30, ఏప్రిల్ 2016, శనివారం

దుప్పటి

రంగు రంగు దారాల లతలతో    

జరీ జిలుగు పూలతో  నైపుణ్యంగా 

అలంకరించబడింది నా దుప్పటి.  


అదృశ్య హస్తమేదో పూలకి రంగులద్దినట్లు 

నా ప్రాణ దర్పణాన్ని  ఆ రంగుల దుప్పటి 

ఆత్మీయంగా కమ్మేసేది. కనబడని నీడయ్యేది 

తన విముక్తాకాశం క్రింద పులుగునై 

సంచరించడానికి అవకాశమూ ఇచ్చేది 

ఎన్నెన్నో  హృదయాఘాతాలని 

భరించిన  బాధని  గోప్యంగా దాపెట్టేది 


క్షత గాత్ర గానాన్ని వినబడనీయకుండా  

నన్ను  రహస్యంగా కప్పేసేది . 

చర్మ చక్షువులతో సంగ్రహించిన సత్యాన్ని 

బయల్పడకుండా కాచే కన్నూ అయ్యేది 


శుభ్రవస్త్రం లాంటి మనసుపై 

ధూళి నంటనివ్వని తెరయ్యేది 

పలుచనైన పలకరింపులన్నీ వొడపోసేది  

అతిగా బాధించే సున్నితత్వాన్ని కత్తిరించేసేది 


కొత్తగా హృదయానికి రెప్పలు మొలవడాన్ని   

 ప్రేమ ఓ భ్రమరంలా జొరబడి  చేసే రొదలని 

పొరలు పొరలుగా విచ్చుకున్న జ్ఞానాన్ని 

కాపాడే రహస్య సైనికుడయ్యేది. 


ఇతరముల నుండి నన్ను విడదీసి 

ప్రియమైన  అలంకారమైంది. 

ఇంతగా నన్ను కాచిన  ఈ " అహం"  దుప్పటి 

నాకొక కవచకుండలమైనది. 


నా అనవసర త్యాగాలలో ఎన్నటికీ  చేరని 

ఈ దుప్పటి నునుపు మెరుపు 

తరక్కుండా చేసే సాము గరిడీ  

నాకు బహు ప్రీతికరమైనది. 


ఇది కులమతాల జాతి విద్వేషపు దుప్పటి 

కానందుకు మరీ గర్వకారణమైంది .

26, ఏప్రిల్ 2016, మంగళవారం

ఇల్లాలి అసహనం

ఇలాలి అసహనం -వనజ తాతినేని 

మేమెలాగూ నిద్ర పోలేదు, మిమ్మల్ని మాత్రం ప్రశాంతంగా నిద్ర పోనిస్తామా  అన్నట్టు ఊరంతా మేల్కొనేలా సినిమా పాట పాడుకుంటూ వెళ్ళే వాహనం, దాని వెనుకనే  రోడ్డు మీద దబుక్కుమన్న శబ్దం. ఉలికిపడి లేచాను.  ఇంటద్దె  ఇరవై శాతం పెంచానని ఓనరమ్మ చెప్పినప్పుడు ఉలికి పడ్డట్టుగా.  అన్యాయం!  చానల్ సాక్షిగా తాడిగడపలో ఇంతిల్లు  పదివేలే అంటున్నారన్నా ! చానల్స్ లో ఎవరూ నిజం చెప్పరని మీకు తెలియదా అంది. నిజమే కదా! అనుకున్నాను వీలైనంత ఏడుపు గొంతుని సరి చేసుకుని. అన్నీ పెరుగుతున్నాయి. ఆయుష్షు కూడా పెంచి ఇక్కడ నరకమెందుకు చూపిస్తావ్ దేవుడా !? మనసులో తిట్టుకున్నాను.

రాత్రంతా నిద్ర లేదు. కలలకి కూడా పొంతన లేదు  ఆలోచనలాగానే ఎడ్డె మంటే తెడ్డె మంటున్నాయి. కాసేపు  నాలుగు రింగుల కారు, కలర్ ఫుల్ పోలీ వీవెన్ చీరలు, కొంకణ్తీర్  డైమండ్ నగలు, ఇవే కనబడతాయి. కాసేపాగాక   ప్రకృతంతా  వసంతగానం చేస్తుంటే  ఎండలేమో తొందరపడి ముందే సచిన్ బాదినట్టు  బాదుతున్నాయి.  ఒంట్లో  నుండి చెమట చుక్క బయటకి రానీయమని కంకణం కట్టుకున్నవారు వర్సెస్  తాగడానికి చుక్క నీళ్ళ కోసం అలమటించేవారు.ఇదీ భారతం. భవతు భారతం. అక్షరాల అరవై ఎనిమిది సంవత్సరాల నుండి ఆకలి, నిరుద్యోగం, అవినీతి, లంచగొండితనం  వగైరా వగైరా లన్నింటికి ఒకే ఒకే విశ్వసనీయమైన  మందు దేశభక్తి. అసలా ప్లేవర్ కి ఏ ప్లేవర్ పోటీ  రాదు.   అందులో పడి మునిగిపోవాలని రాసి పెట్టి ఉందని తెలుస్తూనే ఉంది. ఆకలి ఉంటే  సరిపోయిందా దేశభక్తి ఉండొద్దూ ... అడుక్కుని పరువు తీయకు పో ... దూరంగా పో ! లాంటి నిజాలు చెప్పే కలలు వచ్చినందుకూ  అసహనంగా ఉంది.

వాకింగ్ పేరుచెప్పుకుని  మగవాళ్ళు ప్యాంట్ జేబులో క్యారీ బేగ్  ని వేసుకొస్తున్నారు.  పరులు  పెంచుకున్న మొక్కల, చెట్ల పూలతో పూజ చేస్తే మంచిదని దేవుడు చెప్పాడు కాబోల్సు. శ్రద్దగా తెగ పాటించేస్తున్నారు. కామన్ ప్లేస్ లో కుండీలలో పెట్టిన మొక్కలకి కూడా ఒక్క పూవ్వు మిగల్లేదు. నా హృదయపుష్ఫం ఎవరూ దోచుకోలేరులే అనుకున్నా అంతకన్నా వేరే దారిలేక. ఉపన్యాస చక్రవర్తి భర్త పాదాలు  పిసికి, మొల మీద గుడ్డ ఉతికి ఆరేసి పుణ్యం తెచ్చుకోండి అని సెలవిస్తున్నాడు. అర్ధభాగంకి ఆయనెప్పుడైనా అలా చేసాడో లేదో ! అమ్మ కన్నా చేసాడో లేదో ! ఒరేయ్ ఒరేయ్ ..కాస్తైనా మారండి రా ..బాబూ!  ఈ శతాబ్దపు ఆడవాళ్ళకి ఎందుకసహనం తెప్పిస్తారు ?

బిల్డింగ్ లో ఉన్నవాళ్ళందరి పైనా పెత్తనం చెలాయించే సుధీర్  " నా  పట్టు చొక్కా అంతా కాల్చేసావ్ ! ఇస్త్రీ చేయడం కొత్తని చెప్పొచ్చుగా. పొలాల్లో పనిచేసుకుని బతికినవాళ్ళు టౌన్ లోకి వచ్చి దోబీ అవతారమెత్తితే ఇదిగో ఇలాగే  ఉంటుంది. మూడేలు రూపాయల కొత్త షర్ట్. ఈ షర్ట్ నువ్వే ఉంచుకో ..డబ్బులు నీ జీతంలో కట్ చేసుకుంటా !  ఉదార అసహనం ఒలికిస్తున్నాడు. పాపం! కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని చిందులు తొక్కుతున్న ఆయన్ని చూస్తూ నిలుచున్నాడు కొత్తగా వచ్చిన వాచ్మెన్ నాగేశ్వరరావు.

పొద్దుటి నుండి ఒకటే మెసేజ్ పదిసార్లు.  ఎవరో అన్నయ్య  యు వీ ప్యాలెస్ కి వస్తున్నాడట. అందులో ప్రత్యేకత ఏముందీ ? జనాలు  వీసా లేకుండా ఎన్నో దేశాలకి వెళ్లి వస్తున్నారు . స్వదేశంలో ఎక్కడ తిరిగితే ఏమైంది? ఎవరి పనులు వారివి. దానికంత ప్రాధాన్యం ఎందుకివ్వాలి? అనుకూలంగా కొన్ని, వ్యతిరేకంగా కొన్నీ.  డబ్బులు పుచ్చుకుని మీటింగ్ కెళ్ళే వాళ్లకి అలాంటి మెసేజ్ వెళ్ళినా ఫలితం భారీగా దక్కును. నాకెందుకంటా!  పదకొండో మెసేజ్. అసహనం రాదుమరి. ఇక ఒర్చుకోవడం నావల్ల కాలేదు.ఆ నంబర్ బ్లాక్ చేసి పడేసాను.

హాల్లో టీవి , బెడ్ మీద లాప్ టాప్. డైనింగ్ టేబుల్ మీద ఎడమ చేతిలో మొబైల్. మనుషులు మనుషులతో మాట్లాడుకోరు.  తెరమీద మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం ఎక్కువైపోయింది.తెరల మీద చూసి చూసి ఈ మధ్య మా ఇంట్లో కూడా శాంతి సామరస్యం అస్సలు కుదిరి చావడంలేదు. ప్రతి దానికి అసహనం ప్రదర్శించడం అలవాటైపోయింది. రోజూ వంట చేసినట్టే,రోజూ ఇంటి పని చేసినట్టే రోజూ టీవి సీరియల్స్ చూసినట్టే రోజూ అసహనం ప్రదర్శించకపోతే ఏమీ బాగోలేదు.   మొన్నట్టాగే అత్తగారు చుట్టంలా వచ్చింది వచ్చినట్టు ఊరుకోకుండా..  ఎందుకా సీరియల్స్ అదే పనిగా చూస్తావ్ ! పిల్లలతో హోం వర్క్ చేయించవచ్చు కదా అంది. మా ఆయన్ని వరించినందుకు భరించక తప్పదని ఊరుకుంటున్నా కానీ  పక్కింటి వాళ్ళ కోడలు వేసినట్టు ఏ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ నో వేసేస్తే  పీడా పోద్ది  అనుకున్నాను

అమ్మ గారు డస్ట్ బిన్, అమ్మ గారు పోస్ట్, అమ్మగారు కరంట్ బిల్, అమ్మగారూ నెట్ బిల్, అమ్మాయి గారు సపోటాలు బాగున్నాయి రండి ...  డజను నలబై రూపాయలే ! అయ్యని ఎవరూ పిలిచే  అలవాటులేదు, పాపం ఆర్ధిక భారం ఆయనకేమి తెలుసని జాలి కాబోలు.
పక్కింటమ్మాయికి పెళ్ళైతే నీకెందుకు  కొత్త పట్టు చీర, డిజైనర్ బ్లౌజ్ !? చంపుతున్నావ్ కదే ! ఎదురింటాయన ఆక్రోశం.  ఆ మైనా వాడి దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ నగలమ్మినట్టు చీరలు బ్లౌజ్ లు కూడా అద్దెకిచ్చే వాళ్ళుంటే  ఎంత బావుండునో ! మగాడికి అధిక సంపాదన కోసం బల్ల క్రింద చేయి పెట్టడమో,  హార్ట్ ఎటాక్ రిస్క్ రెండూ తప్పుతుంది. అరెరే ! ఇదేదో మంచి ఐడియానే ! మనమే  అలాంటి షాప్ పెట్టేసుకుంటే పోలా ఇలా ఖాళీగా కూర్చునే బదులు!

మేడమ్!  ఉదయం సార్  తో మాట్లాడాను హవా టెల్ లో మంచి ప్లాన్స్, ఆఫర్స్ ఉన్నాయి పోర్టబిలిటీ చేయించుకుంటానన్నారు అంది కంఠంలో బహుతీపిని ఒలకబోస్తూ ఓ పిల్ల .   ఎవరమ్మా .. ఆ సార్ !? ఏ సార్ తో మాట్లాడావో నువ్వు?  ఈ నెంబర్ గల  ఫోన్  ఎప్పుడూ నాదగ్గరే ఉంటుంది . ఇంకో విషయం తల్లీ ఈ నెంబర్ మీ హవా  టెల్ లోకి మారి రెండేళ్ళు అయింది  కదా ! అన్నాను టక్కున పెట్టేసింది.  మా ఆయన మొన్నెప్పుడో ఇలాంటి కాల్  అటెండ్ అయి   వేషాలు బాగానే వేస్తున్నారు   ఫ్యాన్సీ నెంబర్లని ఎన్నుకుని  ఇదోరకం వ్యాపారం !  సిగ్గు లేదూ..  చావండహే! అన్నది గుర్తుకొచ్చింది.

అక్కా!  అక్కా !! పక్క అపార్ట్మెంట్ అమ్మాయి పిలిచింది నన్నేనా ..? నేను అక్కనెప్పుడయ్యా నబ్బా ! పెళ్ళైన మర్నాటి నుండే అందరికీ ఆంటీ నే కదా ! అలా పిలవద్దని స్మూత్ గా చెప్పి కూడా  అందరితోనూ యాంటీ అయిపోయా ! ఓపికపోయి మూలుగుతూ కూర్చున్న నాకు ఈ  అక్కా అన్న పిలుపు కవితా కృష్ణమూర్తి భైరవి రాగంలా  తోచింది . గబుక్కున బయటకెళ్ళి ఏంటమ్మా ..సత్యా అనడిగా! ఒక కరిపాకు రెమ్ముంటే ఇవ్వక్కా ! అయ్యో ! కూరలో కరివేపాకులా మనుషులని తీసి పారేస్తున్నారని మనుషులకి కోపం వచ్చి కరివేపాకు తోటలని  పెంచడం మానేసారటమ్మా!  కావాలంటే కొత్తిమీర కట్ట ఇస్తా ! మాడిన కూరని కూడా గార్నిష్ చేసి మీ ఆయనతో లొట్టలేసుకుంటూ తినేటట్టు చేయొచ్చు అన్నాను. నవ్వి సరేనంది. ఇలాగే అక్కా అని పిలుస్తూ..  నీకేమి కావాల్సినా అడగమ్మా ! మొహమాటపడకు. పక్క పక్క బిల్డింగ్ లలో ఉన్నాం, మనం మనం  సాయం చేసుకోకపోతే ఎలా !  అంటూ కాస్త అతిగానే స్పందించాను.  మా చిన్నోడికి అర్ధమయ్యిందనుకుంటా.. ముసి ముసిగా నవ్వుకుంటున్నాడు. పిల్లలు పెద్ద ముదుర్లు అయిపోయారు.వాళ్లకీ అన్ని విషయాలు   తెలుస్తున్నాయి.  ఆ సంగతి మొన్నెవడో కథల గ్రూప్ లలో  పోర్న్ వీడియో పోస్ట్ చేసి  మరీ చూపిచ్చాడు. ఝడుసుకుని చచ్చాను. ప్చ్ ..

లోకం  తెగ పాడై పోయింది. నేను పాడవకుండా ఏదన్నా రహస్యముంటే ..చెప్పరా..  భగవంతుడా ! ఆ రహస్యాన్ని కడుపులో పెట్టుకుని దాచుకుంటా, ఎంత కడుపు నొప్పి వచ్చినా సరే ! మాటిస్తున్నానుగా, నమ్మొచ్చు కదా !అసలు ఆడాళ్ళకి కడుపు నొప్పి ఎందుకొస్తుందో తెలుసా !  అవునులే ... హ్యాపీ బ్లీడ్ సంగతి నీకేం  తెలుసు ..నీకు అమ్మున్టేగా?  అమ్మతోడు ! అవకాశం కోసం నేను మతం మార్చుకోలేదు గనుక నువ్వు  అమ్మ లేని భగవంతుడని గుర్తుకొచ్చిందంతే! నిన్నిలా తిట్టడం ఎవరైనా వింటే మా దేవుడికి అమ్మ ఉంది అని యుద్దానికొచ్చే మిత్రులున్నారు. సైలెన్స్ సైలెన్స్ .అదివరకంటే మాటలని ముంతలో పెట్టి దాపెడితే సరిపోయేది ఇప్పుడు  నోట్లో మాట నోట్లోనే దాచి  పెదవులు కుట్టేసుకోవాలని అనుభవాలు చెబుతున్నాయి.బయటకి పొక్కాయా ..బ్లాక్ చేసి పడేస్తారు.  భావ స్వేచ్ఛ జిందాబాద్ !

పెద్దోడిని స్కూల్ లో దించడానికెళ్ళా ! ఆ ఎర్ర చీర మిస్ మీ క్యాస్ట్ ఏమిటీ అనడిగిందమ్మా,  క్యాస్ట్ అంటే ఏమిటమ్మా అన్నాడు వాడు.  కడుపు రగిలిపోయింది . ఆమె పక్కనే బండి ఆపాను . గుడ్ మార్నింగ్ మేడం ! మీ బాబు సో చీట్ అంది. స్వీట్ అందా చీట్ అందా ఇంటర్నెట్ భాష జనంలోకి వరదలా వచ్చేసాక ప్రతి చోటా  కన్ప్యూజే ! ఛీ... దీనెమ్మ జీవితం అనబోయి గబుక్కున ఆపుకున్నా ! ఒక నవ్వు నవ్వేసి ఊరుకున్నా ! మీరేం కేస్ట్ మేడం అడిగింది నన్ను. కోపమొచ్చి నాలుగు పీకుదామనుకున్నా ! ఎలాగో తమాయించుకుని నేనేమీ రాజకీయ నాయకురాలిని కాదమ్మా ! ఏదో ప్రయోజనం ఆశించి సడన్ గా నా కులమేమిటో ప్రకటించుకోడానికి. కాస్త ప్రశాంతంగా బ్రతకనీయండి తల్లీ  అంటూ దణ్ణం పెట్టా ! మీ ఫీలింగ్స్ దెబ్బతీయాలని కాదండీ  జస్ట్  తెలుసుకోవాలని అడిగానంతే! మోహంలో అసంతృప్తి దాచుకుని వెళ్ళిపోయింది.

