11, జులై 2013, గురువారం

మునగ చెట్టు విరిగింది

ఈ పనిమనిషికి యేమొచ్చి చచ్చిందో, పది రోజులకి యెనిమిది  రోజులు యెగనామం పెట్టింది. తెల్లవారి లేస్తే పనులు చేసుకోవాలా లేదా, వస్తుందా రాదా అని ఆలోచించుకుంటూ బద్దకంతో  పని అలాగే వదిలేసి పదకొండు  గంటలదాకా యెదురుచూసి  చూసి యిక రాదనీ నిర్ధారించుకుని . ఆ  కోపాన్ని   సింక్లో పేరుకుపోయిన అంట్ల గిన్నెల కాస్త యింట్లో వాళ్ళ మీద కాస్త ప్రదర్శిస్తూ యెలాగోలా పనులు  చేసుకుంటూ ఆపసోపాలు పడిపోయింది నీలిమ.
ఇద్దరు  పసి పిల్లలతో వాళ్ళ  నవ్వులతో ,  అల్లరితో  యిల్లంతా వెలుగులుతో పాటు వాళ్ళ యేడుపులు, పేచీలతో, అనారోగ్యంతో యింట్లో వున్న పెద్దవాళ్ళందరికీ  దిక్కుతోచనివ్వని వైనాలు. వీటన్నింటి  మధ్య పనిమనిషి యెగ్గొడితే యెలా వుంటుందో వొక వారం రోజులకి బాగా అనుభవమయింది.

నీలిమ గిన్నెలు తోముకోవడం చూసి బట్టలుతికే ఆమె అడిగింది. ఈ రోజు కూడా  రమణ రాలేదా అని. ఆ అడగడంలో ఆరాదీయడం కన్నా వ్యంగమే  యెక్కువున్నట్లు తోచింది.

వస్తే నేను యె౦దుకు కడుక్కుంటాను అని  సమాధానం యిస్తూ  అక్కడి నుండి లేచి వచ్చేస్తుంటే  మీరు పని వాళ్ళందరిని వూరికే  నమ్మేస్తారండి. పోయిన నెలలోనే కదా కొత్త గ్యాస్ పొయ్యి యిప్పిచ్చారు. ఇక  వాళ్ళు  మీకు పని సరిగ్గా చెయ్యరు, కొన్నాళ్ళకి మీ కంటికి కనబడరు.

రమణ పనికి వస్తుందని జీతం పట్టుకుందామని నేను గ్యాస్ కనక్షన్ యిప్పించలేదు. మగ దిక్కులేని ఆడది. ఇద్దరు పిల్లలనేసుకుని వొంటరిగా ఉంటుంది. "పొయ్యి తడిచిపోయి పుల్లలు లేక అన్నం వండుకోలేదమ్మా పిల్లలు ఆకలితో అట్టాగే పడుకున్నారని చెప్పింది. తెల్లవారి బియ్యమేసుకుని వచ్చి యిక్కడ అన్నం వండుకు వెళ్ళింది. అంత కష్టం లో వుంటే   సాయం చెయ్యాలనిపించిది. మనమూ  బిడ్డలు కలవాళ్లమే  కదా ! పస్తులు వుంటే   చూస్తూ వూరుకోగలమా "

మరి ఆ విశ్వాసం యేది ? వారం రోజులు నాగా పెట్టింది. కనీసం పోన్ చేసి నాకు యిబ్బంది  వచ్చింది.  రావడం కుదరదని చెప్పొచ్చుకదా ! కులం తక్కువ వాళ్ళు అంతేనమ్మా నీతి లేని జాతి అంటూ   యె౦తైనా రమణ మాటకారి. ఆ మాటల వలలో పడిపోయి మీరు దానికి అన్ని డబ్బులు యిచ్చేసారు  అంటూ  తనకి యెప్పుడూ అడ్వాన్స్ గా డబ్బులివ్వని అక్కసుని ప్రదర్శించింది

