29, ఆగస్టు 2012, బుధవారం

నా చెలిమి కలిమి

ఓ. పదమూడు రోజుల క్రితం .. ఓ.. బ్లాగర్ నెచ్చెలి .. మా ఇంటికి వస్తానని చెప్పారు.
ఆమెని కలవబోతున్నానని సంతోషం ఒక ప్రక్క, ఆమె వస్తే సరిగా అతిధి మర్యాదలు చేయగలనో లేదో..అన్న బెంగ కొంత.

 నూటమూడు టెంపరేచర్ పెట్టుకుని మరీ ఎదురుచూసిన కొలది నిరాశే మిగిలింది.
ప్చ్.. ఏదో ఇబ్బంది ఏర్పడి ఉంటుంది.. అందుకే వాళ్ళు రాలేదు  అనుకున్నాను.  సాయంత్రం హాస్పిటల్కి వెళ్లాను. ఇక అక్కడ నుండి మొదలయింది నా అనారోగ్య పర్వం.

విపరీతమైన జ్వరం,తలనొప్పి..ఆ జ్వరాన్ని కంట్రోల్ చేయడానికి ఇంజక్షన్స్ ఇచ్చారు. ప్రిస్కిప్షన్ ప్రకారం మందులు వేసుకుంటుంటే చాలు..ఒకటే వాంతులు. నాకు ఊహ తెలిసాక ఎప్పుడూ..ఇలాటి జ్వర తీవ్రత ఎదుర్కోలేదు.గ్రుక్కెడు మంచి నీళ్ళు త్రాగినా..సరే ఇమడ కుండా  ఒకటే వాంతులు.

అలా రెండు రోజులు బాధపడ్డాను. రెండవరోజు మధ్యాహ్నం కి మగతగా పడిపోయి ఉన్నాను.  అప్పుడు నా ఫ్రెండ్ వైష్ణవి .. వచ్చింది. ఇంత జ్వరం, అనారోగ్యం పెట్టుకుని నాకు ఫోన్ కూడా చేయకుండా ఉన్నావని కోప్పడింది. మాకు  ఆప్తుడైన ఒక మిత్రుడు తనకి ఫోన్ చేసి చెప్పగానే ఉన్న ఫళాన బయలుదేరి వచ్చేసింది.

ఎందుకు..వైషూ ..!? నీకు ఎగ్జామ్స్ కదా!చదువుకోకుండా ఇలా వచ్చావు అన్నాను. తను డి ఎస్ సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది. నీకన్నా నాకు ఎగ్జామ్స్ ఎక్కువ కాదులే! అంటూ వారం రోజులపాటు నన్ను అంటి పెట్టుకుని ఉంది. రెండు పూటలా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం, డాక్టర్ చెప్పిన ప్రకారం మందులు  ఇవ్వడం దగ్గర నుండి.. నాకు సపర్యలు చేసింది. నాకు సెలైన్స్ ఎక్కిస్తున్నప్పుడు రాత్రింబవళ్ళు నన్ను పసిపాపలా కనిపెట్టుకుని.. ఒక అమ్మలా సేవ చేసింది.

వైరల్ ఫీవర్ అనుకున్నది కాస్త డెంగ్యూ అని నిర్ధారణ అయ్యాక,జాండిస్ లక్షణాలు బయటపడిన తర్వాత తను చాలా కంగారు పడింది. ఎమర్జన్సీ లో జాయిన్  చేసినప్పుడు నా వాళ్ళు అందరికన్నా ఎక్కువగా దిగులు పడింది. ప్లేట్లెట్స్ కౌంట్ బాగా పడిపోతే నాకు ఏమైనా అవుతుందేమోనని ఏడ్చేసింది.అనుక్షణం కంటికి రెప్పలా కాచింది. నేను ఆహారం సహించక తినడానికి మొండికేస్తే కోప్పడి బిడ్డకి తినిపించినట్లు తినిపించింది.

నేను హాస్పిటల్ లో ఇన్ పేషంట్ ఉండటానికి  ఇష్టపడక పేచీ పెడితే.. డాక్టర్ తో మాట్లాడి..రెండు పూటలా.. ట్రీట్మెంట్ కి తీసుకుని వస్తానని పర్మిషన్ ఇప్పించుకుని.. ప్రతి రోజు రెండు పూటలా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. అన్నయ్య,చెల్లెలు,నాన్న గారు ఇంతమంది ఉన్నా కూడా తనే నా ప్రక్కన ఉంది..
వైరల్  ఫీవర్ ఉన్నవాళ్ళకి నిద్రపట్టక పోవడం అనేది సర్వసాధారణమైన విషయం.
నేను విపరీతమైన తలనొప్పితో  నిద్ర రాక కొట్టుకుంటుంటే నా తల నిమురుతూ.. అమ్మలా చిచ్చుకొట్టి నిద్ర పుచ్చేది.
అలా సేవలు చేసింది. తనకి చాలా ముఖ్యమైన పరీక్షలకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా.. ఎగ్జాం రోజున వెళ్ళింది.
తను బాగా పరీక్ష వ్రాయలేదని కూడా నాకు తెలుసు.

ఇదంతా నేను ఇవాళ వ్రాసుకోకపోతే నాకు మనఃశాంతిగా ఉండలేననిపించింది.

