27, సెప్టెంబర్ 2022, మంగళవారం

నూనె కుండ

 మెయిన్ రోడ్ ని ఆనుకుని  వున్న సినిమా హాలు. దాని ప్రక్కనే ఓ పెట్రోల్ బంక్. ఆ రెండింటి ప్రక్కన  నాపరాళ్ళు, చలువ రాళ్ళు పేర్చిన అడితీ. ఆ అడితీ  యెదురుగా రోడ్డుకి అవతలి వైపున యెత్తుగా గుబురుగా పెరిగిన చెట్లు. ఆ చెట్లు బాటసారులకి యెండా వాన నుండి రక్షణ యివ్వడమే కాకుండా  ఆ రోజు  కుల పెద్దల పంచాయితీ కి వచ్చినవారికి నీడనిచ్చాయి.


భర్త వైపు నుండి నాలుగు ఆటోల జనం దిగారు. భార్య వైపు నుండి పట్టుమని నలుగురు  కూడా లేరు. అయితేనేం ? నలబై మంది మనుషుల లెక్కన ఒకే ఒక స్త్రీ స్వరం  సివంగిలా  విరుచుకుపడుతూ తన వాదన వినిపిస్తూ వుంది. కుల పెద్దలు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ వున్నారు. అప్పటికే తీర్పు జరిగి పోయింది. మెల్లగా కొందరు లేచి కల్లు  పాకల వైపు, దగ్గరలో వున్న బార్ & రెస్టారెంట్ ల వైపు దారి పట్టారు.


మిగిలిన కొంతమంది ఆడవాళ్ళు  " ఇది చేసిన తప్పు యెనక పెట్టుకుని నోరేసుకుని చెలుగుతుంది. ఆడదానికి యింత  కావరం పనికి రాదు. అయినా యిదొక్కతే యీ నూనె కుండ ప్రెమాణంకి తయారైందా  యే౦టీ ? ఎన్ని చూళ్ళా మనం " అంటూ దుమ్మెత్తి పోస్తుండగా ..


వారికి యెదురుగా  పెద్ద కారు ఆగింది. అందులో నుండి కెమారాలు పెట్టుకుని యిద్దరు దిగారు . ఇంకొకతను చేతిలో మైక్ పట్టుకుని  కెమరా ఆన్ అన్నట్టు కెమెరా మెన్ వంక చూస్తూ, వీళ్ళ దగ్గరికి వచ్చి…


 " ఏమండీ ! యిక్కడేదో కుల పంచాయితీ జరుగుతుందని  తెలిసింది . అసలు అలా పంచాయితీలు చేయవచ్చా,  యిక్కడున్న అందరికి తెలియదా? ఏమైనా గొడవలు వుంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలని అనుకోకుండా యింకా యిలా పంచాయితీలు పెడుతున్నారు. ఇది తప్పని మీకు తెలియదా” అంటూ   ఆతను  అలా అడగగానే అదేదొ టీవిలో మనం కనబడతాము అనుకుని కొందరు ఉత్సాహంగా ముందుకు వచ్చి చెప్పబోతుండగా,  యింకొకరు వచ్చి గబా గబా వాళ్ళని వెనక్కి నెట్టి.


 "ఇక్కడ ఆట్టాంటివి  యేమి జరగటం లేదండి, యేదో మొగుడు పెళ్ళాం తగువులు పెట్టుకుంటే సర్ది చెపుతున్నాం " అని ఒకరికొకరు సైగ చేసుకుని అక్కడ నుండి జారుకున్నారు .


ఇక అక్కడ అప్పటిదాకా సివంగిలా తిరగబడ్డ "రమణ "  అక్కడే నిలబడి వుంది.  ఆమె ప్రక్కనే వున్న తల్లి, అమ్మమ్మ,చెల్లి కూడా మీడియా వాళ్ళని చూసి వేగంగా వచ్చే వాహనాలని తప్పించుకుంటూ రోడ్డు దాటి అడితీలోకి వెళ్ళిపోయారు. రమణ వొంటి పై చీర కూడా లేదు "ఇది ఆడు కొనిచ్చిన చీర, ఈ చీర కూడా నాకొద్దు.  వాడే వద్దనుకుంటే వాడు  కొన్న చీర నా వొంటిపై  యె౦దుకు? అంటూ చీరిప్పి మొగుడి మొహాన కొట్టింది. వెంటనే ఆమె తాత తన భుజం పై వున్న తువ్వాలుని వేసి ఆమెని నలుగురి దృష్టిలో పడకుండా చేసి ఆడ  దాక పోయొస్తా!  అంటూ కుల పెద్దలతో కలిసి కల్లు దుకాణానికి పోయాడు.


చానల్ వారికి అర్ధమైంది. తమకి కావాల్సిన విషయాన్ని  వాళ్ళెవరూ చెప్పరని. ఆఖరిసారి ప్రయత్నించి చూద్దాం అనుకుని ఆశతో వారు కూడా రోడ్డు దాటి  ఇవతలి వైపుకి వచ్చారు.  తర్వాత "రమణ" కూడా రోడ్డు దాటి  అడితీలోకి వెళ్లింది.


నేను అక్కడి నుండి కదలబోతుండగా మీడియా విలేఖరి నన్ను అడిగాడు "ఇక్కడ యే౦  జరుగుతుంది ? అసలు యిప్పటి వరకు యే౦   జరిగింది?మీరు చూస్తూనే వున్నారు కదా ! చెప్పండి” అన్నాడు .


నేను చిన్నగా నవ్వి వాళ్ళతో చెప్పాను " స్పెషల్  కథనం కాదగ్గ విషయం కొద్దిసేపటి క్రిందే జరిగిపోయింది. ఇక యిప్పుడేమి లేదిక్కడ”.


అదేమిటో  కొంచెం వివరిస్తారా ? జిడ్డు ప్రశ్న. 

వదిలేటట్టు లేరు వీళ్లు అనుకుంటూ  "నిజంగా యిలాంటి కథనాన్ని మీరు నిత్యం ప్రసారం   చేసేంత ముఖ్యమైనదే ! ఇప్పటికిప్పుడు నేను రెండు ముక్కల్లో చెప్పే విషయం కాదిది.  మీరు యీ ప్రత్యక్ష ప్రసారం కాస్త ఆపేసి ఓ  గంట సేపు  కూర్చోగల్గితే వివరంగా చెపుతాను " అన్నాను .


సరే,  యిప్పుడే చెప్పడానికి మీకు అభ్యంతరం లేదుగా ? అడిగాడు. నేను కొంచెం అసహనంగా ముఖం పెట్టి వారి కెమెరాలవైపు చూసాను .


ఆతను నా అసహనాన్ని గమనించి కెమెరా వారిని  వెళ్ళిపొమ్మని చెప్పాడు.


వాళ్ళు వెళ్ళిన తర్వాత “ఇప్పుడు మీకు యెలాంటి యిబ్బంది లేదు, వ్యక్తిగతంగా  యిక్కడ యే౦  జరిగిందో తెలుసుకోవాలని వుంది చెప్పండి ప్లీజ్ !” అడిగాడతను .


“నూనె కుండలో చేయి పెట్టడం అనేది  మీరెప్పుడైనా  విన్నారా ?’ అడిగాను.


"ఎస్,ఎస్  విన్నానండీ ! అబద్దం చెపుతున్నారనే అనుమానం వుంటే   మరగ కాగుతున్న నూనె కుండలో చేయి పెట్టి తీయాలి నిజం చెపితే చేయి కాలదు లేకపోతే  కాలుతుంది, అలాంటిదే కదా " అడిగాడు ఆసక్తిగా, వుత్సాహంగా  చూస్తూ.


అలాంటి నిరూపణే  చెయ్యాలనే  "కుల పంచాయితీ" జరిగింది యిక్కడ  .


మై గాడ్ ! యిప్పుడు  కూడానా ?  అసలు మనమెంత  అనాగరిక కాలంలో బ్రతుకుతున్నాం,  అలా నూనె కుండలో చేయి పెట్టడం  జరిగిందా ? మీరు అదంతా చూస్తూనే నిలుచున్నారు . ఒక బాధ్యత గల పౌరురాలిగా మీకు బాధ్యత వుంది కదా ! పోలీస్ కి ఫోన్ చేసి నోటీస్  చెయ్యవచ్చు కదా ! అన్నాడు .


"మీరు కూడా నేను ఫోన్ చేస్తేనే వచ్చారు"  నా సమాధానం.


నూనె కుండ పంచాయితీ యె౦దుకు జరిగింది?  అతని ప్రశ్న .


నా మొహం వివర్ణమయింది ." ఇది  యుగ యుగాల తరతరాలగా జరుగుతున్న పరీక్ష . ఆడదానికి శీల పరీక్ష "  మొగుడు అనుమానపడితే నిరూపించుకోవాలి,  తప్పదు అని చెప్పిన   కుల పురుష పంచాయితీ   తీర్పు చెప్పిన కథ”  అసహ్యంగా, ఆవేదనగా చెప్పాను. 


“అసలు నూనె కుండ యెలా  పెడతారో.. ఐ మీన్  ఆ ఆచారం యెలా  వచ్చిందో, యిప్పుడు యెలా ఆచరించాలని తీర్పు చెపుతారో  మీకు తెలుసా !" అడిగాడతను.


చూడండి అంటూ అతని పేరు తెలియక అర్ధోక్తిలో ఆగిపోయాను."రమేష్” అండీ..అని తనను పరిచయం చేసుకున్నాడు. 


“చూడండి రమేష్, ఈ ఆచారం నేను వినడమే కాని యెప్పుడు చూడలేదు. ఈ విషయం గురించి చెప్పడానికి ఒకామె ని పిలుస్తాను ఆమె మీకు అన్నీ వివరంగా  చెపుతుంది” అంటూ .. అడితీ ముందుకు వెళ్ళి


“సుబ్బమ్మా ఓ సుబ్బమ్మా! ఓ మారు యిట్టా రా ! అని పిలిచాను.


