మౌనంగా వుండనీయని "మౌన సాక్షి "
చదవడం ఒక దాహం అయితే ఆ దాహార్తిని తీర్చుకోవడం కోసం నిత్యం కథలు చదవాలి. అలా చదివే క్రమంలో " మౌనసాక్షి " కథా సంపుటి నా చేతికి వచ్చింది. ఆ కథలన్నీ చదువుతుంటే అసలీ కథలన్నీ ఎక్కడినుండి వచ్చాయి మన మధ్యనుండే వచ్చాయి కదా అన్న సృహ కల్గుతుంది. మౌనసాక్షిలో కొన్ని కథలు సందేశాత్మకంగా సుఖాంతగా ముగిస్తే కొన్ని కథలు విషాదంగా ముగిసాయి. ఐదు డయాస్పోరా కథలు, ఐదు సాంఘిక కథలు ఒక కథ జానపదకథ లాంటి కథ. మొత్తం పదకొండు కథలు. ఇందులో ఒక కథ షార్ట్ ఫిల్మ్ గా కూడా రూపొందించబడింది ఏ కథైనా మనలని ఆలోచింపజేస్తుంది. ఒక్కో కథ చదివాక ఇంకేమి చదవాలనిపించక పుస్తకాన్ని మూసి ఆలోచిస్తూ కూర్చుంటాం.
టైటిల్ కథ "మౌనసాక్షి" చదువుతున్నప్పుడు మన మధ్యనే మనందరిలోనే ఉన్నకరుణారాహిత్యం యెంత పచ్చిగా వుందో తెలియజేస్తుంది బలహీనులపట్ల మనం స్పందించకుండా పాషాణాల్లాగా యెలా వున్నామో స్పందించే మనసున్నవాళ్ళు మౌనసాక్షిగా యెలా మిగిలిపోతున్నారో తెలిపే కథ.
నియంతృత్వ ప్రజాస్వామ్యంలో రక్తసిక్తమైన సాక్ష్యాలు యెన్నెన్నో . "పర్యవసానం " అనే కథ ఇలాంటిదే . పదిమందికి మంచి చేసేవాడ్ని, ప్రశ్నించేవాడిని అక్రమంగా పట్టుకుని కాల్చి పడేస్తే ఆ సంఘటనకి ముందు బస్ లో తన ప్రక్కనే కూర్చుని ప్రయాణించిన వ్యక్తి అతనే అని తెలిసినప్పుడు పిల్లలకి పాఠాలు బోధించే అరుణ అనే టీచర్ సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడితే ఆమె నోరుని బలవంతంగా మూయించిన కథ యిది.
కదిలించే కథ "రైల్వే సత్యం " కుటుంబం కోసమే కాదు తోటి కార్మికుల హక్కుల కోసం యాజమాన్యంతో గొడవపడే ఆత్మాభిమానం ఉన్న గూడ్స్ డ్రైవర్ కథ. తన పిల్లల పట్ల ప్రేమ,బాధ్యత, అంతకుమించి కలలు, వాళ్ళ భవిష్యత్ పట్ల ఎన్నో ఆశలు పెట్టుకున్న అతను వాటికి ఆటంకం కలగకూడదని ఆఖరికి ప్రాణ త్యాగం చేస్తాడు. కదిలించే కథ యిది.
