31, ఆగస్టు 2012, శుక్రవారం

రంగు రంగుల సీతాకోక చిలుకలు


చిరుగాలి తన కదలికల్ని..కొమ్మలు ఊపుతూ తెలుపుతుంది.
ఓ..గండు చీమ క్షణం తీరిక లేకుండా తిరుగుతుంది..
పచ్చని సీతాకోక చిలుక అరక్షణంలో తోటంతా తిరిగేసింది.
వీటిని చూస్తూ..నేనే పని పాట లేకుండా కూర్చుని ఉన్నాను...

నాగరిక జీవనంలో ప్రకృతితో మమేకం అయిన సందర్భాలు అరుదుగా ఉంటాయి.అలాంటి సందర్భాలు నాకు ఆయాచితంగా లభించడం ఓ..వరం. అందునా రంగు రంగుల సీతాకోక చిలుకని చూడడటం..

ఏం చేయాలో తోచడం లేదు బోర్ కొడుతుంది..అని అనడం వింటూ ఉంటాం. నాకు బోర్ కొట్టడం అనే పదానికే అర్ధం తెలియదు.ఎందుకంటే ...

భానుని తొలి కిరణాలు భూమిని తాకక ముందే .. నా దిన చర్య ప్రారంభం అవుతుంది.

అబ్బ.. ఇంకొంచెంసేపు పడుకుంటే బావుండును అనుకునే ఛాన్స్ అసలు ఉండదు కాబట్టి లేచి లేవడంతో పాటే వాకిలి శుభ్రంజేసుకుని ముగ్గుపెట్టి... దంత ధావనం చేసుకుంటూ.. ఏ మొక్క కొత్త చివురులు తొడి గిందా .. ఏ కొమ్మకి మొగ్గ పుట్టిందా అని చూసుకుని.. ఆనందించడం ఇష్టమైన పని.

దినపత్రికని చేతిలోకి తీసుకుని ... మళ్ళీ గదిలోకి అడుగుపెట్టి.. చీకటిని పారద్రోలే పరదాలను ప్రక్కకు నెట్టి..కిటికీ తలుపుల్ని తెరచి.. చల్లని పైర గాలులని ఆహ్వానిస్తాను.

మా ఇంటి అదృష్టం ఏమిటంటే.. ఇంటి వెనుక భాగమంతా.. ఒకటి రెండు ఇల్లు తప్ప అంతా తోట భాగమే!రకర కాల ఫల వృక్షాలు, పూల మొక్కలు.

ఆ తోట అనేక పక్షుల కి ఆనవాలం. కోయిల పిలుపులు, పక్షుల కిచ కిచలు, బుల్లి పిట్టల తుర్రు మనే సవ్వడులు.. అంతా కనువిందు మయమే!

కిటికీ ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటూ..దూరంగా వినబడుతున్న టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో జనరేటర్ సౌండ్ తో పాటు పక్షుల కిచ కిచలు వింటూ.. కూర్చునే ఆ స్థలం నా అభిమాన స్థలం అయిపొయింది.కొంచెం ఖాళీగా ఉన్నానంటే చాలు అక్కడికి వెళ్లి కూర్చుండి పోతాను.

తోట ప్రక్కనే ఉన్న ఓ..కార్పోరేట్ స్కూల్ లో నుండి వినిపించే ప్రార్ధనా గీతం, ప్రతిజ్ఞ, కొన్ని పాఠాలు వినబడుతూ ఉంటాయి.

అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తెరచిన కిటికీ తలుపుల్లో నుండి నిత్యం ఒక గంటన్నరసేపు అయినా ఆస్వాదిస్తాను.

ప్రహరీ గోడని ఆనుకుని మొలిచిన మొక్కలు పెరిగి పెద్దవి అయి..గోడలు నేర్రులిస్తాయని వాటిని మొదలంటా నరికేసినా.. ఎక్కడనుండో..మళ్ళీ మొలిచి.. వాటి లేత పచ్చ ప్రాణాల ఉనికిని తెలుపుతూ తలలు ఊపుతూ మనిషి స్వార్ధాన్నినిరసిస్తున్నట్లు ఉంటాయి.

ఇక తోట కి ప్రత్యేకం.. రంగు రంగుల సీతాకోక చిలుకలు. తోటంతా క్షణం తీరికలేనట్లు తిరుగుతుంటాయి. కను మూసి తెరిచేలోగా చక్కర్లు కొట్టుకుంటూ.. మనిషి చపల చిత్తంకి మేము ప్రతీక అన్నట్లు ఉంటాయి.
ప్రతి రోజు నేను ఎంతో ఇష్టంగా చూసే వ్యాపకం. పసుపు పచ్చని చిన్ని చిన్ని సీతాకోక చిలుకలు ఎంత ఆహ్లాదంగా ఉంటాయో..!!

కెమెరా కన్నుకి చిక్కడానికి కూడా వాటికి ఇష్టం లేనట్లు తిరుగుతుంటాయి. నెలల తరబడి ప్రయత్నం చేస్తే కానీ కొన్ని ఫోటోలు తీయడం సాధ్యం అయింది.

అలసిన మనసులకి సేదదీర్చే శక్తి పరిసరాలకి ఎంతో ఉంటుంది. అలా ప్రాతఃకాలంలో ఆహ్లాదంగా , నిశ్శబ్ద సమయాలని.. ఆస్వాదించడం జీవితంలో ఒక భాగం అయిపొయింది.

సీతాకోక చిలుకల అందం మీరు చూసేయండి..








రంగు రంగుల సీతాకోక చిలుక ..పాట వినేయండి.

29, ఆగస్టు 2012, బుధవారం

నా చెలిమి కలిమి

ఓ. పదమూడు రోజుల క్రితం .. ఓ.. బ్లాగర్ నెచ్చెలి .. మా ఇంటికి వస్తానని చెప్పారు.
ఆమెని కలవబోతున్నానని సంతోషం ఒక ప్రక్క, ఆమె వస్తే సరిగా అతిధి మర్యాదలు చేయగలనో లేదో..అన్న బెంగ కొంత.

 నూటమూడు టెంపరేచర్ పెట్టుకుని మరీ ఎదురుచూసిన కొలది నిరాశే మిగిలింది.
ప్చ్.. ఏదో ఇబ్బంది ఏర్పడి ఉంటుంది.. అందుకే వాళ్ళు రాలేదు  అనుకున్నాను.  సాయంత్రం హాస్పిటల్కి వెళ్లాను. ఇక అక్కడ నుండి మొదలయింది నా అనారోగ్య పర్వం.

విపరీతమైన జ్వరం,తలనొప్పి..ఆ జ్వరాన్ని కంట్రోల్ చేయడానికి ఇంజక్షన్స్ ఇచ్చారు. ప్రిస్కిప్షన్ ప్రకారం మందులు వేసుకుంటుంటే చాలు..ఒకటే వాంతులు. నాకు ఊహ తెలిసాక ఎప్పుడూ..ఇలాటి జ్వర తీవ్రత ఎదుర్కోలేదు.గ్రుక్కెడు మంచి నీళ్ళు త్రాగినా..సరే ఇమడ కుండా  ఒకటే వాంతులు.

