4, ఫిబ్రవరి 2025, మంగళవారం

గాయంతో మాటామంతి

 “గాయంతో మాటామంతి” 

మొదటి ప్రపంచయుద్ధం నాటి కథ. ఇద్దరు ప్రసిద్ధ రచయితల మధ్య నడిచిన లేఖల గాథ. అనేక కుటుంబాల వారు తమ వారికి రాసిన లేఖల పుస్తకం కథ. తప్పకుండా వినండీ.. 

ఓ విషాదగాథ - ఓ కవిత - ఇద్దరు ప్రముఖ రచయితలు

Rudyard kipling  కు Sir Arthur Conan Doyle వ్రాసిన ఒక లేఖ గురించి చెబుతున్న కథ “గాయంతో మాటామంతి “ డా. గోపరాజు నారాయణరావు రాసారు. ఆ కథను పదేళ్ళ క్రితం ఒకసారి చదివాను. అప్పుడప్పుడు చదువుతుంటాను. ఇవాళ  మళ్ళీ ఆ కథ చదువుతూ.. ఆ కథలో ఉదహరించిన రచయిత ల పేర్లను గూగుల్ చేసాను. ఆ కథలో ఉదహరించిన కవిత “My Boy Jack” ఈ కవిత రాసిన వారు.. Rudyard kipling ఆంగ్ల సాహిత్యంలో మొట్టమొదటి నోబుల్ బహుమతి అందుకున్న రచయిత. 

 (Bombay  లో జన్మించారు)

“My boy Jack” అనే కవిత గురించి చెప్పుకుందాం. 

ఈ కవిత Great War లో పాల్గొన్న జాక్ గురించి తండ్రి రాసింది. కానీ అప్పటికి ఆ కుర్రాడు యుద్ధంలో మరణించాడు అంట. భార్య ను స్థిమితంగా వుండటం కోసం ఈ కవిత రాసాడట. ఈ కవిత చాలా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే యుద్ధం లో మరణించాడు అనుకున్న జాక్ ఆచూకీ.. గురించి అతని తల్లిదండ్రులు ఎంతోకాలం వెతుకుతూనే వున్నారట. అదొక విషాద గాథ. 

ఆకథ గురించి తర్వాత చెప్పుకుందాం. రేపు YouTube Channel లో ఆ కథ వినిపిస్తాను. 

ఇప్పుడు.. ఆంగ్లంలో నుండి తెలుగులో అనువాదం చేసి ఇమ్మని అడిగిన వెంటనే చేసి ఇచ్చిన P.సింహాద్రమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుతూ.. 

ఆంగ్ల కవిత.. తెలుగు అనువాదం రెండూ ఇస్తున్నాను.. చదువుతారు కదూ! Thank you ! 

మై బోయ్ జాక్ -P. సింహాద్రమ్మ


"నా కొడుకు జాక్ గురించి ఏమైనా తెలిసిందా? "

ఈ అల కాదులే.

"వాడెప్పుడొస్తాడని అనుకుంటున్నావు?"

ఈ వీస్తున్న గాలి తో కాదులే...

ఈ అల తో కూడా కాదులే.


" వాడిగురించి అసలెవరికైన ఏమైనా కబురు తెలిసిందా?"

ఈ అల కాదులే.

మునిగినదేదీ తేలి ఈత కొట్టదు కదా,

అయినా... ఇప్పుడు వీస్తున్న గాలి తో కాదులే.. ఈ అలతో కూడా కాదు."


" ప్రియతమా! ఓహ్!! నాకు స్థిమితం ఎలా సాధ్యపడుతుంది?"

ఏ అల తోనూ కాదులే...

ఇంకే అల తోనూ కూడా కాదులే,


మరి తల ఎప్పటికీ ఎత్తుకునే ఉండు 

ఈ అల తోనూ.

ఇంక వొచ్చే ప్రతీ అలతోనూ..


ఎందుకంటే అతను నువ్వు నీలో మోసి పెంచిన వాడు 

నువ్వు అతన్ని ఆ వీస్తున్న గాలికీ ఇచ్చేసావు

ఆ లేస్తున్న అలకి కూడా....


కథ వినండీ.. 



మినీ కవితలు

 లోనివి.. బయటకు వొంపి


రాలిన పువ్వుల లాంటి ఆకులు

 రంగులన్నీ కాలి కింద  నలుగుతూ 

గలగల  సంగీతం ఒంటరి నడక్కి తోడు

అయినా ఆకురాలని బాటను ఎక్కడని వెతకన్నేను


**********

 

మొహం మొత్తి కాదు పెడ ముఖం పెట్టింది 

శరీరం మార్పు కోరింది

దయ వుంచి  నా అభిముఖంగా వచ్చి కూర్చో !

దైవానికి పసి పిల్లలకు ఇష్టపడే వారికి 

వెన్ను చూప కూడదని మా నాయనమ్మ చెప్పిందిలే. 


***********


ప్రక్షాళన కు కన్నీటికి 

మించినది ఏముంది? 

వెన్నల వర్షం మంచు కాంతి

కురుస్తూనే వున్నాయి పోటీపడుతూ

అయినా నువ్వు రావేం!?




