1, ఏప్రిల్ 2013, సోమవారం

మాట ఒక వంతెన

ఈ కాలపు పిల్లలకి క్షణం మాట్లాడే తీరిక లేదు అనేకంటే  పెద్దలతో మాట్లాడటం అంటే పరమ సుత్తి అనే భావమే గోచరిస్తుంది

 నేను గతంలో ఒకసారి చెప్పాను కదా ! పేస్ బుక్ లో ఫ్రెండ్స్ షేర్ చేసిన పిక్ కి లైక్  కొట్టే సమయంలో  పావు వంతు అయినా పెద్దలతో మాట్లాడితే సంతోషిస్తారు అని

మా అబ్బాయి తోనూ అలాంటి పిర్యాదు ఒకటి ఉంది ఎవరు ఫోన్ చేసినా తీయడు కొట్టుకుని కొట్టుకుని చావాల్సిందే ! పోనీ వాడి ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకుండా ఉంటాడా అంటే అలాంటిదేమీ ఉండదు ఫ్రెండ్స్ తో బహు చక్కగా మాట్లాడు కుంటాడు

 ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం  అవతలి వారు ఏమి అవసరం ఉండి ఫోన్ చేసారో  అన్నది తెలుసుకోవాలి కదా ! అర్ధరాత్రి 12 గంటలప్పుడు నీతో అవసర పడితేనే కదా కాల్ చేస్తారు ఒకవేళ పిచ్చాపాటి కబుర్లు చెప్పేవాళ్ళు అయితే నిర్మొహమాటంగా కాల్ చేయవద్దు అని చెప్పేయి అని  చెప్పి మందలించాను.  నాలాగే కావాల్సిన వాళ్ళు అందరూ మందలించారు  అప్పటి నుండి కాస్త పర్వాలేదు. ఎవరైనా కాల్ చేస్తే వెంటనే పోన్ తీసి మాట్లాడుతున్నాడు :)

ఇక ఇతరుల విషయంలోకి  వస్తే  ఈ మధ్య మా పరిచయస్తుల అమ్మాయి కి ఈ మధ్యే వివాహం జరిగింది. ఆమె భర్త స్నేహితుడికి వివాహం కావాల్సి ఉంది. అతను విదేశాలలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు   ఓ రెండు నెలల క్రితం   సెలవు  పై వచ్చినప్పుడు ఈ జంటని కలవడానికి వచ్చాడు.  మీ విజయవాడ  వైపు అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలని ఉంది మీ వైపు సంబంధం చూడండి అని చెప్పి అతని బయో డేటా అతని మిత్రునికి ఇచ్చి వెళ్ళాడు

మా పరిచయస్తుల అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతూ తన తల్లితో చెప్పింది (ఆమె భర్త పేరు కృష్ణ)   కృష్ణ ఫ్రెండ్ వివేక్ కి మన విజయవాడ వైపు అమ్మాయి ని పెళ్లి చేసుకోవాల్సి ఉందంట ఎవరైనా  మనకి తెలిసిన అమ్మాయి ఉంటె వాళ్ళకి తెలియజేద్దాం అని చెప్పింది మా పరిచయస్తురాలు వచ్చి నాతో ఆవిషయం  చెప్పారు. వివరాలు  పంపమనండి అని అన్నాను నేను ఊరక ఉండలేక

నా మెయిల్ ID  కి వాళ్ళు అతని వివరాలు పంపారు ఇక అప్పటి నుండి నేను పెళ్ళిళ్ళ పేరమ్మ అవతారం దాల్చాను ఎవరు వచ్చినా మీకు అమ్మాయి ఉందా! విదేశాల సంబంధం ఉంది ఇస్తారా ! అని అడగడం మొదలెట్టాను కొంత మందికి అతని వివరాలు ఫార్వార్డ్ చేయడం వాళ్ళు ఇచ్చిన వివరాలు మధ్యలో మాకు పరిచయస్తురాలైన అమ్మాయికి పంపడం అతనికి అమ్మాయి నచ్చకపోవడం లాంటివి జరిగాయి

ఒక పంక్షన్ లో నాకు కూతురు  వరుస,  వయసు ఉన్న అమ్మాయి చప్పున గుర్తుకు వచ్చింది వాళ్ళ నాన్న తో ఇలా చెప్పాను  " బావయ్యా ! పద్మకి సంబంధాలు చూస్తున్నారా !?  మంచి సంబంధం వివరాలు ఉన్నాయి ఒకసారి చూడండి " అని చెప్పాను . వాళ్ళు నా మాట మీద ఉన్న గౌరవం తో ఓకే అన్నారు. అబ్బాయి వివరాలు వారికి పంపాను  అమ్మాయి వివరాలు మా పరిచయస్తుల అమ్మాయికి అల్లుడికి కూడా పంపాను. ఇరవై రోజులయినా  అటువైపు నుండి సమాధానం రాదు. నాకేమో మా బందువుల  నుండి కాల్స్ పై కాల్స్.

రెండు సార్లు  పైగా అతని వివరాలు తెలియలేదు ఇంకా అతను సమాధానం కూడా  చెప్పలేదు అతను అతని తల్లి దండ్రుల వివరాలు ఇస్తేనే కదా మూవ్ కాగలము  అని చెప్పాను

ఈ లోపు అతను  ఇచ్చిన వివరాలు ప్రకారం FB లో సెర్చ్ చేస్తే అతను కనిపించాడు అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి మెసేజ్ లో నన్ను నేను పరిచయం చేసుకున్నాను. మా బంధువుల అమ్మాయి FB  ప్రొఫైల్ షేర్ చేసాను. ఇటీవలి కాలంలో FB  ఇందుకు బాగా పనికి వస్తుంది అట.

ఇంతకీ అతని తో మాకున్న అవసరం ఏమంటే అతని బయో డేటా లో అతని తల్లిదండ్రులు,స్వగ్రామం, నివాసం మొదలైన  వివరాలు ఏమి లేవు అతని చదువు ఉద్యోగం ఆస్తి పాస్తుల వివరాలు మాత్రమే  ఉన్నాయి.  కేవలం అవి ఉంటెనే  చాలదు కదా! కుటుంబం గురించి తెలియాలి  అమ్మాయిని ఇవాలనుకున్నప్పుదు  వారి పెద్దవారితో మాట్లాడాలి సంప్రదాయం చూసుకోవాలి లాంటివి ఎన్ని ఉంటాయి చెప్పండి!?

ఏమిటో .. ఈ కాలం పిల్లలు అనుకుని విసుక్కున్నాను మా పరిచయస్తుల పిల్లని అడిగితే అతనిని కనుక్కుని చెపుతానని చెప్పి ఒక నెల రోజులు అయింది సమాధానం లేదు అతనికి పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్ కి సమాధానం లేదు

పోనీ అమ్మాయి నచ్చలేదు అని సమాధానం అయినా చెప్పాలి కదా! అదీ చెప్పలేదు పిల్ల బహు చక్కనిది ఛామానచాయ గా  ఉంటుంది. నెలకి లక్ష రూపాయాలు తెచ్చుకుంటుంది  ఆట పాటలలో అన్ని బహుమతులు ఆ పిల్లవే! పైగా  ఈ పిల్ల అన్నయ్య విజయవాడ అమ్మాయినే చేసుకోవాలని ఇంటరెస్ట్ చూపిన అబ్బాయి ఒకే సిటీ లో ఉన్నారు. కానీ  అతని తల్లి దండ్రుల వివరాలు చెప్పరు. రెండు మూడుసార్లు నేను అడిగి చూసి  విసుగువచ్చి మానేసాను.

మా బంధువుల నుండి ఆ అబ్బాయి వివరాలు చెప్పారా అని నాకు పోన్ కాల్స్ . అబ్బా.. ఈ విషయంలో నేను ఎందుకు తలదూర్చానా?  అని నాపై నాకే కోపం వచ్చింది. బాధ్యత,సంస్కారం లేని వాళ్లతో పెట్టుకుని నేను తప్పు చేసానా అనిపించింది. పైగా పోన్ కాల్స్ ని తప్పించుకుని దొంగ బతుకు బతకాల్సి వచ్చింది. ఎలాగోలా మా బంధువుల వారికి అబ్బాయి ఇంకా ఆన్సర్ చేయలేదు అని చెప్పాను. ఆ సంబంధం వదిలేసి వేరే సంబంధం  చూసుకోమని చెప్పాను కూడా .  ఈ విషయంలో నేను పడ్డ ఇబ్బంది ఇబ్బంది కాదు .అదొక హెల్. అందుకే అంటారేమో ఇతరుల విషయాలలో జోక్యం అనవసరం అని. ఇక ఎప్పుడూ ఇలాంటివి తలకి ఎత్తుకొను బుద్ధి  వచ్చింది అనుకుని.. తిట్టు కుంటూ ఆ కోపంలో  ఆ వివేక్ అన్న అతని FB లోకి వెళ్లి ఒక మెసేజ్ పంపాను

వివేక్ ! మీ బయో డేటా ఇచ్చినప్పుడు అందుకు మీరు బాధ్యత వహించాలి మీ నుండి ఇతరులకి సమాధానం లభించాలి లేదా నిర్మొహమాటం గా మీ అభిప్రాయం చెప్పాలి ఒక నెల రోజుల పాటు మీ అభిప్రాయం చెప్పకుండా దాటేయడం సంస్కారం అనిపించుకోదు మీకున్న చదువు, ఉద్యోగం, అందం - కోట్లు ఉన్న మీ ఆస్తిపాస్తులు చూసి మాత్రమే   మీకు అమ్మాయిని ఇవ్వరు మీ తల్లిదండ్రులు కుటుంబం వివరాలు ఇవ్వాలి కదా! అమ్మాయి తరపు వాళ్ళు  వారితో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకోవాలి కదా! అది పద్దతి కదా!

