6, ఏప్రిల్ 2013, శనివారం

ఓ .. ఆత్మీయ ముఖపరిచయం (కష్టేఫలే )

ప్రతి మనిషి  జీవితం లోను  అనేకానేక పరిచయాలు ఉంటాయి   

కొంతమంది మన ప్రక్కనే నివశిస్తున్నప్పటికి కూడా పరిచయస్తులగానే  మిగిలి పోతుంటారు 

మరికొంతమంది ముఖపరిచయం లేకున్నా సరే ఆత్మీయులుగా మారిపోతుంటారు

అలా అభిమానం తో ఎప్పుడైనా  మన అభిమానించే వారిని కలిసే అవకాశం వస్తే అసలు వదులుకోం కదా !

ఈ మధ్య నేను కాకినాడ వైపు వరుసగా మూడుసార్లు వెళ్ళాను ఇక్కడే ఎక్కడో మన బ్లాగ్ ఫ్రెండ్ ఉన్నారు  అనుకుంటాను కదా !పనికట్టుకుని ఎలాగు రాలేం, కనీసం వచ్చినప్పుడైనా సరే అకస్మాత్తుగా వారిని కలిస్తే  ఎలా ఉంటుంది ? వారి సంతోషం ని కనులారా చూడవచ్చు కదా! అని తలపోసాను   కానీ చిరునామా తెలియకుండా వెళితే  ఎలా కనుక్కోగలం అనిపించింది.  అలా రెండుసార్లు అయితే వారి చిరునామా తెలియక కలవకుండానే వచ్చేసాను

ఒకరోజు వారి బ్లాగ్ లో వారి వూరిలో జరిగిన వివేకానంద విగ్రహ ప్రతిష్ఠ గురించి వ్రాయగానే అయ్యో . !.వీరిది కాకినాడ కాదు కదా! ఇంకా నయం అక్కడ వెతకలేదు అనుకుని చిన్నగా నవ్వుకున్నాను

ఆ తర్వాత ఇంకోవారంలో వారి మెయిల్ అడ్రెస్స్ లభించింది అడపదడపా క్షేమ సమాచారం కనుక్కోవడం వారి వివరాలు తెలుసుకోవడం జరిగిపోయాయి . నేను మీ వూరి వైపు రావాలనుకుంటున్నాను మిమ్మల్ని కలవడానికి రావాలనుకుంటున్నాను అని చెపితే చాలా సంతోషించారు మనఃస్పూర్తిగా ఆహ్వానం పలికి మరింత వివరంగా ఇంటికి చేరుకునే సులభమైన వివరాలు పంపారు

ఇక నా ప్రయాణం తెల్లవారుఝామున మొదలవుతుంది అనగా వారికి రాత్రి పూట 12 గంటల సమయం తర్వాత వారికి మెయిల్ ఇచ్చాను

నేను నాతొ పాటు మరి ఇంకో ముగ్గురు కలసి కారులో బయలుదేరాం

మా ప్రయాణంలో .. మాకు కనిపించిన అద్భత దృశ్యం ఒకటి  మంచు తెరలను చీల్చుకుంటూ పై పైకి వస్తున్న నారింజరంగు సూర్యుడు ఇదిగో   ఇలా...


