ప్లీజ్ ఓపెన్ ది డోర్ ! ఎవరిదో ఎలక్రానిక్ అభ్యర్ధన. మూలనున్న మూడో పడకగదిలో హాయిగా పడుకుని రంగనాయకమ్మని చదువుకుంటున్న నేను లేవక తప్పింది కాదు. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందగ్గర్నుండి కాలింగ్ బెల్, టెలిఫోన్ రింగ్ రెండూ తెగ విసిగిస్తున్నాయి. రక రకాల సమూహాలలో కలవలేక ఇబ్బంది పడే నాకు ఈ పిలుపులు కూడా ప్రాణ హింసే మరి . తాళం చెవులు చేతిలోకి తీసుకుని బాల్కనీలోకి వచ్చాను . గేటు వెలుపల ఇద్దరు స్త్రీలు. అందులో ఒకరు దుర్గారాణి గారు.తాళం తీసి .. రండి బావున్నారా ! అంటూ ఆహ్వానించాను. వారికన్నా ముందు నడుస్తూ లోపలకి వచ్చాను .
నా వెనుకనే వచ్చినామె గుమ్మానికి బొట్టు పెడతాను అంది . నేను తెల్లబోయాను . గుమ్మానికి ఎందుకు బొట్టు పెడతారో నాకు తెలుసు కాబట్టి గుమ్మానికి ఎందుకూ, నాకు పెట్టేయండి అన్నాను. మీ ఆయనగారు ఉన్నారా ? లేరేమో అనుకుని అక్క గుమ్మానికి బొట్టు పెడతానంది ఏమనుకోకండి అంది ఆమె చెల్లెలు. భలే వారే ... నొచ్చుకోవాల్సింది ఏమీ లేదు . నన్ను చూస్తే అలాగే ఉన్నాను లెండి అన్నాను బోసి మెడ, ఖాళీగా, స్వేచ్ఛగా ఉన్న ఖాళీ చేతులని చూసుకుంటూ. లోపలికి వెళ్లి మెడలో తాళి బొట్టు ఉన్న గొలుసు వేసుకొచ్చుకున్నాక ఆమె గోపురం మార్క్ కుంకుమని నేను పెట్టుకున్న సింగార్ తిలకం పై బొట్టు పెట్టి వాళ్ళ అబ్బాయి పెళ్ళికి ఆహ్వానించింది. తప్పకుండా రండి అని మరీ మరీ చెప్పి వెళ్ళింది. అమ్మయ్య ..ఒక అవమానం ఇలా రాసి పెట్టి ఉంది కాబోల్సు అనుకుని కాసేపు ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను.
ఎవరైనా పిలుపులకి వచ్చినప్పుడు నేను ఇంట్లో లేకపోతే కార్డు పాలబుట్టలో పెట్టి చెక్క గుమ్మం అందుబాటులో లేదు కాబట్టి ఇనుప గుమ్మానికే బొట్టు పెట్టి వెళ్ళిపోతారు. గేటు తాళం తీసి లోపలికి రాబోతూ క్రిందపడిన కుంకుమ చూసి ఏవో పిలుపులు వచ్చాయని అర్ధం చేసుకుంటాను కానీ కోపం ముంచుకొస్తుంది.నా ముఖం గడప ఎప్పుడైపోయిందబ్బా వీళ్ళకి చెక్క గుమ్మం లాగా, ఇనుప బద్దె లాగా కనబడిందా! ఏమిటీ అవమానం? అనుకుంటాను.
మొన్నీమధ్య రాధిక గారి అమ్మాయి పెళ్ళికి కార్డ్ ఇస్తూ ఉంటే పక్కన వచ్చిన ఆ అమ్మాయి ఫ్రెండ్ వెండి కుంకుమ భరిణె తీసి బొట్టు పెట్టాలా వద్దా అనుకునేమో ఇద్దరూ వెనుక ముందు చూసుకుంటున్నారు. ఆఖరికి బొట్టు పెట్టకుండానే మరీ మరీ రమ్మని ఆహ్వానించి వెళ్ళింది వాళ్ళ పెద్ద అమ్మాయి. నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆహ్వానితులకి స్వాగతం పలికే ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఓణీలు వేసుకున్న తెలుగింటి ఆమ్మాయిలు ఒకరు పన్నీరు చల్లి, ఒకరు గంధం రాసి,పసుపుఇస్తే తీసుకుని మంగళసూత్రంకి పెట్టుకుంటున్నప్పుడు ఆ రోజు బొట్టు పెట్టాలా వద్దా అని తటపటాయించిన అమ్మాయిఆశ్చర్యంగా చూసింది ... . నేను నవ్వగానే ..సారీ ఆంటీ ... ఆ రోజు తెలియలేదు అని బొట్టు కింద బొట్టు పెట్టి నా అందాన్ని చెడగొట్టకుండా పాపటలో కుంకుమ పెట్టింది. మళ్ళీ నవ్వేసుకుంటూ లోపలి వెళ్లాను .
