13, ఆగస్టు 2013, మంగళవారం

మాతృ హృదయం

‘మాతృ హృదయం’

అమ్మూ!  అమ్మూ! లెగు, లేచి బయటకి వస్తన్నావా లేదా  అరిచింది రమణ

అంతలో ఉల్లిపాయలు రిక్షా వచ్చింది   ఉల్లిపాయలు ఇద్దువు గాని ఉండన్నా అని చెప్పి  ఇంటెనక్కి ఎల్లింది పనిచేసే వాళ్ళిల్ల  నుండి పోగేసుకొచ్చిన పాత ఇనుము,అట్టపెట్టెలు, పగిలిపోయిన ప్లాస్టిక్ సామాను అన్నీ కలిపి ఒక గోనె  సంచిలో వేసి వుంచినవాటిని    గోనె సంచితో సహా వుల్లిపాయలబ్బాయికిచ్చి వుల్లిపాయలు తీసుకుంది

"మరీ నాలుగే ఇచ్చావేమన్నా ! ఇంక నాలుగియ్యి. పిల్లలకి రోజు పొద్దుట పూట కూరోండి కేరేజీ కట్టాలి "అంది .
"నువ్వెందుకు కేరేజీ కట్టడం? మజ్జానం బళ్ళో పిల్లకాయలకి కూడేడతారు కదా!" అడిగాడు ఆరాగా అతను

"బడికెళ్ళడం  మొదలై పది రోజులయిందో లేదో పిల్లకాయలిద్దరికి జొరం ముంచుకొచ్చింది. ఆడ పెట్టె అన్నం తిని పిల్లలకి వాంతులు, విరోచనాలు పట్టుకున్నాయి. ఆళ్ళని హాస్పటల్కి తీసుకెల్లలేక మందులు కొనలేక చచ్చాననుకో. పేపర్లో కూడా పడతనయ్యి. బళ్ళో పెట్టె బోయనాలు తిని పిల్లలు చచ్చిపోతున్నారంట. ఇంటినెకాల చిట్టిమ్మామ్మ పేపర్ తెచ్చి నా ముందు కూకుని చదివి ఇనిపిచ్చింది "ఒసే  రమణా! పిల్లలకి ఎట్టోగట్టా వండిపెట్టి కేరేజి కట్టవే! ఆ కూళ్ళు తిని పేణం మీదకి తెచ్చుకుంటారు" అంది.

"పలకరిస్తే భారతం చెపుతావ్ కదమ్మే! అంటూ మరో నాలుగు వుల్లిపాయలిచ్చాడు. అయి చాలవన్నట్టు మరో రెండుల్లిపాయలు తీసుకుంది రమణ  "ఇట్టా ఇచ్చుకుంటూ పొతే నేనుకూడా నా రిచ్చాబండిని  పాత సామానాడికి తూకం లెక్కన అమ్మి తువ్వాలేసుకోవాల్సిందే".. అంటూ ఇసుక్కున్నాడతను.

"అబ్బో ఈ మాత్రం దానికే అట్టాగ అయిపోతే యేళ్ళ తరబడి  యిక్కడెట్ట వుంటావు! సంపాయించిన యిల్లు సంగతేంటో" అని దీర్ఘం తీస్తూ యింట్లోకి వచ్చి

చేతిలో వుల్లిపాయల సంచీని అక్కడేసి యింకా  మొద్దు నిద్దర పోతున్న అమ్ము ని గట్టిగా ఒక్కటి చరుస్తూ " ఎన్ని సార్లు లేపినా లేగవకుండా దున్నపోతులా పడి నిదరపోతున్నావ్ కదే! ఎనిమిది గంటలయ్యింది. మీకెప్పుడు జడలెయ్యాలి, అన్నం తినిపిచ్చి స్కూల్ కాడ వొదిలి మళ్ళీ పనికెప్పుడు పోవాలి"అంటూ అరిచింది.
ఆ దెబ్బతో అమ్ము లేచొచ్చి మళ్ళీ వరండాలో ఓ.మూల కూర్చుంది .

అయిదేళ్ళచిన్న కూతురుని  శృతీ ..  శృతి లెగవరా తల్లీ ! ఈ రోజు బడికి వెళ్ళాలి అంటూ బలవంతంగా లేపి ముద్దులాడుకుంటూ బయటకి వస్తూ వరండాలో కూర్చున అమ్ముని చూసి  "ఏంటి ఇయ్యాల కూడా బడికెల్లవా? "అడిగింది కోపంగా .

అమ్ము తల అడ్డంగా తిప్పింది . నీకేం మాయరోగం వచ్చిందే ! నాకు పట్టిన గతే నీకు పట్టకూడదని పనిలో కూడా పెట్టకుండా బడికి పంపుతొన్నా, నీ అయ్యా యేమన్నా సంపాయించి నీకు యేలకి యేలు యిచ్చి పెళ్ళిచేత్తాడు అనుకుంటున్నావా? ఆరవ తరగతికి వచ్చావు యెట్టోగట్టా యింకో నాలుగు కాసులు చదివితే యేదో  వొక ఉజ్జోగం వస్తందని అంగన్వాడి టీచర్ చెప్పింది. నువ్వేమో మూడు మూడు రోజులకి బడి యెగ్గొట్టి తిరుగుతున్నావ్ నిన్ను యిట్టా కాదు  వొంచాల్సింది  అంటూ వొంగి  జుట్టుపట్టుకుని కొట్టబోయింది. చంకలో చిన్నది ఉండటం మూలంగా ఈలు కుదర్లా. ఈలోపులో అమ్ము లేచి వీధి లోకి పరుగులు తీసింది . "అమ్ము ! మరియాదగా ఇంటోకొచ్చి  తొందరగా బయలెల్లి బడికెల్లు " అంది రమణ

"అమ్మా! నేను బడికి పోను" అంది .  ఎందుకనెల్లవే! పాఠాలు అర్ధమగడం లేదా ? నేను వచ్చి అయ్యోరమ్మకి చెప్పేసి వస్తా. నిన్ను కొట్టదు, యే౦ చేయదు.. మమ్మవిగా బడికెల్లవే.. నీకు దణ్ణం పెడతాను "కూతుర్ని  బతిమలాడింది.

 "నేనెల్లనంటే యెల్లను నువ్వు పనికి పో ! చెల్లిని పెట్టుకుని నేనింట్లో ఉంటా"  మొండిగా చెప్పింది
 " ఇయ్యాల నిన్ను యిరగదీసయినా సరే బడికి తీసుకుపోతా"అంటూ అమ్ము వెనకాల పడింది రమణ . ఆ పిల్ల అందకుండా రోడ్డు మీదకి  పరుగు తీసింది .  అరగంట దాటినా దాన్ని పట్టుకోవడం రమణ వల్ల కాలేదు. పనికి ఆలస్యమైపోతుంది, తొందరగా యెల్లకపోతే వుండ రెండిళ్ళు కూడా పోతాయి అనుకుంటూ  చిన్నదాన్ని చంకనేసుకుని యింటికి తాళం పెట్టి గబా గబా పని చేస్తున్న యింటికి వచ్చింది

"ఏంటి రమణా ! నువ్వు వచ్చేదెప్పుడు యిల్లు చిమ్మి తుడిచేదేప్పుడు ? నేను పూజ చేసుకునేదేప్పుడు ? రోజు రోజు కి నువ్వొచ్చే టైం మారిపోతుంది. ఇలా అయితే నిన్ను మానిపించాల్సి వస్తుంది"  గట్టిగా కోప్పడింది హేమ .

