27, డిసెంబర్ 2012, గురువారం

కంట్రీ ఉమెన్ కూతురు



అమ్మాయిల  స్వేచ్ఛా భావన,   వారికి ఇష్టమైన వస్త్రధారణ వల్ల  ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారో..ఈ కథలో చదవండి.

కంట్రీ ఉమెన్ కూతురు (కథ)

నేను ఈ మధ్య నా   స్నేహితురాలి ఇంటికి చిన్న వేడుకకి వెళ్ళాను. ఆ  రోజు  నా  స్నేహితురాలి  పుట్టిన రోజు. తను ఒక కాలేజ్ లో లెక్చరర్ గా పని చేస్తుంది. తన కొలీగ్స్ ని కూడా ఆ వేడుకకి పిలిచింది.
వాళ్ళందరి  మధ్య  నేనెందుకు అంటే  వాళ్ళ కంటే నువ్వే నాకు ముఖ్యమే అని కాళ్ళకి బంధం.  ఇక వెళ్ళక తప్పదు కదా! వెళ్ళాను కూడా.

నా ఫ్రెండ్ కి  ఇరవైయేళ్ళ వయసున్న అమ్మాయి ఉంది.ఆ అమ్మాయి అంటే ఇంట్లో అందరికి చాలా మురిపెం. అంత వయసు వచ్చినా తండ్రి మెడ  చుట్టూ  చేతులువేసి తండ్రి ఒళ్లో కూర్చోవడం అస్తమాను డాడ్  డాడ్ అంటూ పిలుస్తూ  వాళ్ళ అమ్మకసలు విలువే లేనట్లు జోక్స్ వేయడం చూస్తే నాకెందుకో అక్కడ అంతగా ఉండబుద్ది కాలేదు. ముళ్ళ మీద కూర్చునట్లు కూర్చున్నాను.

సరే  నా స్నేహితురాలికి చిన్న పాటి పనులు చేసి సాయం చేద్దామన్నా అప్పటికే ఆమె పనులు అన్నీ చేసుకుని ప్రెష్ అవడానికి లోపలకి వెళ్ళింది. తను ఇచ్చి వెళ్ళిన టీ సిప్ చేస్తూ నా స్నేహితురాలి కూతురి తో మాట్లాడుతున్నాను. పక్కనే ఆ అమ్మాయి  ఆమె తండ్రి ఉన్నారు.

ఇంతలో అతని ఫ్రెండ్స్ ఇద్దరు కుటుంబాలతో  సహా వచ్చారు. నేను లేవబోతే పర్లేదు, మీరు కూర్చోండి అంటూ..ఆడవాళ్ళు ఇద్దరు నా ప్రక్కన మగ వాళ్ళు అతని ప్రక్కన   సోఫాలో సెట్ అయ్యారు.  పరిచయాలు చేస్తూ నా గురించి చెప్పారు. "రమ్య చిన్నప్పటి స్నేహితురాలు. నగరంలో ఒక మానసిక వైద్యశాలని నడుపుతున్నారు అని చెప్పగానే నన్ను కాస్త ఆశ్చర్యంగా  చూస్తూ ఉండటం గమనించాను.
నా స్నేహితురాలి కూతురు.. ప్రక్కనే ఉన్న మోడా   వేసుకుని వాళ్ళకి దగ్గరలోకి  లాక్కుని కూర్చుంది.

నా స్నేహితురాలి కూతురు  మెడిసన్ చదువుతుంది.  వచ్చిన వాళ్ళు ఆ అమ్మాయి చదువు విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. అప్రయత్నంగానైనా వాళ్ళ చూపులు ఆ అమ్మాయి మెడ నుండి క్రిందికి దిగాయి వాళ్ళ చూపు ఆనిన చోట అనాచ్ఛాదిత శరీర భాగాలు. నా ఫ్రెండ్ కూతురు సల్వార్ కమీజ్  వేసుకుంది   కానీ డీప్ కటింగ్ వల్ల అవసరం ఉన్న చోట బట్టలు లేకుండా చూడటానికి ఇబ్బందిగా ఉంది. వాళ్ళ నాన్న  స్నేహితుడి చూపు పదే  పదే  అక్కడే ఆగుతుంది. నా స్నేహితురాలి భర్త ఆ విషయం గమనిస్తున్నాడు.