మధ్య మధ్యలో రోడ్డుని విడదీస్తూ కట్టిన డివైడర్ల పై పూచిన కాగితపు పూల అందాలు, మంచులో తడిచిన గడ్డి పూల సోయగాలు .. మా మాటలు, పెద్ద సౌండ్ తో పెట్టిన పాటలు తో  సమయం ఎలా గడచి పోయిందో  అసలు గుర్తే లేదు.  రావులపాలెం దగ్గరకి చేరుకునేసరికి కాఫీలు తాగాలి అనిపించింది అక్కడ క్రొత్తగా ఓపెన్ చేసిన "అభిరుచి " అనే రెస్టారెంట్  దగ్గర కారు ఆపుకుని టిఫిన్ లు తింటూ పూరీ  లో తినే ఆలు కూరలో ఉప్పు ఎక్కువైన  సంగతి చెప్పి నిమ్మకాయ తెప్పించుకుని నిమ్మ రసం పిండుకుని తినేశాం ఉప్మా లేని పెసరట్టు రుచిని ఆస్వాదించి సర్వర్ల చేతులకు గ్లవ్స్ వేసుకుని వడ్డించాలని, అల్యుమినియమ్  పాయిల్ వేయకుండా ప్లేటులలో అరటి ఆకులు కాని ,అడ్డాకులు కాని వేసుకోవాలని ఉచిత సలహా కూడా చెప్పేసాం. అదేందుకండీ  అంటే పర్యావరణ  పరిరక్షణ గురించి అవగాహన కల్పించడం అన్నమాట.  కాఫీ త్రాగి ఆ "అభిరుచి " రెస్టారెంట్ యజమానికి వారికి బిల్ ఇస్తూ  మేము వెళ్ళాల్సిన ఊరు పేరు చెప్పి వివరాలు అడిగి చెప్పించుకుని ధన్యవాదములు చెప్పి వచ్చేస్తూ .. మీ రెస్టారెంట్ మంచి అభివృద్దిలోకి వస్తుంది ఇటువైపు వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటానని చెప్పి వచ్చాను

అదేంటండి !? అలా చెప్పేశారు .. అని మా డ్రైవర్ ఒకటే నవ్వు. అప్పుడు నేను చెప్పెను . ఆ రెస్టారెంట్ నడిపే అతని దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉంది ప్రతి ఒకరిని ఆహ్వానించడం తో పాటు అంతమంది సర్వర్స్ ఉన్నప్పటికీ కూడా తనే టేబుల్స్ మధ్య తిరుగుతూ మళ్ళీ మళ్ళీ చట్నీ కావాలండీ ? పెసరట్టు వేడిగా ఉంది అదీ ఇమ్మంటారా అండీ ... అంటూ మనుషులని ఊపిరాడనీయకుండా మొహమాట పెట్టేస్తూ ఆర్డర్స్ తీసుకుంటూ స్వయంగా అందిస్తూ తను ఒక సర్వర్లా మారిపోయాడు బిల్ తీసుకోవడానికి మాత్రమే  క్యాష్ కౌంటర్ దగ్గరికి వస్తున్నాడు .. అలాంటి వారు ఉన్నప్పుడు మరి అభివృద్ధి కాకుండా ఎలా ఉంటుంది అన్నాను

తర్వాత కడియం వైపు, మరలా మండ పేట వైపు ప్రయాణం చేసి .. "అనపర్తి " వైపు మళ్ళాము    అక్కడ ఎవరున్నారు .అంటే ... !!??  మన బ్లాగ్ లోకంలోఅందరిని  అత్యంత ఆత్మీయంగా పలకరించే  కష్టేఫలే శర్మగారు ఆ ఊరిలోనే ఉన్నారు  వారు చెప్పిన అడ్రెస్స్ ప్రకారం వారి ఇంటి ముందుకు వెళ్లి కారు ఆపి అందరం దిగాము .

గేటు ప్రక్కనే చిన్న పిల్లలు వ్రాసినట్లు ఉన్న చేతి వ్రాత లో సి .బి శర్మ అన్న పేరుని నిర్ధారించుకుని గేటు తీయబోయి కొంచెం పరికించి చూసాను ఈ గేటు పైనే కదా పసిరిక పాము అల్లుకుని ఉన్నప్పుడు తీసిన ఫోటో ని బ్లాగులో ఉంచారు అనుకుని .. లోపలి వెళ్లి .. కుమారి గారు అని పిలిచాను  ఆ ఇంట్లో నాకు అందరూ తెలిసి ఉన్న దాని లాగా.

వెంటనే కుమారి గారు బయటకి వచ్చేసి ... రండి రండి .అంటూనే తాతగారికి స్నేహితులు వచ్చారని చెప్పమ్మా అని పాపాయితో అన్నారు . ఇంతలో శర్మ గారి భార్య గారు అచ్చు పార్వతమ్మలా పెద్ద ముత్తైదువు లా  వచ్చి లోపలకి ఆహ్వానించారు ఆమె పిలుపులోని ఆప్యాయతకి కరిగిపోతూ కాళ్ళు అయినా కడుక్కొకుండానే .. బిల బిలమంటూ లోపలకి ప్రవేశించాం . ఎదురుగా మాస్టారూ ఆనందంగా బయటకి వస్తూ కనిపించారు   వారికి నమస్కారాలు తెలుపుకుని వచ్చిన నలుగురిమి పరిచయం చేసుకున్నాం