సుబ్బమ్మ అడితీ దుకాణంలో నుండి బయటకి వచ్చింది. “ఏమ్మా ! దొరసాని యే౦ పని బడింది, యిప్పుడు పిలుస్తా వుండావు . మా ఇంట్లో రచ్చ రచ్చగా వుంది మూడు రోజుల నుండి తిండి తిప్పలు లేవు. ఆ పిల్ల కాపరం అట్టా అయిందని నా కూతురు యేడస్తా వుంది. తీర్పు అయిపోయిందిగా, ఉడుకునీల్లు కాసి దానికి కాస్త తలారా స్నానం చేయించాల.” అంది.


“అయన్నీ నీ చిన్న మనవరాలు చూసుద్దిగాని, టీవీ లలో పనిజేసే ఈయన నూనె కుండ సంగతి యివరం చెప్పమని అడగతా వుండాడు . నువ్వు చెపుతా వుంటావ్ కదా ! అదేందో యిప్పుడు చెప్పు” అన్నాను


“ఏయ్యా! ఆయన్నీ పేపర్లో రాస్తావా? టీవిలో చెపుతావా? చెపితే చెప్పావుగాని ,మా పేర్లు రాయబాకయ్యా , ఇట్టాంటివి  వుండాయని లోకానికి తెలియాల, ఆడకూతుళ్ళు యెన్నెన్ని బాధలు పడతన్నారో.. చెప్పుకోవాల , మా గోడు యినేదేవరాయ్యా.. మా కన్నోల్లే మొగుడి యెదాన వేసి యెనక్కి తిరిగి చూడరయ్యే! మేము మొగుడి జాలి ధర్మాన బతికితే బతికినట్టు,చస్తే చచ్చినట్టు” అంటూ వెతలు చిట్టా యిప్పింది .


నేను మౌన౦గా వింటున్నాను “ వీరి కథలు యెన్ని కావ్యాలతో సరితూగ గల్చమా,  ఎన్ని కాన్వాస్ లలో చిత్రించగలమా అని”


"నూనె కుండ సంగతి చెప్పు " తొందర పెట్టాడు రమేష్.


"ఆ మాట తలచుకుంటే.. వొళ్ళంతా భగ భగ మండిపోతా వుంటాది .. ఎల్లమ్మ తల్లి దయ వుండబట్టి నేనింకా బతికి వుండాను కాని లేకపోతే దినంబు నూనె కుండ సాచ్చెం చెప్పమని అడిగేవాడు నా మొగుడు"  అంది.


రమేష్ ఆలస్యం భరించలేనట్టు నా వైపు చూసాడు


“అదే ఆ విషయమే చెప్పు” అన్నాను సుబ్బమ్మ నుద్దేశించి.


మా ఆయన నాకు మేన మావ అవుతాడు. రెండు మనువులు చేసుకుని ఐదుగురు బిడ్డలని పెట్టుకుని  నన్ను మూడో మనువాడాడు.  మా అమ్మ తమ్ముడు కిచ్చిచేస్తే కళ్ళ ముందు పడి  ఉంటానని, మా నాయనేమో  అర్ధ నూట పదహార్ల  వోలికి ఆశపడి   యేబయ్యేళ్ళాడికిచ్చి పెళ్ళి చేసారు . అప్పుడు నా వయసు పదమూడేళ్ళు.  మా ఆయన సాముగరిడీలు ఆడేవాడు . హరికథలు చెప్పేవాడు . ఎప్పుడు వూర్లెంబడి తిరగతా  వుండేవాడు. నేను మున్నేరు చుట్టుపక్కల  మేక పిల్లలని కాసుకుంటూ వుండేదాన్ని. నా మొగుడొకసారి వూళ్ళకి బోయి రెండు నెలలకి  యింటికి వచ్చాడు . ఆయనొచ్చేటప్పటికి  నేను యేవిళ్ళు  పడతా వున్నాను . ఆయనలో అనుమానం మొదలైంది. నేను లేకుండా నీకు కడుపు యెట్టా అయిందే ! నాకు యీ పెళ్ళాం వద్దు అని  పంచాయితీ పెట్టి తప్పు కట్టి నన్ను తీసుకుపొమ్మని మా వాళ్లకు కబురంపాడు .


రోజూ రభసే! పద్నాలుగేళ్ళ దాన్ని యేడవడం కూడా చేతయింది కాదు. కులపంచాయితీ పెట్టారు. నేను నా మొగుడుని  తప్ప పరాయివాడిని యెరగనని వొట్టు పెట్టాను  పంచాయితీలో అందరూ మగొళ్ళే కదా! ఒక్కరు కూడా కనికరం చూపించాలా, ఆడు చెపుతున్నాడు కదా! ఇల్లు మొగం చూసి రెండు నెలలయ్యిందని. నువ్వు యెవడినో వుంచుకున్నావ్  తప్పు కట్టు. లేదా నూనె కుండలో చేయి పెట్టి తప్పు చేయలేదని నిరూపించుకో అన్నారు. 


“మేము తప్పు కట్టలేం నూనె కుండలో చెయ్యి పెట్టి నువ్వు నిరూపించుకో అని మా  అమ్మ అయ్య అన్నారు.   తప్పు చేయనప్పుడు నాకెందుకు భయం ? నూనె కుండలో చెయ్యి పెట్టడానికే వొప్పుకొన్నాను .


పంచాయితీ పెద్దలు, ఇరుగు పొరుగు, చుట్టాలు అందరూ బయలేల్లి యెడ్ల బండ్లలో  అడవిలో వున్న  "ఎల్లమ్మ " తల్లి గుడికెల్లాం . ఆ రాత్రి నన్ను వుపాసం వుండమన్నారు . వచ్చినోల్లంతా కోళ్ళు కోసుకుని వండుకుని తిన్నారు . ఖర్చు అంతా  మా ఆయనే భరించాలి. తెల్లారుఝామునే నూటొక్క బిందె నీళ్ళతో నా చేత తలారా స్నానం చేయించారు . బిందె మార్చి బిందె నీళ్ళు  గుమ్మరిస్తా వుంటె వూపిరి తిరగలా. గుప్ప తిప్పుకోనీయకుండా నూటెనిమిది బిందెల నీళ్ళు గుమ్మరించారు . పసుపులో ముంచిన తెల్లని గుడ్డలు కట్టించారు. ఎల్లమ్మ తల్లి గుడి కెదురూగా  మూడు రాళ్ళ పొయ్యి పెట్టి ఆ పొయ్యిలోకేయడానికి  నూటొక్క పిడకలు తయారుగా వుంచారు . ఒక పాత కుండ నిండా రెండు మానికల నూనె పోశారు. మా ఆడాల్లలోని పెద్ద ముత్తైదువని  పిలిచి యెల్లమ్మ తల్లికి దణ్ణం పెట్టుకుని పొయ్యి ముట్టించి నూనె కుండ పెట్టమని చెప్పారు. అట్టా  చేసాక నన్ను  యెల్లమ్మ తల్లి గుడి చుట్టూతా ప్రదక్షిణాలు  చేయమన్నారు .


నేను ప్రదక్షిణాలు చేస్తా వున్నాను. నూనె మరుగుతా వుంది. నా గుండెల్లో దడ  మొదలయింది . కూర తిరగమాత యేసేటప్పుడు  చుక్క నూనె పడితేనే కాలిపోయి మంట పుట్టుద్దే,అట్టాంటిది నిండు కుండ నూనెలో నేను చేయి పెట్టి ప్రమాణం చేసేదాకా చెయ్యి తీయకుండా వుంటే చెయ్యి కాలదా !? అమ్మా,  యెల్లమ్మ తల్లీ ! యే౦టమ్మా, ఈ అగ్గి పరీక్ష ? నేను నా మొగుడ్ని తప్ప యెవరిని యెరగనే ! అందుకే గద ఈ పరీక్షకి అంత నమ్మకంగా వొప్పుకున్నా.నా నిజాయితీ యేమిటో  నిరూపించు తల్లీ! అని మొక్కుకుంటూ  గుడి చుట్టూ తిరగతా  వుండాను, నా కాళ్ళు తేలిపోతన్నాయి. నేను అడుగడుక్కి  పడిపోబోయి నిలదొక్కుకుంటూ తిరగతా  వుండాను.


అప్పుడే ఒక యిచిత్రం జరిగింది. ఎల్లమ్మ తల్లి వుందని నిరూపించింది ..   సత్తె ప్రమాణం జరిగింది.


 అప్పటికప్పుడే దట్టంగా మబ్బులు కమ్ముకొచ్చాయి. గాలి వాన మొదలయింది. నూనె కుండ కింద పొయ్యి ఆరి పోయింది ..  పంచాయితీకి వచ్చినాల్లందరూ చెట్ల కిందకి పోయారు.  నేను వానలో తడుస్తూనే గుడి చుట్టూ తిరుగుతానే వుండాను. కాసేపటికి యేమైందో తెలియదు,నేను కళ్ళు తిరిగి పడిపోయాను.


కళ్ళు తెరిచి చూసేసరికి  మబ్బులు ఎట్టా పోయ్యాయో! కళ్ళల్లో చురుక్కుమని సూరీడు గుచ్చుతున్నాడు. నీరసంగా కళ్ళు తెరిచాను.


మా అమ్మ చెప్తా వుంది.  నూనె కుండ పంచాయితీ తప్పి పోయిందంట " ఎల్లమ్మ తల్లి సత్తెం కలది అందుకే నూనె  కుండ క్రింద పొయ్యి కూడా చిత్రంగా ఆరిపోయింది. ఇక నూనె కుండలో చెయ్యి పెట్టె పనే లేదు .. నీ పెళ్ళాం యే  తప్పు చేయలేదని  ఋజువైనట్టే,  పంచాయితీ అయిపోయింది అన్నాలు వొండుకుని తిని  యిక యిళ్ళకి బోవటమే!  " అని పంచాయితీ చెప్పారని సంతోషంగా చెప్పింది .


