24, అక్టోబర్ 2011, సోమవారం

నాకు తెలిసిన సోనియా.. ఆమె బహు ముఖాలు


నాకు తెలిసిన సోనియా.. 

ఏ మాత్రం  ఆశ్చర్యం వద్దు. నాకు తెలిసిన సోనియా గురించే..నేను చెపుతున్నా.. ఎలా తెలుసు అనుకుంటారా? అయ్యో..రోజు ఏమిటి  ఖర్మ ..నేను పుట్టినప్పటి నుండి.. పేపర్లో చదువుకున్నాను. పైగా ఈ దేశపు కోడలు ఆమె.. ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? అందుకే తెలుసుకుని ..నాకు తెలిసిన "సోనియా"  అని సింపుల్గా అంటున్నానన్నమాట. శక్తివంతమైన భారతీయ మహిళగా ఆమెని ప్రపంచం గుర్తించాక మనం కాదంటామా?కాదనుకుని ఆమె నీడలో బ్రతికేస్తున్నాం కూడా..     

ఒకోసారి ఒకో మనిషే కాదు జాతి జాతి మొత్తం ఒక మనిషిని విశ్వశించలేం కారణం మనలో..ఆణువణువునా దాగిన మన అనే బలీయభావం.ఆ భావం తోనే.. ఎక్కడ ఉన్నా  ఎవరు మనవారిగా భావించినా యిట్టె కలసిపోతాం.పరాయి భావనలో అభద్రతా బావం వెంటాడుతుంది.అందుకే మనం పరాయి చోటికి వెళ్ళగానే మన తెలుగు వారు కనబడగానే హమ్మయ్య అనుకుని వెంటనే కలేసుకుని,మొహాలు చేటంత చేసుకుని,అంతలోనే పూసేసుకుని.. కాల క్రమంలో.. వెనుక గుస గుసలతో..చెప్పేసుకుని, ఇంకా కొన్నాళ్ళకి తిట్టేసుకునే లెవెల్లో తయారవుతాం. కానీ మనవాళ్ళకి ఏదైనా ప్రమాదం కల్గినంతలోనే   మళ్ళి ఒకటై పోయి  మహాభారత నీతి గుర్తుతెచ్చుకుంటాం. మాలో మేము తిట్టుకుంటాం కొట్టుకుని చస్తాం పరాయి వాళ్లకి మాత్రం మేమంతా ఒకటే..అని దృడంగా చాటి చెపుతాం. ఇదంతా చెప్పుట ఎందుకనగా.. 

మన దేశంలో.. అవినీతి,కుల,మతతత్వం ని ప్రోత్సహించడము రాజకీయనాయలకి వెన్నతో పెట్టిన విద్య. వారినే మనం ఓట్లు వేసి మరీ గెలిపించి.. మన బతుకులని దారిద్ర్య రేఖకి దిగువునకీడ్చి.. మనని అదః పాతాళానికి అణగద్రోక్కుతున్నాసరే..గుడ్డిగా నమ్మేస్తాం. వారసత్వ రాజకీయం తప్ప మన జాతికి ప్రత్యాన్మయ మార్గం లేనట్లు స్టాంపింగ్ ప్రధానమంత్రి ,ముఖ్యమంత్రుల కాలంలో..మన బతుకులుని  గాలివాటు దీపం లాగా పణంగా పెట్టి ఈ సెక్యులర్ స్టేట్ లో బ్రతికేస్తున్నాం.  ఎగుమతులను ఉత్పత్తి చేసే సెజ్లు, ఐ .టి పార్కులు, విదేశాల్లో ఉద్యోగాల కోసం చదివే చదువులు ..అంతా ప్రపంచీకరణే! ఇన్ని ఆమోదించిన మనం ఒక విదేశీయురాలిని ప్రధానిగా అంగీకరించలేం. కాని జాతి మనుగడ మాత్రం ఆమె చేతిలోని పగ్గంగా మారింది.అది మనమే ఇచ్చాం. నేను కూడా..ఒక విదేశి వనిత ప్రధానిగా ఉండటం అంగీకరించలేను. నూట ఇరవై కోట్ల భారతీయులలో..ప్రధాని కాగల అర్హత ఎవరికి లేదా.. అనే ప్రశ్నించి తీరతాను.  

కానీ ఒక స్త్రీ మూర్తిగా సోనియాలో.. నేను చూసిన కోణాలని నా దృష్టిలో వ్రాసుకున్నవి ఇలా.. మీకు నచ్చితే ఓకే..లేకున్నా పర్లేదు. ఇది నా కోణం మాత్రమే. 




ఆమె బహుముఖాలు

నమ్మినవాడితో ఖండాలని దాటి వచ్చిన ఆమె
శ్వాసని కూడా శాసించే రక్షణ వలయాల మద్య 
ఆధునిక వసతుల మద్య  అంతఃపురంలో.. బహు రాణి. 
హింస తాకిడికి కళ్ళెదుటే కూలిపోయిన మహా శక్తిని చూసి 
ఆమె కళ్ళల్లో నదులే ప్రవహించాయి.
 దేశాభవితని భుజస్కందాలపై ఎత్తుకున్న అతని
అడుగులో అడుగు అయింది.
భయపడినదే జరిగినప్పుడు  ఆమె గుండెలో..
జీవనదులే ఇంకిపోయాయి.
తన కూనలని పదిలంగా పొదువుకుని 
వలువలు,చిలువలతో అస్త్రాలని సందిన్చినవారికి 
మౌనంతోనే సమాదానం ఇచ్చిన ఆమె వేదనలో.. 
ఘనీభవించే మంచు ఖండాలే నివ్వేరపోయాయేమో! 
వారసత్వ సంపదని జాతికి అందించే కర్తవ్య దీక్షలో 
కదన రంగాన నడుమున కట్టిన శిశువుతో పోరాడిన 
ఝాన్సీ లక్ష్మి బాయి గోచరిస్తుంది.
చిటారు కొమ్మన ఊరిస్తున మిటాయి పొట్లం  
అందుకోనివ్వని ఈ రాజకీయ కురుక్షేత్రంలో..
విశ్వసనీయమైనవి కులం,మతం కాదని 
ఓటు బంక్లని తలచి  కైవసం చేసుకునేదుకు.. 
అపర చాణక్యుని అంశని ఆవాహం చుసుకున్నదేమో..
అతివగా  మెట్టినింట ఘనత ఘనమని  
ఈ జాతిని మునుముందుకు నడిపించే సారధినని..
ఘనంగా చెప్పుకున్నట్లు ఉండటమే కాదు.. 
మానవత్వానికి ఆనవాలుగా..క్షమా గుణం ప్రదర్శిన ఆమె.. 
అంతరంగం ఓ..ఎడారి నది.. 
కొవ్వొత్తిలా కరగకుండా, వ్యధ చెంద కుండా 
ఏ వెలుగులు దరికి రావన్నదానికి సాక్షీ భూతంగా నిలిచిన 
ఆమె ప్రస్థానంలో.. నిలిచినవి..నేను కన్నవి 
కొండంత ఆత్మ స్థైర్యాన్ని,కరుణార్ద అంతరంగాన్ని 
స్వచ్చమైన అభిమానాన్ని
ఆణువణువూ నిండిన అంకిత భావాన్ని
బందాలకి-భాద్యతలకి బందీ అయిన స్త్రీ మూర్తిని. 
ఆమె .. బహుముఖాలు.



               
                                  
ఆమెని చూస్తే.. ఈ క్రింది  వాక్యంలో నిజం గుర్తుకు వస్తుంది.( ఒకోసారి విరుద్దం గా కూడా) 

Failure also looks beautiful when you have Friends & Family to support you...Success also hurts when they are not with you

7 కామెంట్‌లు:

ఆత్రేయ చెప్పారు...

ధన్యవాదములు
ఫాంట్ ఇంకాస్త తగ్గిస్తే
ఆమె గురించి చదవాల్సిన దుర్గతి మాకు తప్పేది.
జాగ్రత్త కాంగ్రెస్స్ గవర్నమెంట్ విద్య శాఖా చదివితే పాఠ్యాంశం గా పెట్టేయ గలరు.
అసలు ఆ కుటుంబానిది ఒక రాజనీతా ?
పదవీ వ్యామోహం
అవినీతి దాసోహం.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఆత్రేయ గారు ధన్యవాదములు..పాంట్ సైజ్ ఎందుకో అలా మారి పోయిన్దండీ!ఇబ్బంది కల్గినందుకు క్షమించండి. నా పోస్ట్ ఒక పౌరురాలిగా నా ఆవేదనని వెళ్ళగక్కిన తర్వాతే.. స్త్రీ మూర్తి దృక్కోణంలో..మానవతావాదిగా స్పందనతో..ఆమె గురించి వ్రాసుకున్నాను. అంతే తప్ప వారసత్వ రాజకీయాలను ప్రేమించి,ఆమోదించి కాదండీ.. స్పందించిన మీకు ధన్యావాదములు.

అజ్ఞాత చెప్పారు...

she didn't loose anything. Actually she gained a lot. She is not "thyaagaseeli", she tried to be PM but Kalam didn't accepted her and even she is scared of RSS at some time....to be PM

Tejaswi చెప్పారు...

వ‌న‌జ‌గారూ,

బాగా రాశారండి. ద్వేషంతో రాసే వ్యాఖ్యల‌ను ప‌ట్టించుకోకండి. ఆమెలో లోపాలు ఉంటే ఉండ‌వ‌చ్చుగానీ వాటికి మించిన‌ సుగుణాలు చాలానే ఉన్నాయి. ఉదా.కు సీతారామ్ కేస‌రి, పీవీ న‌ర‌సింహారావుల(ఆయ‌న ప‌రిపాల‌న బాగుండొచ్చుగానీ, పార్టీనీ ఏమీ ప‌ట్టించుకోలేదు) హ‌యాంలో నానాటికి తీసిక‌ట్టుగా మారిన కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితిని గాడిలో పెట్టింది...ఒక్కతాటిమీద‌కు తీసుకొచ్చింది. గ‌త‌రెండు ఎన్నిక‌ల‌లో యూపీఏకి అధికారంరావ‌డంలో ఆమె పాత్ర లేద‌ని అన‌గ‌ల‌మా. యూపీఏ-1కి terms dictate చేసిన లాలూ, సీపీఎమ్‌ల‌ను యూపీఏ-2నాటికి వ‌దిలించుకుంది. అయితే యూపీఏ-2 హ‌యాంలో అనారోగ్యంవ‌ల్ల ప‌ట్టించుకోక‌పోవ‌డంవ‌ల్ల‌నేమో పాల‌న రోజురోజుకూ దిగ‌జారుతోంది. ప్ర‌భుత్వం కుంభ‌కోణాల్లో ఇరుక్కుపోయింది. మ‌న్మోహ‌న్ మంత్రివ‌ర్గంమీద ప‌ట్టుకోల్పోయారు. ముందుముందు ఎలా ఉంటుందో అర్థంకావ‌డంలేదు.

త‌న భ‌ర్త‌ను హ‌త్య‌చేసినవారికి క్ష‌మాభిక్ష పెట్టిన మాన‌వ‌తావాది. భ‌ర్త చనిపోయిన త‌ర్వాత, ఈ , రాజ‌కీయాలొద్దు బ‌తుకుజీవుడా అనుకుని భ‌యంతో దేశం వ‌దిలిపెట్టి పారిపోయేవారు మ‌రొక‌రైతే. అయితే ధీర‌గుణంతో నిల‌బ‌డట‌మేకాక దేశాన్ని వెన‌క‌నుండి న‌డిపించ‌డం సామాన్య విష‌యంకాదు

Shabbu చెప్పారు...

ఆత్రేయ గారి వ్యాఖ్యలను వనజగారు లైట్ గా తీసుకోవచ్చుగానీ నన్ను కొంత ఇబ్బందిగా అన్పించాయి, ఎందుకంటే ఈ విషయముగా వనజ గారు తన పోస్ట్ లో చివరన ఇది నా స్వంత అభిప్రాయమని తెల్పినట్లు నాకనిపిస్తుంది,ఇంకా ఆత్రేయ గారు ముందుగా ఫన్నీగా చెప్పినప్పుడు అంశం పూర్తిగా అలాగే ఉండాలి, కానీ పూజ్యులు, పెద్దలు ఇలా కాకతాళీయముగా మొదలుపెట్టి ఇలా వదిలేయడం అస్సలు బాలేదు,,
ఈ కామెంట్ కూడా నా అభిప్రాయం మాత్రమే
Shabbu, KNR

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అజ్ఞాత గారు సోనియా పొందినది ఏమిటి,పోయినది ఏమిటి అన్నది మాన జాతి మొత్తానికి తెలుసు. దేశ భవితని అవినీతిమయంలో నెట్టిన విధం తిలా పాపం తలా పిడికెడు. ఆ కోణాలని వదిలేస్తే ఆమెని కాదన్న చోటనే.. నిలబడి చూపించారు ఆమె తప్ప వేరే దిక్కే లేదన్నట్టు మెజారిటి ప్రజలు తీర్పు ఇచ్చారు. వారసత్వ రాజకీయ మనుగడ కోసం ఆమె శ్రమిస్తున్నారు. వాటినన్నిటిని పక్కన పెట్టి.. ఒక స్త్రీ మూర్తి అనే కోణం లోనే నేను ఆవిడని చూసాను. ఈ అభిప్రాయం నా వ్యక్తిగతం .. ఎవరిని ఆమోదించమని,బలపరచమని నేను అనుకోలేదండి. స్పంధించినందులకు ధన్యవాదములు.

తేజస్వి గారు.. నేను చెప్పినదాన్ని మీరు సరిగా అర్ధం చేసుకున్నారు. ధన్యవాదములు.

షబ్బు గారు.. ధన్యవాదములు, చర్చ జరగడం మంచిదే ! కొన్ని కొత్త కోణాలు మనము దర్శించవచ్చు.

ఆత్రేయ చెప్పారు...

మళ్ళీ సమాధానం ఇచ్చేంత తీరిక లేకున్నా ఇస్తున్నా.
నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి.
@ మొదటగా ద్వేషం గా రాసే రాతల గురించి ...
నాకూ సోనియా గాంధీ కి ఉన్న వైరం ఇప్పటిది కాదు ఏమీ చెయ్యలేక ఇలా రాసి కసి తీర్చుకున్నా. పార్టీ ఝండాలు పట్టుకుతిరిగే ప్రత్యేక వ్యక్తిని కాను.
అధికారం లో ఉన్న పార్టీ చేతగాని తనాన్ని తిట్టుకునే సామాన్య ప్రజా లో ఒకడిని.
దశాబ్దాల తరబడి దేశాని దోచుకు తింటున్నా ప్రతీ రాజకీయ నాయకుడినీ మనసార తిట్టుకునే (ఇంతకన్నా చేసేది లేక)మామూలు భారతీయుడిని.
@ నేను ఫున్నీగా మొదలెట్టి మధ్యలో ఓదిలేసాను
అవును కడుపు మండి కోపం గా చెప్పదలుచుకున్నది సరదాగా వ్యక్త పరచే పద్ధతి నాది.
జూలియన్ అస్సంజే ని అడగండి
ఏ వెధవకి ఎంత సొమ్ము యూరోపియన్ బ్యాంకుల్లో మూలుగుతుందో.
ఆ సొమ్ము ఎలా వచ్చిందో, ఎవడు ఎలా సంపాదించి ఎలా చచ్చాడో వివరంగా చెప్తాడు.
సోదరి వనజ గారి వ్యక్తిగత అభిప్రాయం రాసారు
అలాగే నేనూ ...
ప్రచురించే/ తిరస్కరించే హక్కు ఆమెకి ఉంది.
నవ్వుతూ ధన్యవాదములతో ...నేను