"అమ్మా ! మీరు కూడా అట్టంటే యెట్టాగమ్మా! ఇప్పుడుదాకా దానితో యేగి యేగి యిదిగో దీనిని చంకనేసుకుని వచ్చా " అని వరండాలో నిలబెట్టిన చిన్న దాన్ని చూపెట్టింది .

"ఇవాళ కూడా అమ్ము బడికి వెళ్ళ లేదా ! " ఆరాగా, కోపంగా అడిగింది ఆమె.

"లేదమ్మా ! రోడ్లమ్మట పరిగెత్తుతుంది. దాన్ని పట్టుకోడం నావల్ల  అయ్యే పని కాదు. ఆ బాడుకోవ్ ముండని పెంచడం నావల్లకాదు. దాని అయ్యకాడికి పంపిచ్చేత్తాను" అంది ముక్కు చీదుతూ బాధగా.

"కోపమొచ్చినప్పుడల్ల్లా  నువ్వలా అనడం దానికి తేలికయిపోయింది. అది చెప్పా పెట్టకుండా  వాళ్ళ నాన్న దగ్గరికి వెళుతుంది. రెండురోజులు అక్కడుంటే నీకు దిగులు  అదెక్కడ  అక్కడే ఉండిపోద్దోఅని  రమ్మని ఫోన్ చేస్తావ్ !
 అది  నీఅలుసు కనిపెట్టి బడి యెగ్గొట్టి తిరగడం మొదలెట్టింది . పన్నెండేళ్ళ పిల్ల అలా రోడ్లెంమ్మట తిరగడం ఏమిటే ?  మొన్న అర్ధరాత్రి పూట పన్నెండింటికి బాంక్ దగ్గర రోడ్డు ప్రక్కనే వేసిఉన్న బెంచీ మీద కూర్చుని ఉందంట.  మీ సార్ గారు చెప్పారు"

అవునమ్మా ! ఆరోజు తిట్టానని అలిగెల్లి అక్కడ కూకుంది యెంత  బతిమలాడినా రాలేదు. అప్పుడు మా చెల్లెల్లి  తీసుకొచ్చింది "

"ఏమన్నా అనుకో రమణా ! నీకసలు వివరం లేదే! పిల్లలని అంతగా తిట్టడం యెందుకు ? నిదానంగా అర్ధం అయ్యేదాకా చెప్పుకోవాలి. మొగుడు పెళ్ళాం విడిపోతే పిల్లలు యిలాగే తయారవుతారు, పద్దాక నువ్వు మీ అయ్యదగ్గర కెళ్ళు అనబట్టేగా ఆదట్టా.. తయారయింది. మన కోపాలు, మన బాధలు పిల్లలు మీద చూపెట్ట కూడదే!
అన్నీ దిగమింగుకుని పిల్లలని పెంచాలి.పిల్లలని పెంచడం అంటే మాటలనుకున్నావా? వాళ్ళని కన్నంత తేలిక కాదు"

"అవునమ్మా ! ఆ సంగతి అప్పుడు తెలియాలా, అందరొద్దన్నా నా పిల్లలు నాకే కావాలని తెచుకున్నా. ఇయ్యాల యేకు మేకైనట్టు తయారయింది.  మొన్న అప్పు జేసి మూడొందల రూపాయలు పెట్టి నోట్స్ పుస్తకాలు కొనిచ్చా, ఆ అప్పు ఇంకా తీరనే లేదు . రెండు రోజులు పని మానుకుని మీటింగ్ కి ఎల్లా ! బడికి నాగా పెట్టకుండా ఎల్లినాల్లకి డబ్బులు ఇస్తారని చెప్పారు. చక్కగా సదువుకోమ్మా అని బతిమలాడి చెపుతున్నాయినడంలేదు నేనేం  జేయాలి? "

 రమణ ఆక్రోశం చూసి బాధ కల్గింది హేమకి "తీసుకెళ్ళి హాస్టల్లో  పడేయి, బయటకి రాకుండా అందులో పడి ఉంటుంది "

 అమ్ము మీద హేమకి  చాలా కోపం ఉంది . అది వాళ్ళ మ్మ మాట వినదు.  తెలివికలదే కాని చదువు మీద శ్రద్ద లేదు బడి యెగ్గొట్టి ఆటలాడటం, ప్రక్క యిళ్ళకి వెళ్లి టీవి చూట్టానికి  అలవాటు పడిపోయింది.
రమణ ఆ పిల్లని ఒక్క దెబ్బ కూడా కొట్టదు కాని నోటికివచ్చినట్టు తిడుతుంది. అలా తిట్ట కూడదే! మంచిగా చెపితే వినకపోతే గట్టిగా నాలుగు వడ్డించు. ఆ  భయం ఉండాలి .. అంటుంది

"ఏమోనమ్మా ! నేను దాన్ని కొట్టలేను బిడ్డలని కొట్టడానికి నాకు పేణం ఒప్పదు "అంటుంది. ప్రేమగా . ఆ రోజంతా చిన్న దానినేసుకునే యిళ్ళల్లో పనులు చేసుకుంది . సాయంత్రం ఇంటికెల్లాక చూసింది  అమ్ము ఇంటికి రాలేదు .. రాత్రి అయింది అయినా అమ్ము ఇంటికి రాలేదు, రోజూ అమ్ముఎక్కడెక్కడతిరుగుతుందో అక్కడక్కడికివెళ్లి వెదికింది

అమ్ము కనబడలేదు . ప్రక్కన ఊరిలో వున్న వాళ్ళ నాన్న దగ్గరికి యెల్లిందేమో అన్న ఆలోచన చేసింది.  అమ్ము తండ్రికి ఫోన్  చేసి కనుక్కోవడం ఆమెకి  ఇష్టం లేక పోయింది .. ఇంకాసేపు చూసింది.  ఇక ఉండబట్టలేక  చెల్లెలుతో  కలసి హేమ ఇంటికి వచ్చింది .  అమ్ము నాన్న నంబరు ఆమె కిచ్చి వాళ్ళ నాన్నకి పోన్ చేయించింది .  హేమ  అతని నంబరు నొక్కి .. రమణ చెల్లెలికి  మాట్లాడమని ఇచ్చింది.

"బావా.. అమ్ము వచ్చిందా !?"

 "అది నాదగ్గరకేందుకు వస్తాది,. అయినా నేను వూళ్ళో లేను. ఇటికరాయి తోలుకొచ్చే లారీలో బట్టీ కాడికి పోతున్నా .  ఇంటో మా ఆవిడ పిల్లలు కూడా లేరు వూరికి బోయినారు. పిల్లని పెంచని రాని  నీ అక్కని రోడ్డ్లెమ్మట యెతుక్కోమను" చెప్పి ఫోన్  పెట్టేసాడు .

రోజులు చూస్తే బాగా లేవు . దానికి చిలక్కకి చెప్పినట్టు చెప్పాను . ఎన్నిసార్లు చెప్పానో .. అలా వొంటిగా  తిరగోద్దె.. అని నా మాట యింటేగా!? అని యేడుస్తూ కూర్చుంది రమణ .

అమ్ము యేమై ఉంటుంది ?హేమలో  కూడా చిన్న ఆందోళన మొదలైంది . అసలే ఆడపిల్ల... ఆలోచించడానికే భయమేసింది .
అమ్ము నాన్న ఫోన్  లో యే  మాటలైతే చెప్పాడో ఆ  మాటలని తిరిగి చెప్పింది రమణ చెల్లెలు .

