30, జనవరి 2012, సోమవారం

ప్రియమైన పుత్రులున్ గారికి

ప్రియమైన పుత్రులున్ గారికి మీ మాతృ శ్రీ  అనేకానేక అనేకమైన హృదయపూరవకమైన దీవెనలతో  వ్రాయు  లేఖార్ధములు. మీరు అక్కడ క్షేమముగా ఉన్నారని తలస్తున్నాను. 

మీరు మాతో దూరవాణి ద్వారా కానీ, చిత్ర వాణి ద్వారా కానీ మాటలాడి పది దినములు అయినది. మీ క్షేమ సమాచారముల గురించి.. మేము మిక్కిలి దిగులు పడుతుంటిమి. ఆ దిగులును మరచినది ఎట్లనగా..నేను ఒక తీవ్రమైన సమస్యని ఎదుర్కోను చుంటిని. అందువల్ల నేను మీతో మాటలాడుటలో అశ్రద్దగా ఉన్నాను. మీరు మన మాతృ భాషని పూర్తిగా మరచి నట్లు తోచుచున్నది. అందువలన మేము మీకు గ్రాందికంలో ఉత్తరం వ్రాయటమైనది.అటులైనను..మీరు ఈ లేఖ చదువుటకు తగిన  శ్రద్ద వహించేదరు..అని నా నమ్మిక. 

మీరు నాతో .. మాట్లాడినప్పుడల్లా ఏమి చేస్తున్నారు  ..మాతా శ్రీ  అని పదే పదే అడుగుతూ ఉందురు  కదా! పని   లేకపోయినా యెడల ఈగలు,దోమలు తోలుకోనుడు..అని వాడుక మాట యున్నది కదా..అటుల గాకున్ననూ.. నేను పని ఉన్న నూ ..కూడా మశ్చ రములను వేటాడుటయే  ముఖ్యమైన పనిగా ఉన్నది. ఈ ఋతువు నందు మన వసతి గృహము దరిదాపుల్లో..మశ్చరము లు బహుళంగా ఉన్నవి. మన వసతి గృహం ముందును ,ప్రక్కనూ.. బహుళ అంతస్తుల భవనములు నిర్మింపబడి సముదాయ గృహములగా మారి యున్నవి.  మన గ్రామ పరిపాలనా అధికారులు నిబందనలికి విరుద్దంగా.. అలా కట్టడములు కి అనుమతి ఇచ్చితిరి కానీ .. జనులు వాడిన నీటిని సక్రమముగా వెడులు క్రియలు చేపట్టక నిర్లక్ష్యం వహించిరి.అందువల్ల.. మశ్చరము లు  బహుగా వర్ధిల్లి.. జనుల్ని కుట్టి విపరీతముగా బాధించు చున్నవి. రాజ్యంలో.. ప్రభువులకి   చిత్త శుద్ధి లోపించినట్లే.. అధికారులకి చిత్త శుద్ధి-నీతినియమములు నశించి.. ప్రజలని పెక్కు ఇక్కట్లుకి గురిచేస్తుంటే..పీల్చి పిప్పి అవుతున్న ప్రజలకి.. మురుగు దుర్గంధం మరియు  మశ్చరముల కాటు తప్పడం లేదు.

విదేశములలో..  మిడతల దండు ఆకస్మికంగా దాడి చేసి పంటలని నాశనం చేసినట్లు..వార్తా పత్రికలో చదివి యుంటిని కానీ..ఈ మశ్చ రముల దండు నాకు కడు  విచిత్రముగా తోచు చున్నది.మశ్చ రముల కాటుకు రక్షణగా ఉండు నవనీతం వంటి పైపూత మందు వ్రాసుకుని నా శరీరం రంగు మారినది కానీ.. వాటి యొక్క కాటు నుండి మమ్ము మేము రక్షింప మార్గం తోచుడం లేదు. పిచికారి మందులు, చక్రముల గాఢమైన పొగలు, తెరలు,వలలు..అన్నియు నిష్ప్రయోజనం అయిపోతున్నవి. 

అదియును గాక  మశ్చ రముల నివారణకి ఏ క్రియలు చేపట్టిననూ..మాకు..శరీర తత్వమునకు సరిపడక నాశికా రంద్రముల నుండి..దారాపాతమైన స్రావాలు వెలువడుతున్నవి. లేదా.. నాశిక దిబ్బడలు,నయనములు యెర్ర బారుట, అగ్ని మంటలు వచ్చి వైద్య శాలల చుట్టునూ..ప్రదక్షిణములు చేయుట పరిపాటి  అయినది. ఇక  ఉపేక్ష తగదు అని ద్వారములకి,గవాక్షములకి వల చట్రములని బిగింప జేసితిమి. అదియును మితిమీరిన వ్యయం అయి ఈ వత్సరము.. నా పుస్తకముల పండుగకి వెడల వీలు కల్గిన్పక ఎన్నటి నుండో.. ఖరీదు   చేయవలనని అనుకున్న  ఆసక్తి కల్గిన పుస్తములకి గండి కొట్టినవి. నాకు  తీవ్ర విచారం కల్గినది.వల చట్రములు బిగించిననూ కూడా  అదేమీ చిత్రమో..మశ్చరముల.. బెడద వదలక మరింత   ఎక్కువ అయినది. 