అట్టా… నేను నూనె కుండలో చెయ్యి పెట్టకుండా తల్లి కాపాడిందని  నేను యే  తప్పు చేయలేదని చెపుతా వుంటారు.  నేను ఆ ముక్కే నోరు చించుకుని చెప్పినా యినలేదు, యేడ్చి చెప్పినా యినలేదు. నూనె కుండలో చెయ్యి పెట్టాల్సిందే అన్నారు . ఆ తర్వాతయినా మా ఆయనలో అనుమానం జబ్బు పోలేదు. తర్వాత ఆ వూరిడిచి వచ్చేసాము. ఈ బెజవాడ చుట్టుపక్కల బతుకుతున్నాం, ఇంటోనుండి కాలు బయటకి పెడితే చాలు "ఎవడ్ని ఉంచుకున్నావే ... "(అభ్యంతర పదం) తో .. తిడతా వుంటాడు. ముగ్గురి బిడ్డలని కన్నా. ఏళ్ళతరబడి అన్నం తిన్నట్టు తిట్లు తింటానే వుండాను. శుభ్రంగా గుడ్డ కట్టుకోనీయడు,పూలు బెట్టనీయడు, నలుగురితో మాట్టాడనీయడు. కాలు చెయ్యి ఆడక పదేళ్ళు అయ్యింది. ఏ పని చేయకుండా తిరుగుతున్నా  పాచి పని చేసి పసి బిడ్డని సాకుతున్నట్టు సాకుతున్నా. ఇప్పుడూ  తిడతానే వుంటాడు. ఆ తిట్లు తిని తిని యిట్టా అయిపోయా అంటూ చెప్పింది. 


సన్నగా కట్టేబారిపోయి ఉన్న ఆమెని చూస్తూ జాలిపడ్డాడు రమేష్.


“నీకెన్నేళ్ళు అవ్వా” అడిగాడు 


“అరవయ్యి వుంటాయయ్యా.  ఈ కళ్ళతో యెన్నో చూసా, చెప్పుకుంటే బోలెడు కథలు” అంది


 “అది సరే ఆ తర్వాత నీకు తెలిసీ యెవరన్నా యిట్లాంటి పరీక్షలో నూనె కుండలో చేయి పెట్టారా ?” రమేష్  గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు సుబ్బమ్మని.


“మా కులంలో మొగుడు అనుమానిత్తే అట్టా నూనె కుండలో చేయి పెట్టి నిరూపించుకోవాల్సినదేనయ్యా. ఇద్దరు ముగ్గురు కాలి నయం గాక చచ్చిపోయారు . కొంత మందేమో చేయి పెట్టడానికి భయపడి తప్పు చేయకపోయినా చేసామని వొప్పుకుని డబ్బు కట్టి మొగుడ్ని వదిలేసుకుని యెల్లిపోతారు మొగుడు నిందేస్తే ఆడదాని జీయితం అయిపోయినట్టేనయ్యా! అందుకే మాలో ఆడైనా, మగైనా  మారు మనువులు జాస్తి.  అని చెప్పి  అక్కడినుండి కదిలింది.


“దొరసాని,  నేను పోయోస్తా, రేపు  కనబడతానమ్మా  కాసిని డబ్బులు అప్పు యియ్యాలి నువ్వు” అంటూ అడితీలోకి వెళ్ళిపోయింది


నేను ఆలోచిస్తూ వున్నా.. ఆ రోజు గాలి వానా రాకుండా వుండి వుంటె... ఆ  కుండలో  మరుగుతున్న నూనె లో  సుబ్బమ్మ చేత చేయి పెట్టించి ప్రమాణం చేయించి వుండేవారు . కచ్చితంగా చేయి కాలి చర్మం కూడా వుడికి పోయి వుండేది.  ఊహించు కుంటేనే వొళ్ళు జలదరిస్తుంది . శీల౦ పరీక్ష పేరిట అమాయుకులైన ఆడవాళ్ళని యిలా హింసించే ఆచారాల్ని కూకటి వేళ్ళతో పెకిలించి వేయాలి  ఆవేశంగా అనుకుని ..


 రెండు  తరాల తర్వాత కూడా .. సుబ్బమ్మ మనుమరాలు "రమణ" కి మళ్ళీ నూనె కుండ పరీక్ష పెట్టమని పంచాయితీ చెప్పిన కుల పెద్దల తీర్పు తో .. వాళ్ళ జీవనంలో యెలాంటి మార్పు రాలేదని  అర్ధమవుతుంది కదా రమేష్ గారు .... అడిగాను


అవునండీ! ఇంతకీ ఈ సుబ్బమ్మ మనుమరాలికి యీ పరీక్ష పెట్టమన్నారా  యేమిటీ అడిగాడు.


అవునని తలూపాను .


మైగాడ్ !  అలా జరిగిందా ?  అడిగాడు అతను ఆశ్చర్యంగా ..


“అలా జరగడానికి "రమణ " యేమన్నా  సుబ్బమ్మ లాంటి మామూలు ఆడమనిషి కాదు  ఆభిజాత్యం యెక్కువ. నేను చెప్పడం కాదు కాని మీరు రెండు మూడు రోజుల తర్వాత తీరిక చేసుకుని వస్తే  స్వయంగా ఆమె నోట వెంబడే ఆమె కథ చెప్పిస్తాను”అన్నాను


మళ్ళీ .. సస్పెన్స్ లో పెట్టారా మేడమ్ అన్నాడతను నవ్వుతూ ....


కొన్ని కథలు మనం చెప్పుకోవడం కన్నా వారి కథ వారి నోటి వెంట వచ్చినప్పుడు వింటేనే బావుంటుంది అన్నాను.  రమేష్ నా ఫోన్ నంబర్ తీసుకుని  రెండు రోజులలో వీలుని బట్టి కలుస్తానని చెప్పి నా   వద్ద సెలవు పుచ్చుకుని . వెళ్ళిపోయాడు



సరే.ఫ్రెండ్స్... నా కథ  యిక్కడ ఆగింది .


"రమణ"  రమేష్ తో  ఆమె  తన కథ  చెప్పేటప్పుడు  మీరు విందురుగాని  ఐ మీన్ చదువుదురుగాని  ఇక వుండనా మరి.


(బ్లాగ్ ను ఆధునీకరించే క్రమంలో అదివరకు సీరియల్ గా రాసిన కథలను తుడిపేసి ఒకే కథగా ఇవ్వడమైనది. బ్లాగ్ మిత్రులు గమనించగలరు.)




26, సెప్టెంబర్ 2022, సోమవారం

ఆధిపత్య అహంకార పీడ జాడలను విడిచిన ‘కుబుసం’

“ కుబుసం” కథ  ఈస్తటిక్ సెన్స్ కథాసంపుటిలో  ఉన్న కథ. వెబ్ పత్రికలో ప్రచురింపబడిన కథ. అంజని యలమంచిలి ఈ కథకు వ్యాఖ్యానం రాసారు. చదవండీ.. వారి వ్యాఖ్యానం. 



సూర్యుడికి గ్రహణం పడుతుంది. 


చంద్రుడికి గ్రహణం పడుతుంది. 


మహిళకూ గ్రహణం  పడుతుంది. 


సూర్యచంద్రులకు పట్టిన గ్రహణం కొద్ది నిమిషాల్లో వదిలేస్తుంది. 


కానీ మహిళలకు పట్టిన గ్రహణం... 


అనాదిగా తరతరాలకు పట్టి పీడిస్తున్నది. 


మహళలకు పట్టిన ఆ గ్రహణం తాలూకు అనేక రూపాలే ఈ ‘కుబుసం’ కథ. 


సాంప్రదాయాల సంకెళ్లను ఛేదించకుండా స్త్రీ జాతికి స్వేచ్ఛా సమానత్వాలు లభించవని చాటిచెప్పే  కథ ఈ కుబుసం.  


ప్రేమ్ చంద్ తన ‘కర్మభూమి’ నవలలో  కార్యోన్ముఖులు, సాహసులు, త్యాగశీలురైన స్త్రీ పాత్రల్ని సృష్టించినట్లుగానే... ఈ కథలో రచయిత్రి వనజ తాతినేని  సృష్టించిన రామేశ్వరి పాత్ర కూడా అంతటి ఔన్నత్యం వున్న వ్యక్తిత్వం గలది.  


అందుకే అంటాడు చలం... ‘స్త్రీకి కూడా శరీరం వుంది. దానికి వ్యాయామం యివ్వాలి.ఆమెకీ మెదడు వుంది. దానికి విజ్ఞానం యివ్వాలి. ఆమెకు హృదయం వుంది.  దానికి అనుభవం యివ్వాలి అని


స్త్రీల శరీరంపైన, ఆలోచనలపైన, హృదయంపైన అడుగడుగునా అనాధిగా ఈ సమాజం పెడుతున్న అనేక ఆంక్షల వొత్తిడిని కుబుసంలా విడువగల్గితేనే... స్త్రీ కుబుసం విడిచిన నాగులా చైతన్యశీలిగా మారుతుంది. 


గతంలో ఒక తరం స్త్రీలందరూ బడి మెట్లు ఎక్కేందుకు కుటుంబాన్ని వొప్పించడానికి ఎంతో నొప్పిని భరించారు. తర్వాత తరం వారు ఉద్యోగం చేయడానికి కుటుంబంతో యుద్దాలే చేశారు. తర్వాత తరం ఆస్తి హక్కు పొందడానికి సమాన హక్కులు సాధించడానికి లింగ వివక్ష లేని కుటుంబం కోసం సమాజం కోసం కృషి చేస్తూనేవున్నారు. 


కుబుసం కథలో రామేశ్వరి కూడా అదే చేసింది. పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఆడ పిల్లలకు చదువు అందని ద్రాక్ష. తనకు లభించని  చదువుకునే స్వేచ్ఛను ఆస్థి హక్కును నచ్చిన వ్యక్తితో కోరుకున్న వివాహాన్ని కూతురికి లభించేటట్లు చేయడానికి శతవిధాలా కృషిచేసింది. కుటుంబ సహకారం లభించకపోయినా ఆర్థిక స్వావలంబన దిశలో నడక సాగిస్తూ పురుషాహంకార పితృసామ్య భావజాలాన్ని అడుగడుగునా ఎదిరిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచింది. రామేశ్వరి ఒక తరానికి ప్రతినిధి. కచ్చితంగా చెప్పాలంటే రచయిత కాలానికి చెందిన స్త్రీ ప్రతినిధి. 


ఎన్ని విప్లవాలు నడిచినా పర్వాలేదనే ధోరణిలో కళ్లు మూసుకొని, 

తలవొంచుకొని తప్పుకెళ్లే ఈ సమాజంలో  కుటుంబ వ్యవస్థకు  ప్రమాదం జరుగుతుందంటే కూలిపోతుందంటే మాత్రం... దాన్ని ఆధారం చేసుకుని అధికారం చెలాయిస్తున్న పురుషాధిక్య సమాజం విపరీతమైన కలవరపాటుకు గురవుతుంది.  