నాకు సిగ్గుగా అనిపించి మనం లోపలకి వెళదాం రామ్మా! అని లేచాను. ఆ పిల్ల ఆ మాట పట్టించుకోకుండా ఇంకా మాట్లాడుతూనే ఉంది. 

నేను నా ఫ్రెండ్ రూమ్లోకి వెళ్ళిపోయాను. అప్పటికే తను తయారై పోయింది. "రమ్య ఒక మాట చెపుతాను ఏమి అనుకోవుగా ?" అడిగాను.
 "అయ్యో! అదేమిటే నువ్వేమైనా చెపితే నేనెప్పుడైనా అభ్యంతరం చెప్పానా , చెప్పు " అంది.

"వెంటనే నీ కూతురు డ్రెస్ మార్పించు. నలుగురిలో అలాటి డ్రెస్ బాగోలేదు " అన్నాను.

"నేను చెపుతూనే ఉంటాను..అయినా వినదు.దానికి వత్తాసు వాళ్ళ నాన్న కూడాను. మన కాలంలో  అప్పుడు మనకెలాగు స్వేచ్ఛ లేదు ఇప్పుడు మన పిల్లలైనా స్వేచ్ఛగా  వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఉండనీయి అంటారు". అని చెపుతూనే ..

"స్వీటీ! ఒకసారి లోపలి రా" అని కూతురిని పిలిచింది. ఆ అమ్మాయి విసుక్కుంటూనే లోపలకి వచ్చింది.

“ఆ డ్రెస్ అంత బాగోలేదు,ఇంకో డ్రెస్ వేసుకోరాదు” అని చెప్పింది అనునయంగా.


"నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది, ఇదే  డ్రెస్ తో ఉంటాను.. అయినా బర్త్ డే  నీది కాని నాది కాదుగా" అని వెళ్ళిపోయింది.

రమ్య నా వంక నిస్సహాయంగా చూసింది. తర్వాత రమ్య అతిధి మర్యాదలో మునిగిపోయింది.

కాసేపటికి చిన్న కేక్ కటింగ్  కార్యక్రమం.

"ఇప్పుడు మమ్మీ కోసం ఒక పుట్టినరోజు పాట పాడాలి, ఆంటీ! మీరు పాడండి"అని  నన్ను అడిగింది.

దానికేం భాగ్యం ! అంటూ అహో!ఒక మనసుకి నేడే పుట్టిన రోజు..అని మా రమ్య కి ఇష్టమైన పాట ని మొబైల్ లో ప్లే చేసాను.

నా స్నేహితురాలు ముఖం వికసించింది.  అదే గొప్ప కానుక అని మురిసి పోయింది.

 "మీకొక విషయం తెలుసా! ఈ రోజే రమ్య కృష్ణ పుట్టినరోజు కూడా . అమ్మ, రమ్య కృష్ణ సేమ్ ఒకే  తేదిన ఒకే సంవత్సరం పుట్టారు” అని చెప్పింది స్వీటి.

అవునా !?  ఆశ్చర్యపోయారు అందరూ .

“మరి మా మమ్మీ చూడండీ అప్పుడే అమ్మమ్మలా ఎలా ఉందో ?రమ్య కృష్ణ చూడండి ఎలా ఉందో ?” పోలిక పెట్టింది.

"నీకు రమ్య కృష్ణ అంటే ఇష్టమా? "అడిగాను నేను.

