7, నవంబర్ 2012, బుధవారం

"దేవుడు " మా ఇంటి ముందుకు


ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నాను.  ఎవరెవరో వచ్చి అయినదానికీ కాని దానికి తెగ విసిగించి వేస్తున్నారు.

ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఉండనివ్వడంలేదు.




ప్రొద్దు ప్రొద్దుటే.. ఎక్కడ నుండో.. మొబైల్ దేవుడు రిక్షా వచ్చి మా ఇంటి ముందు ఆగింది. ముప్పయి ఏళ్ళు  కూడా దాటని భార్యాభర్తలు రిక్షా బండి ఆపుకుని  వాళ్ళు ధరించిన సివిల్ డ్రస్స్ తీసేసి భక్తుల అవతారం వేసారు. ముఖాలకి విభూది ధారణ గావించుకుని లౌడ్ స్పీకర్ ఆన్ చేసారు.

రండి అమ్మా..రండి.! షిర్డీ సాయిబాబా మీ ఇంటి  ముందుకు వచ్చాడు. మీ కోర్కెలు తీర్చడానికి కరుణించ డానికి మీ ముందు ఉన్నాడు. కానుకలు సమర్పించి ఆశ్సీస్సులు అందుకోండి.. అంటూ రిపీట్ గా  వచ్చే  సిడి ..ఆన్ చేసి.. ప్రతి ఇంటి ముందుకు వచ్చి లోపల ఉన్నవారిని బయటకి రండమ్మా..అంటూ..డిమాండ్ గా పిలవడం మొదలెట్టాడు.

నేను అదే సమయానికి ఇంటి  కాంపౌండ్ వాల్ కి ఆనించి వేసిన మొక్కల నుండి పూలు కోసుకుంటూ.. వాళ్ళని  చూస్తూనే ఉన్నాను.

నేను పూలు కోయడం చూసి దేవుడు పేరు చెపితే సెంటిమెంట్ గా కానుకలు ఇస్తాను అనుకుని మా గేటు  ముందు నిలబడ్డాడు. నేను అతనిని అసలు పట్టించుకోకుండా పూలు కోసుకుంటూనే ఉన్నాను.

రండమ్మా ! సాయినాధుడు  మీ ఇంటి ముందు వేచి చూస్తున్నాడు అన్నాడు.

నాలుగు  ఇళ్ళ అవతల సాయిబాబా గుడి ఉంది. అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. మా ఇంట్లోను దేవుడు ఉన్నాడు.. అన్నాను.  అతను నా మాట వినిపించుకోకుండా..

మీ ఇంటికి వచ్చాడు కదమ్మా..ఇక్కడ కానుకలు సమర్పించండి. అన్నాడు.

"లేదు .. నేను అలా  ఇచ్చే అలవాటు లేదు, నేను ఇవ్వను మీరు వెళ్లి రండి" అన్నాను.

అతను నా వైపు గుర్రుగా చూసి ప్రక్క గేటులోకి వెళ్ళాడు.

మా ఇంటి చుట్టుప్రక్కల వాళ్లకి మా ఇద్దరి సంభాషణ వినబడుతూనే ఉంది. వాళ్ళు నిస్సందేహంగా నవ్వుకుంటూనే ఉంటారు.

వారానికి ముగ్గురు నలుగురితో.. ఇదే విధమైన వాదన.

 యుక్త వయసులో ఉండి ఆరోగ్యంగా కనబడుతూ  కూడా.. దేవుడు పేరు చెప్పి, తీర్ధ యాత్రలకి వెళ్ళాలి సాయం చేయండి..అమ్మాయి పెళ్లి కి సాయం చేయండి అంటూ.. వచ్చి అడుగుతుంటారు. జాలి,దయ కల్గిన వారికి ఇదో పెద్ద శిక్ష.

ఇచ్చేది సాయమో,అపాత్ర దానమో..తెలియదు. చిరాకు ముంచుకొస్తుంది.

ఒకోసారి కోపంతో.. మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎందుకు అలా మాట్లాడామా ..అని బాధ కూడా  కల్గుతుంది.

మొన్నీ మధ్య  వినాయక చవితి వెళ్ళిన మర్నాడు.. ప్రొద్దుటే ముగ్గురు యువకులు నల్ల వస్త్రాలు ధరించి .. శబరిమలై కి వెళుతున్నాం. టికెట్లు కొనుక్కోవడానికి డబ్బు సాయం చేయండి అంటూ వచ్చారు.

