31, జులై 2018, మంగళవారం

మెత్తగా సుతిమెత్తగా ..






 - మంజు యనమదల 


సామాజిక అంశాలపై తనదైన శైలిలో చక్కని కథలను రాస్తూ రాయికి నోరొస్తే, కుల వృక్షం అనే రెండు కథల పుస్తకాలను వెలువరించి వెలుతురు బాకు అనే కవితా సంపుటిని అందిస్తున్న పరిచయమక్కర్లేని వనజ వనమాలి బ్లాగర్ తాతినేని వనజ.


 వెలుతురు బాకు కవితా సంపుటి గురించి నాలుగు మాటలు...


మొదటి కవిత ద్వారాల మాటలో ఇంట్లో ఓ ఆడది అవసరాలకు మాత్రమే ఉండాలనుకునే శతాబ్దాల చరితకు ముగింపు రుధిర ద్వారాల మాటను, దశమ ద్వారమా మాట అంటూ ఎంత నిక్కచ్చితంగా చెప్పారో ఆ వేదనాభరిత హృదయాన్ని మనం ఆ అక్షరాల్లో చూడవచ్చు. కల కల్లలై కవితలో రైతు ఎదురుచూపులను, వెనుకెలుగుతో కవితలో ఒంటరితనపు మది అంతరంగాన్ని, వస్త్రాపహరణమొక సంస్కృతి అంటూ ఇంటా బయటా స్త్రీలపై జరుగుతున్న అరాచకాలను, జాతి, మత, కుల వివక్షలకు తావీయక అధికారులు చేస్తున్న అన్యాయాలను అద్దంలో చూపించారు. వారు వారే కవితలో పర స్త్రీలలో అమ్మ అనాటమి చూడలేని ఎన్నటికీ, ఎప్పటికి మారని వారి వికృత అభిరుచిని ఎండగట్టారు. హాస్టల్ గది కవితలో చదువుల బందిఖానాలో పడి మగ్గుతున్న పిల్లల ఆవేదనను, అక్షయ శిఖరంలో అమ్ముడౌతున్న అక్షరం ఆక్రోశాన్ని, రహస్య రచయితల(ఘోస్ట్ రైటర్స్) అక్షరపు అమ్మకాలను, అక్షయ అక్షర తూణీరంలో లసంత విక్రమ తుంగే మరణానికి చింతిస్తూ వెలువడిన భావావేశాన్ని, ఆంధీ కవితలో తోలి వలపు ప్రేమ పరిమళపు జ్ఞాపకాన్ని, చిరునామాలో ఎవరేమనుకున్నా తానేమిటో చెప్పిన భావుకత్వాన్ని, దుఃఖం కావాలనిపిస్తుందిలో మనల్ని మనం సేదదీర్చుకోవడానికి కాస్త దుఃఖం కావాలనిపిస్తుందంటారు ప్రేమగా. దేహాన్ని కప్పండి కవితలో కాసుల కోసం సినిమాయాజాలం చేస్తున్న అంగాంగ ప్రదర్శనను, దానికి కారణమైన కళాకారుల కుటుంబ గతులను సవివరంగా చూపించారు. 


నాకో మనిషి కావాలిలో అనుభూతులను, అవసరాలను పంచుకోవడానికి మనిషి ఆకాశంలో చందమామయినప్పుడు ఇలా మాటై, మనసై అక్షరంలో చేరానంటారు. నిశ్శబ్ద సంగీతంలో జీవిత సంగీతాన్ని, నదీ వియోగ గీతంలో మనసు నది అంతరించి పోతున్న జీవ నదులలు, తరిగిపోతున్న జీతపు విలువలకు అన్వయిస్తూ ఆలపిస్తున్న అంతర్లీన గీతాన్ని వినిపించారు. ఈ కవితా సంపుటి పేరైన వెలుతురూ బాకు కవితలో మానసిక చీకట్లను రూపుమాపడానికి రహస్య ఖార్ఖానాలో తయారు చేసుకున్న వెలుతుబాకుతో దండయాత్ర చేద్దామంటారు. సాయం చేయడానికి చేతులు కావాలిలో పరాయి దేశాలు పట్టిపోయిన మన వారసత్వాలకు బలై పోతున్న ఎన్నో మనసుల మానసిక సంఘర్షణ ఈ కవిత తేటతెల్లం చేస్తుంది. మట్టి, మనసు ఒకటేనంటారు సౌందర్య పిపాస కవితలో. 


హాలికుడా కవితలో హరితం కాలేని రైతు బతుకు ఉరికొయ్యకు వేలాడుతోందని వేదనగా వందనాలంటారు. ఎవరి కోసం ఆగని కాలంతో కలసి కలం కవితలో పగురులు తీస్తారు. పులిస్వారీలో ప్రేమని ఓ ద్రవంగా చెప్తూ వయసుకి వణుకు వచ్చినా , మనసుకి జ్వరం వస్తూనే ఉంటుందంటూ ఆ అయోమయంలో ప్రయాణ ప్రమాదం, ప్రమాద ప్రయాణానికి తేడా తెలియడం లేదంటారు. ఎవరన్నారు రాయడం లేదని, అక్షరాత్మ ఆశ్లేషం, డైరీలో కొన్ని పేజీలు, నీటిపై ప్రయాణం, మామ కబుర్లు, మనలేని మనం, హృదయాన్ని ఊరడిల్లనీయీ వంటి కవితల్లో సున్నితత్వంతోపాటు తన మనసు అంతరాళంలో తచ్చాడే భావాలను, వేదనలను వినిపిస్తారు. నాగలి విధ్వంసం, నువ్వు వదిలేసిన కాడితో కవితల్లో ఓ ఇంటి రైతు మరణాన్ని, ఆ తరువాత ఆ ఇంటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు ఓ కొత్త దృక్కోణంలో.


అంతేగా.., పూల కథ, బరువు మేఘం, దింపేయగా రాలేవా, ఏమడిగాను నిన్ను, ఎప్పుడో ఒకప్పుడు, అతిధి వంటి కవితలు కళాత్మకంగా సుకుమారంగా ఓ మగువ మనసుని ఆవిష్కరిస్తాయి. అవయవ దానం కవిత మహిళలపై జరుగుతున్న దాడులకు తన నిరసన గళాన్ని విన్నూత్నంగా చాలా నిక్కచ్చిగా వినిపించడం అభినందనీయం. చెక్కేసిన వాక్యం కవితలో లైఫ్ ఈజ్ బ్లండెడ్ విత్ కిచెన్ అంటూ వంటింటికి అంకితమైపోయిన స్త్రీ జీవితం ఎప్పటికి మారని నిర్వచనమని, ఎప్పుడో చెక్కేసిన వాక్యమని అంటారు. రమ్మంటే రాదు, రాలుటాకు స్వగతం, అలవాటుగా, హాంగోవర్, అమ్మ మనసులో ఓ మాట, అమ్మ చేతి గాజులు, నా కెరుకగాని ప్రేమభాష, జీవితకథ, జారిపోయినరోజు, జీవితాన్వేషణ మొదలైన కవితల్లో ప్రేమ రాహిత్యం, అమ్మ మనసు, స్త్రీ సున్నిత హృదయం మనకు కనిపిస్తాయి.


 దేహక్రిడలో తెగిన సగం, గోడలు, గాయం - వేల సందర్భాలు, నా ఏకాంతంలో నేను, నిరీక్షణ, నేను సరస్సుని, శపిస్తున్నా, ఒక మౌనం వెనుక, కన్నీటికి స్వేచ్ఛ, వంటి కవితలు ఆత్మీయత కోసం ఓ స్త్రీ మది పడే తపన కనిపిస్తుంది. తాళం చెవి, ఉనికి, ఇంటిపేరు, ఖాళీ సంచి, అయామ్ ఆల్వేజ్ ఏ లూజర్,ఆధునిక మహిళ వంటి కవితల్లో భావావేశం తీవ్రత తనకి ఏం కావాలో, ఎలా కావాలో చెప్పడంలో ఎవరి చెప్పని విధంగా చెప్పడంలో అద్భుత ప్రతిభ గోచరిస్తుంది. ప్యాసా దిల్, రూపకశ్రేణి, ఆకాశాన సగం మనం వంటి కవితల్లో సమానత్వాన్ని కాంక్షిస్తారు. 


మూడో మనిషి, రాత్రి ఓ అంతరంగ రహస్యం, నాల్గింట మగనాలి, నీడసత్యం - శివం - సుందరం వంటి తనని తాను వ్యక్తపరుచుకోవంలో ఓ నిజాయితీతో కూడిన నిబద్దత ప్రతి కవితలోని కనిపిస్తుంది. తిరిగొచ్చిన ఇంద్రధనుస్సు కవిత హాయిగా మనలని ఓ పిల్లతెమ్మెర తాకినట్లు ఉంటుంది. పునీత కవితలో గాయాల అంతర్వేదన గాయపడిన స్త్రీకి కొత్త కాదని వేరొకరు గీసిన గీతని మార్చేసి సరికొత్త గీతాగానంగా చరిత్రలో నిలిచిపొమ్మంటారు. బిచ్చటపు ఎద కవిత ప్రేమ రాహిత్యంలో కొట్టుకుపోతున్న జీవితాలకు విశ్వ రహస్యమైన ప్రేమను అరువుగా ఇమ్మని విశ్వాత్మను అర్ధించడం ఈ కవితా సంపుటికి అందమైన ముగింపుగా మారింది.

మన సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అకృత్యాలను, వింత పోకడలను, స్త్రీ సమస్యలను, రైతు సమస్యలను, సామాజిక లోటుపాట్లను ఇలా ప్రతి కోణాన్ని పరిశీలించి విభిన్న భావావేశంతో తనదైన శైలిలో నిజాయితీ నిండిన మనసుతో సున్నితంగా కొన్ని అంశాలను, కోపంగా మరికొన్నిటిని, ఆవేశంగా కొన్ని అక్షర భావాలను బాకులుగా మార్చి వెన్నెలను కూడా మండే అగ్ని కణాలుగా వర్షింపజేయడం ఒక్క వనజ తాటినికే చెల్లింది. చక్కని సామజిక, నైతిక అంశాలతో కూడిన ఈ " వెలుతురు బాకు " కవితా సంపుటి అందరిని అలరిస్తుంది అనడంలో ఎట్టి సందేహమూ లేదు. చక్కని, చిక్కని కవిత్వాన్ని అందించిన వనజ తాతినేని శుభాభినందనలు.



30, జులై 2018, సోమవారం

తాజాగా...

కవిత్వం వ్రాయడానికి 

కలమూ కాగితమూ కీ బోర్డ్ డిజిటల్ పేజీ యే కావాలా యిప్పుడు ? 

ఆ గుబురు మీసాల క్రింద దాక్కున్న చిన్న చిర్నవ్వు ఆ గడ్డం నొక్కు 

చంద్రకాంతిని  గ్రోలి  తూలి వెలిగే ఆ కళ్ళు 

మేకప్ పొరలు దాయలేని 

నుదిటి మీద మూడు అడ్డు గీతలు చాలవూ 


ఆ చంద్ర బింబం లాంటి ఆ  ముఖాన్ని రెండు అరచేతుల మధ్యకి తీసుకుని 

కళ్ళలోకి కళ్ళు ప్రవహించిన క్షణాలని 

అరంగుళం దూరంలో ఆపేసి భుజాలమీదుగా క్రిందికి సాగి 

రెండు ముంజేతులను అందుకుని కళ్ళ కద్దుకోవడం కవిత్వం కాదూ ..  


పదేళ్ళుగా .. క్షణ క్షణానికి తాజాగా పూచే భావాలివి  

నా అయిదో ఆకాశమా . 

రానే కూడదు కానీ  

వచ్చాక సౌందర్య సృహ అంటుకోనిదెపుడని

రాలినప్పుడు కానీ ఆగనిది ఈ మృదు మధుర  కవనమని

చెప్పడమెలాగూ అనడం ఇక కుదరదని. 


(నిన్ననే సున్నితంగా భావోద్వేగాలతో నింపబడిన కథలేవీ రావడం లేదు అన్న కవి మిత్రుడికి కథలా అనిపించే కవిత్వం ..ఇదిగో ..అంటూ ..)




28, జులై 2018, శనివారం

కథపై స్పందన

బి హైండ్ హెర్ స్మైల్ కథ పై ఒక నిజమైన పాఠకుడి ప్రతిస్పందన.

పత్రికలో రాలేదని ..తాపత్రయపడి ..నాకు మెసేజ్ చేసి మెయిల్ ఐ డి ఇప్పించుకుని అభిప్రాయం పంపారు.