“చాలా ఇష్టం” అని కళ్ళు విప్పార్చుకుని చేతులు పెద్దగా చాచి యెంత ఇష్టమో చూపించి చెప్పింది.

నటనా,లేక,అందమా? అడిగారు మిగతావారు ఆసక్తిగా.

“ఇవి రెండు కాదు శిల్పం లాటి ఆమె ఫిజిక్ “ అంది. ఎస్,ఎస్..మాకు అంతే! అన్నారు  మిగతా వారు గుడ్డెద్దు చేలోపడినట్లు.

"రమ్య కృష్ణలా మీ అమ్మ లేదని నీకు బాధా లేక మీ అమ్మలా రమ్య కృష్ణ లేదని బాధా ?" కొంచెం కోపం గా అడిగాను.

"ఆంటీ..మీకు కోపం వద్దు. నిజానికి రమ్య కృష్ణ కంటే మా అమ్మ చాలా అందంగా ఉంటుంది కదా " ప్రశ్న ఇబ్బందికరమే. అయినా వాస్తవం ఒప్పుకుంటూ..

"నిజమే" అన్నాను నేను.

“కానీ  మా అమ్మ  చూడండీ  ఆ డ్రెస్ సెన్స్ చూడండీ. అమ్మమ్మ లా  ఉంటుంది”  అంది.

 అలా అని ఊరుకోలేదు రమ్య . అంతే కాదు మా అమ్మ కొలీగ్స్ కి మా అమ్మ కి తేడా చూడండి. అంది ఆరోపణ గా..

"ఎప్పుడైనా అమ్మ నా కాలేజ్ కి వస్తే నా ఫ్రెండ్స్ చేసే కామెంట్స్ కి నాకు చిన్న తనంగా ఉంటుంది.ఆవిడ  మీ అమ్మా? మీ అమ్మమ్మ అనుకున్నాం అంటారు. తన స్టైల్ మార్చుకోమన్న మార్చుకోదు  మమ్మీ వొట్టి  కంట్రీ ఉమెన్"  అని చెప్పింది కాస్త బాధతో  ..

కరక్ట్ గా ఆ అమ్మాయి మంచి విషయం లోకి వచ్చింది.ఇలాంటప్పుడే  బ్రెయిన్ వాష్ చేయాలి అనుకున్నాను.

"సరే, ఇప్పుడు మీ అమ్మ అధునాతనంగా కనిపించాలి  అంతేనా..!?"

"అవును"  కచ్చితంగా అన్నట్లు చెప్పింది.

"అందుకు మీ నాన్న ఒప్పుకోవాలిగా " అన్నాను.

"డాడీ ఎప్పుడూ   ఓకే నే" అమ్మను అందంగా చూడటం ఆయనకు మాత్రం ఇష్టం కాదా" అంది.
 "సరే ఈ సారి మీ అమ్మని నాగరికంగా మార్చే బాధ్యత నాది సరేనా ! " అన్నాను

ఆ తరువాత కబుర్లు తోటి డిన్నర్ ముగించి అందరు వెళ్ళినా కాసేపు అదనంగా కూర్చుని నేను బయలుదేరేటప్పుడు మళ్ళీ ఆ పిల్ల వాళ్ళ అమ్మని మార్చే సంగతి గుర్తుచేసింది.

నన్ను బయటకి సాగనంపటానికి వచ్చి "ఆదేమిటే! డ్రెస్ సెన్స్ గురించి   తనకేదో మంచి మాటలు చెపుతావనుకుంటే నన్ను మార్చుతానని చెపుతున్నావ్ "అని అడిగింది..రమ్య.

"అందులో భాగమే ఇది కూడా ".అని హామీ ఇచ్చాను .

ఒక నెల తర్వాత నేను,మా రమ్య కలసి స్వీటీ వాళ్ళ కాలేజ్ కి వెళ్ళాం.

వెళ్ళే ముందు తనని ఒక బ్యూటి పార్లల్ కి తీసుకువెళ్ళి ఐ బ్రోస్ ట్రిం చేయించడం,తన చక్కటి ఒత్తైన జుట్టుని కట్ చేయించాకుండానే నానా అవస్థలు పడి స్టైల్ అయిన హెయిర్ స్టైల్ వేయించడానికి నా తల ప్రాణం తోకకి వచ్చింది.

ఒక బ్లౌస్  ని డీప్ నెక్ పెట్టి కుట్టించి చాలా పల్చటి జారిపోయే  చీరని కట్టించి అలవాటులేని వస్త్రధారణతో అది తెగ అవస్థలు పడుతుంటే బాగా జాలిపడి నీ కూతురిని మార్చాలంటే ఇంతకన్నా వేరే మార్గంలేదు   అని  నచ్చజెప్పి రోడ్డుమీద నడవడానికి తెగ సిగ్గుపడుతుంటే ఆటో   పిలిచి ఎక్కేసి యెన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలో దిగాం.

లోపలోకి నడుస్తూ ఉంటే.మా రమ్యని కళ్ళు తిప్పకుండా   చూస్తున్న కొంత మందిని గమనించాను. ఒక వైటు కోటు తొడుక్కున్న కుర్రాడు ఈల వేయడం చూసి నవ్వుకున్నాను.

మేము లోపలికి నడుస్తూ ఉండగానే ఒక పింక్  టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి ఎదురైంది. ఆ టీ షర్ట్ పై.. రెండు ఎర్రటి ఆపిల్స్ ఎదపై వచ్చేటట్లు ముద్రించి ఉన్నాయి. ఆ క్రిందనే  టేస్ట్ మీ ! అనే కొటేషన్ కూడా ఉంది.
ఎదురుగా వస్తున్న ఒక కాలేజ్ కురాడు ఆ అమ్మాయికి  తన శరీరంతో డాష్ ఇచ్చి మరీ ఆ అమ్మాయిని పడవేసి వెంటనే ఆమె ఎదపై చేయి వేసి "యాపిల్స్ తీసుకుంటాను టేస్ట్ మీ అంటున్నాయిగా " అని  అసభ్యంగా ప్రవర్తించాడు.

చుట్టూర  ఉన్నవారు ఏం జరిగిందో అర్ధం చేసుకునే లోపు అతను బై అంటూ వెకిలిగా నవ్వుకుంటూ అతని ఫ్రెండ్స్ తో కలసి బైక్ పై వెళ్ళిపోయాడు.  ఇదంతా కూడా బయటకి వస్తున్న నా ఫ్రెండ్    కూతురు  స్వీటీ చూస్తూనే ఉంది.

యాపిల్స్ టీ షర్టు వేసుకున్న అమ్మాయి ఏడుస్తూ వెంటనే అక్కడినుండి వెళ్ళిపోయింది.

నా ఫ్రెండ్ కూతురు వాళ్ళ అమ్మని కొత్త అవతారంలో చూసి కొంచెం కూడా స్పందించలేదు.  అలా జరగడం చూసి షాక్ లో ఉందేమో పైగా తల్లిని అవతారంలో  చూసి జీర్ణించు కోలేకపోయింది అనుకుంటాను.

 " ప్లీజ్ ఆంటీ,అమ్మని నేను ఇలా చూడ లేకపోతున్నాను. మీరు వెంటనే ఇంటికి వెళ్లి పోండి "చెప్పింది.

అందుకోసమే చూస్తున్న మేము  వెంటనే ఇంటి కి  వచ్చి పడ్డాం. .

ఇంటికి వచ్చీ రాగానే అలవాటు లేని  కొత్త అలంకారాలు అన్నీ పీకి పడేసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది మా రమ్య.

"అయినా అదేం పోయే కాలమే వాడు అలా చేసాడు" అని  కాలేజ్ లో జరిగిన దానిని గుర్తుచేసుకుని నోరు నొక్కుకుంది.