అలా రెండు రోజులు బాధపడ్డాను. రెండవరోజు మధ్యాహ్నం కి మగతగా పడిపోయి ఉన్నాను.  అప్పుడు నా ఫ్రెండ్ వైష్ణవి .. వచ్చింది. ఇంత జ్వరం, అనారోగ్యం పెట్టుకుని నాకు ఫోన్ కూడా చేయకుండా ఉన్నావని కోప్పడింది. మాకు  ఆప్తుడైన ఒక మిత్రుడు తనకి ఫోన్ చేసి చెప్పగానే ఉన్న ఫళాన బయలుదేరి వచ్చేసింది.

ఎందుకు..వైషూ ..!? నీకు ఎగ్జామ్స్ కదా!చదువుకోకుండా ఇలా వచ్చావు అన్నాను. తను డి ఎస్ సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది. నీకన్నా నాకు ఎగ్జామ్స్ ఎక్కువ కాదులే! అంటూ వారం రోజులపాటు నన్ను అంటి పెట్టుకుని ఉంది. రెండు పూటలా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం, డాక్టర్ చెప్పిన ప్రకారం మందులు  ఇవ్వడం దగ్గర నుండి.. నాకు సపర్యలు చేసింది. నాకు సెలైన్స్ ఎక్కిస్తున్నప్పుడు రాత్రింబవళ్ళు నన్ను పసిపాపలా కనిపెట్టుకుని.. ఒక అమ్మలా సేవ చేసింది.

వైరల్ ఫీవర్ అనుకున్నది కాస్త డెంగ్యూ అని నిర్ధారణ అయ్యాక,జాండిస్ లక్షణాలు బయటపడిన తర్వాత తను చాలా కంగారు పడింది. ఎమర్జన్సీ లో జాయిన్  చేసినప్పుడు నా వాళ్ళు అందరికన్నా ఎక్కువగా దిగులు పడింది. ప్లేట్లెట్స్ కౌంట్ బాగా పడిపోతే నాకు ఏమైనా అవుతుందేమోనని ఏడ్చేసింది.అనుక్షణం కంటికి రెప్పలా కాచింది. నేను ఆహారం సహించక తినడానికి మొండికేస్తే కోప్పడి బిడ్డకి తినిపించినట్లు తినిపించింది.

నేను హాస్పిటల్ లో ఇన్ పేషంట్ ఉండటానికి  ఇష్టపడక పేచీ పెడితే.. డాక్టర్ తో మాట్లాడి..రెండు పూటలా.. ట్రీట్మెంట్ కి తీసుకుని వస్తానని పర్మిషన్ ఇప్పించుకుని.. ప్రతి రోజు రెండు పూటలా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. అన్నయ్య,చెల్లెలు,నాన్న గారు ఇంతమంది ఉన్నా కూడా తనే నా ప్రక్కన ఉంది..
వైరల్  ఫీవర్ ఉన్నవాళ్ళకి నిద్రపట్టక పోవడం అనేది సర్వసాధారణమైన విషయం.
నేను విపరీతమైన తలనొప్పితో  నిద్ర రాక కొట్టుకుంటుంటే నా తల నిమురుతూ.. అమ్మలా చిచ్చుకొట్టి నిద్ర పుచ్చేది.
అలా సేవలు చేసింది. తనకి చాలా ముఖ్యమైన పరీక్షలకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా.. ఎగ్జాం రోజున వెళ్ళింది.
తను బాగా పరీక్ష వ్రాయలేదని కూడా నాకు తెలుసు.

ఇదంతా నేను ఇవాళ వ్రాసుకోకపోతే నాకు మనఃశాంతిగా ఉండలేననిపించింది.

స్నేహితులు అందరికి ఉంటారు. అందరూ వారి వారి వ్యక్తిగతమైన పనులు మానుకుని శ్రద్ద తీసుకుని హెల్ప్ చేయరు. ఇక్కడ హెల్ప్ అనడం కన్నా సేవ అనడం సబబు కూడా.

నిజానికి నా ఫ్రెండ్ వైషూ ..స్థానంలో నేనున్నా కూడా.. నేను కూడా అలా చేయలేను.అలా సేవ చేయగల శ్రద్ద,ఓపిక నా దగ్గర శూన్యం  కూడా.

ఇతరులకి సేవ చేయడంలో అంకితభావం ఏ కొందరికో ఉంటుంది.

స్నేహం విషయంలో నేనెప్పుడూ గర్వంగా ఫీల్  అవుతూ ఉంటాను. అది మరొకసారి ఋజువైంది.

సాగర సంగమం చిత్రంలో కమలహాసన్ మిత్రుడు శరత్ బాబు. శరత్ బాబు కమలహాసన్ కి మిత్రుడు. అతను మిత్రునికి సాయం చేయడం అనేది సామాన్యమైన విషయం. కానీ శరత్ బాబు భార్య కూడా భర్త స్నేహితుడికి సేవలు చేస్తుంది..సాధారణ మధ్య తరగతి కుటుంబాలలో స్నేహానికి చక్కని నిర్వచనం ఇచ్చిన దృశ్యాలు నాకు అప్పుడప్పుడూ గుర్తుకు వచ్చేవి. అలాగే మా ప్రకాష్ కూడా..నన్ను అర్ధరాత్రి అపరాత్రి అని చూడ కుండా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం నాకు కళ్ళు చెమరింపజేసాయి.

ఇన్ని రోజులు ఇంత  అనారోగ్యంగా ఉన్నా కూడా దూరంగా ఉన్న  మా అత్తమ్మకి కాని, మా బాబుకి కానీ తెలియనివ్వకుండా..జాగ్రత్తగా చూసుకున్నారు.

 ప్లేట్ లెట్స్ 40,000 పడిపోయి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళిన నాకు మా చెల్లెలు చూపిన  శ్రద్ద , నా ఫ్రెండ్ వైష్ణవి చేసిన సేవ వల్ల నేను తొందరగా కోలుకోగల్గాను.

నేనిప్పుడు ఒకటి అనుకుంటాను. నేను నా స్నేహితులకి ఏమి ఇచ్చాను అని కాదు..వాళ్ళ నుండి నేను ఏమి పొందానన్నదే గుర్తుంచుకోవాలనుకుంటున్నాను.

కొన్నాళ్ళ క్రితం స్నేహం-స్వార్ధం అని పోస్ట్ వ్రాసినప్పుడు నా మనసులో స్నేహం పట్ల ఎలాటి భావం ఉందొ.. ఇప్పటికి అదే భావం ఉంది. అంతకన్నా  ఇప్పుడు ఎక్కువ గౌరవభావం పెరిగింది.