మీరు పని చేసి సంపాదించుకుని వెళ్ళ  వచ్చును కదా ? అన్నాను. ముగ్గురిలో ఎవరు మాట్లాడలేదు

ఒక పని చేయండి అన్నాను. వాళ్ళు ప్రశ్నార్ధకంగా చూసారు. మా హవుస్ ఓనర్ గారు.. ఈ బిల్డింగ్ మొత్తానికి  రంగులు వేయించాలని అనుకుంటున్నారు. వెలుపలి వైపు అంతా.. కడిగి శుభ్రం చేయండి. రాను,పోను కి  రైలు టికెట్లు  రిజర్వేషన్  చేయించి ఇస్తాము అన్నాను. అంతే.. వాళ్ళు మాట్లాడకుండా వెళ్లి పోయారు.

ఎదుటి వారు సొమ్ము ఇస్తే జల్సాగా బ్రతికేద్దాం  అనుకుంటారు ఇలాటి సోమరిపోతులు.

ఈ దేశంలో ఇలాటి వారికి ఏమి తక్కువ ఉండదు. ఇలా ప్రతి నిత్యం వెంటపడే వారు ఉంటె చిరాకు కలగదా ..చెప్పండి. ? మొన్నటికి మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు భిక్షకులు అందరూ..ధర్మం చేయండి అని వెంట బడుతూ అడుగుతున్నప్పుడూ..అందరికి సాయం లేక తెగ ఫీల్ అయి పోయాను.

ఈ రోజు చూస్తే ఉదయాన్నే.. భవాని  భక్తులం ,యాగం చేస్తున్నాము, బ్రాహ్మలం .చందా వ్రాయండి అంటూ.. ఓ..బుక్ పట్టుకుని వచ్చి  క్షణంలో చేతిలో పెట్టేసారు.

నేను తిరిగి ఇచ్చేస్తూ..

మీరు భవాని  భక్తులే కానీయండి,యజ్ఞ  యాగాలే చేసేవారే కానీయండి. నేను ఏ విధమైన  చందా వ్రాయను అని చెప్పాను.

మీ జాతకం చెపుతాం ..అన్నారు. అసలు చెప్పవద్దు. నాకు తెలుసుకోవాలన్న ఆసక్తిలేదు. పుట్టినప్పుడే వ్రాసి ఉంటుంది.. అన్నాను.

పుట్టినప్పుడు కాదమ్మా.. పురిటి రోజు రాస్తాడు. అంటూ వివరాలు చెప్పబోయాడు.

వద్దండి..!!నేను అసలు  వినదల్చుకోలేదు అన్నాను. .. ఏదేదో మాట్లాడుతూ వెళ్ళారు.

ఇదేక్కడ గొడవండీ! మన ఇంటికి వచ్చి మనకి సలహాలు, నీతులు వల్లించి వెళతారు.. ఇలాటి వారి బారి నుండి.. ఎలా తప్పించుకోగలం!? అని తలపట్టుకు కూర్చున్నాను.

ఇలాటి వారే కాదు..బీద విధ్యార్డులకి చదువుకు సాయం చేసే పేరిట నిధులు వసూలు చేసి జల్సాగా ట్రిప్పులు తిరిగేసి వచ్చే వారిని చూసాను. వాళ్ళని  ఏం  చేయగలం..నాలుగు కడిగేయడం తప్ప.

అవసరమైనప్పుడు సాయం అందించే చేయి ఉండాలి. అలా అని అడిగిన వారందరికీ ఇచ్చి.. అనవసర దానాలు చేసి .. తర్వాత వెధవ  సంత ! నమ్మకంగా సెంటిమెంట్ల మీద కొట్టి,  తెలివిగా బోల్తా కొట్టించి డబ్బు దోచుకు వెళ్ళాడు అని తిట్టుకోవడం ఎందుకు చెప్పండి. ?

కాస్త మొహమాటం ప్రక్కన పెట్టి..నిర్భయంగా మాట్లాడితే.. అపాత్రదానం సగానికి సగం తగ్గుతుంది.అని నా అనుభవం.

