21, ఫిబ్రవరి 2026, శనివారం

ఆమె - వంటగది



 ఆమె-వంటగది కవిత పై నేను చేసిన సమీక్ష .. 

వీడియో రూపంలో సారంగ చానల్ లో…  ఆమె-వంటగది. తప్పక చూడండి. 



మధుర రవళులు

 


సరాగమాల - వనజ తాతినేని 


వసంతం ఎప్పుడంటే 

భూమి నవ్వుతూ వున్నప్పుడు 

అంది ఆమె.

కాదు వయ్యారాల పువ్వులు 

వికసించి నప్పుడు అన్నాడతను. 

వైవాహిక ఘట్టం తర్వాత 

గ్రీష్మం రసభంగం చేసింది 

వర్షం తర్వాత..  

ఆమె ఊపిరి పీల్చుకుంది.

అతని వేళ్ళ భాష ఆమెలోకి 

నిదానంగా ఇంకుతుంది.

ఆమె దేహాన అగ్ని విరబూసింది.

రసోద్దీపన సమయంలో 

మూడు ముళ్ళు స్తంభించాయి


************

మధుర రవళులు 


అతను ఆమె పగటి రోజులను 

వెంటాడుతూనే వుంటాడు. 

ఆమె అతని కలల రాత్రులను 

చల్లబరుస్తుంది. 

అతని రహస్య గీతంలో 

ఆమె అందెలు కూడా 

జత కలుపుతాయి.  

భౌతిక అవసరాన్ని 

అధిగమించిన ప్రేమ

సౌందర్య దృష్టితో 

పని లేని ప్రేమ 

వారికి అరచేతిలో ఉసిరి.

కళోపాసన.. 

పక్వానికి వచ్చింది.


19, ఫిబ్రవరి 2026, గురువారం

హంసలు పొడుస్తున్నాయి

హంసలు పొడుస్తున్నాయి - వనజ తాతినేని


నగరం భక్తితో ఊగిపోతుంది.ఉత్సాహంగా పరుగులు తీస్తుంది. కొత్త కొత్త అలంకారాలతో మెరిసిపోతుంది. దక్షిణం వైపు కృష్ణమ్మ ఎన్నడూ లేనంత ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఆ సవ్వడి గంభీరంగానూ భీతిగొల్పుతూనూ వుంది. కొత్తవారికి అంతే! ఇది మాకు అలవాటేలే అన్నట్టు ఏమైనా జరిగితే ఆ సంగతంతా  ఆ కొండపై ఉన్న అమ్మవారే చూసుకొంటుందిలే అన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్న ప్రజలు. 

ఆ రోజు మూలానక్షత్రం. కొండపైన అమ్మవారిని సరస్వతీ రూపంలో దర్శించుకోవాలనుకునే భక్తులు రాత్రి పదిగంటలు నుండే క్యూలైన్లలో నిండివున్నారు. కంటికెదురుగా కిలోమీటర్ దూరం వరకూ క్రౌడ్ మేనేజ్మెంట్ తో సమూహాలుగా విడగొట్టబడిన భక్తజన సమూహాలు. వినాయకుడి గుడి దగ్గరనుండి తాత్కాలికంగా ఏర్పాటు చేయబడిన క్యూలైన్లు.కాలం కదులుతుంటే లైన్లు కదిలాయి. చీకటిపోయి వెలుగు వచ్చింది. క్యూ మాత్రం మరింత కిటకిటలాడుతోంది. 

రాత్రి రష్ మరీ ఎక్కువగా వుంటుంది అని ఉదయం తొమ్మిదింటికి బయలుదేరారు సుభద్ర అర్జున రావు దంపతులు. వారిది ఏటి అవతల వొడ్డు.లంక పొలాలు. అప్పటివరకూ పెళ్ళున కాసిన యెండ నిమిషాల్లో మాయమైంది. ఆకాశం మేఘావృతమై సన్నగా చినుకులు పడుతున్నాయి.. 

ఇంతలోనే యెండ అంతలోనే వాన ఏం తుఫానులో ఏమో! నిరుడుజూస్తే బుడమేరు వరదలో మునిగిపోయిన పంటపొలాలు. ఈ యేడు చూస్తే వదిలిపెట్టని తుఫానులు. పచ్చని వరి పొలాలు కంకి పోసుకుంటున్నాయి. అన్నాడొక రైతు. ఏ ఊరండీ మీది?  మాట కలిపాడు అర్జునరావు. “నిడమానూరు గూడవల్లి మద్య” అన్నాడతను. 

“మా పసుపు తోటలు నడుమెత్తు పెరిగాయి అరటి గెలలు కార్తీకంలో నరకడానికి సిద్ధంగా వున్నాయి. ఏటికి వరద పెరిగితే   మా ఉరి పొలాలన్నీ మునకే, ఫై నుండి వచ్చి పడే వరద రోజూ దంచి కొడుతున్న వాన. ఇట్టాంటి వానలు నా ఎరుకలో లేవండి బాబు “ వాపోయాడు.

సుభద్ర మనసులో కూడా సుడులు తిరుగుతూన్న ఆలోచనలు. పంటలు మునిగితే ఆ నష్టాన్ని తట్టుకోవడం కష్టం.  భార్య ముఖం చూసి ఆమె ఏం ఆలోచిస్తుందో కనిపెట్టాడు. అహే! ఏం కాదులే! గవర్నమెంట్ బాగా చూసుకుంటుంది లే! పనోడి పని వంక పెట్టటానికి వీల్లేకుండా వుంటంది. ఎక్కడిక్కడ గట్టి ఏర్పాట్లు చేయిస్తున్నారు. ముంపు భయం లేదు ఏం లేదు. ఇక్కడ చూడు, ఏడన్నా ఇబ్బంది వుందా? లచ్చలమంది వత్తా వుండారు పోతావుండారు. అన్నిచోట్లా అట్టే వుంటది ఆయన పనితీరు.అర్జునరావు మాటల్లో నమ్మిన ప్రభుత్వం పనితీరు పట్ల విశ్వాసంతో పాటు ఒకింత గర్వం అతిశయం కూడా తొంగి చూస్తున్నాయి. 

చుట్టూ బారికేడ్లు, పైన షామియానా కప్పి వున్న టెంట్ లోని భక్తజనంతో పాటు లా అండ్ ఆర్డర్ నిర్వహిస్తున్న పోలీసులు కూడా అతని మాటలను వింటున్నారు. పక్కనే తిరుగుతున్న ఆవులు కూడా వింటున్నట్టు వున్నాయి. ఒక పోలీసు అసహనంగా ముఖం పెట్టాడు. ఇదివరకంతా ఇలా లేదు. డ్యూటీల పేరుతో అరగరుద్ది  మాపై పెత్తనాలు చేస్తున్నారు అని అశ్లీల భాషలో గవర్నమెంట్ ని తిట్టాడు.

ఇంతలో కపిల గోవును  పసుపు కుంకుమలతో అలంకరించుకుని వచ్చి  పుట్ పాత్ కి ఆనుకుని వున్న కాలువ రైలింగ్ దిమ్మెకు  కట్టేసి ఆ పోలీస్ వంక చూసాడు. మీరు భక్తులను వదిలితే గోమాతను పూజించుకుంటారు. పుణ్యం వాళ్లకు చిల్లర నాతోపాటు మీక్కూడా అన్నట్టు. బస్తాలో పెట్టి తెచ్చుకున్న గడ్డి మోపును ఆవుకు దూరంగా పరిచాడు. గుంపులో ఉన్న ఒకామె చీరను మంచిదిమోకాళ్ల పైకెత్తి బారికేడ్లను దాటుకుంటూ అవతలకు వెళ్ళింది. పర్స్ లో నుంచి  పది రూపాయలు తీసి ఆవు యజమానికి ఇచ్చి పిడికెడు గడ్డి పుచ్చుకుని ఆవుకి తినిపించి మూడు ప్రదక్షిణలు చేసింది. ఇవాళ లక్ష్మి వారం సప్తమి కూడా నయ్యే!  ఇంత మంచి రోజున కపిల గోవును పూజిస్తే . పసుపు కుంకుమతో అలంకరిస్తే మరీ మంచిది అంటూ బారికేడ్లను దాటుకుని తిరిగి లోపలికి వచ్చింది. 

పసుపు కుంకుమ కూడా వున్నాయి. బైటికి తీసి పెట్టేదాక మీరు ఆగితేనే కదా!అంటూ భుజం సంచిలో నుండి డిస్పోజబుల్ ప్లేట్స్ వాటర్ బాటిల్ తీసి పసుపు కుంకుమ పొట్లాలు చింపి ప్లేట్లలో  విడిగా పోసాడు. పసుపు లో  నీళ్ళు కలుపుతూ దగ్గరకొచ్చిన మరొక భక్తురాలిని చూస్తూ “పసుపు కుంకుమ కి పది, గడ్డికి పది. ఒకరికి ఇరవై రూపాయలమ్మా” అన్నాడు.

ఆమె ఆశ్చర్యంగా చూస్తూ.. “ఏంటి చిటికెడు పసుపు కుంకుమ పది రూపాయలా!? దేనికైనా హద్దుండాలయ్యా” అంటూ పది కాగితాన్ని లోపలికి తోసి ఇరవై తీసి ఇచ్చింది. పోలీస్ ఆవు యజమాని ని చూసి నర్మగర్భంగా నవ్వాడు. 

దవడ బిగించిన అప్రసన్న ముఖంతో  గోవును పసుపు కుంకుమతో అలంకరించి గడ్డి తినిపించి ప్రదక్షిణలు చేసి వస్తూ.. “మరీ దోచుకు తింటున్నారు” అంది.”అవును” అంటూనే మరికొందరు బారికేడ్లను దాటారు.  

అక్కడికి కొద్ది దూరం నుండి కాళ్లకు చేతులకు బేండేజ్లు చుట్టుకుని వున్న బిక్షకుడి అర్ధింపులు 

“అమ్మా ఆకలి, అయ్యా ఆకలి! దానం చేయండి” అంటూ. అతని తాలూకూ మనిషిని అంటూ ఓ ఏడెనిమిదేళ్ల కుర్రాడు బ్యారికేడ్లు మధ్య నున్న భక్తజనం మధ్య తిరిగి డబ్బులు సేకరిస్తున్నాడు. చిల్లర నాణేలతో ఆ కుర్రాడి దోసిలి నిండుతుంది. భిక్షుకుడి ముందు డబ్బాలోకి చేరుతుంది.. గంట తర్వాత డబ్బుల డబ్బా సంచీలో వేసుకుని పోయిన పిల్లాడి ఆచూకీ లేదు. బిక్షకుడు అమ్మా, అయ్యా ఆకలి! అని అరుస్తూనే వున్నాడు.  