ఈ విషయం అర్జంట్ గా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేసి కుల నిర్మూలన కోసం పోరాడాలి . ఒక నాలుగువందల లైక్ లు, ఎనబై షేర్ లు గ్యారంటీ ! లైక్ లంటే గుర్తొచ్చింది .. ఆ పెద్ద రచయిత్రి పోస్ట్ కి లైక్ కొడితే ఇంకో పెద్ద రచయిత్రికి కోపం . ఈ రచయిత్రి పోస్ట్ కి లైక్ కొడితే ఆ  రచయిత్రికి కోపం . భగవంతుడా ఈ పెద్ద పెద్ద వాళ్ళ మధ్య నన్నెందుకు ఇరికించావయ్యా ! నా మనసు చెప్పినట్టే వింటానని నీకు తెలియదూ ! నారీనారీ నడుమ మురారి నీది నాది వేరే దారి ఏఎన్నార్ డాన్స్, ఇరువురి భామల కౌగిలిలో అంటున్న  యువరత్నవేడుకోలు ఒకేసారి గుర్తొచ్చాయి మరి. స్నేహం చేద్దామంటే ఒక్క మంచి మనిషి దొరకరు. బోల్డ్ కాంటెంపరరీ  స్టైల్స్ షాప్ లలో అయితే దొరుకుతాయి కానీ మనుషుల్లో మంచి మనిషి భూతద్దం పెట్టి వెదికినా దొరకరు. అన్నీ ఆ తానులో ముక్కలే ! దొరికే దాకా వెతుకు వెతుకు .. వెతకవమ్మా . కష్టపడనిదే ఎవరికీ దొరకదని చెపుతున్నాగా! చత్!! అంతరాత్మ హిత బోధ ఎక్కువైపోయింది.

మన్ కీ బాత్.  మన్ కీ బాత్ . వినలేక చచ్చిపోతున్నా. అసలు మనసుంది ఎందరికీ ? కళ్ళముందు భగ భగ మంటలు, కస కస కోస్తున్న కత్తులు, టన్నులు కొద్దీ కన్నీరు.  ముందు  మన్ తీసేసి మాట్లాడటం నేర్చుకోవాలి.  నేర్పేందుకు ఎవరైనా ఉండారో లేదో అన్న సందేహం అసలొలదు. కోచింగ్ సెంటర్స్ కోసం కాళ్ళరిగేలా తిరిగే కష్టం కూడా వద్దు.  ఇప్పుడందరూ ఆ విద్యలో అవధానం చేసినవాళ్ళే  కదా ! ఓ చిలిపి పంజేయాలని బుద్దిపుట్టి   అనవసరంగా పృచ్ఛక  అవతారమెత్తితే అసహనానికి గురికాగలరు. జాగ్రత్తగా ఉండాలి పెద్దోళ్ళతో మాటలుకాదు మరి.   

మధ్యాహ్నం 12:55 అయింది ప్రియా కూతేసింది కాకి అలవాటుగా గోడమీద వచ్చి కూర్చుని  కావ్ కావ్  మంటుంది . ఎదురింటి తలుపు తప్పనిసరై తెరుచుకుంది. గుప్పిట్లో తెచ్చిన ముద్దని గోడమీద పెట్టి వెళ్ళిపోయింది కాకి అత్తమామ ఆరగించడానికి రెడీ అయిపొయింది. బతికి ఉన్నప్పుడు పెట్టారో లేదో కాని కళ్ళు మెరుస్తుండగా తృప్తిగా చూసుకుంటూ వెళ్లి ఠపీమని తలుపేసుకుంది . కాకి తిన్నంత తిని నేలమీద పడ్డ మెతుకులని  వదిలేసిపోయింది.ముక్కుతో ఏరేరుకుని తినే శ్రమ ఈ కాకికి లేదు కాబట్టి  హాయిగా ఎగిరి పోయింది గానీ  పాటు నాకొచ్చి పడింది.   గేటులోకి వచ్చి పడ్డ అన్నం మెతుకులని తొక్క కూడదనే సెంటిమెంట్ ఏడ్చింది కాబట్టి చీపురు తీసుకుని బర బరా ఊడ్చి పారేసా ! ప్రక్కనే పక్కిన్టామె  పెట్టిన కుండీలో తులసి మొక్కకి  చీపురు తగిలిందేమో! పుణ్యం వాళ్లకీ  పాపం నాకు.

మధ్యాహ్నం భోజనం చేసాక టీవి తదేకంగా చూస్తూ "దొండపండు పెదవులేసుకుని ఆ కాప్రా చూడు ఎంత బావుందో ... నువ్వు ఉన్నావ్ ఎందుకూ !? సిటీకొచ్చి ఆరేల్లైంది,గోరింటాకు మానేసి నెయిల్ పాలిష్ వేయించలేకపోతున్నా. ఎంతైనా ఊళ్లోళ్ళు  మారరని రుజువుచేసుకున్నావ్" అన్నాడు మా ఆయన. కడుపు మండిపోయింది. ఊళ్లోళ్ళు అని గడ్డిపరక లెక్క తీసేస్తున్నాడు. వాళ్ళు లేకపోతే తింటానికి గడ్డి కూడా దొరకదని తెలియదు.ఏంటో పెద్ద పట్నం గొప్ప? నీళ్ళు కూడా కొనుక్కుంటూ అని లోలోపలే తిట్టుకుంటుండగానే ఒక ఆలోచన పుటుక్కుమని పుట్టింది, ఆయన్ని ఏడిపించాలని.  బాగుంది కానీ...  మరీ తొమ్మిది గజాల గుడ్డ నేలపై జీరాడడమే అస్సలు బాగోలేదు అన్నా.  అది అంతర్జాతీయ  ఫ్యాషనే పిచ్చిమొహమా  అన్నారు.  వాళ్ళ ఒంటి నిండా కట్టినా డబ్బులే, కట్టకపోయినా డబ్బులే అంట,  నాక్కూడా అలాంటి అంతర్జాతీయ  ఉద్యోగమేమన్నా దొరికితే బావుండును అన్నాను అమాయకంగా. రిమోట్ విసిరి పడేసి  బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు పిచ్చి నా మొగుడు. సినిమా వాళ్ళతో పెళ్ళాన్ని పోల్చడం మొగుడికి తెలిసినట్టు పెళ్ళానికి తెలియదనే అజ్ఞానమైతే ఎట్టాగబ్బా  మరి.

 ఇలా రాసేసాక చాలామందిని  టార్గెట్ చేసినట్టు రాసేవేమో బంగారూ అంది అంతరాత్మ.  బాబోయ్ నేనేమన్నా నల్లకళ్ళద్దాల వృద్దనారీ రచయితనా ఏమిటీ ఇప్పటిదాకా జనాల్లో ఉన్న గౌరవం పోగొట్టుకోవడానికి. ఒక అక్షరం ఎగర గొట్టేసిన  పేరుతో కథ రాసేసి విషం కక్కినట్టు ఇంక్ కక్కడానికి. రాసే ప్రతిదీ నిజమని ఏ పాఠక వెధవాయ్ నమ్మడని తెలిసినట్టు లేదు. అంత వయసొచ్చాక  కాస్త ఇంగితం ఉండాలి తల్లోయ్ !  అభిమానిస్తున్నారు కదా అని చెవుల్లో  ఇంగ్లీష్ కాలీ  ప్లవర్ పువ్వెట్టకుమాతా ! చెప్పులో రాయి గుచ్చుకున్నట్టు ఫీల్ అవుతారు కొందరు అని చెప్పాలనుకుంటున్నా ! అయినా నా మాట వినడానికి ఆమెకి తీరిక ఉందో  లేదో !  చెవులు సరిగా పని చేస్తున్నాయో లేదో !

టీపాయ్ మీద పెట్టిన  మా ఆయన ఫోన్ కి ఏదో మెసేజ్ కూత.  యధాలాపంగా చూసా. బి ఎఫ్/జి ఎఫ్ కావాలా? కాంటాక్ట్ నెంబర్ పదంకెలు !ఇన్బాక్స్ లో బోలెడు ప్రేమ రుతువుల పైత్యాలు పచ్చిగా వార్మప్ చేసేవిగా ఉన్నాయి. ఇలాంటి వాటితో కాపురాలు కూలిపోమ్మంటే కూలి పోవూ ! అసహనం హద్దులు దాటింది. మా ఆయన ఫోన్ బాల్కనీ  గోడకెళ్లి టప్పున కొట్టుకుంటుంది. టీవీ,మొబైల్,ఇంటర్నెట్ ఇవన్నీ లేనప్పుడు అమ్మల కాలం ఇప్పటికన్నా కొద్దిగా బాగుండేదేమో! అప్పుడు  ఇన్ని విచ్చలవిడితనాలు లేవు. అయినా ఈ మాత్రం దానికే అంత అభద్రతాభావం ఎందుకో ? అంతరాత్మ మళ్ళీ  ఎదురుగా నిలబడి చెప్పింది  "ఎందుకంటే పెంపుడు కుక్కని నమ్మినట్టు, కొట్టంలో పశువుని నమ్మినట్టు మొగుడిని నమ్మడానికి వీలులేదే పిచ్చిదానా "అని. పోదూ ...ఎల్లకాలం మోసం చెయ్యాలనుకున్న వాడికి ఎప్పుడైనా బై బై చెప్పే తెంపరితనం కూడా ఉందిలే నాలో అని సముదాయించుకున్నా.

కోపం తగ్గాక మొబైల్ ముక్కలేరి చెత్త కుప్పలో పోద్దామని బయటకొచ్చా.  పుస్తకాలు ముందేసుకుని కూడబలుక్కుని చదువుకుంటున్న లక్ష్మిని చూసి ముచ్చటేసింది. పగలల్లా పదిళ్ళల్లో పాచి పని, అంట్ల పని చేసుకుని, ఇల్లు సర్దుకుని పుస్తకాలు ముందేసుకుని కూర్చోవడం, చదువుకోవడం. అలా ఉండటం  అస్సలు నచ్చలేదట లక్ష్మి మొగుడికి.  ఆమె పుస్తకాల్ని  చించి  పోగులు పెడుతుంటే  లక్ష్మి రాక్షసిలా మొగుడి మీద తిరగబడింది. నీ యబ్బ ! నీకేంటిరా నచ్చాల్సింది, నా సదువు నా ఇట్టం.  నోరు మూసుకుని ఇంటో  ఉంటే ఉండు, దొబ్బితే దొబ్బు అంది . నోరు తెరచుకుని ఆశ్చర్యంగా చూస్తూ లక్స్ నా సౌందర్య రహస్యం, బికినీ వేసుకుని బీచ్ లలో పరిగెత్తడం లాంటివే  కాదమ్మా  స్వేచ్చంటే .. అచ్చమైన  స్త్రీ స్వేచ్చంటే ఇది గదా ! అనుకున్నాను. లక్ష్మీ సెహబాష్ .

లక్ష్మిలా ఇలా తనని తానూ కాపాడుకోకపోతే అసలాడవాళ్ళని బ్రతకనిచ్చేటట్టు ఉన్నారా ! పిండంగా ఉండగానే ముక్కలు ముక్కలు చేసి   డ్రైనేజీలో గుమ్మరించేయడం లేదా   వావి వరుస వయసు చూడకుండా అత్యాచారం చేయడం.  అయితే అటు కాకపొతే ఇటూ ... బేటీ బచావో, ఔరత్ బచావో ... గొంతు పగిలిపోతుంది ఎవరికీ చెప్పాలి, యేమని చెప్పాలి ?  వినే నాధుడే లేడాయే !  ఏమి శిక్షరా ... బాబూ ! పొగిలి పొగిలి  ఏడ్వక ఏం మిగిలింది ? నెట్ న్యూస్ లో కూడా  అప్డేట్  చేసినప్పుడల్లా  ప్రపంచ దేశాలలో  ఎక్కడైనా సరే .. ఎప్పుడు., ఎలా రేప్ జరిగిందో వివరంగా చెప్పే కథనాలు ఎక్కువైపోయాయి.   మొన్నెప్పుడో కలలో రెండు కాళ్ళ మధ్య భూగోళాన్ని ప్రసవిస్తున్న స్త్రీ కనబడింది. ఏమిటో దానర్ధం? ఈ  అవాంఛితాల వార్తలు కళ్ళబడటం, వినబడటం వల్ల స్పందించే గుణం కూడా పోయింది. సున్నితత్వం కూడా పోతుంది. మెదడు మొద్దుబారిపోతుంది.

చీకటి పడబోతుండగా మధ్యాహ్నం నిద్ర నుండి మా ఆయన మేలుకున్నాడు.  రోడ్డు పక్కనే ఉన్న కల్యాణ మండపంలో పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది ... చెవులు బద్దలయ్యే మేళం మోగుతుంది.  పెళ్లి కొడుకు గుర్రం మీద ఊరేగుతూ నిన్నా కుట్టేసినాది, మొన్నా కుట్టేసినాది గండు చీమ అనే పాటకి తెగ ఎంజాయ్ చేస్తూ మండపానికి వెళుతున్నాడు. అతనుకూడా యువరాజులాగానే ఉన్నాడు.పెద్దలు కుదిర్చిన పెళ్ళంట.  భారీ కట్నం,పుత్తడిబొమ్మ అమ్మాయి. మా ఆయనకి దక్కినట్టే !  అంతకి ముందు ఎన్ని చీమలు కుడితే  కంగారుగా దులిపేసుకున్నాడో అమ్మా అయ్యా   ఏడుపు ముఖాలు చూడలేక.

నా ఫోనేది ... ఆయన ప్రశ్న. ఏమో నాకేం తెలుసూ ... అన్నా అమాయకంగా ముఖం పెట్టి. ఆయన ముఖంలో అసహనం. నాకది చాలా సింపుల్ గా అనిపించింది.  చూస్తున్నారుగా . వేకువఝాము నుండి   నేనెన్ని అసహనాలు భరించాను. ఆయనా ఒక్క అబద్దాన్ని సహించకపొతే ఎట్టాగబ్బా!

(సారంగ వెబ్ వార పత్రిక ఏప్రిల్ 21-2016 సంచికలో ప్రచురితం )




25, ఏప్రిల్ 2016, సోమవారం

అనిపిస్తూ

అనిపిస్తూ ... 

కొందరిని వింటుంటే 
వారితో కలిసి ప్రయాణం చేస్తున్నట్లనిపిస్తుంది 
కొందరిని చూస్తుంటే 
రంధ్రాన్వేషణ చేసినట్లనిపిస్తుంది  
కలగలిసి  నడుద్దామనుకున్న వారితో  కలిసి 
గమ్యం వైపు పరుగులు తీస్తున్నప్పుడే 
బ్రతుకుకి అర్ధముందనిపిస్తూఉంటుంది .

దుఃఖ  ఛాయ పడని  జీవితానికి  
వెలుగురేక  విలువ తెలియదనిపిస్తుంది 
కలల్ని  పగలకుండా కాపాడుకుంటూనే 
ఉబికొచ్చె కన్నీళ్ళని దహనం చేయాలనిపిస్తుంది  

కులమతరక్కసి వలకి చిక్కుకోకుండా 
ద్వేష బీజాలు జల్లకుండా  
ప్రేమ మొలకలై వనంలా విస్తరించాలనిపిస్తూ ఉంటుంది
కాఫీని, కవిత్వాన్ని బొట్లు బొట్లుగా లోపలికంటా 
ఆస్వాదిస్తున్నప్పుడు బతికే  ఉన్నానపిస్తుంటుంది. 

చేయవలసిన యుద్ధం చాలానే  ఉంటుంది  
ఆవేశం అతిగా ఉన్నా ఉద్వేగం ఉసిగొల్పుతున్నా 
శక్తి సన్నగిల్లుతుందనిపిస్తుంది  

మాటలు తూటాల్లా పేల్చడానికి ముందు
అనురాగ  రాగమాలికలని అదిమేసే ఉంచాలనిపిస్తుంది 
మనసుకి మరతనం తొడుగేసుకోవాలనిపిస్తుంది  
ప్రక్కనోడికి  మన వ్యూహాలు తెలియకుండా  
ఆలోచనలని  ముంతలో దాచే ఉంచాలనిపిస్తుంది 
పొల్లుమాటలు  రాకుండా పెదవుల్ని  కుట్టేసుకోవాలనిపిస్తుంది   
  

లోయల్లోని పూల తోటల వైపుకి వేరెవరో
వేలు చూపితే  వెళ్ళడం వీరత్వం కాదనిపిస్తుంది   
అచల శ్రేణీ పైకెళ్ళే   కొంగ్రత్త దారులని  
ఎవరికి వారే జిజ్ఞాసతో   కనుక్కోవాల్సి ఉంటుందనిపిస్తుంది   
ఈ అనిపిస్తూ..  ఉన్న ప్రయాణంలో గుర్రం రౌతు 
నేనే  అవ్వాలసి ఉంటుంది.






