5, ఫిబ్రవరి 2012, ఆదివారం

ఉడాన్




అప్పుడే చురుక్కు మనిపించే పాల్గుణ మాసపు ఉదయపు ఎండలో.. వడివడిగా నడుస్తూ బస్ స్టాప్ వైపుకి వెళుతున్నాను .
తండ్రి ఎదురొచ్చి.. షబానా! ఏ మహీనా కే కమాయి కే పైసా లావో " అన్నాడు.
"బిల్కుల్ బాబా.." అంటూ..ఆగకుండానే ముందుకు కదిలింది. అమ్మీ ఎప్పుడు ఆ వంట గదిలోనే ఉంటుంది అయినా వంట చేయడం త్వరగా అవదు. వంటయి లంచ్ బాక్స్  తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. లేకపోతే ప్రతి రోజు తన మధ్యాహ్నపు    భోజనానికయ్యేఖర్చుతో ఇంటిల్లపాది రెండు కూరలతో రెండు పూటలా తినవచ్చు అని  ఆలోచిస్తుంది. తండ్రి అనారోగ్యంతో పని చేయక రెండేళ్ళు  అవుతుంది. ఆయన కి మందులకి, మంచి ఆహారం అందించటానికి తనకన్నా చిన్నవైన నాలుగు చేతులు కష్టపడుతూనే ఉన్నాయి. అయినా అవసరాలు తీరవు. రోజు ఏమేమి సరుకులు నిండుకున్నాయో అవి కావాలని అమ్మీ తనకి మాత్రమే చెపుతూ ఉంటుంది. తండ్రి దర్జీ పనిలో ఆదాయం బాగా ఉన్న రోజుల్లో విలాసంగా బ్రతికిన తమ కుటుంబం ఇప్పుడు అర్ధాకళ్ళతో బ్రతకాల్సి వస్తుందని  దిగులు ముంచుకొస్తుంది.

తమ ఇంటి ప్రక్కనే ఉంటున్న ఉష ఆంటీ (నేను ఆమెని నా రెండో అమ్మ అంటాను) అమ్మీతో ఎప్పుడూ చెపుతూనే ఉండేది "ఆదాయం బాగా వస్తున్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేయండి. ఇద్దరాడపిల్లలు ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళకి, మగ పిల్లల చదువులకి ఆదుకుంటాయని.

అందుకు భిన్నంగా ఎప్పుడు చూసినా...  ఇంటినిండా చుట్టపక్కాలు. కిలోలకి కిలోలు బిర్యాని డేగిసాలు దించడం తప్ప ఏమి ఉండేది కాదు. మామూలు చదువులు మానేసి "మదర్సా లో చదువుకోవడం వల్ల ఇప్పటి చదువులు ఏమిటో తెలియక పోవడం తో.. ఉన్న టెన్త్ క్లాస్స్ అర్హత తోనే .ఈ నెట్ సెంటర్లో ఈ చిన్న పాటి ఉద్యోగం అయినా దొరికింది. అది కూడా తనకి వరుసకి అన్నయ్య అయ్యే బంధువుల అబ్బాయి రికమండ్ చేయడం వల్లనే దొరికింది. తమ్ముళ్ళు ఇద్దరు కూడా చదువు మానేసి చేతి పనులు చేస్తున్నారని  రోజూ అమ్మీ కళ్ళు ఒత్తుకుంటుంది. చెల్లెలు పోద్దస్తమాను ఇంట్లో దర్జీ పని చేసి సంపాదిస్తూనే ఉంటుంది. పాతికేళ్ళు దాటినా ఆడ పిల్లలకి పెళ్లి చేయలేక పోతున్నామని  అమ్మి మామయ్యల దగ్గర వాపోతూ ఉండేది. అన్నీ వింటూ తను మౌనం వహిస్తుంది. ఇప్పటికే ఇంటద్దె భారం అయిపోయి సరిగా అద్దె కట్టక  ఇల్లు కాళీ చేయాల్సిన పరిస్థితి. అయినా పొద్దుగూకే సరికి అబ్బాకి.. మాత్రం ఓ క్వార్టర్ బాటిల్ కి అయినా డబ్బిచ్చుకోవాలి,అలాగే  రెండో మూడో సిగేరేట్ పేకెట్లు  కొనివ్వకక తప్పదు . ఇలా ఇంటి పరిస్థితులు గురించి ఆలోచించు కుంటూ బస్ ఎక్కి కూర్చుంది

కండక్టర్ టికెట్ అడిగాడు.డబ్బులు ఇచ్చి స్టేజి పేరు చెప్పాను.

"మీరు ఏం చెపుతారో మాకు అర్ధం కాదు.  కాస్త ఆ నకాబ్ తీసి చెబితే మాకు సులువు. మా ఖర్మ కొద్ది రోజూ.. ఈ ఊరుకొచ్చే బస్ డ్యూటీలే వేసి చావ బెడతారు." అని విసుక్కున్నాడు.

ప్రక్కనే ఉన్న ఊరి నిండా మా  మతస్తులే ఉండటం మూలంగా స్త్రీలు అందరూ..బురఖా ధరించే బయటికి రావడం కద్దు. తను చూసుకోకుండా ఆ బస్సే  ఎక్కింది. వాళ్ళల్లో తన బంధువులు ఉండవచ్చు అయినా తను గుర్తు పట్టలేదు. అంతా బురఖా ధరించే ఉన్నారు తనలాగే! తను పని చేసే నెట్ సెంటర్ లోను అంతే! ఏమిటయ్యా !  మీ చెల్లెలి అందం చూసి నేను ఉద్యోగం ఇస్తే ఆ అందానికి ఎప్పుడు ముసుగు వేసుకుని వస్తుంది. కౌంటర్లోకూడా   బురఖా తీయకుండానే కూర్చుంటానంటుంది, ఇలా అయితే నా నెట్ సెంటర్ కాస్త మూసుకోవాల్సిందే.! అని అంటాడు.

తను మదర్సాలో చదువుకున్నప్పుడు ఖురాన్లో ఏం చెప్పబడిందో.. తనకి..ఆణువణువూ జీర్ణించుకు పోయింది. తమ మతంలోని స్త్రీలు తప్పని సరిగా.. బయటి వెళ్లి నప్పుడు బురఖా ధరించాలని పర పురుషుల కంట పడకుండా జాగురకతతో..తమని తాము కాపాడుకోవాలని ఉంటుంది. తమ మత స్త్రీలు అందరు అలానే పాటిస్తారు కూడా . బురఖా వేసుకున్న స్త్రీలని చూస్తే అందరికి ఎగతాళే ! తతిమా .వాళ్ళ కుటుంబాలలోని స్త్రీలు మాత్రం గాజులు వేసుకుని, ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని వారి వారి సంప్రదాయాలని వారు పాటించడం లేదు !? వారి సంప్రదాయాలని ఛాందసం   అని తాము చిన్న చూపు చూసామా! లేదు కదా!? అని బేరీజు వేసుకుంది.

సిటీ లో బస్ స్టాప్లో దిగి మెయిన్ రోడ్ నుండి కొంచెం లోపలకి ఉన్న నెట్ సెంటర్ కి వెళ్లి సెక్యూరిటి అతని సాయంతో హడావిడిగా తెరిపించింది. ఇంకొంచెం ముందు రండమ్మా!వచ్చే వాళ్ళు ఇంత ఆలస్యంగా తెరిస్తే ఎలా అని తెగ గొడవ చేస్తున్నారు అన్నాడు. వచ్చే వాళ్ళలో..చాలా మంది చాటింగ్ కోసం వచ్చే వాళ్ళే! టైం నోట్ చేసుకుని.. సిస్టం అప్పగించే ముందు.. కావాలని మాటలు కలుపుతారు. ఆ బురఖా తీయ వచ్చు కదండీ..అంటారు. ఇద్దరు ముగ్గురు కలసి.. ద్వంద అర్ధాలతో.. మాట్లాడుతూ ఉంటారు. అమ్మడు బుల్లెట్ ప్రూఫ్ తీయదురా.. తీస్తే అందాలన్నీ కనబడతాయనేమో..అంటాడొకడు. అసలు అక్కడ చూడదగ్గవి ఏమైనా ఉన్నాయో లేదో.. అంటాడు ఇంకొకడు. కళ్ళ నీళ్ళు జల జల రాలతాయి. అవి రాలినట్లు ఈ లోకానికి తెలియనవసరం లేదు. ఆ పరదా మాటునే ఇంకి పోతాయి.

అసలు నువ్వు నీ పరదాని తీస్తే..  పొద్దస్తమానం వీళ్ళందరు  పిచ్చి కుక్కల్లా నీ చుట్టూ తిరగరు అంటుంది నా రెండో అమ్మ. ఆమెకి నేను అంటే చాలా ఇష్టం. మా షబానా ని చూడండీ. కళ్ళెత్తితే కనకాభిషేకాలే! తన తెలివి తేటలకి, మాట తీరుకి , మంచితనానికి ఎంతటి వీరుడైనా, దీరుడైనా పడిపోవాల్సిందే.! .అని హాస్యం ఆడుతుంది. స్వచ్చంగా తెలుగు మాట్లాడే తనని చూసి ఆశ్చర్య పోతుంది. నీకు ఇలాటి బాష ఎలా వచ్చు..? అనడుగుతుంది . అవును మరి నేను తెలుగుదేశం లో పుట్టక పోయే అని నవ్వుతుంది. నేను పుట్టింది ముస్లిం కుటుంబంలో అయినా పెరిగింది.. అంతా హిందువల మధ్యనే! ఆ మాత్రం రాకుండా ఎలా ఉంటుంది. మీ పండుగలు అన్నీనా పండుగలే కదా!  కాదా ?అని అడుగుతాను.  అప్పుడు ప్రేమగా ఓ..మొట్టికాయ వేసి..మురిసిపోతుంది. తన వెంట వాళ్ళ బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు.. బొట్టు లేకపోయినా వాళ్ళ అమ్మాయినే అనుకునే వారు. చిదిమి దీపం పెట్టవచ్చు మీ అమ్మాయికి పెళ్లి చేస్తారా అని అడుగుతుంటే..మేమిద్దరం నవ్వుకునే వాళ్ళం  తప్ప నేనొక ముస్లిం అమ్మాయినని  అసలు చెప్పేది కాదు. ఆమెకి నాకు ఉన్న అనుబంధం అలాటిది.

నెట్ సెంటర్ యజమాని..నలబయిలకి దగ్గర పడినవాడు. కావాలని రాత్రి పొద్దు పోయేవరకు కూర్చో బెడతాడు. ఒక రోజు" ఏం పెర్ఫ్యూమ్ వాడతావ్" అని అడిగాడు.
"లేదు..నాకు అలవాటు లేదు " అంటే అపనమ్మకంగా చూసాడు. ఒక రోజు సమీపంగా వచ్చి నిలబడి.. " నీ శరీర సుగంధం నన్ను పిచ్చివాడిని చేస్త్జుంది. నువ్వు అవునంటే.. ఈ నెట్ సెంటర్ నీ సొంతం చేస్తాను" అని అన్నాడు. వెంటనే అక్కడి నుండి  లేచి విసురుగా  ఇంటికి వచ్చేసింది తను . రెండు రోజులు జ్వరంగా ఉందనే వంక పెట్టి పడుకుండి పోయింది. మూడవ రోజు..నెట్ సెంటర్ యజమాని తన అన్నయ్యని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు! అలాటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త తీసుకుంటాను అంటున్నాడు. వాడే అసలు ఇబ్బంది అని చెప్పలేక పోయింది. తను తెచ్చే జీతం రాళ్ళ కోసం ఎదురు చూసే ఇంట్లో వాళ్లకి తన ఇబ్బందేమిటో  వివరించి చెప్పలేదు.

అలా నెలలు గడుస్తున్నాయి. అబ్బాజాన్  సమీప బంధువల వైపు నుండి నా కోసం  పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి మాకు నచ్చింది పైగా అరబిక్ లో ఖురాన్ గ్రంధంని బాగా చదువుకున్నపిల్ల గనుక కట్న కానుకలు ఏమి అక్కరలేదు పెళ్లి జరిపించండి అని అడిగారట. అబ్బా ...అమ్మతో చెపుతూనే నావైపు "ఏమంటావ్?" అన్నట్లు చూసారు. అబ్బా జాన్ ముందు ఎప్పుడు నోరు విప్పి మాట్లాడని అమ్మి వెంటనే..  "ఆ ఇంట్లో నేను పిల్లని ఇవ్వను.." అనేసింది.
పైసలు అడగడం లేదు,మనకీ  బరువు తగ్గుతుంది " అన్నాడు అబ్బాజాన్
   
 " ఆ ఇంట్లొ అందరు ఛాందసులు. ఆడవాళ్ళందరు వంటిళ్ళల్లో మగ్గి పోవాల్సిందే!  లోకం ముఖం చూడనివ్వరు. పైగా పిల్లవాడు ఖాజీ.. ఆ గడ్డం పెంచుకుని ఎప్పుడూ.. ఊర్లమ్మట తిరుగుతూ..ఉంటాడు. పిల్లలిక చాలనుకునే ఆపరేషన్లు ఉండవు, ఒక సరదా ఉండదు సంతోషం ఉండదు,  నేనక్కడ పిల్లనివ్వడానికి ఒప్పుకోను " అని ఖరాకండిగా చెప్పేసింది.

"అలాటిచోట పిల్లని ఇవ్వకుంటే.. మరి ఎందుకు మదర్సాలో పెట్టి ఏళ్ళ తరబడి చదివిన్చావ్? ఆడ పెత్తనాలు ఎక్కువ యిపోయాయి." అని అబ్బాజాన్  బాగా కోపగించుకున్నాడు.

"ఖురాన్ చదవడం అనేది అల్లా గురించి తెలుసుకోవడానికి, మంచి-చెడు తెలుసు కోవడానికి .
లోకమంతా  మారింది. అదివరకంత  చాందసంగా ఎవరూ  ఉండటం లేదు. ఆ ఇంట్లో  నేను పిల్లనివ్వనంటే ఇవ్వనని చెప్పేసింది.

పిల్ల చేత ఉద్యోగం చేయించుకుని  కూర్చుని తింటున్నారు. అయినా ఉద్యోగం చేసిన పిల్లని మా ఇంట కోడలిగా చేసుకోమని మళ్ళీ వాళ్ళే అన్నారని వార్త మోసుకొచ్చింది తన మేనత్త.

ఆరోజు ఇంట్లో పెద్ద యుద్దమే జరిగింది. అమ్మి  నన్ను ఉద్యోగం  మానేయమంది.

ఆ క్షణం నేను చేస్తున్న ఉద్యోగం మానేద్దామనుకున్నాను, కానీ మానలేకపోయాను. అప్పటి అవసరాలు అలాటివి కూడా.

మత సంప్రదాయాలు మనిషికి నడవడికని నేర్పాలి కానీ మనిషి మనుగడనే శాసిస్తున్నట్లు ఉంటే ఎలాగో నాకర్ధం  కాలేదు ?  సంప్రదాయం పాటిస్తూనే లోకంలో మనుగడ సాగించుకునే స్వేచ్చ తమకి లేదా? పరదా వేసుకోవడమన్నది కేవలం మాకు మాత్రమే సంబంధించిన విషయం. పరదా వేసుకోవడమో, లేదా వేసుకోక పోవడమో వల్ల ఇతరులకి వచ్చే ఇబ్బంది ఏమిటి?

తన మతానికి  చెందిన అబ్బాయ్ ఒక హిందువుల పిల్లని ప్రేమించాడు. ఆ అమ్మాయితో సినిమాకి షికార్లకి తిరగాలని అతని కోరిక. ఆ అమ్మాయి పెళ్లి జరిగే వరకు అలాటివి కుదరదు అంటుంది. అతనేమో పోనీ నేను ఒక ఉపాయం చెప్పనా? అంటాడు. ఆ అమ్మాయి ఏమిటని అయిష్టంగానే అడుగుతుంది. నేను బురఖా తీసుకుని వస్తాను అది వేసుకుని నాతో రా.. ఎవరికి అనుమానం రాదు  ఎవరికీ తెలియదు కూడా అంటాడు. "ఏమే! మీ బురఖా.. ఇందుకు  మాత్రం భలే ఉపయోగ పడుతుందా? రహస్య ప్రేమికులని కలపటానికి " అంటుంది కోపంగా నా రెండో అమ్మ.అలా బురఖా పవిత్ర భావాన్ని  చెడగొట్టే వారు ఉన్నారు.

అలాగే తన పెద్దమ్మ కూతురు.. నసీమా . ఆమె కూడా మదర్సాలోనే తనతో కలసి కొంత కాలం చదువుకుంది తర్వాత ఇంగ్లీష్ మీడియం చదువులు చదివింది. నసీమా ఓ..పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంది. కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చింది. ఆమెని తీసుకుని నా రెండో అమ్మ ఇంటికి వెళ్లాను. ఆ పిల్ల గురించి ఆమెకి చెపుతూ చదువు పూర్తయ్యే వరకు నా లాగే బురఖా వేసుకునే కాలేజ్ కి వెళ్ళేది. కేంపస్ సెలక్షన్స్ లో సెలక్ట్ అయ్యాక ఉద్యోగం కోసం బాండ్ వ్రాసింది. వేలల్లో జీతం. అక్కడ బురఖాకి ప్రవేశం లేదు. అయినా ఇంటినుండి బురఖా వేసుకునే వెళుతుంది. ఆఫీసుకి వెళ్ళిన తర్వాత లోవెయిస్ట్ పేంట్ వేసుకుని.. పొట్టి చొక్కాలు తొడుక్కుని ఆ చొక్కాని పదే పదే కిందకి లాక్కుంటూ జుట్టు విరబోసుకుని, చేతులమీద నూనుగు మాత్రమైనా  రోమం కనబడకుండా నీట్ గా తయారయి వెళుతుంది. ఆ అమ్మాయి చేసేవన్నీ మత విరుద్దమైన పనులే! అని చెప్పాను.

  ఏమిటే ఇలా చేస్తున్నావ్ అని ఆమెనడిగితే..

 నసీమా  ఇలా చెప్పుకొచ్చింది. కాలం మారింది,  నేను నా మతాచారాలు ప్రకారమే బురఖా వేసుకుని ఉద్యోగం చేస్తానంటే.. ఒప్పుకోరు.  ఒప్పుకోమని  చెప్ప కుండానే " వస్త్ర ధారణ అన్నది మీ ఇష్టం, కానీ ఇంకా పురాతనంగా ఉండటం ఎందుకు? మీ ముస్లిం దేశాల లలో మహిళా ప్రధానులు, అధ్యక్షులే..బురఖాని విసర్జించారు. బురఖాకి మీరు కూడా  స్వస్తి చెప్పండి "అంటారు. అలాగే తోటి ఉద్యోగస్తులు..మనపట్ల చూపే చిన్న చూపు, వెటకారాలు,అశ్లీల హాస్యపు మాటలు విని నేను బురఖాని విసర్జించాను. కానీ అది అక్కడ మాత్రమే.. మన ఇళ్ళల్లో మన వారి మద్య మన సంప్రదాయం పాటించడం నాకు చాలా ఇష్టం కూడా. ఒక వేళ రేపు నా పెళ్లి అయిన తర్వాత నా భర్త బురఖా వద్దన్నా వేసుకోమన్నా అది కేవలం నా ఇష్టం మాత్రమే కానీ వేరొకరి ఇష్టం ప్రకారం నేను నడుచుకోను ఎవరి ప్రభావం నాపై ఉండదు, ఉండనివ్వను  అంది దృడంగా 

అప్పుడు నా రెండో అమ్మ ఇలా చెప్పింది. నిజానికి మీ ముస్లిం స్త్రీలు చదువుకుంటున్నారు. వారికి నాగరికత తెలుసు.ఎంతో మంది అందగత్తెలు ఉన్నారు .అలా అని వారిని ఈ బాహ్య ప్రపంచంలో వెల్లడించుకోవాలో లేదో అన్నది వారి వారి వ్యక్తి గతం. అలాగే ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది అజ్ఞానం లో ఇంకా  బురఖా బందీఖానాలో బ్రతుకుతూ ఉన్నారు కూడా! వాళ్ళ బ్రతుకుల్లో మార్పు అవసరమనుకుంటే వాళ్ళు పోరాడతారు. వాళ్ళ తరపున మరి కొందరు పోరాడతారు.  ప్రపంచం మారుతుంది. మార్పు అవసరం కూడా అని చెప్పింది. ఇంకా లోతుగా ముచ్చటిస్తూ ... ముస్లిం రచయిత్రులు కూడా స్వేచ్చగా తమ అభిప్రాయాలు వ్రాయడానికి కుటుంబం ఒప్పుకోక పోవడం, వారి పైన ఆంక్షలు ఉన్నట్లు వారు వివిధ సందర్భాలలో చెప్పుకుంటారు. అయినా వారు వ్రాయడాన్ని మానలేదు కదా!  అంది మరింత వివరంగా.  ఆమె పరిశీలనకి ఆశ్చర్యపోతూ ... నేను, నసీమా కూడా  అవునన్నట్లు తల ఊపాం.

తర్వాత ఈ విషయం గురించి తెగ ఆలోచించేదాన్ని. ఎక్కడో..నాకు ఆచూకీ దొరికినట్లే దొరికి జారిపోయేది. సందేహం తీర్చుకోవడానికి అమ్మీని అడిగేదాన్ని. బురఖా వేసుకోకుంటే ఏమవుతుంది ?  అని.
"ఏమి అవదు. ప్రపంచంలో అందరు బురఖా వేసుకునే బయటికి వెళుతున్నారా..? మన వాళ్ళు కాని వారు బ్రతకడం లేదా !? అలాగే మనం బ్రతుకుతాము. కాకపొతే.. సంప్రదాయం లేనివాళ్ళ మని ఆడిపోసుకుంటారు అంతే.." అనేది. అలాంటి ఆలోచనలు అమ్మీ లో ఉండటం నాకు ఆశ్చర్యమే !

కొన్నాళ్ళకి నా రెండో అమ్మ వెంట నేను సూరత్ వెళ్లాను. ఆమె వెంట నేను ఎక్కడికయినా వెళ్ళే స్వేచ్చ  ఉంది. విజయవాడలో ట్రైన్ ఎక్కగానే  వెంటనే స్వేచ్చగా పక్షిలా ఎగరాలనిపించింది నాకు. బురఖా తీసి బేగ్ లో అడుగుకి కుక్కేసాను. స్వేచ్చగా గాలి పీల్చుకున్నాను. అలాగే బురఖా లేకుండానే నా రెండో అమ్మ వెంట ఒక నాలుగయిదు రోజులు హాయిగా తిరిగాను. అలా అని అయిదు పూటలా నమాజు చేసుకోవడం మానలేదు.

ఆ రోజు గురు పూజోత్శవం. అమ్మ వెంట నేను ఆ కార్య క్రమానికి వెళ్లాను. అక్కడ అడిగిన వారందరికీ ఎప్పటి లాగానే మా అమ్మాయి అని చెప్పి పరిచయం చేసింది. వాళ్ళు అందరికి పసుపు కుంకుమ ఇస్తూ.. నా నుదుటిన  కుంకుమబొట్టు  పెట్టారు. నేను అభ్యంతరం చెప్పలేదు. అదేమిటి ..ఒక ముస్లిం అమ్మాయి వాళ్ళ సంప్రదాయం కి విరుద్దంగా ముఖాన బొట్టు ఎలా పెట్టిం చుకుందని  ఆశ్చర్యం వద్దు.

" అవును ! నేను మారాను. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలనుకుంటానో అలాగే ఉంటాను నా కోసం, నన్ను అమితంగా ఇష్టపడే వాళ్ళ కోసం కూడా.   మతం, దేవుడు, ఆచారాలు వ్యక్తీకి  వికాసం కల్గించాలి. వికాసం కల్గించలేనివి,  మనిషిని మభ్య పెట్టేవి విసర్జించాలి" అనుకున్నాను.

మనిషి జీవితం గాలిపటం లాటిది. ఆ గాలి పటం ఎగరడానికి ఆధారం దారం. ఆ దారం మతం, ఆచారం కానవసరం లేదు  కదా !

5 కామెంట్‌లు:

హితైషి చెప్పారు...

chadhivaaka....... konthamandhynaa maarathaaru. kaaranam... nenu.....egaraalani korukuntunnAa.
"UDAAN" Chaalaa baavundhi.. churakaththi.

శశి కళ చెప్పారు...

yenta chakkati kadhanam...matam manishini rakshinchaali....avunu...

జ్యోతిర్మయి చెప్పారు...

వనజగారూ చివరి వరకూ ఆపకుండా చదివించారు. మీరెంచుకున్న కథా వస్తువులు కూడా వైవిధ్యంగా ఉంటాయి. ఇలా౦టి మంచి మంచి కథలు మీరు మరెన్నో వ్రాయాలి.

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

బాగుంది వనజ గారు... ఎగిరిపొతే ఎంత బాగుంటది అని ఫీలింగ్ రాకుంటా ఉండటానికి ఇంక ఏన్ని రోజులు గడవాలో...

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

హితైషి..మీ పేరు బాగుందండీ.. ఈ కథ మీకు నచ్చినందుకు ధన్యవాదములు.

@జ్యోతిర్మయి గారు.. మీ ప్రశంస కి ధన్యవాదములు.సామాజికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని నేను దర్శించిన కోణాన్ని బట్టి నేను రచన చేస్తున్నాను.అంతే నండీ! బురఖా అనేది చాలా వివాదస్పదమైనదిగా..హాస్యాస్పదంగా కొంతమందికి కొంతమందికి కనబడుతుంది. ముస్లిం వనితా అంతరంగం ఏమిటో తెలియాలి కదా!

@శశి గారు సజీవ పాత్ర చిత్రీకరణ ఈ కథ అందుకే అంత బాగా రావాలి అని నా ప్రయత్నం కూడా.. సఫలీ కృతం అయ్యానంటారా?

@ బాలు.. విహంగం లా ఎగరాలని షబానా లా చాలా మంది ఉంటారు. వారి సంప్రదాయం వారిని ఇంకా బందిహానా లోనే ఉంచుతుంది.మారాలి లేదా మార్పు రావాలి అనేది వ్యక్తిగతం. మనం ఏమి అనలేం
కదా!