అప్పుడు..ఒకే ఒక సులభతరమైన బాణం ని ప్రయోగింప జొచ్చితిని. అది..రాముని చేతియందు రావణుని వధించు బాణం వలె..,భీమషేనుడి చేతిలోని.. గద వలే, ఇంకన్నూ చెప్పాలంటే.. సామ్రాట్ అశోకుడి   చేతిలోని వీర   కార్తీకేయ ఖడ్గం   గాను నేను అమితంగా ఊహించుకుని.. మశ్చరముల పని ఇక ఖాళీ అని మిగుల సంతోషించితిని. ఇంతకూ ఆ బాణం ఏమనగా అది విద్యుత్ దండం. ఆ దండముని పట్టుకుని.. అసుర సంధ్య వేళ మొదలిడి..నిశాంత సమయం వరకునూ.. మశ్చరముల వేట కొనసాగించుతూనే ఉండితి తిని. "వంద ఈగలు అయినను తప్పించుకోన వచ్చును గానీ  ఒక్క మశ్చరము కూడా తప్పించుకోన వీలు లేదు అనే నినాదం పూని.. కంటి మీద కునుకు లేకుండా.. వేటాడుతుంటిని. ఆ దశలో.. మేము. బాల్యం దశలో.. ఆడిన పసుపురంగు బంతి కొట్టే ఆటని ఆడుతున్నట్లు బంతి ని ఒడుపుగా పట్టుకుని బలంగా కొట్టి ప్రత్యర్దులని  మట్టి కరిపించిన రోజులు మదిలో మెదిలినవి. కానీ ఇక్కడ  ఆట   ఏక పక్షంలో  తలపించినది.అప్పుడైననూ.. నేను అపజయం ఎరుగను.కానీ మశ్చరముల  సమయ స్ఫూర్తి,తెలివితేటల యందు నేను ఓడూతూనే ఉంటిని.  అది నా మొదటి రోజు అనుభవము. 

ఇక రెండవ రోజు.. రంద్రాన్వేషణ మొదలెట్టి..  మశ్చరములు వచ్చు మార్గమును సూక్ష్మంగా పరిశీలించి కాదు జాగ్రత్త వహించాను. అయిననూ కూసింత కూడా..ప్రయోజనం లేదు. నా శరీరం నందలి రుధిరాన్ని వాటికి వింది భోజనంగా..అందించక తప్పడం లేదు. గానం వినబడకుండా ఉండని   మన గృహం నందు.. గానము లేదు వీనుల విందు సంగీతం లేదు.అన్నపానీయముల పనియును లేదు. కర్ణ ద్వయం పేలినట్లు  మశ్చరముల సంగీతం వినుటయే సరి. మాకున్  కక్ష   స్వభావం  మేల్కొని ఎల్లప్పుడునూ మీ సంగీతమే..మేము ఆస్వాదించట యేనా..నా గాన కళా ప్రావీణ్యముని వినుడని..  అర్ధ రాత్రుల యందు..వాటికి వినిపించాను. అవి అందుకున్ కూడా అవి భయపడక.. జారుకోక.. మన ఇంటి యందె నిశ్చలంగా స్థావరం ఏర్పరచుకుని ఉన్నవి. ఇది..నా రెండో.. అనుభవ దినం 

