30, డిసెంబర్ 2022, శుక్రవారం

ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటి వెనుక కథ

 ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటి వెనుక కథ.  మూడేళ్ళ నా రచనా ప్రస్థానం వెనుక నా అక్షరాల ఆత్మ విశ్వాసం కథ యిది.

2020 నుండి పత్రికల్లో నా కథలు రాలేదు. కథలు వెనక్కి తిరిగి వచ్చినప్పుడల్లా.. నేను నిరాశ పడేదాన్ని. అయినప్పటికీ కథలు రాయడం మానలేదు. 

ముగింపు వాక్యం, నాన్నెప్పుడొస్తాడు, గీటురాయి, రస స్పర్శ, నీట చిత్తరువు కథలు తిరస్కరించిన కథలే! 

2020 లో  వొక్క కథ కూడా రాయలేదు. 

ఈస్తటిక్ సెన్స్ - Dr. గీతాంజలి భారతి

అరుణతార పత్రిక వారి వద్ద 6 నెలలు కాలం వుంది పరిశీలన లో. మెయిల్ పెట్టి నేనే వెనక్కి తీసుకున్నాను 

ఊహల మడుగు - Dr. శైలజ కాళ్ళకూరి

ప్రజాశక్తి స్నేహ, పాలపిట్ట, ఆంధ్రజ్యోతి తిరస్కరించాయి. 

వాతాపి జీర్ణం - పద్మజ సూరపనేని

ప్రజాశక్తి స్నేహ తిరస్కరించింది

రుణ బంధాలు - ఆర్.దమయంతి

 ప్రజాశక్తి స్నేహ తిరస్కరించింది

విముక్తం - పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి

ఆంధ్రజ్యోతి తిరస్కరించింది

ప్రేమే నేరమౌనా - రాధ మండువ

ఫేస్ బుక్ గోడపై ప్రచురించాను. 

పైడి బొమ్మ - శశికళ ఓలేటి

వెబ్ పత్రిక 4 నెలలు పరిశీలనలోనే వుంచింది. 

చిట్టిగుండె - ఎమ్ ఆర్ అరుణ కుమారి

విశాలాక్షి పత్రిక లో ప్రచురితం

కోకిల తల్లి - శాంతి ప్రబోధ వల్లూరి పల్లి

ఆంధ్రజ్యోతి తిరస్కరించింది. 

కుబుసం- అంజనీ యలమంచిలి.

అటా ప్రత్యేక సంచిక లో ప్రచురితం

ఈ అనుభవాల తర్వాత పత్రికలకు పంపడం మానుకున్నాను. 

దృశ్య భూతం - వారణాసి నాగలక్ష్మి

రెండు లక్షలు - శ్రీదేవి సోమంచి

చెరగని గీత - లక్ష్మి రాయవరపు

ఔనా - జ్వలిత దెంచనాల

పైన కథలన్నింటికీ సహ రచయితలు అడగగానే వ్యాఖ్యానం రాసారు. ఎవరూ ఈ కథలు బాగోలేదని మాట మాత్రం కూడా చెప్పలేదు. 

“విముక్తం” కథ ను మాత్రం పాలగిరి విశ్వ ప్రసాద్ రెడ్డి సూచన మేరకు సవరించాను. మూలం యే మాత్రం మార్చకుండా. 

R వసుధా రాణి గారు కుబుసం కథ కు వ్యాఖ్యానం రాయడానికి తిరస్కరించారు. అంజని యలమంచిలి గారు వ్యాఖ్యానం రాసి యిచ్చారు. 

బంగారు భూమి - సాహిత్య ప్రస్తానం వారి దగ్గర నాలుగు నెలలు వుంది. మెయిల్ పెట్టి నేనే వెనక్కి తీసుకున్నాను. అదే కథ.. 

బంగారు భూమి - బహుళ త్రై మాసిక పత్రిక లో ప్రచురింపబడింది. 

రంగు వెలిసిన కల - బహుళ త్రై మాసిక పత్రిక లో ప్రచురింపబడింది. 

ఇంకొక ప్రత్యేక సంకలనం కోసం కథ రాసాను. 

ఇకపై ఎవరైనా అడిగితే తప్ప కథ యివ్వను. నా అంతట నేను కథను పంపను. 

వీలును బట్టి డైరక్ట్ గా పుస్తకమే వేస్తాను. 

2023 లో 24 కథలతో “దుఃఖపు రంగు” కథా సంపుటి 

ప్రచురిస్తాను. 

సంఘటిత కు కవిత యిచ్చాను. సంకలనంలో నా కవిత వుంది. 

వీధి అరుగు లో ప్రచురించడానికి వారే కవితను యెంపిక చేసుకున్నారు. 

తెలుగుతల్లి వారు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ప్రచురించారు. 

వీరందరికీ ధన్యవాదాలు 🙏

పత్రికలకు కథలు పంపి  తిరిగొస్తే నేను నిరాశ పడలేదు.. యువ రచయితలు మీరెవరూ కూడా నిరాశ పడవద్దు. 

- రచనలు ప్రచురించిన వీరందరికీ 

నా రచనలు చదువుతున్న పాఠకులందరికీ  ధన్యవాదాలతో.. వనజ తాతినేని.





#ఈస్తటిక్_సెన్స్ #వనజతాతినేని

29, డిసెంబర్ 2022, గురువారం

స్త్రీ జాతికి విముక్తం

ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటిలోని “విముక్తం” కథ పై వ్యాఖ్యానం రాసిన పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలతో.. 
 'కాదేదీ కవిత కనర్హం' అని శ్రీ శ్రీ అన్నారు గానీ, కథకు కూడా ఏదీ అనర్హం కాదు - దేన్నైనా కథగా రూపొందించే నైపుణ్యం తగినంత అధ్యయనం రాసేవారికి వుంటే..వనజగారు రాసిన 'విముక్తం' కథలోని వస్తువు అరుదైనది. ఈకాలంలో ఇది అరుదైనదేనా?
అర్దనగ్నంతో అశ్లీలభంగిమల డాన్స్ లతో వున్న ఇప్పటి సినిమాలు, అరచేతిలో పోర్న్ వీడియోలు చూపించగల మొబైల్ ల ప్రభావంతో చాలామంది మగవాళ్ళ బుద్ధి వంకర తిరుగుతోంది - అందువల్ల అరుదైనదనీ చెప్పలేం.
'విముక్తం' లో కరుణ, ఆమె తల్లి సుగుణమ్మ, భర్త రాజు లు కథను నడిపించిన ప్రధాన పాత్రలు. రాజు తల్లిదండ్రులు, కరుణ పనిచేసే హాస్పిటల్ డాక్టరు కథకు సహాయక పాత్రలు.
కరుణ ఒక నర్సు. రాజు ఆసుపత్రి నిర్మాణంలో పనిచేసిన బేల్దారి. రాజును కరుణ ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. పెళ్ళాయ్యాక తెలుస్తుంది - రాజు ఒక సుఖవాసి అనీ, తాగుడు వ్యసనమైన వాడనీ.
కరుణ కాన్పుకు ఆమె తల్లి సుగుణమ్మ చేదోడువాదోడుకు వస్తుంది. రాజు కన్ను సుగుణమ్మ మీదపడి, ఆమె అక్కడున్న మూడునెలల్లో ఆమెను కబళించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఆమె లొంగదు. కూతురికి చెప్పదు. కరుణ తన మొగుడి దుర్నీతిని గ్రహించి మందలిస్తుంది. ఒకరాత్రి తాను పడుకొని వుండగా, రాజు లేచి వెళ్ళి పక్కగదిలోని సుగుణమ్మపై లైంగికహింస చేయబోతాడు. మెలుకువ వచ్చిన కరుణ మూలనున్న గొడ్డలితో నరుకుతుంది.
ఈ సంఘటన అరుదైనదేనా? కరుణ తన మొగుడిని నరకడమనే సన్నివేశం అరుదైనదే కావచ్చు. కథలోని ప్రధాన అంశం....??
కథలో రాజు తన భార్య తల్లిని(అత్త)ను కబలించాలని చూశాడు. సమాజంలో మరొకచోట మరొకరిని కావచ్చు. ఒకచోట పెళ్ళికాని మరదలి(భార్య చెల్లెలి)ని కావచ్చు, పెళ్ళై భర్త పోయిన వదిన(భార్య అక్క)ను కావచ్చు.
మగాడిలో ఇట్లాంటి దుర్నీతికి తమ ఆర్ధిక స్థాయిలేవీ అడ్డురావు. హైక్లాస్ కుటుంబాల్లో, లోక్లాస్ కుటుంబాల్లో అనే తేడా ఏముండదు. ఇదొక దుర్దమ మానసికరుగ్మత. తన తల్లిని కానీ, చెల్లెలిని కానీ, అక్కను కానీ తన భర్త అనేవాడు కబలించాలని చూస్తే ఆ బాధితురాళ్ళ వ్యధతో సమంగా ఆభార్యా వ్యధ పడుతుంది.
ఈ అంశాన్ని 'కథ' గా చేయాలనుకున్న రచయితను అభినందించాలి. ఇది సాధారణ 'కథాంశం' కాదు. మనోవిశ్లేషణతో కూడుకున్న క్లిష్టమైన అంశం. రచయితకు మనోవిశ్లేషణ సామర్థ్యం వుండాలి. పాత్రల మానసిక స్థితి స్వరూపాలు చదువరికి కనిపింపజేయాలి. అప్పుడే అది ఒక రిపోర్ట్(పోలీస్ రిపోర్ట్ లేదా న్యూస్ రిపోర్ట్) కాకుండా 'కథ'గా మారి అనుభూతి నిస్తుంది. అట్లని మనోతాత్వికతనంతా ఏకరువు పరిస్తే మనోవైజ్ఞానిక వ్యాసమయే ప్రమాదమూ వుంది. దాన్ని సమన్వయపరుచుకునే బాధ్యత రచయితదే.
ఈ అంశాన్ని 'కథ' గా రూపొందించడంలో వనజగారు సఫలమయ్యారు. పాత్రల మానసిక స్థితిస్వరూపాలను మనకు ఎరుకపరచడంలో  రచయిత సఫలం అయ్యారు కానీ  ఎక్కడో కొంత కొరత వుంది. రాజు దుర్మార్గంపై ఏవగింపు కలుగుతుంది. అదే సమయంలో కరుణ, సుగుణమ్మలపై సానుభూతి కలుగుతుంది. 
మగవాడి అహంకారానికి  దౌష్ట్యానికి గురవతున్న సమయంలో స్త్రీలందరూ సుగుణమ్మలా మానసిక బలహీనత ఆవరించి ప్రతిఘటించలేని స్థితిలో నైనా వుంటారు లేదా కరుణ లా ఆవేశంతో తెగింపుతో తమను తాము రక్షించుకోవాలన్న సృహలో ఆ పురుషుడిపై ఎదురుదాడి చేసి రక్షించుకోగల దైర్యాన్ని ప్రదర్శిస్తారు. 
ఈ కథలో కరుణలో తెగింపుతో పాటు ఇతరుల ప్రాణాలు చాలా విలువైనవన్న సృహ కల్గినటువంటి స్త్రీ అవటం మూలంగా.. ఆమె పై పాఠకుడికి వ్యతిరేక భావం ఏర్పడకుండా చక్కని వాక్యంతో కథను ముగించారు. అటవిక న్యాయం మానవ సమాజంలో సహజమైనదిగా చిత్రీకరించడం తగదని  రచయిత పాటించాల్సిన విచక్షణను బహుచక్కగా ప్రదర్శించారు. 
ఇటువంటి అంశాన్ని 'కథ' గా రూపొందించిన రచయితకు మనసారా అభినందనలు.
-పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి 


26, డిసెంబర్ 2022, సోమవారం

కథలో నాటకీయత

 కథ ను గూర్చి కొన్ని ఆలోచనలు.. 

రచయితల సృజనలోనూ ప్రపంచం లోనూ బలమైన వ్యక్తిత్వం వున్న పాత్రలు చాలానే వుంటాయి. 

కానీ బలమైన వ్యక్తిత్వం వుండి కూడా బలహీనతలు కూడా ప్రస్పుటంగా కనబడే కొన్ని పాత్రలు వుంటాయి. నిజం చెప్పాలంటే మూసపోసినట్టు వుండే పాత్రల పట్ల నాకు విముఖత. చక్కగా వున్న రచనలో  సహజంగా వుండే పాత్రలు కొన్ని లోపభూయిష్టంగా కనబడతాయి. నా రచనల్లో కూడా అలాంటివి వుంటాయి. అక్కడ అది రచయితగా నా ఫెయిల్యూర్ కాదు.బలవంతంగా పాత్రను లోపం లేకుండా సృజించలేను. (ఆ పాత్ర నన్ను ఆవహించి విరుద్ధంగా చేయనివ్వదు కూడా) మానవ సహజమైన లోపాలతో పాత్ర వర్ధిల్లాలని నా భావన. పాత్ర పరివర్తన చెందడం రూపాంతరం చెందడం రచయిత చేతిలో పనైనా సరే యెక్కువసార్లు దాన్ని అలా వొదిలేయటం మంచిది అనుకుంటాను. నాటకీయమైన త్వరితగతమైన కృతకంగా కనబడే మార్పు యెబ్బెట్టుగా వుంటుంది. పాఠకుడి గా అది నాకు విదితమే! పాఠకుడిని మరీ అమాయకంగా లెక్కించకూడదు. 