ఇదండీ ..నా చెలిమి కలిమి.





26, ఆగస్టు 2012, ఆదివారం

నా బ్లాగ్ స్టేటస్

హాయ్..ఫ్రెండ్స్!! ఒక పది రోజులగా బ్లాగ్ కి విరామం ప్రకటించాను.

అనారోగ్యం వలన ఇటువైపు తొంగి చూడలేదు.  అయినా బ్లాగ్ ని చూసినప్పుడల్లా.. అందరిని మిస్ అవుతున్న ఫీలింగ్.

ఇదిగో..ఇప్పుడే ఇలా వచ్చాను. ఒక విషయం గమనించి..ఇలా షేర్ చేసుకుంటున్నాను.

నా బ్లాగ్ స్టేటస్ ... ని గమనించండి.


http://www.statscrop.com/www/vanajavanamali.blogspot.com

20, ఆగస్టు 2012, సోమవారం

సూపర్ స్టార్ కృష్ణ గారి అర్ధాంగి

సూపర్ స్టార్ కృష్ణ గారు  అర్ధాంగి శ్రీమతి ఇందిర తో కలసి వారి అమ్మాయి ప్రియదర్శిని వివాహ సమయంలో.

శ్రీమతి ఇందిర మీడియా కి కనబడటమే తక్కువ.




17, ఆగస్టు 2012, శుక్రవారం

ఈనాటి సీత కథ

సీత 

ఆర్యపుత్రా ! మీరు వెళ్లి రండి ' సీత అంది. 

"నువ్వూ వస్తావా? అడవిలో రాళ్ళు రప్పలు ,ముళ్ళూ ఉంటాయి. అయినా నేనుంటానుగా ... స్వప్నాలు వర్షిస్తూ మనం కలసి ఉండొచ్చుగా ... నువ్వు రా "

"ఏదీ నాలుగేళ్ళే గా  అరణ్యవాసం ?" సీత చెప్పింది 
'పర్వాలేదు ఆ కాలం కొన్ని వీడియో సినిమాలు చూస్తూ గడిపేస్తాను విసుగు ఉండదు .అందువల్ల ఆర్యపుత్రా..వీడియో లైబ్రరీలో ఒక మెంబర్ షిప్ ఏర్పాటు చేయండి నాకోసం "

శ్రీరాముడు ముందుకు సాగాడు.

కైకేయి కుర్చీ వద్ద కూర్చుని మంధర మళ్ళీ నవ్వింది. 

(ఇది చిన్ని కథ .ఈ కథ చదివి నేను నవ్వాను.)

మళయాళ మూలం: పి.కె.సారక్కడవు 

తెలుగుసేత :ఎల్.ఆర్.స్వామి.

(చినుకు మాసపత్రిక సౌజన్యంతో...) 

16, ఆగస్టు 2012, గురువారం

ఓ..కవి హృదయం

పిల్ల గాలి ఊదింది పిల్లన గ్రోవి
పల్లవించి ఊగింది గున్నమావి

మా పల్లె మారింది వ్రేపల్లెగా
మనసేమో పొంగింది  ..పాలవెల్లిగా

చెలువ పంపిన పూల  రేకులు
చిలిపి బాసల మూగలేఖలు
మరల మరల చదువు  కుందును
మనసు నిండా పొదుగు  కుందును
చిలిపి బాసల మూగలేఖలు
 చెలువ పంపిన పూల  రేకులు

పరిమళాల పల్లవులగా
ప్రణయ గీతములల్లు కుందును
బ్రతుకు పాటగా పాడుకుందును
చిలిపి బాసల మూగలేఖలు
చెలువ పంపిన పూల  రేకులు

విరహమోపగలేక వెన్నెల్లో పడుకుంటే
పండు వెన్నెలేమో చండ్ర నిప్పులే  ఆయె
మరులు సైపగ లేక మల్లెలను దూయగా
మల్లియలు సైతం పల్లెరులైపోయే
ఇక సైపగా లేను ఈ మధుర బాధ
ప్రియ సఖీ నా పైన దయ చూపరాదా

ఎవరి కోసం రాధ ఏతెంచేనో
ఎదురుపడగా లేక ఎట పొంచెనో
తలుపు చాటున దాగి తిల కించేనో
తిలకించి లోలోన పులకించేనో
చిలిపి కృష్ణుడు అంత చెంగు పట్టగా
నిలువెల్లా ఉలికిపడి  తల వాల్చెనో



15, ఆగస్టు 2012, బుధవారం

వాన వెలిశాక...


వాన వెలిశాక...
నిర్మలాకాశం 
ద్వంసమైన  తోట...  మాత్రమే కాదు.. 

వాన వెలిశాక 
నేలని కడిగినట్లు 
చేట్టుచేమ తానాలాడినట్టు 

వాన వెలిశాక.. 
రంగులన్నీ కరిగి పోయినట్లు 
ఇంద్రచాపమై మిగిలినట్లు 

వాన వెలిశాక 
నీటిముత్యాలు
జారుడు బల్లాట లో జారినట్లు 

వాన వెలిశాక ..
 పూలు బరువుగా వాలినట్టు 
పండ్లు పగలబడి నవ్వినట్లు.. 

వాన వెలిశాక 
నేనేమో..
తడిసిన బట్టలు ఆరేసుకుంటూ..
కురులు ఆరబెట్టుకుంటూ... 

14, ఆగస్టు 2012, మంగళవారం

మై స్పేస్ అమ్మలక్కల కబుర్లు 4


దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే తరుణం.

నేను వ్రాస్తున్న ఈ పోస్ట్.... అమ్మాయిలకి లభించిన స్వేచ్చ ఏ విపరీత ధోరణులకి దారి తీస్తుందో.. అని బాధ పడుతున్న మధ్యతరగతి తల్లి దండ్రుల ఆవేదన గురించి ..

ఓ..తల్లి . ఇలా చెప్పుకుంటూ వచ్చింది

మా నాన్న జేమ్స్ బాండ్.. మనదంతా పాత ట్రెండ్.. అని మా అమ్మాయి బాధగా పాటలు పాడుకుంటుంది.

చీటికి మాటికి వాళ్ళ నాన్నపై చిర్రు బుర్రులాడుతుంది. ఎందుకో ఏమిటో...అర్ధమై చావదు.

ఆ తండ్రి కూతుళ్ళ కోల్డ్ వార్ చూడలేక పోతున్నాను. చిన్నతనం నుండి..గుండెలపై ఆడించి పెంచుకున్న కూతురు తండ్రి చెప్పినదానికి వ్యతిరేకంగా నడుచుకోవడంని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు,

మన కాలంలో తండ్రి మాటకి ఎదురు చెప్పి ఎరుగుదుమా! ఈ పిల్ల చెప్పినది వినదు. ఆయన తన పంతం తనదే అంటారు.