రచయితకు ఇంతకన్నా ఏం కావాలి !? కథ లింక్ ఇక్కడ 


 బిహైండ్ హెర్ స్మైల్





27, జులై 2018, శుక్రవారం

ఈ కవిత్వం ఆత్మజనిత వాక్యం

జీవన విధానంలో కాస్తంత సంఘర్షణ,సమాజంలోని సంక్షుభిత సంఘటనలకు స్పందించే హృదయం, మనసులో మరి కాస్తంత చెమ్మదనం, ఆలోచనల్లో పరిస్తితులన్నింటినీ విశ్లేషించే స్వభావం ఇవి ఉన్న వ్యక్తి తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు కవి కాగల్గుతాడు. వీటన్నింటికి మాతృ భావనలు తోడైతే ఇదిగో ఇలా వెలుతురు బాకై అక్షరాల్ని చెక్కుతారు.

"నన్ను నేను కోల్పోయిన చోటే తనని తానూ వెలిగించుకుంటూ తరిగిపోతున్న కాలంతో పాటు జీవించడం తెలిసిన వారు అక్షరప్రవాహమై పరుగులు తీస్తారు వనజ తాతినేని మాదిరిగా.

ప్రపంచీకరణ నేపధ్యంలో రెక్కలు విచ్చుకోవడం మొదలు పెట్టిన దగ్గర్నుండీ యువతరం చూపు పడమటి దిశ వైపుగానే ఉంటుంది. ఆ సందర్భంలో ఈ కవయిత్రి పలు విధాలుగా అనేక కవితల్లో స్పందించారు. ఇంత కాలం తమ కళ్ళ ముందు తిరిగిన పిల్లలు ఎగిరివెళ్ళిపోతుంటే వారి కళ్ళలో మెరుస్తున్న భవిష్యత్ పైన ఆశని చూస్తూ వాళ్ళ బాగుని కోరడం తప్ప ఏమనలేని నిస్సహాయత్వంతో మరబొమ్మలుగా నిలబడిపోయిన అనేకానేక తఃల్లుల మౌన భాషణాన్ని అక్షరీకరించారు పిల్లల ఆలోచనలు కొత్తపుంతలు తొక్కుతున్నాయనీ, శ్రమని మారకపు విలువతో లెక్కించుకుంటూ మేధోసంపత్తి పడమటికి వలసపోతుందని అమ్మ మనసులో మాటగా ప్రతిధ్వనించారు.

ఎన్నెన్నో శాస్త్ర విజ్ఞాన పరిశోధనల ఫలితంగా అరచేతిలోనో , ముందున్న టేబుల్ పైనో వేల మైళ్ళ దూరంలోని కన్న బిడ్డని తెర మీది బొమ్మలుగా చూస్తూ ఉంటోన్నా సరే స్పర్శని కనిపెట్టడం తెలియని శాస్త్ర విజ్ఞానాన్ని పరిహసిస్తారు కవయిత్రి.

"ఏడాదికి ఒక ఎకరా లెక్కన తెగనమ్మి

పదిలంగా పెంచిన ఒకే ఒక వృక్షం

పదిమందికి.. నీడ నిస్తుంది అనుకుంటే..

పరాయి క్షేత్రంలో వేసిరివేయబడ్డ విత్తులై.. ..

డాలర్ల కాపు కాసే చెట్లైతే.. పెరడే కాదు..

ఊర్ల కు ఊర్లే.. బావురుమంటున్న దృశ్యాల్ని .

ప్రత్యక్ష ప్రసారాలతొ .. చూపించాలని ఉంది " అంటూ ఈ నాడు అనేక కుటుంబాలలోని అనుభవాన్ని ,మేధో వలసల్ని బలమైన అభివ్యక్తితో దృశ్యమానం చేసారు కవయిత్రి.

అందుకనే జీవితం జీవితాన్నే ఖాళీ సంచిగా మార్చి బిడ్డలెప్పుడో చేతికి తగిలించుకుని వెళ్ళారని వేదన చెందుతారు.

ఈ కవయిత్రి నదిపై ,జలవనురలపై గల అమితమైన ప్రేమని అనేక కవితల్లో, పద చిత్రాల్లో,భావ చిత్రాలుగా ప్రదర్శించారు. ఆమె చినుకులో చినుకుగా,వరదగా ,నదిగా ,ప్రవాహంగా పరవళ్ళు తోక్కాలనే భావన అనేక పంక్తులలో అలలు అలలుగానో , కెరటాల రూపమై ఉవ్వెత్తున ఎగసిపడుతూనో, ప్రవహిస్తూనో ఉంటుంది. అతని ప్రేమలో మునుగీతలు కొట్టాలనుకుంటారు. చదువుల సముద్రంలో రేంకుల ఓడలపై ప్రయాణిస్తున్న యువతరాన్ని చూసి దిగులు పడతారు. సెజ్ ల పేరిటా , ఆనకట్టల పేరిటా నదీ ప్రవాహాలని మానవ దేహాల మీదుగా మళ్ళించే ప్రయత్నాలకి నిప్పులు చెరుగుతారు. మానవత్వపు జీవనదికై అలమటిస్తూనే ఉంటారు తన కవితల్లో.

నువ్వోదిలేసిన కాడితో అనే కవితలో .. "బాధల్లన్ని మరిచిపోవాలని

అప్పుడు ఆ మందు తాగినావు ..

ఏకంగా ఇప్పుడు ఈ మందు తాగేసి

పురుగులా మాడిపోయావు.

నన్ను గాలికి ఒగ్గేసి..

నువ్వు గాలిలో కల్సిపోయాక

నేను రోజూ ధైర్యం అనే మందు తాగుతూనే ఉండాను " అంటూ రైతు ఆత్మహత్య అనంతరం రైతు భార్య మనోగతాన్ని ఈ కవితలో చూపించారు . నిజానికి ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక్క క్షణం తమ తదనంతరం మిగిలిన వారి దుస్థితి గురించి ఆలోచిస్తే ఆ పని చేయలేరు. పాదాలన్నీ సాధారణమైనవే అయినా ఈ ఫంక్తులు మనసుని మెలిపెడతాయి. ఇక్కడ రైతు భార్య పక్షాన నిలబడ్డారు కవయిత్రి.

అదే విధంగా వేటాడ్డం ,భూమిని దున్నడం మాత్రమే తెలిసిన గిరిపుత్రులకి సాన పెట్టడమూ తెలుసనీ , మౌనంగా గుండెల్ని తడమడమే గాక బాణాలతో గుచ్చి చంపడమూ తెలుసని అంటారు.

అందుకే .. మూగబోయిన కలం నాలుక చీలికలు చీలికలుగా మారి దునుమాడటానికి సిద్దంగా ఉందని " వాకపల్లి బాధితులకి సానుభూతి ప్రకటిస్తారు. అదే విధంగా ఒక కవితలో చీకటి మాటున గిరి పుత్రులని మట్టుబెట్టి ఆ తల్లులకి గుండె కోటని మిగిల్చి అమాయకుల ప్రాణాల్ని ఎగరేసుకుపోతున్నందుకు రాజ్య హింసపై నిరసన తెలపడమే కాకుండా, అందుకే మర్నాటికి మరింత ఉద్యమ స్పూర్తి నింపుకున్న సూర్యుళ్ళుగా మారే గిరిపుత్రులకు తన సంఘీభావాన్ని ప్రకటించింది కవయిత్రి.

మనది కాని జీవితంలో నటిస్తున్న

నట ఊర్వశి' లం మనం.

విజ్ఞానపు పూలతో అలంకరించుకున్న

వసంత భామినిలం ..మనం..

వ్యక్తిత్వపు పరిమళాలు ,సమర్ధతా నైపుణ్యాలు ఉన్న

పట్టమహిషి "లం మనం.. అంటూనే మగువాని కొలతల మధ్య తయారుచేస్తున్న వస్తువులాగో , అంగడి సరుకు లాగో ,దేహ సంపదని బజారుపాలు చేస్తున్న వ్యవస్థ పై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు కవయిత్రి. ఏ స్త్రీ అలా కాకూడదనే చింతనతో చరిత్రలో తమకొక అధ్యాయాల్ని మిగుల్చుకోవాలంటారు .

భారతీయతను అడ్డుకున్న స్త్రీ తనను తానూ కొవ్వొత్తిలా జీవితాన్ని కుటుంబం కోసం కరిగించుకుంటూ బతికే విధానాన్ని ఉగ్గుపాలతోనే వంటబట్టించుకుంటుంది. తీరా జీవితం చివరికైనా "అంతా ఇచ్చేశాను జవసత్వాలన్నీ ధారపోసి ఇంటి గుమ్మానికి తోరణమయ్యాక " అపుడు తనకోసం మిగిల్చుకున్నదేవిటని తనను తానూ ప్రశ్నించుకుంటుంది ఇవ్వడం మాత్రమే తెలిసిన స్త్రీ మరణం వెతుక్కుంటూ వస్తే ఇవ్వకుండా ఉంటానా ? అనుకుంటుందంటారు కవయిత్రి .

అలా కాకుండా తనకొక అస్తిత్వం ఉందని ప్రతి స్త్రీ భావించాలని, ఎదిగే దిశలో ప్రయాణించాలని మనతో మనం మనలో మనం అంటూ పిలుపునిచ్చారు.

సమాజంలో స్త్రీలపై జరుగుతున్నా అత్యాచారాలకు,అణచివేతలకు తల్లడిల్లుతూ ..

"వయసు ఉడిగినా సరే / పరస్త్రీ అనాటమీ లో

అమ్మ అనాటమీ చూడలేని /అనాగరిక సంతతి వారిది " అని వికృతాభిరుచి కలిగి నది రోడ్డు మీద మృగాళ్ళుగా మారుతున్నవారిని వారు వారే . ఎన్నటికి మారని జాతి అని చీదరించుకుంటారు . బలమైన వ్యక్తీకరణతో అచ్చెరువు చెందిస్తారు కవయిత్రి

దుఃఖాల వారసత్వాలని మోయాలని లేదు నాకని అంటూనే ఒక సందర్భంలో "నన్ను నేను సేద తీర్చుకోవడానికి / చేద అరువు తీసుకునైనా దుఃఖాన్ని చేదుకోవాలని కోరుకుంటారు . నదిని ఈదిన నన్ను సముద్రం సవాల్ చేస్తుందంటారు. దుఃఖంతో కుమిలిపోవడం కాదు సవాళ్ళు ఎదుర్కునే దైర్యాన్ని సంతరించుకోవాలనే సందేశం నర్మగర్భంగా చెప్పారనిపించుతుంది.

"రెండు దేశాల మద్యనో రెండు ఇజాల మద్యనో

సరిహద్దుల వెంబడి మానవత్వపు నది

మెలికెలు తిరుగుతూ ప్రవహిస్తూనే ఉంది

దానిని మళ్ళించి మన హృదయసీమల్లో

శాంతిని పండించే విత్తనాలు నాటాలి" అంటూ తన శాంతి సందేశాన్ని ముంబై పేలుళ్ళ సందర్భంలో ఒక ఆశావాద దృక్పదాన్ని వెలుతురుబాకు కవితగా మెరిపించారు వనజ తాతినేని .

ఏ రంగంలోనైనా చొచ్చుకుపోయే స్వభావమే కాక తానూ చేస్తున్న కృషిని భూతద్దంలో జనానికి చూపి తమని తాము శిఖరంపై నిలబెట్టుకుని ప్రచారార్భాటం చేస్తేనే గాని ఇతరుల దృష్టికి ఆనం అనే దృక్పదం ఈ ప్రచార యుగంలో ప్రబలంగా ఉంది. అన్ని రంగాలలో లాగానే సాహిత్య రంగంలో కూడా దీనికి భిన్నంగాలేదు . సమాజంలోకి వచ్చి ప్రచారార్భాటం చేయనప్పుడు,చేసుకోలేనప్పుడు ఆ రంగంలో ఎంత కృషి చేసినా గుర్తింపు లభించదనే వాస్తవాన్ని "అక్షర శిఖరం" కవితగా అక్షరీకరించారు కవయిత్రి.

అమ్మ చేతి గాజులు గురించి వ్రాసినా,ఆర్ధిక సంబంధాలు గురించి చెప్పినా నిజాయితీ నిక్కచ్చితనం స్పష్టంగా ఉంది. అంత స్పష్టంగానూ చీకటి నిజాలను చూడగల్గే సహస్రాక్షుడైన పాత్రికేయ ఇంద్రుడు రావాలని అభిలషిస్తారు. కొన్ని కవితల్లొ స్వచ్చమైన ప్రేమ భావం గుభాళిస్తుంది. మరికొన్ని కవితల్లో ప్రేమ పొందలేక పోవడంతో ప్రేమరాహిత్యంతో కూడిన వ్యధాభరిత గాధల హృదయ స్పందనలు వినిపిస్తాయి. తన కోసం ఒక ఆలంబన కోసం వెతుకులాట ఉంటుంది. ఒక ఎడ తెగని నిరీక్షణ, తనని నమ్మిన వారి కోసం జీవితాన్ని సైతం ధారపోసేందుకు సిద్దపడే అమృతత్వం గుర్తించగలం. స్త్రీని ఆట బొమ్మగా,ఒక శృంగార చిహ్నంగా మాత్రమమే చూసేవారి పాలిట వెలుతురు బాకుగా మెరుపులు చిమ్ముతూ పదునైన వ్యక్తీకరణతో చీల్చి చెండాడేందుకైనా సిద్దపడే కఠినత్వాన్ని సంతరించుకున్న ఒక స్త్రీ మాతృ హ్రుదయాలాపనలు వినగలం.