ఒక వుదాహరణ చెబుతాను. ప్రేక్షకులందరూ మెచ్చిన రుద్రవీణ చిత్రంలో సూర్యం(చిరంజీవి)  హీరో కాదు ఆ చిత్రంలో అసలైన హీరో బిళహరి శాస్త్రి(జెమినీ గణేషన్) అంటాను. నా దృక్కోణం అదే!  

జీవన నాటకంలో పాత్రలే వుంటాయి.. కేరెక్టర్స్ వుండవు.. అన్న వాక్యానికి అనుసరించి నేను రాసిన కథలన్నీ జీవన నాటకంలో పాత్రలే! 

 ఇంకా కల్పన లేని వాస్తవ జీవిత కథ చిగురులు లేని మోడు లాంటిదని.. ఓ రచయిత అన్నట్టు చదివిన జ్ఞాపకం. అది మరీ గుర్తుంచుకుంటాను. 

ఈ మధ్య నేను రాసిన “రంగుల కల“ కథలో ఆమె పాత్ర, ఆ కథలో వర్ణన యెక్కువైంది అని ఆమె పాత్రకు వ్యక్తిత్వం లేదని వొకరు అన్నారు. ఆ ఒక్కరు తప్ప కథను అందరూ మెచ్చుకున్నారు. 

ఆ వొక్కరి మాటను దృష్టిలో వుంచుకుని మళ్లీ సమీక్షించు కున్నాను. రచయితగా యే లోపం కనబడలేదు. మూర్తీభవించిన మంచితనం స్పష్టత వ్యక్తిత్వం వుండాలని ఆ వొక్కరు కోరుకుని వుండొచ్చు.ఆమె ట్వంటీ ప్లస్. ఆ వయసులో వుండేవారి విచక్షణా రాహిత్యమే ఆమెలో వుంది. . 

అలాగే “ఆమె నవ్వు” కథ లో కృష్ణ పాత్ర ను చూసి ఈమె యేమిటి యిలాంటి కథ రాసింది అన్నారట.. రచయితల కథలన్నీ పది పది కథల పుస్తకాలుగా వేసి కథను అమ్ముకునే రచయితల సంఘం యెడిటర్. మరి ఆయన యేం చదివారు యిన్నేళ్ళుగా యిన్ని కథలు చదివి అన్నాను. 

ప్రచురితం కాని యింకో కథ లో పాత్ర “నీలవేణి” పాత్ర ను కూడా నేను బాగా సమీక్షించుకున్నాకే ఆఖరి పేరా రాసాను. 

కథ రాసాక రివ్యూ చేసుకోవడం అవసరం. ఈ వాక్యం అవసరమా అని పదిసార్లు ఆలోచించుకోవాలని చెబుతారు. దయానిధి లా  పాత్ర అంతర్ముఖుడైతే.. పేజీలకు పేజీలు రాసుకుంటూ పోవడం చూసాం మనం. రచనల్లో యెక్కువ వర్ణనలు వుండటం “ఉత్తమ కథకుడు” అనిపించుకున్న వారి రచనల్లోనూ చూసాం. ప్రస్తుత కాలంలో పత్రికల్లో ప్రచురించే కథలకు నిడివి సమస్య బాగా వుంది. అది యెంత తగ్గితే అంత మంచిది అని భావిస్తున్నారు. కొత్త పాఠకులను అలాగే తయారుచేసుకుందాం అనుకుంటున్నట్టు వుంది. వెబ్ కథలు ఆ సమస్య లేకుండా స్వేచ్ఛ నిచ్చాయి. అన్ని కథలూ క్లుప్తంగా రాయలేం. ఒకోసారి రచయితకు వ్యామోహం యేదో చెప్పాలని. చదివే పాఠకుడికి విసుగు కల్గితే పక్కన పడేసేయవచ్చు. రామాయణం ని మూడు ముక్కలలో చెబితే కోపగించుకోవడం యెలాగో కొన్ని కథలు చదివినప్పుడు అలాగే కోపం రచయిత మరీ పిసినారి గా వున్నాడు అని. 

కొందరు ఆంగ్ల కథకులను ఉదహరిస్తారు. అది మరీ విచిత్రం. పత్రికలలో వచ్చే కొన్ని కథలు చదివినప్పుడు రచయితలు తమ వాల్ మీద ప్రచురించుకునే కథకు పెద్ద తేడా వుందని నాకు చాలాసార్లు అనిపించింది. పత్రికలు చదవడం మానేసాను. నిజాయితీ గల పాఠకుడు యెవరైనా  కథ బాగుంది అంటే అప్పుడు చదువుతున్నాను. ఇప్పుడు హాయిగా వుంది.  

ఒక కథ రాయాలనుకుంటే యెవరి అభిప్రాయమో కన్నా  మన కథను  మనమే బాగా సమీక్షించుకోవడం యెంత ముఖ్యమో అంత ముఖ్యం. అందుకే కథలు రాయటం తగ్గించి హాయిగా చదువుకుంటున్నాను. 

గుర్రపు డెక్క పూలు యివి. 👇




25, డిసెంబర్ 2022, ఆదివారం

మరపు పొరలు

కాలేజీ రోజుల్లో నేను మరీ అంత బాగా చదవకపోయినా పర్వాలేదు బాగానే చదువుద్ది అనే కేటగిరిలో వుండేదాన్ని. ఆటలు స్నేహితులు సినిమా పాటలు చిన్న చిన్న కవితలు యిలా  నా చుట్టూ సందడిగా వుండేది. ఎవరితోనైనా స్నేహం చేస్తే వారికి చాలా విలువనిచ్చేదాన్ని. నాకు వారు నచ్చకపోతే దూరంగా వుండేదాన్ని. అది యెంతలా అంటే వారనేవారు అసలు నాకు పరిచయమే లేదన్నట్టు. నచ్చితే వారు యెలాంటి వారైనా వారి ఇమేజ్ నా మీద పడి నన్ను వారిని వొకే గాట కట్టినా సరే వారి చెయ్యి వదిలేదాన్ని కాదు.అంతలా గాఢంగా వుండేది నా స్నేహం.


 స్నేహితులలో స్వార్థం కపటం నాకు నచ్చేవి కావు.నాతోపాటు చదివినవారిలో బాగా చదువుతారని ముద్ర పడిన యిద్దరు ముగ్గురు అలా వుండేవారు. వారిని నేను అసలు లక్ష్యపెట్టేదాన్ని కాదు. నా జూనియర్స్ కూడా నాతో స్నేహం చేసేవారు.ఇంటర్మీడియట్ లో వున్నప్పుడు కొందరు నాతో లవ్ లెటర్స్ రాయించుకునేవారు. నా రైటింగ్ బాగుంటుండదని ప్లస్ బాగా రాస్తానని.😅. అప్పటికే యద్దనపూడి నవలలు రాధాకృష్ణ సీరియల్స్ చదివినదాన్ని. యండమూరి కూడా పరిచయమే అన్నట్టు గుర్తు.


ఒకసారి వొకరికి లవ్ లెటర్ రాసిచ్చాను. ఆ లెటర్ అతనికి చేరకుండానే ఆమె పారేసుకుంది.అది యెవరికో దొరికింది. ఇంకేముంది..నేనే రాసాను అనుకున్నారు.నేను ఆ విషయాన్ని ముక్కు చీది పక్కన పడేసినంత తేలికగా తీసుకున్నాను. నా ఫ్రెండ్ నాతో లెటరు రాయించుకున్న అమ్మాయి అబ్బాయి కూడా నా ఆరవ తరగతి నుండి క్లాస్మేట్సే.ఇద్దరూ వొకే కులం. (ఒకటే కులం అని యెందుకు చెప్పానంటే పెళ్ళికి పెద్దలు అభ్యంతరం చెప్పరు అనే భావన వొకటి వుండేది) ఇద్దరూ బాగా చదివేవారు.కానీ ఆ అమ్మాయి యెవరినైతే యిష్టపడి లవ్ లెటర్ రాసిందో ఆ అబ్బాయి మా జూనియర్ తో పీకల్లోతు ప్రేమలో వుండి.. ఇంకో మూడేళ్లు కొనసాగిన తర్వాత ఆ అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే యితను బాగా మానసికంగా దెబ్బతిన్నాడు. ఎక్కడో వున్నత వుద్యోగంలో యిమడాల్సిన వాడు సొంత వూరిలో నిర్లిప్తంగా యేదో బతికి వున్నాం కాబట్టి బతుకుదాం అన్నట్టు వుంటాడు. అతన్ని యిష్టపడి లవ్ లెటర్ రాయించుకున్నమ్మాయి ఇంజినీరింగ్ చదివి జాబ్ చేస్తూ చక్కగా సెటిల్ అయింది.లవ్ లెటర్ అతనికి అందలేదని తెగ బాధ పడింది. కానీ వేరే అమ్మాయితో అతని లవ్ గురించి తెలిసాక పోతే పొయ్యాడులే సచ్చినాడు అని కళ్లు తుడుచుకుంటూనే వీడు కాకపోతే వీడిలాంటి అందగాడు నాకు దొరకడా అంది కసిగా. ఆ తర్వాత యెవరికీ లవ్ లెటర్ రాసివ్వలేదు. ఆ ఫ్రెండ్ తో అన్నాను. జీవితమే వొక ఆట. ఏ బాల్ కి యెవరు అవుట్ అవుతారో ఎవరు ఫోర్ సిక్సర్ కొడతారో అన్నాను.క్రికెట్ పిచ్చి వుండేది అప్పట్లో. రేడియోలో కామెంటరీ వినేవారిమి. వెంగ్ సర్కార్ భలే యిష్టం వుండేది నాకు. పేపరులో ఫోటో చూసేకేలెండి😂.


ఇప్పుడవన్నీ తలుచుకుంటే సిల్లీగా వుండవు. అక్కడ నుండే మన వ్యక్తిత్వాలకు బలమైన పునాది పడింది అనుకుంటాను. నేను బాగా చదువుకోనందుకు నాకు నేను క్షమాపణలు చెప్పుకోవడం వొక యెత్తైతే మా అమ్మకు క్షమాపణ చెప్పకుండా వుండటం మరింత క్షమించరాని విషయం. మేము బాగా చదువుకోవాలని మంచి భవిష్యత్ వుండాలని మా అమ్మ బలంగా కోరుకునేది. పిల్లలను ప్రెవేట్ కి పంపేది. ఆలస్యంగా అయినా మాకు కావల్సినవి అమర్చాలని తాపత్రయపడేది. కానీ యెందుకో మేము బాగా చదువుకోలేకపోయాము. మారిన ఆర్థిక పరిస్థితులు అప్పులు అవమానాలు వాటన్నింటి మధ్య నిబ్బరంగా నిలబడింది మాఅమ్మ. నేను  మా అబ్బాయి చదువు పట్ల బాగా శ్రద్ద తీసుకునేటప్పుడు మమ్మలను కూడా బాగా చదువుకోండి అని యింకొంచెం వొత్తిడి పెట్టి వుండొచ్చు కదమ్మా.. అనుకునేదాన్ని. అప్పటికే మా అమ్మ చనిపోయింది. జరిగపోయిన వాటి పట్ల యెంత విచారం వొలకబోసినా పెద్ద ప్రయోజనం వుండదు కదా! 


ఇదంతా యెందుకు గుర్తుచేసుకుంటున్నానంటే  మొన్నీమధ్య బాల్య స్నేహితురాలు పలకరించింది ఫోన్ లో. తను యెంతకూ గుర్తు రాలేదు. వాళ్ళ యిల్లు యెక్కడో చెపితే అప్పుడు లీలగా గుర్తొచ్చింది. ఆ స్నేహితురాలు మా అమ్మను యెంత గుర్తు చేసుకుందో! ఆ స్నేహితురాలు 1990 లేదా 1991 లో తను నన్ను పరమర్శించడానికి హాస్ఫిటల్ కు కూడా వచ్చానని చెబితే అసలు తనను నేను యెలా మర్చిపోయాను అని ఆలోచించాను. కొంతమంది పదవ తరగతి పూర్తి కాకుండానే గృహిణి లు అయ్యారు. కొంతమంది బాగా చదువుకుని మంచి వుద్యోగస్తులు అయ్యారు. 


