తెల్లవారు ఝామున నాలుగు గంటలయినా కాకముందే నిద్ర లేచింది మల్లి.
గబా గబా వాకిలి చిమ్మి ముగ్గు పెట్టి పళ్ళు తోముకుని ముఖం కడుక్కుని రాత్రి వేళనే డబ్బు లెక్కపెట్టుకుని ఉంచిన గుడ్డ సంచీని తీసుకుని బొడ్లో దోపుకుంటూనే పూల బుట్టని తీసుకుని బస్ స్టాప్ వైపు పరిగెత్తింది అప్పటికే బస్సు ని స్టార్ట్ చేసి.. కదల్చకుండానే కదిలి వెళ్ళిపోయే దృశ్యాన్ని కనుల ముందు పెట్టె నేర్పరేమో.. ఆ డ్రైవర్ ..కావాలని ప్రయాణికులని హడావిడి పెడుతున్నాడు.
అచ్చంగా అలాంటి దృశ్యం చూసినప్పుడల్లా నాకు చావలేక బతుకీడుస్తున్న ప్రభుత్వాల మాదిరి కనబడతాయి .
"మల్లి " వస్తుంది. కాస్త ఆగండి డ్రైవర్ గారు ! అని రిక్వెస్ట్ చేసాను.
"రోజూ బస్ కదిలే సమయం తెలుసు కదా! ముందొస్తే ఏం పోతుంది. ఆదరా బదరా పరుగులు పెడుతూ మమ్మల్ని విసిగిస్తారు" అన్నాడు బస్ డ్రైవర్
"ఆడవాళ్ళు పనులు చేసుకుని బయలుదేరాలి కదండీ.. పాపం ఆ ఇబ్బందిని మనం గమనించాలి" అన్నాను నేను.
నేను ఆ బస్ కి కండక్టర్ని. నేను చెపితే ఆగాలి కాబట్టి ఆగాడు . మల్లి బస్ ఎక్కగానే తన చేతిలో ఉన్న బుట్టని బాయ్ నెట్ పై పెట్టి సీట్ కోసం వెదుక్కుంటుంది.
నీకు బుద్ది ఉందా? నిన్ను ఈ బుట్ట ఇక్కడ పెట్టవద్దని ఎన్నిసార్లు చెప్పాను. తీసేయి..అంటూ చీత్కరించాడు డ్రైవర్
నేను కల్పించుకుని "వెనక్కి వెళ్లి బుట్ట అక్కడ పెట్టుకో.. అక్కడికి వచ్చి టికెట్ తీసుకుంటాను "అని చెప్పాను. మల్లి ఆ బుట్ట తీసుకుని..సీట్లలో కూర్చున్న ప్రయాణికులకి తగలకుండా జాగ్రత్త పడుతూ.. నెత్తిమీద పెట్టుకుని బస్ వెనుక భాగం కి వెళ్లి పోయింది.
రైల్వే స్టేషన్ కి బయలుదేరే మొట్ట మొదటి బస్ కాబట్టి ఆ బస్ 365 రోజులు కిక్కిరిసే ఉంటుంది మూడు సూపర్ ఫాస్ట్ ట్రైన్ లని , ఇంకా ముంబై ,కలకత్తా వెళ్ళాలంటే ఆ బస్ ని అందుకోవాల్సిందే. అందుకే ఆ బస్ కరక్ట్ టైం కి బయలు దేరాలి. లేకపోతే ప్రయాణికులు గొడవ పెడతారు.
అయినా మల్లి మీద సానుభూతితో.. వారానికి ఒక సారి అయినా మల్లి ఆలస్యంగా వచ్చినా సరే ఆమె వచ్చే వరకు బస్ ని ఆపి పెడతాను నేను. కేవలం ధన సహాయం చేయడం, అన్నదానం చేయడం, విద్యాదానం చేయడం లాంటివే దానం అనుకుంటారు కానీ నాకైతే అవసరమైనప్పుడు మాట సాయం చేయడం, సాటి మనుషులపట్ల దయ,కరుణ చూపడం సేవ చేయడం కూడా అలాంటి దానాలకన్నా తక్కువకాదేమో ననిపిస్తుంది మల్లి నాకు తెలిసిన మనిషి.ఎలా అంటే..ఓ..సాటి మనిషిగా పరిచయం అంతే..
