20, డిసెంబర్ 2024, శుక్రవారం

పాదముద్రలు

 పాద ముద్రలు   -వనజ తాతినేని


బ్రహ్మీ ముహూర్తంలో అతని అడుగులు గాలిలో పరుగులు పెడుతున్నట్టు వుంటాయి. 

ముఖాన్ని చూస్తే.. తాను నిర్వర్తించబోయే విధి పట్ల ఒకింత ఉద్వేగం ఆరాటం తో పాటు మహా ఇష్టం వ్యక్తమవుతూ వుంటాయి. అతని పేరు మహదేవ్. 


వంద అడుగుల దూరం లో అతన్ని అనుసరిస్తూ వుంటుంది వహీదా. ఏళ్ళ తరబడి క్షుణ్ణంగా అతన్ని చూసి చూసి  ప్రతి కదలికను వర్ణించి చెప్పగలదు. 


చేతుల మధ్య హృదయానికి దగ్గరగా వున్న తెల్లని గుడ్డ కాస్త బూడిద రంగులోకి మారి కనబడుతుంటూంది లోపల వున్న వస్తువు ఆచూకీ తెలుపుతూ. 

చూపు స్థిరంగా వుంటుంది.మనసులో ధ్యానం చేస్తూన్నట్టూ నో, పెదాలు కదిలి కదలకుండా ఏ పంచాక్షరీ నో జపిస్తూ .. దేవాలయ ప్రాంగణం వైపు సాగుతూ వుంటాడు. గాలి గోపురం వీథిలో పువ్వులమ్మే మనిషి ముందు ఆగుతాడు. అతనిచ్చిన డబ్బును అదృష్టంగా అందుకుని తత్తరపాటుతో మేలిమిరకంగా అల్లిన దండను ఏరి అతని చేతిలో వుంచుతారు. తాము అల్లిన మాల అతని చేతి ద్వారా తప్పకుండా మహాదేవుడి ని అలంకరిస్తుంది అని. అతని ప్రశాంతవదనంలో చిన్న చిరునవ్వు తొంగిచూస్తుంది.


ఎందుకంత కంగారూ.. పూదండ మాత్రమే ఏమి?  తుదకు మనమందరం ఆయన సన్నిధి చేరేవాళ్ళమే కదా అన్నట్టు. మరొక దుకాణం ముందు ఆగి నిత్యం లాగే కస్తూరి ని తీసుకుంటాడు. ఇక ఆలస్యమేమి లేకుండా.. ప్రత్యేక మార్గం ద్వారా దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తాడు. ధ్వజస్తంభం  వద్ద నిలబడి ఆకాశం వైపు చూసి నమస్కరించి నలువైపులా చూస్తూ మంత్రోచ్చరణ చేస్తూ ఒక ప్రదక్షిణ చేస్తాడు.మరో ప్రదక్షిణ చేసుకుని దక్షిణా ముఖంగా వున్న సింహద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశిస్తాడు. అప్పటికి ఆమె ఆగిపోతుంది. 


హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుని లైవ్ కార్యక్రమం చూస్తుంది.అతను లోపలికి ప్రవేశించేటప్పటికే.. రుత్విక్కులు అలంకారాలు ఏ మాత్రం ఇష్టపడని మహాదేవునికి ప్రీతిగా శ్రద్ధగా  తమ తండ్రిగానో బిడ్డగానో గావించి అలంకారం చేసుకుంటూ సరిజేసూకుంటూ.. “ఈ వేళ ఎంత బాగా కుదిరింది స్వామికి అలంకారం” అని మురిసిపోతూ వుంటూండటం చూసి దరహాసం వొలికిస్తాడు. అతని దరహాసం మహాకాలుని దరహాసంలా వుందే అనుకుంటాడు ఒక కుర్ర పండిత్ జీ. అతని మీసాలు తాను ఇప్పుడే స్వామికి తీర్చిదిద్దిన  మీసాల్లా వున్నాయా లేక తానే చిన్నతనం నుండి అతని మీసాల అందాన్ని చూసి చూసి ఇంకించుకుని అలా అలంకారం చేసానా అనుకుని తికమకపడతాడు. 


అంతలో అతను పడమటి వైపు నిలబడి తూర్పు వైపు తిరిగి స్వామికి భక్తిగా వినయంగా నమస్కరించుకుని పానపట్టంపై భస్మం మూటని వుంచుతాడు.చేతిలో పూ మాలను స్వామి శిరస్సున అందంగా అలంకరిస్తాడు. రొంటిన దోపుకున్న సుగంధ ద్రవ్యాన్ని తీసి పూలదండల క్రింద అమర్చి… పక్కనున్నతని చేతిలో నుండి వింజామరను అందుకుని సున్నితంగా విసురుతూ వుంటాడు. తన  భస్మ సేవకు అనుజ్ఞ  లభంచేవరకూ ఆ సేవ  కొనసాగిస్తాడు. అప్పటి వరకూ హడావిడి చేసిన అందరూ  వెనక్కి జరిగి అతని సేవకు దారి ఇస్తారు . అతను భస్మం మూటను  అందుకుని భక్తిగా నమస్కరించుకుని భస్మం తో మహాదేవుని అలంకరిస్తాడో హారతి నిస్తాడో అతనికే తెలియదు. పేరు ఏదైతేనేం… ఆ సేవలో తాను అంకితుడవుతాడు. నిత్యం పునరంకితుడవుతాడు. అతను చేస్తున్న ఆ పని  పూర్తయ్యేటప్పటికి గర్భగుడి అంతా దూసరవర్ణ మేఘం ఆవరించినట్లు వుంటుంది. స్వామికి ఎదురుగా మోకరిల్లి కైమోడ్పులర్పించి ఖాళీ మూటతో నిండిన హృదయంతో వెలుపలికి నడుస్తాడు.  


వహీదా తాను చూస్తున్న  యూ ట్యూబ్ ని క్లోజ్ చేస్తుంది.  అతని వైపు దృష్టి సారిస్తుంది. 


క్యూ లైన్ ల్లో నిలబడి భగవంతుని దర్శనం కోసం ఎదురుచూస్తూన్న రోజువారీ భక్తులు. భస్మ హారతిని  ఎదురుగా కనబడే డిస్ ప్లే లోనూ  స్వయంగానూ చూసిన భక్తులు వెళుతున్న అతన్ని గుర్తించి అబ్బురంగానూ ఈర్ష్యతోనూ చూస్తూ వుంటారు..  


అదిగో వెళ్తున్న అతనే, మహాకాలుడికి భస్మ హారతి ఇచ్చేది.ఎంత అదృష్టవంతుడో!..ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకునో పుట్టి వుంటాడు. అతను కాటికాపరుల కుటుంబంలో పుట్టిన వాడట. ఆ సేవ చేయడం వంశపారంపర్యంగా వస్తుందంట అంటారు తెలిసినవారు . ఆ మాటలు విన్న కొత్తవారు ఆసక్తిగా అతన్ని నఖశిఖపర్యంతం చూస్తారు. జుట్టునంతా ఊర్ధ్వం గా లేపి నడినెత్తికి  చేర్చి వేసిన ముడి (ఊర్ధ శిఖ ముడి)  మోకాలు దిగేవరకూ ముదురు నారింజ  రంగు పంచ మాత్రమే ధరించి కండువాను దట్టీగా బిగించి కట్టి వుంటాడు. పైనంతా జంధ్యం లేని అనచ్ఛాదిత దేహం.

ఫాలభాగాన విభూతి ఒడలంతా గంధపు త్రిపుండాలు. మెడలో రుద్రాక్ష మాల.తులసి పూసల మాల, కుడి చేతికి నారింజ రంగు దారం. 


తిరిగి వెళ్ళేటప్పుడు అతని నడక వేగం కొంత నెమ్మదిస్తుంది. అతని కళ్ళు ఎవరినో చూడాలని ఆశ పడతాయి. రావిచెట్టు చప్టా మీద కూర్చుని వున్న ఆమెని కళ్ళ నిండా చూసి

చిన్న దరహాసంతో ముందుకు సాగుతాడు. ఆమేమో తన దుకాణం వైపు మళ్ళుతుంది. ఇలా పదేళ్ళుగా సాగుతూనే వుంది మార్పు లేకుండా. 


**********

ఒక నెల రోజులుగా ఆమె అతన్ని అనుసరించడం లేదు.. ఎదురుపడుతుంది. 


అతను మందిర ప్రాంగణంలో నుండి రుద్రసాగర్ వైపుకి నడిచి కుడి వైపుకు తిరుగుతాడు.హరసిధ్ది మార్గ్ లో సర్కిల్ దాటి క్షిప్రానది పై వున్న వంతెన దాటేలోపు నడక మధ్యలో  వహీదా ఎదురవుతుంది ప్రతిరోజూ . 