మంచి నీరు త్రాగి ఇంటిని నలువైపులా చూస్తూ మీ ఇల్లు చలువ పందిరి లా చాలా చల్లగా ఉంది అని చెప్పాను. కష్టేఫలె మాస్టారు ఇల్లుని చూద్దురుగాని రండి అని ఇల్లు అంతా  చూపించారు . తూర్పు వైపున గోడకి  లామినేట్ చేసి ఉన్న ఒక సన్మాన పత్రం ని   చూసాను. అది శర్మ గారి కి జరిగిన సన్మాన పత్రమే అనుకుంటాను (చదవలేదు) అలాగే నట్టింట్లో ఒక పెద్దావిడ ఫోటో ఉంది ఆవిడ తనని పెంచుకున్న "అమ్మ" అని చెప్పారు. శర్మ గారి బ్లాగులో ఆవిడ గురించి చదివి ఉండటం వల్ల  ఆమెకి అప్రయత్నం గానే  నమస్కారం చేసుకున్నాను

తర్వాత శర్మగారు  మూడంతస్తుల భవనం కన్నా పైకి పెరిగి ఉన్న పెద్ద  మామిడి చెట్టుని, పనస చెట్టుని చూపించారు   చూపటం ఏమిటీ  వెంటనే  వంకీ కట్టిన కర్రని తీసుకుని వడి వడిగా డాబా మెట్లు ఎక్కి  వద్దు వద్దు అంటున్నాసరే   వినకుండా కొత్తపల్లి మామిడి కాయ  కొబ్బరిలా ఉంటుంది .. వాడి చూడండి అంటూ అందరికి కాయలు కోసి ఇచ్చారు కాయలు క్రింద పడకుండా ఆ కర్రకి ఒక సంచీని కుట్టారు వంకీ తో  కాయని త్రుంచగానే   కాయ నేరుగా  ఆ సంచీలోకి వెళ్ళిపోతుంది ఆ సంచీ ని మా అత్తయ్య గారే కుట్టారు అని కోడలు గారు చెప్పారు.

తర్వాత బాగా కాసిన పనస చెట్టు నుండి పనసపొట్టు కూరకోసం లేత కాయలని తెంపి ఇచ్చారు వాటిని క్రోసేటప్పుడు అమ్మ గారి సూచనలు. అది ముదురుకాయ కూరకి బాగోదు లేత కాయని తుంచండి అంటూ. శర్మ గారికి చెప్పి పనస కాయలు కోయించారు

అన్నీ ఒక సంచీలోకి వేసాక లోపలి వెళ్ళాము . భోజనం చేయమని అడిగారు మేము ఇప్పుడు  వద్దండి,  చేయలేం అని కూడా చెప్పాము భోజనం సమయం కి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళడం భావ్యమేనా అని శర్మ గారు బాధపడ్డారు

అమ్మ గారేమో ..ఉప్మా అయినా చేస్తానంటూ వంట ఇంట్లో బిజీ అయిపోతుంటే నా ఫ్రెండ్ వైష్ణవి వెళ్లి ఆ ప్రయత్నాన్ని ఆపి కాఫీ లు తయారు చేసుకుని వచ్చింది . మధ్యలో అమ్మగారు రుచి చూపిన పనసపొట్టు కూర సంగతి కూడా సంతోషంగా చెప్పింది ఒక పావు గంట సేపు కూర్చుని సెలవు తీసుకుని వచ్చేటప్పుడు అమ్మగారు అందరికి పసుపు కుంకుమ ఇచ్చారు. ఉన్న కొద్ది సమయం లోనే వారు చూపిన ఆత్మీయత వారి మాటలు పదే  పదే  గుర్తుకు వస్తున్నాయని నా హైదరాబాద్ స్నేహితురాలు  భారతి అక్కడికి వెళ్ళాక ఫోన్ చేసి మరీ చెప్పింది