అలాంటి పురుషాధిక్యతకు నమూనా... అతిపెద్ద ఉదాహరణ... ఈ కథలోని వీరయ్య పాత్ర.  


సాంప్రదాయం పేరుతోనో, కట్టుబాట్ల పేరుతోనో స్త్రీలపై జరిగే అణచివేత, 

పురుషాధిక్య పెత్తందారీతనాన్ని జయించి, తన కుటుంబాన్ని కుటుంబాన్ని ప్రగతిపథం వైపు నడిపించేందుకు... కుటుంబంలోని పురుషాధిక్యతను ఎదిరించి... భర్తను, పిల్లలను ఒక ఉన్నతమైన మార్గం వైపు మళ్లించగలిగిన చైతన్యం, ఔన్నత్యం కలిగిన పాత్ర రామేశ్వరి. 


గ్రహణం విడిచిన సూర్యుడు జగజగ్గీయమానంగా, గ్రహణం విడిచిన చంద్రుడు ఎంతో ప్రశాంతతో కనిపించినట్లుగా... రామేశ్వరి కూడా చుట్టూ వున్న అనేక సమస్యలను ఓపికతో, చాకచక్యంగా పరిష్కరించుకొన్న తీరును నాగును వీడిన కుబుసంతో పోల్చడం.. రచయిత్రి యొక్క అక్షర విన్యాసానికి,  రచనా కౌశలానికి నిదర్శనమని చెప్పొచ్చు.

 

వాస్తవానికి ఈ కథాంశం సాధారణమైనదే. సమాజంలో నిత్యం మన కళ్ల ముందు కనిపించే సంఘటనే. కానీ, ఈ కథలోని శైలి, శిల్పం అసాధారణం. 


రామేశ్వరి పాత్రను నడిపిన తీరు వల్లే  ఈ కథకు ఇంతటి ప్రాధాన్యత సమకూరింది.  


ఒక సందర్భంలో ‘రామేశ్వరి అలా ఎక్కువ కాలం మౌనంగా వుండలేకపోయింది. ఉత్సాహంగా కదిలే కాళ్లను, చేతులను స్తబ్దత నుండి విముక్తి కల్గించి పనికి మళ్ళించింది’ అంటూ రామేశ్వరి పాత్ర నైజాన్ని, ఆమె స్వేచ్ఛా ప్రియత్వాన్ని, ఆమె చైతన్యశీలతను సుస్పష్టంగా చెబుతారు రచయిత్రి.  


మరో సందర్భంలో తన పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బుతో కొన్న భూమిని తన పేరున ఎందుకు పెట్టలేదని భర్తని ప్రశ్నిస్తుంది. 


‘మా నాయన ముందు ఈ మాట అనేవు. కత్తి తీసుకుని నరుకుతాడు’ 


అంటాడు రామేశ్వరి భర్త సిద్ధప్ప.  


ఈ ఒక్క వాక్యం సీమలో ఒక సాధారణ రైతు కుటుంబంలో వుండే ఆధిపత్యం వీరయ్యలో కనిపిస్తే... తండ్రి ముందు కనీసం మాట్లాడలేని ఒక మామూలు వ్యక్తిగా సిద్ధప్ప కనిపిస్తాడు. 


అంతేకాదు... సిద్ధప్ప మాటకు రామేశ్వరి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది.  


అంత చేతకాని వాళ్లు ఎవరూ లేరులే ఇక్కడ’ అంటుంది.  


అలాగే  ఇద్దరు బిడ్డలు చాలని,  పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటానంటుంది రామేశ్వరి.  


ఇంకో రెండుతూర్తు చూద్దాం. ఆపు అన్నాడు వీరయ్య.


ఆ మాటలేవీ లెక్క చేయకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది రామేశ్వరి. 


అప్పుడు అందరి ముందు భార్య చెంపపై కొట్టి తన అధికారం ప్రదర్శిస్తాడు సిద్ధప్ప.   


లోను డబ్బుతో ఒక పాడి గొడ్డును కొంటుంది. 


సొంతగా నూనె గానుగ పెట్టాలనుకుంటుంది.  


మగ పెత్తనం సాగే ఆ ఇంట్లో రామేశ్వరిని అడుగడుగునా అణచివేయాలని చూస్తారు. పిల్లలకు కాన్వెంట్ చదువులు చెప్పించాలనుకున్నప్పుడు కూడా ఇంట్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.ఇలాంటి సందర్భంలో ‘మా వాటా ఎంతొస్తే అంత మాకు పంచి ఇవ్వండి’ అంటూ వీరయ్యను నిలదీస్తుంది రామేశ్వరి. 


తనపై చెయ్యెత్తిన మామను ఎదిరిస్తుంది.  


కొడుకుని, మనవడిని ఇంట్లోవుంచి, కోడలిని, మనమరాలిని వీధిలోకి నెట్టేస్తాడు వీరయ్య.అలాంటి సందర్భంలోనూ ధైర్యం కోల్పోకుండా... 


ఎదురింటి వారి ఆశ్రయం తీసుకుంటుంది. 


పొలం పనికి, కోళ్ల ఫారంలో పనికి వెళుతూ ధైర్యంగా బతుకుతుంది. 


ప్రభుత్వం ఇచ్చే సాయంతో ఇల్లు కట్టించుకోవాలని అనుకున్నప్పుడు సొంత స్థలం కోసం...  ఊరి పెద్దల దగ్గర పంచాయితీ పెట్టించి మరీ పదిసెంట్ల భూమిని రాయించుకుంటుంది. 


భర్తను, కొడుకుని కూడా ఇంటికి రప్పించుకుంటుంది.  


పిల్లల చదువు విషయంలోనూ  ఆడపిల్లకు అంత చదువెందుకని అడ్డుతగులుతాడు సిద్ధప్ప. 


ఆ సందెవేళ.. భర్తకు వినబడేలా 


‘తాను సృష్టించిన స్త్రీ తన తలనెక్కింది


తాను సృష్టించిన స్త్రీ తన ఒడికెక్కింది


తాను సృష్టించిన స్త్రీ బ్రహ్మ నాలుకెక్కింది


తాను సృష్టించిన స్త్రీ నారాయణుని ఎడదకెక్కింది


అందువల్ల... స్త్రీ స్త్రీకాదు, స్త్రీ అబల కాదు... స్త్రీ రాక్షసి కాదు


స్త్రీ ప్రత్యక్ష కపిల సిద్ధ మల్లికార్జునుడే కనవయ్యా..’ 


అంటూ వచనం చదువుతుంది. అది అర్థం చేసుకున్న సిద్ధప్ప.. ఆ తర్వాత ఎప్పుడూ బిడ్డల మధ్య ఆడ మగ భేదం చూడలేదు.


ఎదురైన అన్ని ప్రతికూలతలను... తనకు అనుకూలంగా మార్చుకుంటూ... కొడుకును ఇంటర్ లో చేర్పిస్తుంది. 


కూతురు మల్లి బిటెక్ పూర్తి చేస్తుంది.  


తల్లి మాదిరిగానే ఆత్మవిశ్వాసంతో ఎదుగుతుంది. 


తల్లి మాటలను నిత్యం  మననం చేసుకుంటుంది.  ‘


ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడి సంపాదించుకున్న రోజే ప్రేమ పెళ్లి ఆలోచన చెయ్యాలి. ఆడమగ పిల్లలు కలిసి చదువుకునేచోట అనేక ఆకర్షణలు వుంటాయి. అలాంటి సాలెగూడులో పడకుండా బాగా చదువుకో. తర్వాత నీకిష్టమైన వాడిని ఎంచుకో. అంతేకాని తప్పుదారి పట్టకు’ అని మల్లికి చెప్పించడం ద్వారా రామేశ్వరి పాత్ర మరో మెట్టు ఎక్కుతుంది. 


మల్లి ప్రేమ విషయంలోనూ  అండగా నిలుస్తుంది.  


వీరయ్యదగ్గర పంచాయితీ నడుస్తుంది.  


వీరయ్య ఎలా ఒప్పుకుంటాడో తెలిసిన రామేశ్వరి... ఒక అబద్ధం చెప్పి, మల్లి పెళ్లి తాను ప్రేమించిన వాడితోనే చేసేందుకు మార్గం సుగమం చేస్తుంది.  


ఆ విషయంలో మల్లిని క్షమాపణ అడుగడం ద్వారా తన ఔన్నత్యాన్ని మరోసారి చాటుకుంటుంది రామేశ్వరి. 

 

అంతేకాదు... 


పెళ్లికి ముందు రోజే.. నాలుగు సెంట్ల స్థలాన్ని కూతురికి సర్వహక్కులతో రాసిస్తుంది. 


తల్లిదండ్రులకు బిడ్డలందరూ సమానమే. 


మన అబ్బాయికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పు అని భర్తకు చెబుతుంది. కులాంతర వివాహం చేసుకుంటున్నందుకు ఆస్తిని చెల్లికి రాసినందుకు పెళ్లికి రానని కొడుకు చెప్పినట్లు సిద్ధయ్య చెబుతాడు.

 

అప్పుడు రామేశ్వరితో చెప్పించిన మాట రచయిత్రి పోరాట పటిమ కి నిదర్శనం. 


‘నేను జీవితకాలం యుద్ధాలు చేస్తూనే వుండటానికి ఓపిక తెచ్చుకుంటాను తప్పేదేముంది’ అంటుంది రామేశ్వరి.  


కథ ముగింపు కూడా అద్భుతంగా మలిచారు వనజ తాతినేని.


 రామేశ్వరి అత్తారింట అడుగుపెట్టిన నాటినుంచి ఆమె ఎదుర్కొన్న ప్రతి సంఘటనలోనూ సిద్ధప్పకు పాము కుబుసం కనిపిస్తుండేది.


 సిద్ధప్ప దాన్ని చూసి భయపడేవాడు.  


‘ఇంట్లోకి వెళ్లి భార్యని నిద్ర లేపబోయి ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె ముఖం చూసి వద్దులే అనుకుని బయటకు వచ్చాడు. 