మల్లి నిజంగా పువ్వు లాగానే ఉంటుంది. పువ్వులాగా నవ్వుతూనే ఉంటుంది. నిదానంగా మాట్లాడుతుంది.భర్త చనిపోయాడో,లేదా వదిలేసి వెళ్ళిపోయాడో తెలియదు.. కాని తల్లి తో కలసి ఉంటుంది. ఇద్దరు పిల్లలు. రోజు తెల్లవారుఝామునే లేచి ఈ బసెక్కి పూల మార్కెట్ కి వెళ్లి హోల్‌సేల్ మార్కెట్ లో కేజీల లెక్కన పూలు కొనుక్కుని మూటలు కట్టుకుని మళ్ళీ బస్ లో వేసుకుని ఏడుగంటలకల్లా ఇంటికి చేరుకుంటుంది. ఇలా చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వారి దగ్గర లగేజ్ వేసుకున్నందుకు నేను టికెట్ కొట్టక పోయినా బస్ డ్రైవర్లు మాత్రం పదికో ఇరవై కో ఆశ పడి ..మూట లు వేసుకోనిస్తారు. నేను డ్యూటిలో ఉన్న రోజు డ్రైవర్ కి డబ్బులు ఇవ్వకుండా లగేజ్ టికెట్ కొట్టి ఆమెకి ఓ..పది రూపాయలు మిగిల్చి పెడతాను.
మల్లి పూల బస్తాలు వేసుకుని వచ్చి ఇంటి పనైపోయిన తర్వాత విశ్రాంతి అనేదే లేకుండా పూలు మాలలు కట్టం తో పాటు..ఇండ్లలో ఖాళీగా ఉండే ఆడవాళ్ళకి పూలు ఇచ్చి మాల కట్టించుకుని మూరలలెక్కన లెక్క కట్టి డబ్బు ఇచ్చేసి.. సాయంత్రం పూట మల్లి, ఆమె ఇద్దరు పిల్లలు కలసి వీధులెంట తిరిగి ఆ పూలని అమ్ముకుంటూ ఉంటారు. అదే వాళ్లకి జీవనోపాది.
పూలు అమ్ముడు పోని రోజు ఏదైనా ఉంటే ఆ రోజు వాళ్ళు నలుగురూ పస్తులు ఉండాల్సిందే!
మల్లి రోజు వారి ఖాతాలు పెట్టుకుని పూలు అమ్మడానికి మా కాలనీ లోకి వస్తూ ఉంటుంది. పూజ కోసం మా ఆవిడ కూడా పూలు కొంటూ ఉంటుంది. నిత్యం కొంటూ ఉంటాం కాబట్టి.. కాస్త తక్కువ ధరకే పూలు ఇచ్చి వెళ్ళిపోతుంది. చిల్లర లేదని తర్వాత ఇస్తామని చెప్పినా ఎదురు మాట్లాడదు . నెలకి ఒకసారి ఇస్తామన్న మాట్లాడదు . అన్నింటికీ తల ఊపడమే.. సమాధానం అన్నట్లు ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టే.. ఆమెకి డబ్బు ఎగవేసే వారు ఉంటారు. "మరీ అంత ధరా? రోజు కొంటున్నాం కదా అని .. ఈ కాలనీలోకి ఎవరు వచ్చి అమ్మరని తెలిసి మరీ ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నావ్.ఇలాగైతే నేను నీ దగ్గర పూలు కొనేదే లేదు" అని మా ప్రక్కింటి ఆవిడ అప్పుడప్పుడు అరిచే మాటలు వినబడుతూనే ఉంటాయి.
మా ప్రక్కింట్లో ఉండే రావు గారు బల్ల క్రింద చేయి పెట్టి బాగా డబ్బు కూడ పెట్టిన వ్యక్తి. ఉన్న పిల్లలిద్దరూ విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఒకటికి నాలుగు ఇళ్లు .వాటిపై వచ్చే అద్దె డబ్బులు, పెన్షన్ అన్ని కలిపి నెలకి ఒక లక్ష రూపాయలు కళ్ళ జూస్తారు . పెరిగిన పాపం పోయెందుకేమో.. నిద్ర లేచింది మొదలు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. అట్టహాసంగా పూజలు చేయిస్తూ ఉంటారు. ఇంట్లో భజనలు పెడుతూ ఉంటారు. కాని సాటి మనిషికి చిన్నపాటి సాయం చేయరు.కాకిని కూడా ఎంగిలి చేత్తో విదిల్చరు. మల్లి కి కూడా సరిగా డబ్బులు ఇవ్వకుండా కాపీనం చూపిస్తారు అని చెపుతూ ఉంటుంది మా ఆవిడ .