ఇక మూడో రోజు..  నా బాణం (అదే నా విద్యుత్ దండం)  కార్య రూపం దాల్చనని మోరాయించినది. నేను వెంటనే.. నా కార్తీకేయ కరవాలమునకై పరుగులు తీసితిని. ఆ దుష్ట అశోకుడి,ఆ క్రూర అశోకుడి,ఆ నీచ   అశోకుడి..  కార్తీకేయేం ఎక్కడ ఎక్కడ అని వెతికితిని. వేయి క్షాత్రవులని చంపి కానీ ఒరలో ఇమడని కార్తీకేయం   అంత త్వరగా దొరికినది కాబట్టి సంతసమే! (పనిలో పని గా ఇటులు  మీ పితురులని  తిట్టామని  కోపగించుకోకండి అశోక తనయా..మేము ఎపుడైనాను అటుల తిట్టు సాహసించేదమా?  చెప్పండి.!? మీ తండ్రి గారికి మాతృ శ్రీ మిమ్ము తిట్టితిరి అని సరదాకి అయినా ,హాస్యంగా అయినాను పిర్యాదు చేయకండి.)  మేము వెంటనే సరి క్రొత్త దండం ని ఖరీదు చేసి..ఆఘమేఘముల మీద  గృహమునకి వచ్చితిమి. పాపం మన పని వారల .. కనుల వెంట ఆనందభాష్పములు. మా యజమానికి యెంత   ద్రయార్ద్ర హృదయము.. మమ్ము మశ్చరముల నుండి కాపాడుటకు ఎన్ని అవస్థలు పడుతున్నదని. నాకు ఒడలు ఎల్ల గర్వం పొంగినది. పాపము శమించుకాక  . వేలాది  
మశ్చరములను జంపి.. మేము.. తప్పిదం చేయు చుంటిని అని ఆత్మ విమర్శ జేసుకుంటిని కానీ మశ్చ రముల అమిత కాటు వల్ల అనారోగ్యములు దరి జేరి.. వళ్ళు ఇల్లు గుల్ల అవుతుంటే.. ఇక ఉపేక్షించ జాలను  అని కటోర నిర్ణయం గైకొని..దండ యాత్ర సాగించితి కానీ..  అది మశ్చ రముల జైత్ర యాత్ర అని మరునాటికి గానీ తెలియ రాలేదు. 

మరల మర వచ్చు పోవు వసంతములా ..మశ్చరముల దండు..దిన దినంబు వృద్ది అగుచున్నది  జంపుట వల్ల ఓపిక నశించు చున్నది. కానీ..  శాశ్వత పరిష్కారం కనబడలేదు. గ్రామ పరిపాలనా విభాగామునకి వెళ్లి.. పిర్యాదుని సమర్పించితిని. వారు వచ్చి..శ్వేతవర్ణ పిండి చల్లితిరి కాని అందు..సారం లేక యదా విదిగా మశ్చరముల బాధ ..తప్పలేదు. నేను..దీర్ఘముగా యోచన చేసితిని. బాల్యంలో జదివినప్పు డు సరిగా గ్రహించని విషయం తెలుసుకొనుటకు మశ్చ రముల జీవిత చక్రముని నిశితంగా పరిశీలించితిని కూడా. యేవో మందులని పిచికారి చేయిన్చితిని. ఆ రోజు   మాత్రం కాస్తంత ఉపశాంతి.

మశ్చరముల వేటలో.. మా ఉదయపు వ్యాహాళికి స్వస్తి చెప్పితితిని. ఎందుకనగా.. మశ్చరములను వేటాడు టయే  ..నాకు అమితమైన వ్యాయామం అయి.. నా చిరు బొజ్జ తగ్గి.. నా బాహు దండముల కొవ్వు కరిగి.. కాస్త నాజూకు  అయితిని కూడా. ఇరుగు పొరుగు వారు.. పూర్తి దినము అంతయూ.. ఆ అంతర్జాలం ,రంగుల పెట్టేయందే.. కాలక్షేపం చేయు చుంటిరి. కాస్త వెలుపలకి రండు అని .. ఎక్కేసపు మాటలు వినలేకున్నాను. కానీ మేము చేయు పని ఏమంటే.. ఎలాగు మశ్చరముల ని ఎదుర్కోను ట   అన్నదే యోచన అని వారికిన్ చెప్పలేదు.  మేము..అంతర్జాలం లో తల దూర్చి   ఎన్ని దినములు అయినదో..నాకు అమితమైన బెంగ గా ఉన్నది. అతి విలువైన మా సమయములని,నిదురని,అన్న పానీయములని వెచ్చించి ననూ కానీ.. మశ్చరముల బెడద తప్పడం లేదు. 

ఇక మేము విసుగు చెంది.. రాత్రుల సమయం నందు.. నడి మంచం పైననే కూర్చుని విద్యుత్ దండం ప్రక్కన యుంచుకుని మౌనంగా  వీక్షిస్తూ ఉన్నాను. మశ్చరముల వద్దకు మేము వెళ్ళకుండా.. అవియే మా వద్దకు వచ్చుట చూసి.. అయ్యో..అనవసరం గా   ఇన్ని దినముల  నుండి  జాంటీ రోడ్స్ వలే మైదానం అంతా తిరిగి బంతి పట్టుకోనునట్లు మశ్చరముల వెంట బడి శక్తీ కోల్పోయి అలసితినే! అమితంగా డస్సి తినే  ..అని తెగ విచారబడితిని. ఎలా అయితేనేమి.. మశ్చరముల దండుని కొంత కట్టడి చేయ గల్గితిని. మీ తండ్రి గారు మీ స్వగ్రామములో ఉంటిరి గాన వారు ఈ మశ్చరముల కాటుని తప్పించుకొంటిరి .లేకున్నా వారికి సేవలని జేసి.. వీటి బెదడకి.. నేను అలసి పోయి ఉందునేమో!  మేము మశ్చరముల నివారణకి ఏమి చేయుచుంటిమో,యెంత పరిశీలన చేయు చుందునో.. వ్రాయుట మొదలిడిన ..ఒక బ్రహుత్ గ్రంధం వ్రాయవచ్చును. ఆ గ్రంధమును ఏ విశ్వ విద్యాలయమునకైనా సమర్పించిన యెడల నాకు పరిశోధనా పత్రం తేలికగా లభించి..నాకున్న  విద్యా విషయ సంబందమైన కోరిక కూడా (పి.హెచ్.డి)బహు తేలికగా నెరవేరును అని పించుచున్నది.