ఆమె తండ్రిది దేవాలయ ప్రాంగణ సమీపంలో పూజాద్రవ్యాలు అమ్మే షాపు.ఇటీవల అన్య మతస్తులు దేవాలయ ప్రాంగణంలో షాపులు నిర్వహించకూడదు అని కమిటీ నిర్ధారించాక  షాపు ఖాళీ అయింది. ఆమె కనిపించడమూ మానేసింది. ఈరోజు కూడా ఆమె కనబడదేమో అనుకుంటూ ఆలోచిస్తూ క్షిప్రా నది వొడ్డుకు చేరుకున్నాడు. దూరంగా మెట్ల మీద కూర్చుని కనిపించింది ఆమె. నాలుగడుగుల దూరంలో ఆగాడు. అతని కళ్ళలో ఏదో చెప్పాలనే తపన.. చెప్పలేని సందిగ్ధత. ఆమె చొరవజేసింది.


“రోజూ కనబడటం లేదని వెదుకుతున్నావా”


అతను ఆ ప్రశ్న ను పట్టించుకోనట్లు నటించి “ఇప్పుడెలా మరి” ప్రశ్నించాడు.


 “అదే ఆలోచిస్తున్నాను” తలమీద చున్నీని సరిచేసుకుంది. 


“అలవాటైన పని అలవాటైన దారి మారితే కష్టంగా వుంటుంది కదూ”  ఆమెకు ఇందాకటి ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది ఆ మాటల్లో.


“దుకాణం అయితే వీల్లేదు అన్నారు కానీ పూలు అమ్మడం వద్దనలేరు కదా, రోజూ పూలు, బిల్వ పత్రాలు అమ్ముతాను “అంది పట్టుదలగా. 


“వహీదా! ఎందుకీ  కష్టమూ పట్టుదల నీకు?! హాయిగా పెండ్లి చేసుకోకూడదూ! పిల్లాపాపలతో వర్దిల్లాలి నువ్వు” 


“నువ్వు మాత్రం వర్ధిల్లకూడదా ఏం!? మహదేవ్”


“చూడు, నా వయస్సు ఇంకో రెండేళ్లకు నలబైకి చేరుకుంటుంది,  ఇదిగో చూడు సగానికి పైగా గడ్డం కూడా నెరిసిపోయింది,మహాకాలుడి సేవలో మునిగిపోయి అర్ద విరాగి గా మారిన నన్ను ఏ స్త్రీ వివాహమాడుతుంది చెప్పు?  పైగా శ్రవణ కుమారుడిలా తల్లిదండ్రుల సేవలో మునిగిన వాడిని”


“నేను మాత్రం యవ్వనవతి నా!? ఫ్రౌఢ లోకి మళ్ళిపోయాను. నాకు మాత్రం ఇలాగే గడిచిపోనీయరాదా!?” అంది మొండిగా.


“అప్పుడలా జరిగి వుండాల్సింది కాదు నీకు” బాధగా అన్నాడు. 


ఆ మాటలు ఇష్టం లేని వహీదా లేచి “నా దేవుడి దర్శన భాగ్యం అయింది, ఇక నీ దేవుడి దర్శనం చేసుకుని వస్తాను” అని మెట్లపై నుంచి లేచి పూల బుట్టను అందుకుంది.  


మెట్లు ఎక్కుతున్న ఆమెను వెనుక నుండి చూస్తూ అనుకున్నాడు  నుదుట కుంకుమ పాపిట సింధూరం ధరించని దేవతలా వుంది అని. నడుస్తూ ఆలోచిస్తూన్నాడు. తమ  మనసులు ఎందుకో ఏమో తెలియకుండానే  ముడులు వేసుకున్నాయి కానీ కలిసి నడిచే దారి వేసుకోలేదు. వేరొకరు నడిచే దారిలో నడవటానికి తమకు సంకోచం. తాము వేసుకున్న ముడులు చిక్కుముడులు కాకూడదు అని ఆలోచిస్తూనే ఏళ్ళు గడుస్తున్నాయి. గడిచిపోతాయి అంతే! 

 

దుకాణం విషయం మినహా ఇవాళ జరిగిన సంభాషణ గత పదేళ్ళుగా వారి మధ్య నెలకొకసారి అయినా జరుగుతున్నదే!   మహదేవ్ దళితుడు. పైగా తరతరాలనుండి కాటికాపరి వృత్తిగా గల కుటుంబంలో  మొదటి పురుష సంతానం. ఆ కుటుంబంలో వారినే భస్మ సేవకు నియమింపబడటం తరతరాలుగా ఆచారంగా వుంది . అనాదిగా దేవాలయం ఆ సేవకు వారిని సమ్మతిస్తుంది.తండ్రి అనారోగ్యం వల్ల మహదేవ్ ఆ సేవకు యవ్వనకాలంలోనే నియమితుడయ్యాడు. డిగ్రీ వరకూ చదువుకున్నాడు.వృత్తిని దైవంగానూ భావించేవాడు. పండిత బ్రహ్మణులతో సరిసమానంగా అంతకన్నా ఎక్కువగానే అర్చన వేదం తదితర విషయాల్లో సాధికారత సాధించాడు. అయినా వినయం గా మౌనంగా వుంటూ తన సేవ తాను చేసుకుంటూ వుంటాడు.సంస్కృతంలో ఎమ్ ఏ  చదువుకుంటూ వేదాలను అధ్యయనం చేస్తుంటాడు. క్షిప్రా నది వొడ్డున తన ఇంటిలో కూర్చుని గొంతెత్తి శ్రావ్యంగా మహాకాలుడిని కీర్తిస్తాడు. గోవులను మేపుతూ గోమయం సేకరించి పిడకలను చేసుకుని మండించి బూడిదను సిద్దపరుచుకుంటాడు. 


అప్పుడప్పుడు..  తమ్ముడు  తెచ్చి ఇచ్చిన శవ  భస్మాన్ని భస్మ హారతికి తీసుకువెళతాడు. మన ఆచారం తప్పకూడదు రా అయ్యా! అని తండ్రి చెపుతుంటాడని. మహదేవ్ ఆలోచిస్తూ వుంటాడు. శవ భస్మం అనగానే మనిషి భీతిల్లినట్టు తనకు దూరం దూరంగా జరుగుతుంటారు మనుషులు. కానీ, మనిషిలో ఉన్న రాగం ద్వేషం కోపం అసూయ ఈర్ష్య ద్వేషం కుళ్ళు కుశ్చితం పాపం నీతిబాహ్యం లాంటి పేరుకున్న మలినాలెన్నో  ఆఖరికి అగ్నికీలల్లో దహింపబడి బూడిద గా మిగిలిపోతుంది. బూడిద స్వచ్చత గంగాజలం లాంటిది. నారికేళ ఫలం లోని నీరు లాంటిది కదా! అని యోచన చేస్తాడు.  రోజూ ప్రదోషసమయంలో ఢమరుకాన్ని మోగిస్తూనో .లేదా శంఖధ్వని చేస్తూ స్వామి సేవలో తదాత్మ్యం చెందుతాడు. శాంతంగా నిదురిస్తాడు. 



ఇక వహీదా మస్తాన్ వలీ కూతురు. దశాబ్దాలుగా దేవాలయ ప్రాంగణంలో దుకాణం. తండ్రికి నాలుగో కూతురు. కొడుకులా చేదోడు వాదోడు. పన్నెండేళ్ళ క్రితం స్పురద్రూపి మహదేవ్ ని చూసి ప్రేమలో పడిపోయింది. ఆకాశం భూమి కలవవు అని తెలిసినా  అమె పిచ్చి మనసు ఊరుకోలేదు. ఆమె చొరవ కి మహదేవ్ గాంభీర్యం చెదిరిపోయింది కానీ సాధ్యాసాధ్యాలను అతను మర్చిపోలేదు. 


అతనికి రెండే వ్యాపకాలు. ఒకటి మహాకాలుడి సేవ రెండవది  తల్లిదండ్రుల సేవ. ముచ్చటగా మూడవది.. వెల్లడించవలసి వస్తే వహీదా పై వున్న ప్రేమ. “!ప్రేమించడం తెలిసిన వారు నిన్ను ప్రేమించకుండా ఎలా వుంటారు వహీదా!” అనుకుంటాడు. రోజుకొకసారైనా ఆమెకు అలాగ జరిగి వుండాల్సింది కాదు అనుకుంటాడు. ఆమెకు అలా జరిగి వుండకుండా వుండి వుంటే తానూ వేరెవరినో వివాహమాడి  సంసార బంధంలో తలమునకలుగా మునిగి పోయి వుండేవాడేమో అని అనుకుంటాడు. తల్లిదండ్రులు తమ్ముళ్ళు చెల్లెళ్ళూ వివాహం చేసుకోమని చెప్పి చెప్పి అలసిపోయారు. తండ్రి దిగులు పడ్డాడు.. బూది సేవకు వారసుడు కావద్దా అని. తమ్ముడి కొడుకు వున్నాడు కదా అంటాడు మహదేవ్. తండ్రి ముఖంలో కొండంత అసంతృప్తి. 