ఇప్పటి పిల్లలకి చిన్నప్పటి నుండి ఆడింది ఆటగా పాడింది పాటగా సాగనిచ్చి హటాత్తుగా పెళ్లీడు వయస్సు వచ్చేసరికి ఆడపిల్లవి ఇంటి గౌరవం కాపాడాలి అంటూ ఆంక్షలు మొదలు.

ఈ మధ్య వార్తలలో చూసాను ఓ అమ్మాయి తన ఇష్టప్రకారం మోడరన్ డ్రెస్ వేసుకుంటానని చెప్పి అలాంటి వస్త్రధారణ చేసుకున్న ఆమెని తల్లిదండ్రులు నడిరోడ్డు పై వెంటాడి వెంటాడి పిచ్చి పిచ్చిగా దేహశుద్ది చేసారు. అదేమని అడిగితే .. మా బిడ్డ మేము కొట్టుకుంటాం చంపుకుంటాం..అడిగేదానికి ఎవరికీ ఏమి హక్కుఅని తిరిగి ప్రశ్నించడం చూసాము.

ఇక ఇప్పటి యువతరం లో కొంత మంది ఆర్ధికంగా బలపడిన కుటుంబాలలో పెరిగిన పిల్లలతో పోల్చుకుని మధ్యతరగతి వర్గంలోని పిల్లలు ఆదునికంగా విలాసవంతంగా పెరగాలని అనుకుంటున్నారు. నిజానికి మన గ్రామీణ ప్రాంతాల పిల్లలు చదువుల కోసం పట్టణాలకి వెళ్ళడం, ఉద్యోగాలకి ఇతర ప్రాంతాలకి వెళ్ళడం వల్ల తల్లిదండ్రుల అజమాయిషీ లోపించి స్వేచ్చాను గుణంగా ప్రవర్తించి అర్ధాంతరపు చావులకి గురి అవుతుతున్నారు.

చదువుల పేరిట ,ఉద్యోగాల పేరిట అమ్మాయిలని బయటికి పంపడంపట్ల తల్లిదండ్రులకి అభ్యంతరం లేకపోయినా ఇలాంటివి విన్నప్పుడు భయ భ్రాంతులకి గురి అవుతున్నారు. పిల్లలు కాస్తంత విచక్షణ గా, భాద్యతగా నడుచుకుంటే తల్లిదండ్రులకి గుండెకోత,నలుగురిలో అవమానాలు ఉండవు కదా!

వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ లో ఉన్న పిల్లలు కూడా మహా నగరాలలో వ్యాపించిన పేజ్ త్రీ కల్చర్ కి, రేవ్ పార్టీల కల్చర్ కి ఆకర్షితులవుతున్నారని ఓ.. తల్లి ఆవేదనగా చెప్పింది. పెద్దలు చెప్పే మంచి మాటలు పిల్లల తలకెక్కుతాయా ? సరదాల పేరిట జీవితాలనే రిస్క్ లోకి నెట్టుకుంటున్నారు.

ఈ సంస్కృతి ఇలా వేలం వెర్రిగా మారుతుంటే...

ఈ చదువులు ,స్వేచ్చలు అన్ని ఉండి కూడా పెళ్లి విషయంలోకి వచ్చేసరికి తల్లిదండ్రులు తమ ఇష్టప్రకారం జరగాలను కుంటున్నారు. ప్రేమించుకున్న కొంతమంది యువతీ యువకులని తమ ఇష్ట ప్రకారం పెళ్ళిచేసుకున్న వారిని పరువు ప్రతిష్టలు పేరుతొ.. చంపుకుంటున్న తల్లిదండ్రులని చూస్తున్నాం.

ఇప్పటి తల్లిదండ్రుల పాత్ర పిల్లల ని స్వేచ్చాను గుణంగా వదిలి వేయడమా ..లేక తప్పని సరి ఆంక్షలు విధించి పెడదారి పడుతున్న వారిని చేయి పెట్టి నడిపించడమా... !? పిల్లలని ఎలా గైడ్ చేయగలగాలి ?

ఆ తల్లి ప్రశ్నకి .. ఏమి సలహా ఇవ్వగలం ?

ఈ ప్రశ్నకి సమాధానం పితృస్వామ్యం అనో,పురుష అహంకారం అనో, మోసకారీతనం, కాముకత్వం అన్నంత తేలికగా దొరకదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది.

ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా కొన్ని వాస్తవాలని మనం గమనించాలి. బాధితులకి అండగా నిలబడం ఎలాగో .. పెడదారి పడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా అవసరం కదా !

13, ఆగస్టు 2012, సోమవారం

స్నేహం - స్వార్దం

స్నేహంలో స్వార్దం ఉంటుందా!

చాలా మంది స్నేహంలో స్వార్దం ఉండదు నిస్వార్దంగా ఆలోచిందే నిజమైన స్నేహం అంటారు.
అసలు స్వార్దం అంటే ఎలాటి స్వార్దం?

నాకు ఒక స్నేహితురాలు ఉంది. తను నాకు ఒక ఉత్తరం ద్వారా  పరిచయం అయినప్పుడు సంతోషం కల్గింది.

ముందుగా ఆమె నన్ను చూడటానికి వచ్చారు. అప్పుడు నేను కొంచెం ఆశ్చర్య పోయాను.నేను ఆ చొరవ చేయలేకపోయానే అని బాధ పడ్డాను కూడా. !

ఆమె గురించిన వివరాలు చెప్పారు. ఒక రోజు మా ఇంట్లో ఆతిధ్యం స్వీకరించారు.  మరుసటి రోజు వెళుతూ నన్నొక ప్రశ్న అడిగారు

 "మీరు మా సంస్థలో పని చేయడానికి రాగలరా?" అని.

ఆమె హిందూ ధర్మ ప్రచార సభలో స్వచ్చందంగా  అంకిత భావంతో పని చేస్తారు. నాకు అలాంటి సంస్థలలో పని చేయడానికి ఆసక్తి లేదు. ఆమె లా నేను అంత అంకితభావంతో పని చేయలేను అని కూడా  నాకు తెలుసు. అందుకే నేను ఆ పని నా నా వల్ల కాదని నిర్మొహమాటంగానే స్పష్టంగానే  చెప్పాను.అందుకు ఆమె కొంచెం కినుక వహించారు.

నా నుండి వీడ్కోలు తీసుకుని .. వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి నాకొక ఉత్తరం అందింది.

ఆ ఉత్తరంలో ఇలా ఉంది. మీరు దేశ భక్తికి,దేశ గౌరవంకి సంబంధించిన సంస్థలో పని చేయడానికి వీలు కాదని చెప్పారు. మీ స్నేహం నాకు నచ్చలేదు అని..చెబుతూ..

ఇంకా నా పని వాళ్ళ పట్ల నేను చూపించే ఔదార్యం,చొరవ తనకి నచ్చలేదు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి.మీ పట్ల యజమాని  అన్న విలువ వాళ్ళకి లేదు   అని వ్రాసారు.
ఆమె అలా ఉత్తరం వ్రాసిన విధానాన్ని చూసి నేను చాలా నోచ్చుకున్నాను.