సమాజంలో మహిళల జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్న సందర్భాలకి ఒకింత ఆవేశం,మరికొంత సహానుభూతితో చెమ్మగిల్లిన కళ్ళని ఈ కవయిత్రి లో పరికించగలం.

నేల రాలిన ఆశల్ని మిణుగురుల వెలుగులో ఏరుకుంటూ "

" వద్దన్నా పక్షి మనసు పై పిచ్చి నాట్యం చేసి

ఆలోచనలని కెలికి వెళుతుంది "

కష్టమైనా ఇష్టంగా అగాధాల అంచున ఆమె పులి స్వారీ చేస్తూనే ఉంటుంది " వంటి కవితాత్మక పంక్తులు పాఠకులని బాగా ఆకట్టుకుంటాయి.

మంచి ప్రతీకలతో బరువైన పద చిత్రాలు లేకుండా సరళమైన బాషలో సున్నితమైన భావ ప్రకటనలతో కవిత్వం సాగుతుంది. మరీ ఆవేశం వచ్చినప్పుడో,ఉద్యమ స్వభావంతో రాసినప్పుడో ఒక్కొక్కసారి కవితాభివ్యక్తి పలచని వచనంగా సాగిపోవడం అత్యంత సహజం. అటువంటప్పుడే మరికొంత సాధన అవసరమవుతుందని . రెండు మూడు కవితల్లో కవిత్వీకరణ తగ్గినట్లుగా ఉన్నా కానీ సమాజం పట్లా కవిత్వం పట్లా కవయిత్రికి గల అంకితభావం గమనించినవారికి అదంతా ప్రధానంగా తోచదు. అందుకే "పడి లేచే కెరటానికి ప్రతీకను ,అనంత కాలానికి ఉనికిని ..నేను స్త్రీని " అని తనని తానూ ప్రకటించుకోవడమే కాకుండా "మనల్ని మనంగా ప్రేమించే హృదయానికి చిరునామా ని " అంటూ దృఢ చిత్తాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు.

కొన్ని కవితల ప్రచురణా కాలాన్ని బట్టి పది పన్నెండేళ్ళు గా కవిత్వం రాస్తున్నా ఇన్నాళ్ళకి పుస్తక రూపంలో తీసుకువస్తున్నందుకు వనజ తాతినేనికి అభినందనలు. కవితా హృదయం ప్రతీక్షణం ఆత్మజనిత వాక్యంతో జ్వలిస్తూనే ఉంటుందని అందుకే ఆమె కలం రాస్తూనే ఉంటుందన్న వనజ తాతినేని ఇకముందు కూడా మంచి కవిత్వానికి ఆనవాలుగా ఉండాలని మనసారా కోరుకుంటూ .

శీలా సుభద్రాదేవి.

19 నవంబర్ 2015.

హైదరాబాద్



26, జులై 2018, గురువారం

ఈ కవిత్వ వర్షం ఎలా కురిసిందో !




వెలుతురు బాకు కవితా సంపుటి ఆవిష్కరణ తర్వాత మంచి పాఠకులు విమర్శకులు "పిన్నమనేని మృత్యుంజయరావు "గారు ఒక మాటన్నారు. కొత్త తరం వాళ్ళు ఏమి వ్రాస్తున్నారో ఎలా వ్రాస్తున్నారో చూడకుండానే సీనియర్ కవులు కొత్తవాళ్ళని అవహేళన చేయడం ఎంతమాత్రం తగదని అన్నారు. కవులకి దిశా నిర్దేశం చేయడం మానేసి దశాబ్దాల తరబడి ఇంకా వారి వొరవడి యే కొనసాగాలనుకోవడం కూడా అత్యాశ అవుతుందని అన్నారు. నిజంగా అవే మాటలని కల్పన రెంటాల గారు కూడా తన ముందు మాటలో .. అన్నారు.

కల్పన రెంటాల గారు వ్రాసిన ముందు మాట ..చదవండి.

ఈ కవిత్వ వర్షం ఎలా కురిసిందో!

స్త్రీ వాద కవిత్వ తొలి సంకలనం “ నీలీమేఘాలు” వచ్చిన చారిత్రక సందర్భం నుంచి ఇప్పటి దాక స్త్రీవాద కవిత్వం ఎన్ని దారుల్లో ప్రయాణించిందో , ఎన్నెన్ని మలుపులు తిరిగిందో వనజ కవిత్వం చదువుతున్నప్పుడు అనివార్యం గా ఎవరికైనా గుర్తుకు వస్తుంది. స్త్రీవాద కవిత్వం మొదట్లో వచ్చినంత బలంగా ఇప్పుడు రావటం లేదనో, లేదా ఇప్పుడు అసలు స్త్రీవాద కవిత్వం అనే ముద్ర అవసరం లేదనో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉంటాయి. నీలిమేఘాల తర్వాత ముద్ర ( స్త్రీల కవిత్వ సంకలనం) , ఇంకొన్ని సంకలనాలు వచ్చినప్పటికీ, బలమైన స్త్రీవాద కవిత్వ సంకలనం మరొకటి మాత్రం రాకపోవటం విచారకరం. అస్తిత్వ ఉద్యమాల్లో రకరకాల ఉప చీలికలు వచ్చాయి. ఆ చీలిక మంచిదో, చెడ్డదో అని వ్యాఖ్యానించటం కన్నా, అవసరం, అనివార్యమని ఒప్పుకొని తీరాలి.

స్త్రీవాద కవిత్వం మొదట్లో ఓ ఉధృతి లాగా వచ్చినప్పటికీ, తర్వాత తర్వాత కూడా ఆ ఉదృతి ఏ మాత్రం తగ్గలేదు. కాకపొతే ఓ విధమైన ఆవేశం స్థానం లో మరింత పదునెక్కిన ఆలోచన చోటు చేసుకుంది. భిన్నమైన పోరాట సన్నివేశాలను , ముఖ్యమైన సామాజిక పరిణామాలను గ్లోబలైజేషన్ నేపథ్యం నుంచి స్త్రీవాద కవయిత్రులు చూసారు. అవన్నీ తప్పనిసరిగా స్త్రీల కవిత్వం లో స్థానం సంపాదించుకున్నాయి. అయితే అవి స్త్రీవాద సాహిత్య విమర్శ లో రికార్డ్ కాలేదు.

స్త్రీవాద కవిత్వ విమర్శ పేరిట వస్తున్న వ్యాసాలూ ’80 ల్లో వచ్చిన కవిత్వం గురించి, కవితల గురించి, కవయిత్రుల గురించి ప్రస్తావించి వదిలేస్తున్నారు తప్ప తర్వాతర్వాత వచ్చిన కవిత్వాన్ని గురించి మరీ ముఖ్యంగా గత పది పదిహేనేళ్ళుగా వస్తున్న కవిత్వాన్ని గురించి, కవయిత్రుల గురించి మాట్లాడటం లేదు. వనజ కవిత్వం చదువుతున్న సందర్భం లో ఆ లోపం మరింత గా కొట్టొచ్చినట్లు కనిపించింది. ఎందరో కవయిత్రులు గత రెండు దశాబ్దాలుగా తెలుగు సామాజిక జీవన సందర్భాన్ని కవిత్వీకరించారు. అవన్నీ వారి వారి వైయక్తిక కవిత్వానుభావాలుగా చూడటం కన్నా, ఒక సామాజిక పరిణామ క్రమ లో భాగం గా చూడాల్సిన అవసరం ఉంది. వనజ కవిత్వం కూడా ఆ ముఖ్యమైన పరిణామ క్రమం లో ఒక భాగం.

“ నిశ్శబ్దాన్ని గెలిచి బతకడమంటే

లోకాలను గెలిచి బ్రతకడం కన్నా

గొప్పని తెలిసి పచ్చని చెట్టు పై

గర్వం గా కూర్చుందీ ఒంటరి పక్షి అలవాటు గా “

దాదాపు పదేళ్లకు పైగా కవిత్వం రాస్తున్న వనజ కవిత్వానికొక మచ్చు తునక ఈ పంక్తులు.

కవిత్వ తాత్త్వికత ను, జీవన భారాన్ని రెండింటినీ సమతుల్యం చేసే ఒక సాహిత్య దృక్పథాన్ని తన రచనల్లో ప్రతిబింబించ గల సమర్థురాలు వనజ. ఆధునిక మహిళ గా కవిత్వం రాయడం అంటే ఏమిటో తెలుసు వనజ కు. ఆమె రాసిన కవితల్లో సగానికి పైగా స్త్రీగా తన అనుభవాలను, అనుభూతులను ఆవిష్కరించింది . ఒక స్త్రీ గా కవి కావటమంటే రెండు రకాల వేదనలను ఆవిష్కరించగలగాలి.

వనజ కవిత్వం మొత్తాన్ని ఒక చోటకు చేర్చుకొని ఒకటే సారి అన్నీ చదువుతున్నప్పుడు వనజ ఎంత భావుకురాలో, సున్నిత మనస్కురాలో అర్థమవుతుంది. కవిత్వానికి కావాల్సినంది ముఖ్యంగా స్పందించే మనసు. ఆ మనసు కి మాట్లాడటం రావాలి. మాటలు గా చెప్పుకోవటం రావాలి.

“ ద్రవం లాంటి దాన్నని అర్థమయినందుకేమో

అవలీల గా పాత్రలలో మారుతుంటానంతే !

ఇక తాళం చెవి తో పనేముంది?”

కవిత్వం రాయటానికి తాళంచెవులతో బంధించని మనసు ఉండాలని గుర్తించిన కవయిత్రి వనజ.

మనసు పలికించే మృదంగ ధ్వనులను అక్షరీకరించే పరసువేది కవిత్వం. ఆ విద్య అందరికీ ఒకేలా దక్కదు. మది లో వచ్చే ప్రతి భావం కవిత రూపం దాల్చనక్కరలేదు. కాకపోతే కవిత్వం రాసే కొత్తల్లో “ డైరీ లో కొన్ని పేజీలు “ ఎప్పుడూ కవిత్వమవుతూనే ఉంటాయి. వాటిని ఇంకొంచెం సానబెడితే, అక్షర శిల్పాలను చెక్కుతూ ఉంటే బలమైన కవిత్వం గా మారుతుంది. లేదంటే కొన్ని కవితలు కేవలం భావాల ప్రోది గా మిగిలిపోతాయి. ఈ తేడా ను గుర్తించే క్రమం లో ఉంది వనజ కవిత్వం.

నిజాన్ని నిర్భయంగా నిష్పూచీగా చెప్పడం ఒకానొక కవిత్వ లక్షణమైతే, వనజ కవిత్వంలో ఆ లక్షణం నిండుగా వుంది. చాలా మంది మొహమాట పడో, సంకోచం వల్లనో, సంశయం తీరకనో చెప్పలేని విషయాల్ని స్పష్టంగా మాటల్లో వ్యక్తం చేయడం వనజ సాహిత్య వ్యక్తిత్వంలో బలంగా కనిపిస్తుంది. ఈ కవిత్వ సంపుటి ద్వారా ఇది ఇంకా ఎక్కువ మందికి తెలిసివచ్చే నిజం. ఆమె కవితలు జ్వలించే “ఆత్మజనిత వాక్యాలు.”

అమ్మ చేతి గాజుల గురించి, అమ్మ మనసు లో మాట గురించి మాట్లాడటం తో పాటు, మోయలేని భారం గా మిగిలిన ఇంటి పేరు గురించి, హాస్టల్ అమ్మాయిల అవస్థల గురించి రాస్తూనే “ అనంత కాలానికి ఉనికి ని....నేను స్త్రీని “ అంటూ బలంగా కవిత్వ గళం విప్పుతుంది.

ముఖ్యంగా స్త్రీల సమస్యలే కేంద్రంగా కథలూ కవిత్వమూ వ్యాసాలు నిరంతరాయంగా ఆమె కలం నించి వస్తూనే వున్నాయి. ఈ కవితలు కూడా ఆమె స్త్రీ-కేంద్రిత ప్రపంచానికి ఇంకో రూపమే. వ్యక్తిగతం అంటూ ఏమీ లేని సామూహిక గానం ఈ కవిత్వం. రాసేది ఇంటి పేరు గురించి కావచ్చు, సామాజిక అత్యాచారాల గురించి కావచ్చు- వనజ కవిగా నూటికి నూరు పాళ్ళు సామూహిక జీవి.

ఉదాహరణలు అనేకం ఇవ్వచ్చు కాని, ఈ విషయం స్పష్టంగా అర్థం కావడానికి “ఇంటి పేరు” కవిత చదివితే చాలు.

