14, ఆగస్టు 2012, మంగళవారం

మై స్పేస్ అమ్మలక్కల కబుర్లు 4


దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే తరుణం.

నేను వ్రాస్తున్న ఈ పోస్ట్.... అమ్మాయిలకి లభించిన స్వేచ్చ ఏ విపరీత ధోరణులకి దారి తీస్తుందో.. అని బాధ పడుతున్న మధ్యతరగతి తల్లి దండ్రుల ఆవేదన గురించి ..

ఓ..తల్లి . ఇలా చెప్పుకుంటూ వచ్చింది

మా నాన్న జేమ్స్ బాండ్.. మనదంతా పాత ట్రెండ్.. అని మా అమ్మాయి బాధగా పాటలు పాడుకుంటుంది.

చీటికి మాటికి వాళ్ళ నాన్నపై చిర్రు బుర్రులాడుతుంది. ఎందుకో ఏమిటో...అర్ధమై చావదు.

ఆ తండ్రి కూతుళ్ళ కోల్డ్ వార్ చూడలేక పోతున్నాను. చిన్నతనం నుండి..గుండెలపై ఆడించి పెంచుకున్న కూతురు తండ్రి చెప్పినదానికి వ్యతిరేకంగా నడుచుకోవడంని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు,

మన కాలంలో తండ్రి మాటకి ఎదురు చెప్పి ఎరుగుదుమా! ఈ పిల్ల చెప్పినది వినదు. ఆయన తన పంతం తనదే అంటారు.

ఇప్పటి పిల్లలకి చిన్నప్పటి నుండి ఆడింది ఆటగా పాడింది పాటగా సాగనిచ్చి హటాత్తుగా పెళ్లీడు వయస్సు వచ్చేసరికి ఆడపిల్లవి ఇంటి గౌరవం కాపాడాలి అంటూ ఆంక్షలు మొదలు.

ఈ మధ్య వార్తలలో చూసాను ఓ అమ్మాయి తన ఇష్టప్రకారం మోడరన్ డ్రెస్ వేసుకుంటానని చెప్పి అలాంటి వస్త్రధారణ చేసుకున్న ఆమెని తల్లిదండ్రులు నడిరోడ్డు పై వెంటాడి వెంటాడి పిచ్చి పిచ్చిగా దేహశుద్ది చేసారు. అదేమని అడిగితే .. మా బిడ్డ మేము కొట్టుకుంటాం చంపుకుంటాం..అడిగేదానికి ఎవరికీ ఏమి హక్కుఅని తిరిగి ప్రశ్నించడం చూసాము.

ఇక ఇప్పటి యువతరం లో కొంత మంది ఆర్ధికంగా బలపడిన కుటుంబాలలో పెరిగిన పిల్లలతో పోల్చుకుని మధ్యతరగతి వర్గంలోని పిల్లలు ఆదునికంగా విలాసవంతంగా పెరగాలని అనుకుంటున్నారు. నిజానికి మన గ్రామీణ ప్రాంతాల పిల్లలు చదువుల కోసం పట్టణాలకి వెళ్ళడం, ఉద్యోగాలకి ఇతర ప్రాంతాలకి వెళ్ళడం వల్ల తల్లిదండ్రుల అజమాయిషీ లోపించి స్వేచ్చాను గుణంగా ప్రవర్తించి అర్ధాంతరపు చావులకి గురి అవుతుతున్నారు.

చదువుల పేరిట ,ఉద్యోగాల పేరిట అమ్మాయిలని బయటికి పంపడంపట్ల తల్లిదండ్రులకి అభ్యంతరం లేకపోయినా ఇలాంటివి విన్నప్పుడు భయ భ్రాంతులకి గురి అవుతున్నారు. పిల్లలు కాస్తంత విచక్షణ గా, భాద్యతగా నడుచుకుంటే తల్లిదండ్రులకి గుండెకోత,నలుగురిలో అవమానాలు ఉండవు కదా!

వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ లో ఉన్న పిల్లలు కూడా మహా నగరాలలో వ్యాపించిన పేజ్ త్రీ కల్చర్ కి, రేవ్ పార్టీల కల్చర్ కి ఆకర్షితులవుతున్నారని ఓ.. తల్లి ఆవేదనగా చెప్పింది. పెద్దలు చెప్పే మంచి మాటలు పిల్లల తలకెక్కుతాయా ? సరదాల పేరిట జీవితాలనే రిస్క్ లోకి నెట్టుకుంటున్నారు.

ఈ సంస్కృతి ఇలా వేలం వెర్రిగా మారుతుంటే...

ఈ చదువులు ,స్వేచ్చలు అన్ని ఉండి కూడా పెళ్లి విషయంలోకి వచ్చేసరికి తల్లిదండ్రులు తమ ఇష్టప్రకారం జరగాలను కుంటున్నారు. ప్రేమించుకున్న కొంతమంది యువతీ యువకులని తమ ఇష్ట ప్రకారం పెళ్ళిచేసుకున్న వారిని పరువు ప్రతిష్టలు పేరుతొ.. చంపుకుంటున్న తల్లిదండ్రులని చూస్తున్నాం.