మూడు గంటలనుండి క్యూ లైన్ కదలడం లేదు.  మెట్లమార్గం నుండి  వచ్చే వారిని కొండ వెనుక నుండి వచ్చే జనాలను వదులుతున్నారట. విఐపి దర్శనాల వల్ల కాదు ఆగడం అని ఎవరో భక్తుల అపోహలను తొలగిస్తున్నారు. 

“దర్శనం అయ్యేటప్పటికి ఆలస్యం అయ్యేట్టుంది. అప్పటిదాకా ఏం తినకుండా వుంటే షుగర్ డౌన్ అయిపోద్ది, ఏమన్నా తినవే” సుభద్రను  బతిమలాడుతున్నాడు భర్త. ఆమె అతని వంక చూసి తల అడ్డంగా తిప్పింది. పెదవులు కదలకుండా లలితాసహస్రం పఠిస్తుంది. అప్పుడప్పుడూ చేతిలో వున్న మొబైల్ చూసుకుంటుంది. “నీ దేవి కడుపు మాడ్చుకుని ఆకలితో  కొండకి రమ్మని చెప్పిందా ఏం?  ఆమె ఏమీ అనుకోదు లే!  ఏదో వొకటి కొద్దిగా ఎంగిలిపడు” పక్కన పెట్టిన సంచీలో నుండి బ్రెడ్ పేకెట్ అరటి ఆకులో కట్టిన పొట్లాలు బయటకు తీసాడు. ఆమె చేత్తో వద్దని వారించి నీళ్ళ సీసా తీసుకుని రెండు గుటకలు తాగి బ్రెడ్ పేకెట్ భర్త చేతికిచ్చి భిక్షుకుడి వంక చూపించింది. అది తీసుకుని అర్జునరావు బారికేడ్లు దాటబోతుండగా పోలీసు అడ్డుకున్నాడు. 

“ఆ బిక్షగాడు ఆకలి అని అరుస్తున్నాడు. వాడికి ఇచ్చి వస్తానయ్యా” 

అర్జునరావు చేతిలో బ్రెడ్ పేకేట్ తీసుకుని ముష్టివాడి వైపుకు గిరవాటు వేసి నువ్వు లోపలికి పో అన్నట్టు చూసాడు. ముష్టి వాడికి అందకుండా పడిన బ్రెడ్ పేకెట్ ని కుక్క ఒకటి వచ్చి నోట కరుచుకుని  అవతలకి పోబోయింది. ఆకలితో మండిపోతున్న ముష్టివాడు తన పక్కన వున్న కర్రతో కుక్కను గట్టిగా కొట్టాడు. అది కుయ్యో మని అరుచుకుంటూ  అవతలకు పోయింది. చేతులతో డేకుతూ పోయి బ్రెడ్ పాకెట్ ని  అందుకుని గబగబా  మూడొంతులు పైనే తినేసాడు. ఆకలితో అలమటించి పోయాడు పాపం! ఆ డబ్బు దండుకు పోయిన వాడు ఏమయ్యాడో! ఆలోచిస్తున్నాడు అర్జునరావు. 

సుభద్ర పదే పదే మొబైల్ చూసుకుంటుంది. 

కొడుకు కూతురు ఇద్దరూ ఈ రోజు కలుసుకుంటారు. రెండు రోజులు ఇద్దరూ కలిసి ఇష్టమైన వంటలు చేసుకుంటూ తమతో మాట్లాడుతూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ సరదాగా ఉంటారు. తామందరూ ఒకేచోట వున్నట్టు ఆనందం వ్యక్తం చేసుకుంటూ లోపలి బెంగలను మర్చిపోతారు. కూతురు పూజ అమెరికా వెళతానంటే వద్దని అనలేదు. అదే బాటలో కొడుకు వెళ్తానని అంటే ఇద్దరూ వొప్పుకోలేదు. అర్జునరావు గట్టిగానే చెప్పాడు..

“ఒరేయ్ అవినాష్! ఐదు తరాల నుండి ఈ లంకల్లోనే పడి బతుకుతున్నాం  పాడి పైరు వేటికి కొదవలేదు. మా నాన్నకు ఐదురుగురు సంతానం. అందరం మోకాళ్ళ లోతు బురదలో  నడుచుకుంటూ పోయి పడవెక్కి రోడ్డెక్కి పోయి చదువుకున్నాం. కూటికి గుడ్డకి ఆరోగ్యానికి అన్నింటికీ బాగానే వున్నాం. మీ కాలానికి బండ్లు వచ్చే, బైకులొచ్చే, కారులొచ్చే, ఆఖరికి బస్ లు కూడా వచ్చే. నీకు ఉద్యోగం హైదరాబాద్ కాకపోతే చెన్నయ్, బెంగుళూరు లైనా వచ్చే.. ఈడనే వుండరా” అని బతిమాలాడు.

వినలేదు కొడుకు. ఏవో పరీక్షలు రాసి అమెరికా యూనివర్సిటీ లో సీటు తెచ్చుకున్నాడు. నువ్వేం డబ్బులు ఇవ్వవద్దు నేను లోను పెట్టుకుంటాను అన్నాడు. లోను రాకూడదు అని మొక్కుకుంది అట్లా అయినా ఆగిపోతాడని. లోను కూడా ఇచ్చారు. విమానం ఎక్కాడు అవినాష్. 

పోయినేడు ముంపు వచ్చినప్పుడు వచ్చాడు. “నాన్నా! నువ్వీ దండగ మారి వ్యవసాయం మానమంటే మానవు. నా చదువు పూర్తై ఉద్యోగం వచ్చాక నువ్వు వ్యవసాయం మానేయ్. తెనాలి లో ఇల్లు తీసుకుని అమ్మ నువ్వు హాయిగా వుందురుగాని” అని పదేపదే చెప్పాడు. 

పశువులు కాడ చేసి చేసి విసుగొస్తుంది ఓపిక సన్నగిల్లింది సుభద్రకి . అవినాష్ కి ఉద్యోగం రాగానే పూజకి పెళ్ళి చేసేయాలి అని తను అంటుంటే.. ఆడపిల్ల భర్త ఎక్కడ ఉంటే అక్కడుంటుంది. కొడుకు మాత్రం ఊరి పట్టునే వుండాలి. ఏం!?  మన అమరావతి లో ఆడికి ఆ మాత్రం ఉద్యోగం రాకపోద్దా? అంటాడు భర్త. 

“ఆ రోజులు వస్తే నేను వచ్చేస్తానులే నాన్నా! ముందు రానీయ్, రాకముందే నస పెట్టి చంపకు”అని విసుక్కున్నాడు. 

“కడుపున పుట్టిన బిడ్డలిద్దరూ అమెరికాలో భవిష్యత్తు కోసం గొడ్డులా కష్టపడుతున్నారని 

 మీ నాన్నకు బాధ. పండగొస్తే ప్రతి ఇంటి ముందు కారు వుంటుంది ఇంటినిండా పిల్లాజెల్లా వుంటున్నారు. మనిల్లు వొక్కటే బోసిపోయి ఉంటుంది. ఏ తల్లిదండ్రులు మాత్రం కన్నబిడ్డలు పై గుబులు పడకుండా వుంటారు ? అని మందలించింది కొడుకుని. 

“ఈసారి ఎప్పుడు వస్తానో చెప్పలేనమ్మా!. ట్రంప్ వస్తే అన్నీ మార్చేస్తాడు. అందుకే ఇప్పుడు ఎక్కువ రోజులు వుంటున్నా.” అన్నాడు ప్రేమగా హత్తుకుని. తల్లి తండ్రితో ఎన్నో సెల్ఫీలు తీసుకున్నాడు అవినాష్.

పోయినేడు ఇదే రోజున కొడుకు తనూ ఇట్టాగే  అమ్మ వారి దర్శనానికి వచ్చారు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో! కన్నపేగు కదిలింది.” అమ్మా! బిడ్డలను చల్లగా చూడమ్మా” కొండ వైపు చూసి చేతులు జోడించింది. 

 బిక్షగాడు మళ్ళీ అరుస్తున్నాడు. అమ్మా ఆకలి అంటూ. చిల్లర ఇవ్వబోతే వద్దు పండో ఫలహారమో పెట్టమని అడుగుతున్నాడు. ఇదంతా సాధారణమే అన్నట్లుగా చూస్తున్నారు జనం. ఎవడి ఆకలి వాడిది. ఎవడి ఆశ వాడిది. గోవు యజమాని, పోలీస్ వాడు, భిక్షకుడు, పెద్దబొట్టు ధరించిన భక్తుడు, ఆఖరికి  సుభద్ర ది కూడా! ఎండ పెళ్ళున్న కాస్తుంది. సుభద్ర కు తలనొప్పి మొదలైంది. ఏమిటో గుండెల్లో చెప్పలేని అలజడిగా వుంది. 

బ్యారేజీ దగ్గర నుండి వినాయకుడి గుడి మధ్య వీధులవెంట తిరుగుతూనూ   చెత్త కుండీల దగ్గర జేరి అక్కడ పోసిన కుళ్లిన ఆకు కాయగూరలు హోటళ్ళు నుండి వచ్చిన ఎంగిలి విస్తరాకులు తింటూ తిరిగే వీధి ఆవులమంద  ఆ ముందు రోజు రాత్రి బారికేడ్ల అవతలకు వెళ్లి అక్కడ చిక్కుకొని వున్నాయి. మనుషులు అదుపు తప్పుతారని అతి జాగ్రత్తగా కాపలా కాస్తున్న పోలీసులు పారిశుద్ధ్య సిబ్బంది వాటిని పట్టించుకోవడం మానేసారు. రెండు రోజుల నుండి స్వేచ్ఛగా తిరిగే వీలులేక తిండి నీళ్ళు లేక బందీల దొడ్డిలో వున్న పశువుల్లా అవి కొంత దీనంగా మరికొంత అసహనంగా వున్నాయి. ఎటుచూసినా జనం. ఎర్ర రంగు దుస్తులు ధరించిన భక్తులు. వారి కేకలు చిడతలు మ్రోగిస్తూ డప్పు వాయిస్తూ పాటలు పాడుకుంటూ వాటి ప్రశాంతత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంటే ఊరుకుంటాయా.. ? వాటిల్లో వున్న ఓ గంగిగోవుకి పూనకం వచ్చింది. పక్కనే వున్న ఆవుని కుమ్మింది. అంబా అని అరిచిన ఆవు ఊరుకుంటుందా? ప్రతీకారం తీర్చుకుంది. ఆవులన్నీ చెల్లాచెదురు అయ్యాయి. పరిగెత్తుతూ బారికేడ్లను విరక్కొట్టుకుంటూ అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్నాయి..కంగారుపడిన  కొంతమంది బారికేడ్లను దాటి రోడ్డు డివైడర్ ను దాటి అవతలికి వెళ్ళసాగారు. 

భిక్షుకుడు కూడా ఎక్కడలేని ప్రాణ భయంతో చేతులతో చక్రాల పీటను తోసుకుంటూ ఆవులను మనుషులనూ తప్పించుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. సుభద్ర అర్జునరావు భయంగా ఒక పక్కకు వొదిగిపోయారు. కళ్ళెదురుగా దూరంగా పారిపోతున్న భికకుడి కళ్లలో మెదిలిన భయం అప్రమత్తత జీవనకాంక్షను తొట్రపాటుతో గమనిస్తూనే వీళ్ళు కూడా  డివైడర్ ఎక్కి కూర్చున్నారు. అంతలోనే సుభద్ర ఫోన్ మోగుతోంది. మోగుతూనే వుంది. కొద్ది నిమిషాల్లోనే ఆవులమంద ని విడగొట్టి వంతెనపై నుండి  అవతలకు తోలేస్తున్నారు. పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చింది.  

“ఇంతలోనే ఎంత ఉపద్రవం వచ్చిపడింది!? ఏదో చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు జనం. ఇంకా నయం ఆవులు వాటిల్లో అవే కొట్లాడుకున్నాయి మనుషుల జోలికి రాకుండా” 

అనుకుని హమ్మయ్య అని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

సుభద్ర తెప్పరిల్లింది.సంచీలో వున్న బ్యాగు తీసి ఫోన్ చేతిలోకి తీసుకుంది. తెల్లవారినప్పటి నుండి ఎదురు చూస్తున్న వీడియో కాల్ అది. ఆత్రంగా  తెరిచింది. ఎదురుగా కన్నీరు కారుస్తూన్న కూతురు పూజ. ఏమైందమ్మా ! ఆందోళనగా అడిగింది. ఏడుపే కూతురు సమాధానం అయింది. 

అర్జునరావు ఫోన్ తీసుకుని ఏమైందమ్మా.. బుజ్జమ్మా! తమ్ముడు నీదగ్గరికి వచ్చి వుండాడా? మనసులో ఏదో కీడు శంకిస్తూ వుండగా గాబరాగా అడిగాడు. 

“నాన్నా! తమ్ముడు,తమ్ముడూ” అంటూ చెప్పకుండా మళ్ళీ భోరుమంది. 

“ఏమైందమ్మా! చెప్పు తల్లీ! చెప్పకుండా ఏడిస్తే మేము ఏమి అనుకోవాలి.మీ అమ్మ పడిపోయేట్టు వుంది.” 

“నాన్నా! గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తున్న తమ్ముడి పై గన్ పేలింది నాన్నా! తమ్ముడు చచ్చిపోయాడు నాన్నా! అరగంట క్రితం కాల్ చేసి నెక్స్ట్ డ్యూటీ కి రావాల్సిన అబ్బాయి ఇంకా రాలేదు. వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందేమో అన్నాడు నాన్నా! ఇంతలోనే ఇలా! “ గట్టిగా ఏడుస్తుంది. ఆ మాటలు వింటున్న సుభద్రకి స్పృహ తప్పింది. 

“అయ్యో! దేవుడా.. మేము ఏమి అపకారం చేసామని ఈ శిక్ష వేసావ్ తండ్రీ! గొల్లున ఏడుస్తూ గుండె పట్టుకున్నాడు అర్జునరావు. 

ఎక్కడో వస్తుందనుకున్న తుఫాను దుఃఖపు తుఫానులా భార్యాభర్తలిద్దరిని ముంచెత్తింది.  కన్నీరుమున్నీరవుతూనే భార్య ను వొడిలోకి తీసుకుని ముఖాన నీళ్ళు చిలకరిస్తున్నాడు.

“సుభద్రా! నేను వద్దంటే విన్నావటే! పిల్లల ఇష్టప్రకారం పోవాలి అంటివి. ఇప్పుడు చూడు ఏమైందో! ఒరే అవినాష్! బిడ్డా! అమెరికా కి పోవద్దంటే  కాదు, పోవాలంటివి. అటు నుండి అటు గానే పోయినవా బిడ్డా! మా కడుపున ఇంత దుఃఖం పెట్టి పోయినావా కొడుకా! “ గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు.

చుట్టూ జనం చుట్టుకున్నారు. అయ్యో పాపం! అని విచారపడ్డారు. ఆ దేశంలో ఇట్టా జరుగుతున్నా కూడా ఆశపోతు తల్లిదండ్రులు పంపుతూనే వున్నారని కొందరు యెగతాళిగా  వ్యాఖ్యానించారు. “ఆ!!  మరణం ముందు చెప్పి వస్తుందా?  ఇంట్లో వున్నా ముంచుకొస్తుంది.  అట్టా జరగాలని వుంది జరిగింది” వైరాగ్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగిపోయారు కొందరు. సుభద్ర కళ్ళు తెరవడం లేదు. పోలీసులు  అంబులెన్స్  పిలిపించారు. అది భార్యభర్లను ఎక్కించుకుని హాస్పిటల్ వైపు దూసుకువెళుతుంది. 

తమ జీవితాన్ని అతలాకుతలం చేసిన  ఆ భయంకర సంఘటన ఎలా జరిగివుంటుందో ఊహించుకున్నాడు అర్జునరావు. చికాగో లో అర్ధరాత్రి సమయం. గ్యాస్ స్టేషన్ లో అవినాష్  ఎదురుగా నిలబడిన నల్ల జాతీయుడు.  మాట్లాడుతూ మాట్లాడుతూనే  గన్ తీస్తే  ఏం జరుగుతుందో అని ఊహించేలోగానే గుండెలోకి దూసుకుపోయిన బుల్లెట్. ఆ క్షణంలో కొడుకు కళ్ళల్లో కదలాడిన ప్రాణభీతి.ఇందాక భిక్షగాడి కళ్ళలో కనబడిన ప్రాణభీతి వొకటే! ప్రాణం అంటే తీపి లేనిది ఎవరికీ? ఏ మాత్రం అవకాశం చిక్కినా ప్రాణం కాపాడుకోవడానికే ప్రయత్నిస్తారు. ఎంత దురదృష్టవంతుడు తమ కొడుకు!!

ఇప్పుడు భార్య స్థితి ఏమిటి? భయంతో భార్య వైపు చూసాడు. ఆమె కొద్దిగా కదిలింది.

ఆందోళన పడ్డవద్దని నర్స్ దైర్యం చెప్పింది. కాసేపటికి చిన్నగా కళ్ళు తెరిచింది సుభద్ర. ఇద్దరి కళ్ళనుండి ధారగా కారిపోతున్న నీళ్ళు. ఆమెను తానెలా ఓదార్చ గలడో అన్నది అర్థం కాక అయోమయంగా చూస్తూ ఏటిదాపున పుట్టి పెరిగిన తన అనుభవంతో 

 గొణుకున్నాడు అర్జునరావు.

“హంసలు తాము తిరిగాలనుకున్న తావుల్లో  వలస పక్షులను, కొంగలను కాలూననివ్వవు.పొడిచి పొడిచి తరుముతాయి, చంపుతాయి. అదే జరుగుతుంది అక్కడ “

విధి రాతకు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వున్నారు దంపతులు.  కొండపై కనకదుర్గమ్మ చదువుల తల్లిగా చిరునవ్వు చిందిస్తూనే వుంది.  దర్శన భాగ్యం తోనే తమ పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుందని వారిని  ముందుకు నెడుతున్నారు తల్లిదండ్రులు. అచ్చం అమెరికా విమానం యెక్కితే చాలు అన్నట్లు.  కాలానికి సాక్ష్యంగా నది  గంభీరంగా ప్రవహిస్తోంది.

………… సమాప్తం…………

గ్రీకు సుందరి - తోటరాముడు

 



నా కొత్త కవిత  “ప్రేమ ప్రకటనా పత్రము “  

ది తెలంగాణ డాట్ కామ్ లో ప్రచురితం. 

ఈ లింక్ లో ప్రేమ ప్రకటనా పత్రము  చదవండి ప్లీజ్! ధన్యవాదాలు 

17, ఫిబ్రవరి 2026, మంగళవారం

క్షమయా ధరిత్రి




 పంట కోసాక ఖాళీగా ఉన్న భూమిని  చూస్తూ ముచ్చట్లు చెపుతున్న  గులాబీ ని చూస్తూ వచ్చిన ఆలోచనలను ఇలా!  . 

అనగనగా ఒకానొక కాలంలో అంకితభావంతో సేద్యం చేసే రైతు వుండేవాడు. 

కాలం ఏదైనా ప్రకృతి కి నాగరికత కు మధ్య వారధిగా నిలిచినవాడతను.  

ఒయాసిస్సు ను నమ్ముకొని ఎడారి సేద్యం చేసినటువంటి వాడు. 

నెర్రెలిచ్చిన నేలను దున్ని విత్తనం నాటతాననే ఆశ కలవాడు. 

ధాన్యం ఏమిటీ ధనం కూడా పండించగల మనుకునే అతిశయం ప్రదర్శించేవాడు. 

నదులన్నా ఏరులన్నా సరస్సులన్నా వాగు వంకలన్న ఆరాధ్య భావం కల్గినవాడు. 

గుప్పిళ్ళతో జల్లి కుంచాలతో గాదెను నింపేవాడు. 

ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని 

అమ్మడానికి వస్తుమార్పిడికి ఇచ్చగించేవాడు కాదు. నాణాలను వేసిన సంచీని  నిప్పు ను ఒడినగట్టుకుని తిరిగినట్లు తిరిగేవాడు. తరాలు మారాయి అతని కొడుకులు మనుమలు అందరూ సేద్యంలో ఆరితేరిన వారయ్యారు. కానీ అతను పండించినట్లు పండించలేకపోతున్నారు. బాట మళ్ళారు కొందరు. సాయగాళ్ళు లేని సేద్యం 

పుట్టెడు అప్పుల్లో మునిగిపోయింది

భార్యబిడ్డలు అతన్నొదిలేసిపోయారు. పొలం ఇల్లు వాకిలి దొడ్డి గొడ్డు అన్నీ కొత్త సంరక్షణలో సర్దుకున్నాయి.  

అడిగిన వారికి అడగని వారికి దారిన పోయేవారిని ఆపి.. తన ఆలోచనలను వినిపించేవాడు. 

నాకు మూడు తలంపులు  వున్నాయి. 

క్షామం అనేది ఎరుగని కాలం వొకటి వుండాలని కోరిక. 

జగతిలో వున్న మానవులందరికి  ప్రతిరోజూ పట్టెడన్నం పెట్టగల్గాలని వ్యామోహం.

ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ రైతే రాజుగా అధికారంలో వుండాలి. అప్పుడే ప్రజలకు రక్షణ. 

ప్రతి మానవుడు భావోద్వేగాలను అనుభవించడానికి కారణం  పై మూడే! అని చెప్పేవాడు. 

అతన్ని పిచ్చివాడిని చూసినట్లు చూసేవారు జనం. 

అతను ఊరు విడనాడాడు. కాలు వెళ్ళిన చోటుకల్లా వెళ్ళాడు. 

పవిత్ర గంగ లో సాగర సంగమం లో  త్రివేణి సంగమం లో 

కుంభమేళాలో  అనేక పుష్కరాల సమయంలో  పుణ్య స్నానం చేసాడు. 

కానీ..  అతని తపన తీరలేదు. 

నది జాలిపడి అతని చెవిలో ఒక రహస్యం చెప్పింది. 

నువ్వు భూమిని నాగలితో దున్నిన పాపం  వదిలిపోలేదు. 

పచ్చి బాలింతరాలు అని కూడా చూడకుండా మళ్ళీ మళ్ళీ దున్నావు విత్తులు చల్లావ్  అని. 

అతను కనులు మూసుకుని గతం లోకి కళ్ళు తెరిచాడు. 

“ధరణి బాధతో అల్లాడింది,శపించింది. . దున్నడానికి భూమి లేకుండా పడి వుండు అని. ప్రకృతి శక్తులు భూమికి మద్దతు పలికాయి. అతివృష్టి అనావృష్టి. జనులు క్షామంతో  అల్లాడిపోతున్నారు.”

అతను భూమిని క్షమించమని చేతులు జోడించి వేడుకున్నాడు. అలాగే నేలకొరిగాడు. 

కొన్నేళ్ళకి భూమి తల్లి శాంతించింది. ప్రకృతి సహకరించింది. ధాన్యం విరివిగా పండింది. ఆశ కి అంతు లేకుండా ధనం కోసం మళ్ళీ చేసిన తప్పు చేస్తూనే వున్నారు  అతని లాంటి అనేకులు.  


************

సుద్దాల అశోక్ తేజ గారి గీతం లో చిన్న భాగం .. 

పరువమోచ్చి సేను వంగే పైరు

కాపు మేను పొంగే పంట

బిడ్డను రైతు బండికెత్తినంక

పగిలిపోతుంది నీ గుండె

నేలమ్మా....! నేలమ్మా…..!

నేలమ్మ నేలమ్మ నేలమ్మా 

నీకు వేల వేల వందనాలమ్మా 💚🙏❤️


#వనజతాతినేని #vanajatatineni #hilights #follower #MobilePhotography #shortstory

16, ఫిబ్రవరి 2026, సోమవారం

తళుక్కులు

 

తళుక్కులు - వనజ తాతినేని


అవమానాలు పూలహారాలై 

మెడను అభినందించాక

కనురెప్పలపై వెలిగే  రంగుల దీపాలు 

కన్నీళ్ళ దండగా జారాయి

************

ఎండిన పూల తోటలను 

నాగళ్ళు దున్ని వెళ్ళాయి

నా ప్రియమైన వ్యక్తి నిదురించాక

మేఘాల కోసం ఎదురుచూపు లేదిక.

**********

మంచి అద్దం ఒకటి

కొనుక్కోవాలిప్పుడు

బహు పాత్రాభినయం అవసర పడింది.

********* 

16/02/2026  09:15 am. 


14, ఫిబ్రవరి 2026, శనివారం

సంరక్షణ కన్నా మించిన ప్రేమ ఏముంటుంది !?



సంరక్షణ కన్నా మించిన ప్రేమ మరొకటి ఏం వుంది. !!!?

కాకరపాదుకు గోరు వెచ్చని నీళ్ళు పోస్తే పూత పిందె నిలబడతాయి నాయనమ్మ మాటలు జ్ఞాపకం చేసుకుంది. కాకరపాదుకు గుండ్రంగా పాదుచేసి కుదురు చుట్టూ తవ్వి తీగకు ఎడంగా నాపబండ వేసింది. పిల్లాడిని ఆ బండపై నిలబెట్టి కబుర్లు చెపుతూ ఒళ్ళు రుద్దుతూ గిలిగింతలు పెడుతూ  ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ స్నానం అయిపించేది.  సున్నిపిండితో కలిసిన గోరువెచ్చని నీరు తాగిన కాకరపాదు అమ్మ కొడుకు సరదా కబుర్లు అల్లిబిల్లి పాటలు  విన్న కాకరపాదు విరగబడి పూచేది,ఆరోగ్యంగా కాచేది. కాయలు కోయాలి అన్నప్పుడు అమ్మ అబ్బాయి ముఖముఖాలు చూసుకునేవారు. వాళ్ళిద్దరూ మనసొప్పక మాలుకున్నా కోసే చేయి కోయక మానేదికాదు,కూర అవ్వకుండా ఊరుకునేది కాదు. అది నా ఒకప్పటి సంగతి.


కరివేపాకు మొక్కకు బియ్యం కడిగిన నీరు రోలు కడిగిన నీరు పొయ్యి… బాగా గుబురుగా పెరుగుతుంది అని అమ్మ చెప్పింది. ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఆచరణ. ఈ రోజుకి కుండీలో పెరిగే కరివేపాకు మొక్కకు  అదే తిండి అదే దాహం. రోజూ.. కచ్చితంగా చెప్పాలంటే 365 రోజులూ  నాలుగైదు రెమ్మల కరివేపాకు సంకోచం లేకుండా తెంపుకొచ్చి నలిపి కూరలో వేయడమే!  ఇది ఇప్పటి సంగతి. 


ఇక పూల మొక్కలకు చెట్లకు వేర్వేరు సూచనలు. నేల కరువై వాష్ ఏరియాలో ఎండ తగిలే చోట నాలుగైదు పూల మొక్కలు పెట్టుకుని వాటికి చేసే సంరక్షణ. ఫిల్టర్ లో వడపోత అయ్యాక మిగిలిన సారం లేని గుప్పెడు కాఫీపొడి  ముద్ద, వడపోసాక కూడా అల్లం యాలకులపొడి లవంగం మొగ్గల పరిమళంతో కూడిన ఘాటు లేని  టీ పొడి, పాల గిన్నె కడిగిన నీళ్ళు, పెరుగు గిన్నె తొలిపిన నీళ్ళు, బియ్యం కడుగు, అన్ని రకాల పప్పు కడిగిన నీళ్ళు, ఆఖరికి సగ్గు బియ్యం కడిగిన నీళ్ళు ఏది వృధా గా పోయేది లేదు. ఆఖరికి కాఫీ టీ కప్పు కడిగిన నీళ్ళు కూడా. 


శంఖుతీగె పెద్ద పెద్ద పూలు ఇస్తుంది. కనకాంబరాల చెట్లు ప్రాణశక్తి నంతా ధారపోసి సహజ వర్ణానికి మెరుపు జతచేసి పిగిలిపడతాయి. ఇక తామరలు నిద్రాణవస్థను భంగపరిచి పూలు నిస్తాయి. మెక్సికన్ పెటూనియా, అడేనియం పూలు ఆరోగ్యంగా హాసం వెదజల్లుతాయి.పుదీనా కోసిన కొలదీ విరగబడి పెరుగుతుంది. కోయకపోయినా మరువం మరి మరీ కొమ్మ రెమ్మలతో కుండీ నిండా పరుచుకుంటుంది. ఇక ఇండోర్ ప్లాంట్స్ నన్ను ఇబ్బంది పెట్టకుండా నిదానంగా పెరుగుతుంటాయి. 

రోజూ పూజకు  పూలు కోసుకుంటూ అనుకుంటాను. నేను పరిశుభ్రమైన తిండి తింటూ పానీయాలు తాగుతూ   మీ ముఖాన ఎంగిలి నీళ్ళు పోస్తాను. అవేమీ మనసుకు తీసుకోకుండా ప్రతి ఉదయం తాజా తాజా పువ్వులను ఇస్తుంటారు. మీది ఎంతో ఉదార హృదయం అంటూ చెట్టుకు కృతజ్ఞతలు చెప్పి క్షమాపణలు చెప్పి.. దేవుని పూజ కొరకు పువ్వులు కోసుకుంటున్నాననే మాట విన్నమించి పువ్వులు కోస్తాను. 


మనం ఎవరికైనా.. భూమి కైనా సరే  ఏమి ఇస్తున్నాం ఏం తీసుకుంటున్నాం !? ఎప్పుడేనా ఆలోచిస్తున్నామా!? మన బిడ్డలకు ఎలాగూ త్యాగాలు చేసి మరీ నాణ్యమైనవి ఇవ్వడానికి తాపత్రయ పడతాం. మన తల్లిదండ్రులకు కూడా ఇవ్వడానికి ప్రాణం వొప్పదు ఒకోసారి. అసలు మనని భరిస్తున్న భూమికి  పర్యావరణానికి ఏం ఇస్తున్నాం!? కాలుష్యం కాలుష్యం కాలుష్యం. విషం విషం విషం. తోటి ప్రాణులను ప్రాణాలు తీసి మన జిహ్వలను చల్లార్చుకుంటున్నాం. 


ఇక తోటి మనుషుల పట్ల మన చర్యలు ఎంత అహేతుకం !!!? అర్ధం పర్ధం లేని ఈర్ష్యలు ద్వేషాలు అనుమానాలు,వంకర మాటలు. ఆంటోని చెకోవ్ “మాస్క్” కథ విన్నాను ఈ రోజు. పంచతంత్రం కథల్లో “మిత్రలాభం” చదివాను పొద్దున్నే! ఈ రోజుల్లో అసలైన మిత్రులు వున్నారా!? అవసరాలు తప్ప అభిమానాలు వున్నాయా!? ఒక్క హితమైన మాట చెబితే శత్రువైపోతున్నాం. 


మనం ప్రకృతిని చూసి అయినా నేర్చుకుందాం.వీలైనంత భరించి ఇతరులకు ఆహ్లాదం పంచుదాం. 


 నా చిన్ననాటి నుండి మొక్కల సంరక్షణ పోషణ నుండీ  ఈనాడు నా బాల్కనీ గార్డెన్ లో మొక్కలు పెంపకం నుండి నేను నేర్చుకున్న పాఠం ఇది. 


మన బిడ్డల వలెనె మనని కన్న తల్లిదండ్రులకు మన అత్తమామలకు, మన బిడ్డలకు జీవితాంతం తోడు నీడగా నిలబడటానికి వచ్చిన వారిని అత్యున్నతంగా భావించండి. వారికి మంచివే ఇవ్వండి మన స్నేహితులను ఎవరినీ తక్కువ చేసుకోవద్దు. వారు ఎలాంటి వారైనా సహృదయంతో వుండండి.దుష్టులు కానంత వరకూ వారికి సన్నిహితంగానే వుండండి. కాలక్షేపపు కబుర్లలో వారి గురించి చెడుగా ప్రచారం చేయకండి.  పరిస్థితుల వల్ల డబ్బు ఇచ్చి ఆదుకోలేకపోవచ్చు. కానీ హితం కల్గించే మాట చెప్పడానికి కష్టంలో వెళ్ళి పక్కన నిలబడటానికి నిర్లక్ష్యం పిసినారితనం చూపకండి. 


Learn more Do more  Give more Forgive more Become more. 


కనీసం నాలుగు మొక్కలు పెంచండి. రెండు చెట్లు పెంచండి. 💚🍀🌿🌴

సంరక్షణ కన్నా మించిన ప్రేమ మరొకటి ఏం వుంటుంది!? 


ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ .. నా ప్రేమ 💚💚💚

12, ఫిబ్రవరి 2026, గురువారం

తళుక్కులు

వేచి చూస్తుంది.  

నిరీక్షణ ఆమె రెండవ పేరు 

******

వేప పూసింది.

మాఘమాసం చివర్లోనే 

వసంతం. 

******

అనాలోచిత చూపు

మొదటి సారి 

నీతో నే మాటాడిన మాట 

********

నిశ్శబ్దం వాన వాసనేస్తుంది

పంచుకున్నాం ఇద్దరం 

*******

రెక్కలు నావి 

ఎగరడానికి వొకరి అనుమతి ఎందుకు? 

ఆకాశం అందరిది. 


**********

అహంకారం 

అతని చిరునామా 

రిథమ్ ఆమెకు తెలిసినంతగా

తెలియదు అతనికి.

********

10, ఫిబ్రవరి 2026, మంగళవారం

ఫ్రేమతో… ఓ గులాబీ..


ఫేస్ బుక్ లో చాలా మంది వాల్ మీద నా స్పందన కనబడదు. ఎందుకంటే కొంతమంది అప్ డేట్ చేయరు. కొంతమంది చేసినా పాత అకౌంట్ లు ప్రోత్సాహించని కారణం మరికొంత కావడంతో వారి పోస్ట్ లు మనకి కనపడవు.  మిత్రుల రాతలను వాల్ మీద అయితే చదవగలను. బుక్ గా చదవలేని కారణంగా. ..నా  స్పందన వుండదు. ఇకపోతే మరో కారణం ఎవరి గోల వారిదే! కొంత వివరణ ఇచ్చే ప్రయత్నంలో.. ఈ పోస్ట్ రాస్తున్నాను. ఎవరికి వారు వాళ్ళు మన పోస్ట్ లకు స్ఫందిస్తున్నారా.. మనం వాళ్ళ గోడ మీదకు వెళ్ళడానికి అని భీష్మించుకుని కూర్చుంటారు. కొంతమంది తమ రాత ఏదో తాము రాసుకుంటూ ఇతరులను చదవరు.. ఓపిక ఆసక్తి లేక కూడా! 

కొంచెం వివరంగా రాస్తున్నాను అందుకే! 

**********

రహస్య గీతం

గులాబీ నుండి రేకులు రాలడం ఎవరు చూశారు?

నేనే, కానీ అది ఎవరికీ తెలియదు అంది సాలీడు,

పక్షిపై సూర్యాస్తమయ కాంతి మెరవడం ఎవరు చూశారు?

నేనే, కానీ అది ఎవరూ వినలేదు అంది చేప,

సముద్రంపైకి పొగమంచు రావడం ఎవరు చూశారు?

నేనే, కేవలం నేనే! అంది సముద్రపు పావురం,

సూర్యుని మొదటి ఆకుపచ్చ కాంతిని ఎవరు చూశారు? (ఆకుపచ్చ అంటే lush green కావచ్చు)

నేనే, ఏకైక దానిని అంది గుడ్లగూబ.

రాయిపై నాచు పాకడం ఎవరు చూశారు?

నేనే, ఒంటరిగా! అంది బూడిద రంగు నక్క,.


Margaret Wise Brown/మార్గరెట్ వైజ్ బ్రౌన్

The Secret Song అనే కవితకు స్వేచ్ఛానువాదం


****************

ఈ పద్యం నవ్వు తెప్పించేదిగా వుంది కదా!    సాలీడు, చేప, సముద్రపు పావురం, గడ్లగూబ,నక్క ఇవ్వన్నీ కూడా ప్రాణులే! ప్రకృతిలో జరుగుతున్న అనేక విషయాలను మార్పులను ఎవరు చూసారు అంటే…. వేటికవి నేను చూసాను, నేను మాత్రమే చూసాను, ఒంటరిగా చూసాను అని జవాబు ఇస్తున్నాయి. కానీ వాటితో పాటు మిగతా ప్రాణులన్నీ కూడా ఆ విషయాలను గమనిస్తాయి. ఇవన్నీ సామూహికంగా ఆ విషయాలను గ్రహించలేదు గమనించలేదు. వేటికవే తమను సమూహం నుండి విడగొట్టుకుని ఒంటరిగా గమనించి ఆస్వాదించి నేను మాత్రమే చూసాను అని డంబాలు పలుకుతుంటాయి. ఆస్వాదన అందరిదీ. ఎవరి పరిధిని బట్టి వారు అర్థం చేసుకుంటారు, ఆస్వాదిస్తారు. నేను మాత్రమే ప్రత్యేకం అనుకోవడం హాస్యాస్పదం. ఒకే దృశ్యాన్ని ఇద్దరు ఒకేసారి చూసినప్పుడు కూడా కలిగే భావనలు ఒకటిగా వుండవు. ఎవరి భావన వారిది. ఇది చిన్న పిల్లల పద్యంలా అనిపించినప్పటికీ.. ఇది అందరికీ సంబంధించినదిగా నాకు తోచింది. ఒంటరితనం కూడా బాగా ఆస్వాదించతగినదే కదా అనిపించింది.ఆనందపడటం కూడా  హర్షించదగినదే!  సాహిత్యం కూడా మనకి మనం ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఎవరికి అర్థమైనంత రీతిలో అర్ధమైనంత. ఇతరులకు అర్థం కానంత మాత్రాన అది మంచి రచన కాకుండా పోదు. దేని విలువ దానిదే! ఎవరి రహస్య గీతాలు వారివే! 

కవిత్వం కానీయండి కథ కానీయండి అందులో ఒక అంతరార్థం వుంటుంది. ఆ భావోద్వేగాల లోతు,శ్లేష సాధారణ పాఠకుడు అందుకోలేకవచ్చు. అందుకే  కవులు రచయితలు సాధ్యమైనంతగా సంక్లిష్టంగా కాకుండా అలతి అలతి పదాలతో రూపాలను సృజించగల్గితే సాహిత్యం పామరుల వరకూ చేరుతుంది. అక్షరం అందరికీ చేరువకానప్పుడు కూడా  సాహిత్యం వాజ్మయరూపంలో వర్ధిల్లింది. జానపద గీతాలు, పేదరాసి పెద్దమ్మ కథలు ఆయాకాలంలో అలరించాయి. 

ప్రతి కవి, రచయిత కూర్చుని పాఠకుడికి అర్ధవివరణ ఇవ్వలేడు, ప్రతీక లను ఎలా అర్ధం చేసుకోవాలో చెప్పలేడు. పాఠకుడు అర్ధం చేసుకోవాలి అంటే మనం ఆ సాహిత్యాన్ని సృజించే రూపం, భాష అత్యంత ప్రధానం. లేదా ప్రతి పాఠకుడు ఆ ఎత్తులను అందుకోవాలి. చాలామందికి సాహిత్యం కన్నా జీవితం విలువైనది. జీవనయాత్రలో అనేక పరీక్షలు యాతనలు. తప్పక ఈదాల్సిన సముద్రం జీవితం.. సాహిత్యం చదువుకుంటూ కూర్చుంటే అవ్వదు కదా! సాహిత్యం అప్పుడప్పుడూ మనిషికి అవసరపడే చేతిలో దీపం. అంతే! 

ఇవాళ సాహిత్యాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలిపే పంతుళ్ళు లేరు. సిలబస్ ఎంత త్వరగా పూర్తి చేయాలి, రిజల్ట్ ఎంత బాగా చూపించాలి అనే సవాళ్ళు తప్ప. మాతృ భాషలో చదవడం అనేది లేకపోవడం, అసలు పుస్తకాలు చదవడం అనే అలవాటు లేని యువత సోషల్ మీడియాలో చదవడానికి అలవాటు పడ్డారు. వారు అలవాటుగానో రిలాక్స్ అవడానికో వచ్చినప్పుడు మనం సంక్లిష్టంగా రాసిన రూపం ఏదైతే వుందో అది కనబడితే  అర్థం కాక వెంటనే వేరే విషయం లోకి వెళ్ళిపోతారు. ఏదో కొద్దిమంది తప్ప లోతుగా స్ఫురించే రూపాల పట్ల ఎక్కువ మంది ఆసక్తి చూపరు. అది గమనిస్తూ… మన కోసం మనం రాసుకుంటే కల్గే తృప్తి కోసం రాసుకుని అది తన సమూహంలో వుండే మనుషుల కోసం అయినా విసిరి పడేసి స్పందన రావడం లేదని విచారపడకూడదు. ప్రతి అంశం అందరికీ తెలిసి వుండదు. నిఘంటువులు పక్కన పెట్టుకుని చదివే ఓపిక ఆసక్తి అందరికీ వుండదు. అంత అవసరం కూడా అందరికీ ఉండదు. 

చెరుకు నమిలిన కొలదీ తీపి అని అర్ధమైనప్పుడే చెరుకు గడ పూర్తిగా తింటారు. కానీ అంత ఓపిక లేదే.. ఈ జనరేషన్ కి. ఓనమాలు మాత్రమే వచ్చిన వారికి శార్దూలము, మత్తేభము పరిచయం చేసినట్టు వుంటుంది కదా! కాఫ్కా  ని అందరూ అర్ధం చేసుకోలేరు. కాఫ్కా అర్ధం కాలేదని మిగతా సాహిత్యం వదిలేయరు. తమ స్థాయికి తగినవి చదవడానికి ఎన్నుకుంటారు. కాఫ్కా లాగా నేను రాస్తున్నాను మీరు ఎందుకు చదవరూ.. అర్ధం చేసుకోలేరు అని అంటే… block చేసుకుని పోతారు. గ్రహింపు శక్తి హైయిర్ డై వేసుకుంటే  నలుపు అంటుకున్నంత సహజంగా అందరికీ వుండదు. ఎవరి స్థాయి వారిది. కాలక్రమేణ ఆసక్తిని బట్టి ఉత్సాహాన్ని బట్టి అలవడతాయి. అందుకు ఆంగ్ల సాహిత్యమే ప్రామాణికం కాదు. మన సాహిత్యం కూడా చాలా గొప్పది. ఈ విషయం మనం గ్రహించాలి.  ఇకపోతే నేను సంక్షిష్టంగా రాసిన రాతలను అర్ధం చేసుకోలేను. మన్నించండి. నా పరిమితి ఇంతే! 

నేను పై కవిత సౌలభ్యం కోసం తీసుకున్నాను తప్ప.. నాకు ఆంగ్లం రాదు. గూగుల్ అనువాద సాయం తీసుకున్నాను. అంతే!  

ఇవాళ ఫేస్ బుక్ ని పక్కన పడేసి “సుందరకాండ” చదువుకుంటాను. మన భాష లోని మాధుర్యం అనుభవించడానికి. ఇదంతా చదివినందుకు ధన్యవాదాలు. 

నా మెదడు పెద్ద నిర్జన మైదానం. అంతగా అవసరం లేని పనికి రాని దరిద్రపు జ్ఞానంతో నిండి వున్నప్పుడు మంచి కవితో కథో నా అంచనాకు అందదు. అందుకోలేను. కఠినం అయిన వాటి జోలికి పోకుండా కరుణ శ్రీ  “లలిత సుగుణజాల తెలుగు బాల” చదువుకుంటాను. 

ఈ రాతతో నా సమూహం లోని  మిత్రులను ఎవరినైనా బాధ పెట్టి వుంటే వారికి ప్రేమతో ఈ గులాబీ. 🌹మీ రచనల విలువను నేను అందుకోలేని అజ్ఞానిని. మన్నించండి. మీ వాల్ మీద స్పందించలేకపోతున్నందుకు మన్నించండి. 🙏

ఇదంతా చదివినందుకు ధన్యవాదాలు 🙏

9, ఫిబ్రవరి 2026, సోమవారం

సరాగమాల






సరాగమాల  - వనజ తాతినేని. 


వసంతం ఎప్పుడంటే 

భూమి నవ్వుతూ వున్నప్పుడు 

అంది ఆమె.

కాదు వయ్యారాల పువ్వులు 

వికసించి నప్పుడు అన్నాడతను. 

వైవాహిక ఘట్టం తర్వాత 

గ్రీష్మం రసభంగం చేసింది 

వర్షం తర్వాత..  

ఆమె ఊపిరి పీల్చుకుంది.

అతని వేళ్ళ భాష ఆమెలోకి 

నిదానంగా ఇంకుతుంది.

ఆమె దేహాన అగ్ని విరబూసింది.

రసోద్దీపన సమయంలో 

మూడు ముళ్ళు స్తంభించాయి. 


©️Vanaja Tatineni 



6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

వీడియో సాహిత్యం

 ఇటీవల రెండు స్వీయ కవితలు, ఒక స్కెచ్ వీడియోగా రూపొందించాను. మీకు ఆసక్తి వున్నట్లైతే చూడండి ప్లీజ్! 






4, ఫిబ్రవరి 2026, బుధవారం

అమ్మ - చెట్లు ప్రసాదించిన జీవితం

 చెట్లు ఉసురుపోసిన (ప్రసాదించిన)  జీవితం - పెరుమాళ్ మురుగన్ 

ఈ కథ మూలం: ప్రసిద్ధి  తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ - అమ్మ. "A life bestowed by trees"  అనే శీర్షికతో కవితా మురళీధరన్ ఇంగ్లీష్ లోకి అనువదించారు. ఇంగ్లీషు నుండి తెలుగు లో అనువదించిన వారు - సునీతా రత్నాకరం 

ఒక మంచి కథను స్పూర్తికరమైన అమ్మ ను సాహితీ మిత్రులకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో

ఇప్పుడు ఈ కథను చదివి వినిపిస్తున్నది… వనజ తాతినేని 


 అమ్మ - చెట్లు ఉసురుపోసిన (ప్రసాదించిన)  జీవితం - పెరుమాళ్ మురుగన్ 


అమ్మ దగ్గర ఎప్పుడూ డబ్బులుండేవి. తన అవసరాలకి ఎప్పుడూ ఎవరిమీదా ఆధారపడేది కాదు. తన ఆరోగ్యం దెబ్బ తిన్నప్పుడు కూడా ఉన్న మేకల్ని, ఆవుల్ని అమ్మేసి ఇంట్లోనే ఉండిపోయింది. నేను నా కుటుంబంతో సహా నామక్కల్ కి మారినప్పటి నుంచి పొలంలో ఉన్న నా రెండు గదుల ఇల్లు ఖాళీగానే ఉంది. అమ్మని అందులో ఉండమన్నాం, కానీ నాకు అంత పెద్ద ఇల్లు ఎందుకని దానిని అద్దెకిచ్చేసింది. ఆ ఇంటి వెనక నా పుస్తకాలు పెట్టి ఉంచిన చిన్న అర లాంటి గది ఉంది. మట్టి పెంకులతో  కప్పు వేసిన ఆ చిన్న అర చాలు అనేది. 


నేను ఎప్పుడు డబ్బులు ఇవ్వాలని చూసినా అమ్మ అనే మాట ఒకటే 'నాకేం ఖర్చులుంటాయి?' అని.  బదులుగా నా పిల్లలు ఎప్పుడు మా ఊరు వెళ్లి వస్తున్నా తానే పదో, ఇరవయ్యో వాళ్ళ చేతిలో పెట్టేది. 


ఆ ఇంటి నుంచి వంద, నూట యాభై రూపాయల అద్దె వచ్చేది. ఆవిడ ఒక్కతే ఉన్నా ఆ కాసిన్ని డబ్బులెట్ల సరిపోతాయ్? అందుకే నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా కూరగాయలు, సరుకులు తీసుకెళ్ళేవాణ్ణి. 'ఇవన్నీ నాకెందుకు? నేనేం చేసుకుంటాను? నువ్వు డబ్బులన్నీ దుబారా చేస్తావేం? నాకేమైనా అవసరం వుంటే నేనే అడుగుతాను కదా' అని నన్ను కోప్పడేది. అప్పట్నుంచీ అమ్మకేం కావాలో ముందే అడిగి తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నా. అమ్మా నీ ఖర్చులన్నీ ఎట్లా గడుస్తున్నాయ్  అని నేను ఆమెనడిగితే ఇంటి బయట చుట్టూ ఉన్న చెట్లని చూపించి, 'అవి ఇస్తాయి' అని చెప్పేది. మా అమ్మకి ఆ కొన్ని చెట్ల నుంచి వచ్చే ఆదాయం సరిపోయేది. 


పెళ్ళికి ముందు మా అమ్మకి పొలం పనులు ఏమీ తెలియవు, ఒకసారి నేర్చుకున్నాక ఆమె మొక్కని పెంచడం కూడా ఒక అందంతో చేసేది. అమ్మ అంట్లు తోమే జాలారు దగ్గర్లో ఒక మిరపచెట్టుని  ఎప్పుడూ పెంచేది. ఏడాది పొడుగూతా ఆమెక్కావాల్సిన మిరపకాయలు ఆ చెట్టే ఇచ్చేది. రెండు మూడేళ్లు వుండేది. ఆకుపచ్చటి గొడుగులాగా చూడటానికి కూడా కంటికింపుగా వుండేది. కొన్ని కాయలు పచ్చిగా కోసుకునేది, కొన్నిటిని చెట్టుమీదే పండనిచ్చి ఎండబెట్టేది. పది రోజులకోసారి పొరియల్ చెయ్యడానికి ఒకట్రెండు కలేపళ్ళ మొక్కలు సరిపొయ్యేవి. అమ్మ ప్రకృతిని ఉపయోగించుకునే పద్ధతి భలే ముచ్చటగా వుండేది. 


నామక్కళ్ లో మేముండే ఇంట్లో కూడా అమ్మ చెట్లు పెంచింది. ఒక ములగ చెట్టు, ఓ కరివేపాకు చెట్టు బయటి గోడ పక్కనే వేసి, డాబా ఎక్కితే వాటిని కోసుకొనేంత పెరిగేదాకా పెంచింది. మా ఇంటిముందు నాటిన గోరింటాకు మొక్క ఇప్పుడు పెద్ద పెద్ద కొమ్మలతో గోడంతా కమ్మేసింది. వాకిలి మొత్తం నింపేసే ఆ గోరింట వాసన తగిలినప్పుడల్లా అమ్మ, అమ్మతోపాటే ఆమె ఆ చెట్లను జాగ్రత్తగా పెంచుకున్న జ్ఞాపకం నాలో నిండిపోయేది.  


అమ్మ మా ఊళ్ళో పెంచిన చెట్ల ముచ్చట ఇంకా పెద్దది. ఇంట్లో, పొలంలో ఎన్నో చెట్లు పెట్టింది. ఒక్కో కరివేపాకు చెట్టు, మునగ చెట్టు, నిమ్మచెట్టు, జామచెట్టు, ఉసిరిచెట్టు, రెండేసి మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, దానిమ్మ, చింత చెట్లుండేవి. మొత్తం పదమూడు చెట్లు - మాకంత  గుర్తు. 


మా చింత చెట్లు ఓ మాదిరివి, చింతకాయలు పండి ఎండిపొయ్యాక కూడా వాటంతట అవి రాలేవు కావు, కర్రతో కొట్టి దులుపుకోవడమే. మా అమ్మ ఆ చింత పండు ని  'నరం చింత' అనేది, నరాల్లాగా చెట్టుకి అతుక్కుని ఒక పట్టాన రాలవని. ఒక్కో ఎండిన చింతకాయని జాగ్రత్తగా  రాల్చి, గింజ తీసేసి దాచేది. తనకోసం కొంత పక్కన పెట్టుకుని మా అన్నకూ, నాకు ఏడాదికి సరిపడా చింతపండు ఇచ్చేది. చింత చెట్టు పంటని ఎప్పుడూ అమ్మింది లేదు, మిగిలిన పదకొండు చెట్ల నుంచి వచ్చిందే అమ్మ ఆదాయం. 


మా చుట్టుపక్కల పెద్దగా కరివేపాకు చెట్లు ఉండేవి కావు, నీటి ఎద్దడితో పెంచడం కష్టమని ఎవరూ వేసేవాళ్ళు కాదు. మా దగ్గర కరివేపాకు ఎంత  అబ్బురంగా ఉండేదంటే ఎవరింట్లో అన్నా ఒక్కళ్ళే బిడ్డలు వుంటే వాళ్ళని లేత కరివేపాకు మొక్కతో పోల్చేవాళ్ళు. మా అమ్మ కరివేపాకు చెట్టు మొదట్లో ఓ కుండ పెట్టేది. పంపులో నీళ్లు వచ్చినప్పుడల్లా ఆ కుండ నింపి పెట్టేది. మేము కాళ్ళు, చేతులు అక్కడే కడిగేవాళ్ళం కాబట్టి ఆ చెట్టుకి వేరే నీళ్లు పొసే పనిలేదు. కొబ్బరి చెట్ల దగ్గరా అట్లాగే రెండు కుండలు పెట్టింది. అంట్లు అక్కడ కడిగేది  మళ్ళీ నీళ్లు పోసేపని లేకుండా. జామ, ఉసిరి చెట్లు అమ్మ వుండే చిన్న గది ముందే వుండి కావలసినంత నీడ ఇచ్చేవి ఇల్లూ, వాకిలికి, వాటికి మాత్రం అప్పుడప్పుడూ కాసిన్ని నీళ్లు పోస్తే సరిపొయ్యేది. 


దానిమ్మ చెట్లు ఇంటికీ రోడ్డుకి మధ్య ఉన్న కాలిబాటలో వుండేవి. నా భార్య ఈ దానిమ్మ గింజలు మొలకెత్తించి ఒక పాలిథిన్ సంచీలో పట్టుకెళ్లి అక్కడ నాటింది. ఆ చెట్టు బాగానే ఎదిగి పూలు, పిందెలు వచ్చేవి. పిందెలు కాస్తా కనపడగానే ఎక్కడినుంచో పురుగులొచ్చి వాటిని పాడు చేసేవి. అమ్మ ఆ పిందెల మీద బూడిద చల్లి పురుగుల్ని చంపాలని చూసేది కానీ, ఆ బూడిదని  అవి మంచిగ అరాయించుకునేవి. 


ఒకసారి అమ్మ ఇంటి చుట్టుపక్కల కనపడ్డ పాలిథిన్ సంచీలు పోగు చేసి ఆ దానిమ్మ కాయల చుట్టూరా జాగ్రత్తగా చుట్టి దారంతో కట్టేసింది. పురుగులు ఈ సంచీల్ని ఏమీ చేయలేకపోయాయి, అట్లా అమ్మకి అవి క్రిమి సంహారకాలుగా ఉపయోగపడ్డాయి. అప్పట్నుంచి అమ్మ ఆ చెట్టుమీద ఒక కన్ను వేసి ఉంచేది, కాయ కనపడగానే చిటుక్కున పాలిథిన్ సంచీ కట్టేది పురుగు దాన్ని చూసేలోపు. మా దానిమ్మ చెట్టుమీద పాలిథిన్ సంచీలు పెరుగుతున్నట్లు వుండేది అదాటున చూస్తే. అప్పుడప్పుడూ జాగ్రత్తగా ఆ సంచీలు విప్పి కాసేపు కాయకు గాలి తగలనిచ్చి మళ్ళీ కట్టేసేది. ఆ కాయ పూర్తిగా పండి సుళువుగా తెంపగలిగినప్పుడే వాటిని తెంపేది చెట్టుకి దెబ్బ తగలకుండా. మా పాలు పళ్ళు మేము తిన్నాక మిగిలినవి అమ్మితే బాగానే డబ్బు వచ్చేది వాటిమీద.  


అప్పుడప్పుడూ వచ్చే వానలు గోరింటాకు చెట్టునీ, మునగ చెట్టునీ పోషించేవి. గోరింటాకుని ప్రత్యేకం కొనేవాళ్ళు ఉండరు, అందుకే వేరేవి ఏమైనా కొంటున్నప్పుడు వాళ్ళు గోరింటాకు తెంపుకోవచ్చు. మునగచెట్టు మాత్రం ఏడాది పొడుగునా ఏదోకటి ఇచ్చేది. మునగాకు ఎప్పుడూ వుండేది, కాలంలో మునక్కాయలు కాసేవి. మునగచెట్టు మహా పెళుసు, అందుకే ఆ చెట్టుని ఎవ్వరినీ పట్టుకొనిచ్చేది కాదు, అమ్మే చులాగ్గా చెట్టు కందకుండా ములక్కాయలు కోసే విద్య నేర్చుకుంది. ఎప్పుడైనా గాలి విసురుకి ఓ కొమ్మ విరిగిపోతే చెయ్యి విరిగినంత పనయ్యేది అమ్మకి. మునగచెట్టుకి పసిపిల్లలంత సుకుమారపు అవసరాలుండేవి, అమ్మ ఆ చెట్టుని అంత సుకుమారంగానే చూసుకునేది. మా మావిడిచెట్లు ఇంటి నుంచి కాస్త దూరంగా పొలంలో వుండేవి. ఆ రెండు చెట్లకి పైపుతో నీళ్లు పెట్టేది. చెట్లనుంచి వచ్చే వస్తువేదీ అమ్మ వృధా పోనిచ్చేది కాదు. అమ్మ బజారుకి ఎప్పుడూ ఉత్త చేతులతో బయలుదేరేది కాదు, రెండు మూడు కట్టల కరివేపాకు, మునగాకో, ఏ కూరగాయలో సంచీలో వేసుకునేది. దారిలో ఉన్న ఇళ్లలో వాటి అమ్మకం అయిపోయేది. చుట్టుపక్కల పిల్లలు జామకాయలు, ఉసిరికాయల కోసం వచ్చేవాళ్ళు, అవి అమ్మకి అందే ఎత్తులో వుండవు కాబట్టి ఆ పిల్లల్ని కోసుకోనిచ్చి వాళ్ళిచ్చిన డబ్బు తీసుకునేది. మామిడిపళ్ళ కాలం వస్తే  మాత్రం పొద్దంతా ఆ చెట్లకి మా అమ్మ కావిలి వుండేది. ఆ చెట్ల దరిదాపుల్లో ఒక నీడ తచ్చాడినా 'ఎవరక్కడ?' అని అరుస్తుండేది. 


మా ఇంటికెప్పుడైనా వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఉన్న మునగాకో, మునక్కాయలో తప్పకుండా కోసుకుని సంచీలో వేసుకునేది, వెళుతూ వెళుతూ వాటిని అమ్మేసి సంచీ ఖాళీ చేసుకునేది, ఎక్కడా వస్తువు దుబారా కావద్దు అమ్మ లెక్కలో. 


అమ్మ కంటపడకుండా ఒక్క పసి పిందె అయినా తప్పించుకునే ప్రసక్తి లేదు. ఇంక  మామిడిపళ్ళ కాలంలో అయితే మేము ఎంత బతిమిలాడినా ఊరునుంచి కదిలేది కాదు. తప్పక రావాల్సిన పరిస్థితి వస్తే సాయంత్రంగా వచ్చి మళ్ళీ పొద్దున్నే ఇంటికి చేరేది. మేము కనుక వేసవిలో ఊరికి వెళితే వెంటనే చెట్ల దగ్గరికెళ్లి రెండు పండిన కాయలు తెంపుకొచ్చేది. ఆ పళ్ళు మా చేతికిస్తూ 'మీరొస్తున్నారని చెట్టుమీదే వుండనిచ్చా' అని చెప్పేది ఎక్కువ రోజులు ఉండనిచ్చినందుకు చెట్టు తనకేదో అనుమతి ఇవ్వాలన్నట్టు. మాకు ఎప్పుడూ బాగా మగ్గిన జామకాయలు, చక్కగా పండిన ఉసిరికాయలు దొరికేవి. అమ్మకి ఆ చెట్ల అణువణువూ తెలుసు. 


మామిడిపళ్ళ కాలంలో అమ్మ ఆదాయం బాగా వుండేది. కొబ్బరికాయలు కూడా అమ్మేది. అమ్మకి ఎంత ఆదాయం వచ్చేది ఇవన్నీ అమ్మితే? మహా అయితే కొన్ని వందలు. మూడొందల రూపాయలు మహా బాగా సరిపోతాయి అనేది, ఇంకా కొంత డబ్బు దాచేది కూడా. నా అంచనా అయితే ఇంటద్దెతో కలిపి ఒక అయిదొందలు వస్తాయి నెలకి. అందులోనే బియ్యం, ఉప్పులు, పప్పులు, కూరలు గడిపేది అమ్మ. 


నాకు మంచి జీతం వచ్చే గవర్నమెంటు ఉద్యోగమని అమ్మకి తెలుసు. అమ్మ అవసరాలు నేను చూసుకోగలననే నమ్మకం, తాను ఒప్పుకుంటే చూసుకుంటాననే  గర్వం ఉన్నాయి ఆమెకు. అప్పట్లో మా ఊళ్ళో ముసలివాళ్లైన తల్లిదండ్రుల్ని తిండికి కూడా సరిగా లేకుండా తిప్పలుపెట్టిన పిల్లల కథలేమీ తక్కువలేవు. మన దగ్గర పిల్లలు కావాలనుకునేదే ముసలితనంలో ఆసరాగా ఉంటారని. చిన్నప్పటినుంచీ 'పెద్దయ్యాక మీ అమ్మా నాన్నల్ని చూసుకోవా?' అన్న మాటల్ని నూరిపోస్తూనే వుంటారు. అయినా తల్లిదండ్రుల్ని గాలికి వదిలేసే పిల్లలు వుంటూనే  ఉన్నారు. అమ్మకీ మొదట్లో ఈ భయం వుండేది, కానీ నా చేతలతో ఆమెకి గట్టి నమ్మకం కలిగింది తనకా గతి పట్టదని. 


ఎవరైనా అమ్మని నిన్ను వాడు చూసుకుంటాడా అని అడిగితే, 'వాడెప్పుడైనా నేను అడిగింది ఇవ్వనన్నాడా? కట్టలకొద్దీ నోట్లు ఇవ్వబోతాడు, నేనే వద్దంటాను. నన్ను చూడటానికి ఎప్పుడైనా ఉత్త చేతులతో వస్తాడా? సంచీల నిండా ఏవొకటి నింపుకువస్తాడు. ఇక్కడేమైనా పిల్లలున్నారా అవి తినడానికి? అందుకే వాడిని అవేవీ తేవద్దంటాను. నా ఒక్కదానికి గడవడానికి ఈ చెట్లు చాలవా?' అంటుంది. 


అమ్మకి పార్కిన్సన్స్ జబ్బు చేశాక ఎనిమిదేళ్లు బతికింది. ఆమె ఇష్టం మీద హోమియోపతీ మందులు వాడినా, అల్లోపతీ మందు కూడా వేసుకునేది. రోజుకో మాత్ర, అది ఖరీదైనదే. ఎక్కువ ధర అని తెలిస్తే వాటిని వద్దంటుందన్న భయానికి నేను అవి చవకేనని చెప్పా. ప్రతీ నెలా మర్చిపోకుండా ఆ మాత్రలు కొనిచ్చేవాణ్ణి. ఊళ్ళో ఎవరైనా 'నువ్వు నీ కొడుకుని చదివించావ్, వాడు నిన్ను సరిగ్గా చూసుకుంటున్నాడా?'అని అడిగితే అమ్మ 'మీకు కళ్ళు కనబడట్లేదా, నెలనెలా ఎన్నెన్ని మాత్రలు తెచ్చి పోస్తున్నాడు? వాటికీ ఎంత ఖర్చవుతుందో ఎప్పుడైనా చెప్పాడా? అవి వెయ్యో రెండువేలో నీకేమైనా తెలుసా?' అని పోట్లాడేది. 


ఆ చెట్లు అమ్మకి ఆదాయం ఇవ్వడమే కాక ఇంకో పెద్ద మేలు చేసాయి. 


నేనెప్పుడూ ఊరికి వెళ్లినా అమ్మ ఏ చెట్టు కిందో కూర్చొనో, నిలబడో వుండేది. మా ఇల్లు పొలాల్లో వుండటంచేత ఒంటరిగా వుండేది. మిగిలిన ఇళ్ళు కూతవేటు దూరంలో వుండేవి కానీ, యింటి ముందు అటూ ఇటూ జనాలు తిరిగేవాళ్లు కాదు. ఎప్పుడైనా జనాలు ఇటు వచ్చినా ఒకట్రెండు మాటలంతసేపు కనపడేవాళ్లు. ఎవరి పని వాళ్ళకుండేది. అమ్మకి చెట్లతోనే సావాసం. వాటితో మాట్లాడేది. వాటితో పాటు అమ్మ ఒక చెట్టు, అట్లా కలిసిపోయేది. వాటిలో వచ్చే చిన్న మార్పైనా అమ్మ పసిగట్టేది. ఏ చెట్టు మీద ఎన్ని పిందెలున్నాయి, ఎన్ని పండ్లున్నాయి, ఎన్ని కాయలున్నాయి, అవి ఎన్నాళ్ళలో పండుతాయి, అన్నీ అమ్మకి తెలుసు. ఏ పనిలో ఉన్నా వాటివైపు ఓ చెవి వేసి వుంచేది. అమ్మకు కొన్నేళ్లు ఎక్కువ ఆయుష్షు పోసింది ఖాయంగా ఆ చెట్లే. 


రెండేళ్లపాటు వర్షాలు లేవు మా ప్రాంతంలో. బోరింగులో నీళ్లు అడుగంటిపోయాయి. ఆ చెట్లని కాపాడానికి అమ్మ ఎన్నో తిప్పలు పడ్డది. పార్కిన్సన్స్ వల్ల కాళ్లు చేతులు సరిగ్గా చాపగలిగేది కాదు, బరువులు పట్టుకునే శక్తి వుండేది కాదు. ఇంటి దగ్గర ఉన్న చెట్లకి పెద్ద బాధ లేదు కానీ మామిడి చెట్లు వడలిపోవడం మొదలైంది. వాటిని కాపాడుకోవాలని అమ్మకు ఎంత ప్రాణంగా ఉండేదంటే పిల్లలు ఆడుకునే రెండు గురుగుముంతలు కొనుక్కొచ్చింది. వాటిలో నీళ్లు నింపుకుని ఆ చెట్ల దగ్గరికి బయల్దేరేది. ఆ కాస్త దూరానికి ఒకటిరెండుసార్లు మధ్యలో ఆగి ఊపిరి పీల్చుకుంటేగానీ నడవగలిగేది కాదు. అట్లా ప్రతీరోజూ కాసిన్ని నీళ్ళని పోసి ఆ చెట్లని మళ్ళీ జీవం పుంజుకునేలా చేసింది.  


మేము అమ్మని చూసేందుకు వెళ్ళినప్పుడు ఆమె అడిగేది ఒక్కటే 'ఆ మామిడి చెట్లకి ఒక కుండెడు నీళ్లు పోసిపొమ్మని'. అమ్మ దగ్గరికి ఏదైనా కొనడానికి వచ్చినవాళ్ళనీ ఆ మాటే అడిగేది. రెండేళ్లపాటు ఆ మామిడిచెట్లు పూత పుయ్యలేదు. కానీ అమ్మ పంతంతో బతికించింది. మూడో ఏడాది కొంచెం వర్షాలు పడ్డాయి, మామిడిచెట్లు మళ్ళీ పూత పూసి కాయలు కాసాయి, అమ్మ సంబరానికి అంతులేదు. 


అమ్మ చివరి యేడాది  భారంగా గడిచింది. ఆవిడ ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో మా ఇంటికి తీసుకువచ్చాం. ఊర్నుంచి అమ్మని చూడటానికి ఎవరైనా వస్తే ముందు చెట్ల గురించే వాకబు చేసేది. మేము కూడా ఊరికి వెళ్ళినప్పుడల్లా తప్పనిసరిగా నీళ్లు పోయడం అలవాటు చేసుకున్నాం. ఎప్పుడైనా అమ్మ ఆరోగ్యం కాస్త మెరుగైతే తనను బస్సు ఎక్కించేదాకా ఊరుకునేది కాదు. ఆ చెట్లకి ఆ గురిగిముంతలతో నీళ్లు పోస్తూ కనీసం వారమన్నా అక్కడ వుండేది. ఆ చెట్లని చూసుకోవడానికి ఎవరూ లేరని అమ్మ చాలా దిగులుపడేది. 


అమ్మ చివరి ఆరు నెలల్లో మా ఊరికి వెళ్లలేకపోయింది. మేము వెళ్ళినప్పుడల్లా ఆ చెట్లకి నీళ్లు పోస్తూనే ఉన్నాం. మేం చెయ్యగలిగింది అంతే. పాతిక మైళ్ళ దూరంలో ఉన్న చెట్లకి నెలకోసారికన్నా ఎక్కువ వెళ్లి నీళ్లు పొయ్యలేకపోయాం. అమ్మ కడతేరి పోయాక కొన్ని నెలలపాటు మా ఊరికి వెళ్లలేకపోయాం. అమ్మ వస్తువులు తీసుకురావడానికి నేను వెళ్ళినప్పుడు ఆ మామిడి చెట్లని ఒకసారి  చూడాలనుకున్నాను. చెప్పడానికేముంది? రెండు చెట్లూ ఎండిపోయి మొద్దుల్లా నిలబడ్డాయి. అనాధ పిల్లల్లా! 


---------------- సేకరణ*************** ఈ కథ పోస్ట్ చేయడం పై అభ్యంతరం వుంటే లేదా copy right వుంటే గనుక తెలియజేయండి. తొలగించగలను. మంచి కథను పాఠకులకు అందించడమే నా ఉద్దేశ్యం అని మనవి చేస్తూ..


ఈ కథ  చదువుతూ వుంటే.. ఆవిడ.. ఒక దృఢమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మ  అనిపించింది, చాలా మంది అమ్మల్లాగే వుంది కూడా!  విజయవంతమైన  అనేదానికన్నా ఆటుపోట్లు తట్టుకునే నిబ్బరం ఉన్న ప్రతి స్త్రీ పురుషుల వెనుక గట్టిగా నిలబడ్డ అమ్మ  మాత్రం కచ్చితంగా వుంటుందని అనిపిస్తుంది.  అమ్మ కు 🙏