నేను మళ్ళీ ఆమెకి రిప్లై వ్రాయలేదు. నా దగ్గర పనిచేసే ఆడ పిల్లలు .. ఆ ఉత్తరం చూసి బాధపడ్డారు. ఇదేంటి ఆంటీ.. మిమ్మల్ని ఆమె ఇలా అనేసారు అని నన్ను అడిగేవారు.  (ఆమె పోస్ట్ కార్డ్ పై  ఆ లేఖ వ్రాసారు ). మా దగ్గర పని చేసేవాళ్ళలో అమ్మాయిలు ఇంటి పిల్లలు లాగానే ఉండేవారు. నేను వంట చేసుకుంటూనో..వేరే డిజైనింగ్ పనిలోనే ఉన్నప్పుడు .. ఫోన్ లిఫ్ట్ చేయడం చేస్తుంటారు కాబట్టి నాకు మరీ అంత పర్సనల్ అంటూ ఉండేవి కాదు కాబట్టి..ఆ చొరవ వారికి ఉండేది.

నిజానికి ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు నా దగ్గర పనిచేసే ఒక వ్యక్తీ మానసిక పరిస్థితి బాగోలేదు. అందువల్ల నేను అతని పట్ల సానుభూతి చూపుతూ.. చూసి చూడనట్లు పోయేదాన్ని. ఆమెకి ఆ సంగతి తెలియక అలా వ్రాసారు

కొన్నాళ్ళకి మరలా ఆమె మా ఇంటికి వచ్చారు.. నేను మాములుగానే ఆహ్వానించాను. ఆత్మీయంగానే మాట్లాడాను. ఆమె తను వ్రాసిన ఉత్తరం గురించి ప్రస్తావించి ..అలా వ్రాసినందుకు క్షమించమని అడిగారు. నేను ఆ సంగతి ఎప్పుడో మరచిపోయాని అని చెప్పాను.

తర్వాత తర్వాత ఆమె నాకు మంచి స్నేహితురాలయింది. తను బాగా అలసిపోయినప్పుడు భాద్యతల నుండి తప్పించుకుని ఓ..రెండు రోజులు మా ఇంట గడపడానికి వస్తూ ఉంటుంది. ఇష్టమైన పాటలు వినిపిస్తూ,పుస్తకాలు చదువుతూ ..రకరకాల చర్చలు లేవనెత్తుతూ.. సంతోషంగా ఉంటుంది.

ఆమె వచ్చిన రోజుల్లో ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ కాల్ చేసినా, ఎవరైనా వచ్చినా వారితో కూడా స్నేహంగా ఉండటం ఆమెకి నచ్చదు.  ఒక ఫ్రెండ్ తన వైవాహిక జీవితంలో తలెత్తిన  ఇబ్బందులవల్ల కొద్ది కాలం మా ఇంట్లో ఉండటానికి నేను అవకాశం కల్పించాను. తను చదువుకోవడానికి,కొద్దిగా ఆర్ధిక స్థిరత్వం సంపాదించుకోవడానికి సాయం చేస్తే బావుంటుందని నేను అనుకున్నాను.  ఆమె అలాగే కొన్ని నెలలు మా ఇంట్లో ఉంది.తర్వాత మాకు దగ్గరలోనే ఓ..ఇల్లు చూసుకుని వెళ్ళిపోయింది కూడా. ఆమె వస్తే చాలు ,లేదా ఇంకెవరైనా వస్తే   వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా..అన్నట్లు చూస్తుంది. లేదా వెంటనే బయలు దేరి వెళ్ళిపోతుంది.  రెండు మూడుసార్లు  నేను అది   గమనించి ఎందుకు లా చేస్తున్నావు అని అడిగాను. నీ అంత ఓపిక నాకు లేదు.వాళ్ళ సోది నేను వినలేను  నాకు కొంచెం మంది స్నేహితులు ఉంటె చాలు. మీ విస్తారమైన స్నేహ ప్రపంచంలో నేను ఇమడలేను.. ఇక్కడ నాకు విలువలేదు.. అందుకే దూరంగా ఉంటాను అని చెప్పింది.

ఆమె స్నేహంలో నాకు స్వార్దం కనిపించింది.ఆమె వెళ్ళిన కొన్నాళ్ళకి ఆమెకి ఒక ఉత్తరం వ్రాసాను.

ప్రియమైన స్నేహితురాలికి.. ఓ..ఆత్మీయ లేఖ.

పరిమితమైన స్నేహితులు ఉండటం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు.  చిన్ననాటి స్నేహం, జీవన విధానానికి తగ్గట్టు అవసరమైన స్నేహాలు, అభిరుచిలు కలసిన స్నేహాలు, ఎన్నటికి విడిపోని  గాఢమైన స్నేహాలు.. వీటి మధ్య బ్రతుకుతున్న చాలా మందికి కొంతమందికే పరిమితమైన స్నేహం ఉండాలనుకోవడం సాధ్యం కాకపోవచ్చు.   నేను అందుకు అతీతం ఏమి కాదు.

స్నేహం అంటే కాస్తంత సాయం చేయడం, ఎదుటిమనిషి ఉన్న స్థితిని అర్ధం చేసుకోవడం, మనం  వారికి అండగా ఉన్నామని భరోసా  ఇవ్వడం..

ఇందులో మనకి కొన్ని వ్యక్తీ గత ఇబ్బందులు ఉండవచ్చు కాని వాటిని ప్రక్కనపెట్టి మన స్వంత వాళ్ళకి, రక్త సంబందీకులకి అయితే మనం చేయమా? అని మనకి మనం ప్రశ్నించుకోగల్గితే ..  ఎలాటి ఇబ్బంది ఉండదు కదా  నీకు నావల్ల కల్గిన ఇబ్బందికి క్షమించు....

ఆఖరిగా ఒక మాట.. నిత్యం మన చుట్టూ ఉన్న వాళ్ళతోనే స్నేహంగా ఉండటం సాధ్యం కానప్పుడు వారికి సాయం చేయలేను అని భావిన్చుకున్నప్పుడు .. పై పై మాటలతో వారికి  స్నేహం రుచి - రంగు చూపిస్తూ కప్పదాటు స్నేహం నేను చేయలేను,నటించలేను   అంటూ  ఉత్తరం ముగించాను.

లింగ బేదం  లేని వారి పట్ల చూపే స్నేహంలోనే ఎన్నో అభ్యంతరాలు ఉంటె.. ఇక స్త్రీ-పురుష స్నేహాలు ఎలా ఉంటాయి అని నాకు గొప్ప సందేహం ముంచుకొస్తుంది. అది ఏమిటంటే ...  అసలు స్నేహంలో స్వార్ధం ఉండాలా-వద్దా?