అప్పటిదాకా నిబ్బరంగా కనబడిన రమణ నేలపై కూలబడింది. కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ "చూడమ్మా! ఇది ఎంత పంజేసిందో! నేను యేడని దాన్ని వెదుక్కురాను నాకాడ ఓపిక్కూడా లేదాయే! నేనేం చేయను దేవుడోయ్" అంటూ కనబడని దేవుడిన్ని అడిగింది. అమ్ము వాళ్ళ నాన్న దగ్గిరికే పోయుంటదమ్మా! ఆ దొంగనాకొడుకు నన్నేడిపీనాటికే అబద్దపు కూతలు కూస్తా ఉన్నాడు. ఇప్పుడే ఆడి  పని చెబుతా.. ఆడింటికిపోదాం పదవే."  అంటూ చెల్లెలిని పిలిచింది. ఇంత  రాత్రేల పోయి యేడ యెతుకాతం? రేపు చీకటేల్నే పోదాం. ఇప్పుడు యింటికి పోదాం పద,  ఈ పాటికి అమ్ము కూడా యెడేడో   తిరిగి యింటికి  వచ్చేసే వుంటాది అంది రమణ చెల్లెలు.

అప్పుడు హేమ  కలగజేసుకుని "నువ్వు యింటికిపో దుర్గా , నేను రమణని తీసుకునెల్లి అమ్ము అక్కడుందేమో . చూసొస్తాం." అని చెప్పి బండి బయటకి తీసింది. ఓ.మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణీంచాక అమ్ము వాళ్ళ నాన్నుండే  యింటి  ముందు బండి ఆపి  నిలబడి చుట్టూ చూసారు. అక్కడ నిర్మాణంలో వున్న అపార్ట్మెంట్లు చాలా వున్నాయి . ఇంకొద్ది దూరంలో ఒక పాక వేసి ఉంది . ఆ పాకలో అక్కడ వాచ్ మెన్ గా పనిచేసే అమ్ము వాళ్ళ నాన్న కాపురం ఉంటాడు. ఆ పాకలో నుండి సన్నని వెలుతురూ కనబడుతూ ఉంది.  వాడు చూడమ్మా యెంత  అబద్దపు కూతలు కూసాడో! ఎవరు లేకపోతే   యింటో దీపం ఎట్టా ఎలుగుతాది? అంటూ యింటి ముందు కళ్ళతో వెదుకుతుంది. హేమ  ఇంటి ముందుకు వెళ్లి తలుపు తట్టబోయింది.  రమణ వచ్చి చటుక్కున ఆమె చేయిని పట్టుకుని ఆపేసింది.

"అమ్మా ! యెల్లిపోదాం  రా"  అంది  రమణ. "అదేమిటే? పిల్ల కోసం అన్జెప్పి వచ్చి పిల్ల వుందో లేదో చూడకుండా పోదాం పదమంటావు? నీకేమైనా వెర్రా? "

ఇదిగో.. యిక్కడ చూడమ్మా ! అమ్ము చెప్పులున్నాయి. అంటే అదిక్కడ వుండట్టే గా. వాడు నాటకాలు ఆడుతున్నాడు
ఆడనీ, నాటకాలాడనీ , యెన్నాళ్ళు నాటకాలు ఆడతాడో చూత్తా! రేపు మా కులపోళ్ళతో పంచాయితీ పెట్టిస్తా! వాడిని అందరితో వూపియ్యాలి. ఆడు మొగుడు కాదమ్మా ! నా పాలిట యముడు. ఆడిని వదిలిచ్చుకుని తప్పు కట్టానా!  రొయ్యల ప్యాక్టరీలో రాత్రిబవళ్ళు కష్టపడి ఆ అప్పు దీర్చుకున్నా. పిల్లలతో ఆడికి సంబందం లేదని రాయించుకున్నా. చిన్న పిల్ల తెలిసో తెలియకో అది వాడి యింటికి   యెల్లిందీ  అనుకో తీసుకొచ్చి దించిపోకబోగా యింటో  పెట్టుకుని నన్ను దేసంమీద పడి వెదుక్కోమన్నాడు.  ఆడికి నిలువెల్లా ఇసమేనమ్మా! నన్నిట్టా  కూడా  ఎందుకు బతకనీయాలని ఆడి  కచ్చ..అంటూ ముందుకు దారితీసింది . రమణ మాటల శబ్దానికి  యెవరైనా బయటకి వస్తారేమోనని కాసేపు ఆగి చూసింది హేమ . ఎక్కడా ఆ అలికిడే లేదు . బండి స్టార్ట్ చేసిన చప్పుడుకి  ఇరుగుపొరుగు  ఆరాగా తొంగి చూసారు  కాని ఆ ఇంట్లో నుండి సవ్వడే లేదు.

ఇంటికి వస్తున్నంత సేపు దారంతా  రమణ మొగుడ్ని తిడుతూనే ఉంది. ఇంటికి వచ్చాక ఇంకా ఇప్పుడు ఏమి వెళతావ్ ఇక్కడే పడుకో అంటే  . లేదమ్మా ! చిన్నది నేను లేకపోతే  నిదరపోదు.. ఇంటికి పోతాను అంది . సరే .. ఈ అన్నం పట్టుకెళ్ళు అని  రమణకి అన్నం పెట్టి  యిస్తుంటే సమాజ సేవ అయిందా ..?  అంటూ యింట్లో  వాళ్ళ గొణుగుడు . అవన్నీ గోడకి తగిలినట్టే అనుకుని .. అయ్యో రామా! ఇది ఒక సేవే నంటారా? మగవాళ్ళు చేస్తే అది మరపురాని సేవ . ఆడవాళ్ళు  చేస్తే అధిక ప్రసంగం అంటారనుకుంటా  కదా? అని ఎదురు ప్రశ్న వేసింది. ఆమె గడసరి ప్రశ్నకి  అటువైపు నుండి శబ్దమే లేదు.

తెల్లవారి రమణ రోజుకన్నా పెందలాడే పనికి వచ్చింది చాలా హుషారుగా ఉంది . ఎన్నాళ్ళు వుంటదో  వుండనీయమ్మా !  నేనసలు దాని జోలికే పోను ... దానిని తలిస్తే మీ చెప్పు తీసుకుని కొట్టండి .. అంటూ బింకపు మాటలు పలికింది. అలా రెండు రోజులు గడచిపోయాయి .
పంచాయితీ పెట్టిస్తానన్నావు కదే, యెప్పుడు  పంచాయితీ? అని అదిగింది హేమ

"అది యింకో  రెండు రోజులకైనా యింటికోస్తాది కదా ! అప్పడే చెపుతా ఆ సంగతి" అంది .

********************

బడి ఎగ్గొట్టి  నాన్న ఇంటికి చేరిన అమ్ము ని గుమ్మంలో నుండే నిలబెట్టి అడిగింది   వాళ్ళ నాన్నని  కట్టుకున్న మూడో పెళ్ళాం  వసంత.  ఏమ్మా ..! ఇట్టా వచ్చావ్? బడికి పోలే ?  మీ యమ్మ నిన్ను యిట్టా గాలికోదిలేసిందేంటే ! భయంబత్తి లేకుండాతిరుగాతా ఉండావ్! నీకులా నా బిడ్డలు తిరిగితే అట్టకాడ కాల్చి వాతలెడతా! అని చీదరిచ్చుకుంది. మీ నాయనొచ్చి నీ సంగతి తేల్చుకుంటాడు నాకెందుకు మధ్యలో అని లోపలికి పోయింది.