ఇంకా తనేం చెప్పిందంటే నువ్వు రాసిన కథలు కవిత్వం చదివేదాన్ని నేను. 4 th బెంచీలో కూర్చునే వాళ్ళం మనం అని చెప్పినా గుర్తు రాలేదు. 🥲ఎందుకు మర్చిపోయాను అని తెగ ఆలోచించాను. ఒకసారి లాగి వొక చెంపదెబ్బ కొట్టాను. బాగా యేడ్చావు, చాలాసేపు యేడ్చావ్, నీ తప్పు యేం లేదు నేనే యెందుకో కొట్టానో అంది. ఎంత సహృదయులు స్నేహితులు. ఊరికే కొట్టాను అని అని చెప్పింది యిన్నేళ్ళ తర్వాత కూడా. 


నాకు కొంతమంది పేర్లు రూపం కూడా గుర్తులేదు. కానీ వొకటి రెండు నొచ్చుకున్న విషయాలు అందువల్ల వారితో అస్సలు మాట్లాడని విషయాలు గుర్తున్నాయి. అవి యివీ కలబోసుకోవాలి. 


మా అన్నయ్య యీ నెల లోనే స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ మీట్ కి వెళ్ళివచ్చాడు. వెళ్ళి వచ్చాక విశేషాలు చెబుతుంటే నేను మూడొంతులకు పైగా క్లాస్మేట్స్ ను గుర్తుచేసుకున్నాను. అప్పుడు మా వదిన అంటుంది నన్ను వుద్దేశించి. “నువ్వు టకటక గుర్తుచేసుకున్నావు అందరినీ, మీ అన్నయ్యకు యెవరూ గుర్తులేరంట” అంది. ఇప్పుడిక్కడ కొంతమంది జూనియర్స్ నా ఫ్రెండ్ వొకరు Facebook friends లిస్ట్ లో వున్నారు కూడా. వారంతా యిది చదువుతారని ఆశిస్తాను. 


జ్ఞాపకం వున్నంత మాత్రాన వారందరూ మన మనసుకు దగ్గరైన వారూ అయి వుండరు. జ్ఞాపకం లేనంత మాత్రాన వారు పరాయి వారు అయిపోరు. రక్తసంబంధీకులే పరాయి అయిపోతున్న రోజులివి. తోడబుట్టిన అనుబంధాలనే తుడిచేసుకునే కాలం యిది. ఎవరో ఆట మొదలెడతారు. అది వేరొక చోట ముగుస్తుంది.. అంతే! 


మరొకసారి యింకొన్ని ముచ్చట్లు.. ఈ మొక్కలను యెకరాలకు యెకరాలలో పండించేవారు.. మా కాలేజ్ కు మైలవరం నారాయణ ధియేటర్ మధ్య నిమ్మతోట మామిడితోటల వెనుక (పిచ్చి గన్నేరు రక్త గన్నేరు అనేవారు) పంటగా వేసేవారు. మేకలు పశువులు కూడా తినేవికావు. బిపి మందులు తయారు చేస్తారని చెప్పేవారు. నమ్మేసేవారిమి. ఇప్పటికి తెలియదు వీటి ప్రయోజనం. 😘







24, డిసెంబర్ 2022, శనివారం

ఋణ బంధాలు

ఈస్తటిక్ సెన్స్  కథాసంపుటిలో

 “ఋణ బంధాలు” కథకు ఆర్ దమయంతి గారూ వ్యాఖ్యానం రాసారు. వారికి ధన్యవాదాలతో 🙏


ఇవ్వడం మాత్రమే తెలిసిన చేతులకి రాగద్వేషాలుండవు..కరుణ తప్ప!' అని చెప్పిన కథ! - 'ఋణ బంధాలు'

 

"వాళ్ళతో నాకున్న పరిచయం, స్నేహం ఈనాటిది కాదు. కొన్నేళ్ళది. నేనంటే వాళ్ళకెంత మర్యాద, ఎంత మన్నన! గడపలోకెళ్తే  ఎంత ఆనందపడిపోతారంటే..'రండి..రండి! ఇవాళెంత సుదినం! మీ రాక మాకెంతో ఆనందం.."-  అంటూ అత్మబంధువులకంటే మిన్న గా ఆహ్వానిస్తారు. 'మనది జన్మజన్మల బంధమన్నంత..' ప్రాణం గా మాట్లాడతారు.  ఇదంతా నిజం గా నిజం. కానీ, ఎప్పటి వరకు అంటే - నాకివ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వమని అడగనంత వరకే!" - అని అంటాడు ఓ గొప్ప అనుభవజ్ఞుడైన రచయిత. ఇది అక్షర సత్యం. ఆ నగ్నసత్యానికి దర్పణం పట్టిన కథే - శ్రీమతి వనజ తాతినేని గారు రాసిన 'ఋణ బంధాలు' కథ.

మేలైన వ్యసనాలలో అతి ప్రమాదకరమైన వ్యసనం అంటూ ఏదైనా వుందీ అంటే, అది ఖచ్చితం గా - అడిగిన వారికి లేదనకుండా అప్పు లివ్వడం! కొని తెచ్చుకున్న మనో వ్యధ అంటూ ఏదైనా వుంటే..  తీసుకున్న వాడు, ఋణం చెల్లించకుండా పెట్టే బాధలు..ఇతరులతో చెప్పుకోలేక లోలోన కుమిలిపోవడం! ఆ టార్చర్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. జీవిత కాలం లో ప్రతి మనిషీ ఈ రకమైన అనుభవాన్నుంచి తప్పించు కోలేనివారే!

మనిషి కీ మనిషి కీ మధ్య ఆర్ధిక సంబంధాలు వుండొచ్చు కానీ,  స్నేహితులతో కానీ, అయిన వాళ్ళతో కానీ, రక్త సంబంధీకులతో కానీ పైసా తో కూడిన లావాదేవీలకు దూరం గా వుంటం వల్ల బంధాలు నిలుస్తాయి. కథలో కరుణ కూడా సరిగ్గా ఇలానే అభిప్రాయపడుతుంది.

నీ డబ్బు నీ చేతిలో వున్నంత వరకే అది నీది. పరుల చేతి కిచ్చాక, అది ఇక పరాయిది..నీ సొమ్ము నీకు తిరిగి వచ్చే దాకా..దిగులే మరి.

- కాళ్ళు పట్టుకున్నాడని కరిగిపోయి, స్యూరిటీల మీద సంతకంపెట్టడం,   చేతులు పట్టుకున్నాడని..జాలితో కదిలిపోయి, తల తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చివ్వడం - ఆ పైన అతను అడ్రెస్ లేకుండా పోయాక దిగులుతో మంచమెక్కడం..ఇదంతా - సుఖాన వున్న ప్రాణాన్ని కష్టాల పాలు చేసుకోవడం వంటిదే. ఆదుకోబోయి, ఆపదల్లో చిక్కుకోవడం అంటే ఇదే మరి!

మిత్రుడు బాధల్లో వున్నాడని ఇంటి అవసరాలని కూడా పక్కకి పెట్టి దాచుకున్న మొత్తాన్నిఎత్తి ఋణమివ్వడం అంటే అది తనకి మించిన మంచితనం అవుతుంది. కాదు. తన జీవితాన్నే ముంచెత్తేస్తుంది. ఈ రకమైన జాలి ఖచ్చితం గా బలహీనతే! మంచి తనం కూడా నరాల బలహీనతే అని అందుకే అంటారు ప్రఖ్యాత రచయిత గోపీచంద్.  

' నీ స్నేహితునికి డబ్బిచ్చి అతన్నొక మతిమరపు మనిషిని  చేయకు.' అంటూ జోక్ పేల్చాడు ఓ అనుభవజ్ఞుడు.  నిజమే. అప్పు తీసుకున్న వాడికి తిరిగి ఇవ్వాలని గుర్తుండదు మరి.

అసలు అప్పులిచ్చి ఇన్ని అవమానాలు, బాధలు పడే కంటే అదే మొత్తాన్ని శక్తి కొద్దీ దానం గా ఇస్తే ఎంత శాంతి గా వుంటుంది! ఇటు ఇల్లూ, అటు మనసూ, మనిషి కి  కూడా ఎంత ప్రశాంతం గా వుంటుంది! సరిగ్గా ఇదే గీతా బోధన చేస్తాడు, కథలో తల్లికి - ఆ కుమారుడు. ఈ రోజుల్లో యువకులు ఎంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు, ఎలా ముందు జాగ్రత్తలు తీసుకుంటారో చెప్పడానికి కథలో ఇతని పాత్ర ఓ నిదర్శనంగా పేర్కొనాలి.

ఇదొక వైనం అయితే, మనిషి ని నమిలేసే మరో ఋణ బాధేమిటంటే..

ఎవరికైనా పైసా బాకీ వున్నా, తీర్చే దాకా నిద్ర పట్టని అస్థిమితం తో కొట్టుమిట్టాడటం.

కథలో సగ భాగం - అప్పులి చ్చి ఆగమైన వారి సంగతైతే, మిగిలిన సగ భాగం, బాకీ తీర్చడం కోసం పరుగులు తీసిన ఓ నిజాయితీ పరురాలి కథనం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది.  

ఈ రండ సమస్యల ఘర్షణా సంఘర్షణల మధ్య నలిగిన ఓ మంచి మనసున్న మగువ కథ - ఋణబంధాలు.

కూరల బండి వాడి బాగు కోరి అప్పు ఇస్తుంది - కరుణ. అతను తనకివ్వాల్సిన డబ్బుని తిరిగివ్వకుండా మాయమైనప్పటి బాధ కంటేనూ, తను అతనికివ్వాల్సిన చిన్న మొత్తాన్ని చెల్లించడం కోసం పరుగుపరుగున మరీ వెదకి పట్టుకుంటుంది. చివరకి ఆ మొత్తాన్ని అతని చేతికందించి, గుండెల మీదున్న కొండంత భారాన్ని దింపుకుని, హాయిగా నిట్టూర్చుతుంది.  

చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ మంచి గుణాన్ని చూస్తాం. వాళ్ళకి అప్పు అంటే భయం. పైసా బాకీ వున్నా సరే, తీర్చే దాకా నిద్రపట్టదు. తిరిగి ఇచ్చే దాకా మనసుకి చెయిన్ పట్టదు.  

కథలో కరుణ కున్న ఈ పాటి నీతి నిజాయితీలు - వేల కోట్లు అప్పులు చేసి, విదేశాలకు పారిపోయిన బడా దొంగలకు వుంటే ఎంత బావుణ్ణు కదా అనిపిస్తుంది.  

వాస్తవ సంఘటనలని ఆధారం గా చేసుకుని, వినూత్నమైన కథాంశంతో సహజ రీతిలో, తనదైన శైలిలో, కథని రక్తి కట్టించారు - రచయిత్రి. కథ ఆసాంతం ఆసక్తి కరం గా చదివించారు.

సంభాషణలో వినోదం వుంది. దాని వెనకే విషాదమూ దాగుంది.   మనిషి అసలు నైజాన్ని చాటుతూనే, తస్మాత్ జాగ్రత్త సుమా అనే విలువైన సందేశాన్ని కూడా అందచేస్తుంది -కథ.

'ఈ కథ నా కథ లా వుందే చెప్మా!' అని ప్రతి పాఠకుడునీ తన రచనలో   నిమగ్నం చేస్తూ కథ రాయడం రచయిత్రి రచనా ప్రతిభకి ఓ తార్కాణం అని చెప్పాలి.

వనజ గారి కలం నుండి మరెన్నో వినూత్న కథాంశాలతో కూడిన మంచి మంచి కథలు రావాలని, రాయాలని మనసారా కోరుకుంటూ, మరిన్ని కథా సంకలనాలు వెలుగు చూడాలని ఆశిస్తూ..


శుభాభినందనలతో..

ఆర్.దమయంతి.



22, డిసెంబర్ 2022, గురువారం

218 వ నెంబర్ బస్

 ఈ బస్ మా వూరికి మొక్కుబడిగా వస్తూ వుంటుంది. ఇప్పుడే కాదు 35 యేళ్ళ నుండి యిదే తంతు.  ఇటీవల ఒక కథ రాస్తూ.. ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళాను. 

మా వూరు కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం కుంటముక్కల. నా చిన్నప్పుడు (బహుశా అప్పుడు నాకు పదేళ్ళు వుండవచ్చు). మా వూరికి వెల్లటూరుకు మధ్య మాగాణి పొలాల మధ్య నుండి R&B రోడ్ శాంక్షన్ అయింది. భూ సమీకరణ జరిగింది.తతిమా  రైతులందరూ అంగీకరించినా మా పెద్దతాత కుమారుడు తన భూమి ని యివ్వకుండా మోకాలడ్డు వేసారు. ఆ రోడ్డు మార్గం యిలా. (మైలవరం - కుంటముక్కల - వెల్లటూరు- వెలగలేరు- విజయవాడ) 

మా వూరికి లోపలికి రావాలన్నా బయటకు వెళ్ళాలన్నా వొకేదారి. మరో మూడు దారులు బండ్ల బాటలు పొలాల మధ్య నుండి చెరువు కట్టల మీదగా వెళ్ళాల్సివచ్చేది.