పూలు కొంటుంటే డబ్బు ఖర్చు అవుతుందని ఏడ్చే బదులు వాళ్ళకున్న ఖాళీ స్థలంలో మొక్కలు పెంచుకుని..ఆ పూలు వాడుకోవచ్చు కదా అనుకుంటాను నేను. ఈ మధ్యనే ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో రేకులతో రెండు గదులు వేసి.. ఒకరికి అద్దెకి ఇచ్చారు. ఆ అద్దెకి ఉంటున్న వాళ్ళు ఇంటెడు చాకిరీ చేస్తే కాని బయటికి వెళ్ళకూడదని ఆంక్షలు ,. ఏమైనా అంటే మాకు పని చేస్తావనే కదా.. తక్కువ అద్దెకి ఇచ్చాం అనేవాళ్ళు.
మా ప్రక్క ఇల్లే కాబట్టి అప్పుడప్పుడు రావు గారితో మాటలు తప్పవు నాకు. ఒకటి రెండు మాటలుతో ముగించి వేరే పని ఉన్నట్లు జారుకుంటాను. లేకపోతే విరామం ఇవ్వకుండా.. ఆయన ఉద్యోగ విషయాలు, ఆయనకీ ఉన్న పలుకుబడి గురించి డబ్బా గొడుతూనే ఉంటాడు.
ఎందుకో రెండు రోజుల నుండి రావు గారు కనబడలేదు. హమ్మయ్య! ఏ కొడుకు దగ్గరకో విదేశాలకి వెళ్ళి ఉంటాడనుకుని ఊపిరి పీల్చుకున్నాను. ఓ..ఆర్నెల్లు పాటు అయినా ఆయన బెడద తప్పుతుందని కూడా సంతోషించాను. .
నేను అలా అనుకున్నానో లేదో వెంటనే రావు గారు కనబడ్డారు. ఎప్పుడు ఆయనే ముందు మాట్లాడే వారు. ఈ సారి ఎందుకో మాట్లాడ లేదు. నేనే పలకరించాను. " ఏం..సార్ ..! కనబడటంలేదు. ఊర్లో లేరా..? అని అడిగాను.
"ఉన్నాను . కొంచెం హెల్త్ ప్రాబ్లం "అని చెప్పి గబా గబా లోపలకి వెళ్ళిపోయారు.
లోపలికి వచ్చి మా ఆవిడతో .."ప్రక్కింటి రావు గారికి ఏదో అనారోగ్యం అంట..ఏమైంది.? " .అడిగాను ఆసక్తిగా.
అలా అడగడం ఎందుకంటే వంట ఇంటి గోడ ప్రక్క అటు వైపు ఇటువైపు నిలబడి మా ఆవిడ, రావు గారి ఆవిడ గంటల తరబడి ముచ్చట్లు పెడుతూ ఉంటారు. అలా అయినా విషయం మా ఆవిడకి తెలిసి ఉంటుంది కదా అన్న నా ఆసక్తి కూడానూ..
అప్పుడు..మా ఆవిడ నాకు దగ్గరగా వచ్చి రహస్యం చెపుతున్నట్లు చెప్పింది.
" అనారోగ్యం కాదు ఏమి కాదు. వాడొక ముసలి నక్క . పొట్టంతా విషమే! కూతురి వయసున్న ఆడవాళ్ళని కూడా దొంగ చూపులు చూసి చొంగ కార్చుకుంటాడు. మొన్న ఆయన భార్య ఊరెళ్ళి నప్పుడు .. పూలు ఇవ్వడానికని మల్లి వస్తే..ఆమెతో..అసభ్యంగా మాట్లాడు అంట. .పోనీలే చితకార్తే కుక్క అనుకుని పూలు ఇచ్చి వెళ్ళిపోయింది . మళ్ళీ తెల్లవారి డబ్బులిస్తానుండు ..అని గుమ్మలో నిలబెట్టి ఉంచి లోపలి వెళ్లి ఇంటి చుట్టూరా తిరిగివచ్చి మల్లిని లోపలి కి నెట్టి తలుపులు మాసాడంట
పాపం మల్లి..గట్టిగా అరిస్తే పరువు పోతుందని అరవకుండా గొంతు అదిమి పెట్టుకునే.. పూల మాలని తెంపే బ్లేడ్ తీసుకుని చేతికందినట్లు ఎడా పెడా కోసేసి బయట పడింది. పూల బుట్ట అక్కడే పడేసి గబా గబా వచ్చి మనింట్లో కొచ్చి పడి ఒకటే ఏడుపు.