23, ఏప్రిల్ 2016, శనివారం

గడప బొట్టు

ప్లీజ్ ఓపెన్ ది డోర్ ! ఎవరిదో  ఎలక్రానిక్ అభ్యర్ధన. మూలనున్న మూడో పడకగదిలో హాయిగా పడుకుని రంగనాయకమ్మని చదువుకుంటున్న నేను లేవక తప్పింది కాదు. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందగ్గర్నుండి కాలింగ్ బెల్, టెలిఫోన్ రింగ్ రెండూ తెగ విసిగిస్తున్నాయి. రక రకాల సమూహాలలో కలవలేక ఇబ్బంది పడే నాకు ఈ పిలుపులు కూడా  ప్రాణ హింసే మరి .  తాళం  చెవులు   చేతిలోకి తీసుకుని బాల్కనీలోకి వచ్చాను . గేటు వెలుపల  ఇద్దరు స్త్రీలు. అందులో ఒకరు దుర్గారాణి  గారు.తాళం తీసి ..  రండి బావున్నారా ! అంటూ ఆహ్వానించాను. వారికన్నా ముందు నడుస్తూ లోపలకి వచ్చాను . 


నా వెనుకనే వచ్చినామె  గుమ్మానికి బొట్టు పెడతాను అంది . నేను తెల్లబోయాను .  గుమ్మానికి ఎందుకు బొట్టు పెడతారో నాకు తెలుసు కాబట్టి  గుమ్మానికి ఎందుకూ,  నాకు పెట్టేయండి అన్నాను. మీ ఆయనగారు ఉన్నారా ? లేరేమో అనుకుని అక్క గుమ్మానికి బొట్టు  పెడతానంది ఏమనుకోకండి  అంది ఆమె చెల్లెలు. భలే వారే ... నొచ్చుకోవాల్సింది ఏమీ లేదు . నన్ను చూస్తే అలాగే ఉన్నాను లెండి అన్నాను బోసి మెడ, ఖాళీగా, స్వేచ్ఛగా ఉన్న ఖాళీ చేతులని చూసుకుంటూ. లోపలికి వెళ్లి మెడలో తాళి బొట్టు ఉన్న గొలుసు వేసుకొచ్చుకున్నాక ఆమె గోపురం మార్క్ కుంకుమని నేను పెట్టుకున్న సింగార్ తిలకం పై  బొట్టు పెట్టి వాళ్ళ అబ్బాయి పెళ్ళికి ఆహ్వానించింది. తప్పకుండా రండి అని మరీ మరీ చెప్పి వెళ్ళింది. అమ్మయ్య ..ఒక అవమానం ఇలా రాసి పెట్టి ఉంది కాబోల్సు అనుకుని కాసేపు ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను. 


ఎవరైనా పిలుపులకి వచ్చినప్పుడు నేను  ఇంట్లో లేకపోతే కార్డు పాలబుట్టలో పెట్టి చెక్క గుమ్మం అందుబాటులో లేదు కాబట్టి ఇనుప గుమ్మానికే బొట్టు పెట్టి  వెళ్ళిపోతారు. గేటు తాళం తీసి లోపలికి రాబోతూ క్రిందపడిన కుంకుమ చూసి ఏవో పిలుపులు వచ్చాయని అర్ధం చేసుకుంటాను కానీ కోపం ముంచుకొస్తుంది.నా ముఖం గడప ఎప్పుడైపోయిందబ్బా వీళ్ళకి చెక్క గుమ్మం లాగా, ఇనుప బద్దె లాగా కనబడిందా! ఏమిటీ అవమానం? అనుకుంటాను. 


 మొన్నీమధ్య రాధిక గారి అమ్మాయి పెళ్ళికి కార్డ్ ఇస్తూ ఉంటే  పక్కన వచ్చిన ఆ అమ్మాయి ఫ్రెండ్   వెండి కుంకుమ భరిణె తీసి బొట్టు పెట్టాలా వద్దా అనుకునేమో  ఇద్దరూ వెనుక ముందు చూసుకుంటున్నారు. ఆఖరికి బొట్టు పెట్టకుండానే మరీ మరీ రమ్మని ఆహ్వానించి వెళ్ళింది వాళ్ళ పెద్ద అమ్మాయి.  నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు  ఆహ్వానితులకి స్వాగతం పలికే ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఓణీలు వేసుకున్న తెలుగింటి ఆమ్మాయిలు ఒకరు  పన్నీరు చల్లి, ఒకరు గంధం రాసి,పసుపుఇస్తే  తీసుకుని మంగళసూత్రంకి పెట్టుకుంటున్నప్పుడు  ఆ రోజు బొట్టు పెట్టాలా వద్దా అని తటపటాయించిన అమ్మాయిఆశ్చర్యంగా చూసింది ... . నేను నవ్వగానే ..సారీ ఆంటీ ... ఆ రోజు తెలియలేదు అని బొట్టు కింద బొట్టు పెట్టి నా అందాన్ని చెడగొట్టకుండా పాపటలో కుంకుమ పెట్టింది. మళ్ళీ నవ్వేసుకుంటూ లోపలి వెళ్లాను . 


ఈ మధ్య నా స్నేహితురాలు  కోడలిని తీసుకుని నా ఇంటికి వచ్చింది . వారిద్దరుతో పాటు తన మరిది కూతురు ఉంది.   పెళ్ళికి నేను వెళ్ళడం కుదరనందువల్ల వాళ్ళిద్దరులో స్నేహితురాలి  కోడలు ఎవరో తెలుసుకోవడం కోసం పాదాల వొంక చూసాను. మెట్లు పెట్టుకోకపోతే ఏం చేసేదానివి అంది. నిజమే కదా అనుకున్నాను. అసలు సమాజంలో అందరూ ఈ బండ గుర్తులకి ఎంత అలవాటై పోయారంటే చెప్పనలవే కాదు .మెడలో తాళి, నల్లపూసలు, చేతులకి మట్టి గాజులు, నుదుట కుంకుమ బొట్టు లేదా పాపట సిందూరం,కాళ్ళ వేళ్ళకి మట్టెలు ఇవన్నీ ఉంటే  కానీ  ఆమె వివాహిత స్త్రీ, పుణ్య స్త్రీ అని లెక్క. ఇవేమీ లేక నాలా ఖాళీగా కనబడితే విధవరాలు క్రింద లెక్క కట్టేసి ..శుభకార్యాలప్పుడు వెలివేసినట్లు చూడటం వల్ల అలా వెలివేతకి గురైన వాళ్ళు ఎంత ఆవేదన చెందుతారో !


మొగుడు చచ్చినదాని ముఖం చూడకూడదు, విధవరాలు ఎదురు రాకూడదు లాంటి అనేక చేదు  అనుభవాలు చాలామందికి విదితమే ! అలాంటివి వ్యతిరేకించినా తమ ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు వాళ్ళని మనమూ వెలివేస్తాము. లోకవిరుద్దంగా ప్రవర్తించి వాళ్లకి నలుగురితో పాటు చందన సత్కారాలు అందిస్తే తమకి కీడు జరుగుతుందని భయం కూడా ! ఇంట్లో ఉన్నప్పుడు కొత్తగా మతం మారినదానిలాగా ఉండే నాకు ఆహ్వానపత్రాలు అందటం, ముఖానికి అంటని అవమాన పత్రాలు  రాజ్య పూజ్యాలని సమానం చేస్తాయని నవ్వుకుంటాను.    అసలు ఈ  రకమైన సంప్రదాయాలు పెట్టిన వాడెవడో .ఖచ్చితంగా పురుషులే అయిఉంటారని నా విశ్వాసం కూడా ... వాడిని అరసెంటీమీటర్ లెక్కన కోసి కుప్పలు పెట్టాలని ఉంటుంది.


వ్రాతలలో కూడా  ఆమె కనుబొమ్మల మధ్య విరిసిన సిందూరం  రెండు కొండల మధ్య ఉదయిస్తున్న సూర్యుడిలా ఉందనో,  బొట్టు లేనప్పుడు చంద్రుడు లేని ఆకాశంలా ఉందని వర్ణనలు. ఎంత అన్యాయం ?  అసలు సంప్రదాయం గురించి ఎవరికీ తెలియదు ఒకరు ఒకటి చెపితే ఇంకొకరు ఇంకొకటి చెపుతారు . ఒకరు చెప్పినదాన్ని ఇంకొకరు ఖండించడం తాము చెప్పిన పద్దతిన జరగని వారు  మూతులు ముక్కులు విరుచుకోవడం భలే తమాషాగా ఉంటుంది నాకు. 


అసలు సోలా సింగార్ అవసరమా అనిపిస్తూ ఉంటుంది నాకు . చదువు,ఉద్యోగం కన్నాముందుగా  స్త్రీలకి స్వేచ్చ పేరిట లభించింది అలంకరణ. స్వేచ్ఛ.   ఆడవాళ్ళ సౌందర్య పిపాసని ముడి సరుకుగా చేసుకుని   పురుషులు  వ్యాపారం చేసుకుంటూనే  శారీరక సృహ, ఆరోగ్యం కాపాడుకోవడం పేరున ఆమెని మరింత దిగజార్చారు.అదంతా వ్యాపార మాయాజాలం అని తెలియనంతగా కూరుకుపోతున్న స్త్రీ లని  చూస్తే జాలి కల్గుతుంది.  మొన్నీమధ్య మా పక్కింటి అమ్మాయికి పెళ్ళైతే ..ఇరవైవేలు ఫేషియల్స్ కే  సమర్పించారంట , నా పెళ్ళప్పుడు ఆరు రూపాయల గోళ్ళ  రంగు కొనడానికి వెనుకాడితే ఇవాళ మా అమ్మాయి వయసు వాళ్ళు ప్రతి రోజు డ్రెస్ కి తగ్గట్టు మేచింగ్ గోళ్ళ  రంగు వేసుకోవాల్సిందే, సాయంత్రం తుడ వాల్సిందే !  పుట్టి ఏడాది అయిందో లేదో పెద్దలని అనుకరిస్తూ లిప్ స్టిక్ అడ్డుకుంటున్న పిల్లని చూస్తే విరక్తి కల్గింది.  


మా అక్క వాళ్ళమ్మాయి ఉత్తర భారతంలో ఉంటుంది . "అక్కడ మరీ వింత పిన్నీ !  ఇంట్లోనుండి వీధిలోకి కాలు పెట్టాల్సి వస్తే మేకప్ లేకుండా బయటకిరారు. పది పదకొండేళ్ళ పిల్లలు కూడా బాయ్ ఫ్రెండ్, మేకప్ తప్పని సరి అన్నట్టు ఉంటారు" అని చెప్పింది. 


అందం ఆత్మవిశ్వాసాన్ని నింపడం అనేది పది శాతం వరకూ నిజమేమో ! విజ్ఞ్ఞానం కల్గి ఉండటం,సమయస్పూర్తిగా వ్యవహరించడం ,జీవితంలో కష్టాలని ఎదుర్కోవడంలో ఉన్న ఆత్మస్థయిర్యం , దైర్యంగా ఉండటం అనేవి నిజమైన అందం అని చెప్పుకోవచ్చు అని ఎవరూ చెప్పరా  ఏమిటీ అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను. 


ఈ మధ్య మా బంధువులావిడ బస్ లో కనబడింది. కళ కళ లాడుతూ ఉంది. భర్త చనిపోయాడని, ఆ తర్వాత వెంటనే కూతురికి పెళ్లి చేసిందని విన్నాను. ఆమె పక్కన సీట్ ఖాళీ అయితే వెళ్లి కూర్చున్నాను.  మీరు విడోయరా అని ఆమె అడిగితే మీరు న్యూలీ మేరీడ్ ? అని ఒకేసారి ఒకరినొకరు ప్రశ్నించుకున్నాం . 


ఆమె "నాకు అలంకరణ అంటే  చిన్నప్పటినుండి చాలా ఇష్టం అండీ . ఈ  బొట్టూ, కాటుక, పూలు,రంగు రంగుల గాజులు లేకుండా అసలు నన్ను నేను ఊహించుకోలేను . ఆయన మరణించినప్పుడు పెద్ద యుద్దమే జరిగింది . మంగళసూత్రం, మట్టెలు తీసి పక్కన పెట్టేసాను . తెల్ల చీర కట్టుకోలేదని, బొట్టు తీసేయలేదనీ , అయినవాళ్ళ కి కీడు జరుగుతుందని ఏదేదో అన్నారు . అయినా నేను అవేమీ పట్టించుకోలేదు. పుట్టినప్పటి నుండి అవన్నీ ఇష్టంగా ధరించి మధ్యలో వచ్చిన భర్త పోయినప్పుడు తీయడమేమిటీ ? ఆయన చనిపోవడం నాకు పెద్ద విషాదమే కానీ నా రూపు రేఖలు అన్నీ మార్చుకుని జీవచ్చవంలా బ్రతికి ఉండటం కూడా కష్టం అనిపించింది.  ఆయన పోయిన తర్వాత ఇరవై రోజులకే ఆఫీస్ కి వెళ్లాను . మాములుగానే వెళ్లాను . చదువుకున్న వాళ్ళు కూడా పక్క పక్కకి తప్పుకుని వెళుతుంటే నవ్వు వచ్చింది . అంతగా మన రక్తంలో ఆ దురాచారాలు పేరుకుపోయి ఉన్నాయి . అలాంటి ఆచారాలకి మంగళ గీతం పాడాలి అందుకు ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. ఆ అడుగు నాతోనే పడిందేమో అనుకుంటాను . మీరూ  అంటూ ... అర్ధోక్తిలో ఆగింది . 


"నాకు అలంకరణల పట్ల అంత ఆసక్తి లేదండీ,  నాకిలా ఉండటమే ఇష్టం.  మా వారు గుండ్రాయిలా బాగానే ఉన్నారు . బొట్టులేని ముఖం, తాళి లేని మెడ అంటూ తెగ సెంటిమెంటల్ ఫీల్ అయ్యినా నేను పట్టించుకోను. 

బట్టలేం ధరించాలి ? అలంకరణ ఎలా చేసుకోవాలి, ఏం  తిండి తినాలి లాంటివన్నీ మనిషికి సొంతమైన ఇష్టాలండీ, నువ్వెందుకు అలా ఉన్నావ్, ఇలా ఎందుకు ఉండవు అని కూడా బలవంతం చేయకూడదు. 

మన దురదృష్టమేమ్టంటే .. చెత్తంతా ఎక్కడ పడితే అక్కడ ఎందుకు  పారేస్తావ్,చెట్లు ఎందుకు కొడుతున్నావ్ , లంచం ఎందుకు అడుగుతున్నావ్ ?, బస్సులు,రైళ్ళు ఎందుకు తగలబెడుతున్నావ్ అని అడగడం చేతకానివాళ్ళు,బాధ్యత లేనివాళ్ళు "ముఖాన బొట్టు ఎందుకు పెట్టుకున్నావ్ "  అని అడగడంలో మాత్రం ముందు ఉంటారు అన్నాను. 


ఇంత నాగరికత నేర్చినట్లు ఉండే ఇప్పటి జనం ఇలాంటి విషయాలలో ఇంత మూర్ఖంగా ఉంటే .. సంఘసంస్కరణకి నడుం బిగించిన కందుకూరి వీరేశలింగం లాంటి వారు విధవ పునర్వివాహాలు చేసి సమాజం నుండి ఎంత నిరసన ఎదుర్కున్నారో అన్నది తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుందండి అంది ఆమె . 


నిజమే కదా ! ఎంతో లోతుగా ఆలోచిస్తూ, కుహనా సంప్రదాయాల పట్ల అంతో ఇంతో వ్యతిరేకత ఉన్న ఆమె, నేను కూడా ఆ తానులో ముక్కలమే అని మేము ఒకరినొకరు ప్రశ్నించుకోవడంలో అర్ధమైపోయింది. కొన్ని  వదిలించు కావాలన్నా వదలవు జిడ్డులాగా అంటుకునే ఉంటాయేమో !  స్వగతంలో అనుకున్నాను. 




  

    


22, ఏప్రిల్ 2016, శుక్రవారం

సారంగ లో...




అలజడితో నిద్రపట్టని రాత్రులు . వ్యక్తిగత సమస్యలతో మాత్రం కాదు . అంతా సభ్యసమాజం గురించే ఆందోళన. అలా నిద్రపట్టని నడిరేతిరి పక్క మీద నుండి లేచొచ్చి సిస్టం ముందు కూర్చున్నా ! వ్రాయడం మొదలపెట్టాను. రెండున్నర గంటలలో ... ఒక రూపం ఏర్పడింది. అది కథ అవుతుందని అదొక చైతన్య స్రవంతి అని నాకు తెలియనే తెలియదు. అచ్చులో చూసుకోవడం సంతృప్తి నిచ్చింది. చైతన్య స్రవంతిలో ఎంత బాగా వ్రాసారు అని ఒక మిత్రుడు మెచ్చుకునేదాక నాకు కథ అచ్చైన విషయమూ తెలియదు. 

"సారంగ" కి హృదయపూర్వక ధన్యవాదములతో ..


ఈ వారం   సారంగ లో  నేను వ్రాసిన కథ  "ఇల్లాలి అసహనం"     ఈ లింక్  లో ...



20, ఏప్రిల్ 2016, బుధవారం

అయ్యోరమ్మా! రొవొంత ఇటొచ్చి ఉత్తరం ముక్క చదివిపో ..

