17, జనవరి 2012, మంగళవారం

మా పార్వతక్క

సంక్రాంతి పండుగ సంబరాలలో.. కనుమ, ముక్కనుమ ఆటా-పాటా..లతో..పిల్ల పెద్ద అందరికి ఆటవిడుపు.
 పల్లెటూర్లు లో అయితే.. తిరునాళ్ళ సంబరమే!

ఊరికి దూరంగా ఎక్కడో..రహస్యంగా కోడి పందాలు జరుగుతూ.ఉంటాయి. ఆ స్థలం మాత్రం ఊరిలో అందరికి తెలిసి పోతూనే ఉంటుంది. కోడి పందాలు అనగానే..నాకు మాత్రం ఒక విషాదం అలముకుంటుంది. అది ఓ..వెంటాడే విషాద జ్ఞాపకం.

 బాల్యంలో..మధురమైన జ్ఞాపకాలే కాదు.. విషాదాలు కొన్ని ఉంటాయి కదా! అలా ఒక  విషాదం .

మా చిన్నప్పుడు.. మా అమ్మ  అన్నయ్య,నేను,చెల్లి. కలసి వెళుతుంటే .ముగ్గురికి  కలసి.. కొన్ని డబ్బులు ఇచ్చేది..ఆ డబ్బులు తీసుకుని.. పెందలాడే అన్నం తినేసి..  కోడి పందాలు జరిగే చోటుకి వెళ్ళేవాళ్ళం. అక్కడ కోడి పందేలు జరగడం మాత్రమేకాదు ..గారడీ వాళ్ళు ఉండేవారు. వాళ్ళ విన్యాసాలు చాలా అబ్బురంగా తోచేవి. రెండు గెడకర్రల ఆధారంగా కట్టిన అతిసన్నని బైండింగ్   వైరుపై..ఒక అమ్మాయి చేతిలో ఒక కర్ర పట్టుకుని.. చాలా తేలికగా.. వంకలు వంకలు తిరుగుతూ..(ఇప్పటి కాట్ వాక్ లాగా అన్నమాట) నాలుగైదు సార్లు నడచి చూపించేది. అప్పుడు వారికి చాలా చిల్లర నాణేలు పడుతూ ఉండేయి.

గారడీ వాళ్ళ దగ్గర   ఒక కుక్క ఉండేది.ఆ కుక్క మెడలో తోలు బెల్టు..ఆ బెల్టులో.వేలాడే మూడు చిన్న గంటలు..వెన్నువిరిచి కుక్క విన్యాసంగా నిలబడితే.. చూడటానికి భలే ఉండేది.ఆ కుక్క మండుతున్న రింగ్లో నుండి.. ఆ ఇటు దూకేది. అలాగే ఒక కోతి.. చేతి విన్యాసాలు చూస్తూ.. ఆశ్చర్యంగాను,నవ్వులతోను కాలం గడచిపోయేది . అమ్మకి తెలియకుండా నానమ్మ ఇచ్చిన డబ్బులతో..బెలూన్లు,బొమ్మలు,కొనేవాళ్ళం. అన్నయ్య మాత్రం ఎప్పుడు మౌత్ ఆర్గాన్ కొని ఊదుతూ ఉండేవాడు.  నేను అయితే.. మగ పిల్లలు గోలీలాట ఆడుతుంటే వాళ్ళతో కలసి ఆడుతుండే దాన్ని.

ఎవరైన్నా పెద్దవాళ్ళు.. ఏమిటి అమ్మాయి.. ఆడపిల్లవి  గోలీలాట ఆడుతున్నావ్  అంటే.. ఏ మగపిల్లలే ఆడాలని రూల్ ఏమైనా ఉందా ? అనేదాన్ని .