వంట యింటిలో పని చేసుకుంటున్న నీలిమ పోన్ కి మిస్ కాల్ వచ్చింది. తీసి చూస్తే పని మనిషి రమణ నంబర్ అది. చూసి మెదలకుండా వుండిపోయింది. నిన్న తను పనికి వస్తుందా రాదా అని కనుక్కోవడానికి యెనిమిది సార్లు కాల్ చేసినా పోన్ తీసి మాట్లాడలేదు. ఈ రోజు అది మిస్ కాల్ చేస్తే నేను కాల్ చేసి మాట్లాడాలా? ఆప్త్రాల్ వొక పనిమనిషికి అంత  పొగరా ?  ఎంత పనికోసం ఆధారపడితే మాత్రం అంత  లోకువ అయిపోవాలా? తిరిగి కాల్ చెయ్యనుగాక చెయ్యను అని తీర్మానించుకుని ఆలోచనలో పడింది

ఇప్పుడు పని వాళ్ళు అంతా  హై టెక్ పనివాళ్ళు అయిపోయారు మిస్ కాల్ యిచ్చి పెట్టేయడం  అది చూసుకుని తిరిగి కాల్ చేయాలి . "పనికి రాలేనమ్మా.. పిల్లకి బాగో లేదు  అనో, అర్జంట్ గా వూరు వెళ్ళాలనో వొంక. వారాలకి వారాలు  పని మానేసినా యేమీ అనకూడదు, జీతం కోతకోయకూడదు. ఒకవేళ అలా చేస్తే యింకో పదుగురి చెవుల్లో మన గురించి వినకూడని మాటలు  వినబడతాయి.  వీళ్ళకేనంట రోగాలు నొప్పులు వచ్చేది, వీళ్ళకేనంట చుట్టాలు పక్కాలు ఉండేది అని అనవసర వ్యాఖ్యానాలు.

పని వాళ్ళు మనుషులే ! వాళ్ళకి కష్ట నుఖాలు వుంటాయి రోగాలు నొప్పులు వస్తాయి అని అర్ధం చేసుకోరెందుకు   అని   వొకప్పుడు అనుకునేదాన్ని. ఇప్పుడు తెలుస్తున్నాయి వాళ్ళ తెలివితేటలు అని ఆలోచించుకుంటూ వుండగా    ఆర్చుకుని తీర్చుకుని పన్నెండు  గంటలకి వచ్చిన పనిమనిషి రమణ ని చూసి తన్నుకు వస్తున్నకోపాన్ని అదిమిపెట్టుకుని ముఖాన నవ్వు పులుముకుని వచ్చావా తల్లీ ! ఈ నెలలో నీకు రాని  రోజులకి జీతం కోత అని  చెప్పింది .

రమణ అంత కన్నా ధీమాగా "అలాగే కట్ చేయండి " అని గిన్నెలు బయట పడేయండి అమ్మా!  పిల్లలిద్దరికి బాగోలేదు. పెద్దదానికి టైఫాయిడ్ జ్వరం, చిన్నదానికి వాంతులు విరోచనాలు. మరి పిల్లలని చూసుకోవాలి కదా అందుకే యిన్ని రోజులు రాలేదు అంటూ  సంజాయిషీ ఇచ్చుకుంది

మరి ఆ ముక్కే పోన్ చేసి చెప్పొచ్చుకదా ! రోజు వస్తావని యెదురు చూడటం రాకపోతే పనులు చేసుకోవడం అవస్థ పడిపోయాను.

మరి అదే ! మేమంటే యేమిటో అనుకుంటారు గాని  మేము రాకపోతే  యె౦త కష్టమో తెలిస్తే కాని అర్ధమయ్యిది మా విలువ " అంది.