"అమ్మా. వాడికేం రోగం వచ్చిందమ్మా ! నా తండ్రి ఈడు మనిషి. ఒకసారి మంచితనంగా చెప్పి చూసా ..వినలేదు. రోజూ వాళ్ళ ఆవిడ చూడకుండా సతాయిస్తా ఉంటాడు. నేను డబ్బు కోసం ఆశ పడే మనిషి నైతే పొద్దస్థమాను కష్టపడి ఈ పూలమ్ముకుని ఎందుకు బతుకుతానమ్మా.. నన్ను పూల పక్కలమీద పడుకోబెట్టేవాళ్ళు ఉంటారు.
ఏదో పూలు అమ్ముకునేది..కదా! నాలుగు డబ్బులు పడేస్తే పువ్వుని నలిపినట్టు నలిపేద్దామ్ ..అనుకునే మనుషులమ్మా వీళ్ళంతా .
ఒకడు కన్ను గీటు తాడు.ఇంకొకడు..పూలన్నీ నేనే కొంటాను..రాత్రికి వచ్చేయి అంటాడు.
ఆడ పుట్టుక పుట్టిన పాపానికి .. ఈ చిత్తకార్తే కుక్క ముండా కొడుకులకి లోకువైపోయాను. నన్ను వదిలేయ్..అయ్యా.. ! అంటే వినలేదు. బలవంతం చేయబోయాడు. పూలు కట్టే చేతులు కదా.. పువ్వులా ఉంటాననుకున్నాడు. ఈ చేతులు దారాన్ని పువ్వుల కుత్తుకకి బిగించిన చేతులు కూడానమ్మా... ఆ దారంతోనే ఉరి వేద్దునూ. పాపమంటుకుంటుందని బ్లేడు తీసుకుని.. బరికేసినా.." అని చెప్పింది..అంటూ సీన్ మొత్తం కళ్ళకి కట్టినట్లు వివరించేసింది మా ఆవిడ.
నాకైతే ఆ సమయమప్పుడు మల్లి ఎలా ఉంటుందో.. ఊహించుకుంటే.. భలే సంతోషం వేసింది. పువ్వులా ఉండే మల్లి ఉగ్ర రూపం కనులముందు మెదిలింది. "ఆ ముసలి నక్కకి తగిన శాస్తి జరిగింది". అన్నాను.
"ఇంతకీ రేపు ఊరెళ్లిన రావు గారి భార్య వస్తే ..ఒళ్ళంతా ఆ గాయాలు ఏమిటని అడిగితే ఏం చెపుతాడో.. !? మా ఆవిడ ఆసక్తి.
"నిమ్మ చెట్టు క్రిందకి వెళ్లాను. చెట్టుపై పాము కనబడింది.. భయపడి గబగబా రాబోయాను. ప్రక్కనే ఉన్న కొమ్మకి తగులుకున్నాను. నిమ్మ ముళ్ళు గీరుకున్నాయి అని చెపుతాడు లే!" అన్నాను.
"భలే ఊహించారండీ మీరు " అని వెంటనే.. "మీకు గాని ఇలాంటి అనుభవం ఏమైనా ఉందా!? నా వైపు అనుమానంగా చూస్తూ అడిగింగి మా ఆవిడ.
శ్రీ రామచంద్రా..! అంటూ.. పూజా మందిరం వైపు తిరిగి చేతులు జోడించాను నేను.
11 కామెంట్లు:
బావుందండీ. స్త్రీలకి ముంచుకొచ్చే ఆపదలని దైర్యంగా ఎలా ఎదిరించాలో చెప్పారు.
కథా రచనలో మీ శైలి అద్భుతం,ఏకబిగిన చదివించే లక్షణం మీ ప్రతి పోస్ట్ కి ఉంటుంది.