మీరు నివశించు దేశమున అభివృద్ధి పథం గా ఉన్నది కాన అక్కడి నివారణ  ఉపాయాలని మాకున్ తెలియ పరచి.. సహాయం చేయవలే అని మిమ్మల్ని అడుగ వలెనని అనుకుంటిని.  ఇంతలో మీ సహొదరి గారు.. మాతో మాటలాడినారు. మా రాజ్యమున మశ్చరముల బెడద లేదు.. అని మా తృ దేశం లోని మన వెతలకి చింతించినది.  పరిపాలని అసహ్యిన్చుకున్నది. అవినీతి లాగును,దేశ సంతతి లాగునూ.. మశ్చరముల వృద్ది అని అవహేళ నం   జేసినది.మాకు బాధ కలిగిననూ..మాటలాడలేదు. ప్రొద్దు గుంకినది. మరల మా వేట ప్రారంభం అవబోతున్నది. ఒక్క విషయం చెప్పి లేఖ ముగించేదను.

మీరు రాత్రిబవళ్ళు  కష్ట పడినను..మేమున్ కష్ట పడినను..మన యొక్క స్వగృహ నిర్మాణం కల నెరవేరుట సుదూరముగా తోచుచున్నది. అందుమూలంగా మేము మీకు సూచించునది ఏమన గా..మీ తండ్రి గారిన్ ఎలాగు అయినను ఒప్పించి కొన్ని గజముల భూమిని విక్రయించి ఆ ధనం ఉపయోగించి..  ఊరికి చివరగా..మురుగు, మశ్చ రముల,రణ గొణ ధ్వనుల  బాధ లేని  అధునాతన రీతిలో పూర్తి శీతలీకరణ గృహం మాదిరి  వలె  పూర్తి " నవీకరణ  రక్షిత వల "నిర్మిత మైన గృహముని అధునాతనం గా  నిర్మించుకుని.. ప్రశాంతముగా ఉండుటకు ఆస్కారం ని కలిగించు కొనవలయని..ఆ విధముగా యోచన చేయమని తెలియ పరుస్తూ.. మా  స్వంత ఇంటి కలని కోరికని తీర్చి సంతోష పరచవలసినదిగా.. చెపుతూ..     

మీరు ఎల్లప్పుడు క్షేమం గా ఉండుటయే.. మా  మదిలోని కోరిక గా ఎరింగి.. జాగ్రత్తగా మసలుకోనుచూ.. వెను వెంటనే..ఈ లేఖకి.. సమాధానమును  గ్రాంధికం గాకున్ననూ  మాతృ  బాషలో అయినను వ్రాసి..మమ్మల్ని ఆనందింప జేయుదురని   ఆకాంక్షిస్తూ..
                                                 
                                                          ప్రేమ పూర్వకమైన ,వాత్శ ల్య  భరితమైన  దీవెనలతో.. మీ మాతశ్రీ గారు.
   

3 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

దోమల బాధ కూడా బాగా చెప్పేరు. పాపం పుత్ర రత్నం మాత్రం ఏమి చేయగలడు, మన బలిసిన దోమలను?

రాజి చెప్పారు...

మీ ప్రియమైన పుత్రులున్ గారికి గ్రాంధికంలో
మీరు రాసిన లేఖ బాగుందండీ..

priyanestam sanajai చెప్పారు...

namaskaram meru mee purtulungarikoraku unchina lekha memunu chadinaamu marachina grandhikam palu chotla sarala telugu gurthu chesinanduku dhanyavadamulu mana nagarmantayu ee macharamula badha janulanu ibbandipettuchunnavi aa vishayamu gurthuvachinapudu kadu vichaichuchu untmegani eamiyunu cheyalekuntimi. vyakhyaninchadaniki avakasam kalpinchinanduku dhnyavaadamulu.

itlu priya nestam sanjai