ముప్పై మూడు  కోట్ల  దేవుళ్ళలో ఏ  దేవుడు ఎక్కడ ఉన్నాడో.. ఓ..మై గాడ్.!. నన్ను క్షమించు ..తండ్రీ .!!.అని కోరుకుంటూ (భయం అండీ మరి)

ఉదయం  మొదలైన ఈ చిరాకు ఇప్పటికి తగ్గలేదు అనుకుంటూ.. ఇలా కక్కేసాను కదా!!

అమ్మయ్య ! కాస్త చికాకు తగ్గినట్లు ఉంది.  ఇలాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఇప్పుడు  చికాకు పడటం ఇక  మీ వంతు.  :)

(అచ్చు తప్పులు ఉంటే మన్నించాలి. సమయాభావం )

9 కామెంట్‌లు:

కాయల నాగేంద్ర చెప్పారు...

పవిత్ర స్థలాలలో ఉండాల్సిన దేవుళ్ళను
కొందరు సోమరిపోతులు ఇలా రోడ్డు పైకి
తీసుకురావడం బాధాకరం.

మాలా కుమార్ చెప్పారు...

నాకూ అంతే నండి ఇలాంటివంటే మహా చికాకు .

చాతకం చెప్పారు...

You are on right path. Even God does not want you to do so. In fact you are trying to make them as better human beings rather than businessmen that trade god's good name.

దేముడి దృష్టి లో అపాత్రదానం ఒక నేరము కూడా!

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

నిజమే అండి మీరు చెప్పింది ఈ మద్య దేవుని పేరు చెప్పుకొని అడుక్కొనే సోమరిపోతులు పెరిగి పోయారు...

మరి గురువారం రోజు అడిగేవారు బాగా పెరిగినారు...

హైదరాబాద్ లో ఎ గల్లికి పోయిన ఇలా ఒక ఇలాంటి రిక్షా కనిపిస్తుంది...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

నిజమేనండీ 2005 లోనే హైదరాబాద్ లో ఈ మొబైల్ దేవుడు వచ్చేవాడు..గురువారం ఎక్కువ..

కానివ్వండి ఎవరి తెలివితేటలు వాళ్ళవి అనుకుంటాము ఇలాంటివి చూసినప్పుడు..

పల్లా కొండల రావు చెప్పారు...

ముందిదేదో దేవుళ్ల గోలనుకుని వదిలేశాను. 100% నేనూ మీ టైపే. చాలామంది ఎందుకు వాళ్లతో వాదన అంటారు. వదిలేస్తే మరీ ఎక్కువవుతారు. భక్తి కూడా ఓ సరుకైపోయిందీ వ్యవస్థలో. బాగుంది పోస్టు. ప్రతి అంశాన్ని భలేగా పోస్టుగా మలుస్తారండీ మీరు :))

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కాయల నాగేంద్ర గారు.. మనం నిత్యం అలాంటివి చూస్తూ భరించడం బాధగా ఉంది. :(

@ మాలా కుమార్ గారు.. మనం అలా వ్యతిరేకత చూపడం వాళ్ళ కొంతైనా మార్పు రావచ్చు కదండీ! దేవుడు పేరు చేపెతే బలం రావాలి కాని బలహీనత కాకూడదు కదా!

@చాటకం గారు మీ స్పందనకి ధన్యవాదములు. కొంతైనా అవగాహన ఉంటే .. అపాత్ర దానం ని చేయం కదండీ!! థాంక్ యు !!

@ప్రిన్స్ .. ప్రశ్నించండి. అది భాద్యత అని అనుకోండి. ధన్యవాదములు.

@రాజీ గారు.. మీరు వీరి బారిన పడుతుంటారా? :(

@ పల్లా కొండలరావు గారు.. మీ స్పందనకి ధన్యవాదములు. మీరు నాలాగానే!! థాంక్ యు వెరీమచ్.
మీ ప్రశంసకి ధన్యవాదములు.

హితైషి చెప్పారు...

ఏ విషయాన్ని ఒదిలి పెట్టరా?
ఇలా వ్రాయాలి అనే ఆలోచనలు మీకు ఎలా వస్తాయోనండీ
చాలా బాగా చెప్పారు. నేను చూసినప్పుడు జరిగినవే కదా.
జరిగినవి తల్చుకుని ఇవి చదువుతుంటే చచ్చే నవ్వు.
మనఃస్పూర్తిగా థాంక్స్

హితైషి చెప్పారు...

thappakundaa aa god mimmalni kshamisthaadoch.:)