1984 కి ముందు చదివిన మేమంతా గూడు రిక్షా యెక్కి వెళ్ళే వాళ్ళం. అందులో ఆరుగురు కూర్చుని వెళ్ళేవాళ్ళం.  రిక్షా అతను ఉదయం 09:30 కల్లా స్కూల్ దగ్గర దించేసి సాయంత్రం 04:30 కి మైలవరం సెంటర్ లో యెక్కించుకునేవాడు. రిక్షా అతని టైమ్ టేబుల్ అదే! పరీక్షల సమయాలు మార్పులు అతనికి యే ప్రమేయం వుండనట్టు వుండేవాడు. ఏ తరగతికి యెప్పుడు పరీక్ష అయినా.. పొద్దున్నే అందరూ కలిసి వెళ్ళాల్సిందే అందరూ కలిసి తిరిగి రావాల్సిందే!. ఏ మాత్రం ఆలస్యం అయినా యెవరి తిప్పలు వారివే. అన్ని తిప్పలు పడి యిల్లు చేరితే  అక్కడ మందలింపులు మొట్టికాయలు. 

నేను టెన్త్ క్లాస్ లో వున్నప్పుడు మా నాన్నగారి స్నేహితుడు వారింట్లో మూడు నెలలు ఆశ్రయం యిచ్చారు. వారింట్లో వుండి ట్యూషన్ కి స్కూల్ కి వెళ్లాను. నేను లెక్కలు లో పూర్. టెన్త్ క్లాస్ లో ఉదయం 05:30 కి లేచి రెడీ అయి మూడు కిలోమీటర్లు నడిచి విజయవాడ తిరువూరు రోడ్ లో మా వూరి అడ్డరోడ్డు దగ్గరికి 06:20 కల్లా చేరుకుని విజయవాడ నుండి మైలవరం తిరువూరు వెళ్ళే ప్యాసింజర్ బస్ కోసం యెదురుచూపులు. ఆ టైమ్ లో వొకే వొక ప్యాసింజర్ బస్ వుండేది. ఇంకో రెండు ఎక్స్ ప్రెస్ బస్సులు. జగదల్ పూర్ ఎక్స్ ప్రెస్ వొకటి భద్రాచలం ఎక్స్ ప్రెస్ వొకటి. ప్యాసింజర్ బస్ ఆలస్యం అయినా ముందే వెళ్ళిపోయినా మెటాడోర్ వేన్ లు తిరిగేవి.అవి యెక్కి మైలవరం సెంటర్ లో దిగి ట్యూషన్ కి పరుగు. కన్నుకనబడని మంచులో కూడా యెంత స్పీడ్ గా నడిచి వెళ్ళేదాన్నో వొంటరిగా. ఈ విషయాలన్నీ విని మా నాన్న స్నేహితుడు ఉమా గారు అమ్మాయిని  అంత కష్టపెట్టటం యెందుకు? ఆడపిల్లలు వొంటరిగా అంత పొద్దున్నే అలా  రావడం కూడా యెందుకు? మా ఇంట్లో వుంటుంది లే! అన్నారు. అలా మూడు నెలలు వారింట్లో వుండి బండి రామారావుగారి ట్యూషన్ కి వెళ్ళి చదువుకున్నాను. ఆ పిన్ని పేరు విజయ. అమ్మలా ఆదరించింది. ఆమె చెల్లెలు స్వర్ణ. తెల్గగా అందంగా వుండేది. నా క్లాస్మేట్. ఇద్దరం కలిసి స్కూల్ కి ట్యూషన్ కి వెళ్ళేవాళ్ళం.  టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు రావడానికి వారి ఆశ్రయం కారణం.

నేను పద్నాలుగేళ్లకే పదవతరగతి పరీక్షలు రాసాను. నేను మా అన్నయ్య వొకే క్లాసు. తర్వాత ఇంటర్మీడియట్ లో  లెక్కలు రావని భయపడి డాక్టర్ చదవాలనే కలలు వుండి  బై పి సి తీసుకున్నాను.  కానీ  నాకు ఫిజిక్స్ అర్థమయ్యేది కాదు.ఎంత చదివినా వచ్చేది కాదు.కాలేజ్ అయ్యాక ట్యూషన్ కి వెళ్దామంటే.. నాతో పాటు రిక్షా లో వచ్చే మిగతా  ఐదుగురు నా కోసం వేచివుండరు. ట్యూషన్ అయ్యాక ఏడు గంటలకు  మా వూరికి రిక్షాలు తక్కువ వుండేవి. ఆడపిల్ల గనుక  అమ్మ భయాలు అమ్మవి.అలా ఆ సబ్జెక్ట్ లో వీక్ అవడం మూలంగా ఇంటర్మీడియట్ అంతా పూర్తైనా మొదటి సంవత్సరం ఫిజిక్స్ అలా వుండిపోయింది. 

పల్లెటూర్లకు బస్ సౌకర్యం లేకపోవడం మూలంగా ఆడపిల్లల చదువుకి ఉద్వాసన తప్పదు. మా వూరికి బస్ సౌకర్యం వుండి వుంటే విజయవాడ వరకు పంపి కూడా చదివించేదాన్ని అనేది మా అమ్మ. చదువులేక ఖాళీగా వుంటే పెళ్ళి ప్రయత్నాలు అనివార్యం.ఏడాది తర్వాత పెళ్ళి గండం బారిన పడ్డాను నేను. చదువుకోవాలని బాగా కోరిక వుండేది. అప్పుడే ఆటలు పాటలు స్నేహితులు తగ్గించుకుని వొళ్ళు దగ్గర పెట్టుకుని శ్రద్దగా ఆ ఫిజిక్స్ చదువుకుంటే బాగుండేదని తర్వాత కాలంలో చాలాసార్లు అనుకున్నాను విచారపడ్డాను. 

కొన్ని జ్ఞాపకాలు మధురంగానూ బరువుగానూ వుంటాయి.  కొందరి రుణం యేమిచ్చినా తీర్చుకోలేము. ముఖ్యంగా విజయ పిన్ని. ఆమెను విజయ గారూ అని పిలిచేదాన్ని. కూటి రుణం కథ చదివినప్పుడు ఆమె యెందుకో అప్రయత్నంగా గుర్తుకొచ్చింది. ఆమె కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లో హైదరాబాద్ లో ఇరుక్కొని లాక్ డవున్ తర్వాత మైలవరం రావడానికి కారులో ప్రయాణిస్తూ యాక్సిడెంట్ లో మరణించారు. ఆమెను కడసారిగా చూడాలని నా మనసు యెంత కొట్టుకుందో!  కానీ వెళ్ళలేకపోయాను. ఓ మంచి మనిషి కోసం కాసిని కన్నీళ్ళు వొంపాను తప్ప ఆ రుణం తీరేది కాదు. 

*******

బస్ గురించి.. 

 మొట్టమొదటసారి మా వూరికి బస్ వచ్చింది 1984 అనుకుంటా. సరిగ్గా గుర్తు లేదు. మైలవరం ఎమ్మెల్యే జేష్ఠ రమేష్ బాబు సొంత వూరు కాబట్టి బస్ రావడం అనే అదృష్టం దక్కింది లేదా మా వూరు ఆ మాత్రం పుణ్యం జేసుకుంది అనుకునేవారం. 

ఇబ్రహీం పట్నం డిపో బస్ వొకటి విజయవాడ-మైలవరం సర్వీస్ లో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కేవలం మూడు సార్లు మాత్రం అదీ మైలవరం స్కూల్ కి కాలేజ్ కి వెళ్ళే పిల్లలను మైలవరం జేర్చటానికి సాయంత్రం తిరిగి యింటికి జేర్చటానికి వీలుగా సర్వీస్ ను నడిపేది. విజయవాడ నుండి రావడానికి రెండుసార్లు విజయవాడ వెళ్ళడానికి ఒకసారి మైలవరం వెళ్ళడానికి రావడానికి రెండుసార్లు ఇలా లిమిటెడ్ ట్రిప్పులతో మా వూరికి బస్ సౌకర్యం వుందని చెప్పుకోవడానికి గొప్పగా నడిచేది. మధ్య మధ్యలో యెప్పుడు వచ్చేదో యెప్పుడు రాదో యెవరూ వూహించని మలుపులు. అలా మా వూరి పిల్లలు బడి కాలేజీ లకు వెళ్ళే ఆ బస్ రానప్పుడు మా వూరి అడ్డరోడ్డు వరకూ నడిచెళ్ళి రిక్షా లెక్కి సైకిలెక్కి వెళ్ళి చదువుకునేవారు. 

మేము చదువుకునేటప్పుడు లిటిల్ ప్లవర్ స్కూల్ అని ఒకే వొక ఇంగ్లీష్ మీడియం స్కూల్ వుండేది మైలవరంలో. కొన్ని కాన్వెంట్ లు వుండేవి కానీ అందరూ గవర్నమెంట్ స్కూల్ కే వెళ్ళేవారు. చుట్టుప్రక్కల ఇరవై కిలోమీటర్ల దూరంలో నుండి కూడా హైస్కూల్ కి కాలేజ్ కి వచ్చేవారు. 

మా తర్వాత పెరిగిన  పిల్లలందరూ బస్ ని పెద్దగా నమ్ముకోక ప్రెవేట్ స్కూల్ వెళ్ళే వారైతే స్కూల్ బస్ కి గవర్నమెంట్ స్కూల్ వెళ్ళే వాళ్ళైతే బస్ పాస్ తెచ్చుకుని ఆ వచ్చి రాని బస్ నే నమ్ముకొని యెలాగోలా చదువుకొని మైలవరం చదువు వొడ్డుని దాటేవారు.  తర్వాత విజయవాడ లేదా నూజివీడు గాని వెళ్ళి చదువు కునేవారు.  మా వూరి నుండి మైలవరం వెళ్ళే దారిలోనే లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్, మాంటిస్సోరి ఆధ్వర్యంలో నడిచే బి ఫార్మసి కాలేజ్.. (రోడ్డు నుండి కొద్దిగా లోపలికి గుర్రాజుపాలెం) ఏర్పడ్డాయి. ఆ కాలేజ్ లకు కాలేజ్ బస్ లున్నాయి.  తర్వాత లకిరెడ్డి హనిమరెడ్డి డిగ్రీ కాలేజ్ వచ్చింది. ఈ మార్పులు రావడానికి  20 to 25 సంవత్సరాలు పట్టిందేమో! 

ఎట్టకేలకూ కొద్ది సంవత్సరాల క్రితం మా వూరుకు వెల్లటూరుకు మధ్య  తారు రోడ్డు పడింది. అందుమూలంగా.. విజయవాడకి  కొండపల్లి ఇబ్రహీంపట్నం మీదగా ప్రయాణించకుండా మైలవరం to విజయవాడ (వయా వెల్లటూరు మీదగా) ఇరవై కిలోమీటర్ల తక్కువ దూరంతో చేరుకోవచ్చు. మేము మా వూరు యెప్పుడు వెళ్ళినా ఈ మార్గంలోనే ప్రయాణించి ఈ రోడ్ వేయడానికి పెద్దనాన్న అప్పుడే భూమి యిచ్చి వుంటే మన వూరు యెంతో అభివృద్ధి చెందేది. చాలామంది చదువుల పేరిట వుద్యోగాల పేరిట వూరు వదిలేసేవారు కాదు అని అనుకుంటాం.  నిజంగా చెప్పాలంటే మా వూరిలో వృద్ధులు తప్ప యెవరూ లేరు. మా తరం వాళ్ళంతా పట్టణాలలో వారి పిల్లలంతా విదేశాల్లో వున్నారు. మా బోటి వారికి బస్ తో పనిలేదు. కార్లలో తిరగడమే. 

కానీ వూరి పిల్లలు!!? 

ఇప్పుడు మా వూరు పిల్లలు స్కూల్ బస్ లు ఆటోలు వ్యక్తిగత వాహనాలలో ప్రయాణించి వెళ్ళి చదువుకుంటున్నారు.  ఎప్పుడూ ఆటోలు తిరుగుతుంటాయి. కానీ  నా బోటి వారు వూరికి సడన్ గా వెళ్ళాలంటే కారు లేకపోతే బోలెడు కష్టం. ఇప్పటికీ మా వూరికి సరిగా బస్ నడవదు. ఏదో కంటితుడుపు గా వస్తూ వుంటుంది. విజయవాడ నుండి మా వూరి అడ్డరోడ్డు దగ్గర దిగడానికి ప్రయాణించే సమయం కన్నా అక్కడ నుండి వూర్లోకి ప్రయాణించే మూడు కిలోమీటర్లు దూరం ప్రయాణించి యింటికి చేరడానికి రెట్టింపు సమయం పడుతుంది. అంత ఇబ్బంది. మైలవరం వెళ్ళి ప్రత్యేకంగా ఆటో కట్టించుకుని రావాలి. అడ్డరోడ్డు దగ్గర ఆటో ఆగినా యెక్కించుకోరు. 