 ఈ పనివాళ్ళతో వచ్చిన చావే ఇది.  ఒకటి మాట్లాడితే తక్కువ రెండు మాట్లాడితే  యెక్కువ . "మింగ మెతుకు లేకపోయినా మీసాలకి సంపెంగ నూనె"  అన్నట్లు  యె౦త గర్వం వొలకబొస్తారో !  ఇన్నాళ్ళు పని మానేసామే అని చిన్నమెత్తు బాధ కూడా ఉండదు వచ్చే జీతం వస్తే యెంత పొతే యెంత అన్నట్టు వుంటారు. అసలు పనికి వొప్పుకున్నాక అన్ని రోజులు పాటు మానేస్తే యెలా అన్న ఇంగితజ్ఞానం  కూడా వుండదు. జీతంతో పాటు రోజు కాస్త కూర పెట్టండి , తలనొప్పిగా వుంది కాస్త టీ పెట్టండి లాంటి డిమాండ్ లతో పాటు అన్నం మిగిలిపోయింది తీసుకువెళ్ళ మంటారా లాంటి  అభ్యర్ధనలు అన్నీ మామూలే! వాళ్ళ తిండి తిప్పలుతో పాటు వాళ్ళ యింట్లో వాళ్ళ రోగాలు నొప్పులు కూడా మనమే పడాలన్నట్టు మాట్లాడతారు. జీతంతో  పాటు భత్యాలు అన్నమాట యివన్నీ. మళ్ళీ పండగలప్పుడు అన్నీ మామూలే. ఈ పని మనిషిని భరించడం కన్నా వొక గంట యెలాగోలా కష్ట పడటం నయం అనుకుని యీ నెల పూర్తవగానే రమణని మానిపించేయాలి అనుకుంది మనసులో

వేసిన అంట్ల  గిన్నెలన్నింటికి మందంగా సబ్బు రాసి గిన్నెలు అరిగిపోతాయేమో అన్నంత సున్నితంగా రుద్ది  రెండు బకెట్లు పట్టే టబ్ లో ఒక ముంచు ముంచి స్టాండ్ లో పడేస్తూ  అయిదు నిమిషాల్లో గిన్నెలు కడగడం ముగించి  కాస్త టీ  పెట్టండమ్మా తలనొప్పిగా వుంది అని గుమ్మం ముందు కూర్చుంది. మనసులో తిట్టుకుంటూనే టీ కి నీళ్ళు పెడుతుంటే కాస్త అల్లం ముక్క కూడా వేయండమ్మా,  మీ మార్కు టీ  తాగి వారం రోజులయింది అని మునగ చెట్టు యెక్కిన్చేసింది. పెద్దపిల్లకి అన్నం పెట్టవద్దు అన్నారమ్మా ! ప్రిజ్ లో ఇడ్లీ పిండి వుంటే  కాస్త పెట్టియ్యండి అమ్మా,
హోటల్ లో యిడ్లీ తినబుద్ది కావడం లేదు, నీలిమ ఆంటీ వాళ్ళ యిడ్లీ బాగుంటది అని నా కూతురు అడిగిందమ్మా అంది. రెండోసారి మునగ చెట్టు యెక్కింది నీలిమ
మౌనంగా ప్రిజ్ డోర్ తీసి పిండి బాక్స్ తీసి నాలుగు యిడ్లీలకి సరిపడా పిండి యింకో బాక్స్ లోకి వేసింది.. టీ తాగుతూ పిల్లల అనారోగ్యాలతో యెంత అవస్థ పడిందీ  చెపుతూ  చిన్నదానికి పత్యం కూర పెట్టాలమ్మా మీరు  బీరకాయ కూర వండారు కదా ! కాస్త కూర వేడి అన్నం వేసి యివ్వండి  అని అడిగింది . అడిగినవన్నీ మళ్ళీ గిన్నెల్లోకి సర్ది యిచ్చింది తిట్టుకుంటూ

అన్నీ తీసుకుని బుట్టలోకి సర్దుకుని "పనిపాట చేసే వాళ్లకి మీరు కాక యెవరు పెడతారమ్మా  యిట్టా  " అని  మళ్ళీ మునగ చెట్టు యెక్కించేసి  అమ్మా,ఒక రెండు వందలు యివ్వండమ్మా ! పిల్లలని సాయంత్రం హాస్పిటల్కి తీసుకుపోవాలి  అంది.