ఒకసారి ఒక అబ్బాయి తొండి ఆట ఆడుతున్నాడని.. గోలీ తీసుకుని వేసి కొట్టాను.  పాపం నుదుర మీద తగిలి..
బొట బొట రక్తం కారి పోయింది. ఆ తర్వాత నాతో ఎవరయినా  ఆడటానికి కాస్త భయపడుతూ ఉండేవారు.

ఈ ఆటలు కాదు కానీ.. కోడి పందేలు ఆట ఆ ఆట పై  పై పందేలు  కాసే వాళ్ళని చూస్తే.నాకు ..మా పార్వతక్క గుర్తుకొస్తుంది.

పార్వతక్క అంటే అమ్మ చెల్లెలు. తెల్లని రంగులో  గులాబీ రెక్కలు  కలిపితే ఏ వర్ణం వస్తుందో..ఆ రంగులో మెరిసిపోతూ ఉండేది..పార్వతక్కా అనేదాన్ని. పిన్ని అని పిలేచేదాన్ని కాదు. నా చిన్నప్పుడు అంతా.. అమ్మమ్మ వాళ్ళింటి  దగ్గరే పెరిగాను. మా పార్వతక్క పెంపకం అన్నమాట. పిల్లలని పోగేసి బడికి వెళ్ళ కుండా ఆటలాడుతుంటే పార్వతక్క  కొట్టేది అప్పుడు మా రెండో మామయ్య అడ్డు వచ్చి కొట్టనిచ్చేవాడు కాదు.వాళ్ళ ఇద్దరికీ నా మూలంగా గొడవ జరిగేది కూడా.. ఆ మామయ్యకి నేనంటే  చాలా ఇష్టం.నన్ను అలా కొట్టినా సరే మా పార్వతక్కకి నేనంటే   చాలా ఇష్టం. రోజు నాకోసం జామకాయలు   కోసి దాచి ఉంచేది.


అలాగే ముద్ద ముద్దకు నెయ్యి వేసి తినిపించేది.శుభ్రంగా   స్నానం   చేయించి..చక్కగా జడలు వేసి..రిబ్బనలతో.. ఆరు రేకుల పువ్వు వచ్చేటట్లు అందంగా వేసేది.మా చిన్న పిన్ని..తనని చిన్నారక్క అని పిలిచేదాన్ని. తను ఎప్పుడు నన్ను గిచ్చి తెగ కొట్టేది.  మా పార్వతక్కకి.. ఆమెకి కూడా ఎప్పుడు  పోట్లాట జరిగేది. అప్పుడు నాకు ఎనిమిదేళ్ళు.

ఆ సంవత్సరం వేసవి సెలవలలో ..మా పార్వతక్క పెళ్లై పోయింది . లబ్బీపేట వెంకటేశ్వర స్వామి  గుడిలో ఉన్న మండపంలో..మా పార్వతక్క పెళ్ళి  జరిగింది.ఆ పెళ్ళికి నాకు మా అమ్మ పొడవు లంగా కుట్టించింది. ఆ లంగా వేసుకుని.. సరిగ్గా నడవడం చేతకాక పరుగులు పెట్టడం చేతకాక తెగ అవస్థ పడిపోయాను.


మా బాబాయిది..బళ్ళారి.వాళ్ళకి అక్కడ చాలా పొలాలు ఉండేవి.బంధువుల అబ్బాయి అని మా అమ్మమ్మ తమ్ముడి కొడుకని దూరం అయినా సరే ఇచ్చి చేసారు. పెళ్ళై నాక మా పిన్ని బాబాయి వెంట వెడుతూ.. చాలా ఏడ్చింది. వెళ్ళేటప్పుడు..నన్ను దగ్గరకు తీసుకుని  ముద్దాడి.. చక్కగా బడికి వెళ్లి చదువుకో.. అని అప్పగింతలు పెట్టింది. పెళ్ళి   జరిగిన  తర్వాత  నేను  ఏడుస్తూ ఉన్నప్పుడు  అందరు ఫోటోలు దిగుతున్నారు. మా చిన్న పిన్ని కూడా ఫోటో దిగుతూ.. నన్ను  వద్దని నెట్టివేసింది. అప్పుడు  ఇంకా ఏడుస్తూ ఉంటే.. మా పార్వతక్క కోప్పడి.. నన్ను కూడా నిలబెట్టి  ఫోటో తీయమంది. మా పార్వతక్క  మా చిన్న పిన్నితో.. కలసి దిగిన ఫోటో.. . పై ఫోటో.