 నా ఈ అనుభవం తర్వాత  మనఃస్పూర్తిగా  స్నేహహస్తాన్ని  ఇవ్వడం సాధ్యం కానివాళ్ళు ఇక సంస్థలలో ఎలా అంకిత భావంతో పని చేయగలరు..అని అనుకుంటాను. ఇంతకీ ఆ మిత్రురాలు నాతొ స్నేహం కట్ చేసుకుందా ..!? అంటే అదేమీ  లేదు..

ఆమె వచ్చినప్పుడు పవర్ కట్ లేకుంటే  ఇంట్లో '"చిట్టేమ్మ" సీరియల్ చూస్తూ ఉంటారు. భారతీయ సంస్కృతి సంప్రదాయం నాశనం చేసిందని విమర్శిస్తూ  రాధిక గురించి ఆవిడ వ్యాఖ్యనిన్చుతారు. నేను ఆమెతో తగవు పడతాను.. అదీ సంగతి.

ఫ్రెండ్ షిప్ అంటే.. నా మాటల్లో..

 అండర్ స్టాండింగ్, కేరింగ్,షేరింగ్,సపోర్టింగ్... అంతే!!


మైత్రి దినోత్సవం నాడు వ్రాసుకోవాల్సిన పోస్ట్..ఈ రోజు ఇలా.. మనసైంది. :)

12, ఆగస్టు 2012, ఆదివారం

వనమాలి కోసం





















వనమాలి కోసం

నీ స్వరచాలనం
కలల ప్రయాణంలో ఉన్న
నన్ను మేల్కొలిపింది

నీ కరచాలనం
ఎన్నెన్నో జన్మల బంధాన్ని
జ్ఞప్తికి తెచ్చింది


నీ ఆత్మీయ చుంబనం
నాఆలోచనలపై..
తీయని ముద్ర వేసింది

నీ ఆలింగనం
అలజడితో నిండిన
నా ఆత్మని శాంతింపజేసింది.

నా ఆత్మదీపం
నీలో కలిసేవరకు
నా నిరంతర అన్వేషణ ముగిసేనా

నీవెవరివో
ఎవరికైనా తెలిసేనా
వనమాలి...  నీవే కదా
నడిపేది నడిపించేది
కలలో అయినా ఇలలో అయినా
జీవితాన్వేషణలో అయినా

8, ఆగస్టు 2012, బుధవారం

మతాంతర వివాహాలు - ఒక పరిశీలన

నా అనుభవం లోనుండి ఒక వాస్తవ విషయాన్ని తీసుకుని కథలో జొప్పించి ఆ కథని ప్రింట్ మీడియాకి పరిశీలనకి పంపినప్పుడు. ఆ కథ రిజెక్ట్ అయింది. అందులో ఉన్న అంశం .. వివాదాస్పదం అవుతుందని ప్రచురణకు అంగీకరించలేదు.

మతాంతర వివాహాలలో ఉన్న సమస్యల గురించిన విషయమే ఆ కథలో ఉంది. నిజాలని చెప్పుకోవడంలో కూడా భయపడే సమాజంలో, నిజాన్ని చెప్పడం కూడా సాహసం అవుతుందేమో అనుకున్నాను.
ఆ కథ లో విషయం లాంటి ఇంకొక విషయం ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను.

నేను ప్రత్యక్షంగా చూసిన మరొక మతాంతర వివాహం వలన భార్య,పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు...గురించి చెప్పడమే ఈ పోస్ట్.

మా పరిచయస్తులలో ఇద్దరు విద్యాధికులు ప్రేమించుకుని మతాంతర వివాహం చేసుకున్నారు. వారికి ఇరువురు పిల్లలు కలిగారు. ప్రేమించుకుని వివాహం చేసుకున్నంత మాత్రాన వారి మధ్య మత బేధాలు సమసి పోయాయా అంటే అదేమీ లేదు. వాకిట్లో ముగ్గు పెట్టడానికి వ్యతిరేకించడం దగ్గర నుండి ఇంట్లో ఆహారపు పదార్ధాల తయారీ వరకు భర్త చెప్పినట్లు జరగాల్సిందే! ఆమెని మతం మార్చుకోమని ఒత్తిడి తీసుకు రావడం జరిగింది. కానీ అందుకు ఆమె సమ్మతించలేదు. పిల్లల పేర్లు కూడా అతని ఇష్ట ప్రకారమే పెట్టడం జరిగింది. ఆమె ఇంట్లో మాత్రం భర్త చెప్పినట్లు నడుచుకుని బాహ్య ప్రపంచం లోకి అడుగు పెట్టేటప్పుడు నుదుటున ఒక స్టిక్కర్ అతికించుకుని ప్లాస్టిక్ నవ్వులు పులుముకుని తనలోని భావాలని బయట ప్రపంచం కి కనబడకుండా దాచుకుంటుంది.

ఆమెని అలా చూసిన అందరు.. మతాంతర వివాహం చేసుకుంటే మాత్రం ఏమిటి..వారు ఇరువురి మధ్య ఎంతటి అండర్ స్టాండింగ్ ఉందొ !. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ వారిని వారు గౌరవించుకుంటూ ఆదర్శప్రాయంగా ఉంటున్నారు అనుకుంటారు.

కానీ నాలుగు గోడల మధ్య జరిగే తంతు ఎవరికీ తెలియదు..మరీ సన్నిహితులైన వారికి తప్ప.

వారి అమ్మాయికి పదమూడు ఏళ్ళు రాగానే తండ్రి తరపు సంప్రదాయం ఆమెని కమ్మేసింది. ఆరేళ్ళ తన కొడుకు తల్లి మతాచారాల వైపు ఆకర్శితుడవుతున్నట్లు గ్రహించిన ఆ తండ్రి బెల్టు దెబ్బలు,అట్లకాడ వాతలతో..తన మతాచారాన్ని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించాడు . ఆ పిల్లవాడికి తన మతాచారం ప్రకారం ఒక సంప్రదాయ వేడుకని కూడా నిర్వహించి తనకి సంబంధించిన బంధు పరివారానికి విందు ఏర్పాటు చేసాడు.

పాపం ఆ పసివాడు.. తనకి ఇష్టం లేని ఆచారం పాటించడానికి కుళ్ళి కుళ్ళి ఏడవడం చూసాం.

తల్లిని ఆ పిల్లలు ఇద్దరు ప్రశ్నించేవాళ్ళు. నువ్వు ఆచరించని ఆ మతాన్ని మాచేత ఎందుకు బలవంతంగా ఆచరింపజేస్తున్నావు అని.

ఆ తల్లి దగ్గర చెప్పడానికి సమాధానం లేదు. తండ్రి మతంని మాత్రమే బిడ్డలకి వంశ పారంపర్యంగా చెప్పుకోవడం,ఆచరించడం ఆనవాయితీగా ఎందుకు మారింది?