అయ్యోరమ్మా! రొవొంత ఇటొచ్చి ఉత్తరం ముక్క చదివిపో .
శశీ ఎలా ఉన్నావ్ ?

ప్రేమ నిండిన  నీ పిలుపుతో ప్రియమైన అక్కని చేసావు నన్ను. ఆ పిలుపు నాకెంత సంతోషమో !

నాలుగేళ్ల క్రిందట నువ్వు నన్ను చూడాలని  మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఎంత సంతోషించానో ! నాలుగేళ్ళు అలా అలా..  గడచిపోయాయి . మీ అబ్బాయి నివాస్ చదువు పూర్తయింది కదా !
అమ్మాయి హేమకి   పెళ్ళి చేసినప్పుడు నాకూ ఆత్మీయంగా  ఆహ్వానం పంపావు. నెల్లూరు అనగానే నాకెంత సంబరమేసిందో !   నువ్వు కాకుండా, నాకెంతో ఆత్మీయురాలైన "సామాన్య " ఉంది. ఇంకో సుగుణ ఉన్నారు, ఇంకా కొంతమంది స్నేహితులు ఉన్నారు.  వీలుపడక రాలేకపోయాను కానీ .. ఈ టీచరమ్మ అప్పుడే అమ్మాయికి పెళ్లి చేస్తుంది ఏమిటీ ? అమ్మాయికి చిన్న వయసే కదా ! తను కూడా బాగా చదువుకుని ఉద్యోగంలో చేరి కొంచెం ఆర్ధిక స్వావలంబన  ఆత్మవిశ్వాసంతో నిలకడగా నిలబడినప్పుడు కదా పెళ్లి చేయాలి ? , తనేమో చక్కగా చదువుకుని టీచరమ్మగా ఉంటూ అమ్మాయికి పెళ్లి చేయాలని తొందరపడం బాగోలేదు అనుకున్నాను. మళ్ళీ అంతలోనే అంత మంచి సెబ్బర కనుక్కోకుండా, అన్నీ వివరంగా తెలుసుకోకుండా శశీ తొందరపడదులే అనుకున్నాను.

అమ్మాయికి  బాల్యజ్ఞాపకాల గురించి హేమ మాధురి మధురిమలు పేరిట నువ్వు వ్రాసిన జ్ఞాపకాలు ఎంత మధురంగా ఉంటాయో శశీ ! బిడ్డల ప్రతిదశని, ఆ ముద్దు ముచ్చట్లని అమ్మ గుర్తుంచుకున్నంతగా ఇంకెవరికి గుర్తుండవేమో కదా ! ఇక్కడ సందర్భం కాదు కానీ .. ఒకటి చెప్పుకోవాలి. మంచి విద్యావేత్తగా చక్కని వక్తగా పేరు తెచ్చుకున్న లక్ష్మీ పార్వతి గారు  సవతి కూతురికి పెళ్లి చేసి పంపేసి తను మాత్రం ఉన్నత విద్య చదువుకుందని పత్రికలలో చదివాను. పిల్లలకి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి రావాలి కదా ! తొందర తొందరగా  పెళ్లి చేసి భాద్యత తీర్చేసుకోవాలనుకుంటే తర్వాత అమ్మాయిలకి వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు వస్తే ఇతరులపై ఆధారపడి బ్రతకడం ఎంత కష్టం చెప్పు ?

అందుకే ఆడపిల్లలకి విద్య యొక్క ఆవశ్యకత తప్పని సరిగా తెలియాలి. ఇప్పుడు పిల్లలేమో చదువుకోమని కాలేజీలకి పంపితే ప్రేమ, అవాంచిత గర్భం, మౌనపోరాటం లేదా ఆత్మ హత్య ఎక్కడ చూసినా ఇవే కనబడుతుంటే ఇదా మనం సాధించిన అభివృద్ధి అని దిగులు కల్గుతుంది.

ఒకపక్క స్త్రీలకి విద్య అందుబాటులోకి వచ్చి వందేళ్ళు కూడా కాలేదు అప్పుడే స్త్రీల చదువులపట్ల ఎంతో  వ్యతిరేకం .  ఎంత చదివినా ఇల్లు చక్కబెట్టుకోవడం తప్పదు కదా అని తేలికైన మాటతో తీసిపారేస్తారు. ఇంకో పక్క  భారతీయ స్త్రీల వేష భాషల్లో ఆహార్యంలో ఎంతో  మార్పు వచ్చింది ముఖ్యంగా  వస్త్రధారణలో ఎంతో  మార్పు వచ్చింది.  సంప్రదాయబద్దంగా కట్టే చీరకట్టు, చుడీదార్ స్థానంలో ఫ్యాంట్ షర్ట్ వచ్చేసాయి . మళ్ళీ అక్కడినుండి కూడా డీ గ్రేడ్ అయి నిక్కర్ లలోకి దిగిపోయారు. మా విజయవాడలో కూడా అమ్మాయిలు ఐమాక్స్ దియేటర్స్ లోనూ, షాపింగ్ మాల్స్ లోనూ చాలా అధునాతనంగా కనబడుతున్నారు. నాకేమో ఇదంతా పశ్చిమ దేశాలనుండి దిగుమతి అయిన సంస్కృతి అయినప్పుడు పశ్చిమ దేశాలవాళ్ళు తీసుకున్నంత తేలికగా కొన్ని విషయాలని కొట్టి పారేయలేక పోతున్నాం కదా! అనుకుంటాను. వేష భాషలలో వచ్చినంత ఆధునికత ఆలోచనల్లో రాలేదు కాబట్టే  బయటకి వెళ్ళిన అమ్మాయి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేంతవరకూ అమ్మ చూపులు వీధి చివరనే అతుక్కుని ఉంటున్నాయి.

ఇంకేమిటీ శశీ ... నీ చిన్నప్పటి పొలం కబుర్లు చాలా బావుంటాయి. వ్యాఖ్య పెట్టలేకపోయినా చదివేసి వస్తూ ఉంటాను. మాది కూడా వ్యవసాయమే వృత్తిగా చేసుకుని, దానికే   ప్రాధాన్యతనిచ్చే  కుటుంబం కదా ! మా పంటపొలాలు కూడా వాణిజ్య భూమిగా మారిపోయే రోజులు దగ్గరికొచ్చాయి. అగ్రికల్చర్ జోన్ అంటే రైతులే నిరసన తెలుపుతున్నారు. ఇక పంటలు పండేది ఎక్కడ? అన్నం తినేటప్పుడు చేనుని, దాహంతో నీరు తాగేటప్పుడు నదికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని మా అమ్మ చెప్పేది. ఈ అతివృష్టి అనావృష్టిల దోబూచులాట కాలంలో రైతు కునారిల్లిపోతున్నాడు. ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు. మనసు వికలమైపోతుంది.  ఈ సంవత్సరం కృష్ణ డెల్టా లో కూడా పంట వేయలేదని 24 ఏళ్ళ తర్వాత మళ్ళీ మళ్ళీ అలాంటి కటకటని చూస్తున్నామని మా ప్రాంత  రైతులు చెపుతున్నారు. కృష్ణ, గోదావరి జలాలన్నీ  ఈ జిల్లాలే మింగేస్తున్నాయని రాయలసీమ ప్రాంత ప్రజల ఆవేదన వింటున్నాం.  ఇలాంటి  వాతావరణ పరిస్థితుల్లో పాలకులు మాత్రం ఏం చేస్తారు ? మనిషి చేసే పర్యావరణ నాశనానికి అంతం ఉందా ?

పత్రికలలో ఒక వార్త చూసినప్పుడు  నువ్వే గుర్తుకు వచ్చావ్ ! తమిళనాడులో శ్రీ వరిని  పండించి అధిక దిగుబడి సాధించిన ప్రసన్న భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు అంట. అర ఎకరం పొలంలో  నలబై బస్తాలు పండించి రికార్డ్ సృష్టించారు . మహిళలు క్లాస్ రూం లో పాఠాలు చెప్పడమే కాదు పంట పొలంలో దిగి వ్యవసాయం చేసి ఉత్తమ ఫలితాలని అందిస్తున్నారు . వ్యవసాయ ప్రాధాన్యమైన మన దేశంలో పొలం గురించి పరిచయం లేనిదెవరికి?  పచ్చని పైరుని చూసి పొంగిపోవడం,  పాడి పశువులని ప్రేమగా చూడటం మన గ్రామీణులకి సహజంగా అమిరిన గుణం. అది ఒకరు నేర్పాలా ఏమిటీ ?

అయిదవ తరగతి నుండి వ్యవసాయాన్ని కూడా తరగతి పాఠంగా చేర్చి వ్యవసాయ ప్రాధాన్యం గురించి, కుటీర పరిశ్రమల గురించి తెలియజెప్పాల్సిన అవసరముంది శశీ ! మన విద్యావిధానంలో చాలా మార్పులు రావాలి. రాబోయే కొన్ని సంవత్సరాలలో వ్యవసాయ ఉత్పత్తులే పెద్ద పరిశ్రమగా మారే అవకాశం ఉందంట. ఆధునిక వ్యవసాయం పట్ల మనవాళ్ళకి అవగాహన ఏర్పడాలి . మా ఇంటి దగ్గరలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలెట్టారు. ఒక స్టోర్ కూడా పెట్టి కూరగాయలు అమ్ముతున్నారు. ఖరీదు చాలా ఎక్కువ. మనలాంటి మధ్య తరగతి వాళ్లకి అందుబాటులో లేవు. పెరటి తోటలు ఇప్పుడు లేవు కదా ! అలాగే రూఫ్  గార్డెనింగ్  చేసుకోవడానికి అవకాశంలేని అగ్గిపెట్టె గదులున్నఇళ్ళు  అయిపోయాయి. ఇక మొక్కలని ఎలా పెంచుకోగలం ? సూర్యోదయం, సూర్యాస్తమయం, వెన్నెల  ముఖం చూడని బతుకులు అయిపోతున్నాయని దిగులుగా ఉంది.  ఇకపై మా ప్రాంతం వాళ్ళూ ..  ప్రకృతి ఒడిలో సేదతీరాలంటే ... ఓ  పాతిక కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. ఎక్కడ చూసినా బిల్డింగ్ లే ! నెల్లూరు కూడా అంతే కదా ! ఎంత పెరిగిపోయింది! కానీ అంతే ఇబ్బంది ఉంది కదా? మొన్న వర్షాలకి నిండా మునిగి పోయింది కదా, అలాంటి అభివృద్ధి అవసరమా అనిపించడం లేదూ !?

అందరూ పచ్చగా  ఉండాలంటే ... భూమికి పచ్చని  రంగేసినట్టు పాటు పడాల్సింది మనమే కదా ! మా అబ్బాయీ, నేనూ అనుకుంటూ ఉంటాం. ఇంకో అయిదారేళ్ళకి  తను ఇక్కడికి వచ్చేస్తాడు. పాలీ హవుస్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని తెగ ముచ్చట పడుతున్నాడు. భూముల ధరలు చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. గ్రౌండ్ వాటర్ లెవల్స్ పాతాళంలో ఉన్నాయి, పదెకరాలు పొలం కొనాలంటే అమెరికాలో పదేళ్ళు కష్టపడ్డా ఇక్కడ భూమి రాదు ... ఎక్కడో మారుమూల కొనుక్కోవాలి, అక్కడ కూడా మంచినీళ్ళు కొనుక్కుని తాగుతున్నారు. నువ్వేం వ్యవసాయం చేస్తావ్ ? అని వాస్తవాలు చెపుతాను .  అవునా అమ్మా అంటూ  దిగులు పడతాడు.

ఇంకేమి వ్రాయాలబ్బా అని ఆలోచిస్తున్నా. ఉత్తరం వ్రాయకముందు  ఏవేవో వ్రాయాలి అనుకున్నాను కానీ వ్రాయడం మొదలెట్టాక అవేమీ గుర్తులేవు. ఎప్పుడో నువ్వు అడిగిన ప్రశ్న గుర్తుకు వచ్చింది.

ప్రేమంటే ఏమిటని అడుగుతావు కదా శశీ ! నాకు కూడా అదేమిటో తెలియదు. అమ్మ ప్రేమ, బిడ్డపై ప్రేమ, ఒక మంచి భావం పై పుట్టే తాత్కాలిక ప్రేమ తప్ప ప్రేమంటే ఏమిటో నాకూ అనుభవం కాలేదు శశీ !
ప్రేమంటే భాద్యత , మనని నమ్మినవారి భవిష్యత్ ని మనం కలగనడం. అవతలివారు ద్వేషించినా ప్రేమిస్తూనే ఉండటం అని నేను అనుకుంటాను .

నేనున్నానని తోడయ్యేది..నీవే నేనని నీడయ్యేది...అమ్మగా చల్లగా కనిపించేది.. వేటూరి గారి గీత రచన కూడా నాకు చాలా నచ్చుతుంది.

బిడ్డపై తల్లిదండ్రులకి ఉన్న ప్రేమని ఎవరూ శంకించలేరు, అదే జీవిత భాగస్వామి ప్రేమ ఎప్పుడూ శంకతోనే ఉంటుంది.  యువతీ యువకుల ప్రేమ ఎప్పుడూ ఆకర్షణ తోనే ముడిపడి  ఉంటుంది  అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్ళ పెళ్ళిళ్ళూ  విఫలమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇద్దరూ ఉద్యోగాలు చేయాలి, ఇద్దరూ ఇంటిపని, వంటపని మిగాతాపనులన్నింటిని పంచుకోవాలి.  ఆడ పని మగ పని అంటూ ఏమి ఉండకూడదు. గౌరవం ప్రధానం. పురుషులు ఏమంటారో తెలుసా ! అన్నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పడేస్తున్నాం అది ప్రేమ కాదా అంటారు . ఆ పడేయడంలో విసుగు,అహంకారం ఉంటాయి.  ప్రకటితం కాని ప్రేమ ఎక్కడో అట్టడుగున తొక్కేసి ఉంటుంది. యాంత్రిక జీవనంలో ప్రేమ దొరికే చాన్స్ ఉంటుందా ?  దొరకని దానికోసం ఆవేదన చెందటం ఎందుకూ అని  అనిపిస్తూ ఉంటుంది.


ఈ మధ్య చాలామంది స్త్రీలు  ముక్కుపచ్చలారని బిడ్డలని ఉరి వేసి చంపేయడమో, నీళ్ళలో తోసేసి చంపేయడమో చేసి వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కన్నతల్లికి  బిడ్డలని చంపేసే కర్కశత్వం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపడుతున్నాం. కానీ వారి మరణం వెనుక దాగిన  పురుషుల నిర్లక్ష్యాన్ని, ద్రోహ చింతనని మనం అంతగా పట్టించుకోవడం లేదు. వైవాహిక జీవితంలో అసంతృప్తులు మగవాడిని ప్రక్కదారి పట్టించడం జరుగుతుంది. ఆడవాళ్ళు తక్కువేం కాదు. ఇలా కుటుంబ సంబంధ భాంధవ్యాలు దెబ్బతినడం మూలంగా నిరాశతో, నిసృహతో నిలువునా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి మరణాలు సమాజానికి విసురుతున్న  సవాల్ అన్నమాట . భర్త అలా చేస్తే భార్య నేను ఇలా చేసి చూపిస్తాను అని చెప్పడమన్నమాట.

మగవాళ్ళ దుర్వ్యసనాలు, బహుభార్యాతత్వంతో వర్దిల్లుతుంటే ఆ సంసారాన్ని ఈదటం తలకి మించినబరువు. పిల్లల చదువులు గుండెల్లో  పెద్దబండ. పాపం ఇక ఆ స్త్రీ ఏం చేయగల్గుతుంది ? ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే గుండె బరువెక్కుతుంది.  దైర్యంగా బ్రతుకుని ఈడ్వాలని వీరికి ఎవరు చెపుతారు ?  నిజంగా భర్త భార్యని ప్రేమిస్తే బిడ్డలు గుర్తుంటే ఇలా వ్యసనాల పాలవుతారా ? కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారా?

నాకు తెలిసిన ప్రేమ ఏమిటంటే  జీవిత భాగస్వామిని చచ్చేదాకా ప్రేమించడమే ! అంతకన్నా ఇంకేదైనా ప్రేమ బలమైనది ఏమైనా కల్గితే, ఒకవేళ  ఉంటే ఇతరులని ఎక్కువ కాలం మోసగించకుండా క్లారిటీతో హుందాగా, గౌరవంగా ప్రక్కకి తొలగడమే ! మొదట్లో జీర్ణం చేసుకోవడం కష్టమే కానీ దీర్ఘకాలం మోసపోయి భంగపడటం కన్నా ఇదే మంచిది కదా ! ఓల్గా గారి  మానవి నవలలో  ఇలాగే జరుగుతుంది. పాపం వసంత అని అనిపిస్తుంది. ఆ  నవల  నువ్వు చదివావా?  ఆ నవల చదవబట్టే నేను ఇలా ఉన్నాను శశీ ! ఒక నిజం చెప్పనా ?  నెల్లూరు అంటే నాకు కూడా ఇష్టమే,  పదిహేడేళ్ళు నిండి నిండగానే పెన్నా తీరానికి కొత్తకాపురానికి వచ్చాను. అక్కడ పంటపొలాలు, పచ్చని ప్రకృతి, మంచి మనసులు అన్నీ ఓ మంచి  జ్ఞాపకమే! కాకపొతే ఓచేదు జ్ఞాపకం నా జీవితకాలం  వెంటాడేది కూడా ఉంది. నా జీవితాన్ని కాజేసిన దొంగది ఆ నెల్లూరంటే నాకెందుకో విరక్తి.ఇంకెప్పుడూ నెల్లూరు రాకూదదనుకున్నాను. రాను కూడా !