“నీ కొడుకు ఆ ముస్లిమ్ పిల్లపై మనసు పడ్డాడు. ఆ పిల్ల కు కాబోయే వాడు బారాత్ లో గుర్రం అదుపుతప్పి అతన్ని తొక్కి చంపేయకుండా వుండి వుంటే ఆ పిల్ల నిఖా సవ్యంగా జరిగి పోయివుండేది. ఆ పిల్లేమో నిఖా కాకుండానే విధవరాలు అయినట్లు మనసు బిగదీసుకుని వొంటరిగా మిగిలిపోయింది. ఆమె పెళ్ళి చేసుకోలేదని వీడూ చేసుకోడు. ఒక ఏడా రెండేళ్ళా!? పదేళ్లు పైగా గడచిపోతూనే వుంది”. అని గొణుక్కుంది తల్లి అహల్య.


అయినా చొరవజేసి ఆ పిల్లను తీసుకొచ్చుకుని పెండ్లి చేసుకుంటే మహాకాల్ సేవకు మందిర్ కమిటీ వాళ్ళు వొప్పుకుంటారో లేదో! అని సందేహపడుతుంది. కొడుకు దగ్గర ఆ మాటే చెబుతూ వుంటే విని ఊరుకుంటాడు తప్ప ఏమీ మాట్లాడడు. ఆమె విసుక్కుంటూ “ మీ ఇద్దరూ సద్దు చేయకుండా బండల క్రింద బావురు కప్పల్లా పడివుండారు.  మీ ఇద్దరి జీవితాల్లో కళ్యాణ ఘట్టం రాసి వుందో లేదో ఆ దేవుడికే తెలియాలి.”  అని రొట్టెలు వొత్తుకోవడంలో మునిగిపోయేది.. 


*********

వహీదా రావిచెట్టు అరుగు మీద కూర్చొని ప్రధాన పండిత్ శివనాధ్ స్వామి కోసం ఎదురు చూస్తుంది. మహదేవ్ పై ఆయనకు కొండంత  పితృ ప్రేమ. మహాకాలుడికి ఏక హారతి పంచ హారతి నక్షత్ర హారతి కర్పూర హారతి జరుగుతూ వుంటే వీక్షిస్తూ కూర్చుంది. వసీదా మనసు అల్లా కు  ఈశ్వరుడికి తేడా లేదు. క్రియలు వేరు వేరు. భావన వొక్కటే! మందిరంలోకి ప్రవేశం లేదన్నమాటే కానీ తన దుకాణం నుండి భక్తుడి ద్వారా వెళ్లే ప్రతి వస్తువు పైనా తన భక్తి అలుముకుని లేదూ. ధూళిలా భగవంతుడి కరుణ తనను చుట్టి వుండలేదూ! అనుకుంటుంది. పైగా మహదేవ్ మనసులో తానూ తన మనసులో మహదేవ్ వున్నప్పుడు మహాకాలుడ్ని తాను అన్యదేవత అని తాను ఎలా భావిస్తుంది?.  తన మనసులో వున్న మాటలే పండిత్ జీ కి  ఎలా చెప్పాలి? తీరా చెప్పాక ఆయన ఏమంటారో!? సంకోచంగా వుంది. పండిత్ జీ  బయటకు వచ్చారు. ఆయనకు ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసింది. ఆయన హృదయానికి కుడి అరచేతిని ఆనించి శివార్పణమస్తు అన్నారు. తికమక పడింది. “చెప్పమ్మా వహీదా!అందరూ కుశలమేనా? దుకాణానికి జాగా కుదిరిందా!? 

“లేదన్నట్లు తలఊపింది “ ఏదో విషయమై వచ్చి ఆయన చుట్టూ ఉన్న వారిని చూసి ఆగిపోయిందని అర్థం చేసుకుని.. ఇప్పుడు  వేరే పనిలో వున్నానమ్మా. 11 గంటలకు ఇంటికి రామ్మా! అక్కడ మాట్లాడతాను అన్నారు. తల వూపి ఇంటికి వచ్చేసింది. 


తల్లికి వంట పనిలో సాయం చేస్తూ ఉండగా.. పినతల్లి వచ్చింది. తల్లి ఇచ్చిన ఛాయ్ తాగుతూ కోడలిని తిట్టడం మొదలుపెట్టింది. “ఆ చినాల్ రండ్ పిల్లలిద్దరికీ పేర్లు మార్పించి హిందువుల పేర్లు పెట్టించింది అంట. నా కొడుకు సంపాదించిన సొమ్మును పందిలా తింటూన్నప్పుడు  నా కొడుకు వారసులుగా కదా ఆ బిడ్డలు పెరగాల్సింది. వాడు మళ్లీ కోర్టు లో కేసు వేశాడంట భరణం ఇవ్వను అని”  అంటూ చెప్పుకొచ్చింది. 


“అన్న ఆ పిల్లలను తన పిల్లలగానే పెరగాలనుకుంటే వదినకు తలాక్ ఎందుకు చెప్పాలి. అంతా బాగున్నప్పుడు ఆమె మాత్రం  మీ పేర్లు పెట్టొద్దు అని అభ్యంతరం చెప్పిందా ఏమిటి”  అంది? గట్టిగానే. తల్లి చూపులతో వారిస్తున్నా వినలేదు వహీదా. 


నీ ప్రశ్నలకు జవాబు ఎందుకివ్వాలన్న అహంకారంతోనూ సమాధానం తోచకనూ అక్కడి నుండి జారుకొంది పినతల్లి. తల్లి వహీదా ని కోప్పడింది.“ఆమెతో వాదులాట మనకెందుకు? చెవులు అప్పగించి ఊరుకుంటే సరి.” అంది. 


“వదినకు జరిగిన అన్యాయం మన కుటుంబాల్లో వారికి జరిగితే మనకెందుకు అని ఊరుకుంటారా అమ్మీ! “


జాహిదా మౌనం వహించింది. 


వహీదా.. ఆలోచన చేస్తుంది. చిన్నాయన కొడుకు వశీమ్ బాగా చదువుకున్నాడు.మంచి నౌఖరిలో కుదురుకున్నాడు. సంబంధాలు చూస్తున్నప్పుడే హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకు వచ్చాడు. ఆమె పేరు అమృత. ఇదే పట్టణం. అందం ఉద్యోగంతో పాటు గట్టి ఆస్తులున్న కుటుంబంలో పెరిగిన అమ్మాయి.ఆమె తల్లిదండ్రులు వీరి వివాహాన్ని అంగీకరించలేదు. ఇద్దరూ భోపాల్ లో ఉద్యోగం చేసుకుంటూ ఐదేళ్లు కాపురం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. వదిన పిల్లలను పెంచుకోవాలని ఉద్యోగం మానేసింది. ఆమె పుట్టింటి వైపు నుండి భారీగా ఆస్తులు వస్తాయన్న ఆశ వమ్ము అయ్యేటప్పటికి, సంపాదనలేని భార్యని చూస్తున్న కొద్దీ వశీమ్ కి భార్య నచ్చలేదు. మంచినీళ్లు తాగినంత సులభంగా మూడుసార్లు తలాక్ చెప్పేసి వేరొక స్త్రీని నిఖా చేసుకున్నాడు. బదిలీ చేయించుకుని ముంబాయికి పారిపోయాడు. అమృత వదిన కోర్టులో కేసు వేసింది. అసలు షరియత్ చట్టం ప్రకారం అమృత మతం మారి వశీమ్ ని వివాహం చేసుకోలేదు అని వశీమ్ వైపు లాయర్లు, అసలు వీరి వివాహమే చట్ట సమ్మతం కాదని కొన్ని వాదనలు. ఇలా  రెండేళ్లు కొనసాగాక… వశీమ్ అమృత లది పెళ్ళి కాదని సహజీవనం లాంటిదే  అని తీర్మానించిన కోర్టు తండ్రి ఆ పిల్లలిద్దరికీ భరణం ఇవ్వాలని తల్లి సంరక్షణలో పిల్లలు పెరగాలని తీర్పునిచ్చింది. అమృత వదిన ఆద్యంతం గాయపడిన హృదయంతోనే పోరాటం చేసింది.


కోర్టులో కేసు నడుస్తుండగా ఒకరోజు దుకాణం దగ్గరకు వచ్చింది. ఎన్నో విషయాలు చెప్పింది. 

