10, అక్టోబర్ 2012, బుధవారం

నచ్చినా - నచ్చక పోయినా..


ముఖ  పుస్తకం  లో  స్వీయ చిత్రాలు  ప్రచురించుకోవడం  వల్ల ఇబ్బందులకి   గురవుతారని ఓ.ప్రక్క హెచ్చరిస్తున్నా  కూడా  వినకుండా అత్యుత్సాహం తో... షేర్  చేసుకుంటున్న వారిని చూస్తే  ఏమనుకోవాలో అర్ధం కాక జుట్టు  పీక్కుంటున్నాను ..అన్నాను నా స్నేహితురాలితో..

పీక్కుంటే ఉన్న జుట్టు  కూడా పోతుంది..అంత పని చేయకు. అయినా మంచి చెపితే ఎవరు వింటారు ? అని అంది

అవును మరి..

"ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠాన్ని " అని పాడుకోవడం ఎందుకు? అని సిరివెన్నెల గారిని తలచుకున్నాను.

చాలా కాలం నుండి వింటున్నాం..అమ్మాయిల ఫొటోస్ షేర్ చేయడం ప్రమాదం అని. అయినా వినడం లేదు. అందంగా ఉంటారు,ఆత్మవిశ్వాసం అధికం.

అబ్బ! అంతా చాదస్తం ! ఎం జరుగుతుంది.. లే! అని కొట్టి పారేయడం షరా మామూలే!

అమ్మాయిలే కాదు.. పెళ్లీడు కొచ్చిన అమ్మాయి ఉన్న తల్లి కూడా.. సింగిల్  స్టెప్ పైట వేసుకుని హీరోయిన్ లెవల్ లో ఫోటో కి పోజిచ్చి ..మళ్ళీ ఆ ఫొటోస్ ని ముఖ చిత్రంలో షేర్ చేసుకోవడం.. చూసాను.

అలాగే   అందమైన అమ్మాయిలూ  రోజుకొక  ఫోటో ని షేర్ చేయడం.. ఆ ఫోటో  కి   గుంపుజనం   అంతా లైక్ లు కొట్టడం .. ఇంకొందరు సొంగ కార్చుకునే బలహీన మనస్కులైతే హీరోయిన్ కన్నా నువ్వే అందం గా ఉన్నావు .. పిచ్చేక్కిస్తూ ఉన్నావ్ అని కామెంట్  పెడితే కూడా.. థాంక్ యు చెప్పే అమ్మాయిలూ ..

అమ్మో.. వీళ్ళు అమ్మాయిలా..? యువకుల మనసులతో..ఆడుకునే పిశాచాలు  అని అనుకోక తప్పదు. వీటిని  అన్నిటిని.. అన్ని పైత్యాలని చూసి చూసి రోత పుట్టిపోయింది అనుకో.. అని  ఆవేశంగా చెప్పి  మనసులో బాధని వెళ్ళగ్రక్కి కాస్త శాంతించాను.

ఇవన్నీ చూడటం ఎందుకు.. మనకి ఇష్టం లేదని.. అలా ప్రవర్తించడం మానమని మనం చెప్పగలమా! ఒకవేళ చెప్పినా  వింటారా? అక్కడ ఇమడ లేకపోతే  ఆ ముఖ చిత్రం కి బై బై చెప్పరాదు.. అని సలహా చెప్పింది.

 లాగిన్ అవడం చాలా తేలిక. డిలెట్  చేయడం చాలా కష్టం.రెండు మూడు సార్లు ఆ ప్రయత్నం చేసాను. కొందరు ఫ్రెండ్స్ వచ్చి చేరుతున్నారు. వారితో.. స్నేహం కోసం తప్పడం లేదు అన్నాను. ఒక రకంగా నాకు అయిష్టం కూడా ఏర్పడింది.

ఇంకొక విషయం చెప్పనా.. !? ఇప్పుడు పేస్ బుక్  అంటే పెళ్లి చూపుల వేదిక.  ఒక అమ్మాయి వడ్డాణం  పెట్టుకుని మరీ ఫోటో షేర్ చేసుకుని స్టేటస్  చెపుతుంది. అయినా ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి సంబంధం కుదరలేదు ..అని చెప్పాను.

మా పరిచయస్తులలో ఒక అబ్బాయి కి పెళ్లి సంబంధం ఖరారు అయింది. అబ్బాయి తప్ప అందరు అమ్మాయిని చూసి మెచ్చి సంబంధం ఖాయం చేసుకున్నారు. అబ్బాయి అమ్మాయి ఫొటోనే చూసాడు. పెళ్లి రెండు రోజులు ఉందనగా అబ్బాయి.. అమ్మాయి పేస్ బుక్ లో అమ్మాయికి యాడ్  అయ్యాడు. వెంటనే ఆ అమ్మాయిని నేను చేసుకోను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. పెళ్లి క్యాన్సిల్  అన్నాడు. కారణం ఏమిటంటే.. ఆ అమ్మాయికి  నాలుగు వందలమంది పైగానే ప్రెండ్స్  ఉన్నారు.. అందులో మూడొంతులు మంది అబ్బాయిలే ఉన్నారు. నాకు వద్దు అన్నాడట.

ఇలా ఉన్నాయి.. వైపరీత్యాలు. ఎవరిని తప్పు పడతాం?

స్నేహం చేయడం,లేదా స్నేహితులు అందరూ సమూహంగా ఉండటం.. ఇష్టాలు, అభిప్రాయాలు కలసి.. ఏదైనా సామాజిక అంశాలు పట్ల స్పందించడం, తమ వంతు  స్పందన తెలుపుకుంటూ.. వీలయితే  ఎలా మెలగాలో చెప్పుకోవడం ఇవన్నీ తప్పు అని నేను అనను. కానీ.. అధిక సమయాలు  సోషల్  నెట్వర్క్ లలో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ.. అక్కడే సర్వస్వం ఉన్నట్లు ఇతర కుటుంబ సభ్యులకి ప్రాధాన్యం ఇవ్వకుండా.. మెలగడం.. ఏం  బావుంటుంది. !?

అన్నిటికన్నా తమ ఫొటోస్ ని షేర్ చేసుకోకుండా ఉంటె బావుంటుంది. వారి ఫొటోస్ ని తస్కరించి.. కాని చోట్ల వాడే వారికి సులభంగా  అందించి.. ఇబ్బందులలో పడే ప్రమాదం అయితే  ఉంది కదా! అమ్మాయిలూ  కాస్త ఆలోచించండి.

అందం గా ఉంటారు. ఫోటో పెట్టుకోవడం తప్పు కాదు. కానీ..దొంగల చేతికి తాళాలు ఇవ్వడం లాంటి పని ఇది.
అలాగే అందం కన్నా.. ఆత్మ విశ్వాసంతో..  మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం నేర్చుకుంటే..  నిత్యం మొబైల్ అప్లోడ్స్ అవసరం ఉంటుందంటారా!? ఆలోచించండి.

( ఈ  నా మనసులో మాట  నా ఫేస్  బుక్ ఫ్రెండ్స్ కి ఎవరికైనా వర్తిస్తే.. మన్నించండి. నొప్పించాలని నేను ఈ పోస్ట్ వ్రాయడం లేదు. రిస్క్ లో పడవద్దని, స్వీయ చిత్రాలకి ప్రాముఖ్యత ఇవ్వడం తగ్గిస్తే బావుంటుందని ఉద్దేశ్యంతో.. వ్రాసాను. ఎవరికైనా నచ్చకపోతే.. లేదా నచ్చినా కూడా..సమంగానే స్వీకరిస్తాను.)

19 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

వనజ గారు ఒక చక్కటి సందేశాన్ని మీ పోస్ట్ ద్వారా అందించారు అభినందనలు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారూ..
నిజమేనండీ ఆలోచించాల్సిన మంచి విషయాన్ని చెప్పారు..బాగుంది..

Unknown చెప్పారు...

well said vanaja garu

అజ్ఞాత చెప్పారు...

ఇంకా చాలా జరుగుతున్నాయండీ. ఇది ఆడ పిల్లలికి తెలుసు కూడా. తెలిసి ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఈ టపా మీరు కనకే రాయగలిగేరు. మా లాంటి వాళ్ళం రాస్తే మా బతుకు బస్ స్టాండే :)

Lasya Ramakrishna చెప్పారు...

చక్కటి సందేశాన్ని మీ పోస్ట్ ద్వారా అందించారు

శ్రీ చెప్పారు...

థింక్ ట్యాంక్ కి పని చెప్పాల్సిన పోస్ట్ ఇది...
చెప్పామనుకోండి ...మీ మగవారేనా ఫోటోలు పెట్టుకుంటారు?
అంటూ విరుచుకు పడే ప్రమాదం ఉంది....
వనజ గారూ!
శర్మ గారు చెప్పినట్లు ఈ విషయాన్ని మీరు చెప్పారు కాబట్టి సరిపోయింది...
ఎందుకంటే ఎవరో బ్లాగ్ లో చెప్తే...దానికి ఓ అజ్ఞాత చాలా ఇబ్బందికరంగా
ఆ బ్లాగర్ని విమర్శించారు...
ఎప్పటిలానే ఇది కూడా సందేశాపూర్వకమైన మీ మంచి పోస్టుల్లో ఒకటి...
@శ్రీ

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

వనజావనమాలి గారు,
మంచి విషయం చెప్పారు. ఈ విషయాలు పెద్ద సీరియస్ గా తీసుకునే వాళ్ళే తక్కువ. శర్మగారు, శ్రీగారు చెప్పినది నిజమే. ఈ విషయాన్ని మగవాళ్ళు ఎంత మిత్రులైనా చెపితే అపార్థం చేసుకునేదే ఎక్కువ. ఇక మనము చెప్పినా ఏదో పాతకాలపు ఆలోచనలు అని తేలిగ్గా తీసుకునేదే జరుగుతుంది. ఏంచేద్దాం? అడుసు తొక్కి కాళ్ళు కడిగితేనే వాళ్ళకు తెలిసొచ్చేది.

రాజ్ కుమార్ చెప్పారు...

సరిగ్గా చెప్పారండీ...
నేనూ ఆ మధ్య పీక్కున్నాను జుట్టు. అన్నీ తెలిసిన వాళ్ళే చక్కగా ఫోటోస్ పెడుతున్నారు.
ఏదయినా బ్యాడ్ అయితే ఏడవటం తప్ప ఏం చెయ్యలేరు.

కామెడీ ఏంటంటే.. ఇలా లేడీస్ ఫోటోస్ పెట్టడం మంచిది కాదు అని ఒక చక్కని పోస్ట్ రాశారనుకోండీ..దాన్ని షేర్ చేస్తారు. కమెంట్లూ, లైక్స్... అంతేగానీ మేటర్ బుర్రలోకెళ్ళదు ;)

శశి కళ చెప్పారు...

నిజం చెప్పావు అక్క.ఈ అడ పిల్లలకు యెంత చెప్పినా అర్ధం కావడం లేదు యెంత ప్రమాదమో

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

ఇలాంటి ఇబ్బందులు అమ్మాయిలకి ఈ మధ్య చాలా వస్తున్నాయి.గుడ్ పోస్ట్.

Meraj Fathima చెప్పారు...

వనజా, మీరు చెప్పినదానిలో ఏమాత్రం తప్పులేదు.
మా వారు రోజూ నన్ను హెచ్చరించేది ఇలాంటి విషయాలే..
నేను సరదాగా ఆయన్ని ఆటపట్టిస్తాను మీ పోలీసు బుద్దికి అందరూ దొంగలుగానే కనిపిస్తారు అంటాను.
నేను పాప పోటో పెట్టిన రోజుకూడా చెప్పారు. మంచి హెచ్చరిక

Madhav Kandalie చెప్పారు...

చాలా కాలం క్రితం (అంటే బ్లాగులు అప్పుడప్పుడే ప్రాచుర్యం పొదుతున్న రోజుల్లో) స్వాతి లో అనుకుంటా ఒక కథ చదివా, రామనాధం గారి బ్లాగు అని. రామనాధం గారు తన స్వవిషయాలన్నీ ఆ బ్లాగులో రాయటం మొదలు పెట్టాక, ఒక సారి తను కుటుంబం తో సహా తిరుపతి వెళ్ళే వివరం రాస్తే, ఒక దొంగ ఆ బ్లాగు చదివి తాపీగా ఇల్లంతా దోచుకుని, ఇంట్లో ఒక వుత్తరం పెట్టి పోతాడు - మీ బ్లాగు కి ధన్యవాదాలు అని. ఆ కథ గుర్తు వచ్చింది.
సోషల్ నెట్ వర్క్ ని జాగ్రత్తగా (సెక్యూర్డ్ గా) వాడుకోకుండా స్వీయ చిత్రాలు, పరులకి తెలియకూడనటువంటి రహస్యాలు ఈ రోజు యువత యధేచ్చగా ప్రచురిస్తున్నారు.ఇబ్బందుల్లో పడుతున్నారు.
చాలా బాగుంది మీ టపా.

శిశిర చెప్పారు...

Well Said Madam.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వీణా లహరి గారు ధన్యవాదములు.

@ రాజీ గారు.. పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు.

@ skv రమేష్ గారు థాంక్ యూ!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలే ..మాస్టారూ..
ఫ్రెండ్ షిప్ ముసుగులో జరుగుతున్నా విషయాలు వింటూ ఉంటే ఇలా చెప్పాలనిపించింది

నేను కాకుండా ..ఎవరైనా ఇలా వ్రాసి ఉంటే ఏం జరుగుతుంది :-)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

లాస్య రామకృష్ణ గారు ధన్యవాదములు.

@ శ్రీ గారు.. మీరన్నది నిజమే..! కానీ ప్రమాదం అంచునే ఉన్న వారిని హెచ్చరించడం కూడా అవసరం కదా..
మీ స్పందనకు ధన్యవాదములు.

@ లక్ష్మీ దేవి గారు.. మీరన్నది నిజమే ! కానీ చెప్పకుండా ఉండలేం కదా ! ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజ్ కుమార్... :) మీరు చెప్పినది నిజం. అలాగే నేను చూసినది నిజం. ఇప్పుడు కూడా బుర్రలోకి ఎక్కదు

అనుభవంలోకి వస్తే గాని తెలుస్తుందేమో!
థాంక్ యు వెరీ మచ్ ఫర్ యువర్ కామెంట్ .

@శశికళ థాంక్ యు వెరీ మచ్.

@oddula రాజశేఖర్ గారు ధన్యవాదములు.

@ మేరాజ్.. థాంక్ యు! నేను చెప్పిన విషయం ని అర్ధం చేసుకున్నందుకు.ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మాధవ్.. మీ అభిప్రాయంతో.. నేను ఏకీభవిస్తాను వ్యక్తిగతమైన విషయాల పై బ్లాగులలో వ్రాసుకోవడం కూడా మంచిది కాదేమో!
అలాగే పోటోస్ షేరింగ్ మంచిది కాదు. అది అర్ధం చేసుకుంటే బావుంటుందని ఇలా చెప్పాలనిపించింది. మీ సూచన బావుంది థాంక్ యూ వెరీ మచ్.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Shishira gaaru.. Thank you very much!!

baavunnaaraa!?