మా వూరుకు మంచి రవాణా సౌకర్యంలేదు అని బాధపడటమే మిగులుతుంది. వచ్చే బస్ సమయానికి రాదు. బస్ ను నమ్ముకుని ప్రయోజనం లేదని అందరూ ఆటోలను నమ్ముకుంటారు. ఆ ఆటోలు సీరియల్ లో తీయాలి. అవి నిండితే కానీ కదలవు. అందరూ తలో దారి చూసుకున్నాక వచ్చే బస్ కు ఆక్యుపెన్సీ వుండదు. ఆ కారణం చూపి సర్వీస్ రద్దు చేస్తారు. మా వూరికే కాదు చాలా వూర్లు ది యిదే పరిస్థితి. 

ఇదంతా యెందుకు రాసానంటే యీ నాటికి బస్ సౌకర్యం లేని వూళ్ళు యెన్నో! ఆ మారుమూల ప్రాంతం నుండి  కష్టంతో బయటకు నడిచివొచ్చి శ్రద్దగా పట్టుదలగా చదువుకున్న వారెందరో! వారి కష్టం సిటిలో పుట్టి పెరిగిన వారికి తెలియదు. అందుకే పల్లెల్లో పుట్టి రవాణా సౌకర్యం లేని పిల్లలకు పరీక్షల సమయంలోనూ  ఆశ్రయం ఇవ్వడం ఆతిధ్యం ఇవ్వగల్గితే బాగుండును అనుకుంటాను నేను. మా ఇంట్లో వుండు అని భరోసా యిస్తాను కూడా. ఉన్నవాళ్ళు వుంటారు. లేనివాళ్ళు లేదు. 

ఒక కథ రాస్తూ యిదంతా గుర్తు చేసుకున్నాను. స్త్రీ విద్యకు చేయూత నివ్వడం చాలా అవసరం. ఇప్పుడు డబ్బు పెట్టగల్గితే వసతి గృహాలు చాలా వున్నాయి. కానీ ఆర్థికంగా బలహీనంగా వున్నవారికి .. ఏం చేయగలం!? ఆడపిల్లలు చదువు ఆగిపోవడానికి అనేక కారణాలలో రవాణా సౌకర్యం లేకపోవడం వొకటి. 

ఇంకో భాగంలో మరికొన్ని. …



20, డిసెంబర్ 2022, మంగళవారం

తెలుగు తల్లి కెనడా పత్రిక - ముఖాముఖి

 డిసెంబర్ 2022 తెలుగుతల్లి కెనడా మాస పత్రిక నిర్వహించిన ముఖాముఖి…లో   రచయిత గా నా అంతరంగం.

మౌనంగానే ఎదగమనీ

-నిర్వహణ: లయన్ విమలా ప్రసాద్ గుర్రాల

తెలుగు నేలలో ప్రముఖులైన కవులు, రచయితలు, నటులు ఇతర రంగాలలో ప్రతిభావంతులు ఉన్నారు. వీరందరూ తెలుగు జాతికి ఎనలేని సంపదలు. ఒకరొక్కరుగా వారి అంతరంగాన్ని పరిచయం చేసే ప్రయత్నం ఇది.

శ్రీమతి వనజ తాతినేని తో ముఖాముఖి

శ్రీమతి వనజ తాతినేని రచయిత్రి / కవి / బ్లాగర్. నివాసం తాడిగడప. విజయవాడ. "వెలుతురు బాకు" కవితా సంపుటి "రాయికి నోరొస్తే" "కులవృక్షం" "ఈస్తటిక్ సెన్స్" కథా సంపుటాలు వెలువరించారు. తన రచనలు https://vanajavanamli.blogspot.com లో భద్రపరిచారు. తెలుగుతల్లి కెనడా అడిగిన ప్రశ్నలకు వారి సమాధానాలు చూద్దాం...


1. మీరు సీనియర్ రచయిత..  సాహిత్యంలో కవిత్వం కాకుండా కథా ప్రక్రియ వైపే మీరు ఆకర్షితులవడానికి కారణం వివరిస్తారా?

జ:అప్పటికప్పుడు కల్గిన ఆలోచనను బట్టి కవితో కథో రూపుదిద్దుకుంటుంది.కథ వ్రాయడానికి  ఎందుకు ఇష్టపడతాను అంటే..ఆలోచనాత్మకమైన పాత్రల చిత్రీకరణ కు కథలో స్కోప్ ఎక్కువ వుంటుంది. కవిత్వంలో స్కోప్ తక్కువ.


2. రచయిత గా మీ జీవితంలో ఏదైనా మరిచిపోలేని విశేష సంఘటన చెప్తారా?

జ:  ఒక కథ రాశాక ఆ కథలోని పాత్రలు నా ముందు వాస్తవికంగా ప్రత్యక్షమైనపుడు చాలా ఆశ్చర్యపోయాను. ఆ కథ “పరస్వరం” లెస్బియన్స్ సహజీవనంలో వుంటారు.  అందులో ఒకామె బిడ్డలు కావాలనుకొని సరోగ్రసీ విధానంలో ఒక బిడ్డను కంటుంది.వారిరువురు  ఆ బిడ్డను పెంచుతూ వుంటారు. ఆ బిడ్డ పెరుగుతూ వుండగా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.బిడ్డను కన్న ఆమె ఆ బిడ్డను వొదిలేసి మరో స్త్రీతో వెళ్లిపోతుంది. Postmodern thoughts కథ రాసాను అనుకున్నాను. ఇటీవల అలాంటి పాత్ర పరిచయమైనపుడు ఆశ్చర్యపోయాను. అలాగే “లాస్ట్ మెసేజ్” “ త్వరపడి” కథలో  స్త్రీ పాత్ర లాంటి స్త్రీలు మన తెలుగు సమాజంలోనే కనబడుతున్నారు. రచయితలు తమ కాలానికన్నా ముందు జీవిస్తారు. వారికి ఆ పాత్రలు తారసపడతాయి. అదే విశేషం అండీ. 


3. కథా శైలి, శిల్పం విషయంలో మీ దృక్పథం వివరిస్తారా? 

జ: కథను బట్టి పాత్రల మనస్తత్వాన్ని బట్టి శిల్పం అదే రూపుదిద్దుకుంటుంది. ప్రత్యేకించి నేనెప్పుడూ శిల్పం మీద దృష్టి పెట్టి కథ రాయలేదు. నా శైలి నాకొక గుర్తింపునిచ్చింది. ఏ పాఠకుడు కూడా మీ కథ చదవలేకపోయాను అని అనకూడని విధంగా నా కథాశైలిని నేను రూపుదిద్దుకున్నాను. నా దృక్పథమే నా కథలు. 


4. రచనలు మొదలుపెట్టిన తొలిరోజులలో మీ అనుభవాలు/అనుభూతులు మా పాఠకులతో పంచుకుంటారా?

జ:కాలేజీ లో చదువుకున్నప్పుడు కొన్ని కథలు వ్యాసాలు వ్రాసాను. కాలేజీ మ్యాగజైన్ లో వ్యాసాలు వచ్చేవి.కథలు మాత్రం స్నేహితులు చదివేవారు. 1996 లో సీరియస్ గా కథ వ్రాసాను. పత్రికలకు పంపితే తిరిగొచ్చింది. ఆ కథ “జాతర”. ఇప్పటికీ అచ్చుతప్పులు దిద్దటం తప్ప ఒక్క వాక్యం కూడా మార్చని కథ అది. ఆకాశవాణిలో ప్రసారమైంది.సంవత్సరానికి రెండో మూడో వ్రాసి పత్రికలకు పంపి అవి ప్రచురణకు నోచుకోకపోతే నిరాశపడి చించేసేదాన్ని. బ్లాగ్ రాయడం మొదలెట్టాక వేలమంది చదువుతున్నారని తెలిసాక విరివిగా రాయడం మొదలెట్టాను.


5. గురువు అని కాకుండా మీకు రచనకు స్ఫూర్తి నిచ్చిన వారెవరు 

జ: ఓల్గా గారు. 


6. మీకు బాగా సంతృప్తి నిచ్చిన రచన/విమర్శ..  మరింత బాగా రాస్తే బాగుండేది అనుకున్న రచన/విమర్శ ఏదైనా ఉందా?

జ: నిడివి ఎక్కువైన కథలను చూసినప్పుడు ఆ కథలను కుదించవచ్చు అనిపిస్తూ వుంటుంది తప్ప మూల కథను మార్చి రాయాలి అన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు. 100% నా కథలన్నీ నేను ఇష్టంగా రాసినవే! దిద్దుకునే పొరబాట్లున్న కథలు నేను రాయలేదు. 


7. ఏ సాహిత్యానికైనా ప్రయోజనం అనేది ఉండాలని కొందరంటారు..మీరేమంటారు?

జ: సాహిత్యానికి ప్రయోజనం వుండాలి. కాల్పనిక సాహిత్యం చదవడానికి ఆసక్తిగా వుంటుంది. కాని దాని ప్రాభవం కొన్నాళ్లే! సాహిత్యం రసానుభూతిని కల్గిస్తూనే ఆలోచనలకు తావివ్వాలి.ఏదో ఒక సందేశాన్ని ఇవ్వాలి. ఇవేమీ లేనిది సాహిత్యమే కాదు. 


8. ఏదైనా  రాయాలి అని తపన పడి కుదరని అంశం ఏదైనా ఉందా?

జ: చాలా ఉన్నాయి.కొన్ని తపనపడి కూడా రాయలేము. భవిష్యత్ లో ఏదో ఒక కథలో పాత్రలకు ఆ అంశాలు వొనగూడతాయి.


9. కథలకు  మంచి పరిచయాలు కూడా వ్రాసారు.  ఆ విధంగా మీ కథా రచనకు మెరుగులు దిద్దుకునే అవకాశం లభించిందని భావిస్తున్నారా?

జ: ఇతర రచయితలను చదవడం ఒక ఎడ్యుకేషన్. వారు ఏమేమి పొరబాట్లు చేసారో మనకు స్పష్టంగా తెలుస్తుంది. వారు రాయలేనివి వొదిలేసినవి మనం రాయొచ్చు. పూర్వ రచయితలను శ్రద్ధగా చదువుతాను.వారిని అనుసరించను అనుకరించను కానీ మన శైలిలో వాళ్లు నిగూఢంగా వుంటారు అని గమనించాను.


10. మంచి సాహిత్యానికి గుర్తింపు పాఠకుల బాధ్యత అవునంటారా/కాదంటారా

జ:పాఠకుల బాధ్యతేనండీ. సంస్థలు మంచి సాహిత్యం అని పొగిడి బహుమతులు అవార్డులు రివార్డులు ఇచ్చినా నచ్చకపోతే పాఠకులు తిరస్కరిస్తారు. పాఠకుల అభిరుచికి విరుద్దంగా సాహిత్యం మనుగడ సాగించలేదు. 


11. మిమ్మల్ని అత్యధికంగా స్పందింపచేసిన పుస్తకం ఏదైనా ఉందా..ఉంటే మీ అనుభూతి నాలుగు మాటలలో చెప్పండి. 

జ: ఓల్గా “మానవి” నాకిష్టమైన నవల.అది నా జీవితాన్ని మార్చేసింది. ఎంత బావుంది అనిపించిన నవలలు “ఏకవీర” “Gone with the wind”

నమస్కారం విమల గారూ.. ధన్యవాదాలు.🙏


తెలుగు తల్లి కెనడా తెలుగు తల్లి కెనడా ఈ లింక్ లో పత్రికను చదవవచ్చు. 



19, డిసెంబర్ 2022, సోమవారం

చెక్కేసిన వాక్యం - విశ్లేషణ పరిచయం

 “వెలుతురు బాకు”  కవిత్వం చదివి అందులో “చెక్కేసిన వాక్యం” కవితను విశ్లేషించిన 

సి.హెచ్ సుశీల గారు. ధన్యవాదాలు మేడమ్! 🙏


  రాయి అనుకున్నది ఒకనాటికి రత్నమౌనులే అని నా కవితలు గురించి నేననుకునే మాట. …

అందుకు ఇదొక మచ్చుతునక అనుకుంటాను ఆత్మవిశ్వాసం వినమ్రత కలగలిపి. 

*********************

వనజ తాతినేని రాసిన "చెక్కేసిన వాక్యం" కవిత పై నా విశ్లేషణ "సాహో" మాస్ పత్రికలో -- డా. సిహెచ్. సుశీలమ్మ/

గుంటూరు. 


                 చెక్కేసిన వాక్యం


" దొరకాల్సింది ఎంతకీ దొరకదు

  వెనక్కి వెళ్లి మళ్లీ      వెతుక్కోవాల్సిందే

గంపెడుజ్ఞాపకాలను జల్లెడపడ్తూ అన్యమనస్కంగానైనా

వెతకాల్సిందే 

ఆచూకి చిక్కేవరకూ వెతకాల్సిందే ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి 

ఎక్కడ పారేసుకున్నానో

ఎంతకీ గుర్తుకు రావడం లేదు!"