ఒక హిందూ వనిత ముస్లిమ్ యువకుడిని ప్రేమిస్తే హిందువుగా వుండకూడదట. తప్పకుండా మతం మారిపోవల్సిందే అంట. అది ముస్లిమ్/ క్రైస్తవ/ యూదు/ జైన ఏ మతమైనా పర్వాలేదంట. కేవలమ్ హిందువుగా మాత్రమే వుండకూడదు అంట.  అలా మారకపోతే షరియత్ వప్పుకోదు అంట.  ఇదెక్కడి పితలాటకం!? 


మత మార్పిడి లేకుండా ప్రత్యేక వివాహ చట్టం 1872 ప్రకారం కూడా వివాహాన్ని చేసుకోవచ్చు అన్నారని నేను మతం మార్చుకోలేదు. మత వివాహాల్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని నేనస్సులు అనుకోనేలేదు. ఈ చట్టాలన్నీ  ప్రేమికుల పాలిట పాము కాట్లే! ఎన్నో పాము కాట్లు వేయించుకుంటే కానీ నిఖా ఆమోద ముద్ర పొందదా? ఆఖరికీ, తలాక్ పాము కాటు కి బలి అయిపోయాను కదా! అని ఏడ్చింది. వహీదా కి కూడా దుఃఖం వచ్చింది. ప్రేమంటే దుఃఖమా!? ఆ సమయంలో వశీమ్ కనబడితే చెంపచెళ్ళుమనిపించేది.


 ఈ మధ్య కూడా అమృత జజారులో కనబడినప్పుడు “బాగున్నావా వదినా,పిల్లలు బాగున్నారా” అని పలకరిస్తే  “ప్రేమ పెళ్ళిలో ప్రేమ రంగు వెలిసిపోతే మోసం మిగిలితే.. జీవచ్చవంలా మిగలాల్సిందే!”  అంది చిన్న నవ్వుతో..  ఆ నవ్వులో టన్నుల కొద్దీ విచారం కనిపించింది. 


ఇంత జరిగినా  ఆమె తల్లిదండ్రులు పట్టు వీడలేదు.కూతురిని ఆదరించలేదు. గాయత్రి పరివార్ ఆదుకుని ఆమెకు ఉద్యోగం, పిల్లలకు చదువులు ఏర్పాటు చేసారు.ఇప్పుడు మళ్ళీ కోర్టూ కేసు. ఆమె జీవితం అడ కత్తెరలో పోక చెక్క అయింది కదా అనుకుని బాధ పడింది.


తల్లితో బయటకు వెళ్ళొస్తాను అనే ఒకమాట చెప్పి పండిత్ శివనాధ్ స్వామి ఇంటికి చేరుకుంది. అప్పటికే ఆయన ఇంటి వరండాలోనూ తోటలోనూ చాలామంది నిరీక్షిస్తున్నారు. కొందరు చిందులు తొక్కుతుంటే కొందరు ఆందోళనగా వేచి వున్నారు. పండిత్ జీ ముందు బయటికి రాగా ఇంటిలోపలి నుండి కొందరు స్త్రీలు వధువుగా అలంకరించిన వొక యువతిని వెంటబెట్టుకుని వచ్చారు. ఆ వధువును చూడగానే ఆవేశంతో ముందుకు వచ్చి ఆమె మీద దాడికి సిద్దపడ్డారు. వారంతా తమ మతానికి చెందినవారే!  పోలీసులు వారిని నిరోధిస్తుంటే నారింజ రంగు దుస్తులు ధరించిన కొందరు ఆ వధువుకు రక్షణగా నిలబడ్డారు. 


 పండిత్ జీ అన్నారు ”మీ అమ్మాయి తప్పేం చేయలేదు. నెలన్నర క్రితం నన్ను సంప్రదించింది. ఆమె తాను ప్రేమించిన మనిషి కోసం మతం మార్చుకుంది. అతనితో కలిసి జీవించడానికి మార్గం సుగమం చేసుకుంది. శుభంగా జరిగే వివాహాన్ని వివాదస్పదం చేయవద్దు. విజయవంతం చేద్దాం. అంటూ సిద్ధం గా వుంచిన పూల దండలు మంగళసూత్రం సింధూరం గిన్నె వారి ముందుకు తెప్పించారు. 


కొందరి శాపనార్థాల మధ్య ఆ శాపనార్థాలు వినబడకుండా  మంగళ వాయిద్యాల మధ్య ఐదుగురి పండితుల వివాహ మంత్రాల మధ్య ఆ జంటకు వివాహం జరిగిపోయింది. వివాహ రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది.


 వరుడి వైపు పెద్దలు కొందరు చొరవ చేసి…కోపాగ్నితో ప్రజ్వలిల్లుతున్న వధువు వైపు వారి దగ్గరకు జంటను తీసుకువెళ్ళి ఆశీర్వదించమని చెప్పారు వారికి  నోరు చెయ్యి రెండూ రాలేదు కాలు కూడా కదపలేదు. పైగా మీ ఇంటి ఆడపిల్లలను మా మతంలోకి మార్పించి నిఖా చేయించండి అప్పుడు మేమూ వొప్పుకుంటాం అన్నారు. ఆ మాటతో కొందరు ఠక్కున వెనక్కి అడుగేసారు.మరికొందరు అలాక్కూడా జరుగుతున్నాయిగా, వద్దు కాదు అనే వారు మూర్ఖులు అన్నారు. 


పండిత్ జీ  మరొకసారి ముందుకు వెళ్ళారు, తన మాటను గట్టిగా వినిపించారు.

 “మతాల పేరు మీద ప్రేమికులను జంటలను విడదీయకూడదు. వీరిరువురి మనసులను కలిపి కుట్టిన ప్రేమ సూత్రం దారం ఏ మతానికి చెందింది?  వీరిరువురూ కలగలసి నడిచే మార్గానికి ముళ్ళ కంపలు వేసి  మూయగల్గింది యెవరూ? నలుగురు నడిచే నేల మీద ఇవి రాముడు పాద ముద్రలు అని  అల్లా పాద ముద్రలు అని విడదీసి చూపగలరా?  పెద్ద మనసుతో పిల్లలను ఆశీర్వదించండి” అని హితబోధ చేసారు.. 


“ఏకోహం బహుస్యం ? 

ఒకే నేను అనేక రూపాలు” అని భగవంతుడే చెప్పాడు కదా అనికూడా వివరణ చేసారు. 


పండిత్ జీ పెద్దరికాన్ని గౌరవించి పెద్దలు పిల్లలను క్షమించి.. ఆశీర్వదించారు. ఆ తర్వాత వారు వీరూ కాస్త తికమకలతో కొత్త బంధుత్వాన్ని ఆలింగనం చేసుకున్నారు. 


జరుగుతున్నదంతా శ్రద్ధగా చూసింది వహీదా. చరిత్ర చదువుకున్న ఆమెకు ఒకటే అనిపించింది. చక్రవర్తుల మందిరాలను కూల్చి మసీదులు, మసీదులు కూల్చి మందిరాలు నిర్మించడం వెనుక వుంది భగవంతుడిపై వున్న భక్తి కాదు. భగవంతుడి పేరుతో  జరిగే మత రాజకీయం. భక్తి తో ఊగిపోయే ఆవేశపరుల్ని బలి పశువుల్ని చేసి ఏమీ ఎరుగని అమాయకులను బలిచేస్తుంది. 


 కర్తవ్యం బోధపడింది.పండిత్ జీ తో మాట్లాడకుండానే వెనుదిరిగింది. ఇంకో రెండు నెలల్లో ఆయన భుజస్కంధాలపై తనొక భారం మోపనుంది. తన ప్రియ శిష్యుడిని వివాహోన్ముఖుడిని చేయాల్సిన బాధ్యత అప్పగించనుంది.తాను అపర్ణగా మారనుంది.   


***********************************0************************************

శీర్షిక లేని రాతలు

 శీర్షిక లేని రాతలు 

బరువులు

నిన్న చాలా బరువులు ఎత్తాను బాధగా మోసాను. 

కాసేపు వొంటరిగా కూర్చుని ఆలోచించాను

పడుకునే ముందు కాళ్ళు కడుక్కునట్టు

ఎత్తిన బరువులన్నింటిని మురికికూపంలోకి

విసిరేసాను. 

కలల నిద్రలో సేదతీరాను

మా అమ్మ బుగ్గపై వొక ముద్దిచ్చి..

నాకు కావాల్సినవి ఇవ్వమని గారాం చేశాను కూడా! 

అమ్మ ఏం చెప్పిందంటే.. .. 

మరీ బరువులు యెత్తుకోకు మరీ పరుగులు తీయకు.. 

నీ శక్తి సన్నగిల్లకుండా నువ్వు పడిపోకుండా వుండాలి.. 

నేనున్నాను గా! 

నీ బరువు నేనెత్తుకుంటాను 

నీ పరుగు నేను పూర్తి చేస్తాను 

పదిలం .. బిడ్డా! అని ముది గారాం చేసింది. 