ఇక ఆ తర్వాత నన్ను అమ్మ  మా వూరికి తీసుకొచ్చేసి..మా వూర్లో.. కాన్వెంట్ కి పంపింది.
కొన్నాళ్ళకి మా పార్వతక్క సంక్రాంతి పండుగకి..బాబాయి తో  కలసి మా ఇంటికి వచ్చారు. అప్పుడు మేమందరం కలసి..మా మైలవరం అశోక్ దియేటర్ లో..అల్లూరి సీతా రామరాజు సినిమాకి వెళ్ళాం . ఆ సినిమాకి వెళ్ళినప్పుడు..మా పార్వతక్క నాకు,చెల్లికి  రెండు మూడు రకాల రిబ్బన్లు,గాజులు కొని పెట్టింది.వాళ్ళు  రెండు రోజులు ఉండి వెళ్ళిపోయారు

తర్వాత నాలుగు  రోజులకి..నేను అన్నయ్య కాన్వెంట్కి వెళ్ళామో లేదో..  వెంటనే ఇంటికి వచ్చేసాము. మా పెదనాన్నఒక విషయాన్ని అమ్మకి చెప్పారంట.  .శ్రీనివాసరావు గారింటికి అడవినెక్కలం  నుండి   పోన్ చేసారు. మీ చెల్లెలు ఎండ్రిన్ తాగిందంట..అని .

అమ్మ మా పిన్నిని  తలుచుకుంటూ  గట్టిగా ఏడుస్తూ.. మమ్మల్ని తీసుకుని.. అమ్మమ్మ వాళ్ళ వూరికి బయలుదేరింది. నాకు అమ్మ ఎందుకలా ఏడుస్తుందో..అర్ధం కాలేదు. అసలు ఎండ్రిన్ అంటే ఏమిటి. అది ఎందుకు తాగుతారు,తాగితే ఏమవుతుంది.. బుర్రలో ఎన్నో ప్రశ్నలు.అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాక.. మమ్మల్ని అక్కడే వదిలి పార్వతక్కని  విజయవాడలో..యెన్.సుబ్బారావు గారి హాస్పిటల్ లో జాయిన్ చేసారని అక్కడికి వెళ్ళింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గుంపులు గుంపులు జనం ఏదేదో..మాట్లాడుకుంటూ.