ఆడ నుండి ఈడకి నిర్దాక్షిణ్యంగా

నెట్టేసిన ఇంటి పేరు

నాకు మంచి పేరుని తెమ్మన్న ఇంటి పేరు

...నా పైబడ్డ పెనిమిటింటి పేరు.

అనే కవితలో ప్రతి స్త్రీ ఆవేదనా పలికిస్తుంది వనజ. ఈ అంశం ఎందఱో స్త్రీల మనోవేదనే అయినప్పటికీ, ఇప్పటికీ దీన్ని గురించి ఎవరూ కవిత రాసిన ఉదాహరణలు అంతగా లేవు. “నన్ను మేల్కొనీయకుండా/ చీకటిలో ఉంచిన ఇంటి పేరు” అంటూ “నేను”తో మొదలైన ఈ కవిత ఆ వ్యక్తిగత పరిధుల్ని దాటుకొని, “అది లేకుండా నేను లేనా/ అని నాళాలు తెగేలా ప్రశ్నించాలని వుంది,” అనే ధిక్కార ప్రకటనతో కొనసాగుతుంది. ఈ కవితలో బలమైన స్త్రీ చైతన్య ధోరణి కనిపిస్తుంది.

“ మనువు ఒక లోహపు గది

తనువు ఒక మోహపు నది”

అన్న వాక్యాలు చదివినప్పుడు హృదయం బరువెక్కుతుంది . మనువు, తనువు ఓ స్త్రీ కి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో అనిపిస్తుంది.

స్త్రీ చైతన్య సంఘర్షణ లను, ఇతర సామాజిక అంశాలని గుండె దిటవుగా పలికించిన వనజ చిక్కని కవిత్వం రాయగలదని చెప్పటానికి మంచి ఉదాహరణ “అలవాటు” కవిత .

“అలవాటుగా” అనే కవితలో ఆమె ఇలా అంటుంది:

పచ్చని చెట్టుపై చిక్కటి నిశ్శబ్దంలో

ఒంటరి పక్షి

మౌనిలా ధ్యానం చేస్తుందో

పరద్యానంలో మునిగి పోయిందో

పంజరంకాని చోట కూడా

నిశ్శభ్దాన్ని పూరించేవారు లేక

ఒంటరి తనాన్ని ఆశ్రయించలేక

దిగులు మేఘం తొడుక్కుని

గుబులుగా కూర్చుంది ఒంటరి పక్షి

దిగులు దిగులుగా మొదలయ్యే ఈ కవిత చివరికొచ్చేసరికి ఆశ్చర్యకరమైన భావంలోకి తీసుకువెళ్తుంది.

నిశ్శబ్దాన్ని గెలిచి బ్రతకడమంటే

లోకాలని గెలిచి బ్రతకడం కన్నా

గొప్పని తెలిసి పచ్చని చెట్టుపై

గర్వంగా కూర్చుందీ ఒంటరి పక్షి అలవాటుగా

అనే ముగింపులో వనజ తాత్వికత గాఢమైన ప్రతీకగా రూపు దిద్దుకుంటుంది. ఆశ్చర్యం అనేది బలమైన కవిత్వ ముగింపు. అలాంటి ముగింపుని ఇవ్వడంలోనే కవి భావ విజయం వుంటుంది. వనజ కవితల్లో ఈ ఆశ్చర్యకరమైన ముగింపులకి ఇదొక మచ్చు తునక మాత్రమే.

వనజ కథలైనా, కవిత్వమైనా ఆమెలోని అన్వేషణా తృష్ణ కి సంకేతాలు. ఎవరైనా ఒక వెతుకులాటలో భాగంగానే రాస్తారు. కాని, ఆ వెతుకులాటకి ఎంతో కొంత అర్థం తెలిసినప్పుడు గమ్యం మసకగా అయినా కనిపిస్తుంది. వనజ కవిత్వంలో ఆమె గాఢమైన అనుభవ పరిపక్వత ప్రతి సందర్భంలోనూ వ్యక్తమవుతుంది. ఈ కింది రెండు వాక్యాలు ఆమె సాహిత్య అన్వేషణకి కచ్చితంగా సరిపోతాయి.

ఆఖరికి కథలోనైనా నన్ను నేను వెతుక్కోవాలి

ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి

ఏకాంతాన్ని గురించి కవిత్వం రాయని కవి ఉండరు. ఏకాంతం గురించి వనజ భావాలు ఆమె హృదయ భాష గా చదువరులకు అర్థమవుతుంది.

“ ఏకాంత మెప్పుడూ వెలుగు లోకి రాని కాసారమే

ఉల్కలు రాలినట్లు రాలే ఆశలను

ఒడుపు గా పట్టుకున్న కొన్ని అమృత క్షణాలను

పాకుడు పట్టిన చేదు జ్ఞాపకాలను

గులకరాళ్ళు గా మార్చి

అజ్ఞాన సముద్రం లోకి విసిరేస్తుంది.”

మొత్తంగా వనజ కవిత్వం స్త్రీ అంతర్బహిర సంఘర్షణల గురించి, సమాజం లో చుట్టూరా కనిపిస్తున్న అన్యాయాలు, అసమానతల గురించి, ఓ వ్యక్తిగా హృదయగతమైన అనుభూతుల ప్రయాణం గురించి ఇలా మూడు దిశల్లో సాగింది. మొత్తం ఆమె కవితల గురించి మాట్లాడటమో, విశ్లేషించటమో నా ఉద్దేశ్యం కాదు. వనజ కవిత్వం గురించి ఒక చిన్న పరామర్శ చేస్తూ నాకు నచ్చిన రెండు మూడు కవితల వరకూ మాత్రమే ప్రస్తావించాను.

దాదాపుగా పదేళ్ళు గా కవిత్వం రాస్తున్న వనజ కవితలు మొత్తం “ వెలుతురుబాకు” పేరిట పుస్తకంగా వెలువడుతున్న సందర్భంగా రాస్తున్న ఒక ఆత్మీయ పరిచయం మాత్రమే ఇది.

అయితే, కవిత్వం విషయానికి వస్తే కవికి రూప అన్వేషణ కూడా పెద్ద సవాలు. కవిత్వానికి తగిన అంశం దొరకడం ఎంత కష్టమో, ఆ అంశానికి సరిపోయే రూపం దొరకడం అంతే కష్టం. ఈ సంపుటిలో వనజకి కవిత్వ అంశాలు అనేకం దొరికాయి. కాని, వాటికి తగిన రూపాన్వేషణకి ఇదొక ప్రారంభంగానే కనిపిస్తోంది. అయితే, అది మంచి ప్రారంభం! “నన్ను నేను వెతుక్కోవాలి” అని అంటున్న వనజ తన కవిత్వంలో ఈ అన్వేషణని ప్రతి వాక్యంలోనూ చేయగలగాలి. ఈ కవితలు ఆ దిశగా కొత్త ఆశ! “ వెలుతురు బాకు” అన్న పద ప్రయోగం తో ఓ కొత్త దారి లోకి వనజ కవిత్వం ప్రయాణిస్తుందని ఆకాంక్ష.

కల్పనారెంటాల

ఫిబ్రవరి 9, 2016.

20, జులై 2018, శుక్రవారం

వెలుతురు బాకు సృజనలో ..



వెలుతురు బాకు సృజనలో ..

ఆలోచనా కెరటాలు  విరిగిపడ్డ   మనసు తీరాన  

ఉనికిని వెతుక్కుంటూ..నాలోపటికి నేనే వంతెన వేసుకుంటూ ..  

ఏవేవో అస్పష్ట భావనలు మోస్తూ మోస్తూ 

నేనలసి పోతాను, అక్షరీకరణలొను సొమ్మసిల్లి పోతాను

పొద్దంతా అదే పనైతే  రేయంతా ఇంకో రకం సడి

కవితాలాలస జడి అనుకుంటా

బాహ్యాంత సంఘర్షణల మధ్య  నేనొక ఒంటరి యోధురాలిని

నన్ను నేను వ్యక్తీకరించుకోలేనప్పుడు

వేరొక చోట స్పష్టతని చేజిక్కించుకోవడంలో

విఫలమైనప్పుడు నాకు నేనే అర్ధం కానప్పుడూ

ఓ అస్పష్ట కవిత్వాన్ని అవుతాను 

మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ మరల మనిషినవుతాను

మరో రోజు మొదలైన చోట  కవి నవుదామని అత్యాశతో .. 


ఎదురైన కొన్ని సంఘటనలను,యెద తట్టిన దృశ్యాలను కలగాపులగం చేసుకుని నాలో  నేనే మధనపడి  ఆ వేదనకి అక్షర రూపమిచ్చిన కవిత్వమే వెలుతురు బాకు. నేను నత్త నడక కవయిత్రిని. నిత్యం పుంఖానుపుంఖాల కవిత్వం వ్రాయలేను. పదిహేనేళ్ళుగా కవిత్వం వ్రాస్తున్నాను. మొత్తం యెనబైకి పైగా కవితలు మళ్ళీ అందులో కొన్ని చచ్చువి,పుచ్చువి వున్నాయి. ఏదైనా వ్రాయాలనుకున్నప్పుడే వ్రాస్తాను తప్ప ప్రత్యేకంగా కవిత్వం వ్రాయాలని కూర్చుని వ్రాసినవి కాదు.


దారెంట వెళుతూ వుంటే వో దురహంకార పురుషుడు వొక బలహీన స్త్రీని "ఒసేయ్ .. ఇక్కడొక బూతు మాట .... నిన్ను గుడ్డలిప్పదీసి తంతానంటాడు, బస్ ప్రయాణంలో తోటి ప్రయాణికుడు ముందు నుంచున్న స్త్రీ తో అసహ్యంగా ప్రవర్తిస్తాడు, ఎవరికో సాయంగా హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాధిగ్రస్తమనుషులని  ఆ వ్యాధి తెచ్చిపెట్టిన సంక్షోభాన్ని విని విచలితమైపోతాను. ఏ స్నేహితురాలి కూతురినో చూడటానికి హాస్టల్ కి వెళతాను పిల్లల బాధల నది పై నేను కాసేపు ప్రయాణించి వస్తాను. ఊరికెళ్ళి శిధిలమైన యిళ్ళని, కాటికి కాళ్ళు జాపుక్కూర్చున్న వృద్దులని చూసి కన్నీరవుతాను. ప్రక్కదేశంలో రాజ్యం  దురాగతాలని యె౦డగడుతూ అక్షరాలని శరాలని జేసి ప్రశ్నిస్తున్న పాత్రికేయుడిని పొట్టన బెట్టుకున్నతీరుకి స్పందిస్తాను. ఉగ్రవాదం రక్కసికోరలకి చిక్కి ప్రాణాలు కోల్పోయిన అభం శుభం తెలియని చిన్నారులని చూసి వేదన చెందుతాను.  దృశ్య మాధ్యమం జన బాహుళ్యంలోకి జొచ్చుకొనిపోయి యె౦త హాని చేస్తుందో తల్చుకుంటూ వుడికిపోతాను  తోటి స్త్రీల భాధలు విని  గాయం వేల సందర్భాలు అనుకుంటాను, రైతు ఆత్మహత్య చేసుకుంటే అతని భార్య చావలేక బ్రతికి చస్తూ ఉండే వైనాన్ని చూసి ఆవేదన చెందుతాను.


నా చుట్టూ  వున్న స్త్రీల జీవితాలని, వారిపై వున్న  అణచివేతని చూస్తూ వున్నప్పుడు అందులో నన్ను నేను చూసుకుంటాను. అప్పుడు నేనూ తోటి స్త్రీల పక్షాన నిలిచి  కవిత్వపు జెండానవ్వాలనిపిస్తుంది. నేను విన్నవి, కన్నవి  యిన్ని బాహ్య ప్రపంచపు బాధలు నాకు నిద్ర లేకుండా చేసి కలవరపెడతాయి.  అలాగే ప్రొద్దునే కురిసే మంచులో  కావాలని తడిసి    చలికి యె౦డ దుప్పటి కప్పుకోవాలని కూర్చున్నప్పుడు నా చీర చెంగు గాలికెగిరి యే గుత్తుల గులాబీ కొమ్మకి చిక్కు కున్నప్పుడో, యెదురుగుగా వున్న పచ్చని  చెట్టుపై మౌనంగా తలవాల్చి కూర్చున్న వొంటరి చిలకని చూసినప్పుడో తోటంతా తిరిగే సీతాకోక చిలకల ఉత్సాహాన్ని చూస్తున్నప్పుడో అలా నాకవి హృదయం రాగరంజితమై కవిత్వం వ్రాస్తుంటాను తప్ప నేనేమి పెద్ద కవయిత్రిని కాను.    