"మీ లాటి బాధ్యత గల గురువుల స్థానంలో ఉన్నవాళ్ళే చెప్పాలి దానికి పరిష్కారం "అన్నాను తీవ్రంగా..
కాలేజ్ లో చదువుల తో పాటు నైతిక విలువలు, సంప్రదాయాలు, వస్త్రధారణ   గురించి మీరసలు పిల్లలకి వివరిస్తున్నారా? యెంత సేపు మార్కులు, రాంక్ లు గోల తప్ప"  అన్నాను తీవ్రంగా..

"నిజమే, అకస్మాత్ బందులు, సమ్మెలు వీటితో సిలబస్ త్వరగా అవజేయాలి అన్న ఆలోచన తప్ప వాళ్లకి కౌన్సిలింగ్ చేసే అవకాశాలు మాకు ఎక్కడ ఉంటాయి.?" అంది.

"మనసుంటే మార్గం ఉంటుంది.అయినా మహిళా కళాశాలగా పేరు పొందిన మీ కాలేజ్ పిల్లల  వస్త్రధారణ మీరు గమనించడం లేదా ? నీ కూతురే కాదు..ఆ వయస్సు ఉన్న పిల్లందరూ.. కుడి ఎడంగా అదే రకం. ఫిజిక్   టైట్ డ్రెస్ లు, శరీర సౌష్టవం ప్రదర్శించుకునే విధంగా తయారు అవుతున్నారు. మీరు పెట్టిన డ్రెస్ కోడ్ తరగతులు జరిగే కాలం లోనే! ఎక్కడన్నా   చూడు అశ్లీల  వస్త్ర ధారణే ! మగవాళ్ళు దాన్ని అలుసుగా తీసుకుంటున్నారు.."  అంటుండగానే మా రమ్య కూతురు కాలేజ్ నుండి వచ్చేసింది.

ఏమిటి ఆంటీ! మా అమ్మకి క్లాస్ తీసుకుంటున్నారు? అని అడిగింది. "ఇప్పుడు నీకు కూడా క్లాసు తీసుకోవాలి" సీరియస్ గా  అన్నాను.

"తప్పదా..!? "అడిగింది..

"పది మందికి  చెప్పగల్గే గురు స్థానంలో ఉన్న మీ ఆమ్మ మాటే   నువ్వు వినకుండా తేలికగా తీసి పారేస్తున్నావ్!   నా మాట వింటావని నాకు నమ్మకం లేకపోయినా చెపుతాను. ఇప్పుడు చెప్పేదంతా
మీ యువ తరం అమ్మాయిల డ్రెస్ సెన్స్ గురించే చర్చ "

మాకు దగ్గరలో కూర్చుని ఇక క్లాస్స్ తీసుకోవడమే మీ పని అన్నట్టు చూసింది స్వీటీ .

"ఇందాక జరిగిన   సంఘటన చూడు. మగ పిల్లలు అడ్వాన్స్ అవడానికి మీరు ఎలా అవకాశం ఇస్తున్నారో! అందం అనేది శరీరాన్ని ప్రదర్శించుకోవడంలో రాదు. అలా ప్రదర్శించుకోవడం అనేది.. అమ్మాయిలలో కానీ మహిళల్లో కానీ ఒక జాడ్యం. మగ వారిని ఎలా ఆకర్షించాలి  అనే తాపత్రయమో లేక మగవారికి తాము విచ్చలవిడి తనానికి అంగీకారమే అన్న సూచన ఇవ్వడానికో లేక అందంగా లేమనుకుంటారనే ఆత్మ నూన్యతా భావం తోనో ఉంటూ మగవారిని ఆకర్షించడానికి  శరీరాన్ని బహిర్గతం చేసుకున్నట్లు ఉంటుంది. రేపు నీకు  పెళ్ళై భర్తతో  ఇలాటి వస్త్ర ధారణ తో తిరుగుతుంటే నా భార్య   అందంగా  ఉంది అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు తప్ప నా భార్య సెక్సీ గా ఉందని చెప్పుకోవడానికి ఇష్టపడతారా  చెప్పు? " అన్నాను.