వాళ్ళందరికీ మా హరిమ్మ అత్తయ్య (మా పెద్ద తాత కోడలు)వివరంగా ఏం చెపుతుందో..ఇప్పటికి గుర్తుకు వస్తుంది.
మా వూరికి పండగకి వచ్చి వెళ్ళాక .. అమ్మమ్మ వాళ్ళ వూరిలో..చెరువులో..కోళ్ళ పందేలు   వేస్తున్నారని  బాబాయి  ప్రతి రోజు సరదాగా చూడటానికి వెళుతున్నారట. అలాగే ఆరోజు వెళ్ళారని సాయంత్రం   తిరిగి వచ్చాక బాబాయిని తన వాచీ కనబడలేదు మీకు కనబడిందా అని పిన్ని అడిగిందని.. దానికి సమాధానంగా ..'ఇంకెక్కడవాచీ..ఈ రోజు..కోడి పందాలప్పుడు..ఆ వాచీని పై పందెం కాసాను ఓడిపోయాను..అని చెప్పారంట.ఇక పిన్ని ఏం మాట్లాడకుండా ఊరుకుంది అంట.  ఆ రోజే ఉదయాన్నే  ఒక విశేషం కూడా తెలిసింది అంట. పిన్ని తల్లి కాబోతుంది అని. మా హరిమ్మ అత్తయ్య ఏం మరదలా! బెజవాడ వెళుతున్నాను ..ఏమైనా కావాలా ?అని అడిగితే..వదినా దోసకాయలు పట్టుకుని రావా! బొబ్బర్లు దోసకాయ కలిపి కూర వండుకుని తినాలి అని చెప్పినదట. మా హరిమ్మ అత్తయ్య అర్ధం చేసుకుని.. దబ్బ పండు లాటి కొడుకు పుడతాడులే..అంటే.. ఏమి వద్దులే..వదినా ..మా వనజ లాటి కూతురు కావాలి అని చెప్పిందట. (అప్పుడు నేను బొద్దుగా.. ఒత్తైన పొడవైన జుట్టుతో..పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని..గోధుమ రంగు చాయలో..చాలా ఉత్సాహంగా బోలెడు కబుర్లు చెపుతూ ఉండేదాన్ని అని మా పిన్నికి నేనంటే   చాలా ఇష్టం ఉండేది అని మొన్నీమధ్య మా బాబాయి కలసినప్పుడు నాతో చెప్పారు)


అలా మా పిన్ని అడిగిన మర్నాడు ఉదయమే.. మా హరిమ్మ అత్తయ్య.. డాబా మీద నుండి క్రిందకి   దిగి వస్తున్న పిన్నిని చూసి పార్వతి..దోసకాయలు తెచ్చాను..రాత్రి పొద్దుపోయిందని ఇవ్వలేదు..తీసుకొస్తాను ఉండు ..అని చెపుతుంటే..

ఇక మీ పార్వతి ఈ లోకంలో ఉండదు వదినా..కాసేపటికి చచ్చిపోతుంది అని చెప్పిందంట. అప్పటికింకా నిద్ర లేవని బాబాయి ఉలికి పడి బయటికి వచ్చి .. ఆమె దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి..ఏం మాట్లాడుతున్నావు పార్వతీ.. అంటూ.. ఆమెని పట్టుకునేటప్పడికే నురగలు క్రక్కుతూ..పడిపోయిందంట. ఆమె నుండి ఎండ్రిన్ వాసన.మా మామయ్య ఇంకా పొలాలకి వెళ్ళలేదు. గబా గబా అంతకు ముందు రోజు పొగ తోటకి కొట్టాలని తెచ్చిన   ఎండ్రిన్ సీసా కోసం బీరువా క్రింద చూస్తే కనబడలేదని..డాబా పైకి వెళ్ళి  చూస్తే.అక్కడ అది ఖాళీగా కనబడింది.  జరిగింది అర్ధమై .. గబగబా  కారు మాట్లాడుకుని.. విజయవాడ హాస్పిటల్కి తీసుకు వెళ్ళారట . ఆ మధ్యలోనే..చింత పండు నీళ్ళు,మజ్జిగ బలవంతం గా తాగించి..మందుని బయటికి కక్కించాలని కొన్ని ప్రయత్నాలు చేసారట .అలా మూడు రోజులు హాస్పిటల్ లో.. చావు బ్రతుకుల   మద్య కొట్టుకుంటూ..సృహ వచ్చినప్పుడు..కొన్ని మాటలు చెప్పిందట. అప్పుడు పార్వతక్క ని చూసుకుంటూ అమ్మే ..ఉంది. అమ్మమ్మ బాగా ఏడుస్తుందని హాస్పిటల్ వాళ్ళు ఊరుకోవడం లేదని  ఆమెని ఇంటి దగ్గరే ఉంచేశారు