జీవితాన్నుండి,  జీవితానుభవాన్ని నుండి  నేనంటే యేమిటీ అనే చేతన నుండి కవిత్వం వ్రాయడం మొదలెట్టాను . దాదాపు పదిహేనేళ్ళ క్రితం  వ్రాసిన మొదటి కవితకి మొన్న మొన్నే వ్రాసిన అక్షరాత్మ ఆశ్లేషం కి మధ్య ఎన్నో అనుభవాలున్నాయి.   చెప్పలేని యేదో అసంతృప్తి యి౦కా చెప్పడానికి మిగిలిపోయినట్లు ఉంటుంది . కవిత్వాన్ని నేనొక సాహిత్య ప్రక్రియగా భావించలేదు కవిత్వం మానసిక సంవేదన. ఇంకా వివరంగా చెప్పాలంటే లోపలి వెలుగు. నాతో  నేను మాట్లాడుకుంటున్న మాటలని అక్షరాలలో పెడతాను. కోపం,బాధ, నిస్సహాయత, కరుణ,జాలి,ఆవేశం,ఆక్రోశం ,ఆఖరికి ద్వేషం కూడా ఉంటుంది నా కవితల్లో. తిలక్ గారన్నట్లు నా కవిత్వంలో నేను దొరుకుతాను. 


పూర్వ కవుల, నా సమకాలీనుల  కవిత్వాన్ని చదువుతాను కానీ యే౦  చదివాను అంటే చెప్పడం కష్టం . అంతెందుకు నేను యే౦  వ్రాసానో నాకే యేమీ గుర్తు ఉండదు. ఎవరైనా మీ కవిత చెప్పండి అనడిగితే  అప్పటికప్పుడు  చెప్పలేను.  నాకు దృశ్యాలే గుర్తుంటాయి కానీ అక్షర రూపం గుర్తుండదు. నిత్యం నేను నాతోనే సంఘర్షించుకుంటాను. పుడక పుడక కలిపి పక్షి గూడు అల్లుకున్నట్లు పదిహేనేళ్ళుగా నేను వ్రాసిన కవిత్వమే ..ఈ కవితా సంపుటి.  నిజంగా చెప్పాలంటే నాకోసమే నేను ఈ కవిత్వం వ్రాసుకున్నాను. అందుకే పత్రికలకి పంపడం కూడా యిష్టం వుండేది కాదు.  నాకు దాశరధి గారి రచనలంటే యెంతో యిష్టం . మహోంద్రదయం అనే పద్య కావ్యంలో ఈ  వెలుతురు బాకు అనే పదం వస్తుంది . అర్ధం తెలుసుకుంటే చాలా బాగుంది అనిపించింది. 2006 లో ముంబాయి పేలుళ్ళ నేపథ్యంలో వ్రాసిన కవితకు వెలుతురు బాకు అనే శీర్షిక పెట్టాను. అదే ఈ కవితా సంపుటి టైటిల్ గా పెట్టాలని పదేళ్ళ పైగా నా కోరిక. దాదాపుగా అయిదారేళ్ళుగా వాయిదా పడుతున్న ఈ కవితా సంపుటి యిప్పుడు రావడమే నాకెంతో సంతసం.


నేను అడగగానే నా కవిత్వానికి ముందుమాట వ్రాయడానికి సంతోషంగా పెద్దమనసు చేసుకుని  అంగీకరించిన సీనియర్ కవయిత్రి,రచయిత్రి శీలా సుభద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంచెం జాప్యంగా అయినా మరొక ముందుమాట వ్రాసిచ్చిన కల్పన రెంటాల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.  వీరిరువురు ముందుమాట రాసి పంపిన రెండేళ్ళ తర్వాత కూడా నేను నా కవితా సంపుటిని తెచ్చే ప్రయత్నానికి యేవో అవరోధాలు కలుగుతూనే వున్నాయి. కారణాలేదైనా  కవిత్వమంటే విరక్తి కల్గిన దశలో వున్నాను.అప్పుడే  ఒక వేదికపై కలిసిన శిలాలోలిత (లక్ష్మి) గారూ మీ కవిత్వం బాగుంటుందని ప్రశంసిస్తే మళ్ళీ  కవినై జీవించిన క్షణాలవి. వెంటనే మీరు ముందు మాట వ్రాయాలని మాట అడిగి ఇప్పించుకుని ..ఇదిగో ఇలా "వెలుతురు బాకు" తో మీ ముందుకు వచ్చాను.  ప్రతి కవితని చదివి ముందుమాట వ్రాసిన డా. శిలాలోలిత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. శీలా సుభద్ర  గారు శిలాలోలిత గారు వ్రాసిన ముందు మాటల మధ్య కాల వ్యవధి రెండేళ్ళు. ఆ కాలంలో ఓ ఇరవై కవితలు కొత్తవి వ్రాసాను.   


కవిత్వం వ్రాయడమంటే  రేడియో కార్యక్రమాలు విని అభిప్రాయ ఉత్తరాలు వ్రాసినంత సులభం కాదనే నిజాన్ని చెప్పిన  నాగసూరి వేణుగోపాల్ గారి మాటలే నాలో పట్టుదలని పెంచాయి. కవిత్వం వ్రాయాలనే ఆకాంక్ష అప్పుడే కల్గింది.  ఆ మాటలన్న రెండు నెలలకే   ఆల్ ఇండియా  రేడియో  విజయవాడ కేంద్రం ద్వారా నవకవితావేదికలో నా కవిత్వం వినబడటం  అది నా తొలి అడుగు. తర్వాతర్వాత నా కవితలు,వ్యాసాలు  పత్రికలలో ప్రచురింపబడినప్పుడు చూసి  చిరునామా తెలుసుకుని మరీ నన్ను ప్రశంసిస్తూ  ఉత్తరం వ్రాసి అభినందించారు. అలా నాకొక సద్విమర్శతో  స్పూర్తినిచ్చిన నాగసూరి వేణుగోపాల్  గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 


కవిత్వం పట్ల నాకున్న ఇష్టాన్ని గమనించి ఏడేళ్ళపాటు "నెల నెలా వెన్నెల కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతని అప్పగించి ఆ వేదికపై ఎంతో మంది పూర్వ కవులని, వారి  కవిత్వాన్ని పరిచయం చేసిన "ఎక్స్ రే "సాహిత్య సంస్థ విజయవాడ వారికి, నా కవితలని ప్రచురించిన పత్రికా రంగం వారికి, వెబ్ పత్రికల వారికి, పేస్ బుక్ కవిసంగమం ద్వారా కవిత్వాన్ని పాఠకుల దరికి చేర్చుతూ  నేనే  కవిత వ్రాసినా ప్రత్యేకంగా వుంటుందని ప్రశంసిస్తూ కవిసంగమం 5 సిరీస్ లో నన్ను వర్ధమాన కవయిత్రిగా పరిచయం చేసిన యాకూబ్ సర్ కి, ఇంకా నా కవిత్వాన్ని చదివి సద్విమర్శలు చేసి మిత్రులందరికీ హృదయపూర్వక నమఃస్సుమాంజలి. కవితా సంపుటి ముఖచిత్రం ..కావాలని అడిగిన వెనువెంటనే నా మనసులోని భావాలకి తగ్గట్టుగా చిత్రాన్ని అందంగా అర్ధవంతంగా చిత్రించి యిచ్చిన నేస్తం వారాణాసి నాగలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.   వెలుతురు బాకు ని ఇంత అందంగా  ప్రచురించి యిచ్చిన సాహితీ మిత్రులు   శ్రీ శ్రీ విశ్వేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

                                                                                                                  వనజ తాతినేని,    

విజయవాడ.

                                                                                                                    o7/07/2018.


17, జులై 2018, మంగళవారం

ఆహ్వానం

 కల నిజమాయే  ఎన్నో యేళ్ళ కల యిది. 

వాయిదా పడుతూ యిప్పటికి నిజమైంది 
నా కవితా సంపుటి " వెలుతురు బాకు " టైటిల్ యిది.
22/07/2018 సాయంత్రం విజయవాడలో ఆవిష్కరణ
సమీపంలో గల మిత్రులందరూ రాగలరని ఆశిస్తూ ..







13, జులై 2018, శుక్రవారం

గుండుసూది

అభివృద్దికి ఆనవాలు అమరావతి హోరులో యిరవై  యేళ్లుగా నాన్చుతున్న రోడ్డు విస్తరణ కార్యక్రమం నట్లు కొట్టుకుంటూ సాగుతూ వుండటం వల్ల .. విజయవాడ చివరన వున్న మేము కూడా ట్రాఫిక్ పద్మవ్యూహంలో  చిక్కుకోక తప్పడంలేదు. అనుకున్న చోటికి సరైన  సమయానికి  చేరుకోవాలంటే అడ్డదారులు వెతుక్కోవాల్సిన పరిస్థితి. గూగుల్ మ్యాప్ ని శరణు వేడితే మా ఇంటికి వాయువ్య మూలనుండి కేవలం రెండు పర్లాంగుల దూరం వెళితే చాలు సులభంగా IRR కి వెళ్ళే దారి చూపించింది. ఆ రెండు పర్లాగుల దూరంలోనే రోడ్డుకి కుడివైపున అయిదంతస్తుల భవన సముదాయాలు నాలుగైదు కనబడ్డాయి. అరే, ఇవెప్పుడు నిర్మించారు ?  అని ఆశ్చర్యపోయి అవి కార్పోరేట్ కాలేజ్ హాస్టల్ అయివుండవచ్చు అనుకుని సమాధానపడి ప్రశాంతంగా నిద్రపోయాను.

ఉదయాన్నే  ఆఫీస్ కి రెడీ అయిపోయి డ్రైవర్కి రోజూ వెళ్లేదారి కాకుండా రాత్రి నేను చూసిన దారిగుండా పోనీయమని చెప్పాను. తిన్నగా జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గరకి వచ్చిపడగానే ఈ దారెప్పుడు కనుక్కున్నారు సర్ చాలా ఈజీగా ట్రాఫిక్ లో నుండి బయటపడ్డాం  అని నవ్వాడు. గూగుల్ దర్పణం చేతిలో వుండగా  సులభతర దారులకేమి కొదవ బాబూ ..అని నవ్వుకున్నాం.
రోజూ మేము అటువైపు ప్రయాణించడాన్ని కొందరు గమనించి వారూ  రాకపోకలు సాగించసాగారు. అయితే మేము వెళ్ళే దారిమాత్రం ఒక వాడలో నుంచి వెళ్ళాలి. ఆ దారి పదడుగుల వెడల్పుగల రోడ్డు దారి మాత్రమే . ఆ రోడ్డుని ఆనుకున్న చిన్న చిన్న ఇళ్ళు, ఆ ఇంటి ముందు రోడ్డు మీదకి వేసిన చిన్న చిన్నపశువుల పాకలు, రోడ్డు మీదనే బట్టలు వుతుక్కునే వారు కొందరు, కుర్చీలు వేసుకూర్చుని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకునే కొందరు,  ఆడుకుంటూన్నపిల్లలు  కనిపించేవారు. ఆ రోడ్డులో యెన్నడూ లేని విధంగా కార్లు బైకులు తిరగడం వాళ్లకేమాత్రం యిష్టం  లేదని వాళ్ళు లేచి దారి యిచ్చేటప్పుడే అర్ధమవుతూ వుండేది.  కాకపొతే అది అందరికి సంబంధించిన రోడ్డు కావడంతో తప్పనిసరై తప్పుకునే వాళ్ళు.
ఆ రోడ్డులోనే ఒకతను యింటి వెనుక చిన్న రేకుల షెడ్ వేసుకుని  నాలుగైదు గేదెలని కట్టేసుకుని పాలు అమ్ముకుంటున్నట్లు గమనించి వొక రోజు కారాపి అతనితో మాట కలిపి  వాడుకగా మాకు పాలు  పోయడం వీలవుతుందా అని అడిగాను . లీటర్ అరవై నాలుగు రూపాయలు. ఉదయాన్నే  ఆరుగంటలకల్లా వచ్చి మీరే   పోయించుకు వెళ్ళాలి అన్నాడు కొట్టినట్టుగా.  ఇంట్లోకి మూడు లీటర్ల పాల అవసరం వుంది.  నేను రావడం అంటే కష్టం, మీరే పంపకూడదా అని అన్నాను. మనిషి యింటికి రావాలంటే మరో ఆరువందలు రూపాయలు యిచ్చుకోవాలి. తీరా తెచ్చిచ్చాక   పాలు బాగోలేదని వొంకలు పెట్టకూడదు అని అన్నాడు. సరే, రేపటి నుండి పాలు పంపండి.  ఇప్పుడే డ్రైవర్ చేత సీసాలిచ్చి  పంపుతాను అని చెప్పి అడ్వాన్స్ ఇవ్వబోయాను. ముందు తీసుకోవడం అలవాటు లేదు. ఒకటవ తారీఖుకి తీసుకుంటాను అడ్రెస్స్ చెప్పండి అన్నాడు. అతను కొట్టినట్లు  అయిష్టంగానే మాట్లాడటం గమనించి మనిషి యింత సీరియస్ అయితే యెట్టా ! నలుగురికి  పాలు అమ్ముకునేవాడు సౌమ్యంగా వుండొద్దూ  అన్నాను డ్రైవర్ తో. అతనికి మన కార్లు యిటువైపు తిరగం యిష్టం లేదండి.  రోజూ ముఖం యింత లావున పెట్టుకుని ప్రక్కకి తప్పుకుంటాడు అన్నాడు.
తెల్లారి ఆరుదాటిన  ఐదో నిమిషాలకల్లా బెల్ మ్రోగింది. తలుపు తీస్తే యెదురుగా అతనే. రోజూ యిదే సమయానికి పాలు గుమ్మం ముందు పెట్టి బెల్ కొట్టి వెళ్ళిపోతాను. తర్వాత పాలు లేవని అదీ ఇదీ అంటే భాద్యత నాది కాదు అన్నాడు. ఇంకో మూడు బాటిల్స్  సంచీలో వేసి అతని చేతికిచ్చి  ఐరన్ హుక్ చూపించి  దానికి పాల సంచీ తగిలించి వెళ్ళమని చెప్పి ..మీ పేరు అని అడిగాను . శ్యాం అంటారు శ్యామూల్ అసలు పేరు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతన్ని ప్రతి రోజూ చూసినప్పుడు నవ్వి పలకరించబోయినా తనని కాదన్నట్టు వుండటం చూసి పలకరించడం మానుకున్నాను.

