5, జనవరి 2012, గురువారం

మైలవరం - మల్లె తీగకు పందిరి ఓలే

ఇప్పుడే .ఓ.. ఫ్రెండ్ మిస్ కాల్ ఇస్తే.. వెంటనే నేను కృష్ణ వేణి ఎఫ్.ఎమ్ ఆన్ చేసాను.అలా ఎందుకంటారా?
మిస్ కాల్ అనేది మా ఫ్రెండ్స్ కి  మాకు  మద్యన   ఉన్న సంకేతానికి అర్ధం ఏమంటే.. మంచి పాట వస్తుంది వినండి అని.
ఒక వేళ రేడియో పెట్టడం మర్చిపోయినా వెంటనే రేడియో ట్యూన్ చేసుకుని సదరు ఆ పాట వింటాం. చానల్స్ మధ్య రేడియో మూగ పోకుండా ఉందంటే.. కారణం ..ఎందుకో.. రేడియోలో పాటలు వింటుంటే  ఎంత మధురం గా ఉంటాయో!ఎప్పుడు ఎక్కడ ఆ పాట విన్నా ఎందుకో నాకు అంతగా నచ్చదు మరి.పాట వింటే రెడియోలోనే వినాలి. గారెలు తింటే పట్టు పప్పు గారెలే తినాలి కాబట్టి.వాటి రుచి చేవులూరించాగా,చవులూరించగా..అన్నమాట.

అలా వెంటనే రేడియో ఆన్ చేయగానే ఒరేయ్..రిక్షా చిత్రం నుండి.. మల్లె తీగకు పందిరి ఓలే..పాట వస్తుంది. ఆ పాట నాకు చాలా ఇష్టం.

ఆ పాట వినగానే.. వెంటనే మా అన్నయ్య గుర్తుకు వచ్చాడు. మా రిక్షా చిన్న గుర్తుకు వచ్చాడు. ఇవి రెండు తెలుసు కోవాలంటే .. అర్జంట్ గా మా మైలవరం వెళ్ళాలి. మైలవరం అయితే ఏమిటి అంటారా? ఇదిగో..ఏమిటో.. చూడండీ!!!

మైలవరం ..ఆ పేరు వినగానే పుట్టింటికి వెళ్ళినప్పటి కంటే ఎక్కువ పులకరింత. అది నేను పుట్టిన ఊరు కాదు. అయినా నాకు అంత కన్నా ఎక్కువే!

నా బాల్యంతో.. అంతకన్నా నా స్వేచ్చ   ప్రపంచంలో..  నా కంటూ.. మేలిమి గుర్తులని ఎన్నింటినో..మిగిల్చిన మా మైలవరమంటే నాకు విపరీతమైన అభిమానం.

ఓ..పదేళ్ళు నా జీవిత పుస్తకంలో.. మూడొంతుల పుటలు మైలవరం ఉంటుంది. అలాగే చుట్టూ ప్రక్కల ఊర్లు అంతా నా బాల్య స్నేహితులే ఉంటారు.

మన ఆంద్ర ప్రదేశ్ లో.. మూడు మైలవరం లు ఉన్నాయి ఒకటి కడప జిల్లాలో,ఇంకొకటి   మెదక్ జిల్లాలోనో.. తెలంగాణా ప్రాంతంలోనో ఉంది. .. ముచ్చటగా మూడవది కృష్ణా జిల్లాలో ఉన్న మైలవరం. మా మైలవరం.

అక్కడ జిల్లాపరిషత్ హై స్కూల్ లో అడుగుపెట్టి.. ఎమ్.బి.ఎమ్.గరల్స్ హై స్కూల్ కి మారి మళ్లి వి.వి.ఆర్ జూనియర్   కాలేజ్  కి మారిన ఏడేళ్ళలో.. అందరూ..స్నేహితులే.. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చి పోతుండేవారే కానీ మేము మాత్రం మారేదే ఉండేది కాదు. అలా మాకు స్కూల్ ,కాలేజ్ లో లో..స్థాన బలం. చదువుల బలం కాస్త తక్కువే కాని,,ఆట పాటల బలం..బ్రహ్మ్బండంగా  ఉండేది.