గడ్డి దూయడానికి వామి దగ్గరకు వెళ్లాడు. 


భయం భయంగా గడ్డివాము మీద చెయ్యేసి గడ్డిని దూసాడు


 రెండు వాట్లు దూసాక గడ్డితో పాటు మధ్యలోకి తెగని అయిదున్నర అడుగుల కుబుసం చేతిలోకి వచ్చింది.   


కుడికాలి దగ్గర జరజర మని శబ్దం. కదలకుండా ఊపిరి బిగబట్టి నిలుచున్నాడు. 


అప్పుడే కుబుసం విడిచిన గోధుమవన్నె తాచు నిగనిగలాడుతూ... బిరబిర సాగిపోయింది. 


ఆ మెరుపును ఎక్కడ చూసినట్లనిపించింది. 


గుర్తు చేసుకోడానికి ఒక్క క్షణం కళ్లు మూసుకున్నాడు. 


రామేశ్వరి కనుల  మెరుపు అది.  


ఆమె ఆలోచనలు చెల్లుబాటు అయిన ప్రతిసారీ ఆమె కళ్లలో వెలిగే మెరుపు అది’.  


ఇక్కడే రచయిత్రి యొక్క ఆలోచన, శిల్పం లోని వైవిధ్యం పతాకస్థాయికి చేరుకుంటుంది. కథ ఎత్తుగడ ముగింపు  కూడా  రచయిత నైపుణ్యం కనబడింది.కథకు శీర్షిక “కుబుసం” సరిగ్గా సరిపోయింది. 


ఈ కథలోని రామేశ్వరి... అణచివేతను ఎదుర్కొనే మహిళాలోకానికి ప్రతినిధి.అందరికీ  రామేశ్వరి ఎదుర్కొన్నటువంటి సమస్యలే వుండకపోవచ్చు. కానీ... సమస్య ఏదైనా, అణచివేత ఏ రూపంలో వున్నా దాన్ని ఎదుర్కోవాలి. తనకు అనుకూలంగా మలచుకోవాలి.  కుటుంబానికి, సమాజానికి వెలుగు దివ్వెగా మారాలి.  రామేశ్వరి ఆలోచనలు ఆత్మ విశ్వాసంతో కూడిన ఆచరణ కుబుసం విడిచిన పాముకు ప్రతీకగా కథా సంవిధానం వుండటం వల్ల మంచి కథను చదివిన అనుభూతితో పాటు ఇంకా రచయిత చెప్పని కథను ఖాళీలను పూరించుకుంటూ ఈ కథ మిగిల్చిన ఆలోచనలు పాఠకుడిని వెంటాడతాయి.


రామేశ్వరిలా ..కుబుసం విడిచిన తాచు నిగనిగలాడుతూ... బిరబిర సాగిపోయినట్లు... ఈ వ్యవస్థలో ఎదురయ్యే 

ప్రతిఘటనలు తొక్కుకుంటూ స్త్రీ బిరబిర సాగిపోవాలి.  అప్పుడే గురజాడ వారు అన్నట్లు... ‘ఆధునిక స్త్రీ  చరిత్రను పునర్లిఖిస్తుంది’. 


మంచి కథను రాసిన వనజ గారిని అభినందిస్తూ.. “ఈస్తటిక్ సెన్స్” కథాసంపుటికి  శుభాకాంక్షలు తెలుపుతూ..



- అంజని యలమంచిలి




24, సెప్టెంబర్ 2022, శనివారం

రచయితలకు యోగం

 ఈస్తటిక్ సెన్స్ కథలు చదివిన పాఠకుల అభిప్రాయాలు. పుస్తకం చదవడమే అరుదైన ఈ కాలంలో.. ఇదిగో ఇంకా మాలాంటి వారిమి వున్నాం. పుస్తకం కొనుక్కొని చదువుతాం. మా స్పందనను కూడా రచయితకు ఇష్టంగా తెలియజేస్తాం అంటున్న మిత్రులు పంచుకున్న అభిప్రాయాలు. 

రచనలు ఎవరి కోసం అన్న ప్రశ్న ఉదయించినపుడు.. ఇదిగో.. ఇలాంటి పాఠకుల కోసం అని చెప్పుకునే వినయం సంతృప్తి. 

ఈ 14 కథలు మూడేళ్ళ కృషి,బాధ్యత కూడానూ. రచయితకు తమ రచనలను చదివే పాఠకుడు లభించడమే ఒక యోగం. ఈ లెక్కన అదృష్టవంతురాలిని. నాకంటూ కొంతమంది పాఠకులున్నారు. జయశ్రీ గారికి  ఉమా మహేశ్వరి గారికి ధన్యవాదాలు. 

***********

#ఈస్తటిక్ సెన్స్...వనజ తాతినేని గారు..14 కధలు ..14 రకాల layered problems which girls / women face ...అక్రమ సంబంధాలు, body shaming, ఉద్యోగాల బిజీలో ఇంట్లో ఉన్న సహాయకులు చేసే ఘోరాలు, సోషల్మీడియా మత్తులో జీవితాలు నాశనం చేసుకుంటున్న అమాయకులు... భార్యే ఆదాయవనరైతే, భర్త ఆధిపత్యం..

మనుషుల మధ్య డబ్బు గీతలు..... కుబుసం వదిలేసిన పాము దాని పని మీద అది పోతుంది. కుబుసం కధలో రాజేశ్వరి లాగా

( సమస్యలను కుబుసంతో పోల్చారు). అన్ని కధలు ఆలోచనని రేకెత్తించేవే..

(men too have many issues with womenfolk. I would like to read them too.)  -జయశ్రీ అబ్బినేని. 

**************

కథలన్నీ చాలా బాగున్నాయి వనజ గారూ. 

ఇంత మంచి కథలనందించినందుకు చాలా సంతోషం. మీకు హృదయపూర్వక నమస్కారాలు.

ముందు మాటలో నారాయణ స్వామి గారు చెప్పినట్టు ప్రతి కథలోనూ స్త్రీల గాయాలు మాట్లాడుతున్నాయి. మాట్లాడడమే కాదు, సరైన మలామునూ వెతుక్కున్నవి. చికిత్స దిశగా ముందుకు కదిలిపోయినవి అనిపించింది.

ప్రతి కథలోని పాత్రలన్నీ మన చుట్టూ ఉన్నవే. రోజూ చూస్తూనే ఉంటాము. గాయపడుతున్న వారికి ఆ సమయంలో వారేస్థితిలో ఉన్నారో, అసలేం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో ఆలోచించగలిగే, అర్థం చేసుగోగలిగే పరిస్థితి గానీ, మనస్థితి గానీ ఉండదు. సమస్యలోనే కూరుకుపోయి ఉక్కిరిబిక్కిరవుతుంటారు. చుట్టున్న సమాజమూ చూసీ చూడనట్లే ఉంటుంది. వారి వ్యక్తిగతమని దాటవేస్తుంది. దారిన పోయే కంప మన మీద పడుతుందేమోనని భయపడుతుంది. తనకలాంటి పరిస్థితి ఎదురవనందుకు హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంటుంది. అలాంటివో.. కొంచం అటూ ఇటూవో తామూ ఎదుర్కున్నట్లైతే.. లోలోన… మనలాంటి వాళ్ళు మనమొక్కరే కాదు.. ఇంకా ఉన్నారన్న మాట అని కొంత ఊరట పొందుతుండవచ్చు

. గాయపడుతున్న వారికి పరిస్థితి అర్థమయ్యే నాటికి గాయం ఓ మచ్చగా, లోపంగా, బలహీనతగా, తెలివి మాలినతనంగా వారి మనసుల్లో బలంగా నాటుకుపోతుంది కాబట్టి ఇక దాని గురించి వారు ఆలోచించనూ లేరు. (అంతా అయిపోయాక అప్పుడాలోచించి ఉపయోగమూ ఉండదు)

 సరిగ్గా అలాంటి సమయం లోనే.. హే… లోపం నీది కాదు. నీ బాధ నాకర్థమౌతోంది. తప్పు నీది కాదు, తప్పంతా నీమీద జులుం చేసేవాళ్ళది. వాళ్ళది లోపం అని చెప్పే స్వరం కావాలి. దురదృష్టవశాత్తు సమాజం అలాంటి చేయూతను ఆ సమయంలో చేయదు. 

అచ్చం అలాంటి వారికి ఈ కథలు దివిటీలలాంటివి. ఇలాంటి బాధలు మనకొక్కరికే కాదు ఇంకా ఉన్నారన్నమాట. వాళ్ళు మనలా మౌనంగా భరించకుండా సమస్య నుండి బయటపడడానికి ఇంకా ఎవో మంచి మార్గాలు వెతికారన్నమాట. ఆ దారుల నడిచి ఒడ్డున పడ్డారన్నమాట. ఇదుగో… ఇలాంటి కొన్ని పరిష్కారాలు వారినా సమస్యలనుండి బయటపడేసాయన్న మాట. ఈ పరిష్కారాలు ఇంకెవరి చేతుల్లోనో కాదు. అచ్చంగా మనచేతుల్లోనే ఉన్నాయన్న మాట అన్న ఊరటనూ నమ్మకాన్నీ ఖచ్చితంగా కలిగిస్తాయి. అందుకని ఈ కథలు అలాంటి వారు తప్పకుండా చదవవలసినవి.

ఇంత గొప్ప కథలు అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

- ఉమా మహేశ్వరి సామ. 

**************.



21, సెప్టెంబర్ 2022, బుధవారం

ఏడుపు ఊరికే వస్తుందా..?

 రెప్పల తడి  కథ పై ఒక సమీక్ష

ఈ రోజు సాక్షి ఫండే లో వచ్చిన వనజ తాతినేని గారి కథ.

ఒకే వాక్యం లో చెప్పాలంటే సత్యవతికి కుక్క చనిపోయినప్పుడు వచ్చినంత 

ఏడుపు మొగుడు చనిపోయినప్పుడు ఎందుకు రాదు?

కుక్క సారీ బుజ్జోడు చనిపోయినప్పుడు ఏదో లోపలిది ఏదో 

వదిలి వెళ్లినట్లు అయి వర్షంగా కుమిలి కుమిలి కురిసిన దుఃఖం ఒక్క చుక్కగా 

కూడా భర్త శవం పక్కన రాలేదే!!!