ముఖ్యంగా శర్మ గారిలో ప్రసన్నత, విద్వత్తు,ఆత్మీయత అన్ని ప్రస్పుటంగా కనిపించాయి వారి బ్లాగ్ చదివేటప్పుడు  నాకు ఆయన రూపం పై ఎలాటి అస్పష్ట రూపం అయితే  కదలాడేదో అచ్చు అలాంటి రూపమే నాకు అక్కడ ఎదురైంది. వ్రాతల్లోనూ,  మనిషి స్వరూపం లోనూ ఒకే విధమైన  ముద్ర. ఏ మాత్రం తేడా లేని మనిషిని నేను చూసాను. వారి బ్లాగ్ లింక్ ఇక్కడ 

ఒకసారి నా బ్లాగులో "ఊరెందుకు వెళ్ళాలి " అనే పోస్ట్ వ్రాసినప్పుడు "మా ఇంటికి రండి " అని ఆత్మీయంగా ఆహ్వానించారు  అది నేనప్పటికి మరచిపోలేను. అక్కడికి వెళితే నా పుట్టింటికి వెళ్ళిన భావమే కల్గింది నాకు.

బయలుదేరబోతూ .. శర్మ గారి దంపతులని ఒక ఫోటో తీసుకున్నాను .
ఈ పాపాయి శర్మ గారి  మనుమరాలు "శ్రీ విద్య "


వారి దగ్గర నుండి సేలపు తీసుకుని  వెళుతూ  వెళుతూ  ద్వారపూడి లో తీసుకున్న ఫోటో

నాకెంతో ఇష్టమైన ముద్ర నటరాజస్వామి

అక్కడి నుండి బిక్కవోలు మీదుగా ప్రయాణం చేస్తూ నేను గమనించిన విషయం ఏమంటే ప్రతి గ్రామం లోను సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహం  నెలకొల్పబడి ఉంది . ఆహా !.. ఎంతైనా గోదావరి జిల్లాల వారి మనసులు బంగారం అనుకున్నాను.  పలకరింపు లోనే కాదు ఆతిధ్యం ఇవ్వడం లోను, కృతజ్ఞతలు తెల్పడంలోను వారికి మించి వేరెవరు ఉండరు అనిపించింది

ఎంత విదేశీయుడు అయినా సరే గోదావరి పై ఆనకట్ట కట్టడానికి రూప కర్త అయిన సర్ ఆర్ధర్ కాటన్ మహాశయుడిని నిత్యం స్మరించు కుంటూ

 వారి విగ్రహం ని ఊరూరా నెలకొల్పుకుని ఆయనని స్మరించుకుంటున్నారు అందుకేనేమో .. ఆయన ప్రాతఃస్మరణీయుడు అని చెప్పుకుంటారు  అని అనుకున్నాను  ఆ రోజు రాత్రి పూట తిరిగి వస్తూ  చంద్రుడిని వెంట తెచ్చుకున్నాం ఇలా .... 

వ్యక్తిగతమైన పనుల వల్ల  వెళ్ళినప్పటికీ కూడా ... "కష్టేఫలే " శర్మ గారిని కలవడం ఒక మరచిపోని అనుభూతి
నాకే కాదు ఆయన బ్లాగుతో ఏ మాత్రం పరిచయం లేని మరో ముగ్గురికి కూడా. వారు పదే పదే వారి ఆత్మీయతని గుర్తుకు తెచ్చుకుంటూనే  ఉన్నారు .. మళ్ళీ వారి ఇంటికి వెళదామా అని అడుగుతున్నారు  :)

(కష్టేఫలే మాస్టారూ..!  మీ అనుమతి తీసుకోకుండానే మీ ఫోటోలు ప్రచురించాను ఎందుకంటే .. మన బ్లాగ్ మిత్రులు మిమ్మల్ని చూపమని డిమాండ్ చేస్తున్నారు మరి ) 

36 వ్యాఖ్యలు:

Zilebi చెప్పారు...

very beautiful and ఆత్మీయ మైన టపా !


మేమూ వాళ్ళని కలిసిన విషయం చెప్పారాండీ ??


చీర్స్
జిలేబి.

buddha murali చెప్పారు...

baagundi mi prayaanam

Palla Kondala Rao చెప్పారు...

అయినవాళ్లలోనే ఆత్మీయతానుబంధాలు కరువవుతున్న ఈ రోజుల్లో బ్లాగు ప్రపంచం లో భావాలతో ఏర్పడిన పరిచయం ఇలా ఓ ఆత్మీయతను సంతరించుకోవడం అది ఓ పోస్టుగా మారడం బాగుంది. కష్టే ఫలే మాస్టారి గురించి తెలుసుకుందామనుకునే వాళ్లలో నేనూ ఒకడిని. వనజ గారి పోస్టు ద్వారా కొంతమేరకు తెలుసుకున్నాను. కాటన్ ను గోదావరి జిల్లాల వాళ్లు స్మరించుకోవడమూ బాగుంది. మంచి పోస్టు. అభినందనలు వనజ గారు.

జలతారు వెన్నెల చెప్పారు...

Vanaja gaaru, sharma gaaru ee madhya posts raayatam ledu. Okasaari phone chesi kanukkondi elaa unnaaro, enduku viraamam teesukunnaaro. Nenu last trip lo veladaamani plan ayite vesaanu kaani, sharma gaari daggariki -kudaraledu. Meeru kalavadam, aa vishayaalu panchukovadam baagundi.

సా గర్ చెప్పారు...

మీరు వెళ్ళటమే కాకుండా ఇలా మమ్మల్ని అందరినీ అబిరుచి రెస్టారెంట్ కి మరియు శర్మగారింటికీ తీసుకు వెళ్ళటం చాలా చాలా బాగుంది. కృతజ్ఞతలు !!

చెప్పాలంటే...... చెప్పారు...

memu kudaa chusesaamu mito paatu gaa sharma gaarini...anaparthi vellanu chaalaa sarle kaani appatiki blog lato parichayam ledu...mottaaniki maaku kuaa chupinchesaru mi tapa to...Pics kudaa chakkagaa tisaru abhinandanalu vanaja garu

Lakshmi Raghava చెప్పారు...

mee venta memu vunnam అనిపించారు వనజా వనమాలీ గారూ...ఒక్కోసారినాకు వయసు వెనక్కి వెళ్లి ఇలాటి అడ్వెంచర్ కావాలని పిస్తుంది. అయినా మీలాటి వారు సినిమాలా ఇలా చూపిస్తూ మా కోరికలని తీర్చేస్తూ వుంటారు కదా ..

జయ చెప్పారు...

వనజ గారు చాలా మంచి విషయం చెప్పారు. మీతో పాటే నేను కూడా అక్కడికి వచ్చినట్లే అనిపించింది. మరి మా అందరి నమస్కారాలు బాబాయి గారికి అందజేసారా లేదా....

వనజవనమాలి చెప్పారు...

జిలేబీ మేడం .. నిజంగా మీరు వెళ్లి ఉంటారు కూడా . మీరెవరో చెప్పకుండా కలసి వచ్చెసారన్నమాట
మీరు అలాంటి సాహసోపేతమైన పనులు చేసి ఆశ్చర్య చకితుల్ని చేయగలరు కూడాను :) ధన్యవాదము లు

వనజవనమాలి చెప్పారు...

బుద్దా మురళీ గారు ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

జలతారు వెన్నెల గారు .. ఈ సారి మాతృ దేశం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్లి రండి నాలాగే మీరు అలా ఒక మంచి భావన లో మునిగి తేలుతారు అది ఖాయం కూడా . మీ స్పందనకి ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

కొండలరావు గారు .. పెద్దవారిని కలుసుకోవడం వారి అనుభవాలని వినగలగడం ఆస్శీస్సులు అందుకోవడం చాలా మంచి విషయం అండీ! అలా ఒక బ్లాగర్ ఫ్రెండ్ ని కలసి వచ్చాను

మీ వ్యాఖ్య కి ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

సా గర్ గారు "అభిరుచి " మీకు కూడా నచ్చిందా!? ఒహ్..థాంక్ యు ! పోస్ట్ నచ్చినదుకు థాంక్ యు సో మచ్ .

వనజవనమాలి చెప్పారు...

చప్పలంటే మంజు గారు.. నాతో కలసి శర్మ గారిని చూసేసారు, అందరూ గుర్తు పెట్టుకోవాలి :) ఒ.ఽల్లరి నవ్వు . అంతేనండోయ్!!

థాంక్ యు సో మచ్.