నిజంగా చెప్పాలంటే.. నేను అప్పుడు పిల్ల కాకినే! మా కన్నా  అయిదు ఆరేళ్ళ ముందు.. దుర్గ అక్క..(కోమటి జయరాం గారి చెల్లెలు)సాహిత్య వాణి.(పిన్నమనేని వెంకటేశ్వర రావు భార్య) విజయలక్ష్మి (వడ్డే నవీన్ వాళ్ళ పిన్ని)  వీళ్ళంతా    సీనియర్స్. సుధా,రాణి ,నేను.. ఒక్కో క్లాసులు తేడా.అయినా ఫ్రెండ్స్.

వాళ్ళు వాళ్ళ చదువు ముగించుకుని వెళ్ళేటప్పటికి మేము కాస్త ముదిరాం   అన్నమాట. నాతో నా బాల్య స్నేహితులు అందరు ఆ చుట్టూ ప్రక్కల వూర్లు నుండి మైలవరం వచ్చి చదువుకునే వారు. మైలవరం కి..౬.౭  కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఊరినుండి.. గూడు రిక్షాలో మైలవరం వచ్చి చదువుకున్నాం. మేమే కాదు మా వూరి నుండి చాలా కష్ట పడి  కాలి నడకన పొలాలకి అడ్డం పడి నడచి వెళ్లి చదుకున్న వారిలో.. నట భూషణుడు "శోభన్ బాబు " నిర్మాత కే.ఎస్.రామారావు..ఉన్నారు. మైలవరం అందరి చదువుల చిరునామా. ఆ తర్వాత గూడు రిక్షాలు వచ్చాక ఆ తర్వాత తరం వాళ్ళంతా రిక్షాలలో.. వెళ్లి చదువు సాగించారు. ఒక్కో రిక్షాలో..ఆరుగురేసి   చొప్పున పది ఏళ్ళ ప్పడి    నుండి పదిహేడేళ్ళు వచ్చినా అదే రిక్షాలో ఇరికి ఇరికి కూర్చునే విశాల హృదయం అన్నమాట. అలా చదువులు సా....గ దీసి చదివే కాలం ముచ్చట్లు ఎన్నో..

నాతొ పాటు చదువుకున్న బాల్య మిత్రులు ఎక్కడెక్కడ ఉన్నారో..ఏమిటో! నిజంగా నేను తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. కానీ ఇప్పుడు కొందరు టచ్ లో ఉన్నా చాలా మందిని మిస్ అవుతున్నాను. నాతొ పాటు చదువుకున్న తిరుమలరావు..చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ అయి అక్కడే హాస్పిటల్ నడుపుతున్నాడు.(ఓ..పదిహేను ఏళ్ళ క్రితం) అలాగే.. రవి కూడా మేడిసన్ చదివాడని వినడమే !..తనని చూడనే లేదు. అలాగే "అల్లాభక్ష్" వెల్వడం నుంచి వచ్చేవాడు. డాక్టర్ చదవాలనే ఉద్దేశ్యం ఉండేది. విదేశాలకి వెళ్ళాడని విన్నాను. ఇంకా శ్రీను,కొక్కెం కృష్ణ , గంగాధర్ అన్నయ్య.. ఇలా ఎక్కడ ఉన్నారో.. ! వాళ్ళందరూ కలిస్తే బాగుండు.

 అందరికన్నా..మా అన్నయ్య రెండేళ్ళు పెద్ద అయినా మన తెలివి తేటల జంపింగ్   తో..సేం  క్లాస్. మా అన్నయ్య చిన్న నాటి  స్నేహితుడు కూడా . ఇప్పుడు   పేస్ బుక్ ద్వారా  స్నేహితులు అందరు కలవాలని ట్రై చేస్తున్నాను. మన బ్లాగుల్లో.. పూర్వ విద్యార్ధులు,స్నేహితులు కలుసుకుంటున్నారని విశేషం చదివినప్పుడల్లా.. అలా మేమందరం కలవాలనే ఆశ కల్గుతుంది.

ఇంకొక ముఖ్య విషయం ఏమంటే..  మా మైలవరం లో.. డాక్టర్ అనివి రెడ్డి (లకిరెడ్డి బాలి  రెడ్డి సోదరుడు )గారి దాతృత్వంతో.. ఇదు కోట్ల రూపాయల విరాళంతో..డిగ్రీ చదువుకునే విద్యార్దుల కోసం కాలేజ్ ని నిర్మించి మొన్నీ మద్య యూనివర్సిటీకి  హన్దోవార్ చేసారు అని చెప్పినప్పటి నుండి ఒక సారి వెళ్లి చూసి రావాలి అనిపిస్తుంది.