మొన్నేగా యీడకి వచ్చినప్పుడు  బాగా పలకరిచ్చి రెండురోజులుండిపోవే  అని అంది. ఇప్పుడేంటి చిన్నమ్మ యిలా యిసుక్కుంటుంది అనుకుంది  అమ్ము .

కాళ్ళకున్న చెప్పులిడిసి యింటోకి పోబోయింది.. "ఎక్కడికి అట్టా యింటో  జోరబడుతున్నావ్.. కాళ్ళు చేతులు కడుక్కొని   రా! పయిటేలకి కానీ నిన్ను కన్నోడు రాడు. ఆయనొచ్చాక నీ సంగతి తేల్చు కుంటాడు మద్దిలో. నా కెందుకు దురద.? నన్ను యీడికి యిచ్చేటప్పుడు మొదటి పెళ్ళాం బిడ్డలు, రెండో పెళ్ళాం బిడ్డలతో యీడికి సబందమే లేదు అని లొల్లి మాటలు జెప్పారు. ఇప్పుడేమో  పెల్లీడుకోచ్చాక నువ్వు మా ఎదానే పడతావని చెపుతూ ఉండారు. ఇట్టైతే నేను నా పిల్లలు మట్టి కొట్టుకుని పోతాం " అని  ఒకటే సాపించడం మొదలెట్టింది
చానా సేపు చిన్నమ్మ మాట్టాడే ముల్లుమాటలు యింటూనే గుమ్మం ముందే నిలబడింది అమ్ము.

పన్నెండు గంటలప్పుడు చెల్లెళ్ళు యిద్దరూ బడి నుండి ఇంటికొచ్చారు . ఆళ్ళ కాళ్ళకి కొత్త బూట్లు  విప్పుతూ .. నువ్వు కూడా రా! ఈళ్ళతో పాటు  నీకు అన్నమేస్తా అని లోపటికి పిలిచింది . కూరాకు మరింత లేదు నువ్వు ఈ పచ్చడేసుకుని తిను . పూజ,వనజ చిన్న పిల్లకాయలు కదా ! పచ్చడి తింటే రొప్పుతారు అంటూ .. పచ్చడేసి పెట్టింది . అప్పుడు అమ్ము కి వాళ్ళమ్మ గుర్తుకొచ్చింది .. కళ్ళల్లో నీరు పళ్ళెం లో పడ్డాయి. ఈ మాత్రం దానికే యేడవాలా? పచ్చడి తిని బతకాలా, గొడ్డుగారం వేసుకుని తిని బతకాల. అంటూనే పిల్లలిద్దరికి పాలబూత్లో కొనుకోచ్చిన పెరుగు కప్పు తీసి అన్నంలో కలిపి ఇచ్చింది.  అమ్ము మారు అన్నం అడక్కుండానే పళ్ళెం తీసుకుని బయట కుళాయి దగ్గరికి కెళ్ళి పళ్ళెం కడిగి నీళ్ళు తాగి అక్కడే నిలబడింది.

అమ్ము ఇటు రాయే! ఈ గిన్నెలు తీసుకుపోయి కడుక్కురా! నేను యీళ్ళని తీసుకుని బంగారంగడికి పోయి రావాలి . కంసాలాయన  కాళ్ళ గొలుసులు  యిస్తానన్నాడు.  అన్జెప్పి తలుపుకు గొళ్ళెం పెట్టి తాళం వేసుకుని  మరీ పోయింది .
వాళ్లటు పోగానే అరుగుమీద పడుకుంది అమ్ము. నాన్న యెప్పుడు వస్తాడో ?  సైకిల్ యెప్పుడు కొనిస్తాడో అడగాలి. పుస్తకాల సంచీ బోలెడు బరువు. మోయలేక సాలి వస్తుంది నడుం వంగి పోతుంది . ఆ మాటే అమ్మకి చెపితే రోజు బడిదాకా వచ్చి సంచీ వరండాలో పెట్టి వస్తంది కానీ సైకిల్ అడిగితే  కొనదు. ఏమడిగినా డబ్బులేడయి? నీ కళ్ళు దొబ్బినాయా అని పిచ్చి కూతలు కూసుద్ది . రేషన్ షాప్ లో బియ్యమే తెచ్చి వండుద్ది. పోస్టాపీసులో నెలనెలా డబ్బులు కట్టకపోతే ఆ డబ్బులతో సైకిల్ కొనీయోచ్చు కదా ! అదే మాట అడిగితే అమ్మకి మాలావు కోపం వచ్చుద్ది. గవర్నమెంటాళ్ళు చెల్లికి నాకు నలబయ్యేసి యేలు లెక్కన  బాంక్ లో యేసారని అమ్మమ్మ చెప్పింది . అన్ని డబ్బులున్చుకుని సైకిల్ కొనమంటే కొనదు. నోట్స్ పుస్తకాలు కొనదు. అమ్మ వొట్టి రాకాసిది. నోటికొచ్చినట్టు కూస్తాది. మళ్ళీ అంతలోనే ముద్దులాడుద్ది. నాన్న అట్టా కాదు యెక్కడ కనబడినా పలకరించక్కపోయినా యింటికి  యెలితే.. వచ్చావా అమ్ము రా రా నాన్నా అంటూ దగ్గరికి తేసుకుంటాడు. చెల్లెళ్ళతో పాటు నాకు చాక్లెట్లు కొనిస్తాడు. ఇంటికెల్లెటప్పుడు చార్జీలకి డబ్బులిస్తాడు ... ఛీ ! అమ్మ మంచిది కాదు . నాన్నే మంచాడు . నేను నాన్న దగ్గరే ఉంటా,యిక పొమ్మన్నా పోను అనుకుంటూ గోడకి తిరిగి పడుకుంది .

గుమ్మానికడ్డంగా అట్టా పడుకున్నావేంటే..? యింటికి దరిద్రం, ముందు ఆడ నుండి లే ! అంటూ కసురుకుంది చిన్నమ్మ . బిత్తరపోయి లేచి నిల్చుంది. ఎదురుగా చెల్లెల్లిద్దరూ మువ్వలు పట్టీలు పెట్టుకుని అటు యిటు యెగురుతూ ..ఆమువ్వలుమోతకి నవ్వుకుంటూతిరుగుతున్నారు .అమ్ముతన కాళ్ళకేసి చూసుకుంది.బోసిగా వున్నాయి. దిగాలేసింది. "నాక్కూడా కాళ్ళగొలుసులు తేకూడదా చిన్నమ్మా.." అని అడిగింది .

"అడిగావు ? యింకా  అడగలేదేందా అని అనుకుంటా ఉండా? ఈ గొలుసులేయి మీ బాబు తెచ్చిచ్చిన సొమ్ముతో కొనలేదమ్మా! మా అమ్మోళ్ళు సాంగ్యానికి చెవులు కుట్టిచ్చి కాళ్ళ గొలుసులేసారు. అయ్యో ! నీ అయ్య కంతటి యివరం కూడానా? సంపాయించడం తాగడం సరిపోయే ! అయినా నీ కాళ్ళకి గొలుసులు నేనెందుకు చేయిన్చాలే ? నువ్వేమన్నా నా కడుపున బుట్టావా? లేకపోతే  నీ అమ్మచస్తే నన్ను నీ నాయన కట్టుకున్నాడా? మీ యమ్మ గిత్త లాగా బాగానే ఉందిగా, మూడు మూడు నాళ్ళకి నిన్ను ఈ కొంప మీదకి వుసిగొల్పుతుందేంటి? నా కాడ  ఆ యవ్వారాలు అన్నీ కుదరవు.  వచ్చినావా ఒక పూట వుండావా ... అంతే ! తెల్లారి లేచి  వచ్చిన దారిన పోవాల.. చిన్నమ్మా,పెద్దమ్మా అని వరసలు కలిపి యీడే  తిష్ట వేయడంకాదు. "అని  ఎడతెరిపి  లేకుండా వాయించి యీసడించింది .

