3, మే 2015, ఆదివారం

బంగారు ఉదయం

నిదుర మంచం వదులుతూ దేవునికి కృతజ్ఞత చెప్పుకుంటాను .


తండ్రీ !


నాకు మరొకరోజు ఆయువునిచ్చి


జీవితాన్ని ఆస్వాదించే వరం ఇచ్చినందుకు


అలాగే పోరాడే శక్తిని కూడా ఇవ్వు తండ్రీ !





ఉత్థానపతనాలు  ఆరోహణా అవరోహణాలు


జయాపజయాలు వెలుగు నీడలు


పేరుకి ఏదైతేనేం అవన్నీ సహజాతాలు అని నమ్మినదాన్ని 


పిడికెడు మెతుకుల లేమితోనూ ప్రేమ రాహిత్యం తోనో 


చచ్చే దౌర్భాల్యం లేనిదాన్ని



తప్పు చేసినది ఒకరైతే శిక్ష నేననుభవిస్తూన్నదానిని


నడక పై నడతపై ఆలోచనలపై ఆర్ధిక స్థితిగతులపై


నిత్యం నిఘా వేసి  పొల్లు కబుర్లుతో


అనుచిత వ్యాఖ్యానాలు చేస్తుంన్నందుకు చస్తూనయినా


బ్రతికే వరం ఉన్నందుకు గర్వ పడుతూన్నదానిని  


మనుషులని ఆస్తుల లెక్కన చూడటం కాక


విలువల లెక్కన ప్రేమల లెక్కన


చూడటానికి అలవాటు పడిన దాన్ని 




మానధనం కన్నా అభిమానధనం కన్నా


వారసత్వ ఆస్తులు గొప్పవేమి కాదని నమ్మినదాన్ని  


 ఆస్తులకి కుక్కల లెక్కన కాపలా కాయడమే అసలైన వారసత్వం కాదని


ధిక్కారస్వరంతో తల ఎగరేస్తున్న దాన్ని


అరొకొరో మిగిలినఆస్తులని అమ్ముకోవడమే తప్ప


వేరొకటి అమ్ముకోలేని అసహాయురాలిని



ఎవరైతే దాడి చేస్తారో వారినే నా వారిగా ఆహ్వానించి


ముందు వరుసలో కూర్చోబెట్టే దౌర్భాగ్యాన్ని


 నాకెందుకిచ్చావని వగస్తున్న దానిని 


పైకగుపించని హింసని,ధ్వంసని  


సుతిమెత్తని రంపపుకోతలా అనుభవిస్తూ 


పొగిలి పొగిలి ఏడుస్తూనే... నవ్వుతూ 


నాకిచ్చిన రోజుని దీరోదాత్తంగా  ముగించాననుకుంటూ


వేదనగా ఒత్తిగిల్లుతూంటాను..తండ్రీ ! ప్రతి రోజు 


నీవిచ్చే ... ఓ  బంగారు ఉదయపు సాక్షాత్కారం కోసం.   


     



23, ఏప్రిల్ 2015, గురువారం

కథా ఉత్సవం

   సాహితీ మిత్రులకి, బ్లాగ్ మిత్రులందరికీ , కథని  ప్రేమించే అందరికి ..హృదయపూర్వక ఆహ్వానం .

"ప్రాతినిధ్య " ముచ్చటగా మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టింది . 24 కథలతో మన ముందుకు రాబోతుంది . ఆ కథా ఉత్సవాన్ని మిత్రులందరితో కలసి జరుపుకోవాలనుకుంటుంది. మీరందరూ కూడా .. ఈ ఉత్సవానికి హాజరవుతారని  మనసారా కాంక్షిస్తూ ...  వివరాలు ఇదిగోండి ... ఆ వేదికపై  తప్పకుండా కలుసుకుందాం . కథ ని పరిపుష్టం చేద్దాం .





18, ఏప్రిల్ 2015, శనివారం

నాల్గింట మగనాలి







నాల్గింట మగనాలి

గడప లోపల హింస
గడప బయట ద్వంస
రచించే జ్ఞానపీఠాలు వాళ్ళు
కౌగిళ్ళకారాగారాలు
మోటుసరసాల ధర్డ్ డిగ్రీలు
తప్పని సరి శిక్షలు
అంతెందుకూ  కట్టు బానిసవీ
వారసులని కనే ఖార్ఖానావీ
జన్మాంత ఖైదీవీ కూడా నువ్వే !
ఆడపిల్లని అరణంగా రాసిచ్చిన మానవజాతికి
అమ్మవి నువ్వే బొమ్మవి నువ్వే !

********************

మేడమ్, జీ , సోదరీ , అమ్మా  అంటూ
 గౌరవం ఒలికిస్తూనే
వంకర ఆలోచనలు చేస్తూ ఉంటాడు
దేవతలా పూజించాలంటూనే
అవయవాల కొలతలతో
అంచనా వేస్తాడు
నాతిచరామి అంటూనే
నరకలోకాన్ని సృష్టిస్తాడు
సహభాగంగా గుర్తిస్తే చాలనుకుంటే
తోటి మనిషిగా గుర్తించడానికే
వెన్నుజూపుతాడు.
వాడినని ఏం లాభం ?
***********************


వేడికోళ్ళతో త్యాగనిరతులతో
నిన్ను కీర్తిస్తే కరిగి వరదై కరుణ జూపే
తాయివి నువ్వు.
తనువంతా కరిగించి మనసంతా కుదించి
ఓ పాత్ర లో ఒదిగేస్తావ్
వీడ్కోలు యాత్రలో నీ పై దండలై పూసేది ఈ త్యాగాలే
నీ జన్మ చరితార్ధం చేసిన గాధలని
తామ్రపత్ర లేఖలపై భద్ర పరిచి
యుగయుగాలు పాఠాలు బోధిస్తారు
స్త్రీ జాతి మణిరత్నంగా కీరిస్తారు

*********************
ఆకాశాన సగం మనం
అయినా మనల్నిఆణిచేసేది నిజం
ఆబల లంటూ అల్పంగా చూస్తే
అసహనం అంచులు దాటితే
ఉగ్ర కాళికనై ఉరుములు కురిపిస్తా
రుద్రభూమిలో రుధిరం తాగేస్తా
వేయి తలల ఆదిశేషు నై
 విలువల వ్యాకరణం నేర్పిస్తా
నీ ధీరత్వం వీరత్వం అన్నీ
కూకటి వేళ్ళతో పెకిలిస్తా