       ... అంటూ జీవితాన్వేషణ చేస్తున్న కవయిత్రి వనజ తాతినేని. ఈ రచయిత్రి లాగా జీవిత కాలమంతా తనను తాను అన్వేషించుకొంటున్న  క్రమంలో కవితలు రాస్తున్నవారు బహు కొద్దిమంది అని చెప్పక తప్పదు. ఆ అన్వేషణ వనజ కవిత్వమంతటా కనిపిస్తూనే  ఉంటుంది. బాలిక గురించి రాసినా, యువతి గురించి రాసినా, గృహిణి గురించి రాసినా, తాను రాసే దాని పట్ల స్పష్టత ఉందామెకి. స్త్రీల జీవితాల్లోని కల్లోలాలని, వేదనా తరంగాలనీ, కన్నీటి బిందువులనీ  తన కవిత్వంలో అంతర్లీనంగా ప్రవహింపజేస్తారామె. ఇది కవయిత్రిగా, కథారచయిత్రిగా తన బాధ్యత అన్న భరోసా వాటిల్లో నిజాయితీగా తొంగిచూస్తుంది నిరంతరం.

        స్త్రీల జీవితాల్లోని సమస్యలు, సంఘర్షణ ఎందరో ప్రతిధ్వనింప జేసారు తమ రచనల్లో. స్త్రీలు కుటుంబంలో, సమాజంలో తమదైన జీవన సారాన్ని ఎంతగా పొందలేకపోతున్నారో, ఏమి కోల్పోతున్నారో తెలియజేశారు చాలా మంది. ఒక్క జీవితంలో ఎన్నో పాత్రలు పోషిస్తున్న స్త్రీ తన జీవనయానంలో ఎన్నెన్నో ఆలోచనలు... ఆటంకాలు... బహిర్గతం కానీ ఎన్నో కోణాలు... అంతర్గతంగా జరుగుతూనే ఉన్నాయి. అణిచివేతల పర్వాలు 'భారత'మంత భారమైనవి.

     స్త్రీలకు ఎదురయ్యే మరొక అరుదైన, తెరవెనుకటి అస్పష్ట  పార్శ్వాన్ని ఆర్ద్రంగా, ఆవేశంగా  వెల్లడించారు వనజ.

     స్త్రీల అణచివేత, ఆవేదనల గురించి తరచుగా వచ్చిన కవితలు "నీలిమేఘాలు" కవితా సంకలనం తో విస్తృతమై, ఉధృతమై స్త్రీ వాదం బలంగా వేళ్లూనుకుంది. స్త్రీవాద కవయిత్రులు తమ శారీరక మానసిక వేదనలన్నిటినీ వాదాలుగా  చేసుకొని, స్పష్టమైన గళంతో ఈ సమాజానికి తమ స్వరాన్ని వినిపించారు. కవితలు, కథలు, నవలలు రూపంలో నిస్సంకోచంగా ఆవిష్కరించారు. కానీ అలా అక్షరీకరించడానికి వారికి తగిన "సమయాన్ని" ఈ సంఘం, ఈ కుటుంబ వ్యవస్థ ఇస్తోందా? ఒకరు ఇచ్చేది ఏమిటి - అని తామే సమయాన్ని కల్పించుకో గలుగుతున్నారా! కాగితంపై కలం పెట్టడానికే ఎన్నో ఆటంకాలు! గుండెల్లో పెల్లుబుతున్న భావాన్ని కథగానో, కవితగానో రూపాంతరం చేయటానికి ఇంటి బాధ్యతలు అనుమతిస్తున్నాయా! తన చుట్టు అదృశ్యరూపంలో వేయబడ్డ సంకెళ్ళు తెగుతాయా! 

          అదిగో అలాంటి ప్రశ్నలు ఎందరో రచయిత్రుల మనసుల్లో సుళ్ళు తిరుగుతున్నాయి. ఒక్క వాక్యం రాయడానికి కూడా తీరికలేని వంటింటి చాకిరి గురించి వనజ తాతినేని రాసిన " చెక్కేసిన వాక్యం "  ఈనెల 'సాహో కవివర్యా' కవిత --


 Life is blended with Kitchen


"వాక్యాన్ని చెక్కుతుండగా 

కాఫీ ఇవ్వవే అంటావ్ 

అధికారం ధ్వనిస్తూ...

 నిమిషాల్లో బ్లెండెడ్ కాఫీ

 పొగలు కక్కుతుంది

 కానీ వాక్యం ఎక్కడికో జారుకుంటుంది నిస్పృహగా

 కలల బరువుతో ఈ రెప్పలు   బాధ్యతల బరువుతో ఈ రెక్కలు ఎన్నటికీ విచ్చుకోలేవని

 నిత్యం సరికొత్తగా అర్థమవుతాయి తడిచిన కళ్ళతో పాఠం నేర్చుకుని మరీ బోధిస్తాం

అమ్మలూ... వంటిల్లు స్త్రీలకి కిరీటం ఎప్పుడైనా తీసి పక్కన పెట్టుకో

భయపడకు

ఎవరూ ఎప్పుడూ దోచుకెళ్ళరులే  

పాకశాలలో చిక్కబడిందే

 స్త్రీల జీవితమని

 ఎప్పటికీ మారని నిర్వచనం ఎప్పుడో చెక్కేసిన వాక్యం కదా!"

       అనుదినమూ చాకిరీ తో సతమతమయ్యే స్త్రీల కష్టాలను ఏమాత్రం పట్టించుకోని భర్త వైఖరికి ఒక భార్యగా, రచయిత్రిగా స్త్రీ అంతరంగం లోని క్షోభ ఈ కవితలో ప్రకటితమౌతోంది.

         దారంట పోతూ ఉంటే ఓ  దురహంకారుడు ఆడపిల్లని అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్న దృశ్యాన్ని చూసినప్పుడు - బస్సులో యువతి శరీరాన్ని ఎవడో  అసహ్యంగా తాగుతున్న వైనాన్ని గమనించినప్పుడు - వీధిలోనో, బడిలోనో, పనిచేసే చోటో, ఏదో రూపంలో స్త్రీ మానసిక హింసకు గురవుతున్న విషయం తెలిసినప్పుడు - రచయిత్రి తన ఆవేశాన్ని, ఆవేదనని రచన ద్వారా వెల్లడించాలని కలం చేతిలోకి తీసుకున్నప్పుడే పతిదేవుడు ఆజ్ఞలు కురిపిస్తాడు. 

              ఆకాశములో గుంపులు గుంపులుగా మేఘాలు పరిగెత్తుతున్న అందమైన దృశ్యాన్ని తిలకించి ఏదైనా రాసేయాలన్నంత  ఆనందం, ఆహ్లాదం కలగలిసి  పెల్లుబుకుతున్నప్పుడు... పిల్లలో, గుమ్మం దాటి లోనికి వస్తున్న బంధువులో ఆమెకు బాధ్యతల్ని గుర్తుకు తెస్తారు. జల్లు జల్లు గా కురుస్తున్న వాన చినుకులు తన కళ్ళలో మెరుపుల్ని కురిపిస్తుంటే.... నేల నుంచి వస్తున్న మట్టి పరిమళం నాసికని తాకుతుంటే ... పరవశించిపోతూ ఏదో రాయాలని టేబుల్ కుర్చీ  దగ్గరకు నడుస్తున్న సమయంలో - వంటింట్లోని అంట్ల గిన్నెలు, మాసిన గుడ్డలు "మమ్మల్నేం చేస్తావ్" అని ప్రశ్నిస్తున్నప్పుడు మనసు ఉసూరు మంటుంది. నానేసిన పప్పు " నన్ను మెత్తగా మృదువుగా మార్చి, వండి, వడ్డించి, మంచి గృహిణి అనిపించుకో మరి" అని చాలెంజ్ చేస్తుంటే - ఏమి రాయాలి అనుకుంటుందో కూడా మర్చిపోతుందా రచయిత్రి.

     గబగబా పనంతా చేసేసి, అన్నం, పప్పు కుక్కర్ లో పెట్టేసి వచ్చి, హాయిగా అనుభూతుల్ని అక్షరీకరిస్తున్నప్పుడు  "విజిల్స్" వినిపిస్తే... "నేను ఆఫ్ చేస్తాలే" అని భర్త వంటింట్లోకి వెళ్తుంటే మనసు ఆనందంతో ఉయ్యాల జంపాల అవుతుంది కదా! మంచి మూడ్ లో ప్రపంచాన్ని మర్చిపోయి ఆలోచనల్ని రాసుకున్నప్పుడు డోర్ బెల్ మోగితే "నేను చూస్తాలే" అని భర్తో పిల్లలో వెళితే ఆ కవయిత్రి  కలం మరింత ఉత్సాహంగా ఉరకలు వేయదూ!

తన పట్ల, తన రచనల పట్ల శ్రద్ధ చూపే అలాంటి సన్నివేశం చాలా అరుదు. ఉద్విగ్న మనస్కయై  రాస్తున్న ఆమెకి పొగలు కక్కుతున్న వేడి కాఫీ తెచ్చి ఇచ్చే అందమైన దృశ్యం ఎప్పటికీ చూస్తాము! తన మనసులో, పెదవులపై మెరిసే చిరునవ్వు చూసి తృప్తిపడే కుటుంబ సభ్యులు ఉండే ఎంత ప్రశాంతంగా ఉంటుంది! తృప్తిగా ఉంటుంది!

          వనజ మొదట చెప్పినట్టు -  ఒక కవయిత్రి తనను తాను వెతుక్కుంటూ, తనను తాను మలుచుకుంటూ, తనను తాను వ్యక్తిత్వ శిల్పంగా చెక్కుకుంటూ పురోగమిస్తున్నప్పుడు.. ఇంట్లో వారందరూ విశాల దృక్పథంతో ఉంటే, తనకు ప్రాధాన్యత ఇస్తే... అదే కదా ఆమె కోరుకునే గౌరవం! ఆత్మగౌరవం! తనకు, తన కవిత్వానికి అబేధ్యం చెప్తూ ఆమె అన్న మాటలు చూస్తే నిజమేననిపిస్తుంది --

     " వాక్య గుచ్ఛం   

       ముడివిప్పితే

       విడివడిన అనేక పదాల్లో

       నిండిన భావన పరిమళమే

       నేను అనబడే నా

       కవిత్వం"!

               **   **    **

                                   




14, డిసెంబర్ 2022, బుధవారం

సౌందర్య హింస - ఈస్తటిక్ సెన్స్

 


ఈస్తటిక్ సెన్స్ కథకు వ్యాఖ్యానం అందించిన   - డా.గీతాంజలి భారతి గారికి ధన్యవాదములు .


తెలుగు సాహిత్యం లో  రచయిత్రుల పరిమితి స్రీవాద పరిమితిని దాటి సమాజంలో మానవ జీవితం చుట్టూ అలుముకున్న  అనేక సంక్షోభాలను కుల, మతతత్వాలు ,ప్రాంతీయ సమస్యలు మొదలుకొని , రైతుల దళితుల ఆదివాసీల జీవితాల మీద  ప్రపంచీకరణ ప్రభావం, పోస్ట్ మోడర్నిజం ., విప్లవోద్యమం  కథా వస్తువులుగా స్వీకరించి రాయడం మొదలై చాలా కాలం అయ్యింది. భిన్న అస్తిత్వాలకు, వర్గాలకు  చెందిన స్రీల విషయంలో పురుషాధిక్యత., గృహ హింస., అణిచివేత ,అవిద్య,  మూఢనమ్మకాలు ., స్రీల పునరుత్పత్తి హక్కుల మీద., సాంస్కృతిక., రాజకీయ.మానసిక ఆర్థిక కారణాలను విశ్లేషిస్తూ  కూడా చాలా సాహిత్యం వచ్చింది. స్రీల శరీరాల చుట్టూ అల్లుకున్న పురుష లైంగిక రాజకీయాల మిత్ ని బద్ధలు కొడుతూ స్రీలను చైతన్యవంతం చేసిన సాహిత్యం  చాలా వచ్చింది.  ఈ సాహిత్య ప్రభావం వల్ల పురుషాధిక్యత అనిచివేతలను ఎదిరిస్తూ హింసని ప్రశ్నిస్తూ..కుటుంబ హింసా వలయం నుంచి బయటకు వచ్చి తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకున్న స్రీలేందరో ఉన్నారు.. ఇంటి పని , వంట పని, రెండు పనుల ఆదనపు శ్రమ ,ఉత్పత్తి  , పునరుత్పత్తి విషయాల్లో జరిగే దోపిడీ గురంచి స్రీవాధులు విస్తృతంగా రాస్తూనే ఉన్నారు ఒక్క కథా రూపంలోనే కాదు కవిత్వం., నవలలు చాలా వచ్చాయి.అయితే మూసి వున్న పడక  గదుల్లో దాంపత్యం.,సంసారం,శృంగారం, సరసం పేర్లతో.,ముసుగుతో శ్రీల శరీరాల మీద నిశబ్దంగానో.. శబ్దం చేస్తూనో జరుగుతున్న  కనిపించీ., కనిపించని లైంగిక హింస గురించి ఇంకా మరింత సాహిత్యం రావాల్సి ఉంది.1990 సంవత్సరాల ముందు పాత తరానికి చెందిన  రచయిత్రులు ఫ్యూడల్ వ్యవస్థలోని పితృస్వామ్య హింసని..గృహ హింసని కథావస్తువు తీసుకునీ రాసినా..లైంగిక హింసని పెద్దగా తీసుకోలేదు. రచయిత్రుల వస్తువుల మీద పురుషు సమాజం లేదా  రచయిత్రుల కుటుంబాల్లో సెన్సార్ షిప్ ఉండేది.. కథా వస్తువు ఎన్నిక పట్ల పరిమితులు ఉండేవి. కానీ 1990 తరువాత ఈ పరిమితులు దాటి రచయిత్రులు ముఖ్యంగా స్రీవాదులు విస్తృతి పెంచుకున్నారు. స్రీల లైంగికత కి సంబంధించి భిన్నమైన అంశాలను ధైర్యంగా రాస్తూ వచ్చారు. ఇప్పుడు చాలా స్వేచ్ఛగా సెక్స్ & సెక్సువాలిటీ మీద గొప్ప , సమాజానికి కావలసిన కథలు రాస్తున్నారు.