మా అమ్మ లో వేల యశోదమ్మలు కనిపించారు. 

నేను మాత్రం…

 చిటికిన వేలితో గోవర్ధన గిరి ని 

యెత్తినట్లు.. బరువులను మోయగల 

సులువు కనిపెట్టాలి. 

మా అమ్మ కు కష్టం లేకుండా. 

ప్రేమ ఎంత బరువో అంత సలీసు కూడా.

కాదంటారా!?




19, డిసెంబర్ 2024, గురువారం

ఉత్రన్ .. ఉర్దూ కథ

 ఉత్రన్ -విడిచేసిన బట్టలు/వాజెదా తబస్సుమ్ /వనజ తాతినేని 

నవాబు కుటుంబంలో దాది గా వచ్చిన ఆమె కూతురు చమ్కీ. తన వయస్సే వున్న చిన్న యజమానురాలు షహజాది పాషా తను విడిచిన బట్టలను ధరించమని ఇవ్వడం అవి ధరించాల్సి రావడం ఆమెకు ఎంత మాత్రం నచ్చదు. ఆఖరికి చమ్కీ ఏం చేసిందో 

కథ పూర్తిగా వింటే గానీ తెలియదు. 

కథ వినండీ.. 



18, డిసెంబర్ 2024, బుధవారం

వాక్యం

 - వనజ తాతినేని

ఎండిన మరువపు కొమ్మను తెచ్చి 

బట్టల బీరువాలో దాచినట్లు 

నచ్చిన పుస్తకంలో పెట్టినట్లు 

బాగా నచ్చేసిన మనిషిని 

హృదయంలో గుప్తనిధిగా  మార్చేస్తా 

జ్ఞాపకాల పుటల్లో బంధించేస్తా 

అబ్బ! భలే బావుందే ఈ వాక్యం అనుకుంటూ మస్తిష్కంలో నాన పెడతాను 

నేను మాత్రం ఏం తక్కువ అనుకుంటూ -~ ఆలోచనలను సాన పెడతాను 

వాక్యం వజ్రంలా మారకపోయినా 

కనీసం నా పెంపుడు పావురంలా --- మూల్గుతుంది .. నన్ను నిరాశ పర్చకుండా.

సమయం 09:14 ఉదయం 13/12/24



13, డిసెంబర్ 2024, శుక్రవారం

ఊరి చివర ఇల్లు -2

 ఊరి చివర ఇల్లు .. రెండవ భాగం వినండీ 



పొగలేని నిప్పు

 స్ర్తీపురుషుల మధ్య వున్న స్నేహాన్ని ఆ స్నేహం వెనుక వున్న ఆకర్షణలు ఏ విధంగా ఉంటాయో, సమాజంలో ఆ స్నేహం ఎలా పరిగణించబడుతుందో.. పురుషుడు ఎలా వొక అడుగు ముందుకు వేస్తాడో స్త్రీ గిరి గీసినట్లు వున్నా వొకోసారి తన  మనసును ఎలా బయటపెడుతుందో.. చెప్పిన కథ. పొగలేని నిప్పు- బుచ్చిబాబు కథ వినండీ .. పై నుండి కిందికి.. వరుస లింక్స్  ను చూడండి. 










9, డిసెంబర్ 2024, సోమవారం

ఊరి చివర ఇల్లు

 ఊరి చివరి ఇల్లు

హోరున కురిసే వర్షం.. చిమ్మ చీకటి.. ఊరికి దూరంగా ఉన్న ఒంటరి ఇల్లు.. ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు మనుషులు.. ఎవరికి ఎవ్వరూ ఏమీ కారు. ఆ రాత్రి వాళ్ళ జీవితాలను ఎలాంటి మలుపు తిప్పిందన్నదే దాదాపు అరవైమూడేళ్ళ క్రితం దేవరకొండ బాల గంగాధర తిలక్ రాసిన 'ఊరి చివరి ఇల్లు' కథ. మొదటి భాగం వినండీ.. 



2, డిసెంబర్ 2024, సోమవారం

గుంటూరు చిన్నోడా - ఆడియో లో

 తొలిసారి జానపద గీతం రాసాను. 😊🎈🎈track కూడా వినేయండి.. ఇది రీమిక్స్ సాంగ్ Totally male version. అదేదో app లో చేసారు. ఎంత వరకూ YouTube ఆమోదిస్తుందో చూడాలి మరి. వీడియో రూపకల్పన నేనే ! 😊🎈🎈

అబ్బాయి ఫ్రెండ్ ఇలా track గా చేసి పంపించాడు. Thank you so much for your beautiful gift. Zaffar Mohmmad. 


గుంటూరు చిన్నోడా.. -వనజ తాతినేని 

ఆమె:

గుంటూరు చిన్నోడా గుబురు మీసాలోడా

గుబుర మీసాలపై నిమ్మపండు నిలిపేటోడా గుంటూరు చిన్నోడా గుబురు మీసాలోడా

గుబుర మీసాలపై నిమ్మపండు నిలిపేటోడా

చిన్నదాని మనసునెత్తగలవా

ఈ చిన్నదాని మనసునెత్తగలవా? 


అతను:

ఏటవతల చిన్నదాన ఏటి నడకలు దానా

ఏటి నడకలపై ఎన్నెలు చిందేదానా

 నిన్నైతే చిటికెలో యెత్తగలనే 

లోతైన నీ మనసు నెట్టా పట్టుకుందు నే 

పట్టుకుని నేనెట్టా నిలుపుకుందునే

పట్టుకుని నేనెట్టా నిలుపుకుందునే


ఆమె:

గుంటూరు చిన్నోడా బండల్ని పిండి పిండి  చేసేటోడా బండ లాంటి మనసు నీది రా

మనిషివైతే ఎదిగినావు  కానీ 

మనిషివైతే ఎదిగినావు  కానీ 

చీమ మెదడంత తెలివి లేనోడా 

నీతో జతకట్టలేను జీవితమూ ఈదలేను

నువ్వొద్దు పోరా నువ్వొద్దు పోరా


అతను: 

ఎంత మాటంటివే పిల్లా నీవు

నీ వదరుబోతు తనం నా కాడ కాదే

పోట్లగిత్త లెన్నింటినో లొంగదీసి నోడిని

పోట్లగిత్త లెన్నింటినో లొంగదీసి నోడిని

నీకు ముకుతాడు నేను వేయలేనా

నీకు ముకుతాడు నేను వేయలేనా

ఆ మూడు ముళ్ళు నే వేయలేనా

నూరేళ్ళు నీ వొడి లోన నే నిండిపోనా


ఆమె:

నీ బడాయి మాటలు జబ్బల గొప్పలు 

చెప్పింది చాల్లే బండోడా 

సూక్ష్మం చెబుతాను వినుకో.. 

చిన్నదాన్ని మనసు శివధనుస్సు లాంటిది

ధనుస్సునెత్తే ముందు ధరణి పుత్రిక ను చూసినాడు రాముడు

 ఆ చూపుతోనే మనసు చిక్కబట్టినాడు

చక్కనమ్మ చిక్కినాక ధనుస్సు ఇరగ్గొటినాడు

చక్కనమ్మ చిక్కినాక ధనుస్సు ఇరగ్గొటినాడు

ఆ సులువు కనిపెట్టలేవా 

ఆ..  సులువు నువ్వు కనిపెట్టలేవా… 

ఇంత మంద మెదడు వున్న మొనగాడా 

మగువ మనసు తెలుసుకోరా బండోడా


అతను:

కనిపెట్టినానే పిల్లా నేను

కనిపెట్టినానే పిల్లా నేనూ.. 

నీ కళ్ళలోకి నేను కళ్ళు పెట్టి చూసా

గుండె లోకి తిన్నగా దారేసినాను

మనసుతో  మనసుకి పీట ముడి పెట్టేసినాను

లగ్గం చేసుకోను ఎత్తుకొని పోతాను నిన్ను 

ఎత్తుకొని పోతాను నేనూ.. 

మీసాలపై మనసునేంటి పిల్లా 

మొత్తంగా నిన్నే  నెత్తిన పెట్టుకొంటా.. 

మొత్తంగా నిన్నే  నెత్తిన పెట్టుకొంటా.. 


******************************



30, నవంబర్ 2024, శనివారం

ప్రకటన మాత్రమేనా!?

 ప్రకటన మాత్రమేనా!?

నిన్ను నీవు తెలుసుకోవాలంటే.. 

నీతో నువ్వు అంతర్యుద్ధం చేయాలి

మెదడుకి పట్టిన మురికిని కడుక్కోవాలి

నిన్ను నీవు గాయపర్చుకోవాలి 

నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి

తొడుక్కున ముసుగు తొలగించుకోవాలి.

నిశ్శబ్దంగా నీతో నువ్వు మాత్రమే వుండగల్గాలి. 