మా బాబాయి తన వాచీని కోడి పందెం లో..పై పందెం కాసి ఓడిపోయాను అని చెప్పడం వల్ల ఆ వాచీని గెలుచుకున్న వాళ్ళు..ఫలానా మాదల వెంకట్రామయ్య గారి అల్లుడు పండక్కి  వచ్చి వాళ్ళావిడ చేతి వాచీ పందెం కాసాడు అని చెప్పుకుంటే  యెంత పరువు తక్కువ.!? అంత మంచి కుటుంబంలో వాళ్ళ అల్లుడు అలాటి వాడా..అని చులకనగా చెప్పుకుంటారని.. తాతయ్యని.. అలా అని అడిగి నలుగురు చులకనగా మాట్లాడతారని.. ఆలోచించి.. బ్రతక కూడదని అలా చేసానని చెప్పింది..మా పార్వతక్క . మా బాబాయి అలా చేయలేదు..సరదాకి అలా యేడిపించడానికే   అలా చెప్పానని.. ఇలా చేస్తావనుకోలేదు అని బాబాయి తెగ ఏడ్చారు.  పట్టె మంచం నవ్వారు లో..దాచిన వాచీని తీసి అప్పటికప్పుడు చూపించారుకూడానట.(తర్వాత ఆ వాచీని మా చిన్న పిన్ని పెట్టుకుని తిరిగేది.)

అయినా పార్వతక్క బ్రతకలేదు. నేను ఆమె చచ్చిపోతుందని తెలిసి తెగ ఏడ్చాను. అసలు చచ్చిపోవడం అంటే కూడా ఏమిటో  తెలియదు.అయినా మా పార్వతక్కకి..ఏమిటో..జరిగింది..అందరు ఏడుస్తున్నారు..కాబట్టి నాకు ఏడుపు   వస్తుంది. మా పిన్ని సాయంత్రం చచ్చి పోతుంది అనగా ప్రొద్దున్నే నన్ను చూపించమని అడిగిందని..నన్ను తీసుకు వెళ్ళారు. అద్దాల గదిలో ఉన్న పిన్ని దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళారు. నేను భయం భయంగా పిన్నివంక చూస్తూ ఉన్నాను. .పిన్ని మొహంకి..ఏమిటో..తగిలించారు. నన్ను చూసి పార్వతక్క  తన దగ్గరికి రమ్మని చేత్తో పిలిచింది.నేను వెళ్ళగానే నా చేయి పట్టుకుని..కాసేపటి దాకా వదలలేదు. పార్వతక్కా.. ఇంటికి వెళ్ళిపోదాం  రా..అని నేను అడిగాను. ఆమె  నవ్వినట్లుగా ..నేను వస్తానులే..నువ్వు బాగా చదువుకో..అమ్మ చెప్పినట్లు విను..అని చెప్పింది.ఎందుకో..తెలియదు..నేను ఏడుస్తూనే.. తల ఊపాను.  ఇక నన్నక్కడ ఉండనీయలేదు. ఇంటికి పంపించి వేసారు.ఆ సాయంత్రానికి  పిన్ని చచ్చిపోయింది అని చెప్పారు.

"డాక్టర్ గారు నాకు బ్రతకాలని ఉంది..నన్నుబ్రతికించరూ .." అని అడిగిందని..అమ్మ  ఎప్పుడూ..ఏడుస్తూ గుర్తుకు తెచ్చుకుంటూ ఉండేది.

మా పార్వతక్కని ఇంటికి తీసుకు వచ్చే టప్పటికి.. నేను అమ్మమ్మ వాళ్ళింట్లో పూసిన రుద్రాక్ష  (గుండు) పూవులని అన్నిటిని కోసి..


నాకు చేతైనట్టు దండ గుచ్చాను.(అంతకు ముందు మా హరిమత్తయ్య పూలదండలు తెమ్మని చెప్పడం విని).పార్వతక్కకి పూలంటే చాలా ఇష్టం. ఆమెకి  చాలా పూలదండలు వేసి..తీసుకువెళ్ళిపోతున్నారు.అప్పుడు నేనూ  వెళ్ళి  నేను గుచ్చిన దండనీ వేసాను.మా అమ్మమ్మ,అమ్మ అందరు అది చూసి బోలెడు ఏడ్చారు.  మా పార్వతక్క మొహం  ఆ దండలో నుండి..ఇంకా తెల్లగా మెరిసిపోతూ..కనిపించింది.