అమ్ము అక్కడి నుండి లేఛి దూరంగా పోయి రోడ్డు ప్రక్కనే వున్న రాయి మీద కూర్చుంది. రాత్రైనదాకా అక్కడే కూర్చుంది . మీ బాబు వస్తే నిన్నాడనే కూర్చోబెట్టాడని తిడతాడు, నన్ను తిట్టియ్యడానికే కూసున్నావా? లోపలకి వచ్చి కూసో! అని  పిలవాలి కాబట్టి వొకపాలి పిలిచి  మళ్ళీ లోపలి యెల్లిపోయింది . చీకటీగలు పీక్కు తింటన్నాయి. లోపలి పోదామా  అంటే చిన్నమ్మ అనే మాటలు చానా బాధగా ఉండాయి.  అమ్మ యెప్పుడు తిట్టే తిట్లు కన్నా చిన్నమ్మ మాటలు చానా బాధగా ఉండాయి. అయినా సరే యిక్కడే ఉండాలి . అమ్మ దగ్గరికి యెల్ల కూడదు. నేను కనబడకపోతే అమ్మ యేడవాలి, బాగా యేడవాలి అప్పుడు కాని  నా కసి తీరదు అనుకుంటూ కచ్చగా అమ్మని తలుచుకుంది అమ్ము

అమ్ము రాత్రి తొమ్మిది గంటలయ్యేదాక   రోడ్డు మీద బండ పైనే కూర్చుని నాన్న కోసం  యెదురుచూసి  చూసి  యింటి లోపలకి వచ్చింది . చిన్నమ్మ పట్టె మంచంపై చెల్లెళ్ళు యిద్దరినీ  వేసుకుని పడుకుని టీవి చూస్తూ ఉంది   అమ్ముని చూసి "కుండలో కూడుంది . యేసుకుని తిని మిగతా అన్నంలో ఆ గిన్నెలో ఉంచిన గంజి పోసేయి. రేపొద్దున  చద్ది అన్నంకి  ఉంటాది "అని  చెప్పింది .

కొంచెం అన్నం యేసుకుని మిగతా అన్నాన్ని  ఆమె చెప్పినట్టు చేసి,  కంచం తెచ్చుకుని టీవి చూస్తూ అన్నం తిని  కంచం కడుక్కొచ్చి చాప తీసుకుని పరుచుకుని పడుకుంది. దోమలు కుడుతా  వున్నా కూడా కప్పుకోడానికి దుప్పటి కూడా యివ్వని చిన్నమ్మతో తల్లిని పోల్చుకుంది. అమ్మ యెంత జాగ్రత్తగా చూసుకునేదో గుర్తు తెచ్చుకుంటూ చెల్లిని తలచుకుంటూ కళ్ళు మూసుకుంది   మెల్లగా నిద్ర పట్టేసింది. తెల్లారేపాటికి అమ్ముకి జ్వరం ముంచుకొచ్చింది.  ఎండ  బడుతున్నా లేగవకుండా జొరం వల్ల  వచ్చిన చలికి వణుకుతూ మునగదీసుకుని పడుకుంది.

అక్కా! లెగు అమ్మ నిన్ను లేచి వాకిలూడ్వమంటుంది . అంటూ పూజ చేత్తో కదుపుతుంటే మెలుకువ వచ్చింది . జొరం వచ్చిందని చెప్పు అమ్మకి అంది . అమ్మా అక్కకి జొరం వచ్చిందంట అంది. ఆ మాటకి వసంత దగ్గరికి వచ్చి టవొంటి  మీద చెయ్యేసి చూసింది. "మొన్నే కదే ..టైపాయిడ్  జొరం వచ్చింది. పత్తెం చేసావా అడ్డమైన గడ్డి తిన్నావా ? అంటూ తిడుతూనే పోయి పళ్ళు తోముకోచ్చుకో! కాసిని పాలు తాగి మందు బిళ్ళ వేసుకుందుగాని"   .
పదిగంటలకి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళి చూపిచ్చి మందులు తెచ్చింది.డాక్టర్గారు అన్నం తినొ ద్దన్నారుగా .. అంటూ బ్రెడ్ కొనిపెట్టింది. ఇంటికొచ్చి మందు లేసుకుని నాలుగు బ్రెడ్ ముక్కలు తిని టీవి చూస్తా పడుకుంది . పైటేలకి  అమ్ము నాన్న వచ్చి అమ్ముని చూసి  ఈ అమ్మి ఎప్పుడొచ్చింది అడిగాడు , నిన్ననంగా  వచ్చింది. పిల్ల యేమైందా అని ఆ తల్లికి పట్టలా  వదిలేసి ఊరుకుంది . పిల్లకి జొరం వచ్చింది హాస్పిటల్కి తీసుకుపోయా.. అని చెప్పింది  వసంత . రాత్రి అమ్ము వాళ్ళమ్మ పోన్ చేసింది అని చెప్పకుండా దాచిపెట్టి .. దానికేం బట్టీ ... పొతే పోయింది అనుకుంటాది ,దాని సంగతి నీకు తెలియదులే  అంటూ రంగులు పూయబోయాడు.

ఏరా .. అమ్ము యెప్పుడొచ్చావ్  యెందుకొచ్చావ్ ?   అడిగాడు అమ్ము పక్కనే చాప పై కూచుని .

 ఆపాటి కూసింత  పలకరింపుకే  అమ్ము కి యేడుపొచ్చింది . "నేను ఆడ వుండను నాన్నా! మా అమ్మ నన్ను పద్దాక తిడతంది కొడతంది , శృతిని  అసలు యేమనదు. దానికి కొనుక్కోడానికి డబ్బులు  యిచ్చుద్ది, పాలు యిచ్చుద్ది. పద్దాక మీ అయ్య కాడికి పో అని తిట్టుద్ది . నేనక్కడ వుండను యిక్కడే ఉంటా" తండ్రిని అంటుకుని యేడుస్తూ  చెప్పింది.
సరేలే అట్టాగే  వుందువు గానిలే! అంటూ లేచిపోయాడు. తండ్రి యెల్లాక  కూడా అమ్ము యెక్కెక్కి యేడుస్తానే  వుంది.

బయటకి వెళ్ళిన అమ్ము నాన్న వసంత దగ్గరికి వెళ్ళి "నువ్వెందుకు  హాస్పిటల్ కి తీసుకు పోయావ్ ,ఆళ్ళ మ్మే తీసుకుపోయేదిగా " అన్నాడు మేవానంగా .

"ఎవురు తీసుకుపోతే  యే  వుందిలే గాని .  నిన్ననగా  పోయినావ్  యేడికి   పోయినావ్ ?  కోళ్ళ  పందేలకేగా  పోయావ్ ? దొంగ సొమ్మంతా  ఆడ పోసోత్తేగాని  నీకు నిదర పట్టదు.  నీకు మళ్ళీ మూడు పెళ్ళిళ్ళు, పెళ్ళాలు  బిడ్డలూనూ , యే౦  ఆ బతుకు బతకపోతే  చావకూడదా ? ఉరుములేని పిడుగల్లె, వానలేని వరదల్లే  విరుచుకు పడింది. నేను కోడి పందేలకి  పోయ్యానని కలగన్నావా ? నోరు మూసుకేయే, మొగుడ్ని  మగాడిని అని కూడా చూడకుండా  పెట్రేగి పోతన్నావ్ , వంగదీసి నాలుగుద్దులు గుద్దితే చచ్చి వూరుకుంటావ్ ". అని బయటకి   పోబోయాడు వెంకటేశం

 "ఏడికి  మళ్ళీ  పోతన్నావ్ ? ఆ  అమ్మిని యీడనే వుందువుగాని అని చెపుతున్నావ్, మింగటానికి మెతుకు లేదు కాని మీసాలకి సంపంగి నూనె అన్నట్టు  ఆ అమ్మిని కూడా  సాకడం  నా వల్లగాదు .  ముందు దాన్ని పంపిచ్చి రా ! నువ్వా పని జేయకుంటే  నేను నా బిడ్డలు కిరసనాయిలు పోసుకుని చస్తాం." అంది వసంత.

ఇప్పుడు దాక  హాస్పిటల్కి యెవరు  తీసుకుపోతే యేమిలే అన్న మనిషి యింతలోనే ప్లేట్  మార్చేసింది యెందుకో ? ఈ ఆడముండలని అర్ధం జేసుకోవడం  యమా  కష్టం  అనుకుంటూ "అట్టాగే పంపిచ్చేత్తానులే , నువ్వూరికూరికే యెగరబాకు " అంటూ  బయటకి పోయాడు.

అమ్ము కి ఆళ్ళ  మాటలు వినబడ తానే వున్నాయి. నాన్న తనకి అన్ని అబద్దాలే చెపుతున్నాడన్నమాట. అని అర్ధం అయ్యేసరికి యింకా యేడుపొచ్చింది. వెంటనే లేచి యింటికి యెల్లిపోవాలి అనుకుంది. ఇంటికి ఎల్లాలంటే చానా దూరం నడవాలి. బస్ ఎక్కడానికి చార్జీలకి డబ్బులు కూడా లేవు. చిన్నమ్మని అడిగినా తిట్టుద్ది , నాన్న యింటికొచ్చాక డబ్బులడిగి తీసుకుని యెల్లిపోవాలి అనుకుంది. ఆ రాత్రికి తండ్రి రానూ లేదు వేరే వూరికి సామానేసుకుని వెళ్ళాడని చిన్నమ్మ చెప్పింది. మేమందరం కూడా రెండు రోజుల్లో యీ వూరు నుండి యేరే వూరికి యెల్లిపోతన్నాం. నువ్వు అక్కడికి కూడా యిట్టా యెగేసుకుని రాబాకు. ఈ సారి యింటికి వచ్చావంటే కాళ్ళు యిరక్కొడతా . వేలు చూపిస్తూ బెదిరించింది వసంత.

కాసేపటికే వేన్నీళ్ళు  పెట్టి  నీళ్ళు పోసుకోమని చెప్పింది. జొరం తగ్గలా .. ఈ పూట కూడా ఈ బ్రెడ్ ముక్కలు పాలల్లో నంజుకుని తిను అని ముందు పెట్టింది. తినే దాకా ఉండి  మళ్ళీ మొగుడ్ని, అమ్ము వాళ్ళ అమ్మని తిట్టటం మొదలెట్టింది. ఆ తిట్లు యింటున్న అమ్ముకి చివుక్కుమనిపించింది. "మా అమ్మని తిట్టబాకు చిన్నమ్మా ! నేను రేపు మా యింటికి  యెల్లిపోతా  " అంది . అయినా కూడా  ఆగకుండా అరగంట దాకా తిడతానే వుంది  వసంత. అమ్ముకి రోషం ముంచుకొచ్చింది. రాత్రిల కాకుంటే అప్పటికప్పుడు బయలేల్లేదే.

తెల్లారి నిదరలేస్తూనే   "నేను మా యింటికి వెళ్ళిపోతా   చిన్నమ్మా"  అంది అమ్ము

ఆ పటినే  పోతావా ? తల దువ్వుతా రా.. అంటూ పిలిచి జడలేసి చార్జీలకి డబ్బులిచ్చింది.  ఇక యిక్కడికి రాబాకు నువ్వొచ్చినా  యిక్కడ మేముండం, మీ అమ్మ చెప్పినట్టు యిని చదువుకో .. అంది. సరే  అని తలూపి బయటకి వచ్చింది . రోడ్డులో తండ్రి యెదురయి యెల్తన్నావా .. అడిగాడు. తల ఊపింది

 "నువ్వు నా కాడ  వుండాలంటే  మీ అమ్మ , మీ అమ్మమ్మ ,తాత అందరిని తీసుకొచ్చి వొప్పందం చేస్తే నా కాడ  వుందువు గాని లేకపోతే లేదు, వాళ్ళని తీసుకు రా ..  ఈ వూరు నుండి మేము యెల్లిపోతున్నాం , నువ్వు వస్తానంటే మాతో పాటు వద్దువుగాని అక్కడే ఉందువుగాని "అన్నాడు.
"అది అబద్దమే అని నాకు  తెలుసని నాన్న అనుకోడంలేదు.  మాయమాటలు చెప్పి నన్ను  యింకా   మోసం చేస్తన్నాడు "  మనసులో అనుకుంది అమ్ము.

 "మా అమ్మని, చెల్లిని వదిలి పెట్టి యెక్కడ వుండను, నేను అక్కడే వుంటా, యిక నేనెప్పుడు  మీ యింటికి  రాను నాన్నా ! నువ్వు రమ్మన్నా రాను .  నీ కన్నా మా అమ్మ చానా మంచిది "అంది బస్ ఎక్కుతూ

అమ్ము  రావడం రావడం హేమ  ఇంటికే వచ్చింది .  బయట అంట్లు తోముకుంటున్న తల్లి దగ్గరికి వెళ్లి నిలబడింది. అమ్ముని పలకరీయకుండానే  రమణ గబా గబా లోపలి వచ్చి .. "అమ్మా యెవరొచ్చారో చూడు! " అని హేమని  బయటకి పిలిచింది .

 అమ్ముని చూసి యెందుకొచ్చావే .. అని కోప్పడింది. తలొంచుకుని నిలబడింది అమ్ము . రమణ దాన్ని దగ్గరికి తీసుకుంది. అక్కడ యే౦ జరిగిందో పూస గుచ్చినట్టు తల్లికి చెపుతూ వుంది .  హేమ  వంట చేసుకుంటూనే అమ్ము మాటలు వింటూ  యిక అమ్ము ఎప్పుడూ  వాళ్ళమ్మని వదిలి పోదు అనుకుంది

 పోద్దుటి నుండి  యేమీ  తినలేదాంటీ!  ఆకలవుతుంది   అన్నం పెట్టరా అని అంది. అమ్ముకి అన్నం పెట్టి  అది తింటున్నంత సేపు అమ్ము చిన్నమ్మని  హేమ  రమణ ఇద్దరూ కలిసి  ఆమెసలు  ఆడదే కాదని జాలి,దయ ఏ కోశానా లేదని వీలయినంతగా తూర్పారబోసారు

ఆ తర్వాత అమ్ముని నట్టింట్లో కూర్చో పెట్టి   హేమ సుద్దులు చెప్పడం మొదలెట్టింది .  అరగంట పాటు మందలిస్తూ   వాళ్ళమ్మ వాళ్ళ కోసం యెలా కష్టపడుతుందో  చెపుతూ .. అలా యిల్లు వదిలేసి వెళ్ళకూడదని , బడి యెగ్గొట్టి   తిరగ కూడదని చెప్పి .  " నీకేం  కావాలన్న నన్ను అడుగు .. నేను కొనిస్తాను"  అని చెప్పింది హేమ.

"ఆంటీ నాకు సైకిల్ కావాలాంటీ! "అని ఠక్కున అడిగింది . "క్రొత్త సైకిల్ అయితే యిప్పుడు కొనలేను కానీ  మా అన్నయ్య వాళ్ళమ్మాయి సైకిల్ వుంది  అది తెప్పిచ్చి ఇస్తాను . అది కొన్నాళ్ళు  వాడుకో!  తర్వాత క్రొత్తది కొంటాను . అయితే ఒక షరతు నువ్వు అసలు బడి కెళ్ళడం  మానకూడదు అలా అయితేనే  సైకిల్ తెప్పిచ్చి ఇస్తాను " అని షరతు పెట్టింది కూడా . "

కాసేపు ఉండి  అమ్ము, రమణ ఇంటికి వెళ్ళిపోయారు . ఇంతటితో  ఈ కథ అయిపోయింది అనుకుంది హేమ

  ఆ రోజు సాయంత్రం పూట ..ఓ .. ఆడ మనిషి హేమ  యిల్లు వెదుక్కుంటూ వచ్చింది వసంత. ఎవరో  వో  పెద్దాయన ఆమె కూడా వచ్చి "ఇదిగో ..యీ యిల్లే..!  నువ్వడుగుతున్నామె కూడా యీమె " అంటూ  హేమని   చూపి వెళ్ళి పోయాడు

వచ్చింది  యెవరా  అని  ప్రశ్నార్ధకంగా చూస్తున్న ఆమె దగ్గరికి వచ్చి  "హేమమ్మ అంటే మీరేనంటకదమ్మా" అని  అడిగింది . అవునని తల ఊపింది.

"నేను రవణ సవితినమ్మా "... అంటూ పరిచయం చేసుకుంది . అమ్ము చెప్పిన మాటలు గుర్తుకొచ్చి  ముఖం  చిట్లించింది  ఆమెతో   మాట్లాడటం  యిష్టం లేనట్టుగా .

"కాసిని  నీల్లియ్యమ్మా తాగేదానికి"  అడిగింది , ఇవ్వక తప్పదు గనుక యిచ్చేసి లోపలి వెళ్ళడానికి  వెనుతిరగబోతూ "రమణ యిప్పుడు రాదు, రెడ్డి గారింట్లో  పనులన్నీ చేసినాక రాత్రి యేడుగంటలకి వస్తుంది "

ఆ అక్కతో పనిబడి రాలేదమ్మా! మీతోనే ఒక చిన్న యిసయం  చెప్పిపోదామని వచ్చాను "

"నాతో  చెప్పే విషయాలేముంటాయి నీకు ?అడిగింది

అదేనమ్మా ! అమ్ము వచ్చినాక అక్కడ ఇసయాలు  చెప్పి ఉంటాదిగా .మీకు  కూడా తెలిసి ఉంటాయని "... అని సగం చెప్పి ఆమె  ముఖంలోకి చూస్తూ ఆగింది

"నాకు చెప్పడానికి యేముంటాయి ? అది బడి యెగ్గొట్టి వాళ్ళమ్మ కొట్టుద్దని తప్పించుకోవడానికి మీ యింటికి  వస్తుంది .మీరు రెండు రోజులుంచుకుని పంపిస్తారు అంతేగా ! "అంది   యేమి తెలియనట్లు.

"రెండు రోజులుంచుకుని నానా మాటలు అంటున్నానని ఆ అమ్మి చెప్పలేదా .. అమ్మా !"  అడిగింది అనుమానంగా .
హేమ  మాట్లాడలేదు.  ఆమె  చెప్పడం మొదలెట్టింది .

"ఆ అమ్మి మూడు మూడు రోజులకి బడి యెగ్గొట్టి అక్కడికి వస్తుందమ్మా ! వచ్చి ఆళ్ళ మ్మ , తిట్టిందనో ,కొట్టిందనో ,పుస్తకాలు కొనలేదనో , తిండి సరిగా పెట్టడలేదనో చెపుతా వుంటది . అట్టా  చెప్పకూడదని ఆ అమ్మికి యింకా  తెలియదు కదమ్మా ! దాని బాబు చచ్చినాడు రమణక్కని అమ్మనా బూతులు తిడతా ఉంటాడు . అయి విన్న ఆ పిల్లకి ఆళ్ళ  అమ్మంటే మరీ చులకనైపోదూ. నాకా ఇద్దరూ ఆడ పిల్లలే ! ఆడు తెచ్చింది తాగడానికే సరిపోద్ది.  అనుమానం  జబ్బుతో నన్ను  పనికిబోయేదానికి యీల్లేదంటాడు. ఆడు తెచ్చింది యెన్నిటికని సరిపెట్టేది నేను. అయినా ఆయన యెన్ని రోజులు నికరంగా పనిచేస్తాడో నమ్మకం లేకపోయే !  కంటో  కనుమాయం చేసినట్టు ఇనప చువ్వలు,సిమెంట్ కట్టలు అమ్ముకుంటా వుండాడు . అది యెక్కడ బయట పడిపోద్దో అని నాకు వుచ్చబడి పోతా  వుంటాయి. నమ్మకంగా అంతా అప్పజెప్పి పొతే అట్టాచెత్తే  యెట్టా ?  సామాను దొంగతనంగా అమ్మొద్దు అని నెత్తినోరు కొట్టుకుంటా ! ఆడి దొంగ బుద్ది మారదు . ఎప్ప్దడో ఒకప్పుడు  దొంగతనం బయట పడదా ! చేట్టుకట్టేసి కొట్టడమే కాదు జైల్లోనూ  పెట్టిత్తారు . అట్టాంటాడితో  బితుకు బితుకంటూ  కాపరం జేస్తన్నా !

హేమ  మౌనంగా వింటుంది   ఈ విషయాలు నాకు తెలియనివి కాదు . రమణ అప్పుడప్పుడు  భర్త గురించి చెపుతూ వుంటుందిగా అనుకుంది మనసులో.