ఇదంతా సమాజానికి కష్టంగా ఉంది,సత్యవతి ఏడవక పోవడం.

ఏడ్చి తీరాల్సిందే లేకుంటే ఏదో అయిపోతుంది దానికి.

ఏడుపు అంటే నవ్వు కాదుగా ఊరికినే పెదాల మీద అంటించుకోవడానికి!!!

దానికి మాత్రలు కూడా ఉండవు కాబోలు లోకం కోసం ఏడుద్దాము అన్నా.

అయినా లోకం ఒకప్పుడు మొగుడు చనిపోతే నువ్వుకూడా చనిపో అని సతిలో 

తోసింది.ఇప్పుడు రాజారామ్ మోహనరాయ్ గారి పుణ్యమా అని ఏడుపే కదా మీ 

నుండి అడుగుతుంది.కొంచెం ఇచ్చేస్తే పోతుంది కదా. 

ఏడుపు ఊరికే వస్తుందా? లోపల ఏదో కదలాలి.మనదైనది ఏదో దూరంగా 

లాగేస్తున్నట్లు,ఇక ఎప్పటికీ రానట్లు, హృదయం నుండి ఏదో తెగిపోయినట్లు ....

రెక్కలు తెగిన పావురం అయి మనసు ఇంకో మనసు కోసం గిలగిల కట్టుకోవాలి.

అదుగో!అప్పుడు వస్తుంది ఏడుపు గొల్లుమంటూ..... కట్టలు తెగిన వరద నీరులా 

లోపలి బరువును మోసుకొస్తూ ,కాలిపోయే బంధాన్ని గుండెలపై పొదువుకుంటూ,

వదిలిపోవద్దని కాళ్ళు పట్టుకుంటూ .....అలా రావాలి. 

కానీ ఇక్కడ బంధం ఏది? 

తాళి కట్టాడు నిజమే!అందుకే కదా తనను కాదని,తన కష్ట సుఖాలు 

పట్టించుకోకుండా ఇంకొకరితో తిరిగి చివరి దశలో వచ్చినా సేవలు చేసింది.

సేవలకు హృదయం తో పనిలేదు కరుణ చాలు.కానీ దుఃఖం అలా ఎలా 

వస్తుంది!ఆయన ఎప్పుడూ తోడు ఉన్నాడని ఇప్పుడు శూన్యం అనుభవించడానికి?

తోడు లేని ఆయన ఇపుడు పోతే మాత్రం గాజులు బొట్టు తీసేయాలి లోకానికి.

ఎదురు పడితే విసుక్కోవడం,కసురుకోవడం. నిజానికి ఇలాంటి భర్తకంటే మొక్కలు,

కుక్కలు మేలు.కొంచెం ప్రశాంతత ఇస్తాయి అని వ్రాసిన రచయిత మాటలు అక్షరాల నిజం. 

ఇప్పుడు కూడా సత్యవతికి శూన్యం లో బుజ్జోడే గుర్తుకు వస్తున్నాడు సత్యవతికి,భర్త కాదు. 

తన కోసం ఇంటి దాకా వచ్చివెళ్లే బుజ్జోడు.కొంచెం పాలకు ఎంతో విశ్వాసం చూపే బుజ్జోడు.

,బుజ్జోడా బయటకు వెళదాము వస్తావా!అనగానే పరుగున తోడు వచ్చే బుజ్జోడు,

దూరం అయిపోతే....సత్యవతి ఏమవుతుంది?

బంధం మనకు ఎవరితో ఎలా ఏర్పడుతుందో తెలీదు.అది మొక్కలు అయినా కుక్కలు 

ఆయినా దానికి చాలా విలువ ఉంటుంది.మరి అలాంటి విలువకూడా తాళి కట్టిన భార్య 

మనసులో సాధించలేని భర్తలను చూసి జాలిపడటం తప్ప ఏమి చేయలేము.

ఇది సమాజం లో అర్ధం చేసుకోవాల్సిన సున్నిత సమస్య.లేకుంటే తడవని కళ్ళను 

ముసుగులో కప్పి నటించడం తప్పఇంకో దారి లేదు.

చక్కటి కథనం తో వనజ గారు ఒక సమస్యను మన ముందుంచారు.

                      

                                  వాయుగుండ్లశశికళ (శశికళ తన్నీరు) 


రెప్పల తడి  ఈ లింక్ లో చదవండి.. 





20, సెప్టెంబర్ 2022, మంగళవారం

చెరగని గీత ఆడియో రూపంలో

 మిత్రులకు నమస్కారం 🙏

#ఈస్తటిక్_సెన్స్ #వనజతాతినేని 

కథా సంపుటిలోని కథ “చెరగని గీత” 

వినిపించే కథలు ఆడియో ఛానల్ లో వెంపటి కామేశ్వరరావు గారు వినిపించారు. మీరు కూడా వినండి స్పందించండి.. 



https://youtu.be/idJMJ4lOqVs


 ..."మతమన్నది నా కంటికి మసకైతే

మతమన్నది నీ మనసుకు మబ్బయితే

మతం వద్దు గితం వద్దు

మాయా మర్మం వద్దు..."

మనుషులు తోటి వారి మధ్యగీసుకున్న గీతలు చాలా బలమైనవి. క్రూరమైనవి. కులాలు,మతాలు,వర్ణాలు,దేశాలు ఏవైనా వాటిని చెరపడానికి కొన్ని తరాలు, వారి హృదయాలు కూ డా అవసరమవుతాయి. ఈ లోగా గాయపడే హృదయాలెన్నో!

.. శ్రీమతి వనజ తాతినేని కథ  .. చెరగనిగీత .. తప్పక విని ఆదరిస్తారు కదూ! 

18, సెప్టెంబర్ 2022, ఆదివారం

చెరగని గీత - లక్ష్మి రాయవరపు

శ్రీమతి వనజ తాతినేని గారు వ్రాసిన చెరగని గీత కథ చదివినప్పుడు చిన్న ముల్లు గుండెలో గుచ్చుకున్న భావన కలిగింది. సాధారణంగా స్వదేశాలు వదిలి వివిధ దేశాలకి వచ్చిన వాళ్ళకి, ఆ గాలి నేల అలవాటయ్యి  ఒక కొలిక్కి చేరుకునేసరికి మనుషుల మధ్య తారతమ్యాలు చాలా వరకూ నశించి, అగ్గిలో పుటం వేసిన బంగారంలా మారిన హృదయాలతో అందరికీ ఒకరి పట్ల ఒకరికి సహానుభూతి కలుగుతుందనిపిస్తుంది చాలా సార్లు. 

అయితే, ఇప్పటికీ అతి కొద్ది మందిని చూసినప్పుడు వారికి అగ్రవర్ణ అధికార ధోరణి మారలేదనిపిస్తుంది. అలాగే అనాదిగా దౌర్జన్యాలకి గురి అయిన కొన్ని వర్ణాల వారికి ఇంకో వర్ణం వారి మీద ఒక లాంటి అక్కసు ఇంకా పోలేదని కూడా అనిపిస్తుంది. అగ్ర రాజ్యాలుగా భావిస్తున్న ఉత్తర అమెరికా దేశాల సంస్కృతికి అది గొడ్డలి పెట్టు అని నేను భావిస్తాను. పై కారణాల వల్ల, ఒక దేశానికో ప్రాంతానికో చెందిన వారందరూ ఇతరులతో కలవకుండా ఒక చోట స్థిరపడటం కనిపిస్తుంది. వాళ్ళు ఇంకొకరితో కలవడానికి ఇష్టపడరు. ఒక వేళ పొరపాటున ఇంకొకరు ఉన్నచోట ఇల్లు కొనుక్కున్నా, ఇతర దేశస్థుల  వంటల వాసనలు నచ్చక కొందరు ఇళ్ళు అమ్మి వెళ్ళిపోవడం కూడా తరచుగా చూస్తుంటాము. ఇక్కడ వింటే ఈ విషయం వింతగా మనకి అనిపిస్తుంది కానీ భారత దేశంలో ఇది  చాలా సాధారణ విషయమే కదా? చిన్నప్పటినించీ ఇలాంటివి చాలానే చూసి ఉంటాము మనము కూడా. అయితే,  ఇక్కడ జరిగినవి చూడగానే మన గతం మనని చెళ్ళున కొట్టినట్టయితే, మనం కొంత మారినట్టే. ఈ విషయాన్ని రచయిత్రి తన కథలో చిన్నప్పుడు ఆటలాడుకున్నప్పుడు చూసిన యేసు కుమారిని గుర్తు తెచ్చుకుని స్పృశించడం నాకు చాలా నచ్చింది.

చాలా వరకూ మనసులో కలిగే భావాలు పైకి కనబడనీయకుండా దాచుకునే సంస్కృతి ఉన్న ఈ దేశాలలో, అక్కడక్కడ కనిపించే దారుణమైన తేడాలు మనసుని బాధించక మానవు.  ఈ చెరగని గీతలనేవి చాలా పెద్ద సబ్జెక్టు. ఇంత పెద్ద అంశాన్ని ఒక కథలో ఇమడ్చడం లో రచయిత్రి కృతకృత్యులయ్యారు. 

పిల్లలకి కథలు చెప్పేటప్పుడు బూచిని చూపినట్టే ఒకోసారి తెలియని దేవదూతలని కూడా సృష్టిస్తాం మనం. ఆ పాత్రలు పిల్లల మనసుల్లో పూర్తిగా నాటుకుపోతాయి. అలా చెప్పిన ఒక పాత్ర మీద చిన్ని తల్లి అల్లుకున్న ఆశ, ఆ ఆశ తీరనప్పుడు  మెరిసే చిన్ని కళ్ళల్లో, మోములో ద్యోతకమైన నిస్పృహ చాలా బాధ కలిగించింది. సంస్కృతి ఏదైనా సరే, పిల్లలూ దేవుడూ చల్లని వారే అని నమ్మడమే కదా మానవత్వమంటే. ఆ చిన్నారులలో కూడా తారతమ్యాలు చూపించే వాళ్ళని కలవకపోవడం, వాళ్ళ గురించి మాట్లాడకపోవడమే మంచిదని సూటిగా ఒక పాత్ర చేత చెప్పించారు రచయిత్రి. అలాగే చివరలో మళ్ళీ మనదేశం పిల్లలందరూ ఒక చోట కలిసి ఆడుకోవడమే ఉత్తమం అని ఇంకొక గీత గీసి కథకి ముగింపునివ్వడం అనూహ్యం. చక్కని కథ, చక్కని కథనం ఎక్కడా ఆగకుండా చదివించింది. 