స్నేహితులు అందరికి ఉంటారు. అందరూ వారి వారి వ్యక్తిగతమైన పనులు మానుకుని శ్రద్ద తీసుకుని హెల్ప్ చేయరు. ఇక్కడ హెల్ప్ అనడం కన్నా సేవ అనడం సబబు కూడా.

నిజానికి నా ఫ్రెండ్ వైషూ ..స్థానంలో నేనున్నా కూడా.. నేను కూడా అలా చేయలేను.అలా సేవ చేయగల శ్రద్ద,ఓపిక నా దగ్గర శూన్యం  కూడా.

ఇతరులకి సేవ చేయడంలో అంకితభావం ఏ కొందరికో ఉంటుంది.

స్నేహం విషయంలో నేనెప్పుడూ గర్వంగా ఫీల్  అవుతూ ఉంటాను. అది మరొకసారి ఋజువైంది.

సాగర సంగమం చిత్రంలో కమలహాసన్ మిత్రుడు శరత్ బాబు. శరత్ బాబు కమలహాసన్ కి మిత్రుడు. అతను మిత్రునికి సాయం చేయడం అనేది సామాన్యమైన విషయం. కానీ శరత్ బాబు భార్య కూడా భర్త స్నేహితుడికి సేవలు చేస్తుంది..సాధారణ మధ్య తరగతి కుటుంబాలలో స్నేహానికి చక్కని నిర్వచనం ఇచ్చిన దృశ్యాలు నాకు అప్పుడప్పుడూ గుర్తుకు వచ్చేవి. అలాగే మా ప్రకాష్ కూడా..నన్ను అర్ధరాత్రి అపరాత్రి అని చూడ కుండా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం నాకు కళ్ళు చెమరింపజేసాయి.

ఇన్ని రోజులు ఇంత  అనారోగ్యంగా ఉన్నా కూడా దూరంగా ఉన్న  మా అత్తమ్మకి కాని, మా బాబుకి కానీ తెలియనివ్వకుండా..జాగ్రత్తగా చూసుకున్నారు.

 ప్లేట్ లెట్స్ 40,000 పడిపోయి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళిన నాకు మా చెల్లెలు చూపిన  శ్రద్ద , నా ఫ్రెండ్ వైష్ణవి చేసిన సేవ వల్ల నేను తొందరగా కోలుకోగల్గాను.

నేనిప్పుడు ఒకటి అనుకుంటాను. నేను నా స్నేహితులకి ఏమి ఇచ్చాను అని కాదు..వాళ్ళ నుండి నేను ఏమి పొందానన్నదే గుర్తుంచుకోవాలనుకుంటున్నాను.

కొన్నాళ్ళ క్రితం స్నేహం-స్వార్ధం అని పోస్ట్ వ్రాసినప్పుడు నా మనసులో స్నేహం పట్ల ఎలాటి భావం ఉందొ.. ఇప్పటికి అదే భావం ఉంది. అంతకన్నా  ఇప్పుడు ఎక్కువ గౌరవభావం పెరిగింది.

ఇదండీ ..నా చెలిమి కలిమి.





7 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

మీరు కోలుకుని మళ్ళి పోస్ట్ రాసినందుకు చాలా సంతోషం గా ఉంది వనజ గారు.
వైష్ణవి లాంటి ఫ్రెండ్స్ మీకు ఉన్నరంటే మీరు చాలా అద్రుష్టవంతులు.
కొన్ని కొన్ని రాసిపెట్టి ఉండాలేమోనండి! అంతే!

జ్యోతిర్మయి చెప్పారు...

అదృష్టవంతులు వనజ గారూ, బాగా విశ్రాంతి తీసుకుని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

మీరు కోలుకుని ఆరోగ్యం తో ఇలా మళ్ళీ వ్రాయడం సంతోషం.చాలా ఇబ్బంది పడ్డట్టున్నారు.అలాగే మీ స్నేహితురాలి లాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు.అది మీ అదృష్టం.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు..థాంక్ యు వెరీ మచ్! కొద్ది రోజుల తర్వాత యధావిధిగా బ్లాగ్ లో కనబడటానికి ప్రయత్నిస్తాను. వైష్ణవి లాంటి ఫ్రెండ్ ఉండటం అదృష్టమే!
@జ్యోతిర్మయి గారు..థాంక్ యు వెరీమచ్! మీ అభిమానానికి ధన్యవాదములు.
@ఒద్దుల రవి శేఖర్ గారు. థాంక్ యు వెరీమచ్ ..అండీ! నిజంగానే చాలా ఇబ్బంది పడ్డాను.స్నేహం తోడుంటే..ఎన్ని అవాంతరాలు అయినా అధిగమించవచ్చును అని భావిస్తున్నాను.
మీ అందరి అభిమానానికి ధన్యవాదములు.

అజ్ఞాత చెప్పారు...

ఇప్పుడంతా క్షేమమే అని తలుస్తాను.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Arun (achanga) Ippudu kshemamagaane unnaanu. Thank you very much!!

SRINIVASA RAO చెప్పారు...

నేను నా స్నేహితులకి ఏమి ఇచ్చాను అని కాదు..వాళ్ళ నుండి నేను ఏమి పొందాను..అన్నదే గుర్తుంచుకోవాలని ......nice words