తనను తాను రక్షించుకునే తెలివితేటలు కలిగి వుండాలని చెప్తోంది మీ కథ. అందరికీ ఆ ధైర్యం ఉండాలని కోరుకుందాం వనజ గారు.
నేనే మొనగాడిని నేను ఎఅమి చేసిన చెల్లుతుంది అనుకునే వాళ్ళకి సరైన గున్పాటం చెప్పిన మల్లిలా ఆలోచించాలి నేటి అమ్మాయిలు
చాలా బాగుంది వనజ గారూ!...చెప్పాల్సిన సందేశాన్ని చక్కగా చెప్పారు కథ రూపంలో...ఎప్పటిలాగే మీ చక్కని కథనంతో...@శ్రీ
వైష్ణవి .. ఆత్మ రక్షణ విద్యలు నేర్చి ఉండాలి కదా! బెల్లు ,సుకుమారులు అన్న బిరుడులేల?అనిపిస్తూ ఉంటుంది నాకు . కథ నచ్చినందుకు ధన్యవాదములు.
@ జ్యోతిర్మయి గారు.. థాంక్ యు సోమచ్.
సంజయ్ ! థాంక్స్ ఫర్ యువర్ కామెంట్. ఎవరో వచ్చి మనలని రక్షించాలని ఆశ పడకుండా.. తమని కాపాడుకునే దైర్యం ఉండాలండీ. !
@శ్రీ గారు.. ధన్యవాదములు. మన పిల్లలకి చదువు సంస్కారంతో పాటు ఆత్మ రక్షణ విద్యలు నేర్పించడంలో తప్పు లేదండి. విచక్షణ లోపించి.. అహంకారంతో మృగంలా ప్రవర్తించే వారి నుండి కాపాడుకునే తెలివితేటలూ అవసరమే!
వనజ గారు ,
కధ ఆసక్తికరంగానే ఉంది కాని, ఆ అమ్మాయికి 'మల్లి' అన్న పేరు పెట్టడం లో అంతరార్ధం చెప్తారా.
ఇంకో పేరు పెడితే బాగోదా ? :)
మౌళి గారు ... వేరే పేరు పెడితే కూడా బాగానే ఉంటుంది. కానీ నాకు ఆ ఆలోచన రాలేదండి. కథలలో పాత్రలకి పేరు పెట్టడం కష్టమైన పని .
కానీ ఈ కథలో మల్లి పాత్ర చిత్రీకరణ కాదండి
మల్లి లాంటి పూలమ్మి గురించే వ్రాసాను. ఆత్మ విశ్వాసం, దైర్యం, స్వచ్చత మల్లి సొంతం అండీ! సుకుమారంగా ఉంటేనేం నలిపెయాలని చూస్తే ఏమి ఊరుకుంటుందా చెప్పండి ? మల్లి నా ఫేవరేట్.
కథ నచ్చినందుకు ధన్యవాదములు
@మల్లి లాంటి పూలమ్మి గురించే వ్రాసాను
అంటే మీ పూలమ్మి అసలు పేరు అదే అని మీ అభిప్రాయమా..
@ఆత్మ విశ్వాసం, దైర్యం, స్వచ్చత మల్లి సొంతం అండీ!
ఇది చదివి చదివి కొన్నాళ్ళకి ఏమనిపించింది అంటే, ఇంకెవరికీ స్వంతం కానవసరం లేని, పనికిరాని స్వచ్చత పాపం మల్లికి ముళ్ళకిరీటం కాదా ? :)
చాలా కాలమ్ నుండి ఉన్న అభిప్రాయమే కాని, మీ కధ వల్ల ప్రశ్నించే అవకాసం వచ్చింది.
మౌళి గారు ముళ్ళ కిరీటం పెట్టుకుని మోసే వాళ్లకి లేని బాధ చూసేవాళ్ళకి ఎందుకండీ !? స్వచ్చత గా ఉండాలా వద్దా .అన్నది వ్యక్తిగతం దానిని ప్రశ్నించే అధికారం ఇతరులకు ఉండదు కదా!
కొనదరు కొన్నిటికి ప్రాధాన్యత ఇస్తారు. కొందరు వదిలేస్తారు. వ్యక్తి స్వేచ్చని మనం నిరోధించలేం కదండీ ?
అవును మౌళి గారు పూలమ్మి పేరు మల్లి .
మోసేవాళ్ళం కాబట్టే ఈ బాధ, అర్ధం చేసికోరూ :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి