22, డిసెంబర్ 2010, బుధవారం

హాస్టల్ గది

హాస్టల్ గది 
 హాస్టల్ లో ఉన్న ఆడపిల్లలని చూస్తే
ఆక్వేరియంలో అలుపు లేకుండా తిరిగే 
రంగు రంగుల  చేపలని చూసినట్టుంటుంది 
ఎప్పుడెప్పుడు బయటపడదామా అన్నట్లు 
గేటు వైపు చూస్తుంటే 
కాముకుల చూపుల వలకి  
చిక్కుకుపోతారేమోనని భయమేస్తుంటుంది 
చదువుల సముద్రంపై రాంక్ ల ఓడపై 
ప్రయాణం చేస్తున్నట్లు ఉంటుంది 
ఏ తుఫాన్ తాకిడికి చిక్కుకుంటారో 
ఏ తీరాలకి చేరుకుంటారోనని  
దిగులుగా ఉంటుంది 

జ్వలనం చలనమూ లేక  
యాంత్రికంగా మరబొమ్మల్లా 
నడుస్తున్న వాళ్ళని చూస్తుంటే  
వీపున మోస్తున్నసిలబస్ లన్నీ 
కర్కశ హృదయాల పేరాశగా  
కనురెప్పలు మోస్తున్న 
కలలభారాలన్నీ కన్నవారివిగా   
తెలుస్తూనే ఉంటాయి   

వారానికొక రోజొచ్చి ఆత్రంగా 
మార్కుల వివరాలడుగుతుంటే 
పూల వనాలని ధ్వంసం చేసి 
సీతాకోక చిలుకల సంచారం కోసం 
ఎదురు చూపులు చూస్తున్నట్లు ఉంటుంది    

విద్యా గంధాలని 
ఆస్వాదించాల్సిన మనసులు 
టాయ్ లెట్ల దుర్గంధాన్ని భరించలేక 
వమనం చేసుకుంటారు 
తేలికగా రూపాయలెలా సంపాదించాలనే 
ఆలోచనల కుళ్ళుని మోస్తూ 
ఆత్మీయతకి అలమటిస్తారు   
పాటా లేదు పదమూ లేదు  
చీకటి గదులు ప్రహారా కాస్తున్న కళ్ళు 
వాయిదా వేసుకున్న ఆకళ్ళు 
మనిషిగా ఎందుకు పుట్టామోనని వగస్తూనే
గది గోడలు బద్దలు కొట్టాలనే కసితో 
చదివేస్తూ ఉంటారు 
జైల్లో ఖైదీలకి లాగా పదే పదే 
                                                         కేలండర్ కేసి చూస్తుంటారు. 

21, డిసెంబర్ 2010, మంగళవారం

ముందు తెలిసెనా... ప్రభూ ...






నాకిష్టమైన పాట ...ఇంకొకటి మీతో.. పంచుకుంటున్నాను. పైన లింక్లో.. ఇచ్చిన పాటని వింటూ ఇది చూడండీ!!!

ఈ పాట కీర్తిశేషులు శ్రీదేవులపల్లి వారు వ్రాసిన భావకవిత్వం అంటే... ఒప్పుకోవలిసిందే... ఇంతకు ముందు కూడా.. ఎవరైనా ఈ పాట గురించి..ప్రస్తావించి ఉండవచ్చు కూడా!
అయినా ఈ పాట నాకు ఎందుకు.. ఇష్టమో..చెపుతాను ఫ్రెండ్స్.

మేఘసందేశం ... మీకు తెలుసు కదా... దాసరి గారి అపూర్వ దృశ్యకావ్యం..

ఆ సినిమా.. నాకు ఎంత నచ్చిందో చెప్పలేను. వివాహితుడైన ఒక పురుషుడి జీవితంలోకి.. అనుకోని సంఘటనల్లో .. వేరొక స్త్రీ ప్రవేశించడం అందు మూలంగా అతను... కుటుంబం కి దూరం కావడం,అందుకు బార్య సహకరించడం అంతా... ఆసక్తికరం.

కానీ... ఇరువురు స్త్రీ -పురుషులు మద్య శారీరక సంబంధం కాకుండా కళాభిరుచి తో ఏర్పడిన బంధం. వారు ఇరువురిని మరణంలో కూడా విడదీయలేని బంధంగా...నిలిచిపోయింది.

అక్కినేని గారి నటనా వైదుష్యం జయసుధ సహజ నటన, జయప్రద...అపూర్వ నటనా సామర్ద్యం.ఎప్పటికి.. ఈ... చిత్రాన్ని తెలుగు సిని కిరీటంలో... మకుటామయంగా భాసిల్లేటట్లు చేసాయి.