ప్రేమంటే

 ప్రేమంటే..   -వనజ తాతినేని 

     

     నీకు నాకూ మధ్య … 

     పెద్ద పలకరింపులేమీ వుండవు

     ఓ దేవుడి చిత్రం ఓ పువ్వు ఓ కొటేషన్ తో

     గుడ్ మాణింగ్ తప్ప

     అది చాలు ఎక్కడో ఓ చోట వున్నావన్న 

     సంగతి నాకూ చెపుతూ.. రోజూ

     విసుక్కుంటాను చాట్ డిలీట్ చేస్తూ

     అకస్మాత్తుగా నీ నుండి మెసేజ్ లు

     ఆగిపోయిన తర్వాత ఆదుర్దా 

     ఏమైపోయావో.. అని.

     మనుషులు అలవాటైన తర్వాత 

     నిశ్శబ్దాన్ని భరించలేరు

     ఖాళీ ని పూరించుకోనూ లేరు. 

     ఇది కాదా ప్రేమంటే! 



2, ఫిబ్రవరి 2025, ఆదివారం

పాపాయి మనస్సు

 తెలంగాణ పెడరల్ పత్రికలో నా కవిత


పాపాయి మనసు ఈ  క్రింద ఇచ్చిన లింక్ లో చదవండి. ధన్యవాదాలు.  


పాపాయి మనస్సు


పాపాయి మనస్సు -వనజ తాతినేని 

 

పాప లేం చేయగలరు ? 

పాపం!! మనం తిడితే తిట్టలేరు 

కొడితే కొట్టలేరు. 

అంతర్లీనంగా ఓ ధిక్కార స్వరాన్ని బలోపేతం చేసుకోవడం మినహా!

 

వాళ్ళేం.. మన పెంపుడు జంతువులు కాదు పంజరంలో బంధించిన పెంపుడు చిలుకలు కాదు.

మనకు ఇష్టమైనప్పుడు ఆడమన్నట్టు ఆడటానికి పలకమన్నప్పుడు పలకడానికి. వారేం గాడిదలు కారు 

మన కోపతాపాలు మన అసహనాలు మన తాపత్రయాలు మన లక్ష్యాలు మన బరువులు మోయడానికి. 

 

 

మన మానసిక కల్లోలాన్ని తట్టుకునే సముద్రం కాదు వాళ్ళు 

కనీసం ఆహ్లాదానికి మనం పెంచుకున్న పూల మొక్కలు కాదూ 

అమర్చుకున్న ఆక్వేరియంలో చిరుచేపలైనా కాదు. 

వారు మన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు 

 

వారికి మన భాష అర్థం చేసుకునే శక్తి లేకపోవచ్చు 

మన కరుకైన వ్యవహారశైలి వారి మెదడులో గుప్తనిధి లా దాక్కునే వుండవచ్చు  

తెలివిడి పెరిగిన కొద్దీ మనస్సు కూడా గాయపడుతుండవచ్చు 

వారి నిర్మల హృదయం బండబారటానికి బీజం వేసిన పాపం మాత్రం మనదే! మనదే కావచ్చు!! 

 

 

పుట్టుకతోనే కర్ణుడికి కవచకుండలాలు లభించినట్లు మన అహంకారమూ… 

తుస్కారం తుత్తర స్వభావం నోటి వాచాలత వారసత్వ ఆస్తులుగా నిలుపుకున్నట్లు 

మన ఆయుధాలను ఝళిపించడానికి సర్వదా సన్నద్ధంగా వుంటాము 

కార్యాకారణాలను కూడా సైన్యం లా సమకూర్చుకునే వుంటాము. 

 

అయిననూ.. ఓ బాధాతప్త హృదయంతో వేడుకొన్నాను 

సుందరేశ్వరా! మనిషికి సుందరమైన ఆకాంక్షలే కానీ 

సున్నితమైన మనసు ఎందుకిప్వలేదు తండ్రీ !! . 

పోనీ పసిపిల్లల మనసు గాయపడకుండా లోహకవచాన్ని తొడుగుగా అయినా ఇవ్వకపోతివి కదా అని.

 

ఇంతకీ పిల్లలేం చేస్తారు?

చిన్నబుచ్చుకున్న మనస్సును చిచ్చు కొట్టి కాసేపటికి ఎప్పటిలానే 

వారి పెద్ద మనసుతో పెద్దల్ని క్షమించేస్తారు.

వారు క్షమించిన ప్రతిసారీ అదఃపాతాళానికి కృంగిపోవడానికి బదులు 

అహంకారంతో మరోసారి పెట్రేగిపోవడానికి బలం చేకూర్చుకుంటారు అని మళ్ళీ తిట్టినప్పుడు కానీ అర్థమవదు. 

 

పసిపిల్లల స్వచ్ఛత ప్రేమ మనల్ని పునీతులును చేస్తుందని 

మనసుండీ గ్రహించలేని ఆల్చిప్పలు నిలువెత్తు సంతకమై 

ఇంట్లో తిరుగాడుతూనే వుంటారు. 

పాపలు ఇల్లాళ్ళుగా మారుతుంటారు. 

మరో పురుషుడి దాష్టీకాన్ని తట్టుకోవడానికి సమాయతమై. 

 

ఈ దేశంలో ఎన్నటికీ చావు లేనివి రెండే రెండు.. మగవాడి అహంకారం స్త్రీ క్షమాగుణం