"నేనే అట్టా  వుంటే  ఆ పిల్లని నేనెక్కడ  తగిలిచ్చుకుంటానమ్మా! అందుకే ఆ అమ్మి మనసు యిరిగేటట్టు మాటలని ఆడ నుంచి వెళ్ళగొట్టినట్టు చేస్తన్నా!  అయినా ఆ పిల్ల వాళ్ళమ్మ  మీద సాడీలు చెప్పడం మొదలెట్టింది. పిల్లలట్టా కన్న తల్లి మీద చాడీలు చెప్పి పెరక్కూడదు. కన్న తల్లి మొత్తుకుంటూ పిల్లకాయలని పెంచొచ్చు  కానీ పిల్లలు  అమ్మని తిట్టుకుంటూ పెరక్కూడదు. . ఆ అక్క   మొగుడితో యేగేగి  అలుపొచ్చింది. ఇప్పుడు యీ పిల్లా యిసిగిత్తే  యెట్టా బతికేది? ఇప్పుడు బడికి పోవాలంటే సైకిల్ కావాలంటది,బూట్లు కావాలంటుంది. వాళ్ళ నాన్న అడిగినయ్యన్నీ కొనిస్తాడనుకుని  మా చుట్టూ తిరుగుతుంది . ఆళ్ళ మ్మని  వదిలేసి యిట్టా తిరుగతా వుంటే   ఆ అక్క యెంత  కుమిలిపోద్ది ? ఆయన్నీ తల్చుకుని అమ్ము ని ఆడ నిలవనీయకుండాజేసా ! నన్ను తిట్టుకున్నా  బాధనేదు,  తల్లి బిడ్డలు కలిసి ఉండాల.
 వసంత  వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది హేమ
చెట్టులాంటి అమ్మ నీడ వొదులుకుని గొడుగులాంటి నాయన నీడకి చేరతావుంది  ఆ పిల్ల . వాళ్ళమ్మకాడికి చేర్చాలనే అట్టా చేశా!  మనసు రాయిలా  జేసుకుని రాకాసిలా  తరిమేసా ! నేను ఆడదాన్నే ! కడుపు తీపి నాకు తెలుసు. మొగుడ్ని వద్దనుకునే ఆడాళ్ళు  యె౦దఱో వుంటారు. బిడ్డలని వొదిలేసే  ఆడాళ్ళు యేడో తక్కువుంటారు.  మా అక్క బిడ్డలని వొదిలేసే ఆడది కాదు . కులపోల్లు యేసిన తప్పు కట్టి  బిడ్డలని యెంట తెచ్చుకుంది. పని పాటలకి పంపకుండా బడికి పంపతా  ఉంది. అమ్ముకి అమ్మ యిలువ తెలియాలనే నేను అట్టా  కఠినంగా ఉండా" మనసులో వున్నదంతా  వెళ్ళబోసుకుంది వసంత.
ఆహా ..యేమి మనిషి యెంత  ముందు చూపుతో ఆలోచించింది యీమె అనుకుంటూ వుండగానే

   రొంపిన దోపుకున్న చీర కొంగుని బయటకి తీసి మూలన వేసి వున్న ముడి విప్పి మడతలు పెట్టి వున్న డబ్బు ని తీసి హేమ  చేతిలో పెట్టేసింది."అమ్మా .. అమ్ము కి సైకిల్ కొనిపెడతానని పోయినసారి వచ్చినప్పుడు చెప్పా . కానీ కావాలనే కొనిపెట్టలా, ఈ  మూడేలు  పెట్టి దానికి ఒక సైకిల్ కొనియ్యండి . ఇంకేమన్నా డబ్బు పడినా సరే మీరేసి కొనియ్యండి . వచ్చే నెలలో ఆ డబ్బు కూడా తెచ్చిస్తా .. అని చెప్పింది.   హేమ ఆశ్చర్యంగా  చూస్తుంటే "నేనిట్టా  యిచ్చినట్టు ఆళ్ళకి  తెలియనియ్యకండి. నన్ను రాకాసి దాన్నిగానే  వుండనీయండి . తల్లి బిడ్డలు యేరు కాకుండా వుంటే  అదే చాలు "  అన్జెప్పి   గేటు తీసుకుని  గబగబా వెళ్ళిపోయింది.  హేమకి  నోట మాట రాలేదు.  తేరుకుని చూసేసరికి ఆమె  పిలుపు వినబడనంత దూరం వెళ్ళిపోయింది వసంత.

నేను  కఠినాత్మురాలు  అని తిట్టుకున్నది ఈ అమ్మనేనా !? అని సిగ్గుపడింది హేమ

ఆణువణువూ  నింపుకున్న ప్రేమేగా అమ్మంటే ! అమ్మ విలువ తెలిసేది మరో అమ్మకేగా ! అనుకుంటూ  కళ్ళ తడితో గేటు వరకు వెళ్లి  దూరంగా  నడచి వెళుతున్న ఆ అమ్మ వొంక చూస్తూ ఉండిపోయింది.







.          

10 కామెంట్‌లు:

Sharma చెప్పారు...

"గేదె ఛస్తే గాని పాడి బయట పడదన్నట్లు , బయట కష్టాలు చూస్తే గాని ఇంటిలోని వాళ్ళు తమని ఎంత బాగా చూసుకుంటున్నారో" అర్ధమవుతుంది . అలా అర్ధమయ్యేలా చేసిన ఆ సవతి తల్లి వసంతకూ , మనసున్నదని వ్యక్తపరచిన వేళ ఆడదానికి నిర్వచనమైన ఓర్పుని చూడటం తటస్థించింది .
ఆద్వాళ్ళు అంటే ఓర్పు , నేర్పులకు ప్రతీకలుగా వుండాలని ఈ ముగింపు ద్వారా తెలియచేయటం చాలా ఆనందదాయకం . మీ కధా రచనలలో నిగారింపు కనపడ్తున్నది .

ranivani చెప్పారు...

వనజ గారూ !గ్రేట్!చాలా చాలా బాగుంది . సవతి తల్లి రెండో కోణాన్ని చూపించారు .చాలా మంచి కథనం వసంత అమ్ముని హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళడం ద్వారానే అమ్మ ఎవరికైనా .అమ్మే అనిపిస్తుంది .సైకిల్కు డబ్బులు ఇచ్చినట్టు తెలియనీయొద్దని చెప్పడం ద్వారా ,ఆమెకెంత ముందుచూపో అన్పించింది .అబ్బో ఇంకా ఇంకా చాలా చాలా చెప్పాలనుంది కానీ చెప్పడం రావడం లేదు ,

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Sharma గారు కథని చదివి వెనువెంటనే మీ విలువైన అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు. మీ ప్రశంస కి కృతజ్ఞతలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నాగ రాణి గారు మీ స్పందన మీ మాటల్లోనే తెలుస్తుంది. బండల మాటున జలధార ఉంటుందట. పైకి కఠిన మనసు అనిపించినా కరుణనొలికే మాత్రు హృదయం మగువలందరి సొత్తు. కొన్ని సార్లు మసకవేసి కనబడవు అంతే!
మీ స్పందనకి మరీ మరీ ధన్యవాదములు

Padmarpita చెప్పారు...

చక్కని ముగింపుతో చిక్కని భావాన్ని అందించారు.


Niru చెప్పారు...

చాలా బావుంది.కాకపోతే,తీసుకునేవారికి అత్యాశ వుండకూడదు,ఇచ్చెవారు అపాత్రదానం చెయ్యకూడదు..ఇవి రెండు చుసాను చాలా సార్లు...అమ్ము అలా కాకుండ ప్రయొజకురాలు కావాలని అనుకుంటున్న్

కాయల నాగేంద్ర చెప్పారు...

చాలా చాలా బాగుంది వనజ గారు. ముగింపు ఆలోచించే విధంగా కొత్తగా, అద్భుతంగా వుంది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పద్మార్పిత గారు ... కథ నచ్చినందుకు ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Niru గారు మీరు సూటిగా సుత్తి లేకుండా మంచి విషయాన్ని భలే చెప్పేస్తారు. మీరన్నది నిజమే! థాంక్ యూ సో మచ్.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కాయల నాగేంద్ర గారు ... కథ మూడు భాగాలని ఓపికగా చదివి మీ స్పందన తెలిపినందుకు బహుదా సంతోషం. ధన్యవాదములు.