స్వీటీ మౌనం గా ఉంది.

"ఆఖరికి నీవు అమితంగా ఇష్టపడే ఐడియల్ షి రమ్య కృష్ణ భర్త తో సహా " అన్నాను నొక్కి చెపుతూ..

తెర మీద స్త్రీలని చూసి వారిని మీరు అనుకరించే విధంగా డ్రెస్ చేసుకోవడం, చీర కట్టినా కటి ప్రదేశం పై కట్టడం,జాకెట్ ఉండి  లేనట్లు తాడు లాగితే పుట్టుక్కున తెగిపోయేటట్లు ఉండటం,  జుట్లు విరబోసుకోవడాలు   అంతా యెంత అసహ్యం గా ఉంటుంది? చీర కట్టి ఎలా అశ్లీల ప్రదర్శన చేయవచ్చో నడి రోడ్లో నిలువెత్తు బొమ్మల సాక్షిగా చూపుతున్న షో రూమ్ల వ్యాపార నైపుణ్యాలు,చూస్తుంటే అసహ్యం కలగకుండా మీరు ఆమోద ముద్ర వేస్తుంటే యెంత నొచ్చుకుంటున్నామో! అమ్మల్ని అధునాతనంగా   చూడాలనుకున్న మీ వెర్రి మొర్రి కోర్కెలు.. దిగులు పుట్టిస్తున్నాయి. అలాగే మాధురి దీక్షిత్ కూడా ఆశ్చర్య పోయేలా గృహిణుల వీపు ప్రదర్శనలు గురించి ఎంతైనా చెప్పవచ్చు మీలో ఒక్కరన్నా ఆలోచించగల స్థితిలో ఉంటే అన్నాను "ఏదో ఆవేశం పూనినట్లు.

స్వీటి అలాగే మౌనంగా వింటుంది. ఇనుము వేడి మీద  ఉన్నప్పుడే సమ్మెట దెబ్బలు కొట్టి   మనకి కావాల్సిన విధంగా తీర్చి దిద్దుకోగలం అనుకుని మళ్ళీ కొన సాగించాను.

అసలైన  అందం  అంటే  ఆత్మ  విశ్వాసం  అని, వ్యక్తి కి  వన్నె తగ్గని ఆభరణం వ్యక్తితత్వం అని తెలుసుకోవాలి.  అందంతో కాదు మీకున్న తెలివితేటలతో,శక్తియుక్తులతో, సమర్దతా నైపుణ్యంతో మగవాళ్ళని ఆకర్షించగల్గినప్పుడు మీరు గొప్ప క్రింద లెక్క తప్ప శరీరాలు ఆరబోసుకుని  మాత్రం కాదు.  ఎంతో ఉన్నతమైన చదువులు చదువుతున్న మీకీ పాటి సంస్కారం లేదని తెలివితేటలూ లేవని నేననుకోను అన్నాను దీర్ఘంగా, ఆవేశంగా.

రమ్యా నా ఆవేశాన్ని విస్తుపోయిచూస్తుంది. నేనిలా కఠినంగా మాట్లాడతానని అనుకోలేదు కాబోలు ..తన కూతురు ఎలా స్పందిస్తుందో ..తర్వాత ఎలా కామెంట్ చేస్తుందో ..అని కించిత్ బెంగ కూడా వేసింది ఆమెకు. నా వైపు మొహమాటంగా చూసింది.