బతక నేర్చిన పనిమనిషి  రమణని  చూసి వొక్క క్షణం కూడా ఆలోచించ కుండానే "నా దగ్గర డబ్బుల్లేవ్, అయ్యగారు యింట్లో  లేరు అని అబద్దమాడేసింది "

సర్లే యే౦ చేస్తాన్లేమ్మా, యింకో అమ్మగారిని అడిగి తీసుకుంటా. చెప్పడం మరిసిపోయాను  సాయంత్రం పనికి రానమ్మా . యెట్టోగట్టా మీరే  చేసుకోవాలి  అని గేట్ వేసి వెళ్ళిపోయింది.

మునగ చెట్టు కొమ్మ విరిగి ఠపీ మని క్రిందపడింది నీలిమ.

8 కామెంట్‌లు:

పూర్ణప్రజ్ఞాభారతి చెప్పారు...

చెట్టిక్కినమ్మ దిగకతప్పదు.. న్యూనుడి

ranivani చెప్పారు...

బాగుంది వనజగారూ కధ .అందరవీ ఇవే బాధలు .చివర్లో నవ్వొచ్చింది .కొసమెరుపు బాగుంది . పిల్లలకు క్యారేజీ సర్దించుకొని సాయంత్రం రానని చెప్పడం . పాపం నీలిమ!

కాయల నాగేంద్ర చెప్పారు...

కధ బాగుంది వనజగారు!

అజ్ఞాత చెప్పారు...

స్వయం శక్తిని నమ్ముకోవోయ్ మానవుడా అన్నారు మరి. మాకు పని మనిషి లేదు అందుచేత బాధలు తెలియవు. మేమే పని మనుషులం మళ్ళీ మాకొకరా :) ములగచెట్లు విరగడం సహజం :)

జలతారు వెన్నెల చెప్పారు...

:) పనివాళ్ళు బ్రతకనేర్చినవారు వనజ గారు.

ఆత్రేయ చెప్పారు...

కధ బాగుంది. ఇదే కధ రమణ ( పనమ్మాయి) కోణం లోంచి కూడా రాయండి.
ఎందుకంటే బతక నేర్వలేక పోతే ఇంకో దారి చావటమే కదా..
ఈ కాలంలో పని వాళ్ళు . చేయించుకునే వాళ్ళు అందరూ గడసరులే ...
ఇక్కడ నేనన్న పని వాళ్ళు అన్ని వర్గాల పనివాళ్ళు ( ఉద్యోగులు)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పూర్ణ ప్రజ్ఞా భారతి గారు మీ న్యూనిడి నిజమే నండీ! ధన్యవాదములు
@ నాగరాణి గారు ... పాపం నీలిమ ! ఇదోరకం కష్టాలు ఇల్లాళ్ళకి అలవాటే కదా! ధన్యవాదములు
@ కాయల నాగేంద్ర గారు స్పందనకి ధన్యవాదములు
@ కష్టే ఫలే మాస్టారూ ... ఒళ్ళు వంచి పని చేసుకోవడంలో ఉన్న సౌఖ్యం ఇతరులపై ఆధారపదినవారికి రానే రాదు. మీ ఇంటివారు అదృష్టవంతులు పనిమంతులు అయినందుకు చాలా సంతోషం అండీ ! ధన్యవాదములు
@ జలతారు వెన్నెల గారు .. మీరన్నది .. అవుననిపిస్తూ ఉంది. కానీ వాళ్ళకి ఇచ్చే జీతభాత్యాలని మర్చిపోతే సాటి మనుషులు కదా!సాయం చేస్తే సంపదలు కరిగి పోవులే అనిపిస్తూ ఉంటుంది. మీ వ్యాఖ్య కి ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఆత్రేయ గారు ... చాలా రోజుల తర్వాత బ్లాగులలో మీ పునర్దర్శనం చాలా సంతోషం. మీరు చెప్పినట్లే ఇంకో కథ వ్రాసి ఉంది. త్వరలో మీ ముందుకు తెస్తాను .ధన్యవాదములు