వాడకి చివరగా పంటకాలువ ప్రక్కన శుభ్రం చేసుకున్న స్థలంలో సంచార జీవనం చేసే నాలుగైదు కుటుంబాల  వాళ్ళు ప్లాస్టిక్ పట్టాలతో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని వుండేవారు. వాళ్ళలో కొందరు అల్యూమినియం పాత్రలు, కొందరు ప్లాస్టిక్ వస్తువులు, మరికొందరు నాటు కోళ్ళు అమ్ముకోవడానికి బయలుదేరుతూ నాకెదురు పడేవారు రోజూ. ఒకనాడు సాయంత్రం ఆ సంచార జీవనం గడిపే వారితో శ్యాం గొడవపడుతూ కనిపించాడు. అతని చేతిలో ముల్లు కర్ర కూడా వుంది. అతని ముందు తూలుతున్న మధ్యవయసు మహిళ మరొక యువకుడు నిలబడి వాడులాడుతున్నారు. కారాపి  సంగతేమిటీ  అని అడిగాను.  పరదా పట్టాలతో వేసుకున్న వాళ్ళ గుడిసెకి కర్టెన్  కొనుక్కొని రాలేదని ఆమె మొగుడిని  తిడుతుంటే గుడిసెకి కర్టెన్  యేమిటని వాడి తిట్లు అని నవ్వాడు. నేను బిగ్గరగా నవ్వాను .

అక్కడి నుండి ముందుకు నడుస్తూ యెక్కడెక్కడి నుండో  నుండి వచ్చి యిక్కడ గుడిసెలు వేసుకుని వున్నా మేమేమీ  అనడం లేదు.  ఆడమగ తేడా లేకుండా త్రాగడం  వొంటి మీద గుడ్డలు వున్నాయోలేదో చూసుకోకుండా పొర్లాడటం.  అర్ధరాత్రుళ్ళు కూడా గట్టిగా ఇకఇకలు పకపకలు, అంతలోనే  జుట్లు పట్టుకుని కొట్టుకోవడం. ఎవరు మొగుడో యెవరు పెళ్ళామో యెవరికీ తెలియదు,  వీళ్ళని మా పిల్లలు వినోదంగా చూడటం. ఇదొక రచ్చ అయిపోయింది. ఏమోలే అని వూరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నారు. వీళ్ళని చూసి మా పిల్లలు యెక్కడ పాడైపోతారో అని భయంగా వుంది సార్  అన్నాడు . అతన౦త సౌమ్యంగా గౌరవంగా మాట్లాడటం నేను వినడం అదే మొదటిసారి.
వాళ్ళని హెచ్చరిస్తే వినే రకం కాదు గుడిసెలు పీకీసి సామాను యిసిరి పారేస్తే వాళ్ళే పోతారు అని యింకొకరు అందుకున్నారు. మనం ఆ పని చేస్తే యింకో పార్టీ వాడు వచ్చి ఆ స్థలం మన సొంతమా ! పోరంబోకు స్థలం . ఎవరైనా వుండొచ్చు మనకేమి అధికారం వుంది వాళ్ళని లేపడానికి. పంచాయితీ ఆఫీస్ కి వెళ్లి కంప్లయింట్ పెట్టండి  అంటాడు. ఇంకొకడు వెళ్లి మీరందరూ వెళ్లి  ఎం ఎల్ ఏ కాళ్ళ మీద పడి ప్రాదేయపడండి,  ఆయన  జాలి చూపించి మిమ్మల్ని యిక్కడే వు౦డండి అని దయ చూపిస్తాడు అని దారి చూపిస్తారు. మనలో కట్టుబాటు౦టే  యెన్నడూ లేనిది ఈ కార్లన్నీ మన యిళ్ళ మధ్య నుండి తిరిగేవా అన్నాడు యింకొకతను. ఐదు నిమిషాల్లో అక్కడ మూడు పార్టీల  రాజకీయం అంతా అర్ధమైపోయింది నాకు. మెయిన్ రోడ్ పూర్తయితే కార్లు యిటు యెక్కువగా రావులే  అందరూ అటే వెళ్ళిపోతారు అని వచ్చేసాను. ఎక్కువగా మాట్లాడితే వాళ్ళకున్న స్థాన బలం మనకి లేకపోతే యిబ్బంది పడతానని   నాకు తెలుసు కాబట్టి.
చిన్న చిన్నగా సెక్రటేరియట్ లో వివిధ విభాగాల్లో  పని చేసే వాళ్ళు చాలా మంది మా ప్రాంతానికి అద్దెకి వచ్చేసారు. నిర్మానుష్యంగా వున్న మా యింటి వెనుక భాగమంతా  జనసమర్ధంగా మారిపోయింది. కార్లు, ఆటోలు, బైకులు జె ఆర్ నగర్ లో నుండి వెళ్ళడం మరీ ఎక్కువైంది.   "పదేళ్ళ క్రిందట  నేను చూసిన ఈ వూరు యిలా  వుండేది  కాదు దూరంగా విసిరేసినట్లుండే యీ   ప్రాంతం కూడా అభివృద్ధి చెందింది".అన్నాను శ్యామ్ తో. 

"మావూరు రాజధాని రావడం వల్ల కొత్తగా  అభివృద్ది చెందింది యేమీ లేదు . అప్పటికే అభివృద్ధి చెందిన భాగంలో వొకటి.   ఇప్పుడు పెరుగుతున్న యీ అభివృద్దే మా వూరి ప్రశాంతతని కబళిస్తుంది." అన్నాడు . అర్ధం కానట్టు చూసాను .

 నాలుగేళ్ళ క్రిందటే యిక్కడ యెకరం  భూమి విలువ పది కోట్ల పై మాటే. భూమిని కౌలుకి యిచ్చేవాడికి పాతిక  వేలు కౌలు కూడా రాదని బాధ. కౌలుకి తీసుకున్న రైతుకి మగమనిషికి రోజుకి ఆరొందలు కూలిచ్చి పొలంలో పని చేయించుకు౦టే యే౦  మిగులుతాయని వేదన.  ఇప్పుడు వూరి చివర వెలిసిన బార్ అండ్ రెస్టారెంట్. పనికెల్లిన మగాడు అక్కడికెళ్ళి అందులో సగం పైగానే వదిలించుకుని యింటికి జేరతాడు. ఊరి చివర వాడలకి సమీపంగా ఐదు నక్షత్రాల హోటల్ ఆ వాడలకి ఆనుకునే వెలిసిన అపార్ట్మెంట్లు. వాటికి  రెండు ప్రక్కల నుండి దారిని వేసి కొనుక్కునే వాళ్ళ కులాన్ని బట్టి దారిని చూపించే బిల్డర్ల మాయమాటలు. కొన్నాక నిజాన్ని  గ్రహించి అసంతృప్తిగా ముఖాలని పెట్టుకుని తిరిగే విద్యావంతులు. రెండేళ్ళల్లో  నిర్మాణం పూర్తీ చేసుకున్న  తొమ్మిది వందల ప్లాట్స్  అందులో మూడోవంతు మాత్రమే అమ్ముడై నష్టాలలో కూరుకుపోతున్న బిల్డర్స్.  ఎవరికీ చెప్పుకోలేక గుండె పోటులతో కుప్పకూలుతున్న వైనాలు యిదండీ మా వూరి ముఖ చిత్రం . అభివృద్ధి అంతా పోర్ట్ కెళ్ళే రోడ్ దే అన్నాడు వ్యంగ్యంగా.

 తర్వాత మా ఇంట్లో పనిచేసే సుశీల మాటలు వింటే మరింత మతిపోయింది నాకు. "మా వాడలోకి రావడం తప్పుగా అనుకునే జనాలంతా యిప్పుడు మా యింటి ముందు నుంచే వెళ్ళడం యెక్కువైంది. అదివరకు పెద్ద పెద్ద వాళ్ళని చూస్తే మేము కుర్చీలో కూర్చోడానికి భయపడేవాళ్ళం. ఇప్పుడు మా యింటి ముందు కుర్చీలేసుకుని మేము   కూర్చుని వుంటే  వాళ్ళు కారుల్లో పోతూ ఆరిని  చూసి గౌరవంగా లేచి నిల్చోలేదని ముఖం ముటముట లాడించుకుంటూ కూర్చున్నాడు మా వైస్ ప్రెసిడెంట్. మా యింటి  ముందుకొచ్చి మమ్మల్ని మా కుర్చీలలో నుండి లెగవమనడం విచిత్రంగా వుందండీ "అంది.
"చూసి చూడనట్టు కూర్చునే వుండరాదు. అంత  బలవంతంగా గౌరవం యివ్వడమెందుకు,  చాటుగా యిక్కడ వాపోవడమెందుకు" అంది నా భార్య.
"పెద్ద పెద్దాళ్ళతో యేవో అవసరాలు పడతాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు యిలాంటియన్నీ గుర్తుంచుకుని మొండి  చేయి చూపిత్తారమ్మా. దోసిలి పట్టి మంచీళ్ళు తాగడం, చెప్పులు కుట్టుకుని బతకడం, యెనక తాటాకులు కట్టుకుని నడవడం పోయిందన్నమాటే కానీ కనబడని చానా చానా పట్టింపులు వుండాయి కదండీ. ఆ బొచ్చుకుక్క వాళ్ళింట్లో ముందు పని చేస్తే మా యింట్లో పనిచేయోద్దు అని నిలువునా పనిలో నుంచి తీసేసింది వెంకట్రావు గారి భార్య. పనికి కూడా కులమంటుకుంటదో మతమంటుకుంటదో మరి. మీ చదువుకున్నాళ్ళకే  పట్టింపులెక్కువ" అని సణుగుతూనే వుంది పనిజేసినంతసేపు.

మా ఆఫీస్  లో పని చేసే  సుదర్శన్, వెంకటరావు యిద్దరూ  ప్రక్క ప్రక్క సీట్లలో కూర్చునే వుద్యోగం చేసుకుంటారు  ఆఫీస్ లో యిద్దరూ బాగానే మాట్లాడుకుంటారు. అనుకోకుండా యిద్దరూ యెదురుబొదురూ ప్లాట్ లలోనే వుంటారు.  వెంకట్రావ్ అద్దెకి దిగితే సుదర్శన్ సొంతంగా ప్లాట్ కొనుక్కున్నాడు. కానీ  యింటి దగ్గర పలకరించుకోవడం కానీ వొకరింటికి  మరొకరు వెళ్ళడం కానీ వుండదని యిద్దరూ విడి విడిగా చెప్పారు వాళ్ళు. ఎందుకని అంటే  మీకు తెలియదా సర్ వాళ్ళు  ఆ కులం కదా  అంటూ కలవడానికి వున్న  అభ్యంతరం చెప్పారు. పెద్ద పెద్ద చదువులు చదివి వుద్యోగాలు చేస్తున్న వీళ్ళే కుల భావనని జయించలేకపోతే అట్టే చదువుకొని శ్యాం మూర్ఖత్వం ఆక్షేపించ దగినదిగా నాకనిపించలేదు.
 పాలు తెచ్చిచ్చిన శ్యాం ని కూర్చోమని కూడా అనలేదు సుదర్శన్ భార్య.  పైగా భర్తతో అతనేమితండీ అంత అగ్లీగా వున్నాడు  అతనిని యెక్కడ కూర్చోమంటారో,  తెల్లని సోఫాలకి  అతని మురికి యెక్కడ అంటుకుంటుందో అని హడలిపోయాను అందట అని మోసుకొచ్చింది సుశీల.