మనుషుల మధ్య అన్ని తారతమ్యాలు తొలగే రోజు త్వరలో వస్తుందని ఆశిద్దాం.

వనజ తాతినేని అముద్రిత కథాసంపుటి పాఠకులను విశేషంగా అలరిస్తుందనడంలో సందేహం లేదు. వనజ గారికి అభినందనలతో.. 

- లక్ష్మి రాయవరపు కెనడా





నది - నేను

 


మొన్నెప్పుడో … ఇతరులను గాయపరిచిన ఆయుధాన్ని తీసుకుని  నది వద్దకు వెళ్లాను శుభ్రపరుద్దామని. 

నది అదృశ్యమైంది. కన్నీటితో హృదయాన్ని  మనో మాలిన్యాలను శుభ్రం చేసుకుని చేతులు జోడించి వేడుకున్నాను 

నది ప్రత్యక్షమైనది చిరుగాలితో దీవించి

నది నీ ఆత్మ అని వినిపించింది

ఎవరో తత్వవేత్త చెప్పినట్టు దాతృత్వంలోను ఇతరులకు సహాయపడటంలోను నదిలా నీవు వుండు అన్న. వాక్యం గుర్తొచ్చింది

అంతలో.. 

పొడారిపోయిన కళ్ళతో నీళ్ళు నింపుకుని వెళ్దామని  నది తీరానికి వచ్చారు కొందరు. దప్పిక తీర్చకోవడానికి నీళ్ళతో పాటు కాసింత తడిని మనసుకు అద్దుకుని మరికొంత కన్నీళ్ళను నింపుకుని  వెళ్ళారు. 

మరికొందరు తీరాన కూర్చుని  నదిని చిత్రించారు ప్రకృతి అంత సహజంగా

మంద్రంగా అలల సవ్వడిని  కెరటాల ధ్వని ని  తరంగ ధ్వని ని కూడా సృష్టించారు. 

 కానీ నదిని భూమి వలె ఇంకించుకోలేక పారిపోయారు.  వడిగా ప్రవహించలేక పోతారు నదిలా. అలసి  చతికిలపడిపోతారు నాలా. 

పద.. ముందుకు పద అంది నది. 

వంతెనలు పడవలు నౌకలు కనబడని నది వెంట ప్రయాణం దీర్ఘంగా సాగుతున్నట్లు వుంది.

ఆరు నదులు దాటలేని నేను 

విసుగుపడి రెక్కలు తొడిగి నదిని మోసుకుని సముద్రాలు ఎడారులు కీకారణ్యాలు దాటాను. 

మోయలేక నదిని పదిలంగా ఓ చోట జారవిడిచాను. 

భూమిని తొలిచి నీరు పైకి లాగకముందు అనాది జీవుల ప్రాణాధారం నది కాదూ.. అది అందరిది కదూ.. 

మరలా నది వెంట నేను. పద పద.. ముందుకు పద అంటుంది. 

సాగుతూ వుండటమే గమ్యం చేరేదాకా.

17/09/2022  -09:20 PM. 

(ఏ కళ  అయినా నదిలా ప్రవహిస్తూనే వుంటుంది. అంతూ దరి లేనిది.  ఇంకా ఎక్కడో చోట మిగిలేవుంటుంది. తడి తడిగా.. 

నాలో కవిత్వపు తడి.. ఆరిపోలేదు.. నది నడకల సాక్షిగా)


14, సెప్టెంబర్ 2022, బుధవారం

నేను స్కూల్ కి యెల్లను

నేను స్కూల్ కి యెల్లను, నాకు ఫెండ్స్ వద్దు అంటావ్

దిగాలుగా ముఖం పెట్టి.

నా బంగారు తల్లి చిన్నితల్లి.. స్కూల్ కు వెళ్ళి హాయ్ హలో! బాగున్నారా అని చిన్ని చిన్ని పాపలను బాబులను పలకరించాలట  వాళ్ళతో ఆడుకోవాలంట కొత్త కొత్త పద్యాలు నేర్చుకోవాలంట. 

చిన్న వెలుగు చిన్నితల్లి ముఖంలో. అంతలోనే అమ్మ నాన్న కనబడరని బెంగ చుట్టుకుంటుంది. 

ఇలా రోజుల తరబడి స్కూల్ కు పంపడానికి సమాయత్తం చేసాక.. 

గుబులు మొదలవుతుంది నిజంగా స్కూల్ కు పంపాలా

ముప్పై నెలలకు వాళ్ళ నాన్నను పంపినట్టు పంపకపోతే 

యేం!? అని బడిపై కోపం. 

నాయనమ్మ చంకలో వున్న పిల్లను అందుకుని కారు సీటులో కూర్చోబెట్టాక “నాయనమ్మా! నువ్వు రా !! అంటూ కన్నీళ్ళతో అడుగుతుంటే గుండె చిక్కబట్టుకుని కన్నీరు కురవకుండా యెంత ప్రయాసపడినా అయినా ఆగకుండా కారే కన్నీటిని తుడుచుకుంటూ.. 

నేను యిక్కడే వుంటానుగా.. నువ్వు ఫ్రెండ్స్ తో ఆడుకుని రా.. అంటూ రెండు చేతులూ వూపి బై చెప్పి గాలిలో ఓ ముద్దు బట్వాడా చేసాక.. పాప చిన్నగా చేయి వూపింది. 

కారుతో పాటే నాయనమ్మ మనసెళ్ళిపోయింది. 

నన్ను యెత్తుకో అంటూ చేతులు చాచి అడిగితే యెత్తుకునే టీచర్ మనసులో నాయనమ్మ ప్రేమ నిలువెల్లా కొలువై వుండాలని కోరుకుంటూ.. 

నువ్వు యిప్పుడే వచ్చేస్తావని  ఇంటి లోపలకు వీథి మలుపుకు లోలకంలా తిరిగే నేను.. అనుకుంటానిలా. 

నా పిచ్చి గానీ ..  దింపి యింటికి రాకుండా స్కూల్ బయట యెదురుచూసే మీ నాన్నలో కూడా కొండంత గుబులు. నువ్వు యెప్పుడెప్పుడు బయటకొచ్చి  నీ చిన్ని చిన్ని చేతులతో తన మెడను చుట్టేసుకుంటావో అన్న ఆత్రుత కల్గిన  తండ్రి  మనసు. ఇంట్లో చిక్కబట్టుకున్న గుండెతో గుంభనంగా వుండే మీ అమ్మ మనసు. 

నువ్వు అయిష్టంగా స్కూల్ కు వెళ్ళావేమో కానీ .. ఇష్టంగా స్కూల్ కు పంపినదెవరని!? 

మా బెంగంతా గాలిలో చుట్టుకుని నిను చేరకుండా నువ్వు కిలకిలా నవ్వుకుంటూ ఆడుకోవాలి పాడుకోవాలి. ఇల్లు కన్నా ప్రపంచం మరింత పెద్దది కదా!! 

కదా.. బంగారు తల్లీ!💞



#చిత్కళకబుర్లు

12, సెప్టెంబర్ 2022, సోమవారం

వాతాపి జీర్ణం - విషాద నిశ్శబ్దం

 ఈస్తటిక్ సెన్స్  కథాసంపుటిలో మొదటి కథ ‘వాతాపి జీర్ణం’ కథకు ‘పద్మజ సూరపరాజు’ గారి వ్యాఖ్యానం

వనజ తాతినేని గారు సుపరిచిత రచయిత్రి. వారి కథలలో స్త్రీ , వివాహ వ్యవస్థ విషయాలు.  తన చుట్టూ ఉన్న  మహిళలు వివాహజీవితం లో ఎదుర్కొంటున్న సమస్యల గూర్చి చెప్పవలసిన కథలు ఆమె చెప్పారు. నిజాయితీతో , సహానుభూతితో తోటి స్త్రీ ల క్లేశాలను సమీపం నుంచి చూసి, చలించిన ఒక రచయిత్రి వ్రాసిన కథలు ఆమెవి.


 ‘వ్యవస్థ‘, అది ఏదైనా, ఎటువంటిదైనా అందులో  సౌలభ్యాలు కొన్ని, అవకతవకలు కొన్ని తప్పనిసరి. మనిషి తన శ్రేయస్సుకు అని చెప్పుకుంటూ ఏర్పరుచుకున్న ప్రతి ఒడంబడిక, సంస్థ, వ్యవస్థ ఇలా పేరు  ఏదైనప్పటికీ అందులో అనతికాలంలోనే ఒక అధికారవర్గం, ఒక పాలిత లేదా పీడిత వర్గం అంటూ విభజన ఒకటి తలెత్తుతుంది. ఇది తెలియకుండా చాపకింద నీరులా వచ్చిచేరుతుంది. 


మానవ క్రమబద్ధమైన పురోగతికోసం అంటూ ఏర్పరుచుకున్న కూటమిలో అభివృద్ధి మాట అటుంచి రెండు వర్గాల పరస్పర అసూయాద్వేషాల వల్ల తీవ్ర నష్టమే జరగడం చూస్తుంటాం. ఇందుకు కారణం అసమాన సమీకరణాలు. ఒకళ్ళను రెండోవారు తన అధీనంలో ఉంచుకోవడమే తనకు అక్కడ మనుగడ అని భావించడం. ఈ అసమానత అతి భయంకర రూపాలు దాల్చుతూ వస్తోంది. పని సజావుగా విజయవంతంగా సాగాలంటే ఒకరి నాయకత్వం లో తక్కిన సభ్యులు అనుగమించాలి అనే ప్రతిపాదన లో విషాదం ఏమిటంటే ప్రతి సభ్యుడు నాయకుడు తానే అవ్వాలని అనుకుంటాడు. మానవ నైజంలో అనుసరించటానికి, బానిసత్వానికి గల తేడా తెలుసుకునే విచక్షణ ఉండదు.