అయితే ప్రస్తుత వర్తమాన కాలంలో  స్త్రీల సమస్యల మూలాలు పితృస్వామ్య భూస్వామ్య విలువల నుంచి వేళ్ళూనుకొని ఇప్పటి ఆధునిక కాలపు టెక్నాలజీతో వికృతంగా విస్తరించి మరీ ముఖ్యంగా వైద్యం, వ్యాపార మీడియా రంగాల్లో స్త్రీల మనశ్శరీరాలపై అత్యంత దారుణమైన పద్దతుల్లో అమానవీయ రూపాల్లో తన ప్రభావాన్ని చూపిస్తుంది. 


పితృస్వామ్యం పెట్టుబడీ మూలంగా కొనసాగే కార్పొరేట్ వైద్య వ్యవస్థ రెండూ కలసి స్త్రీల దేహాలను ఒక నిత్య హింసల కొలిమిగా మార్చిపడేసింది. స్త్రీలను ఒక లైంగిక వస్తువుగా చూసే దృష్టి ఈ ఆధునిక సాంకేతికత మరింత పెంచింది. అది అభివృద్ది, వెసులుబాట్లు ముసుగు వేసుకుని. ఈ టెక్నాలజీ ముసుగులోనే  స్త్రీలపై పురుషుల అణచివేత. అదే క్రమంలో స్త్రీల లొంగుబాటు అసంకల్పితంగా కొనసాగుతుంది. ఈ సర్ధుబాటు పెనుగులాటల్లో ఆధునిక స్త్రీ డిప్రెషన్ లాంటి మానసిక మనోలైంగిక వ్యాధులకు లోనవుతూనే స్త్రీల లైంగికతను, దేహాలను అణచివేసి లేదా తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాన్ని కుటుంబం రాజ్యం వ్యవస్థ తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి.


స్త్రీ పురుష సంబంధాల్లో దాంపత్య జీవితంలో లైంగిక హింస అనేది సంసారం శృంగారం సరసం పేరిట ఎన్నెన్ని మోసాలతో కుట్రలతో చొచ్చుకుపోతూ స్త్రీల దాంపత్య జీవితాల్లోని సంక్షోభాన్ని నింపడం గురించి తక్కువ సాహిత్యం వచ్చింది. ముఖ్యంగా స్త్రీల దేహాల్ని మార్కెట్ సరుకుగా మార్చాక, ఆధునిక వైద్య వ్యవస్థలో పురుషుడి ఆనందమే కేంద్రంగా మొదలైన స్త్రీ లైంగిక అవయవాల్లో యోని రొమ్ములు ముఖం పెదవులు ముక్కు నిర్మాణాల్లో  పురుషుడిని సంతృప్తి పరచటానికి కావాల్సిన ఖరీదైన సర్జరీలు వచ్చి చేరాయి. స్త్రీ శరీర కొలతలను ఆదేశించే పురుషుల యిష్టాల చుట్టూ స్త్రీల జీవితాలు మానసం పరిభ్రమిస్తూండేలా వైజైనో ప్లాస్టీతో  ఎక్స్ట్రా నాట్ యోని ద్వారానికి వేయించుకొని టైట్ చేయించుకోవడం భర్తను ఆనందపరచడానికి చిన్న రొమ్ములలో  ప్రమాదకరమైన సిలికాన్ ఇంప్లాంట్స్ వేయించుకుని శరీర కొలతలను కుదించుకోవడం  విశాలం చేసుకోవడం, దేహం అందం చుట్టూ తమ వ్యక్తిత్వాలను స్థంబింపజేసుకోవడం వైపుగా  స్త్రీల మీద ఒక వేట కొనసాగుతుంది. దీనికి తోడు పురుషులకీ వెసులుబాటు వున్నా స్త్రీల శరీరాల మీద జరిగే అనేక వైద్య చికిత్సా పద్దతులు.


రొమ్ము కేన్సర్ కి దారితీసే మాలా డీ హార్మోన్ ల వాడకం, సిజేరియన్లు,  హిస్టెరెక్టమీలు, మగపిల్లాడి కోసం ఆడపిల్లల్ని కంటూనే వుండే నిర్బంధ ప్రసవాలు లేదా అబార్షన్లు, రీ కానలైజేషన్ ఆపరేషన్లు అన్ని కోతలు కుట్లు స్త్రీల కేంద్రంగానే నిర్ణయించబడతాయి. స్త్రీలు, శరీరాలు-జీవితాలు ఈ పురుషాధిపత్య వ్యవస్థలో కార్పోరేట్ వైద్య వ్యవస్థలో ఒక ఎలుక-కుందేలు కప్పల్లా పరిశోధనకు వాడబడే ఎక్స్ పెరిమెంటల్ యానిమల్స్ గా చూడబడుతున్నాయి లేదా వాడబడుతున్నాయి. స్త్రీల లైంగికానందాన్ని నియంత్రించే లేదా పూర్తిగా ఆపివేసే జననాంగాలలోని క్లిటోరిస్ ని కట్ చేసేసే కృూరమైన సర్జరీ ఇప్పటికీ ముస్లిం సమాజంలో చాలా చోట్ల స్త్రీల జీవితాలని శాసిస్తుంది. స్త్రీలు బాహ్య జననాంగాలు లేకపోవడమే అందమూ-సౌశీల్యమూ ప్యూడల్ ఆదిమ పురుష సమాజానికి. కానీ అదే కొనసాగుతున్నది. స్త్రీల వ్యక్తిత్వాలను కుంచింపజేస్తూ పురుషుడి దైహిక అవసరాలకు అనుగుణంగా మార్చుకునే సర్జరీల చుట్టూ కోట్ల వ్యాపారం నడుస్తున్నది. లెక్కకు మించి కాస్మొటిక్స్ నించి రొమ్ములను పెద్దగా మార్చుకునే సిలికాన్ సర్జరీల వరకూ ముక్కును మార్చే రైనోప్లాస్టీ సర్జరీ నుంచి వెజైనా బిగువుచేసే హస్బెండ్ స్టిచ్ లేదా ఎక్స్ట్రా నాట్ వరకూ ఏది అందం?  పురుషావసరాలకు తగ్గట్టుగా తమ శరీర నిర్మాణాలను మార్చుకుంటూ కొత్త రూపాల్లోకి మారడమా లేదా తిరస్కరించి తమ వాస్తవ రూపాలని ప్రేమిస్తూ ఆత్మగౌరవంతో నిలబడ్డమా?  ఏది ఈస్తటిక్ సెన్స్!?


ప్రముఖ రచయిత్రి వనజ తాతినేని గారు తన ఈస్తటిక్ సెన్స్ కథలో ఈ వస్తువుని లోతుగా చర్చించారు. స్త్రీలతో ఈ సర్జరీలు చేయించి పురుష స్వామ్య వ్యవస్థను నిలదీసి ప్రశ్నించారు. తను సృజించిన మైథిలి పాత్ర ద్వారా ఆమె కొడుకు కోడలితో చేయించబోయే అకృత్యాన్ని నిరశించారు.

స్త్రీల నైనా పురుషుల నైనా aesthetic sense వైపు తరిమింది ఎవరు...వ్యవస్థ. స్రీలను కేవలం సెక్సువల్  ఆబ్జెక్ట్స్ గా మార్చి వ్యాపారం చేసుకుంటున్న ప్రపంచ మార్కెట్ ..ఆర్థిక వ్యవస్థ. కథలో ఈ రెండు అంశాల మీద చర్చ చేస్తూ అనేక ప్రశ్నలను సంధించారు రచయిత్రి వనజ గారు.


మైథిలి ఎమ్మెల్యే. తన ప్రాంతంలో  గిరిజన ఆదివాసీల హక్కుల కోసం కోసం పనిచేసే రాజకీయ కార్యకర్త కూడా. మైథిలి స్నేహితురాలి కూతురు ప్రియ. ప్రియ ఫ్రెండ్ పద్మ. ఈ ముగ్గురు స్త్రీలు కథలో ప్రధాన పాత్రలు. ముగ్గురిలో పూర్తి స్థాయి చైతన్యవంతమైన పాత్ర మైథిలి అందరికంటే వయస్సులో పెద్దది. సమాజంలో స్త్రీల స్థితి పట్ల స్పష్టమైన సైద్దాంతిక అవగాహన వున్నది. ప్రతిమాటా హక్కుల విలువల కోణంలోంచి మాట్లాడుతుంది. మైథిలి ప్రియ అమ్మ మంచి స్నేహితురాళ్ళు. ప్రియ తల్లి అందగత్తె. అదే శాపంగా మారి భర్త అనుమానంతో వేగ లేక భర్తతో విడిపోయి ఒంటరి స్త్రీ గా ప్రియ ను కష్టపడి పెంచుతుంది. ప్రియ కు తన తల్లి పట్ల అపరిమిత ద్వేషం. ఎందుకంటే ఆమె తను అందగత్తెనని గర్వం. 

తన కూతురికి తన అందం రాలేదని ఎద్దేవా చేస్తుంటుంది. తనను బాడీ షేమింగ్ చేసే తల్లిని మించిపోవాలని ప్రియ రెండు రైనోప్లాస్టీ సర్జరీలు డెంచర్ సర్జరీ చిన్ని గడ్డం కోసం జీనియో ప్లాస్టీ చేయించుకుంటుంది. ఇన్ని కాస్మొటిక్ సర్జరీస్ చేయించుకోవడానికి ప్రియ కు బాగానే ఖర్చవుతుంది. ఎంతంటే  ఆరోగ్యం బాగోలేని కన్నతల్లి వైద్యం కోసం డబ్బు మిగలనంత లేదా తన సర్జరీల ఖర్చు కోసం మాత్రమే డబ్బు మిగుల్చుకునేంతగా. ప్రియ ప్రయారిటీస్ లో అమ్మ లేదు అందం తప్ప. సహజంగా లేవమ్మీ! మనసుకు శాంతినిచ్చే అడవిపూల సౌందర్యం లేదు. కుండీలో పెంచిన గులాబీలా ఉన్నావు అంటుంది మైథిలి ప్రియతో. 

అమ్మకన్నా నేనే అందం అని మురిసిపోతున్న ప్రియను చూస్తూ.. సౌందర్యంగా లేకపోవడం లోపం కాదు. ఉన్నతమైన విద్యే ఆత్మవిశ్వాసం. అబద్దంలో అందంగా బతకగల్గుతాం అనుకోవడం మూర్ఖత్వం అంటుంది ప్రియతో. అందానికి వున్న విలువ వ్యక్తిత్వాలకు ఎందుకు లేదని బాధ పడుతుంది. 


ప్రియ స్నేహితురాలు 43 ఏళ్ళ పద్మ ఇండియాకి ప్రత్యేకించి సిలికాన్ ఇంప్లాంటేషన్ చేయించుకోవడం కోసం వస్తుంది. ఆమెకు పదహారు పదేళ్ళ పిల్లలు వుంటారు. బి టెక్ తర్వాత అమెరికా వెళ్ళి నాలుగేళ్ళు ఉద్యోగం చేసి పెళ్ళి చేసుకుని పిల్లల పెంపకం కోసం ఉద్యోగం మానేస్తుంది. పద్మ భర్తకు భార్య శరీరం పట్ల అసంతృప్తి. ఆమెకున్న చిన్న రొమ్ములు హిస్టెరెక్టిమి తర్వాత  పొత్తి కడుపు క్రింద పడ్డ నిలువు కోత. నీతో సంసారం చేయబుద్దవడంలేదు. విడాకులిచ్చి వేరే పెళ్ళి

చేసుకుంటానని నిత్యం బెదిరించే భర్త . సంసారాన్ని కాపాడుకోవడం కోసం సంసారంలో మూడవ మనిషి రాకుండా వుండటం కోసం సిలికాన్ ఇంప్లాంటేషన్ కి సిద్దపడుతుంది. పద్మే కాదు, ప్రియ కూడా మైథిలి కొడుకు శశాంక్ కోసం సిలికాన్ ఇంప్లాంటేషన్ కి సిద్దపడి వస్తుంది. అది విన్న మైథిలి ఆగ్రహంతో కుమిలిపోతుంది. 