శ్యామ్ మీకు బంధువట కదా అని అడిగాను  సుదర్శన్ ని. అవును అన్నాడు అయిష్టంగా. అసహనంగా వుంటాడన్నమాటే కానీ మంచివాడే అని నేనంటే  అతను మహా పొగరబోతు. ఇరవై యేళ్ళ నాడే ఎం ఏ వెలగపెట్టి ప్రభుత్వ వుద్యోగం కూడా చేసి అర్దాతరంగా వదిలేసి వచ్చి  పేడ పిసుక్కుంటున్నాడు. పెద్ద చిన్న గౌరవం లేదు, వుద్యోగం చేసినన్నాళ్లు గొడవలే, అతనితో కాస్త జాగ్రత్తగా వుండాలండీ అన్నాడు.

ఆశ్చర్యపోతూ అరే అతనెప్పుడూ యీ విషయం చెప్పనేలేదు అన్నాను. శ్యాం పట్ల  యె౦దుకో గౌరవం కల్గుతుంది ఈ మధ్య .  సాయంత్ర సమయాలలో పాలు తెచ్చిచ్చినపుడు యెప్పుడైనే యింట్లోకి ఆహ్వానిస్తే  అయిష్టంగానే లోపలికి వచ్చేవాడు. టీ త్రాగుతూ అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. వ్యవస్థ పట్ల అతనికున్న అభిప్రాయాలన్నీ పచ్చి నిజాలేగా అనిపించేది.
మా మధ్య గాజద్దాల అంతస్తులు కడితే  వాటిని రోడ్డు మీద నిలబడి చూస్తూండం అభివృద్ధి కాద౦డీ, మా ఇందిరమ్మ యిళ్ళ మధ్య నుండి కారులు వెళుతుంటే మనమెందుకు అలాంటి కార్లలో తిర్గలేకపోతున్నామో అర్ధం చేసుకోలేని  మా కుర్రాళ్ళ వుక్రోషం అభివృద్ధి అంటారా?  మా యిళ్ళ మధ్యనే వున్న కార్పోరేట్ కాలేజ్ లో మా బిడ్డలని చదివించగలమా ? షాపింగ్ మాల్ లో కెళ్ళి నా బిడ్డకి  ఫ్లోర్ లెంగ్త్ డ్రెస్ కొనివ్వగలనా ? అంతెందుకు ఓ బ్రాండెడ్ నెయిల్ పోలిష్ కొనివ్వగలనా ? ఇవన్నీ మాకు అందుబాటు ధరలోకి లోకి వచ్చినప్పుడో లేదా మా కొనుగోలు శక్తి పెరిగినప్పుడో కదా  అభివృద్ధికి  అసలైన నిర్వచనం అని  ఆవేశంగా మాట్లాడేవాడు.నాలో  ఆనేక ఆలోచనలని రేపి వెళ్ళేవాడు.


రోడ్డు విస్తరణ కార్యక్రమం పూర్తైనాక కూడా రెండు కిలోమీటర్ల దూరం కలిసి వస్తుందని జె ఆర్ నగర్ రోడ్ లోనే వెళుతున్నాను కానీ జె ఆర్ నగర్ లో బంధువులున్న సుదర్శన్ మాత్రం  కొత్త రోడ్ వైపు   ప్రయాణించడం మొదలెట్టాడు.  ఇటువైపు నుండి వెళితే ఫ్యూయల్ సేవ్ అవుతుంది కదా   అంటే   ఛీ ఛీ ఆ మురికి మనుషుల మధ్య నుండి యెవరు వెళతారండీ,  కారుపై  గేదె తోకతో కొట్టుద్దో , పిన్నమ్మ వరసయ్యే ముసలమ్మ కారాపి  యీ కూర పట్టుకెళ్లు  కొడుకా అంటూ  వెంటపడుద్దో, యె౦దుకొచ్చిన గొడవ అని వెళ్ళడం మానుకున్నాను అన్నాడు.

నేను అతని వొక ఆశ్చర్యంగా చూస్తుంటే "సుదర్శన్ ఎలాంటివాడో నేను  చెపితే మీరు నమ్మలేదు, అతనంటే యేమనుకున్నారు యిప్పుడర్ధం అయిందిగా మీకు" అన్నాడు వెంకట్రావు.

ఇంటింటికి పాదయాత్ర చేస్తున్న ఎం ఎల్ యే కి యెదురేగి మరీ స్వాగతం పలికాడు సుదర్శన్. తనెక్కడినుండి  వచ్చింది యే ఆఫీస్ లో పని చేస్తుంది  అన్నీ వివరించాడు. అది మొదలు ఆయనతో తిరగడం మొదలెట్టాడు.

  ఒకరోజు లంచ్ టైం లో  తెలిసో  తెలియకో నేనూ  యిటువైపు వచ్చాను పిల్లలు పెళ్లీడు సమయం వచ్చేసరికి యీ వూరు  వొదిలి రాజధాని పరిధిలో యిల్లు కట్టాలి.  ఎంతైనా అది ప్లాన్డ్ సిటీ కదా, అక్కడుంటే పిల్లలకి మంచి  మంచి సంబంధాలు వస్తాయి  యేమంటారు మీరు  అని అడుగుతుంటే  మళ్ళీ  ఆశ్చర్యపోయాను. వ్యక్తి కులంగా, మతంగా, అధికారంగా, అభివృద్దిగా, స్త్రీగా, పురుషుడిగా, చదువు వున్నవాడిగా, లేనివాడిగా యింకా వేరు వేరుగా చాలా  విడగొట్టబడినాక మనిషిగా  మాయమైపోయాడు. అభివృద్ధి అనే  మిఠాయి పొట్లం  కోసం చిటారు  కొమ్మపైకి యెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు దిగడం యెలాగో అర్ధం కాకపోయినా దానిని కప్పి పుచ్చుకుని   నేల పై  బురద  వుందని అసహ్యించుకుంటున్నాడు.

సుదర్శన్  ఆఫీస్ లో ఎం  ఎల్ యే కి బాగా సన్నిహితుడినైనానని చెప్పుకోవడం యెక్కువైపోయింది. అడిగిన వారిని అడగని వారికి  ఆయన చాలా మంచివాడు. మనమంటే అభిమానం చూపుతాడు  ఏదైనా పని కావల్సిదే చెప్పండి. నిమిషాల్లో అయిపోతుందని హామీలు యిచ్చేస్తున్నాడు. అసలదంతా నిజమేనంటావా అనడిగాను శ్యాం ని.

మా   వాళ్ళందరిని కలిపి వుంచే గుండుసూది లాగా పనికొస్తాడని దువ్వుతున్న సంగతి తెలియదు వెఱ్ఱి ముఖం గాడికి. అన్నాడు శ్యాం . అతని సూక్ష్మగ్రాహ్యక శక్తికి అచ్చెరువు చెందుతూనే అర్ధం కాలేదు అన్నాను నటిస్తూ ..
యే కులానికి ఆ కులం లెక్కన   వోటర్లని  పొత్తాలు పొత్తాలుగా ఒక  పొదికలా పెట్టుకుని  వాళ్ళని విడిపోకుండా వుంచడానికి  యీ సుదర్శన్ లాంటి వాళ్ళని గుండుసూదిగా వాడుకుంటారు నాయకులు. ఆర్థికంగా బాగుండి, నమ్మకంగా పడి వుండే  వారిని   గోడకి కొట్టిన మేకులాగా,  పార్టీ  అంటే అభిమానంతో పడి చచ్చేవాళ్ళని పాకలో   గుదికొయ్యలా పాతేసి  వాడుకుంటారు. ఈ తెలివిలేని నాయాల్లందరూ  గొర్రెల మందలాగానో, సొల్లు కార్చుకుంటూ చెప్పులు మోసే వాళ్ళు గానో, చిన్న చితకాకి  ఆశపడి కుక్కల్లా కాపాలా కాయడమేగా చేసేది. అంతకన్నా యే౦ మార్పు వుంటుంది  వీళ్ళల్లో అన్నాడు.

రాజకీయ నాయకుల సంగతి అలా వుండనీయ్, అంత మంచి వుద్యోగాని కెందుకు రాజీనామా చేసావ్ ?

"అన్ని చోట్లా వున్న వివక్షేనండీ కారణం. కులపరంగానో,మతపరంగానో,ఆర్దికపరంగానో, ఉద్యోగ స్థాయిని బట్టో  ఆభిజాత్యాన్ని ప్రదర్శించడం బలహీనంగా వుండవాడిని అణగద్రొక్కాలనుకోవడం చూసి భరించలేకపోయాను.ఒకరి క్రింద పనిచేయడం యెందుకు, నాకు నచ్చిన పని నేను చేసుకుంటున్నా, నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు వాళ్లకి రిజర్వేషన్ కేటగిరిలో వచ్చే వుద్యోగం కూడా వద్దు. జర్మనీ కి వెళ్లి  చదువుకోవాలనుకుంటున్నారు" అన్నాడు.

ఆ రాత్రంతా శ్యాం గురించి ఆలోచిస్తూనే వున్నాను. బతక నేర్చినతనంతో  యెక్కడికక్కడ  అవకాశాలు అందిపుచ్చుకునే  సుదర్శన్  కన్నా శ్యాం ఆత్మాభిమానం కలవాడు, చైతన్యం కలవాడుగా అర్ధం చేసుకున్నాను. శ్యాం ని  సామాన్య మానవుడిగా, చేతకాని వాడిగా, పొగరు బోతుగా మాత్రమే అంచనా వేసుకుంటున్నాడు సుదర్శన్. ఇలాంటి సామాన్యుల, సగటు మనుషుల చేతుల్లోనే ప్రభుత్వాలని  మార్చే శక్తి వుందని తెలుసుకోవాలి. మనిషిని వోటర్ గానో లేదా పేడ పిసుక్కునే మనిషిలా  కాకుండా  మనిషిగా గౌరవించాలి. తెల్లవారకుండానే  పాల బాటిల్ల సంచీ పుచ్చుకుని  నేనే శ్యాం యింటివైపుకు దారితీసాను.

(2018 జూలై అరుణ తారలో ప్రచురితమైన కథ)

11, జులై 2018, బుధవారం

ప్రేమా పెళ్ళి రెండూ శిక్షే

continued.. behind her smile...
ప్రేమా పెళ్ళి రెండూ శిక్షే

హృదయం ఒక పద్మ వ్యూహం
ప్రవేశించడమే నీ తొలి వ్యూహం
మనఃఫలకంపై  ఏనాటివో అస్పష్టమైన గీతలు
కాలాన్ని యుగాలుగా కొలవడమెందుకు
నీ  జీవితకాలంతో కొలిస్తే చాలంటావ్ కదా

సంధ్య రంగులని అరువుతెచ్చుకుని
నీ కాలంతో నువ్వెంతగా మమేకమై ప్రవహించావో
అదొక నీటిపై రాత
ఇచ్చేది ఏదైనా హృదయంతో ఇస్తే
అనేక అనుమానాలతో పుచ్చుకోవడం
ఇవ్వాల్సి వస్తే అయిష్టం ఆనవాయితీ అయినప్పుడు
ఒకోసారి రెప్పల దారంతో ముత్యాలను కుట్టుకున్నట్లు
మరొకతూరి సరస్వతి నదిని తలపిస్తూ..

ఖాళీలు పూరింపబడటానికే పదాలను వెతుక్కుంటూ
స్వగతంలో అనుకుంటానిలా
తొలి ప్రేమ లోని పరిమళానివి
గత కాలపు  చిరునామా లో మిగిలిన ద్వేషానివి
వర్తమానానికి వొక జ్ఞాపకానివి
మొత్తానికి  జీవిత కాలానికి వ్రాతకర్తవి.
తగని శిక్షవి మగులకివి తప్పనివి

8, జులై 2018, ఆదివారం

బిహైండ్ హెర్ స్మైల్

ఈ రోజు ప్రజాశక్తి "స్నేహ" సంచికలో ప్రచురితమైన కథ .....


బిహైండ్ హెర్ స్మైల్


ఆమె అందంగా ఉంది మేకప్ లేకపోయినా. ఒకరిద్దరు తప్ప ఆమెని గుర్తు పట్టే అవకాశమే లేదు. మూతిని సున్నాలా చుట్టి గ్లాస్ డోర్ మీద  వేలితో సున్నాలు చుడుతూ లైట్ల వెలుతురులో మెరిసిపోతున్న నగరాన్ని చూస్తూ ఆలోచిస్తుంది. ఆమె ప్రక్కకి వచ్చి చిన్నగా నవ్వాడతను

"హలో "అంటూ పలకరించాడు. బదులు పలకలేదామె. చిరాకు కనబడనీయకుండా మేనేజ్ చేయాలనుకున్నా నొసలు ముడుచుకున్నాయి.

" కాస్త నవ్వొచ్చు కదా, ఆ ఫీల్ తప్ప మిగతావేవి మీ ముఖానికి అంత సూటవ్వవ్". 