ప్రతి అనుభవమూ అనుభూతి పాతవే అని గ్రహించాలి

నువ్వు నువ్వుగా మిగలగల్గాలి అంటే.. భావోద్వేగాలను అణచుకున్న మనిషివైనా కావాలికాలానికి ఎదురొడ్డి నిలిచిన మనిషివైనా అయివుండాలి. 

రహస్యంగానైనా నిన్ను ఆరాధించేబలగమైనా కలిగివుండాలి. 

మెట్టనేలలో మొండిగా నిలిచి   తుఫాన్ గాలి తట్టుకున్న చెట్టువైనా అయివుండాలి

రాగద్వేషాలు అద్దుకున్న  దేహ వస్త్రాన్ని  సవుడు సున్నం వేసి ఉడకబెట్టి పరిశుభ్రంగా ఉతికి ఆరేయాలి. 

పాము కుబుసం విడిచినట్టు జ్ఞాపకాలనూ అనుభవాలను బలవంతంగానైనా విసర్జించాలి. 

మొత్తంగా.. 

నీతో నీవు జీవించిన క్షణాల్లో గాలికి  కదలని దీపానివై  కొడిగట్టే వొత్తి వలే పూర్తిగా దగ్ధమైపోవాలి. 

ఇదంతా ఒక ప్రకటనలా మిగిలి పోకుండా వుండాలి. 

-వనజ తాతినేని  30/11/24  07:20 pm




అపుడపుడూ..

 అపుడపుడూ… 

ప్రకృతి తన సౌందర్యానికి తనే

మూర్ఛిలుతుంది

ఉదారంగా ఇతరులను చూడనిస్తుంది

సౌందర్యానుభవం  సొంతం చేసుకోమని 

ప్రేరేపిస్తుంది. కానీ.. 

తన సౌందర్యాన్ని నాశనం చేస్తూ 

నామ రూప గుణ విశేషణాలు లేకుండా 

చేస్తుంటే బెంగటిల్లుతుంది

జీవకణ విచ్ఛిన్నం విధ్వంసం చిరునామాగా 

మిగిలిందా అని చిరుకోపం ప్రదర్శిస్తుంది. 

నవంబరు 30/24 08:00 am.


29, నవంబర్ 2024, శుక్రవారం

తితిలియోం డూండ్నే వాలీ

 వందల వేల కథల్లో ఒక ఆణిముత్యం ఈ కథ.. తప్పకుండా వినండి.. 

Very very touching story!

మీ వాయిస్, చదివిన విధం కథకు వాటి అసలు రంగు టోన్ ఇచ్చాయి. అభినందనలు వనజ గారూ. అని ఒక మిత్రురాలు అభిప్రాయం తెలియజేశారు. 




26, నవంబర్ 2024, మంగళవారం

గుంటూరు చిన్నోడా

తొలిసారి జానపద గీతం రాసాను.. ఎవరైనా బాణీ కడితే అది కూడా. ❤️😊

అతడు:

గుంటూరు చిన్నోడా గుబురు మీసాలోడా

గుబుర మీసాలపై నిమ్మపండు నిలిపేటోడా గుంటూరు చిన్నోడా గుబురు మీసాలోడా

గుబుర మీసాలపై నిమ్మపండు నిలిపేటోడా

చిన్నదాని మనసునెత్తగలవా

ఈ చిన్నదాని మనసునెత్తగలవా? 

అతను:

ఏటవతల చిన్నదాన ఏటి నడకలు దానా

ఏటి నడకలపై ఎన్నెలు చిందేదానా

 నిన్నైతే చిటికెలో యెత్తగలనే 

లోతైన నీ మనసు నెట్టా పట్టుకుందు నే 

పట్టుకుని నేనెట్టా నిలుపుకుందునే

పట్టుకుని నేనెట్టా నిలుపుకుందునే


ఆమె:

గుంటూరు చిన్నోడా బండల్ని పిండి పిండి  చేసేటోడా బండ లాంటి మనసు నీది రా

మనిషివైతే ఎదిగినావు  కానీ 

మనిషివైతే ఎదిగినావు  కానీ 

చీమ మెదడంత తెలివి లేనోడా 

నీతో జతకట్టలేను జీవితమూ ఈదలేను

నువ్వొద్దు పోరా నువ్వొద్దు పోరా


అతను: 

ఎంత మాటంటివే పిల్లా నీవు

నీ వదరుబోతు తనం నా కాడ కాదే

పోట్లగిత్త లెన్నింటినో లొంగదీసి నోడిని

పోట్లగిత్త లెన్నింటినో లొంగదీసి నోడిని

నీకు ముకుతాడు నేను వేయలేనా

నీకు ముకుతాడు నేను వేయలేనా

ఆ మూడు ముళ్ళు నే వేయలేనా

నూరేళ్ళు నీ వొడి లోన నే నిండిపోనా


ఆమె:

నీ బడాయి మాటలు జబ్బల గొప్పలు చెప్పింది చాల్లే బండోడా సూక్ష్మం చెబుతాను వినుకో.. 

చిన్నదాన్ని మనసు శివధనుస్సు లాంటిది

ధనుస్సునెత్తే ముందు ధరణి పుత్రిక ను చూసినాడు రాముడు

 ఆ చూపుతోనే మనసు చిక్కబట్టినాడు

చక్కనమ్మ చిక్కినాక ధనుస్సు ఇరగ్గొటినాడు

చక్కనమ్మ చిక్కినాక ధనుస్సు ఇరగ్గొటినాడు

ఆ సులువు కనిపెట్టలేవా 

ఆ..  సులువు నువ్వు కనిపెట్టలేవా… 

ఇంత మంద మెదడు వున్న మొనగాడా 

మగువ మనసు తెలుసుకోరా బండోడా


అతను:

కనిపెట్టినానే పిల్లా నేను

కనిపెట్టినానే పిల్లా నేనూ.. 

నీ కళ్ళలోకి నేను కళ్ళు పెట్టి చూసా

గుండె లోకి తిన్నగా దారేసినాను

మనసుతో  మనసుకి పీట ముడి పెట్టేసినాను

లగ్గం చేసుకోను ఎత్తుకొని పోతాను నిన్ను 

ఎత్తుకొని పోతాను నేనూ.. 

మీసాలపై మనసునేంటి పిల్లా 

మొత్తంగా నిన్నే  నెత్తిన పెట్టుకొంటా.. 

మొత్తంగా నిన్నే  నెత్తిన పెట్టుకొంటా.. 

గుండె గొంతుకలోన

 గుండె గొంతుకలోన  … కథ వినండీ.. 

రచయిత ఎవరో కనుక్కోండి. కథలో చాలా క్లూస్ వున్నాయి. సాహితీ ప్రియులు చాలామంది గుర్తించగలరు. 



24, నవంబర్ 2024, ఆదివారం

వంశాంకురం

 కథ వినండీ.. 



పుట్టినరోజు శుభాకాంక్షలు

 



చిన్ని..! బంగారం.. !!  

పుట్టిన రోజు శుభాకాంక్షలు .

ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..

చైతన్యవంతమైన జీవన గమనం తో.. 

స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ.. 

సుఖసంతోషాలతో,ఆయురారోగ్యములతో,పుత్ర పౌత్రాభివృద్దితో 

యశస్విభవ గా. దేదీప్యమానంగా వెలుగొందాలని ..

మనసారా దీవిస్తూ.. 

భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా  నీకు లభించాలని కోరుకుంటూ... 

హృదయపూర్వక శుభాకాంక్షలు. 

నిండు మనస్సు తో.. ఆశ్శీస్సులు .. అందిస్తూ..

ప్రేమతో..దీవెనలతో.. అమ్మ.



15, నవంబర్ 2024, శుక్రవారం

మహా రుద్రాభిషేకం

 స్వామి అభిషేకానికి అతను దోసిళ్ళతో ఏమి తెచ్చాడో వినండి.. 108 బిందెలతో ఏమి తెచ్చాడో చూడండి. 

సుఖాలను దుఃఖాలను నవ్వులను పువ్వులను కన్నీళ్ళను కూడా తెచ్చి.. ఏమి కోరుకుంటున్నాడో ఎంత ఆర్ద్రంగా వేడుకుంటున్నాడో  వినండీ.. 



సామ్రాజ్ఞి

 అమెరికా కథలు కనెక్టింగ్ ప్లైట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు చెపుతుంటే వినాలండీ. అత్తగారివే కాదండీ కన్నతల్లుల కథలు వుంటాయి. 🥲 మోడర్న్ డే ఫ్యామిలీ కథ. కథలో ఎవరికి వారు మంచోళ్లే... అదే సమయంలో ఎవరి పవర్ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఎవరి స్థానాన్ని వాళ్ళు దక్కించుకునే ప్రయత్నాన్ని చక్కగా చూపించారు. కథలో ఎక్కడికక్కడ infuse చేసిన తెలుగు సామెతలు భలే ఉన్నాయి. వియ్యపురాలి ఇన్‌సెక్యూరిటీ కథలోని కాన్‌ఫ్లిక్టుకి కారణం - అత్తగారి పాత్ర యొక్క మెచ్యూరిటీ వల్ల కథ మంచిగా ముగిసింది. ఇద్దరిదీ ఇన్‌సెక్యూరిటీ అయి ఉంటే బతుకెంత ఘోరంగా నడిచేదో...

