11, జనవరి 2011, మంగళవారం

లవ్ మానియా

                                

ఇక్కడ ప్రేమ అమ్మబడును..!?
ఇప్పుడు జీవితం కన్నా,జీవనం కన్నా
చదువుకన్నా,సంస్కారం కన్నా
 ప్రేమ అవసరమైన వస్తువని..కనుగొన్నారు..

అమ్మ స్పర్శలో,నాన్న మందలింపులో
బామ్మ గోరు ముద్దలో,తాత బుజ్జగింపులో దొరకని ప్రేమ
మాట పంచుకోవటానికి లేని తనంలో
లేమితనం నుండి బయటపడటానికో
వెంటాడి వేధించే అభద్రతాభావం నుండో
మేల్కొన్న ప్రేమ
తెర సాక్షిగా..
పలకల  మీద ప్రేమ లేఖలలో..ప్రత్యక్షం.
ఎదిగి ఎదగని ఆలోచనలతనంలో..
ఉత్ప్రేరకం ప్రేమ..ఉద్రేకం ప్రేమ.

ఆ ముసుగులో, తొడుగుల రక్షణలో (కండోమ్స్)..
జీవితంలో చిరునవ్వులు  సాక్షిగా..(ఐ.పిల్)
ఇప్పుడు వాంచల పర్వం అంతా ...
బహిరంగ రహస్యమే మరి.
విచ్చుకునే ప్రేమని ,విచ్చు కత్తి అయిన ప్రేమని .
ఆహ్వనిచడం  తప్పదు..

అసంతృప్తుల కాష్టంలో రగిలే  సహచరికికి
సానుభూతి శీతల పవనం కోసం
నిరంతర ప్రేమాన్వేషణ.
దోరుకునో-లేదో?
అది ప్రేమో!కాదో?
శరీరాల పట్ల ఆసక్తికో
వస్తువుల పట్ల ఆకర్షణకో..
భావసామీప్య సహజాతావరణానికో..
తలొగ్గిన సిగ్గుకి లోపాల్నిపూరించే ప్రేమని
కొనుక్కోక తప్పదు మరి..

జీవన చరమాంకంలో..
సహచరులను కోల్పోయినవారికి
అలసిన కాయాలకి..
అంతస్తులతో కొలిచి..
ధనం విలువతో తూచి చూసే
రక్త సంబంధం కన్నా..
మానవత్వం నిండిన
చిరు ఆత్మీయ స్పర్శే మిన్న అని...
ఆఖరి చిరునామా ఆయిన
ఆశ్రమాల లోనే లభ్యం.
అంతా....ప్రేమ లోకమే..!
ఆయినా అందరికి.. అందని ద్రాక్ష ప్రేమ.

ఇప్పుడు   ప్రపంచం అంతా ..
లవ్  మానియా తొ.. అతలాకుతలం అవుతూ..
ప్రేమ ప్రేమ అని కలవరిస్తుంది..
పుట్టిన బిడ్డ కూడా
క్యార్ క్యార్ బదులు..
ప్రేమ ప్రేమ అంటుంది.   

1 కామెంట్‌:

మెర్సీ మార్గరెట్ చెప్పారు...

mee kavithalu .. mee vyakyanalu chala bagunnayandi .. i appriciate your work and ur poetry