ఆమె ముందుకి నడిచింది, అతనూ వెంటపడ్డాడు.

"మీలా నవ్వడం మరిచిపోయినవారిని కనీసం ఓ ఇరవై మందిని నవ్వించాలని జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాను. తప్పంటారా " 

ఆమె  నవ్వింది. "ఆర్ట్ వేయడం మానేసి యిది యెప్పటి నుండి "

అతనూ నవ్వి " చూసారా నా మనసులో మాట చెప్పగానే నవ్వేసారు. కష్టాలు, కన్నీళ్లు, కోపతాపాలు, విషాదాలు అందరి జీవితంలో వుండేవే. కానీ యెప్పుడూ వుండాల్సింది ఓ చిన్న చిరునవ్వు, దానితో ప్రపంచాన్ని జయించవచ్చని తెలియకపోవడమే ఓ పెద్ద విషాదం. "

ఆమె ఇంకా నవ్వింది 

"గుడ్ ..యిలాగే నవ్వుతూ వుండండి"

******************

"నిన్ను లోకానికి సరికొత్త అందాలతో, నవరస భావాలొలికిస్తున్న చిత్రాలతో  పరిచయం చేస్తాను.  ఇప్పటివరకూ యెవరికీ  కనబడని నటిని పరిచయం చేస్తాను. అవకాశాలు లేక ఖాళీగా  వున్నట్టు వున్నావ్ కదా "

 "తొంబై   సినిమాల్లో నటించాక కూడా  యింకా  యెదురు చూపులెందుకు, వాస్తవాన్ని అర్ధం చేసుకుని ఆనందంగా బ్రతకాలి కానీ "

"ఖాళీగా వుండి మాత్రం యే౦ చేస్తావ్, కనీసం తల్లి పాత్రలైనా చేయొచ్చు కదా " 

" ఆ అవకాశాలెందుకు లేవు,  చాలా వున్నాయి, ఆ రోల్స్ చేస్తూ కూడా   అమ్మాయిగా వాళ్లకి లోబడి వుండనందుకే  యీ  ఖాళీలు "

"అసలు నువ్వు ఖాళీగా వుందెప్పుడూ, ఎప్పుడూ యెవరితో వొకరితో యె౦గేజ్ లోనే వుంటావుగా "

ఆమె నవ్వింది

"ఎన్ని పెళ్ళిళ్ళు ,  యెన్ని పెళ్లిదాకా వెళ్ళనీయని డేటింగ్స్"

"నా నిస్సహాయతని యె౦దుకు గేలి చేస్తావ్ కానీ,  మీ మగవాళ్ళ కళ్ళలో కురిపించే ప్రేమకి  దాసోహం  అని అనుకోవచ్చుగా "

" అదర్ధం అవుతుందిలే,ఇంతకీ నేను అడిగినదానికి సమాధానం చెప్పలేదు." 

"రెండు పెళ్ళిళ్ళు, ఒకటి  మ్యూచువల్  అండర్ స్టాండింగ్ తో డివోర్స్ .  మరో కొన్ని బ్రేకప్ లు తర్వాత రెండో పెళ్ళి నాకంత యిష్టం లేకపోయినా చేసుకోవాల్సివచ్చింది" 

"ఎందుకలా "  

"నన్ను నన్నుగా ప్రేమించానన్నాడు. నన్నెప్పుడూ ప్రశ్నించనని చెప్పాడు . సరేనని పెళ్లాడాను. ఏడాదిలోపే గాల్లో  వేలాడాడు  వెళ్లాడదీసిన మాటలకి మల్లే  "

"తర్వాత"

"తర్వాతేముంది,మళ్ళీ పాత జీవితమే "

"ఇన్ని పెళ్ళిళ్ళు, బ్రేకప్ లు, సమాజం దృష్టిలో   స్త్రీగా పాతాళానికి దిగజారిన మనిషివి నువ్వు "

తెరలు తెరలుగా   ఆమె నవ్వు.  ఆ నవ్వుల మధ్యలోనే "నా నటనకే  కాదు నాకు దిగజారుడు తనం లేదు, వాళ్లంతట వాళ్లే వచ్చి వాళ్లే వెళ్లిపోతుంటే వాళ్లని బందీలుగా చేసుకునే జాణతనం నాకబ్బలేదు "

"ఇక యిప్పుడేం చేస్తావ్, ఎవరో వొకరు పాతవాళ్ళతోనే  సరిపెట్టుకుంటావా, మళ్ళీ అందం యెర వేస్తావా" 

"ఎవరో వొకరు తీగని  మీటితే రాగం పలకనంటుదా,  ఎవరో వొకరు, ఖాళీ లోంచి  హృదయానికి నేరుగా  దారేసుకుని వచ్చామంటారు. అది నువ్వే కావచ్చేమో "

" ఛీ .. నిన్ను చూస్తుంటేనే అసహ్యం నాకు , ఏదో మోడల్ కి కావాల్సి కానీ , అసలు నిన్ను మోడల్ గా పెట్టుకున్నానని  నా భార్యకి తెలిస్తేనే విడాకులు యిచ్చేయగలదు". 

"ఆహా అలాగా, అంటుకోలేదన్న మాటే కానీ కళ్ళతో తాగేస్తున్న సంగతి నాకు తెలియదనుకోకు."  

"నా సంగతి సరే, ఆ హీరో వెంట పడతావెందుకు, అతని భార్య చేత  చెంపదెబ్బలు తిన్నాక కూడా "

"ప్రేమ,పెళ్ళి రెండూ శిక్షే మనిషికి. శిక్ష లేకుండా జీవితం వుండదుగా "

*************************

"నీకేమన్నా పిచ్చా, ఎందుకలా నవ్వుతావ్" అన్నాడు విసుగ్గా .

"మరేం చేయను, నాకేడుపు రావడం లేదు" 

"చచ్చిపోయిన నీ  రెండో మొగుడిని తడుచుకుని ఏడువు". 

"ఊహూ ..నాకు రావడం లేదు"  

"పోనీ, నీ ప్రియుడు యాక్సిడెంట్ అయి చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న సమయాన్ని గుర్తుకు తెచ్చుకుని ఏడ్వు" 

"ఊహూ .. నావల్ల కాదు. అలాంటి సమయాన్ని యెప్పటికీ గుర్తుకు తెచ్చుకోలేను వాటిని  యెప్పుడో తుడిచేసాను" 

"పోనీ కోపంలో కూడా కోపంతో కూడా యేడ్వాలి..ట్రై చెయ్యి "

"అనాధగా  బ్రతికిన తన తల్లిని గుర్తుకుతెచ్చుకుని కన్నీరవుతూ  ఆరో ప్రియురాలితో యిప్పటికి   విలాసంగా బ్రతుకుతున్న  తండ్రిని తల్చుకునికోపంతో మండి పడింది."

"ఎక్స్ లెంట్ .. నాకు కావాల్సింది బాగా దొరికింది. అయినా నిన్ను యేడుపు సీన్ లో చూడటం చాలా కష్టం "

ఆమె నవ్వింది యెప్పటిలాగానే.

***************************

"ఇంతజరిగాక కూడా అంత ఆరాధన పనికి రాదు,అదీ పెళ్ళైన వాడిపై, నీ శ్రేయాభిలాషిగా చెపుతున్నా, అతనితో తిరగడం మానేయ్ "

"మరి నువ్వు పెళ్ళైన వాడివేగా"

"అతను వేరు నేను వేరు. నిన్ను కాలు కందనీయకుండా  బయటపెట్టనీయకుండా చూసుకునే భాద్యత నాది.  ఒప్పుకో"

"నన్ను బంధించడమంటే గాలిని బంధించినట్లే అని నీకు మాత్రం తెలియదూ" ..

"యూ .... అరవై ఆరు కూరలు రుచి చూసేదానికి రోజూ ఒకే కూర యెలా నచ్చుతుంది."

ఆమె పడీ పడీ నవ్వింది. కళ్ళల్లో నీళ్ళతో నవ్వింది. అతను ఆ భావనల్ని నిశ్శబ్దంగా చిత్రీకరించాడు. అరగంట తర్వాత చున్నీ ఆమె ఎదపై కప్పి  "సారీ ..కన్నీళ్ళతో నవ్వితే  యెలా వుంటావో చూడాలని ఆ ముఖాన్ని చిత్రించాలని అలా మాట్లాడాను . ఇక వెళ్ళొచ్చు."

"ఇక నాతో పని పూర్తై నట్టే కదా, రెమ్యూనరేషన్ పంపటం మర్చిపోకు  "

*****************************

"అవకాశాలు బాగా వస్తున్నాయిగా ..చూసావా నా ఆర్ట్ గొప్పదనం "

"కాదంటే నువ్వు బాధపడతావ్ కాబట్టి అలాగే అనుకో "

" నన్ను బాధ పెట్టకూదదనుకుంటే  నువ్వు ఇంకోదానికి  వొప్పుకోవాలి "

"........."

ఇండస్ట్రీ అంతా అనుకుంటుంది. ఆర్ట్ వేసేటప్పుడు  నువ్వు బోల్డ్ గా సహకరించావని, నేను లోలోతులు సృశించానని "

".............."

"ఏమిటీ  సైలెంట్ అయ్యావు,  రేపు రాత్రికి  నేనే వస్తాను మీ ఇంటికి"

"అదే ఎందుకంటున్నా "

" నువ్విచ్చే పార్టీ కి, ఇంకెవరైనా వస్తున్నారా, యేమిటీ "  

"అవును , ఏ కళ్ళైతే నా మనసుని స్వచ్చంగా  తాకాయో ఆ కళ్ళని నేనెప్పుడూ మర్చిపోలేను,ఏ చూపుల వెచ్చదనమైతే నను తాకిందో అప్పుడే నేను మంచులా కరిగిపోతాను.అది మాత్రమే  సత్యం. మిగతాదంతా అబద్దం"




"భ్రమలో బ్రతుకుతున్నావ్, లోకమంతా నిన్ను అతని ఉంపుడుగత్తెవి అనుకుంటుంది "


"లోకంతో నాకెందుకు, నా బ్రతుకు,నా యిష్టం "


"అతని కోసమే మొగుడిని వదిలేసావని, రెండో మొగుడిని నువ్వే చంపేసావని అనుకుంటున్నారు "


"మాటాడుకోవడానికి యేదో వొకటి కావాలి, వాళ్ళ సమయాలని అలా సద్వినియోగం కానీయండి "


"అంతే  కానీ అతనిని వొదలనంటావ్, అది అబద్దం అని కూడా అననంటావ్" .


"పోనీ అది  అబద్దమే  అని నువ్వే అనుకోవచ్చు కదా !"


" వుహూ ఆ అబద్దంలో బ్రతికి చూడాలని నాకు వుత్సాహంగా వుంది కాబట్టి ".


"అబద్దంలో బ్రతికే  మీ సోకాల్డ్  ప్రపంచాన్ని నిజం చేయాలనే ప్రయత్నం యెందుకు గాని, ఆ ప్రయత్నం విరమించుకో "


"కో స్టార్ తోనే కాదు, కొడుకు వరుసతో నటించిన వాళ్ళతోనూ ఎఫ్ఫైర్ నడుపుతున్నావని లోకం కోడై కూస్తుంది.మరి దానికేమంటావ్"


"కడుపాకలి వొకటే కాదని లోకానికి తెలిస్తేనూ, మనిషికి విచక్షణ కూడా వుంటుందని తెలిస్తేనూ బాగుంటుంది"


"పెద్ద ప్రతివతా శిరోమణి బయలుదేరింది లోకానికి నీతులు చెప్పడానికి "


"ఇంటికెళ్ళి నువ్వు చేసే పని అదేగా "


"యూ .. .. " మళ్ళీ తిట్టాడు.


ఆమె  బిగ్గరగా నవ్వి "థాంక్స్ అలోట్, నన్ను  యెల్లప్పుడూ నవ్విస్తాననే మాట నిలబెట్టుకున్నావ్, నిన్ను గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటూ వుంటానెప్పుడూ "   అంటూ  నవ్వింది యింకా   తెరలు తెరలుగా .. మనుషులు  పొరలు పొరలుగా  మరింత అర్ధమవుతుండగా .


అతని  యింటి యెదురుగా బీచ్ వొడ్డున పెద్ద పెద్ద కటౌట్ లు నవరసాలు వొలికిస్తూ.  ఆగి చూస్తున్న జనం, స్పీడ్ గా వెళ్ళే కార్లు కూడా  స్లో అయి ఆరాధనగా  మరీ చూస్తూ..


కిటికీ దగ్గర నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ కసిగా పెదవి కొరుక్కుంటూ " యూ బిచ్ " అని తిట్టుకుంటూ   


స్వేచ్ఛగా, స్వచ్చంగా, హాయిగా నవ్వుతున్న ఆమె చిత్రం క్రింద అతను వ్రాసిన కోట్ పైనే చూపు ఆగింది.


behind her smile,

there is a story you would never understand.