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో.. మంచిగానో,చెడుగానో..పేరు గాంచిన  లకిరెడ్డి బాలిరెడ్డి గారు.. ఇంజినీరింగ్ కాలేజ్ పెట్టి అభివృద్ధి చెందారు కానీ.. ఆయన సోదరుడిలా.. అంత పెద్ద దాతృత్వం చూపలేదు. అని నా భావన.

ఒక్క సారి మైలవరం వెళ్లి రావాలి. ఊసులెన్నో పంచుకుని మా అల్లరికి సాక్షిగా నిలిచిన "మా చిన్నా"' గూడు రిక్షా ని (ఉందొ లేదో తెలియదు కూడా) ఆత్మీయంగా సృశించి రావాలని ఉంది. అలాగే . నాకు తీరని ఒక కలని  ఇప్పుడు చూసి రావాలని  కోరిక అన్నమాట.అది ఇప్పుడు కొత్తగా   నిర్మించిన డిగ్రీ కాలేజ్ని  చూసి రావాలి అని.

నాకు ఇంటర్ మీడియట్   అయిపోయే టప్పటికి ఇంకా .. అప్పటికి మైలవరం లో డిగ్రీ కాలేజ్ రాలేదు.  మా వూరి నుండి విజయవాడ కి డిగ్రీ చదువుకోవడానికి వెళ్ళాల్సి వచ్చేది. వేరే ప్రేవేట్ కాలేజ్ వచ్చింది కానీ  నేను అలాను వెళ్ళ లేదు. కారణం అప్పటికి  నా పెళ్లి అయిపోయింది. ఇప్పుడు నిర్మించిన డిగ్రీ కాలేజ్ కి వెళ్లి చూసి రావాలని ఓ..కోరిక.

అలాగే..నా బాల్య మిత్రులు ఎవరైనా కనబడతారని ఆశ కూడా.. ఓ..నాలుగేళ్ల క్రితం వెళ్లి నప్పుడు .. హడావిడిగా.. రన్నింగ్   బస్ ని ఎక్కి ..హమ్మయ్య తొందరగానే ఇంటికి చేరుకుంటాం అనుకునేంతలో.. ఒసేయ్..రాక్షసి ! నువ్వు ఇంకా ఏమి మారలేదు.ఆ పరుగులు ఏమిటీ.. రన్నింగ్ బస్ ఎక్కడం ఏమిటీ..అని ఆత్మీయంగా తిట్టిన..మా దొంగ రెడ్డి అనబడు..రాజశేఖర్ .. వీళ్ళంతా ..అక్కడే ఉండి ఉంటారు.

మా వాళ్ళందరం కలుసుకుని ..మనందరం ఈ కాలేజ్ అప్పుడే ఉండి ఉంటె.. ఇంకో మూడేళ్ళు అక్కడే కలసి చదువుకునే వాళ్ళం కదా..అని చెప్పుకుందామని ఆశతో పాటు.. మన బుడమేరు వాగు ఏది..? ఎవరో ఆక్రమించేసి నట్టు ఉన్నారు.  పెద్ద చెరువు (దేవుడు చెరువు )ని  లక్కిరెడ్డి   ఇంజినీరింగ్ కాలేజ్   చేసేసారు కదా.. మన స్కూల్,తర్వాత కాలేజ్ గా మారిన (బస్సు స్టాండ్ ప్రక్కన ఉన్న కాలేజ్) లో..బాదం చెట్లు అలాగే ఉన్నాయా?శివలింగం పూల చెట్టు అలాగే ఉందా? మన బాల్ బాట్ మింటన్   కోర్టు, త్రోబాల్ కోర్టు ఇంకా బహుమతులు కొట్టుకొచ్చే లెవెల్ లోనే అంతగా ఉన్నాయా? మన కాలేజ్ మాగజైన్ వస్తుందా?  అందరం కలసి మన నారాయణ దియేటర్ లో సినిమాకి వెళ్లి అల్లరి చేద్దామా? ఇలా ఎన్నో   చెప్పుకోవాలని.. మా మైలవరం పొలిమేరలు చుట్టేసి రావాలని చాలా బలీయమైన కోరిక మొదలైంది.

అలాగే..నాలుగు రోజుల క్రితం  తండా వాళ్ళు కల్తీ సారా తాగి చనిపోయారంట. మనమందరం కలసి.. ఒక అవేర్నెస్ పోగ్రాం చేద్దామా..?  అని మాట్లాడుకోవాలని ఉంది.