నాకు పురుషులంటే ద్వేషం ఏమీ లేదు. కానీ మన చుట్టూ ఎంతోమంది పురుష అహంకార పదఘట్టనల క్రింద నలిగి పోతున్నారు. మన తరం స్త్రీలు ఓర్చుకున్నారు. కానీ ఇప్పటి తరం ఓర్చుకునేటట్టు లేరు. అందుకే మగవాళ్ళు తరతరాలనుండి అంటిపెట్టుకున్న భావజాలాన్ని వదిలించుకోవాలి. నేను కథలు వ్రాస్తున్నది కూడా అందుకే ! నేను వ్రాసే కథలన్నీ నిజజీవిత శకలాలపైనుండి  లేచి నిలబడి ఆత్మస్యైర్యంతో ముందుకు సాగాలనే సందేశం ఉండేటట్టు, స్త్రీలు తమ తప్పులు తానూ తెలుసుకునే విధంగానూ ఉండేటట్టు వ్రాస్తున్నాను.

ఈ మధ్య  నేను చదివిన కథలలో నాకు బాగా నచ్చిన కథలు సత్యవతి గారి కథలు. నువ్వు కూడా  తప్పకుండా చదువు శశీ ! దాదాపు ఒక అరవై డెబ్బై ఏళ్ళ నాటి నుండి స్త్రీల జీవితాల్లో వచ్చిన మార్పులని చక్కగా చూపించారు. ఆ పుస్తకంలో ఉన్న కథలన్నీ స్త్రీల అస్తిత్వ పోరాటంలో  విజయం సాధించి తమ కన్నా ముందు తరం స్త్రీలకి మంచి భవిష్యత్ ఇవ్వడానికి ప్రయత్నించి విజయం సాధించిన కథలే ! చాలా సునిశితమైన పరిశీలనతో పురుషులని తిట్టకుండానే వ్యంగంగా వ్రాసిన కథలవి.

మన ముందు తరాలవారికి మనమేం అందించగలమో లేదో .. ఇప్పటి పిల్లలకి ఏం చేపుదామన్నా ..నీకేమీ తెలియదు నువ్వూరుకో అంటారు తేలికగా. మనసు చిన్నబోతుంది అంది ఒక స్నేహితురాలు. తనకి ఇద్దరూ అమ్మాయిలే !  తల్లి అనుభవం, ముందు చూపు పిల్లలకి చాదస్తం అనిపిస్తుంటే ఏం చేయగలం ? ఇది తరానికి తరానికి ఉన్న అంతరమేమో ... అలా అర్ధం చేసుకుని మనసుని ఊరటపరుచుకో అని చెప్పాను. రాలే ఆకుల్లాంటి మనం పిల్లలకి పదే పదే హితబోధ చేసి వాళ్లకి మనపై చులకన భావాన్ని మరీ పెంచి పెద్దది చేయలేము కదా !  నా ఫ్రెండ్ భర్త మరీ భాద్యత లేనివాడు. కుటుంబాన్ని ఏ మాత్రం పట్టించుకోనివాడు. అందుకే ఆమె పిల్లలకి  తల్లి మాటలన్నా విసుగు. బాధ్యత లేని మనుషులని, భాధించే పెద్దలని పిల్లలు ఎలా భరించగలరు, ప్రేమించగలరు   అంటే...  ప్రేమించగలరు.  జన్మ నిచ్చినందుకు తల్లిదండ్రులకి రుణ పడి  ఉంటామంట.  అందుకే వాళ్ళని మనం ప్రేమించి ఆదరించాలి. అనుభవాల ముడుతలు మనుషులకే కాదు ఆకులకి అనుభవమే ! ఆ ముడుతలలో దాగిన అనాదరణ గాయాల గేయాలు,ఈ ముడుతలలో  చీడపీడల దాడులు. ముడుతలని ప్రేమిద్దాం . రాలే ముందు అదే అసలైన మందు అని అనాలనుకుంటాను.

తర్వాత  మనం గురువుకి , సమాజానికి రుణ పడి  ఉంటామంట.  నువ్వు గురువుగా చాలా మంచి గురువు అని నాకు తెలుసు.  తరగతి పాఠాలు కాకుండా  ఎన్నో మంచి మంచి పాఠాలు నవ్వుతూ, నవ్విస్తూ విసుగు కల్గించకుండా చెపుతావ్. నీ క్లాస్ లో  చదువుకున్న పిల్లలందరికీ నువ్వు మంచి టీచర్ వి గా గుర్తుండిపోతావ్. ఆ మాట నిస్సందేహంగా నేనూ చెప్పగలను .   మీ లాంటి టీచర్స్  కి మాత్రమే కాదు నాలాంటి సాధారణ గృహిణికి కూడా సామాజిక భాద్యత ఉంటుంది. ఎవరికీ వారు సమాజానికి మనమేం చేస్తున్నాం అనే ప్రశ్న వేసుకోవాలి .  ఆ భాద్యతతో మెలగాలనే నేను నా శాయశక్తులా కృషి చేస్తాను. ఏం చేస్తాను అంటే ... అదొక పెద్ద వ్రాత అవుతుంది శశీ ! spondylitis వల్ల  ఎక్కువ వ్రాయలేకపోతున్నాను . నేను బ్లాగ్ తక్కువగా వ్రాయడానికి కూడా కారణం అదే ! అయినా వ్రాస్తూనే ఉన్నాను . ఏదో శక్తి నన్నావహించి వ్రాయిస్తూ ఉంటుంది.

ఏ మూర్తి శక్తి చైతన్య ముక్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి...  ఆ శక్తికి ప్రణమిల్లుతూ ...

ఇక ముగిస్తున్నాను . తప్పకుండా లెటర్ వ్రాస్తావు కదూ .. ఎదురుచూస్తూ ఉంటాను .  పిల్లలకి నా ఆశ్శీస్సులు. మీ సార్  గార్కి నా నమస్కారములు తెలియజేయి.

నీ విద్యార్ధులకి ... ప్రపంచం ఇలా ఉండాలని ... బోధించడానికి కంకణం కట్టుకోవాలని నిన్ను కోరుకుంటున్నాను .

ఇక ఉండనా మరి.   ప్రేమతో ... అక్క  వనజ.   

19, ఏప్రిల్ 2016, మంగళవారం

కదిలెన్ హృదయం


ఈ చిత్రం చూసి కదిలిపోయాను ...  ఆ కదలిక లో ఈ రాత. 



తొమ్మిది నెలలూ  గర్భంలో  ప్రేమగా దాఛుకున్న నువ్వు 

రెండు అరచేతుల మధ్యా నేఅమిరి ఉండననుకున్నావా అమ్మా !

అనాధగా వదిలేసి ఎలా వెళ్ళిపోయావసలు ?


స్తన్యమిచ్చి కడుపు నింప లేకా ఆకలి రోదనని మాన్పలేకా 

జోలపాడి నిదురపుచ్చలేకా వదిలేసి వెళ్ళి పోయావా అమ్మా ! 


నీ ఒడి ఊయల కుదుపులు తెలియవు 

నీ వేలినల్లుకుని నిశ్చింతగా నిద్ర పోనేలేదు 

నీ భుజ సింహాసనాన యువరాణిలా సేదతీరా లేదు. 

గుంపులో ఒకరిగా గుండె గూటికి ఎడం గా ఎడారి మొక్కలా 

ఎదుగుతున్న పాపని నేను. 


అమ్మంటే ..దయ,కరుణ అని మా టీచర్ చెపుతుంది.. 

మరి నన్నొదిలిపోయే కాఠిన్యం నీకెలా అబ్బిందమ్మా ! 


పోనీ నువ్వీలోకం బాధలనుండి విముక్తి పొందావా? 

నువ్వు విశ్రమిస్తున్నస్థలమెక్కడుందో  అదైనా చెప్పమ్మా ! 

ఆ సమాధిపై బోర్లా పడుకుని నీ జోల పాట వింటూ .. 

మైమరచిపోతాను. 


A Iraqi girl in an orphanage -This little girl has never seen her mother, so she drew a mom on the ground and fell asleep inside her. 


Pic courtesy : Google.


14, ఏప్రిల్ 2016, గురువారం

ఆత్మీయ భాషణం

రమణీ ..ఎలా ఉన్నారు ?

నేను మీకీ ఉత్తరం వ్రాయడం ఎలాటిదంటే సముద్రం దగ్గరకి బుడ్డి చెంబు తీసుకెళ్ళి దానిని నింపి నీకు చూపిస్తూ ఇదే  సముద్రం అని చెప్పినట్టు అన్నమాట.  :)

ఈ మధ్య బ్లాగ్ లలోకి వచ్చినప్పుడు నాకు తెలిసిన పాత వాళ్ళనందరినీ ఆత్రంగా వెతుక్కుంటాను. కొంతమందిని చదివి వస్తాను. మనసుకు బాగా నచ్చిన విషయమైనా సరే వ్యాఖ్యనివ్వడానికి ఒకింత బద్ధకం అని తప్పించుకోజూస్తాను కానీ ఆ బద్ధకం వెనుక అంతులేని నిరుత్సాహం. ఏమైనా వ్రాయాలని మనఃస్పూర్తిగా అనిపించినప్పుడు వ్రాసుకోవడం, లేదా ఏ కథో ,కవితో ఇక్కడ భద్రపరుచుకుని బ్లాగులలో కూడా కొంతమందికి పరిచయం చేసినట్లు ఉంటుందని రావడం తప్ప పెద్ద ఆసక్తి లేదు. ఒకప్పుడు ఎలా ఉండేవి బ్లాగులు? ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ,సద్విమర్శలు చేసుకుంటూ సరదాగా ఉంటూనే సీరియస్ విషయాలు ముచ్చటించుకునే వాళ్ళు కదా !   ఇప్పుడంతా సాధారణంగానూ లేక కావాలని కువిమర్శ చేసుకుంటునట్లూనూ,కాలక్షేపం కోసం పోట్లాడుకుంటూన్నట్లుగానూ ఉంటున్నాయ "ట". నేనైతే అసలు వివాదాల జోలికి  పోను కాబట్టి  విహంగవీక్షణం చేసేసి వచ్చేస్తున్నాను.

ఎందుకు బ్లాగ్ మిత్రులందరూ ఫేస్ బుక్ కి అతుక్కుపోతున్నారా అని ఆశ్చర్యం కల్గుతుంది. ఒకే విషయం కాకుండా అనేకానేక విషయాలని రోజుకి ఒక పది పోస్ట్ లని స్నేహితులకి పంచే  వారిని చూస్తూ ఉంటాను. నాకున్న స్నేహితుల జాబితాలో అధికంగా పోస్ట్ లు వేస్తున్నవారిలో మీరూ ఉంటున్నారు రమణీ ! అయితే మీ మాటల్లో ఎక్కువగా చిరాకూ, ఆశాభంగం, బాధ వ్యక్తపరుస్తూ ఉంటారు. మన బాధలు, మన  కోపతాపాలు, చిరాకులూ, నిసృహలూ అన్నీ వ్యక్తిగతం కాదు. అందులో కొన్ని మన చుట్టూ ఉన్న మనలాంటి  మనుషుల నుండి, సమాజం నుండి వస్తున్నవి. కాలక్షేపపు కబుర్లకి, దూలానందం పొందేవారికి, ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి మనసులోమాట కక్కేదానికి అక్కడ వెసులుబాటు ఉంది కాబట్టి తాత్కాలిక వినోదపు వేదిక అయిందని మనందరం గుర్తించాం కానీ అందులోనుండి బయటకి రాలేకపోతున్నాం . ఘనసమయాలు వ్యర్ధంగా గడచిపోతున్నాయి. మనుషులు మనసు విప్పి మాట్లాడుకోవడం తగ్గిపోయింది . మనసు విప్పి  మాటాడటానికి ఓ మనిషి  దొరకక విలవిలలాడిపోతున్నాం.

ముఖ్యంగా ఈ సోషియల్ మీడియా తక్షణ అభిప్రాయాలు పంచుకునే వీలుంటుందని అనుకుంటున్నామో అంతే త్వరగా మనుషులని విడదీస్తుంది .  నా చుట్టుపక్కల నాకెవరితోనూ శత్రుత్వం లేదు . కానీ ఈ ఆన్ లైన్ స్నేహాలలో చాలామందితో నాకు శత్రుత్వం ఏర్పడింది. ఇక్కడ మనుషులు కులం, మతం ప్రాతిపదికపై రాజకీయ పార్టీలని మోసే క్రమంలో, సినీ కథానాయకులని, నాయకురాళ్ళని మోసే క్రమంలో విడిపోతున్నారు. అదెంత విషాదమో !  మనుషుల మధ్య మొలుస్తున్న బలమైన కుడ్యాల పట్ల నిరసన తెలుపుతూనే అదే కుడ్యాల మధ్య మనని మనం బందీలుగా మార్చుకుంటున్నాము, మారిపోతున్నాం . అది చాలా విచారకరంగా ఉంది.   ద్వంద్వ వైఖరి,  ద్వంద్వ ప్రమాణాలు నేనస్సలు పాటించలేను, మనసులో ఉన్నట్టే ప్రవర్తిస్తాను . మనని నిత్యం తిడుతున్నా భరించి, ముఖం మీద నవ్వు పులుముకుని నటించి బ్రతకలేను . నేను నాలాగా ఉండదల్చుకున్నాను. బయటున్న శత్రువు కన్నా మనతోనే మిత్రుడిగా ఉండి మనకి శత్రువై వ్యవహరించేవాడి పట్ల ఉదారంగా ఉండకపోవడం మంచిది . చాలా మందిని un friend ని చేసినందుకు నాలో ఆత్మనూన్యత ఏ మాత్రం లేదు. రమణీ !  స్నేహం పేరిట మానసిక ప్రశాంతత కోల్పోలేము కదా ! నువ్వు కూడా నీకు బాధకల్గిస్తున్న వారినుండి దూరంగా జరిగిపో. అదే మంచిది కూడా !

ఒకొకరికి వారికి ఉన్న ఆలోచనాధోరణి, వారి వారి అనుభవాల మూలంగా  కొన్ని స్థిరాభిప్రాయాలు ఏర్పడిపోతాయి. వాదనలవల్ల వారి వారి అభిప్రాయాన్ని మనమెన్నటికీ మార్చలేం. అందుచేత మనం వారికి దూరంగా ఉండటమే మంచిదని అనిపిస్తూ ఉంటుంది.  బ్లాగ్ లలోనే కాదు  ఫేస్ బుక్ స్నేహితులలో కూడా ఇలాగే ఉన్నారు. భిన్నాభిప్రాయాలు కల్గిన వ్యక్తుల మధ్య స్నేహం నిలిచి ఉండాలంటే వారి వారి మధ్య చాలా అవగాహన ఉండాలి కదా ! మనం చెప్పిన అభిప్రాయాన్ని వారు వ్యతిరేకించారని  వారిని దూరంగా పెట్టాల్సిన అవసరం లేదని అదివరకంతా వాదించే నేను నా అభిప్రాయాన్ని మార్చుకుని కొందరిని దూరంగా పెట్టేస్తే,  కొందరు నన్ను దూరంగా పెట్టారు . నిజంగా ఈ పరిస్థితి  చాలా బాధాకరమైనది కూడా !  అప్పుడే ఇలా వ్రాసుకున్నాను. "నీలోకి నువ్వు తొంగి చూసుకో, నీకు నువ్వు అర్ధమైతే... లోకం అర్ధమవుతుంది. నువ్వూ ఓ నమూనా బొమ్మవేకదా!"  అని. ఇలాంటి ఆనవాళ్ళు ఎవరికైనా దొరుకుతాయేమో కదా !

అంతకు క్రితంలా నేను బుల్లి తెర ముందు, అంతర్జాలం నందు సమయాన్ని వెచ్చించడం లేదు. ఎక్కువగా పుస్తకాలు చదువుతున్నాను. పుస్తకాలు చదవడమంటే ఒక సంగతి గుర్తుకువచ్చింది. ఈ మధ్య నేనొక కథ చదివాను. ఆ కథా రచయిత శైలి చాలా బావుంటుంది. కానీ ఆ కథలో  భాగమైన నలుగురి ఆడవాళ్ళ పట్ల ముఖ్యంగా స్త్రీల పట్ల (ఆమెకి ఒక కొడుకు కూడా ఉంటె బాగుండేది అని ఆడపిల్ల పట్ల చులకన భావాన్ని వ్యక్తపరిచి ) ఆ రచయితకి గౌరవభావమే గోచరించలేదు. ఒకే ఒక పాత్రపై కొద్దిగా జాలి సానుభూతితో పాటు  తాను  దర్శించిన (రచయిత సృష్టించిన పాత్ర ) ఒక సౌందర్య కోణాన్ని గొప్పగా చెప్పాననుకున్నాడు. చాలా బాధేసింది. రచయిత దృక్పధం ఏమిటో మనకి స్పష్టంగా అర్ధమవుతుంటే ... వాళ్ళని  మంచి రచయిత అని ఎలా ఒప్పుకోగలం? ఇలాగేనా కథలు వ్రాసేది? రచయితకి కొంచెమైనా బాధ్యత ఉండొద్దూ  అని చాలామంది అనుకున్నాం కూడా !