Well done ✍️👏👏👏💐


సామ్రాజ్ఞి- వనజ తాతినేని కథ




12, నవంబర్ 2024, మంగళవారం

సోషల్ మీడియా ని దిగజార్చింది ఎవరు!?

 కొందరు మొక్కలు గురించి పూల గురించి పిల్లల గురించి భూత దయ గురించి మాట్లాడుతూ ఏదైనా బాధాకరమైన విషయం గురించి మాట్లాడుతూ టన్నుల కొలదీ విచారం వొలకబోస్తూ “అయ్యయ్యో అచ్చెచ్చో ఇలా జరిగివుండకూడదు” అంటూ వుంటారు. నిజానికి ఇటువంటి వారిలో వారి స్పందన చాలా వరకు కొన్ని క్షణాల వ్యవధి. మళ్ళీ వారు మాములైపోతారు. అలాంటి వారు 90% మంది నా చుట్టుపక్కల వుంటారని నాకు స్పష్టమైన అవగాహన ఉంది. 

గొప్ప కోసమో లేదా నేను మాత్రమే ప్రత్యేకమైన మనిషిని అని చెప్పుకోవడం కాదు కానీ..

గత ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు గురించి మాత్రం నేను చాలా గట్టిగా ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి ఉద్యమం సమయంలో ఆ ప్రాంత స్త్రీలపై జరిగిన హింస అణచివేత పై చాలా వేదనకు గురయ్యాను. తర్వాత కూడా చాలా హింసాత్మక ఘటనలు చూసాం. చాలామంది వాటినన్నింటిని రాజకీయ కోణంలో కొందరు వ్యతిరేకం గానూ కొందరు లోలోపల నవ్వుకుంటూ అలాగే జరగాలని ఆనందించారు. 

వివేకానంద రెడ్డి గారి పాశవిక హత్య అమరావతి స్త్రీల పట్ల హీనంగా హింసాత్మకంగా ప్రవర్తించిన తీరు, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వేధింపులు ఇలాంటివి గమనించినప్పుడు ఈ హింస ఎలాంటిది అనే సృహ ప్రపంచంలో వున్న తెలుగు వారందరిని ఆలోచింప చేసింది. 

నేనెప్పుడూ నా స్పందన దాచుకోనూ.. రచయిత ముసుగు వేసుకోను. స్పందించేటప్పుడు లాభనష్టాల బేరీజు వేసుకోను. అమరావతి ఉద్యమం లో పాల్గొన్న స్త్రీల పై హింస కి స్పందించాను. Fb లో ఇక్కడే ఒక పోస్ట్ పెట్టాను. పేరు కూడా ఉదహరించలేదు. నా ఫ్రెండ్ లిస్టులో వున్న వాళ్ళే ఆ పోస్ట్ ను వారికి అందించారు. నేను నా ఫోటోలు పబ్లిక్ లో పెడతాను తప్ప పిల్లల ఫోటోలు ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు పబ్లిక్ లో పెట్టను. నా ఫోటో పెట్టి ఆ రాకాసి సంతతి troll చేసారు. నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తెలియక నన్ను tag చేసిన ఫోటోలు సేకరించి ఆ ఫోటోలు పెట్టి అశ్లీల భాష ప్రదర్శించారు. 

నేను వొకటే చెబుతున్నాను. నేను ఆ పోస్ట్ నా తోటి స్త్రీలపై జరిగిన హింస కు అణచివేతకు స్పందించి పెట్టిన పోస్ట్. నేను వాడిన భాష కోపం వచ్చిన ప్రతి స్త్రీ మాట్లాడే భాష. అందులో ఆవేదన తప్ప మరొకటి లేదు. 

ఈ సంగతి జరగకముందే మెసెంజర్ లోకి వచ్చి తిట్టి వెళ్ళిన విషయాలు అన్నీ భద్రంగా వున్నాయి.. fb account ID లతో సహా. 

ఎవరైతే అసభ్యంగా తిట్టారో పోస్ట్ లు పెట్టారో ఆ పోస్ట్ లను ఇంకో నాలుగు మాటలు తిప్పి share చేసారో.. వారందరికీ శిక్ష వుంటుంది. ఆల్రెడీ నోటీసులు అందుకున్నారు. చిన్నా చితకలు అకౌంట్లు మూసుకుని పోయారు. 

నా ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వారి వీరాభిమానులు 

IPAC సభ్యులు ముసుగు ముఖాలు.. తోటి స్త్రీలను అంత బాధ కు గురిచేస్తే స్పందించని మీరు నన్ను troll చేస్తే నవ్వుకున్న మీరు.. ఒకటి తెలుసుకోవాలి.  నేను బాధ పడ్డాను. ఆల్ రైట్. ఆ బాధ తట్టుకోలేక fb నుండి కొద్ది రోజులు నిశ్శబ్దంగా వుండిపోయాను. 

ఈ రోజుకు నేను ఈ బాధకు కారణం అయిన పోస్ట్ డిలీట్ చెయ్యలేదు. ఆ పోస్ట్ పెట్టిన కార్యకారణ సంబంధం సత్యమైనది. ఈ పోస్ట్ లో ఆ రోజు నేను పెట్టిన పోస్టు జత చేస్తున్నాను చూడండి. అందులో కనీసం వ్యక్తులను ఉదహరించలేదు. మీరు మాత్రం ఫోటోలు పెట్టి అశ్లీలం గుమ్మరిస్తారు. ఆ రాత లో వున్న వ్యక్తి ఎవరో మీకు అర్థమైనప్పుడు ఆ హింస కూడా అర్థం కావాలి కదా!  అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు జ్ఞానవంతుల్లారా!? 

ఆంధ్రప్రదేశ్ కి “అమరావతి” మాత్రమే రాజధాని. అది సత్యం శాశ్వతం. ఇక చావులు గురించి.. ఎవరికి ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. కొందరు కోపంతోనో ఆవేదనతోనో ఆవేశంతోనో తిడతారు.. అవి నిజం తిట్లు కావు. అమ్మలైన అందరూ కూడా తిడతారు. అంతెందుకు అసలు వాళ్ళ అమ్మ కూడా తిడుతూనే ఉంటుంది అని కొందరు అంటూంటారు. 

ఈ అశ్లీల తిట్టుడు కార్యక్రమాలు జరగడం నాతోనే మొదలు కాదు చివర కాదు.. మగవాడి మదాందకారం ఆడదాని అహంకారం నోటి వాచాలత కు మూలకారణం సంస్కార హీనం. 

మా భువనమ్మ ను కూడా తిట్టారు కదా అని ఆ పెద్ద గీతతో నా చిన్న గీతను పోల్చుకుని కాస్తంత ఉపశమనం పొందానేమో తప్ప జరిగింది మర్చిపోలేదు. బాకీ మిగిలేవుంది.

అది చట్టపరంగా తీరుతుంది. ఒకొకడిని పెన్సిల్ చెక్కినట్టు చెక్కాలి. Nib విరిగిపోవాలి. మళ్ళీ వెబ్ పేజ్ పై కీ బోర్డు  వాడకుండా వెర్బల్ డయేరియా కక్కకుండా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాడు ఎవడైనా సరే! 

ఇంకా లిస్టు వుంది.. బాకీ వుంది. సమాజానికి చీడపురుగులు వీరు. పోర్న్ మాదకద్రవ్యాలు లకన్నా ప్రమాదకరమైన వారు వీరు. వీరి ఉనికి ప్రమాదకరమైనది.  

PS: స్త్రీలను ఆడపిల్లలను ఎవరు కించపరిచినా.. నేను వొప్పుకోను. అశ్లీలంగా కామెంట్ పెడితే ఊరుకోను. కామెంట్ డిలీట్ చేస్తాను. బ్లాక్ చేస్తాను.

9, నవంబర్ 2024, శనివారం

జుబేదా

 ఒక హృద్యమైన కథ వినండీ.. 