ఇంతకీ పాట ఏమిటో చెప్పకుండా విసుగు కల్గిస్తున్నానా...! వచ్చేస్తున్నాను అసలు విషయంలోకి...
జయప్రద నా అభిమాన నటి... అని చెప్పేస్తే చాలా.. తక్కువ అండీ! ఎంత వీరాభిమానిని అంటే 80 లలో... దిన పత్రికలలోనూ,మాస పత్రికలలోనూ, వార పత్రికలలోనూ... ఆమె స్తిల్ల్స్ కనబడితే చాలు దానిని నొక్కేయడం.. శ్రద్ధగా... కత్తిరించి లాంగ్ నోట్ బుక్ లో అతికించి... ఆల్బం చేయడం. దానిని అందరికి.. చూపించి మురిసిపోవడం అదొక పెద్ద ప్రక్రియ. ఒకనాడు.

అవ్వన్నీ నాకు దూరం అయిపోయాయి.ఆ కధ ఇప్పుడు వద్దులెండి, మరోసారి చెపుతాను. అంత ఇష్టమైన జయప్రదపై..చిత్రీకరించిన పాట అండీ ఈ పాట...

ముందు తెలిసెనా  ప్రభూ... ఈ మందిరం ఇటుల ఉంచేనా !
మందమతిని.. నీవు వచ్చు మధుర క్షణమేధో 
కాస్త ముందు తెలిసెనా ప్రభూ.!

అందంగా నీ కన్నులకు విందులుగా వాకిటనే (2 )..
సుందర మందార కుంద  సుమ దళములు పరువనా 
దారిపొడవునా  తడిచిన  పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలు

ఎంత భావుకత... అందుకే కృష్ణ శాస్త్రి... కవిత్వమంటే అందరికి పిచ్చి. ప్రేమికులకైతే... మరీ..

ఇక రెండో చరణం .

బ్రతుకంతా ఎదురు చూపు పట్టున్న రానే రావు...
ఎదురగని వేళ వచ్చి ఇట్టే మాయమవుతావు...(2 )
కధలనీయక.. నిమిషం నను వదలిపోక
నిలుపగా నిన్ను పదములు బంధింపలేను
హృదయం సంకెల జేసి... !

ఇలాటి సాహిత్యంతో ఏ మణులు,మాణిక్యాలయినా... దిగదుడుపే.
అందుకే ఈ...పాట అంటే నాకు.. చాలా ఇష్టం.
రమేష్ నాయుడు గారి స్వర కల్పన.,సుశీల గారి గళం... ఒక అనుభూతికి... ప్రాణం పోశాయి.

ఇక భావం విషయానికి వస్తే  ప్రియుని రాక కోసమై  ఎదురు తెన్నులు చూసే అభిసారికకి..
కబురు కాకరకాయ లేకుండా అతను హటాత్తుగా అడుగిడితే 
ముందు తెలిస్తే... ఈ మందిరం ఇట్లా.. ఉంచుతానా! నేను అసలే మందమతిని నీవు వచ్చే మధుర క్షణమేదో... గుర్తించలేకపోయా,   తెలిస్తే... ఇంటిని, నన్ను మరికొంత అందంగా... అలంకరించుకోనా ? 
నా ఇంటి దారిని రకరకాల పూలతో... అలంకరించనా ! ఆపూల పై... నీ అడుగులే.. పడిన చాలు

నాకు ధన్యత చేకూరును  అంటుంది ఆమె . వావ్... ఎంత గ్రేట్ ఫీల్...!

బృతుకంతా ఎదురు చూసిన రావు... ఎప్పుడో వచ్చి అంతలోనే మాయమైతే నిన్ను బంధించడానికి నా.. హృదయం సంకెలలు చేయడం మినహా...(ఎందుకంటే... అతను వివాహితుడు కనుక.)

అనుభూతి.. చెందడంలో కూడా అర్ధం ఉండాలండీ అనుకుంటాను నేను. ఈ పాట... ఆ కోవలోనిదే!
అందుకే ఈ పాటంటే... ప్రాణం.

నేను వీడియో పాటని లభ్యం కాక జతపరచ లేకపోతున్నాను. వేరే విధంగా వినండీ. ప్లీజ్!! జయప్రద ఎంత అందమైన స్త్రీ నో .. ఆమె పై చిత్రీకరించిన ఈ పాట కూడా అంత అందమైన పాటండీ. ఆమెని దృష్టిలో ఉంచుకుని ఈ పాట వ్రాసి ఉంటారేమో ఆ భావకవి అన్నట్టు ఉంటుంది. 

ఏమైనా... పాట పూదోటలో  నేను గండు తుమ్మెదని అని చెప్పాను కదా! ఈ పాట మీరు విని భావ సంద్రంలో.. తేలియాడండి .. అందుకే ఈ పాట.

ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసెనా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసెనా ప్రభూ!

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును

ముందు తెలిసెనా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!

బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
ఎదుర రయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
ఎదుర రయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
కదలనీక నిముసము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల జేసి

ముందు తెలిసెనా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!


నేను రూపొందించిన  వీడియో ని ఇక్కడ చూడండి. 





సాయం చేయడానికి చేతులు కావాలి



సాయం చేయడానికి చేతులు కావాలి..