వనజవనమాలి చెప్పారు...

లక్ష్మి రాఘవ గారు ,, మీరు శర్మ గారిని కలసి మాట్లాదేసారన్నమాట . ధన్యవాదములు

ఈ సారి నేను మీతో కలసి తిరుమలకి మెట్ల ప్రయాణం చేసి అప్పుడు మన మిత్రులందరికీ తిరుమల చూపిస్తాను లెండి . నాతో కలసి ప్రయాణం కి సిద్దం కావాలి మీరు . మీకు నోలేదు కబుర్లు మోసుకోస్తాను లెండి. (బ్లాగ్ కబుర్లు తప్ప అన్ని కబుర్లు ) మిమ్మల్ని మళ్ళీ ఇరవయ్యి ఏళ్ళు వెనక్కి ప్రయానిన్పజేయకపోతే అప్పుడు నన్నడగండి మరి

వయసుదేముంది? మనం దాని జుట్టు పట్టుకుని వెనక్కి లాగడమే! :) :)

వనజవనమాలి చెప్పారు...

జయ గారు .. అరెరే! మర్చిపోయానండీ!! మా కబుర్లులో చేనేత చీర చోటు చేసుకుంది . అప్పుడైనా మీరు నాకు గుర్తుకు రాలేదు. ప్చ్.. నన్ను నమ్మకండి అయినా మీ నమస్కారములు వారికి ఈ రోజు అందాయి లెండి
ధన్తవాదములు

అజ్ఞాత చెప్పారు...

అందరికి,
పేరు పేరున నమస్కారం. మీరంతా మా పై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞత నేను నాకుటుంబ సభ్యులు తెలియచేసుకుంటూన్నాము. వనజ గారు పుట్టింటి కొచ్చినట్లు ఉందన్నారు, మనసు నిండిపోయింది, ఇల్లాలు మాత్రం అమ్మాయిలు కాఫీ తాగి వెళిపోయారు, మీరు సరిగా చెప్పి ఉండరు అంటోంది. మీ అందరికి మా కుటుంబం తరఫున ఇదే మా ఆహ్వానం. జిలేబి గారు యాదేవి సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా....మాకు కనపడకే మా ఇంటికొచ్చి ఆశీర్వదించినందులకు ఎల్ల వేళలా కృతజ్ఞుడను.

Sharma చెప్పారు...


మీరు , మీ అనుభవాన్ని , కష్టే ఫలి శర్మగారు మీకు పంచిన ఆత్మీయతలని సాటి ఆత్మీయ బ్లాగులవారితో పంచుకొనటం హర్షణీయం.
ఆ బ్లాగుని తలచుకున్నప్పుడల్లా , ఆయన ఎంతటి కష్టజీవో వ్యక్తమవుతున్నది.
మీ అభిరుచిని ఇలా ఈ అభిరుచి ద్వారా పంచుకోవటం చాలా చాలా బాగుంది.

శ్యామలీయం చెప్పారు...

శర్మగారు నాకు కూడా ఆప్తమిత్రులు. వారిని నేను రోజూ మనస్సందర్శనం చేసుకుంటూనే ఉంటాను. ఈ రోజున బ్లాగ్ముఖంగా వారి ప్రసన్నస్వరూపాన్ని మరొక సారి దర్శించుకున్నాను. వనజావనమాలిగారికి చాలా ధన్యవాదాలు.

Pantula gopala krishna rao చెప్పారు...

బ్లాగ్మిత్రులు శ్రీ శర్మగారిని జంటగా పోటోతో సహా పరిచయం చేసినందుకు వనజ గారికి ధన్యవాదాలు.నేను బ్లాగుల్లోకి తొంగి చూడడం మొదలు పెట్టినప్పుడే శర్మ గారు వారి అమ్మాయిని పెంచడం పెళ్లి చేయడం గురించి వివరంగా వ్రాసిన పోస్టులు చదివి కష్టే ఫలేకి ఆకర్షితుడనయ్యాను.అప్పటినుండి విడవకుండా చదువుతూ స్పందిస్తున్నాను కూడా.ఒకరినొకరు చూసుకోకపోయినా మంచి మిత్రులమయ్యాము.ఇది బ్లాగుల పుణ్యమే కదా?

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మిత్రులు శర్మగారిని ఆత్మీయంగా పరిచయం చేసిన విధానం బాగుంది. ఈ మధ్య కాలం లో రావులపాలెం మీదుగా రెండు మాట్లు వెళ్లడం తటస్తించింది కానీ వారిని కలవడం కుదరలేదు. నేనైతే ముందుగా తెలియపరిచి పనసపొట్టు కూరతో భోజనం చేసి మరీ వస్తాను....దహా.

ధాత్రి చెప్పారు...

వనజ గారు
నాకు మిమ్మల్ని చూస్తుంటే జలసీలాంటిది కలుగుతుందండి..
తాతయ్య గారిని చూసేసి వచ్చేసారంటే..
నాకెప్పుడో ఈ భాగ్యం..
తాతగారి ఆత్మీయత గురించి ఎంత చెప్పినా తక్కువే.
వారితో నాకున్న పరిచయానికి వయసు తక్కువైనా
'అమ్మలూ' అని పలుకరిస్తూ,కష్టంలో తట్టుకొనే శక్తినీ,సలహాలను ఇచ్చే తాతగారు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం.
ఇంత విపులంగా రాసి మీతో పాటూ నన్ను కూడా తాతగారింటికి తీసుకెళ్ళినందుకు,వారిని,అమ్మమ్మని,బుల్లి శ్రీవిధ్యని చూపినందుకు
ధన్యవాదాలు వనజ గారు

Sai Kiran చెప్పారు...

Vanaja gaaru,
Chala chakkati post. Sharma garini meetho paatu maku kuda chupinchinanduku dhanyavadalu..

అజ్ఞాత చెప్పారు...

great!!
Palla Kondala Rao గారు చెప్పినట్లు
``అయినవాళ్లలోనే ఆత్మీయతానుబంధాలు కరువవుతున్న ఈ రోజుల్లో బ్లాగు ప్రపంచం లో భావాలతో ఏర్పడిన పరిచయం ఇలా ఓ ఆత్మీయతను సంతరించుకోవడం``
మీ పెద్ద మనసుకు మా మన: పూర్వక అభినందనలు...

usha sree చెప్పారు...

sarma gari blog naku enduko open avatam ledu i missed the blog

వనజవనమాలి చెప్పారు...

ఉష శ్రీ గారు లింక్ బాగానే ఓపెన్ అవుతుంది ట్రై చేయ గలరా ప్లీజ్! స్పందనకి ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

kvsv గారు థాంక్ యు సో మచ్ పెద్ద మనసు లాంటి పదాలు వద్దండి .ఇబ్బందిగా ఉంది మీ స్పందనకి ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

సాయి కిరణ్ గారు ధన్యవాదములు నా బ్లాగ్ కి విచ్చేసినందుకు ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

ధాత్రి గారు ఎప్పుడైనా మీ పై నాకు కుళ్ళు కునే అవకాశం రావాలని కోరుకుంటున్నాను మీ పూర్వకమైన కామెంట్ తాత గారు చూసి ఉంటారు ఇప్పుడు కూడా హాపీ గా ఫీల్ అవ్వండి

వనజవనమాలి చెప్పారు...

శర్మ గారు మీ అభిమాన పూర్వకమైన స్పందనకి ధన్యవాదములు

కష్టే ఫలే బ్లాగ్ చదివి మీకెలాంటి అభిప్రాయం కల్గిందో నాకు అలానే అనిపించింది అండీ వాల్యుబుల్ బ్లాగ్ అంత మంచి విషయాలు చెప్పే వారిని చూడాలని నాకు బాగా ఉండేది ఏదో భావంతుడి దయ ఉంది వెళ్లి కలసి అభిమానం పంచుకుని వచ్చాను థాంక్స్ అండీ .

వనజవనమాలి చెప్పారు...

శ్యామలీయం గారు వ్యాఖ్యకి ఆలస్యంగా జవాబు ఇస్తున్నందుకు మన్నించాలి

మనస్సందర్శనం చాలా గొప్పది అండీ అది మీ అదృష్టం . మీ వ్యాఖ్యకి ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

పంతుల గోపాల కృష్ణ గారు మీ స్పందనకి ధన్యవాదములు బ్లాగుల పుణ్యమా అని అనేక మంది ఆత్మీయులు ఏర్పడ్డారు మన అందరి అనుభవాలు ఎక్కడో ఒక చోట దాదాపుగా కలిసేవే!
ధన్యవాదములు ఆలస్యంగా ఇస్తున్న జవాబు కి మన్నించాలి

వనజవనమాలి చెప్పారు...