"అశ్రువొక్కటి" కథ సాయుధపోరాటదళంలో ఒక కొరియర్ గా పనిచేస్తున్న వ్యక్తి గాయాలతో బయటపడి నగరంలో చికిత్స పొందుతూ కళ్ళముందు కనబడే సత్యాలని గ్రహిస్తూ ఉద్యమపోరాటానికి ద్రోహం జరుగుతున్న తీరుకి ఆక్షేపిస్తూ ఆవేదన పడే కథ. ఆశయాల కోసం అరణ్యాలలో ఎంతోమంది ప్రాణ త్యాగాలకు సిద్దపడి పనిచేస్తుంటే ఇక్కడ నగరాలలో ఉద్యమాలకి అనుకూలంగా పని చేస్తున్న వాళ్ళు చేస్తున్న పనిపట్ల యెలాంటి అంకిత భావం లేకుండా ఉద్యమ స్వభావాన్ని తేలికగా తీసుకుంటూ అరకొరగా పనిచేస్తూ నాగరిక జీవనంలో విలాసంగా బ్రతుకుతున్న కుహనా కార్యకర్తల తీరుని తూర్పారబట్టింది. దళాలమధ్య లక్ష్యాలు,భిన్నాభిప్రాయాలు, అంతర్గత శత్రువత్వం గురించి పాఠకులకి పరిచయం చేసింది.
హిందువైతే యేమిటీ, ముస్లిమ్ అయితే యేమిటీ ? ఎన్ని తలలు తెగితే అన్ని డబ్బులు అనే మూక వెనుక ఉన్న శక్తుల గురించి భయపడాల్సిన రోజులివి. "మృగాల మధ్య" కథ వర్తమాన కథ. సమాజాన్ని అద్దం పట్టి చూపించింది. కులం మతం పట్టింపు లేకుండా అన్ని మతాలూ దేవుళ్ళు అందరూ మనవాళ్ళే అందరిలోనూ మనం ఉన్నామనే కాంతమ్మ లాంటి మనుషులే కావాలిప్పుడు. విలువలు తెలిసి ఉండడమే కాదు వాటిని ఆచరణలో కూడా చూపించగల్గ మనుషులు కావాలి. ఆగి కాస్తంత ఆలోచింపజేసే కథ యిది.
సప్తసముద్రాల దాటినా మనం మన భావాలనే మోసుకెళతాం అని నాకనిపించింది. అమెరికా వెళ్లినా మన ఆలోచనలు యేమీ మారవు అని నిరూపించిన కథ "వేక్ అప్ " పిల్లలపై తల్లి దండ్రుల ఆశలు, వారి చదువులపై మితిమీరిన శ్రద్ద గ్రేడ్ లు పిల్లలని రెక్కలు విరిచిన సీతాకోకచిలకలని చేస్తున్నాయి. వాస్తవంగా అమెరికాలో కూడా వరుణ్ లాంటి పిల్లలు యెందరో. వారిని చూస్తే జాలి కల్గుతుంది. ఈ కథ చదివి తల్లి దండ్రులే మేలుకోవాలి తప్పదనిపించింది.
"నాతిచరామి" అనే కథ వారసత్వ వ్యామోహాన్ని నిస్సిగ్గుగా చూపించింది. సుఖదుఃఖాలలో తోడుగా వుండాల్సిన భర్త పిల్లలు పుట్టరు అని తెలిసిన తర్వాత ఆమెని వొదిలేసి మరో పెళ్ళికి తయారుకావడం అందుకు తోటి స్త్రీలే ఒత్తిడి తేవడం వత్తాసు పలకడం మరీ చిత్రం. సహజమైన కథ యిది. ఈ కథకి పూర్తిగా వ్యతిరేకమైన కథ కౌముది. జానపద కథ చదివినట్లు ఉంటుంది. మంచి సందేశంతో ముగిసిన కథ.
సూపర్ హీరో కథ నాస్టాల్జియాతో మొదలై హీరో తనొక సినిమాలో సహనటుడిగా నటించడానికి చేసిన ప్రయత్నంలో సెలెక్ట్ కావడం ఆ సినిమా హీరో తన బాల్యమిత్రుడే కావడం ఆ హీరో చేతనే సూపర్ హీరో అని కొనయాడించడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఈ కథలో అమెరికా కలలు, కష్టాలు యెలా ఉంటాయో చెప్పిన కథ. కలలు, కళలు మనిషిని నిరాశలో నుండి, యాంత్రిక జీవనంలో నుండి బయటపడేసి సంతోషపు రంగుని అద్ది జీవనాన్ని శోభానామాయం చేస్తాయనిపించింది. ఇలాంటి పెద్ద కథలు ప్రింట్ మీడియా నుండి రావడం అసాధ్యమనే చెప్పాలి. రెండు భాగాలుగా ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన కథ ఇది.