శ్వేతసౌధం మీదగా పయనించి వచ్చిన గాలికి

ఉలికిపడి కనులు విప్పిన నవజాత శిశువు..

నా వారసుడే  కాదు, భావిభారతం కూడా..

పుట్టుకతో పౌరసత్వం వచ్చిందని మురిసే తండ్రిని

ఆరచేతిలో ఉసిరిలా అందే

పసిమి భవితకి సంతసించే తల్లిని దాటి

మమతల స్పర్శతో ముద్దాడుతున్న

నా  చూపుడు వేలిని  కొత్తగా 

ఏర్పడిన అణుబంధం అంత బలంగా ఒడిసిపట్టుకుని..

తన మూలాలు వెతుకుతున్నట్టే ఉంది.


పాశ్చాత్యపు సంస్కృతి  పొత్తిళ్ళలో ఉన్న వాడిని 

అమాంతం దొంగిలించుకు వచ్చి.

పల్లె తల్లి ఒడిలో లాలించాలనిపిస్తుంది..

ఊరి చివర వెలివేసినట్లున్న

విశాలమైన ఇళ్ళల్లో చలిమర చప్పుళ్ళలో..

పలకరించే దిక్కులేని వైనాలకి అందనీయక

కష్టం-సుఖం సవ్వడి వినిపించాలని ఉంది.


వాడికి ఊంగా ఊంగా ఊసులతో పాటు 

వాడి తండ్రికి వినిపించిన ఫూల్ కి చాహ్ కధ

పరమవీరచక్ర  గాధలతో పాటు 

పరాయి దేశంలో  తానుననుభవించిన

ఫూల్ ఔర్ కంటే వాస్తవాలని 

హృదయానికి హత్తుకునేలా చెప్పాలనిపిస్తుంది.


అరక దున్నుతూ చెలకలు వేస్తూ స్వేదం

విలువ  తెలియ చెప్పాలని ఉంది..

ప్రమాణాలకి కొలతలకి  అందక 

స్వేచ్ఛా జీవితాన్ని అందించాలని.. 

నాగరిక చదువులకి అందనీయక

పల్లె కడుపులో పొదువుకోవాలని ఉంది.

ఆ చదువులే కదా ఆత్మీయ స్పర్శ కి

అంటరానితనాన్ని అపాదించాయని 

అరచి చెప్పాలని ఉంది.. 


వేల మైళ్ళ దూరంలో ఉన్న కన్న బిడ్డని 

తెర మీద బొమ్మల్లా చూస్తూ ఉండటం, 

మాట్లాడుతూ ఉండటం తప్ప

స్పర్శ సెన్సర్ ని  కనిపెట్టటం తెలియని 

శాస్త్రాన్ని పరిహసించాలని  ఉంది.. 


సుక్షేత్రమైన పంట పొలాన్ని 

ఏడాదికి ఒక ఎకరా లెక్కన తెగనమ్మి 

పదిలంగా  పెంచిన ఒకే ఒక వృక్షం

పదిమందికి నీడ నిస్తుంది అనుకుంటే.. 

పెరటి చెట్టు వైద్యానికి పనికి రాని చందాన 

విఫలమైన కోటి ఆశల కధ చెప్పాలనిఉంది..


ఒక తల్లి గుండెని నీరు చేసి

ఒక తల్లి గుండెని బండగా మార్చి

పరాయి క్షేత్రంలో విసిరి వేయబడ్డ విత్తులై

డాలర్ల కాపు కాసే చెట్లైతే పెరడే కాదు

ఊరు ఊర్లే బావురుమంటున్న దృశ్యాలని 

ప్రత్యక్ష ప్రసారాలతో  చూపించాలనిపిస్తుంది.


నిర్మానుష్యంగా మారిన నా పల్లె నడిబొడ్డున

జిల్లేళ్ళ వనాలు  విస్తరిస్తున్నాయి.

జిల్లేడు దూదిపై కూడా 

పేటెంట్ హక్కుని సొంతం చేసుకున్నందుకు.. 

తీరికగా నిరసిద్దాం.


ఇప్పుడు నా వారసత్వ సంపదతో పాటు..

నా కయ్యలు నా పెయ్యలు నాక్కావాలి .. 

శిధిలమైన  ఇళ్ళ మొండిగోడలపై..

ప్రేమ పైకప్పులు వేయడానికి 

వట్టిపోయిన కొట్టాల మధ్య 

తువ్వాయిల మెడలో మువ్వల పట్టీలు కట్టటానికి 

నా.. వారసత్వ  శిశువులు  కావాలి


అభేద్యమైన గాఢాంధకార  మేఘచ్చాయ నుండి..

నా జాతిని వెలుగులోకి నెట్టటానికి  నాకిప్పుడు   

సాయం చేయడానికి చేతులు కావాలి  చేతులు కావాలి..            


(నెలా నెలా వెన్నెల  ఎక్స్ రే  వేదిక 21/12/2010)