‘వివాహం‘ లో  సమానత్వ సమీకరణాన్ని సాధించటం అన్ని వ్యవస్థల లోకి కష్టమైన పని. ఇష్టం గా మొదలైన ఒక వర్గపు బానిసత్వం అతి సులభంగా ఒక బలమైన ఒరవడిలో పడిపోతుంది. అదే పురుషాధిక్యపు పోకడ. భాషా, ప్రాంత భేదాలు లేకుండా ప్రపంచం అంతా ఇదే ఎక్కువగా కనపడుతుంది, కొండొకచో రెండోరకమూ ఉన్నా కూడా. 


పెళ్లి ఒక తప్పనిసరి సాంఘిక దురాచారం అని వేళాకోళం చేయగలిగేంతగా పరిణమించి చాలా రోజులయింది. సంతోషం గా ఉండిఉండవలసిన గృహస్థాశ్రమం జీవితఖైదు గా మారింది కొందరికి.

 

శారీరకంగా ఎక్కువ బలవంతులైన పురుషులు తమ స్త్రీ పై అధికారం సంపాదించడం పరిపాటి. వాళ్ళ ఈ బలం ఎంత కారణమో, వాళ్ళ మనోదౌర్బల్యం కూడా ఈ పరపీడనకు కారణం అవడం విచారకరం.

ఆడది తనకంటే రూప,  గుణ, విద్యాఉద్యోగాలలో అధికురాలైనపుడు ఆత్మన్యూనతాభావం తో ఈ పీడనకు దిగుతుంటారు పురుషులు. ఈరకమైన పీడనకు స్త్రీ ప్రతిస్పందన సామాన్యంగా ఒకటి నిశ్శబ్దం గా లొంగిపోవటం, రెండు నచ్చనిదాన్ని ప్రశ్నిస్తూ వాగ్యుద్ధానికి దిగటం, మూడవదీ అన్నింటిలో కి ప్రభావవంతమైనదీ, నిశ్శబ్దంగా ప్రతిఘటించడం, ‘సత్యాగ్రహం‘ ! 


సత్యాగ్రహం కన్నా శత్రువును దెబ్బకొట్టగల అస్త్రం మరొకటి లేదు. అదీ భార్యభర్తల బంధం లో . ఎంత insensitive గా ఉంటూవచ్చినవారిని కూడా సత్యాగ్రహం క్షతగాత్రులను చేస్తుంది. కనిపించని కముకుదెబ్బ ఇది. పరాజయం పైకి ఒప్పుకోకపోయినా ఇక్కడ ఎదిరి లోలోపలే అవమానంతో పెద్ద శిక్ష అనుభవిస్తాడు. విషాదం ఏమిటంటే ఇటువంటి పోరాటం రెండువైపులవారినీ నిర్జీవులను చేస్తుంది బ్రతికి ఉన్నన్ని నాళ్ళూ. 


ఇక్కడ సమీక్షకు ఎంచుకున్న వనజ గారి రచన "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం". 

ఒక కప్పు కిందే ఉంటూ, ఒక నేల మీదనే నడుస్తూ, ఎప్పటికీ ఇక కలవలేనంతగా విడివడి రెండు సమాంతర రేఖలలా బ్రతుకుతున్న దంపతుల కథ. 

ఈ పరిస్థితి రావటానికి ఎవరెంత కారణమో మొదట్లో పాఠకులకు తెలియదు. యాభైలు దాటిన వయస్సులో ఉన్న ఈ ఇద్దరూ ఈ చివరి దశలో పరస్పరం ఆసరాగా ఉండవలసిన సమయం.

ఆసరా ఉంది. అయితే ఒకవైపునుంచే. ఆమె అతనికి ఇస్తున్న ఆసరా అనురాగం తో కాక నైతిక బాధ్యతలా ఉంది. ఆమె కాళ్ళు, మోకాళ్ళు సహాయనిరాకణోద్యమంసాగిస్తున్నా, కేవలం ప్రేక్షకుడైన అతనికి ఇప్పటికీ తిండీ, వైద్య పరమైన శుశ్రూష మౌనంగానే అయినా ఆమె అది  నియమబద్ధంగా అందించడం మానలేదు. 

అతనికి ఇది అసహనంగా ఉంది, పరాశ్రయుడిలా ఆమెతో సేవలు చేయించుకోవడం కాదు. ఆమె apathy. తనను నిశ్శబ్దంగా నిర్లక్ష్యం చేయడం తీవ్ర అవమానకరంగా ఉందతనికి.

ఈ స్థితికి ఆమెను నెట్టిన గతంలోని తన చర్యలకు అతని కళ్ళు మూసుకున్నాయి. సగటు పురుషుడిలాగే తను ఒక భర్త గా తన బాధ్యత, ఉద్యోగం చేయటం, సగం జీతం ఇంట్లో ఇవ్వడం, భార్యను హింసించకపోవడం, ఇలా చాలా సవ్యంగానే నెరవేర్చాను నా కర్తవ్యం అనుకుంటుంటాడు. 


కథ మొదలే అతను భార్య కుంటుకుంటూ వచ్చి మొక్కలకు నీళ్ళు పోయడం చూస్తూ కాస్త తమ నేపథ్యం మనకోసం విప్పుతుంటాడు. సారాంశం, ఆమె ఏ చర్య లో కూడా దోషం లేదు, ధర్మబద్ధత, నైతికత, సామాజిక స్పృహ, సేవా కార్యక్రమాలు చేయడం లో ఉత్సుకత తప్ప . ఆమెవి అన్నీ మంచి లక్షణాలు తనను కించపరిచే లక్షణాలు గా ఎందుకు కనిపిస్తున్నాయి? ఆత్మన్యూనతాభావం ! ఆంతర్యం లో తానేమిటో, ఆమె ఏమిటో తనకు క్షుణ్ణంగా తెలుసు కనుక. ఆమెకూ తెలుసు. ఇంత తెలిసీ ఆమె తనను గౌరవం గా  చూస్తూ యజమానిపగ్గాలు ఇంకా తన చేతికే ఇవ్వాలనుకోవడం వల్ల. ఆమె పైన, ఇంటిపైన బాధ్యత లేని ఆధిపత్యం కోరుకోవడం వల్ల.


తను ఆమెకు చేసిన అన్యాయం పూర్తిగా మర్చిపోయాడు. ఆమెకు అసలు తెలియదు అనుకున్నాడు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగింది. 

కథ ఉత్తమపురుషలో నడుస్తుండగా అతని perception లో ఆయన భార్య ‘ యూ ఎమ్ ‘ ఉదయమిత్ర ను చూస్తాడు పాఠకుడు. ఆమెను చూస్తున్న అతని చూపే అతనేంటో పాఠకుడికి చూపిస్తుంది. 


భార్యాభర్తల మధ్య నమ్మకం నష్టం అయినపుడే పరస్పర గౌరవం, మర్యాదా, జాలీ జారిపోతాయి. మిగిలేది రెండు ఎండు గడ్డి దిష్టి బొమ్మలు. వాళ్ళది ఇల్లని, వాళ్ళు చేస్తున్నది సంసారం అనీ అనలేరు. 


సంతోషం గా ఉండే కుటుంబాలన్నిటివీ ఒకటే కథ, కష్టాలు పడే కుటుంబాలకి ఒక్కో దానికి ఒక కథ అంటాడు Tolstoy. 

 ఆ కథలన్నీ చెపుతూనే ఉన్నారు, వ్రాస్తూనే ఉన్నారు చాలా ప్రపంచ ప్రఖ్యాత కథకులు పురుషులు, స్త్రీలు. 

నిజం ఉన్న కథ చెప్పాలంటే ఎవరైనా తానున్న తలంనుంచీ, తరం నుంచీ తనదైన సత్యమైన పరిశీలన నుంచీ చెప్పాలి. 


వనజగారి కథలన్నీ మంచిపరిశీలన నుంచి వచ్చినవి.

పై కథలో స్త్రీ ఎదిగిన ఎత్తు చాలా గొప్పది. పరస్త్రీ తో సంబంధం పెట్టుకుని సంతానాన్ని కని, సంవత్సరాల పర్యంతం రెండో కాపురాన్ని దాన్ని గురించిన రహస్యాన్ని కప్పెట్టి లాక్కొస్తున్న  భర్తను ఆమె సహించడమే కాక ఇంకా అతన్ని, ఆపదలో ఉన్న తన ప్రత్యర్థి నీ కాపాడుతుంది. 

 భర్త నిజస్వరూపాన్ని తను జీర్ణం చేసుకుంది. 

 ఆమెకు అన్నీ తెలిసీ ఇన్ని రోజులుగా తనను సహించి భరిస్తూవస్తున్నదన్న విషయాన్ని, మనిషిగా తన భార్య తన కంటే ఎన్నో మెట్లు పైన ఉన్నదన్న సత్యాన్ని భర్త హరాయించుకోవాల్సి వచ్చింది చివరకు. 

    ఆమెను కాదని , మనగల సత్తా తనకు లేదని, ఆమె దయాదాక్షిణ్యాలపైననే తన మనుగడ జరగక తప్పదని తనకు తెలుసు. కష్టం అయినా ఈ సత్యాన్ని అతను జీర్ణం చేసుకోక తప్పదు.

తనకున్న జబ్బులకు తను వేసుకోవలసిన మాత్రల పేర్లు కూడా తెలుసుకోకుండా రోజులు వెళ్ళదీయగల భర్త జబ్బుకు ఏ మందు వేయాలో భార్యకు తప్ప మరే వైద్యులకు తెలుస్తుంది? 


విషాదమేమంటే ఈ నిశ్శబ్ద సత్యాగ్రహం వివాహబంధం లోని ఇద్దరినీ సమానంగా దహిస్తుంది. 

సంగీతం లా సాగవలసిన సంసారం ఘనీభవించిన శిలాసదృశంగా మూగపోవడం, సహజంగా కలికి చిలుక లాంటి స్త్రీ కి ఎందుకు ఇష్టం అవుతుంది?


చాలా తక్కువ మాటలలో విస్తారమైన పాత్ర చిత్రణ లతో కథ చెప్పారు రచయిత్రి. 

కథంతా భార్య పాత్ర తాలూకు విషాద నిశ్శబ్దం వింటారు పాఠకులు.