మా అందరి మధ్య.. ఎన్నో తగాదాలు,కొట్టుకోవడాలు,మళ్ళీ అంతలోనే.. కలసి పోవడాలు..ఎన్నో తీపి గుర్తులకి చిహ్నమైన ..మా మైలవరం విద్యార్ధులు ఎవరైనా ఈ బ్లాగ్ చూస్తే..వెంటనే టచ్ లోకి వస్తారని ఆకాంక్షిస్తూ..
 
 మల్లె తీగకు  పందిరి  ఓలే   ఈ పాటకి అర్ధమై నిలిచిన మా అన్నయ్యే కాదు..నాతో..కలసి చదువుకుని ఆడి పాడిన అందరి మనసుల్లోని ప్రేమపూర్వకమైన భావనని.. ఈ పాటలో..చూసుకుంటూ..(వెధవ టీనేజ్ లవ్ లు,ఎలాటి కల్మషాలు లేని రోజులు అవి)

నేనెవరో..గుర్తుకు రాక పొతే ఒక చిన్న హింట్. (పైన బోల్డన్ని హింట్లు ఉన్నాయి) మన కాలేజ్ లో..రెండు సంవత్సరాలు.. లేడీ స్టూడెంట్ యూనియన్ లీడర్ని.ఓ..రాక్షసిని.    

8 వ్యాఖ్యలు:

తెలుగు పాటలు చెప్పారు...

nice andi heartful gaa vrasharu.. naaku baaganchhindi.. mi snehitulu kalavaalani masara korukunttunnanu

ఆత్రేయ చెప్పారు...

బాగుంది వనజ గారు
వేసవి సాయంత్రం పక్కింట్లో మల్లెపూల మాల కడుతుంటే,
లీల గా మనకు సువాసన వచ్చినట్లు (నేను మైలవరం లో చదవ లేదు కాబట్టి) గా అనిపించింది.
చక్కటి జ్ఞాపకం !!

Shabbu చెప్పారు...

నీ పాదమ్మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా,,,,,, తోడబుట్టిన ఋణం తీర్చుకుంటనే చెల్లమ్మా,,,,

సుభ/subha చెప్పారు...

మీరు గుర్తు తెచ్చుకోవడమే కాకుండా మాకు కూడా అన్నీ చక్కగా గుర్తు చేసేస్తారు... చిన్నప్పుడు కాన్వెంట్లో చదువుతున్నప్పుడు ఉండే మా రిక్షా నూకరాజు గుర్తొచ్చాడు హఠాత్తుగా.బాగుందండీ..

raf raafsun చెప్పారు...

i cought you leader!!!!:):)

శశి కళ చెప్పారు...

వెధవ టీనేజ్ లవ్ లు,ఎలాటి కల్మషాలు లేని రోజులు అవి)....అవును వనజ గారు...అయినా ఇంత చక్కగా
వ్రాస్తున్నారు....మీరు రాక్షసి యెమిటి?

వనజ వనమాలి చెప్పారు...

తెలుగు పాటలు.. ధన్యవాదములు.

ఆత్రేయ గారు.. ధన్యవాదములు. మల్లె గుబాళింపు తెమ్మరై ..తాకి వేలుతుందండీ.దాస్తే దాగేది కాదు కదా!!

షబ్బు.. థాంక్ యు. నీకున్న అభిమానమే.. ప్రతి నేస్తం కి ఉండాలని.. ప్రతి మగువ కోరుకోవాలని కోరుకుంటూ.. మల్లె తీగకు పందిరి ఓలే..మసక చీకటిలో వెన్నెల వలె....తెలుస్తూ ఉంది.

రాఫ్సూన్ ..తెలుసుకున్నారా?ధన్యవాదములు.

@ సుభ గారూ .. ఇంకా గూడు రిక్షా కబుర్లు చాలా ఉన్నాయి. ఊరిస్తూ.. చెప్పాలనుకుంటున్నాను. థాంక్ యూ!

@శశి గారూ.. నేను చెప్పే బాల్యం కమ్మనైన కబుర్లు వింటే.. మీరే రాక్షసి అంటారు చూడండీ! ఇప్పుడు కాదు లెండి.

rajasekhar Dasari చెప్పారు...

అందర్నీ టైం మిషన్ లో కూర్చో పెట్టారు . మా వుయ్యూరు కాలేజ్ రోజులు గుర్తుకొచ్చాయి . అన్నట్లు వుయ్యూరు దగ్గర కూడా ఒక మైలవరం ఉన్నది. మా క్లాసు మేట్ గూడు రిక్క్షా లో వచ్చేది .