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే ! ఆఖరికి ఒక ప్రాణి భూమి మీదకి రావడానికి కూడా ప్లానింగ్ కావాలి. ఆర్ధిక స్థిరత్వం యేర్పరుచుకుని పుట్టిన పిల్లలని వాళ్ళు స్కూల్ కి వెళ్ళేదాకా యింట్లోనే వుండి చూసుకునే వాళ్ళు వుండాలి. భార్యాభర్తలిద్దరూ యెంతో కష్టపడి సాధించుకున్న వుద్యోగ స్థానాలని వదిలి పిల్లలని పెంచడానికి తీరిక లేక అమ్మమ్మ తాతయ్యలతో పంపించాలనుకునే ఆలోచనల్లో వుండగా తల్లి గర్భంలో వున్న శిశువు నన్ను నీదగ్గర్నుండి పంపించకమ్మా అని దీనంగా వేడుకునే కథే "పిలుపు". అప్రయత్నంగా కళ్ళు తడిపేసింది ఈ కథే కాల్ మీ అనే పేరుతో షార్ట్ ఫిల్మ్ గా వచ్చింది.
" వెలితి "అమెరికా లాంటి దేశంలో ఐటీ ఉద్యోగిగా ఉన్నా మాతృభూమికి దూరమై ఎదో వెలితితో బాధపడే మోహన్ కి చిన్ననాటి స్నేహితుడు వినిపించిన విజయగాథ ఈ కథ. పదవతరగతితో చదువాపేసి కుటుంబబాధ్యతని తలకెత్తుకుని ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడిన చోటనే నీళ్లు తాగాలనుకున్న రైతు రాజు కథ. వ్యవసాయం కలిసిరాని సంక్లిష్ట పరిస్థితులలో పట్నానికి ఉపాధికెళ్ళి ఒక సినిమా పాట యిచ్చిన స్ఫూర్తి తో మనసు మార్చుకుని పుట్టిన గడ్డమీదనే నిలకడగా నిలబడి వ్యవసాయాన్ని నమ్ముకుని అతివృష్టి అనావృష్టి కాలాలకు ఎదురొడ్డి రైతుగా తన ఉనికిని నిలబెట్టుకుంటూనే తన కలలని బిడ్డల భవిష్యత్ లో చూసుకుని గర్వంగా రైతుని అని చెప్పుకున్న కథ.
రచయిత కథలన్నీ తన అనుభవం నుండో ఇంకొకరి అనుభం నుండో తీసుకున్న కథలివి. ఈ కథలలో యేవీ కల్పనగా అనిపించలేదు. మూడు పేజీల కథలు చదవడానికి అలవాటు పడిన ఈ తరం పాఠకులకి కొన్ని కథలు అతి పెద్దవిగా అనిపించినా చివరికంటా చదివించే గుణం వుండటం వల్ల యెక్కడా విసుగనిపించదు. సూపర్ హీరో కథలో ఎక్కువగా రచయిత కనబడినట్లు అనిపించింది.ఈ కథలు యెలాంటివో యీ సంపుటికి ముందు మాట వ్రాసిన నందినీ సిద్దారెడ్డి గారి మాటలు చెపుతాయి. తప్పక చదవవలిసిన కథలు.అన్ని పుస్తకాల షాపులలోనూ, కినిగె ద్వారా లభ్యం. రచయిత నక్షత్రం వేణు గోపాల్ గారిని మనసారా అభినందిస్తూ .. వారి నుండి మరిన్ని మంచి కథలు ఆశిస్తూ ...
వనజ తాతినేని