ఇలాగే ఒక సినిమా నిర్మాత దర్శకుడు కూడా  "ఆ ఇద్దరంటే నాకు గౌరవంతో కూడిన భయం . జీవితంలో ఆ ఇద్దరాడవాళ్ళకే  గౌరవాన్ని ఇస్తా ! వారికే భయపడతా. వారు నా  తల్లి , నా భార్య . అంటున్నారు. అవును మరి ప్రపంచంలో మిగతా ఆడవాళ్ళందరూ అతని సినిమాల్లో ఆరబోసి చూపించే బాపతనే ఉద్దేశ్యాన్ని అంత నిసిగ్గుగా చెపుతున్నారో చూడండి . ఇంకో దర్శక నిర్మాత హీరోయిన్లను బట్టలు లేకుండా చూపించేందుకు ఎక్కువ ఖర్చుపెడతానని చెపుతుంటే ... వీళ్ళ సినిమాలని తిరస్కరించాలనే జ్ఞానం మన ఆడవాళ్ళకి లేకపోవడం ఎంత విచారకరం.  ముందు స్త్రీలని గౌరవించడం నేర్చుకోండి బాబూ .తర్వాతనే  మీ కథలు,  సినిమాలు అని చెప్పాలి కూడా.  ఇలా చెప్పకపోబట్టే ఏం జరుగుతుందో తెలుసా ?

ఈ  విషయం నీకు చెప్పే తీరాలి.  తలుచుకుంటేనే అప్రయత్నంగానే పెదవులపై నవ్వులు పూస్తున్నాయి. నేనసలు ఎప్పుడో కానీ ప్రొఫైల్ పిక్ పెట్టనని నీకు తెలుసు కదా !  ఈ మధ్యనే ఒకటి రెండు రోజులు పెట్టాను.  నా ఇన్ బాక్స్ లో అపరిచిత వ్యక్తీ నుండి మొదటి పలకరింపు యు ఆర్ సో నైస్ మేడమ్ అని.   నేను గమనించలేదు.   తర్వాత కొన్ని గంటలకి మరి కొన్ని సందేశాలు. హాయ్ మేడమ్, హాట్ సెక్స్ విత్ మీ  అని . అన్ని మెసేజ్ లు ఒకేసారి చూసాను . అది  చూసి రగిలిపోయాను. సరిగా మీసం మొలవని మగపిల్లాడు (మన దృష్టిలో ) వాడి  తల్లి వయసున్న నాతో నెరిపే సంభాషణ ఇది. నేను షాక్ తిన్నాను. నిజంగా ఇలా మెసేజ్ రావడం కూడా ఇదే మొదటిసారి.  వెంటనే వాడికి ఒక చెప్పు బొమ్మ పంపాను. వెళ్లి మీ అమ్మని ఇలా అని అడగరా  అని చెప్పాను.  ఇలాంటి అశ్లీల విషయాన్ని అపరిచిత స్త్రీ మెసేజ్ బాక్స్ లోకి పెట్టినందుకు సైబర్ కేస్ అవుతుంది జాగ్రత్త అని కూడా  హెచ్చరించాను. వాడిని బ్లాక్ చేసాను.  భద్రంగా ఇంట్లో కూర్చున్నా కూడా జొచ్చుకుని వచ్చే అలుసుతనమంతా దృశ్య మాధ్యమం పుణ్యం కాదు. సాంకేతిక పరిజ్ఞ్ఞానం పిచ్చివాడి చేతిలో రాయిలా మారిపోతుంది.  దిగులేస్తుంది. ఇలాంటి వాళ్ళే కదా ఆడవాళ్ళు ఒంటరిగా కనబడితే తెగబడేది అని అనిపించింది .

నేను ఈ విషయాన్ని ఇలా బ్లాగ్ ముఖంగా చెప్పానా !? కొంతమందయినా ఇలా అనుకుంటారని నాకు తెలుసు. ఈ వనజ గారికి ఎంత దైర్యం ? వాడెవడో అలా మాట్లాడితే మాత్రం ఈమె ఇలా బహిరంగంగా  చెప్పాలా అంటారు.  ఎస్, చెప్పాలి. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల ప్రవర్తన ఎలా ఉందో గమనించుకుంటారు. పిల్లల్లో ఉన్నమానసికరోగాలు,వాళ్ళ ప్రవర్తనా లోపాలు గమనిస్తే  కదా మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చుకుని ఇంటా, బయటా ఎలా మెలగాలో సంస్కారంగా ఉండటం, ఆలోచించడం నేర్పిస్తారు. లేదా  సంస్కారంగా ఉండాలని అవగాహన కల్పిస్తారు కదా !

అన్నట్టు ఒక బ్లాగ్ మిత్రుడు ఇలా అన్నారు. ఇదిగో ఆ మిత్రుడి సూచన "బ్లాగులు ఎంత కాదన్న ఔట్ డేటెడ్ . ఇప్పుడు కావాలిసింది ఒక కలెక్టవ్ పబ్లిషింగ్ ప్లాట్ ఫామ్. Medium.com లాంటిది"  అని చెప్పారు. అక్కడికి వెళ్లి చూసాను . అక్కడంతా ఆంగ్లమాధ్యమం. నాలాంటి ఇంగ్లీష్ రాని  వారికి అదంతా అయోమయమే.  :)

మనిషి మనసుని సుతిమెత్తగా మీటగలిగే అనేకానేక పదబంధాలు కల మన మాతృభాషలో మనం వ్రాసుకున్నత హాయిగా వేరొక బాషలో వ్రాయలేమేమో కదా ! గండికోట వారిజ "సీత కో ఉత్తరం "అంటూ ఎంత లాలిత్యంగా, హృద్యంగా వ్రాసిందో కదా !  నువ్వు  ఆ ఉత్తరాన్ని చదివావా ?   అన్నట్టు మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ లో  ఏ విషయమైనా బాగా వ్రాయగలరు అనిపించే ఇద్దరు మిత్రురాళ్ళని  నేను కని పెట్టేసాను. వారిద్దరూ కూడా బ్లాగ్ వ్రాస్తే బావుంటుందని అనుకుంటున్నాను . వారు సరళ మోహన్ (Sarala Mohan) అంజనీ యలమంచిలి. వారిద్దరూ కూడా బ్లాగ్ లోకంలోకి రావాలి. నిన్న ఇద్దరు మిత్రురాళ్ళు బ్లాగ్ రూపొందించి ఇవ్వమని అడిగారు . సంతోషంగా చేసి ఇచ్చాను.

ఇంకో విషయం మరిచాను .. మధురవాణి వెబ్ పత్రికలో పొత్తూరి విజయలక్ష్మి గారి "కొత్తకోణం " కథ చదివాను . గొప్ప సెటైర్ అనిపించింది .  పురాణ  ఇతిహాసాల లోని పాత్రలని తీసుకుని ఆ పాత్రలకి కొత్తకోణం ఆపాదించి మనకి నచ్చినట్లు వ్రాసుకోవడం అని  కథని హాస్యోక్తిగా, వ్యంగంగా చెప్పారు.  నాకు వెంటనే ముగ్గురు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీతలు గ్రహింపుకి  వచ్చారు. ఓల్గా గారి "విముక్త" కి కాకుండా "రాజకీయ కథలు" కి అవార్డ్ వస్తే బావుండేదని నేను అనుకున్నాను. రాజకీయ కథలు స్త్రీలు తమ  అస్తిత్వాన్ని  తాము తెలుసుకునే క్రమంలో వచ్చిన కథలు. మీరు ఇంతకు  ముందు చదవకుంటే వెంటనే చదవడానికి ప్రయత్నం చేయండి.
 ఇక ఉండనా మరి. మరిన్ని విషయాలతో మళ్ళీ ఇంకో సారి మాటాడుకుందాం. వీలువెంబడి మీరూ  ఓ లేఖ వ్రాస్తారు  కదూ ! పలకరింపే ఓ పులకరింత.. అని  మీకు తెలుసు కదా !
ప్రేమతో ...  వనజ .


7, ఏప్రిల్ 2016, గురువారం

అంతేగా ...























వేలి కొసల్లోకి ప్రవహించిన హృదయ  స్పర్శని   
సంభాషణలలో  తొణికసలాడే ఆత్మీయతని  
వెన్నెల పంచుకున్నట్టు నవ్వులని 
నీళ్ళు అడిగి  పుచ్చుకున్నట్లు  కన్నీళ్ళని 
పంచుకునే మనసున్నంత  కాలమూ  
అంతర్వాహినిగా ఎన్నో మైళ్ళు ప్రయాణిస్తూనే ఉంటాం 

నేను  నా అనే  స్వార్ధమో  అనుమానపు బీజమో  
మొలకెత్తిన మరునిమిషం ... 
బాహ్యంగా అడుగు కూడా ప్రవహించలేని సరస్సయి పోతాం 
ఎప్పుడెన్ని  గజాలు విస్తరించాలో లెక్కలేసుకుంటాం 
బిరడాలో మనని మనమెలా  బంధించుకోవాలో నేర్చుకుంటాం 
క్షణానికో మారు నియంత్రించుకుంటాం  
ఓ అత్యవసరాన్ని సృష్టించుకుని చిన్నగా పక్కకి తప్పుకుంటాం . 
మానవ ప్రయాణాలన్నీ అంతేగా ! 

-వనజ తాతినేని 06/04/2016- 08:20 PM.

6, ఏప్రిల్ 2016, బుధవారం

రాలుటాకు స్వగతం





రాలుటాకు స్వగతం

ప్రవాహానికి నిరోధకమని  గుర్రపు డెక్కని తొలగించే నువ్వు  
ఊదా రంగు పూలందాలన్నీ నిరాశ్రయమయ్యాయని బాధతో   నేను
కార్తీకేయఖడ్గం లా కస కసలాడుతూ నీవు 
దర్భ పోచలా ఊగిసలాడుతూ నేను  

ఏనుగు పాద ముద్రలో అన్ని ప్రాణుల ముద్రలు ఇమిడిపోయినట్లు 
సమస్త జీవ కోటి ప్రాణాధారం మేఘంలో దాక్కున్నట్లు
నీ ముద్రలో లీనమవ్వాలనే ఆశలు నాలో 
ఎన్ని నువ్వులు నాలో ఒంపగా 
నేను నువ్వైనానో స్మృతికందనిది.  

రెప్పల తలుపులు మూసి కలల  కోసం గడి తీస్తే 
అవ్యక్తం అనుభవమూ కాని  గతం ముల్లై గుచ్చింది   
దృశ్యం వర్ణాలలో శ్రవణం హోరులలో చిక్కబడింది 
వ్రాయబడని వాక్యమేదో తెంపబడి మాలగా మార్చబడక 
వాడిన పూలవోలే  చిన్నబోయింది 
పరమ రహస్యమైన సంవేదన కన్నీటి బుగ్గయ్యింది.  

జీవితాన్ని ఆవరించిన అంధకారం 
కబోది చుట్టూరా ఉన్న వెలుగులా ఉంది 
పాదాల క్రింద  పచ్చిక నలిగి 
మళ్ళీ గర్వంగా తలెత్తుతుంది
అంతటి  వినయాన్ని  మనమెందుకో 
నేర్చుకోలేకపోయామన్న బాధ తోడయ్యింది.   

కలతల తుఫాన్ జీవన వృక్షాన్ని కూకటివేళ్ళతో పెకిలించి వేసింది 
బావిలో  చందురుడు బోర్లాపడిన  వెండి కుండలా  ఉన్నాడు   
గేలం వేసి లాగాలనుకుంటే  నీలాగే వెన్నెల నీళ్లై కారిపోయాడు
తూరుపు వాకిలి ఎవరో దీపాన్ని బలవంతంగా దాచినట్లు ఉంది 
ఎవరి ఆసక్తుల మేరకో నువ్వాగిపోయినట్లు 

జీవితపు ప్రతి దశ పాట లాంటిదే నడక నేర్చే పాపాయి లాంటిదే  
 రాలే పండుటాకులకి పాటల్లేవ్ మూగరోదన తప్ప
అయినా పాటలా ఆ  స్పర్శలు వెంటాడతానే ఉంటాయి
స్వగతాలై వెన్నుతడుతూంటాయి రాలేదాకా.  

**********************************************************


4, ఏప్రిల్ 2016, సోమవారం

లఘుచిత్రం

లఘుచిత్రం



సీట్ బెల్ట్ పెట్టుకోబోతూండగా ...   కాల్ వచ్చిన  శబ్దం. ఎవరో అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాను. అభి నుండి కాల్. ఎంతో  అవసరమైతే తప్ప కాల్ చేయడని తెలిసిన నేను .. ఆన్సర్ చేసాను.

"రాజా బాబూ ! షార్ట్ ఫిల్మ్  షూటింగ్,ఎడిటింగ్ అన్నీ పూర్తై పోయాయి. యు ట్యూబ్ లో అప్లోడ్ చేసాను. మీరు చూసి ఎలా వుందో చెప్పాలి " అన్నాడు.

ఆఫీస్ కి వెళుతున్నాను అభీ.   చూసి సాయంత్రానికల్లా  చెపుతాను. అయినా నువ్వు చాలా బాగా తీసి వుంటావ్ ! " అన్నాను.

"ఎందుకో..  కొంచెం జంకుగా వుందండీ ..ఎలా రిసీవ్ చేసుకుంటారోనని. నేనాశించిన ప్రయోజనం కొంచెమైనా దక్కితే చాలు. పడిన కష్టమంతా మర్చిపోతాను "

"నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావ్ ! దైర్యంగా వుండు"

కాల్ కట్ అయినాక "అభి " షార్ట్ ఫిల్మ్ గురించి ఆలోచిస్తూ .... అతనికిప్పటికి  రియల్ స్టోరీల కోసం వెతుక్కునే అవసరం తీరినట్లుంది. ఇంతకీ అతని తీసిన చిత్రంలో దేవసేన కథ వుంటుందా ? ఉండే వుంటుంది,  అందులో నాకెలాంటి సందేహం లేదు. ఆమె పాత్ర లేకుండా అభి చిత్రం తీయడమే !? నెవ్వర్ ! అభి చెప్పిన ఆమె కథ విన్న నేనే ఆమెని మర్చిపోలేకపోతే అభి యెట్లా మర్చిపోతాడు ? ఆమె యిప్పుడెలా ఉందో ... . వాళ్ళ  గుడిసెలు వున్నాయో  లేదో .. ? కాలువ కట్టల సుందరీకరణలో  భాగంగా వాళ్లకి ఆ గూడు కూడా లేకుండా చేస్తారేమో ! పైగా యిప్పుడు రాజధాని ప్రాంతం కూడా ! అనుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూనే  వొక యేడాది క్రిందటి జ్ఞాపకంలోకి వెళ్ళిపోయాను.

నేను  చదువు పూర్తి  చేసుకుని యింటికొచ్చిన రోజులవి. ఉద్యోగాల వేటలో  సఫలమవలేక విసుగొస్తున్న రోజులు కూడా.  ఉబుసుపోక నాన్నతో పాటు పొలానికి వెళ్ళేవాడిని. మా పొలం ప్రక్కనే బ్రిటిష్ వాళ్ళ కాలంలో తవ్వబడిన కాలువ. సంవత్సరంలో సగం రోజులపాటు నిండుగా   ప్రవహిస్తూనే వుండేది. అందువల్లేనేమో రైతు పేదేమో కాని పొలానికి పేదేమి వుంటుందీ  అన్నట్టుగా  మా చుట్టూ పక్కల పొలాలన్నీ పచ్చని పంటలతో కళకళలాడుతూ వుండేవి. ఆ కాలువ ప్రక్కనే మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉండేది  "అభి" వాళ్ళ యిల్లు. వాళ్ళ నాన్న గమలాళ్ళ కోటేశు. చెట్లెక్కి కల్లు గీయడం,అమ్మడం చేస్తుండేవాడు. అతనిదీ నాన్న వయసే,ఒకే వూరివారవడం వల్ల నాన్న, కోటేశు యెక్కువగానే మాట్లాడుకుంటూ వుండేవాళ్ళు.

 చిన్నప్పుటి నుండి యెరిగి వున్నప్పటికీ కూడా   అభిని  చూసినప్పుడు  పలకరించడానికి కొన్ని సెకనుల పాటయినా జంకుతాను కానీ ముఖం తిప్పుకుని వెళ్ళిపోయే శతృత్వమేమీ లేదు. రూపం చూస్తే రఫ్ గా వున్నట్టు కనబడతాడు. విశాలమైన కళ్ళు.   ఆ కళ్ళల్లో  ఎర్రటి జీరలు, కోటేరు  ముక్కు, నిర్లక్ష్యంగా పెంచి వదిలేసిన జుట్టు. ఎప్పుడూ చుట్టూ పరిశీలిస్తున్నట్లు గిర గిర తిరుగుతుండే కళ్ళు . నాకున్న కొద్ది పాటి పరిచయంలో అతనిపై మంచి అభిప్రాయం కలగడానికి  కారణం అతనొక మంచి ఆర్టిస్ట్ అవడమే ! రోడ్డు ప్రక్కనే వున్న చిన్న రేకుల షెడ్ లో వొక భాగంలో అతని స్టూడియో. కళాకారుడిగా యెన్నో సూక్ష్మ చిత్రాలను రూపొందించడంతో పాటు  కొన్ని సామాజిక రుగ్మతలకి బాణం గురిపెట్టి సందేశాన్నిచ్చే చిత్రాలు గీస్తూ వుంటాడు.  అన్ని పత్రికలూ,అన్ని చానల్స్ అతనిని పరిచయం చేసేసాయి.

అభిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా వుండేది. పదవతరగతి దాటని చదువు. అయినా యెదురుగా వుండే ఇంజినీరింగ్ కాలేజీలో చదివే ప్రతి విద్యార్ధి అతనికి స్నేహితులే!  వయో పరిమితి లేకుండా  చిన్నవాళ్ళూ  పెద్దవాళ్ళూ అందరూ అతని స్నేహవర్షంలో తడిసిన వాళ్ళే!  "అభి" అంటే తెలియని వారు వుండరేమో ! అతను మాత్రం  కుటుంబం పట్ల కొంత నిర్లక్ష్యంగా వుంటాడని అర్ధమవుతూ వుండేది.   తండ్రి తెచ్చే ఆదాయంతోపాటు  తనూ పని చేస్తూ  గుట్టుగా కాపురం నెట్టుకొస్తూ వుంటుంది తల్లి. పేదరికంలో మగ్గుతూ  కూడా గౌరవంగా బ్రతికే కుటుంబం. అభికి పెళ్ళైంది కానీ భార్యెప్పుడూ పుట్టింట్లోనే వుంటుంది. కాస్త సన్నగా   సాధారణంగా వుంటుందామ్మాయి  . అతని పెళ్లి అతనిష్టంతో జరగకపోవడం వల్ల భార్య పట్ల అంత ప్రేమగా వుండడని అతనింటి  దరిదాపుల్లో ఉండే ఓ కుర్రాడు చెపితే విన్నాను.

ఒకరోజు నేనూ, నాన్న పొలంలో ఉండగానే అభీ వాళ్ళ నాన్న రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడని తెలిసింది.అతని కోసం బంధువులందరూ యెక్కడెక్కడో వెతుకుతున్నారని విని ...  ఆ రోజు ఉదయాన్నేఅతను కాలువ  కట్టమీదున్న యిళ్ళ  వైపు వెళుతుండగా చూసిన సంగతి చెప్పాను.  అతనిని వెతుక్కొచ్చి జరపవలసిన  కార్యక్రమాలు చేస్తూనే కోటేశు లాంటి మంచి వాడికి యిలాంటి పోరంబోకు కొడుకు యెట్టా పుట్టాడో నని  బంధువులు అనుకోవడమూ విన్నాను.   రెండు రోజుల తర్వాత తండ్రి పోయిన దుఃఖంలో వున్న అతనిని పలకరించి ఓదార్పు మాటలు చెప్పి రావాలని నాన్నతో పాటు   అతనింటికి వెళ్లాను.  

 అభి అమ్మ తన  భర్త గురించి చెపుతూ   ఆయనకీ  మగ పిల్లోడిపై నమ్మకం యెక్కువ . “ఏదో ఒకటి చేస్తున్నాడుగా  చేయనీ,  గీతలు గీస్తే యే౦టీ , రాతలు రాస్తే యే౦టీ ? మంచి పేరు తెచ్చి ఫలానా వాడి కొడుకంటూ నాకొక గర్వం సంపాయించి పెడుతున్నాడుగా” అనేవాడు. ఇప్పుడు ఆయనపోయి నడివీధిలో నిలబడ్డాం. ఏం చెయ్యాలయ్యా ? అంటూ ఏడుస్తుంది.

 తల్లి మాటలతో కన్నీరు మున్నీరుగా యేడుస్తున్నాడతను.  రాజా బాబూ !   నేనేపని చేసినా గర్వంగా   ఱొమ్మిరిచుకుని పదే పదే భుజం తట్టే నాన్నలేడు. ఒరేయ్ అభీ ! ఈ కల్లు గీత, రోతా  నీకెందుకుగాననీ  హాయిగా నీ పని నువ్వు చేసుకోరా , ఇంట్లో మంచి చెడు నేను చూస్తానుగా  అని భరోసా యిచ్చే వాడు. అలా  నడిరోడ్డుపై నెత్తుటి ముద్దై మిగిలిన సాక్ష్యం నా మెదదులో చిత్రమై నిలిచి పోయింది. కుంచె పట్టుకుంటే  ఆ దృశ్యమే మెదులుతుంది. దశదిన కర్మ నాటికి ఎంతో మందికి చిత్రం గీసిచ్చిన నేను  మా నాన్న బొమ్మని గీయలేకపోతున్నాను అంటూ ధారాపాతంగా  యేడుపు. ఇంటికొచ్చాక కూడా ఆ యేడుపు తరుముతూనే వుంది, గుండె బరువెక్కింది.

నాన్నంటే అంతేనేమో ! ఉన్నన్నాళ్ళు బరువంతా నెత్తికెత్తుకుంటారు. ఏదో ఒకరోజు చెప్పా పెట్టకుండా పోయీ  మోయలేని బరువులని మీదేసి పోతారేమో ! మా నాన్నకి  కూడా అలా ఏదన్నాజరిగితే ?. ఊహే భయంకరంగా అనిపించింది. ఉద్యోగం సంగతి ప్రక్కనపెట్టి  కుటుంబ అప్పులూ, ఆదాయాలూ, బాధ్యతలూ తెలుసుకుంటూ  కాలక్షేపంగా కాకుండా సీరియస్ గా మా నాన్నకి చేదోడు వాదోడుగా వుండాలని నిర్ణయించుకున్నాన్నేను.  

చేలోకి వెళ్ళేటప్పుడల్లా అభి వాళ్ళింటి  వైపుగానే వెళుతూండటం వల్ల  కాసేపు ఆగి అతనితో మాట్లాడటం అలవాటైపోయింది. మా మధ్య స్నేహం కూడా పెరిగింది.  ఒక రోజు వాళ్ళమ్మ కష్టం సుఖం చెప్పుకుంటూ  "ఇంటి భాద్యత మర్చి పోయి పనిపాట యేమీ లేకుండా  తిరుగుతున్నాడు ! ఇప్పుడీ సంసారం గతేం కాను, ఆ తిరుగుళ్ళూ ,ఆ బొమ్మలు గీయడాలు మానేసి ఇల్లు గడిచే మార్గం ఆలోచించరా అని చెపుతున్నా వినడంలేదు. కాస్త నువ్వైనా చెప్పు బాబు" అంది .

"ఏదన్నా ఉద్యోగం చేయకూడదూ!  నీ టాలెంట్ కి ఏ అడ్వర్టైజింగ్ కంపెనీ వాళ్లైనా పనిస్తారు కదా " అన్నాను.

 "నాన్న అర్ధం చేసుకున్నట్టు అమ్మ అర్ధం చేసుకోవడం లేదు రాజా బాబూ ! అస్తమాను సాని కొంపలెమ్మట తిరుగుతున్నావ్ అంటుంది"  అన్నాడు  కొంత  నిష్టూరంగా.

"ఆమె అన్నమాటల్లో తప్పేముంది ? మీ నాన్న చనిపోయినరోజున కూడా నువ్వు అటువైపు వెళుతుంటేనే చూసాన్నేను.  నువ్వు అన్నం తినడానికి కూడా రాలేదని నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి రోడ్డుపైకి వస్తేనే మీ నాన్నకి అలా యాక్సిడెంట్ జరిగిందని మీ అమ్మ బాధ కూడా "

"అందరికి  నేను అటువైపు వెళ్ళడమే తెలుసు, కానీ నేను యేమి  చేస్తున్నానో యెవరికీ తెలియదు.తెలిస్తే అంత తేలికగా అంచనావేయరు "

"తాటి చెట్టు క్రింద నిలబడి ఆవుపాలు త్రాగుతున్నా అంటే యెవరూ నమ్మరు అభీ ! అటువైపు వెళ్ళడం మానుకో !"  హితవు  పలికాననుకున్నానప్పుడు. మౌనం వహించాడు.

తల్లి పోరుతో  తండ్రి పోయిన దుఃఖంలో నుండి బయటపడి చిన్న ఉద్యోగం సంపాదించాడు. కాస్త దారిలో పడ్డాడనుకున్నాక  తల్లి మళ్ళీ సాపించడం మొదలుపెట్టింది.

ఒకరోజు అక్కడ  నేనుండగానే "నీకు పెళ్ళయ్యింది, పెళ్ళాం యేళ్ళ తరబడి పుట్టింట్లోనే  పడి వుందని గుర్తుకు రాకపోతే యెట్టాగురా ! అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఆ పిల్లంటే యిష్టం లేదని. ఆ సంగతేంటో తేల్చి చెప్పేస్తే  దానికి మారు మనువు చేసుకుంటారు ". అభికి  తల్లి  మాటలుచురుక్కుమనిపించాయి.

"మంచి రోజు చూసి నువ్వే  కోడలిని యింటికి తీసుకురావచ్చుగా " అంటూ విసుక్కున్నాడు. .

"నేనెళ్ళి  పిల్లని పంపమంటే పంపుతారు కానీ నువ్వెళ్ళి అత్తగారింట్లో రెండు రోజులుండి ఆ పిల్లని తీసుకోచ్చుకుంటే బాగుంటుంది రా ! వాళ్ళకున్న అనుమానాలు తీరి పోతాయి." అంది ఆమె.

ఇద్దరం కలిసి  చేలో నడుస్తూ  మాట్లాడుకుంటున్నాం. "అమ్మలు ఎంత మంచి వాళ్ళు ! నాన్నవున్నప్పుడు అమ్మ మాట పట్టించుకునేవాడినే కాదు. అమ్మలది  యెంత ముందు చూపో!. ఒకపనిచేస్తే నాలుగిందాల మెప్పు రావలనుకుంటారు. " అన్నాడు సంతోషంగా నవ్వుకుంటూ.

"మీ ఆవిడని తీసుకొచ్చాక  అటువైపు వెళ్ళడం మానేయ్"  అన్నా

" మానేయడం కాదు, వెళ్ళడానికి  యెలాగైనా ఆమెని వొప్పించుకోవాలి"

"నీకేమన్నా పిచ్చా! అసలు మతి వుండే మాట్లాడుతున్నావా ? ".

"మీరిలా అంటారని నాకు తెలుసు.  నేనెందుకు అటువైపు వెళతానో కథంతా చెప్పేయాలి మీకు "అంటూ ... పసుపు తోట మధ్యలో కూర్చోపెట్టాడు.

వినక తప్పదన్నట్లు కూర్చున్నాను.

"మంచి సబ్జెక్ట్ దొరికితే డాక్యుమెంటరీ చిత్రాలు తీయాలని  యెన్నాళ్ళగానో ఒక కోరిక. సబ్జెక్ట్ కోసం యెక్కడికైనా వెళ్ళిపోతాను.అప్పుడింట్లో కూడా చెప్పను. కొన్నాళ్ళు  వొక సినిమా డైరెక్టర్ కి  అసిస్టెంట్ గా వున్నాను.
ఒకసారి  అవుట్ సైడ్ బ్రాడ్కాస్టింగ్ కోసం భవానీపురంలోవున్న  రిహేబిటేషన్ సెంటర్ కి వెళ్లాను. అక్కడ ముంబాయికి అక్రమ ట్రాఫికింగ్ చేయబడ్డ పిల్లలూ ,యువతులూ, వ్యభిచారం కేసుల్లలో పట్టుబడి వెనక్కి తిరిగొచ్చినవారు చాలామంది  వున్నారు. కొంతమంది యింటికి వెళ్ళడానికి యిష్టపడకపోతే అక్కడే  వుంచి యేదో వొక కోచింగ్ యిప్పించే దశలో  వసతి కల్పిస్తారట. మూడంతస్తుల భవనం అది. లోపల చాలా ఖాళీ స్థలం.  చుట్టూ  ఎత్తైన గోడలు.ఇనుప కంచె వేసి వున్నాయి.  గట్టి బందోబస్తు. అందులోకి  వెళ్ళినవాళ్ళు మంచి మనుషులుగా మారి బయటకి రావడానికి  యెన్నో అవకాశాలు. కౌన్సిలింగ్ తరగతులు, విద్యా కోర్సులు అన్ని సదుపాయాలూ  వుండేవి. కానీ అక్కడి నుండి తప్పించుకుని పారిపోదామని చూసేవాళ్ళూ , వాళ్ళ కోసం వచ్చే పాత యజమానులు, కొత్త విటులూ, ఎందఱో వుండేవారక్కడ.

పోగ్రాం   రికార్డింగ్ చేయడం మొదలెట్టాను.  వారు చెప్పుతున్న కథలు వింటుంటే  ముందు భయం, తర్వాత గగుర్పాటు. అందరి కళ్ళ నుండి  ధారా పాతంగా  కన్నీరు. మగవాడు యేడవకూదదన్నది కూడా మర్చిపోయాం.   తర్వాత గడ్డ కట్టిన మౌనం. జీవం లేని వాళ్ళ కళ్ళూ , చిన్న  చిరునవ్వు కూడా పూయని వాళ్ళ ముఖాలు,  నిర్లక్ష్యం ,కాఠిన్యం నిండిన మాటలూ, ఒకరి ముఖాలు వొకరు చూసుకుని వెకిలిగా నవ్వుకోవడాలూ.  రెండు గంటలు రికార్డింగ్  సమయంలో  రెండొందలమంది పతితుల దీనావస్థ  గుండెల్ని పిండేసింది. అన్నం కూడా తినాలనిపించలేదు. అసలెందుకు వాళ్ళు బ్రతికి వున్నారనిపించింది. రెండో రోజు వాళ్ళ కథలు వినడానికి దైర్యం చాల్లేదు. నేనక్కడికి వెళ్ళలేక యింకొకరిని పంపించాను.  దాదాపుగా అందరివి అవే కథలు.  అదే స్వార్ధం, అదే వ్యాపారం, అదే రోగాలు, దిక్కుమాలిన చావులు. నెల రోజులవరకు మనిషిని కాలేకపోయాను.శారీరక సంబంధమంటేనే అసహ్యమేసింది. ఒక రకమైన వైరాగ్యం వచ్చేసింది . మన భద్రవలయంలో నుండి కాలు బయటకి పెట్టి  ఆ లోకంలోకి చూస్తే తెలుస్తుంది. లోకం యెంత  హీనమయ్యిందో ! వాళ్ళని అర్ధం చేసుకునే కాస్తంత హృదయం, చెమ్మగిల్లిన కన్నూ, అప్పుడప్పుడు వాళ్ళ ఆకలిని కనిపెట్టి అన్నం పొట్లం అందించే  చేయి.. ఓ చిన్న పలకరింపూ. మనం వీటికి పెద్దగా యే౦  ఖర్చు పెట్టవసరం లేదుగా రాజా బాబూ !.

"నువ్వొక్కడివే యెంతని చేయగలవ్ ! వాళ్ళ ఖర్మ అనుకుని వదిలేయాలి. అనవసరంగా నీ పై చెడ్డ ముద్ర పడుతుంది గా "

 "ఆ గుడిసెలలో వుండే వాళ్ళంతా మనవూరి వారు కానే కాదు. ఎక్కేడె క్కడనుండి వచ్చారో తెలియదు కానీ .. సాయంత్రానికి  రోడ్డుపైకి చేరిపోతారు.విటులు దొరికితే పండగే ! వయసుమళ్ళిన కొంతమంది పనిలేక  అడుక్కుంటారు. అలాంటి వాళ్ళకే కాస్త అన్నం పెడదామని ప్రయత్నం.  నేను వాళ్లకి గొప్పగా చేసే సాయమేమీ లేదు,  నా చేతిలోకి  కాసిని డబ్బులు రాగానే ... హోటల్ కి వెళ్ళి  ఆ డబ్బులకి సరి పడా రోటీ, కూర  ప్యాక్ చేయించుకుని సైకిలెక్కి  వాళ్లిళ్ళకి  వెళ్ళి యిచ్చేసి వస్తుంటాను. మనం చేసే మంచి పని లోకం దృష్టిలో చెడ్డగా కనబడితే దానికి మనమేం చేయలేం, లోకాన్ని చూసి జాలి పడటం తప్ప. వ్యక్తిగతంగా నేను చేసేదే కాకుండా  నా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద వాళ్ళు అనాధశారణాలయానికి యిచ్చే విరాళాలని కూడా వాళ్లకిచ్చేస్తాను. అనాధ  పిల్లలంటే యెవరో ఒకరు జాలి చూపుతారు కానీ..  వాళ్లకి సాయం చేయడానికి యెవరూ రారు, అదే విషాదం "

"ఈ.. మనిషే దిగజార్చిన పతితలు.. ఎవరో తెలుసా.. వీరెవరో తెలుసా..మన రక్తం పంచుకున్న ఆడపడచులు.. మనం జారవిడుచుకున్న జాతి పరువులు.. మానవుడు దానవుడులో పాట  గుర్తుకొస్తుంది అభీ "

తెర  మీద కనబడే జీవితాలకన్నా విషాదకరమైన జీవితాలు వాళ్ళవి.   రోజుకొకరి దగ్గరకెళ్ళి  కూర్చుంటాను, వాళ్ళ కథలడిగి తెలుసుకుంటూ వుంటాను. కొందరు ధనవంతుల  కుటుంబాలలో పుట్టినవారూ, ప్రేమ పేరిట మోసపోయినవారూ  వుంటారు. వారి కథని చెపుతూ  పొగిలి పొగిలి యేడుస్తూ వుంటారు" విచారంగా చెప్పాడు.