ఆ తండ్రి బయట ప్రపంచం దృష్టిలో ఒక ఆదర్శవాది. సమాజాన్ని ఉద్దరించడానికి కంకణం కట్టుకున్నట్లు మాట్లాడతాడు. కానీ ఇంట్లో భార్య పిల్లల విషయంలో పరమ చాందస వాదాన్ని వినిపిస్తాడు.

మతాంతర వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్లకి వాళ్ళని ఉదాహరణగా చూపించాలి అనుకుంటాను.

ఆదర్శాలుగా కనిపించే అన్నీ పై పై పూతలే! చదువులలో అభివృద్ధి సాధించారేమో కానీ మానసికంగా నాగరికంగా మారని ఎంతొ మంది ని చూస్తూ ఉంటాం. మతం గుప్పిటలో వారు కీలు బొమ్మలే!

మతం అంటే ఒక సంస్కారం. ఒక సదాచారం.

పిల్లలపై బలవంతంగా మతాచారాన్ని రుద్దడం,హింసించడం అనేది ఏ విధమైన సంస్కారం? తండ్రిగా తన ఆచారాన్ని పిల్లలకి నేర్పడం ఆ తండ్రి తప్పు కాకపోవచ్చు.

ఈ విషయంలో తప్పు ఎవరిదీ అంటే.. భార్యాభర్తల మధ్య అవగాహనా లోపం.వివాహానికి ముందు వాళ్ళు ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఏర్పర్చుకోకుండా.. వారికి జన్మించిన బిడ్డలని మతం పేరిట హింసించడం క్రూరత్వం కాదా!?

చదువులని,సంస్కారాన్ని మసక బారింపజేసి హృదయాన్ని బండగా మార్చే మతం మత్తు లో జోగుతున్న ఎందఱో.. మతాంతర వివాహం చేసుకోక పోవడమే మంచిది.

ఇలాంటి జంటలని చూస్తే మతాంతర వివాహాలని ఎవరైనా ప్రోత్సహించ గలరా !

7, ఆగస్టు 2012, మంగళవారం

కాలం మారింది



పెళ్లి అంటే రెండు మనసుల కలయిక మాత్రమే కాదు రెండు కుటుంబాల కలయిక కూడా..అలాటి వన్నీ కొట్టి పారేసి అమ్మాయికి అబ్బాయి,. అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు అనుకుని సరిపెట్టుకుంటున్న వాళ్ళ సంఖ్యా తక్కువేమీ కాదు.

ఈ రోజుల్లో పెళ్లి సంబంధాల వేటలో.. నమ్మకమైన వ్యక్తుల మాటలు నమ్మడం అంటూ లేదేమో! ఎందుకంటే మెట్రీమోనీ ద్వారా పెళ్లి సంబంధం కుదుర్చుకుని ఒకటైన జంటలు కోకొల్లలు.

వారికి ఉన్న అర్హతలు, కావలసిన అర్హతలు తో స్పష్టమైన వివరాలతో.. మెట్రీ మోని వారి వెబ్ సైట్ లో అమ్మాయిలూ,అబ్బాయిలు దర్శనమిస్తున్నారు.

వారి
బయో డేటా లో వంశ పారంపర్య వ్యాధుల వివరాలుతో పాటు హెచ్ ఐ వి నెగిటివ్ అని కూడా మెడికల్ రిపోర్ట్ ని జత పరచాల్సి వస్తుంది.

మా
పరిచయస్తుల అమ్మాయి తరపు వాళ్ళకి ఇలాటి అనుభవమే ఒకటి ఎదురయింది..

అబ్బాయి
తండ్రి వారి కుటుంబ వివరాలు, అబ్బాయి వివరాలు చెపుతూ.. వ్యాదుల లేమి గురించి కూడా వివరంగా చెప్పడం ని అమ్మాయి వైపు వాళ్ళు కొంచెం జీర్ణించుకోలేకపోతున్నారు.

మనం
అమ్మాయిని ఇవ్వాలనుకుంటే..కుటుంబం సంప్రదాయం మంచి-చెడు,అబ్బాయి చదువు-ఉద్యోగం గుణగణాలు ఇవి తెలుసు కోవాలని ప్రయత్నిస్తాము.

అబ్బాయి
తరపు వాళ్ళే ఇలా అన్ని వివరాలు చెపుతూ.. వ్యాదుల లేమి గురించి చెప్పడం వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. రేపు అమ్మాయి గురించి వివరాలు ఇవ్వాలన్నా ఇలా అడుగుతారు కదా! అనుకుంటున్నారు. అది అవమానకరం గాను ఫీల్ అవుతున్నారు.
నిజానికి ఇలాటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమైన రోజులు ఇవి.

పైగా ఆబ్బాయి తరపు వాళ్ళు మేము ఇంత కట్నకానుకలు ఇవ్వాలని డిమాండ్ చెయ్యం! కానీ మీరు ఏమి ఇస్తారో చెప్పండి అని అడగడం కూడా ఒక అడుగు వెనక్కి తగ్గేతట్లు చేస్తుంది.కట్నం ఆశించం అంటూనే ఒత్తిడి తేవడం ఇక్కడ కనబడుతుంది. అమ్మాయి-అబ్బాయి ఇరువురుకి అన్ని విధాల సమ జోడీ. కానీ ఇలాటి అనుమానాలు వల్ల ఆదిలోనే గండి కొట్టే అవకాశాలు నాకు కనిపించాయి.

ఇలాగే
..మా పరిచయస్తురాలు ఒకావిడ వారి అబ్బాయికి తగిన అమ్మాయిని అన్వేషిస్తూ నాతొ ఒక మాట అన్నారు.

నేను నాకు తెలిసిన వారి అమ్మాయి గురించి చెప్పి ఆ అమ్మాయిని అడిగి చూడండి.. అని చెప్పాను.

అమ్మో
! వాళ్ళు మనకి ఇస్తారా? అని సందేహ పడ్డారు. ఆస్తులు-అంతస్తులు కోసం ప్రాకులాడకుండా అబ్బాయి,కుటుంబం కి ప్రాధాన్యం ఇచ్చేవారయితే.. తప్పకుండా అమ్మాయిని ఇవ్వాలని అనుకోవచ్చు. ఒక మారు అడిగి చూస్తే తప్పేముంది? అన్నాను.

మగ
పిల్లాడి వాళ్ళం. మనం అడగడం ఏమిటీ.. నామోషీ తనం కాదా!? అంది ఆవిడ.

ఈమె
ఇంకా బి సి కాలం లోనే ఉంది ఏమిటబ్బా..ప్చ్..అనుకున్నాను. కాలం మారింది కదా!