కోడి పందేలు జరిగే చోటుకి కొద్దిగా దూరంలోనే..పార్వతక్కకి..అంత్యక్రియలు జరిగాయి.నేను అందరి వెనుక పడి స్మశానానికి వెళ్ళాను .అందరూ  చిన్న పిల్లలు రాకూడదు ఇంటికెళ్ళు అన్నా వినలేదు. వెళ్ళి  దూరంగా  ఉండి..మంటల్లో కాలి పోతున్న మా పార్వతక్కని చూస్తూ ఉంటే.. మా రెండో..మామయ్య నన్ను ఎత్తుకుని ఏడుస్తూ..ఇంటికి తీసుకు వచ్చాడు.

ఆ తర్వాతెప్పుడు  అమ్మమ్మ వాళ్ళ ఊరు  వెళ్ళినా..  ఒక్కదాన్నే చెరువు కట్ట పై నడచి వెళ్ళి  స్మశానం దగ్గరగా నిలుచుని..  మా పార్వతక్కని కాల్చిన చోటునే చూస్తూ ఉండేదాన్ని. అక్కడ నుండి మా పార్వతక్క లేచి వస్తుందని.

తర్వాత మా అమ్మ చెప్పేది..పార్వతక్క ఎప్పుడూ ఇక  రాదనీ.అది అర్ధం అయ్యాక అలా వెళ్ళడం మానేశాను. తర్వాత మా బాబాయి మళ్ళీ పెళ్ళి  చేసుకున్నాడు. అప్పుడు వాళ్ళకి   పుట్టిన అమ్మాయికి పార్వతి అని పేరు పెట్టుకున్నారు.ఆ అమ్మాయి మా చెల్లి  అనే అనుకుంటాం.  ఆ పార్వతి కొడుకు.ఇప్పుడు  మంచి ఆర్చేర్..పేరు ఓంకార్

యెర్ర జామకాయలు,లబ్బీ పేట వెంకటేశ్వర స్వామి గుడి,అల్లూరి సీతారామరాజు సినిమా..,హెచ్. ఎమ్. టీ వాచీ,   కోడి పందేలు ,గుండు బంతి పూలు వీటన్నిటిని చూసినప్పుడలా ..మా పార్వతక్క గుర్తుకొస్తుంది.  ఇప్పటకీ.. నాకు ఏడుపు వస్తుంది. 

6 వ్యాఖ్యలు:

tejaswi చెప్పారు...

మీ జ్ఞాప‌కాలను మా కళ్ళకు కట్టినట్లు, మనసుకు హత్తుకునేటట్లు రాశారు.

జ్యోతిర్మయి చెప్పారు...

కొన్ని జ్ఞాపకాల గాఢత కాల౦తో పాటు తగ్గదు..దైవ నిర్ణయం అనుకోవడమేనేమో.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కొన్ని విషాదాలు అంతే. మరుపు రావు. కళ్ళు చెమర్చాయి.

Kalasagar చెప్పారు...

మీ పార్వతి అక్క గారి గురించి, వారి జ్ఞాప‌కాలను చాలా బాగా రాసారు.

raf raafsun చెప్పారు...

కళ్ళకు కట్టినట్లు రాశారు...జ్ఞాపకాల గాఢత కాల౦తో పాటు తగ్గదు....కళ్ళు చెమర్చాయి..:(:(

శశి కళ చెప్పారు...

వాఆఆఆఆఆఆఆఆ.....యెంత యెడిపించారు...నన్ను
పండగ పూట...నెను ఇంక మీతొ మాట్లాడను...