"ఇంకా యెన్ని కథలు సేకరించాలి? షూటింగ్ యెప్పుడు మొదెలెడతావ్ ? " ఆసక్తిగా అడిగాను.

"మీరొక విషయం వింటే ఆశ్చర్యపోతారు. వాళ్ళు మానాభిమానాలు లేనివాళ్ళని, ఉచ్చనీచాలు మరిచిన వాళ్ళని తేలిగ్గా చూస్తాం కానీ...  వారిలోనూ ఆత్మాభిమానం వున్నవాళ్ళు చాలా మంది వున్నారు. అలా వున్నామె తన  కథ చెప్పింది.  మీకు వినే ఆసక్తి  వుంటే  ఆ కథ  చెపుతాను,  ఆ కథనే  లఘుచిత్రంగా తీయాలని నిర్ణయించుకున్నాను కూడా "

చెప్పు ..చెప్పు  అంటూ అర్జంట్ పని మానుకుని   ఆ కథ కూడా వినడానికి రెడీ అయిపోయాను .

ఒకసారి దేవసేన అనే ఆమె వద్దకి వెళ్లాను. వయసు ముప్పై ఆయిదు నలబై యేళ్ళ మధ్య ఉంటుందేమో, అందంగానే ఉంటుంది. మందు కూడా తాగుతుంది.  అసలే  వాగుడెక్కువ. మందేసుకుంటే యింకా యెక్కువ వాగుడు.  భరించలేం. సమాజపు వికృత రూపాన్ని వికృతమైన భాషలో తిట్టిపోస్తుంది.  ఆమె యింటికి వెళతానంటున్నావ్ జాగ్రత్త ! అదసలు ఆడదే కాదు అని హెచ్చరించాడు నా ఫ్రెండ్. ఏమైనాసరే వెళ్లి తీరాలనే అనుకున్నాను. వెళ్ళేటప్పుడు ... బిర్యానీ,ఐస్ క్రీమ్ తీసుకువెళ్ళాను. తృప్తిగా తినడం చూసాను. తర్వాత నా కోరికని తీర్చుకోమని ఆహ్వానం పలికింది. నేనేమి బదులు పలకలేదు. నన్ను రెచ్చగొడుతూ ఎన్నో ప్రయత్నాలు చేసింది . అయినా నేను చలించలేదని మగాడివి కాదా అని కూడా అవమానించింది. నేను సమాధానం చెప్పకుండా ఆమె యింటి నుండి బయటకి వచ్చేసాను.

తర్వాతెప్పుడో ఆమె తల్లి చనిపోయి మరీ కష్టాలలో వుందని తెలిసీ ఒక బస్తా బియ్యం వేసుకుని  వెళ్లాను.నేను తీసుకెళ్ళిన బియ్యపు బస్తాని గుమ్మం లో నుండే వెనక్కి కొట్టింది . కూటికి మాడి  చావాల్సి వస్తే  కృష్ణలో దూకైనా   చస్తాను కానీ పని జరక్కుండా డబ్బు, వస్తువులు వుచితంగా తీసుకోనని బయటకి నెట్టేసింది. ఆమె ఇంటిముందే బట్టలుతుక్కునే  రాయి మీద  మొండిగా కూర్చున్నాను. కటిక చీకటి, రక్తం తాగేస్తున్న దోమలు, కీచురాళ్ళ శబ్దాలు, వీధి కుక్కల అరుపులు. పన్నెండైనా అక్కడి నుండి కదలలేదు.జాలేసిందో యేమో ! "నాకేమవుతావని ఇట్టా కూర్చున్నావ్,  నీ జాలి నాకు నచ్చలేదు" అంటూ  దేవసేన వచ్చి  చేయిపట్టుకుని యింట్లోకి తీసుకెళ్ళింది. ఆకలవుతుంది అన్నం పెట్టమని అడిగాను. వొండలేదని చెప్పింది. వొండి పెట్టు అని  నేను తెచ్చిన బియ్యం చూపించాను. ఆ బియ్యం సంచీ  అంటుకోకుండానే పొయ్యి వెలిగించి  అన్నం వండి యేదో  పచ్చడేసి పెట్టింది. తనని తినమన్నాను. వద్దని తల అడ్డంగా వూపింది.

నేను తింటూ వుండగా తన కథ చెప్పింది. ఎరుకుల కులం. బుట్టలూ, తట్టలూ  అల్లుకుని బతికేవాళ్ళం. ఉప్పరతట్టలు కొనడానికి వచ్చిన ఆసామి  తోటకి  నమ్మకమైన కాపలా మనిషి కావాలని అడిగితే సంసారమంతాచంకన  పెట్టుకుని చక్కా వచ్చాడు మా నాయన.  మా నాయనని వెదురు కర్రలు నరుక్కురమ్మని అడవికి పంపించి మా అమ్మతో కులికేవాడు. మా నాయనకది  తెలిసేది  కాదు. ధర్మాత్ముడు లాంటి ఆసామి దొరికాడు కష్టం సుఖం చూస్తున్నాడు అని  కుశాల పడేవాడు. ఇప్పుడు తెల్ల బట్టలేసుకుని ఒంటినిండా బంగారం పెట్టుకుని రాజకీయ నాయకుడిగా  తిరుగుతున్నాడు చూడు  ఆయన తండ్రే  ఆ ఆసామి.  పదమూడేళ్ళ పిల్లప్పుడు ఆ ఆసామి కొడుకు, వాడి స్నేహితుడి కామ దాహానికి బలై పోయిన ఆడపిల్లని  నేను.  ఒకసారి అడవి కెళ్ళిన మా నాయన తిరిగి రాలేదు. విషప్పురుగు కుట్టి చచ్చిపోయాడు.  మా అమ్మ నయంకాని రోగమొచ్చి మంచమెక్కింది . నాకే  పని చేతకాదు. అంత చిన్న  వయసులో వున్న నాతో  పని చేయించుకునేవారు కానీ  యెవరూ సరిగా డబ్బులిచ్చే వాళ్ళు కాదు.   ఏ  పని చేసినా మా ఇద్దరికీ  రెండు పూటలా  కడుపు నిండేది కాదు. కడుపు నిండకపోయినా లోకం కంటి నిండా నిద్రపోనీయలేదు. చెయ్యేసి కాలేసి రొచ్చులోకి లాగేస్తుంది. తర్వాత చీత్కరిస్తుంది. అట్టా  ఈ వృత్తిలోకి వచ్చాను. నేనీ  పని చేస్తున్నానని తెలిసినప్పుడు మా అమ్మ ఏడ్చింది. ఆ పని చేయకపోతే  దేంట్లోనన్నా  దూకి చావరాదు. ఒకేడుపు యేడిసి వూరుకుంటాను అని గోల పెట్టేది. తర్వాత నీకు ముద్దవెరు యేస్తారే అమ్మా అనేదాన్ని !  ఎవరో ధర్మాత్ములు యింత ముద్ద పడేస్తారు అనేది నమ్మకంగా. ధర్మాత్ములు యెవరూ వుండరమ్మా,  వుండేదంతా పాపాత్ములే....  అనేదాన్ని.

ఇక్కడికొచ్చిన  వాళ్ళు  ఆకలి తీర్చుకుని రూపాయలని విసిరి కొట్టి వెళ్ళేవారే  కానీ  మా ఆకలి సంగతి ఆలోచించే వాళ్ళెవరు?  మా చావులు యెట్లా రాసి పెట్టి వుంటాయో యేమిటో తెలియదు. పిల్లా పీచు వున్నా వాళ్లకీ  మా గతే  పట్టుద్ది అని వద్దనుకున్నాను,  ఇవ్వాళ  తెల్ల కార్డ్ ఇప్పించమని ఆ తెల్ల బట్టలాయన యింటికెళితే ఆయన పెళ్ళాం  నన్ను చూసి అసహ్యిన్చుకుంది. వరండాలోకి యెందుకొచ్చావ్ ?  వెళ్ళు..  వెళ్ళూ  అంటూ  బయటకి గెంటేసింది. నువ్వు తీర్చలేని నీ మొగుడి వికృత కోర్కెలు తీర్చిన సానిదాన్ని తల్లీ ! అని దణ్ణం పెట్టి వచ్చేసాను. ఈ పని మానేసి  పొలం పనికి , పచ్చళ్ళ కంపెనీలో పనికి  వెళ్ళాను. ఒళ్ళు విరదీసుకునే చాకిరితో పాటు ఈ పనీ  తప్పేది కాదు. ఎవడో ఒకడు చెయ్యేసేవాడు. ఇష్టం లేదంటే నీకిష్టం యేమిటే ... ముండా  అని పచ్చి బూతులు కూసేవాళ్ళు. శరీరం మీద హక్కే  కాదు మనసుకి కూడా మురిపెం ఉండాలి.   ఎంత కడుపాకలి కోసం ఈ పని చేస్తుంటే మాత్రం  మనసు చంపుకుని యెవడితో పడితే వాడితో పొర్లాలంటే యెట్టా కుదురుద్ది. ఎక్కడ చూసినా   చెత్త నా కొడుకేలే ! ఎక్కడికెళ్ళినా యిదే పని చేసేటప్పుడు వొళ్ళు యిరగదీసుకునే కష్టమెందుకు చేయాలని   పనిలో  కెళ్ళడం మానేసా.   ఈ వాడకట్టులో అందరిదీ వొక్కో కథ. ఒకొకరు సంపాదించి యిళ్ళకి పంపుతారు. ఇంకొకళ్ళకి రోజూ గడవదు, హై క్లాస్స్ అపార్మేంట్ల మధ్య ఈ గుడిసెలేంటీ అని వొకో నాకొడుకు రచ్చ చేస్తాడు.  చీకటి పడగానే వాడే మా గుడిసెలు వెతుక్కుంటూ వస్తాడు. ఓట్ల కోసం మమ్మల్ని  ఇట్టాగైనా  వుండనీయడం లేకపోతే  యెప్పుడో  యిక్కడినుండి  లేపేసేవాళ్ళే !   అంటూ భారంగా నిట్టూర్చింది. తినడం కూడా ఆపేసి ఆమె వైపే జాలిగా చూస్తున్నాను.

కాసిని నీళ్ళు త్రాగి  మళ్ళీ చెప్పడం మొదలెట్టింది.  పొట్టకూటికోసం ఈ పని చేస్తున్నాం. ఈ మధ్య మొగుడు చాటు పెళ్ళాలు కూడా మాతో పోటీపడిపోతున్నారు. రోజుకొక చీర కట్టుకు తిరగాలని, బంగారు  నగలు కొనుక్కోవాలని దిగజారిపోతున్నారు.  మా కళ్ళ ముందు నుండే జంటలు జంటలు తోటల్లోకి తిరుగుతూ ఉంటారు.రెడ్ లైట్ ఏరియా లంటారు అక్కడకన్నా యెక్కువ వ్యాపారాలు యిళ్ళ మధ్య యెన్ని  జరగడం లేదు? అంటూ   కడిగిపారేసింది.

సినిమాల వాళ్ళు వేషాల కోసం చేసేది వ్యభిచారం కాదు ?. ధనవంతుల యిళ్ళల్లో సరదాల పేరిట జరిగేవి అది కాదు.   శీలం విలువ ఆకలి వొక్కటే కాదు, ప్రమోషన్, పదవి, చీరలు,నగలు, కారు ఏదైనా కావచ్చంటూ మేడి పండు సంఘం పొట్ట విప్పి పురుగుల్లాంటి  పచ్చి నిజాలని మాట్లాడింది. దిమ్మెరపోయాను. నేనప్పటిదాకా అన్నమే తిన్నానా  ఆమె వొండిన అన్నంలో  మెతుకు మెతుకులొ దాగిన వ్యధని తిన్నానా అనిపించింది.

ఇంకొందరి కథలు చెప్పు అని అడిగాను.  వచ్చిన పని చూసుకుని వెళ్ళాలి కానీ ఈ కథలన్నీ నీకెందుకు ? ఇక చెప్పను అని  మొండికేసింది. బతిమలాడినా వేరొకరి కథ చెప్పలేదు. నేనేమన్నా కథలు చెప్పే పేదరాసి పెద్దమ్మలా కనబడుతున్నానా ! ఎవరి కథ వాళ్ళకే తెలుసు, వాళ్ళే చెప్పుకోవాలి మధ్యలో నాకెందుకు అంది కానీ నోరిప్పలేదు. అప్పుడు నాకు వొకటనిపించింది నీతులు చెప్పే మారాజులందరినీ వాడల వాడల వెంట  త్రిప్పి  వీళ్ళని చూపించాలి. ఛీ,  యాక్ అంటూ. వాంతి  వచ్చినట్టు మొహం పెట్టె అమ్మలక్కలకి  వీళ్ళ కథలు వినిపించాలి. వాళ్ళని చులకనగా చూసే మన  చూపులు మారాలి . సమాజం విసిరి పారేసిన అభాగ్యులు వాళ్ళు .   వికృత ఆలోచనల  సమాజం తయారుచేసిన ఆకలి కేకలు వీళ్ళు. వాళ్ళలో పూట గడవని అతి పేదవాళ్ళు  వాళ్ళని పీక్కు తినే పోలీస్ వాళ్ళు కూడా వుంటారు. రోగాలు రోష్టులతో, మల మూత్రాల మధ్య, మురుగు కాలవలు ప్రక్కన, ఈగలు ముసిరి, దోమకాటులకి బలి పోతూ , కాట్ల కుక్కల మధ్య జీవచ్చవాలై బ్రతుకుతున్న వాళ్ళ దగ్గరికి  కోరికలతో కాదు మానవత్వం చూపడానికి వెళ్ళాలి " అన్నాడు ఆవేశంగా.  

 ఆ క్షణంలో   అభిని చూస్తుంటే అతని పట్ల, కొందరి జీవితాలపట్ల  నాకున్న దురభిప్రాయాలన్నీ పటాపంచలై పోయాయి. ఆ గుడిసెలలో నివసిస్తున్న అభాగినిల  పట్ల మనసులో జాలి,సానుభూతి కల్గాయి.   అభి  వేశ్యలని వుద్దరించడానికి వెళుతున్న తధాగతుడిలా అనిపించాడు. పతితలందరినీ వుద్దరించే శక్తి అతనికి  లేకపోవచ్చు గానీ వాళ్ళ గురించి సమాజానికి చెప్పే అవకాశం అతనికుంది  కదా ! గమళాళ్ళ కోటేశుకి కొడుకు మీద యెంత నమ్మకం.!?  నా కొడుకు చెడ్డ పనులు చేయడయ్యా ! ఏదో వుద్దేశ్యం ఉంటేనే ఆడు అటువైపు వెళతాడు అన్న మాటలు గుర్తుకొచ్చాయి.

“తర్వాత యేమైంది? దేవసేన నువ్విచ్చిన బియ్యం బస్తా తీసుకుందా?” అడిగాను

 ఆ సంగతి చెప్పనేలేదు కదూ ! అక్కడికే వస్తున్నా  వినండీ  సంగతి...   అంటూ కొనసాగించాడు . అన్నం తినమని దేవసేనని  బ్రతిమలాడాను. "పనయ్యాకే తిండి సంగతి. ఎవరికి రుణపడి పోవడం నాకిష్టంలేదు " అంది.
అయితే  ఒకసారి కాళ్ళు చాపుకో దేవసేనమ్మా !  అన్నాను.  చాపిన ఆ  కాళ్ళ పై   తల పెట్టుకుని పడుకున్నా. నేనలా  పడుకోవడంలో నాకే వికారం లేదు. మా అమ్మ కాళ్ళపై పడుకున్నట్టే వుంది.  అప్రయత్నంగా ఆమె చేయి  తల్లి చేయిలా మారింది. నా తలని నిమిరింది. కాసేపు అలా పడుకుని ... లేచి వచ్చేస్తూ ... "ఇదిగో ఇలా ఈ అమ్మ లాంటి వాత్సల్యం చాలు.  నీదగ్గర తీసుకున్నదానికి  నేనిచ్చిన  ఖరీదు ఈ బియ్యం బస్తా " అని చెప్పి  బయటకి వచ్చేసాను.

మంచం మీద నుండి  క్రిందికి వురికి పొయ్యిలో వున్న కట్టెపుల్లని తీసుకుని నా వెంట పడింది ..." ఈసారి నా యింటికి వచ్చావంటే కాళ్ళు విరగ్గొడతా... "  అంటూ.   నేను ఆమెకి దొరికితే కదా!  అన్నాడు నవ్వుతూ అభి.

నాకూ  వొకటే నవ్వు పొరలు పొరలుగా, తెరలు తెరలుగా.  నవ్వులాట నవ్వు కాదది. అంటువ్యాధి  నవ్వూ  కాదది. కళ్ళు తడుస్తూ పుట్టుకొచ్చిన నవ్వది.

ఆనాటి  జ్ఞాపకం యింకా సజీవంగా వుందేమో ... మళ్ళీ నవ్వొచింది అప్పటిలాగే  కన్నీళ్ళతో సహా !

(వాకిలి వెబ్ పత్రిక 2016 ఏప్రియల్ సంచికలో ఈ కథ ప్రచురితం )

 కథకి తగ్గట్టుగా ఇంత చక్కని చిత్రం అందించిన కిరణ్ కుమారి గార్కి ధన్యవాదాలు.