ఇప్పటి తల్లిదండ్రుల పాత్ర పిల్లల ని స్వేచ్చాను గుణంగా వదిలి వేయడమా ..లేక తప్పని సరి ఆంక్షలు విధించి పెడదారి పడుతున్న వారిని చేయి పెట్టి నడిపించడమా... !? పిల్లలని ఎలా గైడ్ చేయగలగాలి ?

ఆ తల్లి ప్రశ్నకి .. ఏమి సలహా ఇవ్వగలం ?

ఈ ప్రశ్నకి సమాధానం పితృస్వామ్యం అనో,పురుష అహంకారం అనో, మోసకారీతనం, కాముకత్వం అన్నంత తేలికగా దొరకదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది.

ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా కొన్ని వాస్తవాలని మనం గమనించాలి. బాధితులకి అండగా నిలబడం ఎలాగో .. పెడదారి పడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా అవసరం కదా !

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఇలా మీరు మాత్రమే రాయగలరు :) మరెవరేనారాస్తే, ఇంకేమయినా ఉందా.....వామ్మో!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"పెడదారి పడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా అవసరం కదా !"

నిజమేనండీ మంచి విషయం చెప్పారు..
మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..!

Meraj Fathima చెప్పారు...

వనజాడియర్, అభినందిస్తున్నాను, మీరు రాసిన ఈ పోస్ట్ ని. ఎంత వివరణ ఇచ్చారు , ఎంత బాగా చెప్పారు.
ముఖ్యంగా పెద్దింటి ఆడపిల్లలను చూసి మద్య తరగతి ఆడపిల్లలు తమకేదో తక్కువైందని వాపోవటం.
వస్త్రధారణ విషయంలో విచ్చలవిడితనం, తల్లిదండ్రులను విమర్శించటం ,విపరీతమైన స్వేచ్చకోరుకోవటం. నిజంగా మీరు మాత్రమె రాయగలరు.
ఎంత సున్నితంగా చెప్పారు.
ఏమిటో మా కవితలెప్పుడు ఇలా చెప్పగలిగితే బాగుండు. మరోమారు అభినందనలు. .

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

ముందుగా
మీతో పాటు - బ్లాగ్ మిత్రులందరికీ -
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .

ఆడ పిల్లను తండ్రి అపురూపంగా ప్రేమించడం ఒక నిజమైతే -
అతని ఆలోచనలు నిరంతరం ఆమె చుట్టూనే తిరుగు తుండడం అంతకంటే నిజం -
ముందుగా కౌన్సిలింగ్ ఇవ్వవలసింది నాన్నలకు -
ఎవ్వరో కొద్ది మంది ఆడపిల్లలు మాత్రమే విచ్చలవిడి తనానికి అలవాటు పడుతున్నారు . అందుకు వేరే ప్రత్యేక కుటుంబ పరిస్తితు లుండొచ్చు .
సమాజం ఎంత మోడ్రన్గా ఉన్నా -
సాధారణంగా మథ్యతరగతి చాలా మంది ఆడపిల్లలు -
కుటుంబ పరిస్థితులను బాగా ఆకళింపు చేసుకుని -
బాధ్యతగానే నడుచుకుంటున్నారు .
సమాజం నుండి భద్రత కూడా నేర్చుకుంటున్నారు .
అనవసరమైన సమస్యల్లో ఇరుక్కోకుండా
అవసరమైన విఙ్ఞత కూడా ప్రదర్సిస్తున్నారు .
----- సుజన-సృజన

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలే గారు.. మీరు ఇలా అన్నారంటే ఈ పోస్ట్ ఆలోచింప జేసిందని అనుకుంటున్నాను. ఎవరైనా.. వ్రాస్తేనా.. వామ్మో! ఎందుకండీ! మళ్ళీ వివరణ తో ఒక పోస్ట్ వ్రాయాలి అనుకుంటున్నాను.

@రాజీ గారు.. నా అభిప్రాయం తో ఏకీభవించినందుకు ధన్యవాదములు

@మేరాజ్.. ఫాతిమా.. థాంక్ యు ..థాంక్ యు వెరీ మచ్!

@ వెంకట రాజారావు గారు.. మీ వ్యాఖ్యకి ధన్యవాదములు. మీరు చెప్పినట్లు అమ్మాయిలు ఒద్దికగా ఉంటే చాలా సమస్యలు రావండీ!అలా ఉండాలనే కోరుకుందాం. ధన్యవాదములు. మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

Jai Gottimukkala చెప్పారు...

పిల్లలకు ఆంక్షలు పెట్టె బదులు బాధ్యత నేర్పించాలి. తాము చేస్తున్న వాటి పర్యవసానాలు అర్ధం చేసుకుంటే తిప్పలు ఉండవు.