బులుసు గారు నమస్తే అండీ ! బావున్నారా? ఈ సారి అటువైపు వెళ్ళినప్పుడు శర్మ గారింటికి వెళ్ళిరండి పనసపొత్తు కూరతో విందు భోజనం చేసి రండి అలాగే రావుల పాలెం లో "అభిరుచి " కి వెళ్ళడం మరువకండి

మీ వ్యాఖ్య కి ధన్యవాదములు

ఎగిసే అలలు..... · చెప్పారు...

మీ అభిరుచి చాల బావుంది...మాతో షేర్ చేసినందుకు దన్యవాదములు...

అజ్ఞాత చెప్పారు...

మిత్రులు శర్మాజీ,
అభిమానవర్షంలో తడిపేశారు.ధన్యవాదాలు

మిత్రులు శ్యామలీయంవారు,
iటుగా వస్తున్నానన్నారు. దర్శనభాగ్యం ఎప్పుడు కలగచేస్తారో వేచి చూస్తున్నా.ధన్యవాదాలు

మిత్రులు గోపాలకృష్ణగారు,
బ్లాగు మీలాటి మంచి మిత్రుడిని అందించింది కదా. మీ అభిమానానికి ధన్యవాదాలు

మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యంగారు,
నాకంటూ ఒక స్థానమిచ్చినవారు మీరు.శ్రీ ఫణిబాబుగారు మొదటివారు బ్లాగ్ గురువులు. ఇద్దరికి నమస్కారం. మీరేమో సతీ సమేతంగా వస్తున్నా అన్నారు, జాడ లేదు. విజయవాడ-కాకినాడ ఫాస్ట్ పాసెంజరెక్కితే అనపర్తిలో దిగుతారౌ సార్. ఈ వేసవిలో మీకోసం ఎదురు చూస్తాం. పనసపొట్టుకూర,పనస తొనలు, కొత్తపల్లి కొబ్బరి కొత్తావకాయ, మరో పదిహేను రోజులలో కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీకిదే ఆహ్వానం, మనలో మాట మీరొస్తే మీతో పాటు నేనూ....రావాలి...ధన్యవాదాలు.

అమ్మలూ ధాత్రి,
వచ్చెయ్యమ్మా! నిదే ఆలస్యం. వీలు చూచుకుని, కేలుపట్టుకుని చల్లగ నడచి వచ్చెయ్యి.....నెనరుంచాలి.

సాయికిరణ్ గారు,
ధన్యవాదాలు.

kvsv గారు,
అనుబంధాలు ఏర్పడిపోయాయండి.ఏం భయం లేదండి. సర్వేశ్వరుడున్నాడని నమ్మండి. నెనరుంచాలి.

ఉషశ్రీగారు,
ప్రయత్నించండి. నెట్ స్లో గా ఉండటంతో దొరికి ఉండకపోవచ్చు. నెనరుంచాలి.

వనజగారు.
ఎదో ఒక చిన్న మాట రాస్తారు వెళ్ళొచ్చామని అనుకున్నా. మీరేమో పెద్ద టపా పెట్టేసి అందరికి చెప్పేసేరు :) మీరు చూపిన అభిమానం లో మేముచూపినదెంత? మీ పెదమనసుకదూ ఇలా అనిపిస్తూంది. మీ బ్లాగుని కబ్జా చేసేశాను. మన్నించండి. నెనరుంచాలి. మీ అభిమానం మా పట్ల ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరుకుంటా. శలవు.

అజ్ఞాత చెప్పారు...

మంచి అనుభవం. అదృష్టవంతులు.

ఈసారి రావులపాలెం వెళ్ళినప్పుడు దగ్గరలోని ఆత్రేయపురం వెళ్ళి పూతరేకులు తెచ్చుకోండి.
మొన్నామధ్య మాస్టర్ చెఫ్ లో కూడ పూతరేకుల పోటీ పెట్టారు.