మీలాంటి కనీస సంస్కారం లేని వారికి, నిర్లక్ష్యంగా ఉన్న వారికి మా విజయవాడ అమ్మాయిని ఇవ్వరు గాక ఇవ్వరు
ముందు అది తెలుసుకోండి .. అని  చెప్పి ఇలాంటి ప్రవర్తన ఉంటె  30 వయస్సులో ఉన్న మీరు   ముదురు బెండకాయ లాగా మారే ప్రమాదం ఉంది జాగ్రత్త .. అని మెసేజ్ పంపాను

మాట మంచి ,బాధ్యత, సంస్కారం లోపించి నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి ముసుగు వేసుకునే వారికి  ఎవరు మాత్రం అమ్మాయి ని ఇచ్చి పెళ్లి చేస్తారు చెప్పండి ? సమాధానం ఇచ్చే తీరిక,కనీస సంస్కారం లేకపోతె ఎలా! మళ్ళీ వీరు మాత్రం  పేరుకి ఉన్నత విద్యావంతులు.  :(

ఏదైనా నాకు మాత్రం ఇదొక అనుభవం.

ఇప్పటి యువతరం అంతా వాళ్ళ వాళ్ళ పనులలో బిజీ బిజీ ! పెద్దవాళ్ళు మాత్రం చాదస్తం తో చంపేస్తారు అనుకుంటారు. ఆ విషయంలో నా కొడుకు అయినా సరే ! మా పరిచయస్తుల అమ్మాయి అయినా ఆమె భర్త అయినా , అతని స్నేహితుడు అయినా సరే ..ఎవరైనా ఒకటే !

మాట మనుషుల మధ్య వంతెన. మాట అంటే ఒక నమ్మకం,  మాట అంటే ఒక నిబద్దత   అది తెలుసుకోలేని వారితో వెంటబడి ఏం  మాట్లాడతాము చెప్పండి.!?

ఈ పోస్ట్ చదివిన వారు కనీసం రోజుకి ఒకసారి అయినా (అబ్బాయిలు కి ప్రత్యేకం )  మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. ప్లీజ్ .

మాట వరాల మూట అది మనుషుల మధ్య దూరాలని తగ్గిస్తుంది కదా!    

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మేమూ ఇలానే చాలా పడి... అనవసరం గా ఇన్వాల్వ్ అయ్యాం..అని చాలా సార్లు అనుకున్నాం..అప్పటి నుంచీ ఏదైనా వినేసి వదిలేయడం నేర్చుకున్నాం.. మా వాళ్లకి చెపుతుంటా.. అవతలి వాళ్ల మాట విని దిగకూ...నిన్ను దించి వాడు తప్పు కుంటాడూ అనీ..మా వైపు ఇలాంటి పర్సనాలిటీలూ మరీ ఎక్కువ..

Unknown చెప్పారు...

మంచి మెసేజ్

శశి కళ చెప్పారు...

బాబోయ్ దేనిలో అయినా తల పెట్టొచ్చు ...సంబంధాల విషయం లో మాత్రం వద్దనే వద్దు

Sharma చెప్పారు...

వనజవనమాలి: మాట ఒక వంతెన


బంధాలు కలుపుదామని సంబంధాలను చూసిపెట్టటమంటే చాలా యిబ్బందికరమైన విషయమే ఈ రోజుల్లో ఎవరికొరకైనా సరే.

విదేసీ సంబంధాలలో నీతి, నిజాయితీలు ఉండనే ఉండవు. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకొన్న వాళ్ళూ కొల్లలు.

ఇటువంటి విషయాలకే కాదు , ఏవిషయాలకైనా " మాట మనుషుల మధ్య వంతెన. మాట అంటే ఒక నమ్మకం, మాట అంటే ఒక నిబద్దత " అన్నది అక్షర సత్యం , ఆచరణ యోగ్యం . సదా మననం చేసుకోవలసి
ఉన్నది .

పల్లా కొండల రావు చెప్పారు...

Good One.