శశాంక్ లో పద్మ భర్తలో భార్యల శరీరాలను బాడీ షేమింగ్ చేయడం అనే అవకరం వుందని స్త్రీలను అందం మాయాజాలంలో ముంచెత్తి తమ చెప్పుచేతల్లో వుంచుకునే భర్త,  మార్కెట్ రెండింటి మాయాజాలాన్ని తిరస్కరించాలని చెబుతుంది.


ఎవరో తమను ప్రేమిస్తేనో.. ఎవరినో తాము ప్రేమిస్తేనో తమకు అస్థిత్వం వుందనుకోవడం తప్పనీ తమను తామే ప్రేమించుకోవాలని  అప్పుడే మన జీవితాన్ని జీవించినట్లనీ లేకపోతే పరాధీనమైపోతామని చెప్తూనే

అసలైన సౌందర్యం అంటే మన జీవితాన్ని మనం జీవించే కళ  అనీ .. అదే ఈస్తటిక్ సెన్స్ అని చెపుతుంది మైథిలి. 


ఎవరో తమను గుర్తించాలన్న సౌందర్యాభిలాష కంటే నిన్ను నీవు ఉన్నతీకరించుకునే సౌందర్యాభిలాషే నిజమైంది. అదే ఈస్తటిక్ సెన్స్ అని రచయిత నొక్కి చెప్పిన కథ ఇది. 


ఉల్లిపాయలోని ప్రతి పొరకీ కన్నీరు తెప్పించే గుణం ఉన్నట్లు, పురుషుడి ప్రతి చర్యా స్త్రీ దుఃఖానికి కారణం అవుతుంది. అలాంటి పురుషుల కోసం తమ దేహాల్ని సర్జరీలతో మార్చుకోవడం సౌందర్యకాంక్షకు బలి అయిపోవడం అవసరమా.. సౌందర్యకాంక్ష వెనుక ఎడతెగని హింస వుంది. కార్పోరేట్ వ్యాపారం వుంది. అందంగా లేని స్త్రీలు ఎన్నో విజయాలు సాధించారు అంటూ ఆఫ్రికన్-అమెరికన్ సౌజర్న్ ట్రూత్ తో పోలిస్తే మిస్ ఇండియాలది మిస్ యూనివర్స్ లది ఏ పాటి అస్థిత్వ నిరూపణ అంటూ.. భర్తల సౌందర్యకాంక్షలకు బలై పోవడానికి సిద్దపడిన ప్రియ పద్మలను ఆవేదన కూడిన స్వరంతో మందలిస్తుంది మైథిలి.


స్త్రీలను కాస్మొటిక్ సర్జరీస్ అనే హింసా కూపాల్లోకి తోసేస్తూ వ్యక్తిత్వం లేని మగవాడి చేతుల్లో బాహ్యరూపాలు మారిపోయే బొమ్మల్లా.. కీలు బొమ్మల్లా మార్చేసే ప్యూడల్ పితృస్వామ్య వ్యవస్థ లోని దోపిడీనీ క్రూరత్వాన్ని మాలిన్యాన్ని వికృతాన్ని…  కార్పోరేట్ వైద్య వ్యవస్థలోని దోపిడీని క్రూరత్వాన్ని…   స్త్రీలు దాంపత్య జీవితాల్లో మౌనంగా అనుభవించే లైంగింక హింసలకు మగవాడి వికారమైన పడగ్గది ఈస్తటిక్ సెన్స్ ని బహిర్గతం చేసే కథలు వనజ తాతినేని గారు మరిన్ని రాయాలని కోరుతూ.. ఈ అవకాశాన్ని నాకిచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ… ఈ కథాసంపుటి లోని మిగతా కథలన్నీ పాఠకుల మనఃచక్షువులు తెరుచుకునే విధంగా వుంటాయని ఆకాంక్షింస్తూ.. వనజ తాతినేని గారికి అభినందనలతో..డా. గీతాంజలి భారతి. హైదరాబాద్.





7, డిసెంబర్ 2022, బుధవారం

ఐదో ఋతువు

కాల పురుషుడు కొరడా ఝళిపించాడు

పువ్వుల బృందగానం ఆగిపోయింది

సీతాకోకచిలుకల ధ్యానం చెదిరిపోయింది

పెళ్ళికూతురిలా శోభిల్లే లోయ కళ తప్పింది


రంగుల ప్రపంచం మటుమాయమైంది

చెట్లన్నీ మోడులై కన్నీటి బొట్లు రాలుస్తున్నాయి

కలత పడ్డ ధర మనసు దుఃఖంతో వశం తప్పింది

జాలి పడ్డ  దివి మంచు తెర ముసుగు వేసింది


సాక్ష్యంగా నిలిచిన రవి చంద్రులిరువురు 

ఎదురెదురు నిలిచి సన్నగా  నవ్వుకున్నారేమో

నక్షత్రాలు తలలూపుతున్నాయేమో

సముద్రం ఉన్ని దుస్తులు ధరించి వెచ్చ బెట్టుకుందేమో


ఋతువులన్నీ ప్రకృతి కే  ఊహలన్నీ అర్ధసత్యాలే

మనసు తోట అరుదైన కానుకను పొందింది 

క్షణానికోమారు పుట్టి మరణిస్తూ వుంటుంది

అది ఎన్నటికీ వాడని ఐదో ఋతువు


లోన బయటా చుట్టేసిన అడవిపూల సౌగంధం

చుట్టూ రంగు రంగు సీతాకోకచిలుకలు 

మధ్య ఒకే వొక్క తెల్ల సీతాకోకచిలుక 

అదే నా ఐదో బుుతువు.







4, డిసెంబర్ 2022, ఆదివారం

జీవితం ఒక ప్రయాణం

 ఇదిగో.. 

ఈ మలుపు దారుల్లో యెక్కడైనా కలిసి నాతో పాటు నడుస్తావనుకున్నా..

విన్న పాటలు చదివిన పుస్తకాలు నిలబెట్టేసిన అందాలు

సహృదయుల మంచితనాలు గురించి ముచ్చటించాలనుకున్నా.. 

ఏమిటో.. సారము లేని జీవితాన తీరని కోరికలెన్నెన్నో


నేను యెన్నటికి తెరవబడని ఖజానా ని 

జీవన మధువును మ్రోయలేని మధుపాన్ని

ఆశల రెక్కవిరిగిన సీతాకోకచిలుకని

అవిసిపోయి చతికిలబడిన అంకురాన్ని. 


పై వాడు యెంత నిర్దయుడు

యేదో వొక కొరత పెట్టి అలమటించమంటాడు

మంచి కూటి జతకు మంచి కూర దొరకదు అని

అంటా వుంటారు కదా 

అట్టా నిజం చేస్తాడన్నమాట 

బోధిస్తాడన్నమాట

జీవితం అంటే పూల దారి రంగుల కల కాదని 😊🤔




1, డిసెంబర్ 2022, గురువారం

మృదుత్వం కల్గి వుండటం శాపమా!?

 రంగు వెలిసిన కల - వనజ తాతినేని గారు రాసిన కథ పై నా అభిప్రాయం, కథా పరిచయం ( R Rama Devi /కవి/ Beditor blogger)


నేనెప్పుడూ కథా పరిచయం  ఎవరికి రాయలేదు...

కథ నచ్చితే ఎందుకు నచ్చింది అని నా మాటల్లో చెప్పడం వచ్చు. మొదటిసారి ఇక్కడ రాశాను.


రంగు వెలిసిన కథ


ఈ కథ గురించి చెప్పాలి అంటే ముందు ఈ కథను కథ అని మర్చిపోవడం మంచిది ... ఇది ఒక జీవితం.  స్త్రీలు కొంతమందైనా వారి వారి జీవితంలో పోగొట్టుకున్న మనసు కథ.


ఈ కథ చదివాక ప్రతి ఒక్కరూ ఈ మనసు తమదే అని ఒకప్పుడు ఉండేదని.. ఇప్పుడు ఎందుకో రాటు తేలిందని మనసు లోలోపల స్ఫురణకు వస్తుంది.


కథ చదువుతుండగా ఆమె పోగొట్టుకున్న మనసు అంచెలంచెలుగా గుర్తుకుతెచ్చే సంఘటనలు మనసు నిండా పరచుకొని కనులు తడితో మసకబారడం తథ్యం.


పోగొట్టుకున్న మనసు  మృదుత్వం భావుకత విలువ కట్టడం ఎవరి వల్ల అవుతుంది. ప్రతి ఒక్కరూ తెలిసి తెలియక ఒక రాయి విసిరే వారే కానీ ఆ స్త్రీ లోనో లేదా పురుషుడిలోనో వున్న ఆ భావుకత ఆస్వాదించే మనిషి ఎదురుపడి అందుకునేది చాలా అరుదు.


సంక్షిప్తంగా కథ విషయానికి వస్తే... ప్రేమలో పడిన ఒక యువతి కథ అని ఒక్క వాక్యంలో చెప్పవచ్చు... 


ఇక్కడ కథలో ఉన్న అమ్మాయి మనసే... కావ్య నాయికా నాయకుడు కూడా...రచయిత్రి ఈ కథలో ' ఆమె మనసును ' ఏ సముద్రపు లోలోతుల్లో నుంచి వెలికి తీశారో కాని .. అక్కడ ' ఆమె మనసు ' ఎంత అందమైన రంగులలో అల్లుకుని ఉండి ఉన్నదో కదా అని చదువుతున్న పాఠకుడు ఒకింత ఆశ్చర్యానికి లోను కాక తప్పదు.


అమ్మాయి మృదుత్వపు మనసుకు విచక్షణా జ్ఞానము ఒకింత తక్కువే ..  తన మృదుత్వపు భావుకతతో ప్రేమను అణువణువు నింపుకుని ఆలోచన సమన్వయం మరవడం,  తర్కానికి చోటు ఉండకపోవడం అన్నది నిక్కమైన నిజం కూడా...  

భావుకత నిండిన మనసు ఒక్కోసారి కళ్ళ ముందు కనిపించే సత్యాలను కూడా విస్మరించేలా చేస్తుంది అంతేకాదు వారి ఆలోచన విధానాన్ని ఏ విధంగా దారితప్పిస్తుందో రచయిత్రి గారు సమర్థవంతంగా చెప్పారు... 


మనసున్న మనిషికి ఒక మృగంలాంటి మనిషి ఎదురైతే ఎలా ఉంటుంది... మనిషి బ్రతికే ఉంటాడు. ప్రేమ, అనురాగాలు అన్న పదాలకు చోటు లేకుండా పోతుంది అంతేకాదు వారు మనుషుల నుంచి దూరంగా పారిపోవాలనుకుంటారు.


అలాంటి స్థితిలో చిక్కుకున్న ఈ కథలోని అమ్మాయి పోగొట్టుకున్నదేమిటి ఆమె మథనపడేది దేనికోసం, ఆమె ఎదురుచూపులు ఎవరికోసం అనే విషయం మాత్రం పాఠకులు ఎవరికి వారు తెలుసుకోవాల్సిన విషయం..


జీవితంలో స్తబ్దుగా మారిన అమ్మాయికి   "ఎదురుపడేవాడు నిర్మలమైన తటాకం అయితే  మనసు అలవోకగా సున్నితత్వం వైపు అడుగేస్తుందని ప్రేమ తిప్పతీగలా అల్లుకుపోతుంది మది నిండుగా " అని రచయిత్రి జీవితంపై ఉన్న సమన్వయ ఆలోచనతో ఆశాభావాన్ని వ్యక్త పరచడం విశేషం. 


చివరాఖరుకు ఆమె ' నలిగిన మనసు ' తనను తాను నిలబెట్టుకోవడానికి ఎంత సమయం తీసుకుంటుందో అంచనాలు పాఠకులకే వదిలేశారు రచయిత్రి కొంచెం గడుదనంతో కథ ముగింపు ఇవ్వకుండా..


ఇది అచ్చంగా మన అందరి లోలోతుల్లో ఎక్కడో చిక్కుబడిన ఓ మనసు కథ..ఈ కథ హృదయాన్ని పోగొట్టుకున్న వాళ్ళకు అర్థమవుతుంది మృదుత్వాన్ని కోల్పోయిన వాళ్లకు అపురూపంగా కనిపిస్తుంది...



మీరు చదవండి… రంగు వెలిసిన కల ఈ లింక్ లో చదవవచ్చు.