4, ఆగస్టు 2012, శనివారం

ఒక కథ గురించి... నా స్పందన




ఈ మధ్య ఆదివారం ఆంద్ర జ్యోతి ఆదివారం సంచికలో "కలాపి" కథ చదివాను. (జూలై 29)

అంతకు ముందు సంచికలో మన బ్లాగర్ (నీలాంబరి) శారద గారు వ్రాసిన "అందవిహీన "కథ ఒక ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటితే..ఈ కథ స్త్రీ లో ఉన్న చపలత్వం ని చూపింది.

ఆ కథలో "కలాపి " ఆనే స్త్రీ గురించి చెప్పడమే ఈ కథ.

ఆ స్త్రీ అందమైనది. ఆ అందం వల్ల ఆకర్షితులైన ఎంతొ మందిలో కేవలం ఎనిమిది పురుషులు ఆమెని వివాహమాడారు. చిత్రంగా.. ఆమె భర్తలగా ఉన్న అందరు ఆమె కోరగానే విడాకులు ఇచ్చేసారు. ఎక్కడా ఎలాటి అభ్యంతరాలు లేకుండా ఆమె ఎనిమిదిమందిని వివాహమాడారు. డబ్బుతో లభించిన సర్వ సుఖాలని అనుభవించిన తర్వాత కూడా ఆమెకి తగిన సంతృప్తి , శాంతి లభించలేదని చెబుతుంది ఎప్పుడూ అన్వేషణ. ఏ మగవాడి దగ్గర తనకి కావలసినది ఏది దొరకలేదు అని చెపుతుంది. రోగ గ్రస్తమైన శరీరంతో.. మరణం కోసం ఎదురుచూస్తూ.. ఉంటుంది.

మనకి మనమే శాశ్వతం, ఐ యాం వాట్ ఐ యాం అంకుంటూ..తనకంటూ మిగిలింది అనుభవాలు మాత్రమే అని చెపుతుంది.

తనకి అనేక వివాహాలు ద్వారా లభించిన నగలు,కానుకలు ని సొమ్ముగా మార్చి శ్రీలంక దేశంలో యుద్దగాయాలతో బాధ పడుతున్న,లైంగిక హింసకి గురి అయిన వాళ్ళు,అనాధ శిశువులకి పునరావాసం కోసం ఖర్చు చేస్తున్నాని చెపుతుంది.

తనకన్నా పది పన్నెండు ఏళ్ల చిన్నదైన "లడ్డు" ఆనే స్నేహితురాలికి తన విషయాలన్నిటిని చెపుతూ.. తన మరణం తర్వాత ఆమెని ఆ బాధ్యతలు చూసుకొమ్మని చెపుతుంది.

అంతే కాకుండా.. జీవన ప్రయాణం లో జరిగిన వివాహాలతో సంబంధం లేకుండా తనకి స్నేహితుడిగా నిలిచిన ఓ..వ్యక్తిని పరిచయం చేస్తుంది. అతను ఆమె స్నేహితురాలు "లడ్డు" కి అన్నయ్య.

ఆఖరికి "లడ్డు" మెడపై "కలాపి" పుట్టుమచ్చ లాగా మిగిలిపోతుంది.

అందమైన స్త్రీ తన అందం తో..పురుషులని ఆకర్షించి ఎనిమిది మందిని వివాహమాడటం.. స్త్రీలలో మితిమీరిన స్వేచ్చకి అద్దం పడుతుందా? అలా అతి స్వేచ్చగా ఉండటాన్ని  ఈ కథ సమర్ధించి నట్లు అయిందా?

చలం రాజేశ్వరిని సృష్టిస్తే ..ఇప్పటికి సంప్రదాయవాదులు గగ్గోలు పెడుతున్నారు.

ఆఖరికి ఈ కథలో కలాపి..తన సంపదనంతా.. యుద్దగాయాలతో బాధపడేవారికి, లైంగిక హింసకి గురి అయిన వాళ్లకి చెందేటట్లు చేయడం చిత్రంగా లేదూ!

కథ అయినా సరే ..కలాపి లోని అతి స్వేచ్చ..ఇంకా చెప్పాలంటే విశృంఖలత్వం (లస్ట్) నాకు నచ్చలేదు. ఆఖరికి ఈ కథలో సందేశం యేమిటో కూడా నాకు అర్ధం అయి కానట్టు ఉంది.

"తన్హాయి" ని విపరీతంగా ద్వేషించిన వాళ్లకి ఈ కథ చదివితే ఏమనిపిస్తుందో!

ఈ కథలో  రచయిత్రి శైలి మాత్రం నాకు బాగా నచ్చింది. కలాపి వర్ణన అద్భుతంగా ఉంది.

బహుశా ..ఈ కథని ఆ శైలి మాత్రమే చదివించింది. వివాహంలో యేమి లేదు అని తెలుసుకోవడానికి  ఒక్క వివాహం చాలు, ఎనిమిది వివాహాలు అవసరం లేదు కదా .. అనిపిస్తుంది (అనిపించింది కూడా )

మీరు చదవండి..! ఏమనిపిస్తుందో ..మీరు చెప్పండి.

కలాపి కథ.. ఈ లింక్లో చదవండి.

3, ఆగస్టు 2012, శుక్రవారం

నిరీక్షణ




నిరీక్షణ


స్వప్నసౌధాల వాకిట్లో నిలబడి..
నీతో కలసి నడవడమే లక్ష్యంగా ఎంచుకుని
నీ
కోసమే నిరీక్షణ ..

నీవు
మాత్రం నీవు-నేను మరచి..
మనమందరం
అనే సమాజం కోసం
వేయి
శిశిరాలతో పోరాడి
ఒక
వసంతం కోసం నిరీక్షించే ఆశావాదివి.

ప్రియతమా
..!
నిజంగా.. నువ్వు రావని నాకు తెలుసు..
అయినా
.. నీ కోసమే..నిరీక్షణ.

ఆరాటాల
పోరాటాల జీవన గమనంలో
మన
ఇద్దరం ఒకే లక్ష్యం కోసం
సమాంతరంగా
పయనించే బాటసారులం
గమ్యంలోనైనా
.. కలవకపోతామా !.
అని.. నిరీక్షణ.

నీ
.. జ్ఞాపకాల అంతఃపురంలో బందీనై
ఆశ
-నిరాశ సరిహద్దురేఖపై నిలబడి
రోజూ
.. రేపు నీ కోసమే అనుకుంటూ ..
చూసే
మధురమైన నిరీక్షణ .

ప్రేమంటే
.. క్షణికమైన మోహం  కాదని ..
ప్రేమంటే
ఎడతెగని నిరీక్షణ అని ఎందరికి తెలుసు ..

నిరీక్షణలో అలసి-సొలసి ..
నా
.. బ్రతుకు ..నీ లిఖితకావ్యం
అన్న
నమ్మకంతో
దిగంతాల అంచులలోనైనా ..
మనం
కలుస్తామనే .. నిరీక్షణ.
ఇదీ
.. దివారాత్రాల నిరీక్షణ.

( కరీంనగర్ వారి శరత్ సాహితీ సంకలనంలో ..పోటీ కవిత)