"నీ లాంటి పిల్లలకి తల్లి దండ్రులు చెప్పలేక మిమ్మల్ని ఆ వస్త్ర ధారణలో చూడలేక, బయటికి వెళితే ఎలాటివి ఎదుర్కుంటారో అన్న భయంతో యెంత అలమటిస్తారో మీకేం  తెలుసు? నీ స్థానం లో నా కూతురు ఉన్నా ఇలాగే చెపుతాను. చొరవచేసి  ఇంత తీవ్రంగా చెపుతున్నందుకు ఏమి అనుకోకు స్వీటీ " అన్నాను.

"ఈ మంచి నీళ్ళు తాగు" అందించింది రమ్య.

"మేము కంట్రీ వుమెన్స్  అని   అనుకున్నా  పర్లేదు మరి మీ తరం వాళ్ళు ఎదుర్కొంటున్న  అవమానాలు సంగతి ఏమిటో చెప్పు? "అన్నాను.

"సారీ..ఆంటీ.. ! నేను ఇప్పుడు ఏమి మాట్లాడ లేను" అని లోపలకి వెళ్ళిపోయింది.

మా రమ్య నాచేతిని తన చేతిలోనికి తీసుకుని ఆప్యాయంగా నొక్కింది. ఇంకాసేపు ఉండి  నేను వచ్చేసాను.

ఆ రోజు రాత్రి రమ్య నుండి కాల్

"గ్రాండ్ సక్సెస్" అని అరిచింది.

 "ఏమిటే నీ కేకలు, హడావిడి"అడిగాను.

నా కూతురు భోజనాల బల్ల వద్ద  "అమ్మా ! నువ్వు ఎప్పుడు నీలాగే ఉండు,నిన్ను ఎప్పుడు కంట్రీ ఉమెన్ అని యెగతాళి చేయను అంది. అలాగే వాళ్ళ డాడీతో రేపు తనని షాపింగ్ కి తీసుకువెళ్ళమని అడుగుతుంది. ఉన్న డ్రెస్ లలో   ఒక్క డ్రెస్ కూడా వేసుకోవడానికి పనికి రాదనీ, కొత్త డ్రెస్ లు కొనివ్వమని అడుగుతుంది.. అని చెప్పింది  రమ్య సంతోషంగా."అలాగే నీకు తన తరపున ఒక రిక్వెస్ట్ చెప్పింది వాళ్ళ కాలేజ్ లో నువ్వు కౌన్సిలింగ్ తరగతులని ప్రత్యేకంగా నిర్వహించాలని అది తన కోరికని చెప్పమంది"  అంది.

"అలాగే నా పని  అదే  కదా." అన్నాను చాలా సంతోషంగా . 

8 కామెంట్‌లు:

జీడిపప్పు చెప్పారు...

సింప్లీ సూపర్బ్!
అసభ్యంగా, రెచ్చకొట్టే విధంగా ఉండవద్దు అని చెప్పడం పురుషాహంకారం అంటారు కొందరు మూర్ఖవాదులు!!

అజ్ఞాత చెప్పారు...

వనజ గారూ, మీ నుండి ఇలాంటి ఆత్మవిమర్శ (ఓ మహిళగా) ఊహించిందే. ఇలాంటి ఆత్మవిమర్శ మరింతమంది చేసుకోగలిగితే కొద్దిశాతమైనా అఘాయిత్యాలు ఆపగలుగుతాం. ఇంటి తలుపులు బార్లా తెరచినా దొంగలు పడకూడదనే స్త్రీవాదుల వాదనలు చూస్తేనే చికాకెత్తేది.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

చాలా బాగుందండి

వేణూశ్రీకాంత్ చెప్పారు...

చాలాబాగుందండీ..

శశి కళ చెప్పారు...

hm...intaku mundu chadivanu akka

హితైషి చెప్పారు...

చెప్పక చెడేరు అంటారు. మీరు చెపుతూనే ఉండండి. ఆచరించిన వారు అదృష్టవంతులు.

బొందలపాటి చెప్పారు...

అసలైన విలువల గురించి చెప్పారు. ధన్య వాదాలు.

Uma Jiji చెప్పారు...

Bavundi