మూడువేల అల్లికలు

 సంస్కరణోద్యమం ద్వారా మన ఆచారాలు వ్యవహారాలు మూఢనమ్మకాలు కొంతవరకు సమసిపోయాయి. విద్య ఉద్యోగాలు స్త్రీలకు అందిన ద్రాక్ష అయ్యాక అన్నీ సవ్యంగా ఉండి సమాజంలో మార్పు వచ్చింది అనుకుంటే పొరపాటే అవుతుంది. కొన్ని వ్యవస్థలు స్త్రీలకు శాపంగా పరిణమించాయి. అందులో దేవదాసీ వ్యవస్థ. కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఆ వ్యవస్థ స్త్రీలకు శాపంగా పరిణమించింది. ఆ దేవదాసీ వ్యవస్థను మార్చడానికి సుధామూర్తి ఎంతో కృషిచేశారు. ఆ స్వీయానుభవాన్ని కథగా రాశారు. “మూడు వేల అల్లికలు “ కథ గా వచ్చింది. ఆ కథ ను ఆడియో రూపంలో వినండీ.. 



4, నవంబర్ 2024, సోమవారం

షరీఫా

 పెళ్ళైన పదేళ్ళ తర్వాత రెండో వివాహం చేసుకుని వచ్చిన భర్త కు ఆ భార్య స్పందన నిశ్శబ్ద యుద్ధం ఎటువంటిది!? అతను జీవచ్ఛవం గా ఎందుకు మిగిలాడు!? ఆసక్తికరమైన కథ తప్పక వినండీ.. 




షరీఫా- సౌపర్ణిక   కథ వినండీ

ఆకులు రాల్చిన కాలం

 కథ వినండీ 



3, నవంబర్ 2024, ఆదివారం

ధాత్రి మాత

  పిచ్చి తల్లి 


అమ్మా ఆకలి అని పిలుపు వినిపిస్తే .. సమాధిలో నుండైనా లేచి పరుగెత్తి రావాలి. 

అంత ప్రేమ వుండాలి తల్లికి. 


అమ్మలను అమ్మ అమ్మలను అసహ్య భాషలో తిడుతుంటే 

చనుబాలు తాగుతూ రక్తం కారేటట్లు కొరికినా ఓర్చుకున్నట్టు చిన్న బిడ్డడు లే అని సర్దుకు పోవాలి. 


ఆలి వచ్చినాక పళ్ళెంలో ఇంత ముద్ద వేయకపోయినా.. పాపం ..నా బిడ్డ తప్పేం లేదు. పరాయి బిడ్డ పన్నాగం అనుకోవాలి గుడ్డి ప్రేమతో... 


ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తూ వుంటారు

భ్రమతలు వొదలరు సత్యం జీర్ణించుకోలేరు

పసివాళ్ళు!  వాళ్ళకేం తెలుసు సంసారం ఈదడం సాగరం ఈదటమేనని 

అంటూ .. మనసు గంప కింద గుట్టుగా దాపెడతారు. 


పిచ్చి సన్నాసులు

ఏదో చికాకులో నోరు జారతారు చెయ్యి ఇసురుతారు కానీ..

మళ్ళీ అవసరం వచ్చినా ఆపదొచ్చినా.. 

అమ్మా! కాసిని దుడ్లు ఇయ్యవే

కయ్యో ఇల్లో రాసియవ్వే.. అని కాళ్ళా వేళ్ళా పడతారు. బిడ్డలు మననిగాక ఎవర్నడుగుతారులే అని జాలిపడతారు.


కరిగి నీరై వేలిముద్రో సంతకమో చేజారారో.. 

దేవతలా దేవుడిలా చూసుకుంటానన్న వాగ్దానం.. హుష్ .. కాకి ఎత్తుకుపోయిందని.. 

రిజిష్టరు ఆఫీసు కాడే వొదిలిపెట్టి  దొడ్డి దారిన జారుకుంటారు. 


నిజం నిప్పై , నొప్పి నిజమై,  చేసిన తప్పై  రుణమై శాపమై పాపమై.. 

గొంతెత్తి ఏడ్చే శక్తి లేక నీరు నిండిన కళ్ళతో 

అయోమయం గా చూస్తుంటారు. నిశ్శబ్దంగా 

కాటికి సర్దుకుంటారు.



భూమి మీద పుట్టిన మానవ సంతతికి 

*ధాత్రి మాత ప్రసవ వేదన చిత్రాన్ని చూపండి 

అమ్మల్లారా అయ్యల్లారా..! 

అంతకు మించి… 

ఆ ప్రసవపు నొప్పి భరించిన తల్లులు పడే 

ఈ భరించలేని బాధలెన్నెంటినో తూకం వేయకండి. సారూప్యత వెతకకండి.


లైవ్ టెలీకాస్ట్ ల్లోనూ..  పెట్టుడు పోగ్రామ్ ల్లోనూ తల్లులను చూపిస్తూ ఆ బాధలను యెగతాళి చేయకండి.. తల్లుల్లారా తండ్రుల్లారా.. 🥲🥲


మీ అమ్మ ఏనాడో మీ నాయన దాష్టీకానికి చచ్చి చచ్చి మీ కోసమే బతికిన వెర్రి తల్లి .. వెర్రి ప్రేమ గల పిచ్చి తల్లి. ఆమె చావును ఆమె చావనియ్యండి.


*(ధాత్రి మాత - నేపాల్  / ప్రసవ వేదన పడే తల్లి రూపాన్ని భక్తితో పూజిస్తారు)




1, నవంబర్ 2024, శుక్రవారం

పిచ్చి తల్లి

 పిచ్చి తల్లి 


అమ్మా ఆకలి అని పిలుపు వినిపిస్తే .. సమాధిలో నుండైనా లేచి పరుగెత్తి రావాలి. 

అంత ప్రేమ వుండాలి తల్లికి. 


అమ్మలను అమ్మ అమ్మలను అసహ్య భాషలో తిడుతుంటే 

చనుబాలు తాగుతూ రక్తం కారేటట్లు కొరికినా ఓర్చుకున్నట్టు చిన్న బిడ్డడు లే అని సర్దుకు పోవాలి. 


ఆలి వచ్చినాక పళ్ళెంలో ఇంత ముద్ద వేయకపోయినా.. పాపం ..నా బిడ్డ తప్పేం లేదు. పరాయి బిడ్డ పన్నాగం అనుకోవాలి గుడ్డి ప్రేమతో... 


ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తూ వుంటారు

భ్రమతలు వొదలరు సత్యం జీర్ణించుకోలేరు

పసివాళ్ళు!  వాళ్ళకేం తెలుసు సంసారం ఈదడం సాగరం ఈదటమేనని 

అంటూ .. మనసు గంప కింద గుట్టుగా దాపెడతారు. 


పిచ్చి సన్నాసులు

ఏదో చికాకులో నోరు జారతారు చెయ్యి ఇసురుతారు కానీ..

మళ్ళీ అవసరం వచ్చినా ఆపదొచ్చినా.. 

అమ్మా! కాసిని దుడ్లు ఇయ్యవే

కయ్యో ఇల్లో రాసియవ్వే.. అని కాళ్ళా వేళ్ళా పడతారు. బిడ్డలు మననిగాక ఎవర్నడుగుతారులే అని జాలిపడతారు.


కరిగి నీరై వేలిముద్రో సంతకమో చేజారారో.. 

దేవతలా దేవుడిలా చూసుకుంటానన్న వాగ్దానం.. హుష్ .. కాకి ఎత్తుకుపోయిందని.. 

రిజిష్టరు ఆఫీసు కాడే వొదిలిపెట్టి  దొడ్డి దారిన జారుకుంటారు. 


నిజం నిప్పై , నొప్పి నిజమై,  చేసిన తప్పై  రుణమై శాపమై పాపమై.. 

గొంతెత్తి ఏడ్చే శక్తి లేక నీరు నిండిన కళ్ళతో 

అయోమయం గా చూస్తుంటారు. నిశ్శబ్దంగా 

కాటికి సర్దుకుంటారు.



భూమి మీద పుట్టిన మానవ సంతతికి 

*ధాత్రి మాత ప్రసవ వేదన చిత్రాన్ని చూపండి 

అమ్మల్లారా అయ్యల్లారా..! 

అంతకు మించి… 

ఆ ప్రసవపు నొప్పి భరించిన తల్లులు పడే 

ఈ భరించలేని బాధలెన్నెంటినో తూకం వేయకండి. సారూప్యత వెతకకండి.


లైవ్ టెలీకాస్ట్ ల్లోనూ..  పెట్టుడు పోగ్రామ్ ల్లోనూ తల్లులను చూపిస్తూ ఆ బాధలను యెగతాళి చేయకండి.. తల్లుల్లారా తండ్రుల్లారా.. 🥲🥲


మీ అమ్మ ఏనాడో మీ నాయన దాష్టీకానికి చచ్చి చచ్చి మీ కోసమే బతికిన వెర్రి తల్లి .. వెర్రి ప్రేమ గల పిచ్చి తల్లి. ఆమె చావును ఆమె చావనియ్యండి.


*(ధాత్రి మాత - నేపాల్  / ప్రసవ వేదన పడే తల్లి రూపాన్ని భక్తితో పూజిస్తారు)