ఈ మధ్య నా స్నేహితురాలు కోడలిని తీసుకుని నా ఇంటికి వచ్చింది . వారిద్దరుతో పాటు తన మరిది కూతురు ఉంది. పెళ్ళికి నేను వెళ్ళడం కుదరనందువల్ల వాళ్ళిద్దరులో స్నేహితురాలి కోడలు ఎవరో తెలుసుకోవడం కోసం పాదాల వొంక చూసాను. మెట్లు పెట్టుకోకపోతే ఏం చేసేదానివి అంది. నిజమే కదా అనుకున్నాను. అసలు సమాజంలో అందరూ ఈ బండ గుర్తులకి ఎంత అలవాటై పోయారంటే చెప్పనలవే కాదు .మెడలో తాళి, నల్లపూసలు, చేతులకి మట్టి గాజులు, నుదుట కుంకుమ బొట్టు లేదా పాపట సిందూరం,కాళ్ళ వేళ్ళకి మట్టెలు ఇవన్నీ ఉంటే కానీ ఆమె వివాహిత స్త్రీ, పుణ్య స్త్రీ అని లెక్క. ఇవేమీ లేక నాలా ఖాళీగా కనబడితే విధవరాలు క్రింద లెక్క కట్టేసి ..శుభకార్యాలప్పుడు వెలివేసినట్లు చూడటం వల్ల అలా వెలివేతకి గురైన వాళ్ళు ఎంత ఆవేదన చెందుతారో !
మొగుడు చచ్చినదాని ముఖం చూడకూడదు, విధవరాలు ఎదురు రాకూడదు లాంటి అనేక చేదు అనుభవాలు చాలామందికి విదితమే ! అలాంటివి వ్యతిరేకించినా తమ ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు వాళ్ళని మనమూ వెలివేస్తాము. లోకవిరుద్దంగా ప్రవర్తించి వాళ్లకి నలుగురితో పాటు చందన సత్కారాలు అందిస్తే తమకి కీడు జరుగుతుందని భయం కూడా ! ఇంట్లో ఉన్నప్పుడు కొత్తగా మతం మారినదానిలాగా ఉండే నాకు ఆహ్వానపత్రాలు అందటం, ముఖానికి అంటని అవమాన పత్రాలు రాజ్య పూజ్యాలని సమానం చేస్తాయని నవ్వుకుంటాను. అసలు ఈ రకమైన సంప్రదాయాలు పెట్టిన వాడెవడో .ఖచ్చితంగా పురుషులే అయిఉంటారని నా విశ్వాసం కూడా ... వాడిని అరసెంటీమీటర్ లెక్కన కోసి కుప్పలు పెట్టాలని ఉంటుంది.
వ్రాతలలో కూడా ఆమె కనుబొమ్మల మధ్య విరిసిన సిందూరం రెండు కొండల మధ్య ఉదయిస్తున్న సూర్యుడిలా ఉందనో, బొట్టు లేనప్పుడు చంద్రుడు లేని ఆకాశంలా ఉందని వర్ణనలు. ఎంత అన్యాయం ? అసలు సంప్రదాయం గురించి ఎవరికీ తెలియదు ఒకరు ఒకటి చెపితే ఇంకొకరు ఇంకొకటి చెపుతారు . ఒకరు చెప్పినదాన్ని ఇంకొకరు ఖండించడం తాము చెప్పిన పద్దతిన జరగని వారు మూతులు ముక్కులు విరుచుకోవడం భలే తమాషాగా ఉంటుంది నాకు.
అసలు సోలా సింగార్ అవసరమా అనిపిస్తూ ఉంటుంది నాకు . చదువు,ఉద్యోగం కన్నాముందుగా స్త్రీలకి స్వేచ్చ పేరిట లభించింది అలంకరణ. స్వేచ్ఛ. ఆడవాళ్ళ సౌందర్య పిపాసని ముడి సరుకుగా చేసుకుని పురుషులు వ్యాపారం చేసుకుంటూనే శారీరక సృహ, ఆరోగ్యం కాపాడుకోవడం పేరున ఆమెని మరింత దిగజార్చారు.అదంతా వ్యాపార మాయాజాలం అని తెలియనంతగా కూరుకుపోతున్న స్త్రీ లని చూస్తే జాలి కల్గుతుంది. మొన్నీమధ్య మా పక్కింటి అమ్మాయికి పెళ్ళైతే ..ఇరవైవేలు ఫేషియల్స్ కే సమర్పించారంట , నా పెళ్ళప్పుడు ఆరు రూపాయల గోళ్ళ రంగు కొనడానికి వెనుకాడితే ఇవాళ మా అమ్మాయి వయసు వాళ్ళు ప్రతి రోజు డ్రెస్ కి తగ్గట్టు మేచింగ్ గోళ్ళ రంగు వేసుకోవాల్సిందే, సాయంత్రం తుడ వాల్సిందే ! పుట్టి ఏడాది అయిందో లేదో పెద్దలని అనుకరిస్తూ లిప్ స్టిక్ అడ్డుకుంటున్న పిల్లని చూస్తే విరక్తి కల్గింది.
మా అక్క వాళ్ళమ్మాయి ఉత్తర భారతంలో ఉంటుంది . "అక్కడ మరీ వింత పిన్నీ ! ఇంట్లోనుండి వీధిలోకి కాలు పెట్టాల్సి వస్తే మేకప్ లేకుండా బయటకిరారు. పది పదకొండేళ్ళ పిల్లలు కూడా బాయ్ ఫ్రెండ్, మేకప్ తప్పని సరి అన్నట్టు ఉంటారు" అని చెప్పింది.
అందం ఆత్మవిశ్వాసాన్ని నింపడం అనేది పది శాతం వరకూ నిజమేమో ! విజ్ఞ్ఞానం కల్గి ఉండటం,సమయస్పూర్తిగా వ్యవహరించడం ,జీవితంలో కష్టాలని ఎదుర్కోవడంలో ఉన్న ఆత్మస్థయిర్యం , దైర్యంగా ఉండటం అనేవి నిజమైన అందం అని చెప్పుకోవచ్చు అని ఎవరూ చెప్పరా ఏమిటీ అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను.
ఈ మధ్య మా బంధువులావిడ బస్ లో కనబడింది. కళ కళ లాడుతూ ఉంది. భర్త చనిపోయాడని, ఆ తర్వాత వెంటనే కూతురికి పెళ్లి చేసిందని విన్నాను. ఆమె పక్కన సీట్ ఖాళీ అయితే వెళ్లి కూర్చున్నాను. మీరు విడోయరా అని ఆమె అడిగితే మీరు న్యూలీ మేరీడ్ ? అని ఒకేసారి ఒకరినొకరు ప్రశ్నించుకున్నాం .
ఆమె "నాకు అలంకరణ అంటే చిన్నప్పటినుండి చాలా ఇష్టం అండీ . ఈ బొట్టూ, కాటుక, పూలు,రంగు రంగుల గాజులు లేకుండా అసలు నన్ను నేను ఊహించుకోలేను . ఆయన మరణించినప్పుడు పెద్ద యుద్దమే జరిగింది . మంగళసూత్రం, మట్టెలు తీసి పక్కన పెట్టేసాను . తెల్ల చీర కట్టుకోలేదని, బొట్టు తీసేయలేదనీ , అయినవాళ్ళ కి కీడు జరుగుతుందని ఏదేదో అన్నారు . అయినా నేను అవేమీ పట్టించుకోలేదు. పుట్టినప్పటి నుండి అవన్నీ ఇష్టంగా ధరించి మధ్యలో వచ్చిన భర్త పోయినప్పుడు తీయడమేమిటీ ? ఆయన చనిపోవడం నాకు పెద్ద విషాదమే కానీ నా రూపు రేఖలు అన్నీ మార్చుకుని జీవచ్చవంలా బ్రతికి ఉండటం కూడా కష్టం అనిపించింది. ఆయన పోయిన తర్వాత ఇరవై రోజులకే ఆఫీస్ కి వెళ్లాను . మాములుగానే వెళ్లాను . చదువుకున్న వాళ్ళు కూడా పక్క పక్కకి తప్పుకుని వెళుతుంటే నవ్వు వచ్చింది . అంతగా మన రక్తంలో ఆ దురాచారాలు పేరుకుపోయి ఉన్నాయి . అలాంటి ఆచారాలకి మంగళ గీతం పాడాలి అందుకు ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. ఆ అడుగు నాతోనే పడిందేమో అనుకుంటాను . మీరూ అంటూ ... అర్ధోక్తిలో ఆగింది .
"నాకు అలంకరణల పట్ల అంత ఆసక్తి లేదండీ, నాకిలా ఉండటమే ఇష్టం. మా వారు గుండ్రాయిలా బాగానే ఉన్నారు . బొట్టులేని ముఖం, తాళి లేని మెడ అంటూ తెగ సెంటిమెంటల్ ఫీల్ అయ్యినా నేను పట్టించుకోను.
బట్టలేం ధరించాలి ? అలంకరణ ఎలా చేసుకోవాలి, ఏం తిండి తినాలి లాంటివన్నీ మనిషికి సొంతమైన ఇష్టాలండీ, నువ్వెందుకు అలా ఉన్నావ్, ఇలా ఎందుకు ఉండవు అని కూడా బలవంతం చేయకూడదు.
మన దురదృష్టమేమ్టంటే .. చెత్తంతా ఎక్కడ పడితే అక్కడ ఎందుకు పారేస్తావ్,చెట్లు ఎందుకు కొడుతున్నావ్ , లంచం ఎందుకు అడుగుతున్నావ్ ?, బస్సులు,రైళ్ళు ఎందుకు తగలబెడుతున్నావ్ అని అడగడం చేతకానివాళ్ళు,బాధ్యత లేనివాళ్ళు "ముఖాన బొట్టు ఎందుకు పెట్టుకున్నావ్ " అని అడగడంలో మాత్రం ముందు ఉంటారు అన్నాను.
ఇంత నాగరికత నేర్చినట్లు ఉండే ఇప్పటి జనం ఇలాంటి విషయాలలో ఇంత మూర్ఖంగా ఉంటే .. సంఘసంస్కరణకి నడుం బిగించిన కందుకూరి వీరేశలింగం లాంటి వారు విధవ పునర్వివాహాలు చేసి సమాజం నుండి ఎంత నిరసన ఎదుర్కున్నారో అన్నది తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుందండి అంది ఆమె .
నిజమే కదా ! ఎంతో లోతుగా ఆలోచిస్తూ, కుహనా సంప్రదాయాల పట్ల అంతో ఇంతో వ్యతిరేకత ఉన్న ఆమె, నేను కూడా ఆ తానులో ముక్కలమే అని మేము ఒకరినొకరు ప్రశ్నించుకోవడంలో అర్ధమైపోయింది. కొన్ని వదిలించు కావాలన్నా వదలవు జిడ్డులాగా అంటుకునే ఉంటాయేమో ! స్వగతంలో అనుకున్నాను.
5 కామెంట్‌లు:
:)
టపా రాసేంత విషయమే ఉంది.
ఓపిక నిండుకుంది.
కొన్నిసార్లు సాంప్రదాయానికి, కొన్ని సార్లు అందానికి మరికొన్నిసార్లు సందర్భానుసారం ఇలా ఏది ఏమైనా సముచితమైన అలంకరణ మనిషికి గౌరవాన్ని,ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది కదండీ... అసలే మనుషులం ఎదుటి మనిషి Appearance కే కదా ప్రాధాన్యం ఇచ్చేది :)
sarma మాస్టారూ ! మీకు ఓపిక ఉన్నప్పుడు రాసేంత విషయాన్ని తప్పకుండా వ్రాసి మాకందరికీ తెలియని విషయముంటే తెలియజేయాలని విన్నపం. ధన్యవాదములు.
:) రాజీ గారూ మీరు చెప్పిన విషయం నిజమేనేమో ! కానీ ఈ కథలో విషయం వేరేమో కదా ! ఆలోచించండి . మీ స్పందనకి ధన్యవాదాలు.
నుదుట కుంకుమ ఆరోగ్యమని పసుపు ఔషధమని నమ్మకం భర్త తో మన జీవితంలోకి రాలేదు కదా.అలాంటప్పుడు వాటిని అందం ఆకర్షణ తో ఎందుకు ముడిపెట్టాలి.ఆరోగ్యం అందరికి అవసరమే అని ఆలోచించండి. ఆడవాళ్ళూ, సంప్రదాయమని పాటించని వాళ్ళని దోషుల్లా చూడటం మన జాతికే అవమానం. కాలంతోపాటు అనేక మార్పులు,బాల్య వివాహం నాటి అభద్రతా భావంనుండి ఆత్మ రక్షణ కోసం పోరాడే దశలో వున్నాం.పసుపు కుంకుమల కోసంకాదు ప్రాణమున్న కూతుర్లు నిర్భయ్యల్లా కాకుండా పోరాడండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి