27, డిసెంబర్ 2025, శనివారం

ఊరు పిలుస్తోంది

 



దూరంగా ఊరు పిలుస్తోంది 

రా రమ్మని పిలుస్తోంది 

ఆకుపచ్చని స్వాగత గీతంతో ఎదురొస్తుంది 

అలికిన మనసుపై ఆత్మీయత ముగ్గు వేసి 

చేతులు బారచాచుతూ లోనికి ఆహ్వానం పలుకుతోంది 

బంతి చామంతి దారుల మధ్య నడుస్తుండగానే

నులివెచ్చని గుమ్మపాలు చెంబుతో ఎదురొచ్చింది. 

ఇంకో చెంబుతో కాళ్ళు కడుక్కోవడానికి నీరు వచ్చింది.

 కుశలప్రశ్నలు అడుగుతూనే  గోరువెచ్చని ఎండకి 

ఒళ్ళు వెచ్చబెట్టుకోమని నులకమంచమేసింది. 

చుట్టమొచ్చిన వాసన కమ్మి ఇరుగుపొరుగొచ్చి

పలకరింపుల దడి కట్టారు. 

పదుంపుల్లతో పళ్ళు తోమి పొంతపొయ్యి నీళ్ళతో తానమాడి 

ఆవిరిగ్రక్కుతున్న కాఫీ చప్పరిస్తూ.. వుంటే.. 

ఈ గాలి ఈ వేళ ఈ ఊరు సెలయేరు 

నను గన్న నా వాళ్ళు.. నా కళ్ళ లోగిళ్ళూ… 

ఊరికి పోవాలనిపిస్తుంది. 

జ్ఞాపకాల నెగడు రగులుతోంది. 



26, డిసెంబర్ 2025, శుక్రవారం

మేల్కొలుపు

 


మేల్కొలుపు  - వనజ తాతినేని


మేల్కొన్నావా ! 

ఆది అనంత నీరవ నిశ్శబ్దంలో మేల్కొన్నావా? 

ఎలకారు కోయిల గానంలోనైనా 

ఎలతేటి ఝంకారంలో నైనా మేల్కొన్నావా? 

నా పాటలో నైనా మేల్కొన్నావా! 

నా హృదయంలో నైనా మేల్కొన్నావా? 

పోనీ నా ఆరాధనకైనా  మేల్కొనలేదా? 

ఈ రాత్రి విరిసిన పారిజాత పుష్పాల సుంగంధానికైనా మేల్కొన్నావా? 


వర్షగానంలో వందల కొలది నెమళ్ళు నృత్యం చేయడం చూసేవుంటావ్

అలా నా హృదయం కేథరిన్ నృత్యం చేస్తుంది. 

నాతో అడుగు కలుపుతావని నృత్యం కూడా ఎదురు చూస్తుంది.

రాత్రంతా కలలో నువ్వు అందమైన పేపర్ కైట్ సీతాకోకచిలుకలో 

పరకాయ ప్రవేశం చేసివుంటావని.. 

దాని వెనుకనే నా మనసు పరుగులు పెడుతుంది. 


నేనసలు నీకు గుర్తున్నానా!? 

ఎడమ వైపు ఒత్తిగిల్లి నప్పుడైనా నీ చెవికి వినిపించే  

గుండె చప్పుడులో నన్ను కనుగొనలేదా? 

నేనిప్పుడు ఈ లోకంలో లేను, నీ లోకంలో జీవిస్తున్నాను

నీ ఇష్టసఖి నిష్కపట స్పర్శ కోసం అలమటిస్తూంది.

రేయంతా నీ వేణువు శబ్దం వినిపిస్తూనే వుంటుంది.

ఆ కలవరపాటుకు ఎన్నో దీర్ఘరాత్రుల నా నిద్రను త్యాగం చేసాను.


ఎందుకింత ఉపేక్ష? 

ఉపదేశాలు వినిపించేవారు నను సమీపిస్తున్నారు 

ఈ జీవిత నిర్బంధం నుంచి నన్ను తప్పించలేవా?

దుఃఖశృంఖలాల నుండి విడిపించలేవా? 

పోనీ నీ ప్రేమలో నైనా నన్ను పునర్జీవించనీయరాదా?

నాది ప్రేమైనా, మధుర భక్తి అయినా నీ దండలో పువ్వుగానో

మౌక్తికంగా  మారడానికి అనుమతినివ్వు.

నీ కరుణా వర్షపు చినుకుకై నా ఎదురుతెన్నులు


రా మాధవా! నేను రాధ ని కాను, యాజ్ఞసేని ని కాదు

మాధవి ని కాను, మీరాబాయీ ని కాదు. 

పూలసజ్జె నిండా పరిమళద్రవ్యాలను నింపుకుని నీ దారిలో

వేచిచూస్తున్న కుబ్జను కూడా కాదు.

నా చిన్ననాటి నుండి నా రెండు చేతుల మధ్య

ఇష్టంగా మోసినదాన్ని. పెను మాయలో పడి 

నిను నా గుండె గదుల్లో భద్రంగా దాచినదాన్ని. 

నీ రస స్పర్శలో మునిగి తేలుతున్నదాన్ని.

నీతో బృందావనాన్ని కలగన్నదానిని

నన్ను నీలో మేల్కొననీయ్, లేదా నువ్వు నాలో నైనా మేల్కో! 

ఇది నవయుగపు కృష్ణ ప్రేమ. 


******************

©️Vanaja Tatineni


#వనజతాతినేని #vanajatatineni #poetry #telugupoetry #indianpoetry #vanajavanamali #వనజవనమాలి #వనమాలి


( 21 డిసెంబరు 2025 ది ఫెడరల్ తెలంగాణ డాట్ కమ్ లో .. ప్రచురితం.)

చిత్రం:శ్రీలక్ఙి



ఈ కవితలో ప్రస్తావించిన అంశాలకు వివరణ

*కేథరీన్ డన్హామ్ (1909-2006) ఒక ప్రముఖ ఆఫ్రికన్ అమెరికన్ నర్తకి, కొరియోగ్రాఫర్, ఆఫ్రికన్, కరేబియన్ నృత్య శైలులను అమెరికన్ నృత్యంలోకి తీసుకువచ్చారు, *పేపర్ కైట్ సీతాకోకచిలుక

24, డిసెంబర్ 2025, బుధవారం

కాలం ఇచ్చిన …

 


ఆరు రోజులు ముందుగానే.. 2025 వ సంవత్సరాన్ని సింహావలోకనం చేసుకుంటున్నాను. 😊

పాఠకురాలిగా.. చాలా చదువుకున్నాను. ఏం చదివాను అంటే .. వెదుక్కుని మరీ చదివాను. ఎక్కువగా అనువాద సాహిత్యం చదివాను. ఈ పఠనానుభవం బాగుంది. 

తర్వాత సాహిత్య ప్రసంగాలు కూడా విన్నాను. ఇదో కొత్త అనుభూతి . ప్రపంచ సాహిత్యం గురించి  తెలిసింది. నాలో పాఠకురాలు సంతృప్తి చెందింది . తర్వాత అవే విషయాలు  మిత్రులతో  చర్చించాను . అది ఇంకా బావుంది. 

************

రచయిత గా.. 

“దుఃఖపు రంగు “ కథా సంపుటి ప్రచురణలో వచ్చింది. 24 కథలున్నాయి ఇందులో. 

ఆరు కథలు ప్రచురణ లో వచ్చాయి. 

నువ్వు - నేనూ - ఓ కనకాంబరం (సారంగ -మార్చి)

ఇంతింతై (ప్రజాశక్తి- స్నేహ)

కలవరమాయే మదిలో (ప్రజాశక్తి-స్నేహ)

క్రాస్ రోడ్స్ (సారంగ -నవంబరు 15)

దేవర న్యాయం (కొలిమి -నవంబర్)

నువ్వు - నేనూ - ఓ ప్రేమ (ఫేస్ బుక్ ప్రచురణ) 

ఇంకా.. ఒక అముద్రిత కథ పత్రిక పరిశీలనలో వుండి.. మూడు నెలల నుండి. 

కవిత్వం.. చాలా రాసాను, రాస్తున్నాను 😊

ఈ కథలన్నీ నా రచనలే! కానీ ఒక కథ నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. 3 ఏళ్ళు నానబెట్టి రాసిన కథ. కానీ బాగా వచ్చింది, నచ్చింది. ఇలాంటి కథను గ్లామరైజ్ చేయకూడదనుకుంటూనే రాసాను. అంశం అంత బలీయమైనది. విషాదమైనది గనుక. 

**************

ఈ సంవత్సరం .. నా మనుమరాళ్ళు ఇద్దరిని ప్రేమగా ఆత్మీయంగా ఆనందంగా గాఢంగా హత్తుకున్నాను. ఇది ఈ సంవత్సరం నాకిచ్చిన అపురూపమైన కానుక. 

ఇక నా కొడుకు కి నాకు మరింత ప్రేమ అనుబంధం అర్ధం చేసుకునే తత్వం  బలపడింది. గౌరవం మరింత పెరిగింది. మా మధ్య ఏరోనాటికల్ మైల్స్ అలాగే వున్నాయి కానీ .. ఆ బాండింగ్ మరింత దృఢంగా మారింది. 

జీవితం కొన్ని పరీక్షలు పెట్టింది. ఎదుర్కొన్నాం. ఆశావాదులకు పాజిటివ్ గానే వుంటుంది. మాకు అంతే! 

********** 

జాతకాలు వార ఫలాలు  నేను అంత నమ్మను. కానీ ఈ సంవత్సరం రాజ్యపూజ్యం మాటేమోగాని అవమానం జరిగింది అంటే నేనే తెల్లబోయాను. షాక్ అయ్యాను. మానసిక స్థితి సరిగ్గా లేని ఒక వ్యక్తి చేసిన చేస్తున్న ఆరోపణలు షాకింగ్ అనిపించాయి. ఇగ్నోర్ చేసాను. వీసమెత్తు మన తప్పు లేకపోయినా అవమానాలు జరగవచ్చు. ఓహో.. ఇలా కూడా జరుగుతాయన్నమాట అనుకున్నాను. ఆన్ లైన్ స్నేహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేసింది ఈ అనుభవం. ఇలాంటి అనుభవాల మధ్య కూడా మంచి స్నేహాలు వృద్ధి చెందుతాయి. కానీ జాగ్రత్తలు అవసరం. 

ఈ సంవత్సరం సగభాగం అధిక ప్రయాణాలతో .. తర్వాత సగం పూర్తి విరుద్ధంగా జరిగింది. 

YouTube ప్రయాణం నిరుత్సాహంగా ఉంది. బ్లాగ్ నిర్వహణ బాగుంది. (రాసినవి భద్రంగా దాచుకోవడం) 

ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ సంవత్సరం ఎక్కువ ఫోటోలు తీసి వుంటాను. సంతృప్తిగా వున్నాను 😊🤗. 

ఇవి.. 2025.. ఇచ్చిన అనుభూతులు,అనుభవాలు. 

వచ్చే సంవత్సరం ఏం చేయాలి అని ఊహించడం లేదు. ఆలోచించడం కూడా లేదు.. Go’s on.. 

గడచిన కాలానికి 🙏❤️💐🎈🎉


23, డిసెంబర్ 2025, మంగళవారం

మినీ కవితలు


ఖాళీ తనాన్ని ఒంపేసుకునేందుకు తొందర యెందుకు? 

జ్ఞాపకాలను తిరగతోడితే.. రాళ్ళు అనుకుని ఒదిలేసిన

మంచి ముత్యాలు కనబడతాయి.

అరచేతికి  అవి అందనూవచ్చు

హృదయ యంత్రానికి కందెనలు అవి. 

సమయం జారిపోతుంది గడియ పెట్టండి.


©️Vanaja Tatineni 




నిత్యం పువ్వు నేనూ ఒకే కల కంటాం.

దృశ్యాన్ని ఇంకించుకోవాలని. 

నేను కొంచెం విభిన్నం.. 

కాఫీ కప్ లో సౌందర్య దాహం  

                

                        - వనజ తాతినేని








21, డిసెంబర్ 2025, ఆదివారం

మాధవుడి ప్రేమ

 


మాధవుడి ప్రేమ

నాకు ఉహ తెలిసినప్పటి నుండీ కృష్ణుడంటే చాలా ఇష్టం. మా ఇంట్లో నానమ్మ పూజ గదిలో చిన్న చిన్నికృష్ణుడు వెన్న తినే  ప్రతిమ వుండేది. ఆ ప్రతిమ తీసుకుని నేను ఆడుకునే బొమ్మలతో కలిపేసేకుని ఆడుకునేదాన్ని. మా నానమ్మ రోజూ నన్ను అడిగి తీసుకుని ఓ పువ్వు పెట్టి దణ్ణం పెట్టుకున్నాక మళ్ళీ ఆమెకు తెలియకుండా తీసుకునేదాన్ని. తల్లి బిడ్డను ఎత్తుకుని హృదయానికి హత్తుకున్నట్టు ఆ పంచలోహ ప్రతిమను రెండు చేతుల మధ్య పట్టుకుని గుండెకు హత్తుకునేదాన్ని.  కొంచెం పెరిగిన తర్వాత గోడ పై మేకుకి వేలాడుతున్న కేలండర్ లో స్వర్గీయ ఎన్టీఆర్ గారు కృష్ణుడు  రూపంలో కనిపించేవారు. ఆయనకు ప్రతిరోజూ ఓ నమస్కారం తప్పనిసరి. అలా మనకు చెప్పి చేయించేవారు కదా.. పెద్దలు. ఇక కృష్ణలీలలు వినని ఇల్లు, మన తెలుగు లోగిలి వుంటుందా?

నాకు పదేళ్ళప్పుడు అనుకుంటా అమరదీపం సినిమా చూసాను. అందులో మాధవి..(అనుకుంటా)

నీవే తల్లివి తండ్రివి 

నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ 

నీవే గురుడవు దైవము 


నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణా! 


అంటూ పాట పాడుతుంది. 

అది మెదడుకి బాగా యెక్కిపోయింది. గ్రీటింగ్ కార్డ్స్ పై కృష్ణుడు.. సినిమా వాల్ పోస్టర్లు లో 

కృష్ణుళ్ళు పేపర్ లో కృష్ణుళ్ళు అన్నీ నావే! టీనేజ్ రాధాకృష్ణుల చిత్రాలు కూడా వుండేవి ఆ సేకరణలో. రేడియోలో వినే యుగళగీతాల ప్రభావం టీనేజ్ లో ఎలా వుంటుందో అనుభవించలేదని అబద్దం చెప్పను నేను. 🙂🥰 

ఆ తర్వాత పదవ తరగతి పరీక్షలు అయ్యాక వేసవి సెలవల్లో ఏమీ తోచక శ్రీమద్భగవద్గీత చదివాను. (మా ఇంట్లో నాయనమ్మ నిత్యం చదువుకునేది. పూజాబల్లపై వ్యాసపీఠం పై భగవద్గీత వుండేది. రోజూ ఒక శ్లోకం చదువుకుని ఒక పువ్వు తులసిదళం అక్షింతలు వుంచి నమస్కారం చేసుకోవడం… నా కళ్ళ ముందు దృశ్యమై కదులుతుంది ఇప్పుడు కూడా.)భగవద్గీత నేను చదువుతుంటే కొంతమంది పెద్దలు వారించారు ఈ వయస్సులో చదవకూడదు అని. కానీ నేను వినను కదా!  చదివేసాను. నాలో గాంభీర్యం వచ్చేసింది.

నల్లనయ్య అంటే అర్జునుడి స్నేహితుడు .. నాక్కూడా స్నేహితుడు,బోధకుడు అనే ఫీలింగ్ లోకి వచ్చేసాను. తర్వాత అక్కడ కొంత అక్కడ కొంత భారతం చదివాను. ఇక మన ఎన్టీఆర్ నటించిన భారతభాగవత చిత్రాల్లోని కృష్ణ పాత్రల ఆకర్షణ కూడా బలీయంగా వుంటుంది కదా!అలా కృష్ణుడు చెలికాడుగా స్థిరపడిపోయాడు. నాకు పద్దెనిమిదో సంవత్సరంలో పెళ్ళి అయింది. మా అత్తమ్మ కంతలో (ఇదొక బహుమతి సంప్రదాయం) వెండి రంగులో వుండే వేణుమాధవుడి ప్రతిమ పెట్టారు. అందరూ అది వెండిది అనుకుంటారు..కానీ అది జర్మన్ సిల్వర్ దే! మనకు మెటీరియల్ తో పని లేదు విలువతో పని లేదు. నాకు చాలా ఇష్టమైపోయింది. ఆ తర్వాత.. ఈ నలభై సంవత్సరాల్లో నాకు ఎన్ని కృష్ణుడి బొమ్మలు బహుమతిగా వచ్చాయో చెప్పలేను లెక్కలేదు, కాఫీ,కాకరకాయ కూర, మాధవుడు నాకు ఇష్టమని.. నా దగ్గర వారందరికీ తెలుసు. 


ఆ ఇష్టం పెరిగి పెరిగి పెద్దదై మర్రి ఊడల్లా విస్తరించింది. పదిహేనేళ్ళ క్రిందట నా బ్లాగ్ క్రియేట్ చేసుకునేటప్పుడు.. ఆ పేరు తో ప్రయత్నిస్తే లభ్యత లేదు. అందుకే.. నా పేరు పక్కన వనమాలి ని చేర్చి “వనజవనమాలి” అయింది బ్లాగ్ నామధేయం. నాకు కృష్ణ (యాజ్ఞసేని) కృష్ణుడి స్నేహం అపురూపంగా తోస్తుంది. ఇంతకు ముందు వనమాలి పై కవిత్వం రాసుకున్నాను. అదంతా నా కోసమే! 


ఇప్పుడు కూడా ఈ “మేల్కొలుపు” కవిత్వం కూడా కేవలం నా కోసమే. ప్లూట్ బేస్ సంగీతం నాకెందుకు ఇష్టమో మీకు ఇప్పటికి అర్దమై వుంటుంది కదా! హరిప్రసాద్ చౌరాసియా, రాజేష్ చేర్తాల, రాకేష్ చౌరాసియా, రమేష్ నాయుడు, MM కీరవాణి సంగీతంలో అలరించేది వీనులవిందు జేసేది.. సమ్మోహిత వేణు గానమే కదా! 


ముళ్ళపూడి గారి కథ “కానుక” అమితమైన ఇష్టం, నేను రాసుకున్న “రస స్పర్శ” మరీ ఇష్టం.  నాకొచ్చిన కలను..యధాతధంగా ఏకబిగిన రాసిన కథ అది. అబ్బాయి ఇంట్లో అట్లాంటా లో వున్నానప్పుడు. 


ఇదండీ… నా కృష్ణ ప్రేమ, మాధవ ప్రేమ, వనమాలి ప్రేమ. నాలో ఏదైనా చైతన్యం వుందంటే…అది..ఆ చైతన్య స్వరూపం మేల్కొలిపేదే అయి వుంటుంది. ఇది భ్రమ భ్రాంతి ఊహ.. ఏమీ కావు. చిత్ ఆనందం. నమో భగవతే వాసుదేవాయ 🙏కృష్ణ ప్రేమలో నేను అన్నీ అనుభవించేసాను. నాకేం కోరికలు లేవు. నా హృదయమంతా కృష్ణ ప్రేమే! ప్రేమే వెలుగు, ప్రేమే చైతన్యం. నేనుండే తావే.. బృందావనం. ❤️❤️❤️

ఈ మధ్య కిట్టయ్య కలలో కనబడకుండా శీతకన్ను వేసాడు. అందుకే ఈ పాటలు కవితలు. 

వనమాలీ… వనమాలీ.. ఈ అక్షరాల్లో కూడా నీ సుందర చైతన్య స్వరూపమే 🙏💐❤️🎈




ది తెలంగాణ ఫెడరల్ డాట్ కామ్ లో ఈ రోజు నా కవిత “మేల్కొలుపు” ప్రచురింపబడింది.

ఈ లింక్ లో చదవండీ.. మేల్కొలుపు

19, డిసెంబర్ 2025, శుక్రవారం

పలకరింపు

 


సంవత్సరంలో మూడొంతులు రోజులు “బ్రహ్మ ముహూర్తం” లోనే నిద్ర నుండి మేల్కొంటాను. పదిహేనేళ్ళగా ఇదే అలవాటైంది. మెలుకువ రాగానే రెండు మూడు నిమిషాలు కలలు ఏమైనా వచ్చాయా అని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాను. కలలు మన గడిచిన జీవితానికి గడవనున్న కాలానికి హెచ్చరికలు అని నమ్ముతాను. తర్వాత నిదానంగా ఎడమ పక్క దూరంగా వున్న మొబైల్ ని అందుకోవడానికి ఎడమ మోచేతిని తలగడపై ఆనించి సగం లేచి కుడిచేత్తో అందుకుంటూనే పవర్ బటన్ ఆన్ చేస్తాను. మొబైల్ నా కళ్ళ ఎదురుగా వచ్చేసరికి.. శ్రీగిరి దర్శనం అవుతుంది. తండ్రి మల్లన్న ధ్వజస్తంభం గోపుర కలశంపై త్రిశూలం చూస్తాను.ఎడమవైపు కాస్త వెనుకగా అమ్మ ఆలయశిఖరం పడమటి గోపురం కనబడతాయి. హృదయ నమస్కారం చేసుకుంటూ..” తండ్రీ మల్లన్నా !” అనుకుంటాను. నిద్ర లేచావా అమ్మా.. కళ్ళు తుడుచుకో అంటాడాయన. తండ్రి కదా, ప్రేమ యెక్కువ. 


తర్వాత హోమ్ బటన్ దగ్గర నుండి పైకి స్క్రోల్ చేస్తాను. నా పంచప్రాణాలు ఇద్దరిని మురిపెంగా చూసుకుంటాను. ఎక్కువ సేపు చూడను దిష్టి తగులుతుందని.మరుక్షణం మహాకాళ్ లైవ్ కి  వెళతాను. పంచామృతాలతో ఫల రసాలతో నారికేళ జలంతో పరిమళ ద్రవ్యాలతో  స్నానమాడుతున్న ఆయన తీరిక చేసుకుని నన్ను కళ్ళతో పలకరించి  వచ్చావా అమ్మా! కూర్చో అంటాడు.ఆయనకు నమస్కరించుకుని రద్దీగా వున్న స్వామి సన్నిధిలో ఓ మూలన నిలబడి  సంకల్పబలంతో ద్విజులు స్వామికి చేస్తున్న సేవలోకి నేనూ జొరబడతాను.  ఉజ్జయినికి వెళ్ళి  స్పెషల్ భస్మహారతి దర్శన టికెట్ కొనుక్కొని చూసిన వారి కన్నా యెక్కువగా భస్మహారతిని చూసుకుని రెండు మూడు క్లిక్ లో స్క్రీన్ షాట్లో తీసుకుని అందులో  సౌందర్యంగా వుండే చిత్రాన్ని క్రాప్ చేసుకుని వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకుంటాను. నేను నిద్ర లేచాను. దిగ్విజయంగా మరో రోజులోకి వచ్చేసాను అనే క్షేమ సమాచారం అందుతుంది అయిన వాళ్ళకి. అదే విషయాన్ని ఫ్యామిలీ గ్రూప్ లో మహాకాళేశ్వర్ చిత్రాన్ని పంపుతూ తెలియజేస్తాను.నేనెలా వుంటానో వుండాలనుకుంటానో అలాగే వుండే ఫ్రెండ్ కి మహాకాళుడి రక్ష వుండాలని..వారికి చిత్రం పంపుతాను. అక్కడితో ఆ పంచడం ఆగిపోతుంది. తర్వాత మెసెంజర్ లో స్టేటస్ గా పెట్టుకుంటాను. 

అప్పుడుగానీ మంచం దిగను. కాలకృత్యాలు తీర్చుకుని ఓ స్ట్రాంగ్ కాఫీ కప్ తో మళ్ళీ బెడ్ మీద కూర్చునే వరకూ… మా గోడలన్నీ మొక్కలన్నీ బద్దకంతో ఇంకా ముడుచుకుని వున్న పక్షులన్నీ నమక చమకాలను భక్తిగా వింటూ వుంటాయి నేను విన్నా వినకపోయినా. 


తర్వాత  నన్ను పలకరించడానికి తొలుత  SP బాలు గారు  వాణీజయరామ్ గారు జానకి గారూ అప్పుడప్పుడూ  సుశీల గారూ ఘంటసాల గారూ వస్తుంటారు. M M కీరవాణి గారు నన్ను పలకరించకపోతే నేనస్సలు ఒప్పుకోనని ముందుగానే క్యూలో నిలబడతారు. వీరందరూ నన్ను పలకరించి పులకరింపజేసాక.. కాస్త మనుషుల అలికిడి మొదలవుతుంది. నేను తూర్పు బాల్కనీ నీ  సౌత్ బాల్కనీ కి వచ్చి అరవిరిసే పువ్వులకు శుభోదయం చెబుతాను. మొక్కలకు Thanks చెబుతాను. కాస్త మోకాళ్ళ కిందకి వొంగి ముద్దు కూడా పెడతాను. అవి సంతోషం ప్రకటిస్తాయి. బహుశా కవిత్వం కూడా చెబుతాయి. పూలన్నింటినీ రకరకాల యాంగిల్స్ లో బంధించుకుని.. మీ  పరిమళాన్ని బట్వాడా చేయలేకపోయినా మీ సౌశీల్యాన్ని ముగ్ధత్వాన్ని మీ అందాన్ని కొందరికి చూపుతాను. బాగా నచ్చితే కొంత స్వార్ధంతో నా పేరు వేసుకుని మరీ పంచుతాను అని చెపుతుంటాను. 


ఇంకా రాడేమిటబ్బా ఈయన అనుకుంటూ విసుక్కుంటూ మధ్య మధ్య ఫేస్ బుక్, వాట్సాప్ చూసుకుంటూ మిత్రులకు గుడ్ మార్నింగ్ లు  చెప్పుకుంటూ కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకీ బాల్కనీల్లోకి తిరుగుతుంటాను.  Weather app ని కూడా check చేస్తాను కచ్చితమైన సమయం కోసం. నా నిరీక్షణ కి తెరదించుతూ… ఇదిగో వచ్చేసానులే.. రా! నాలుగు ఫోటోలు తీసుకో అని నులివెచ్చగా పలకరిస్తాడు ఆయన. ముఖం చాటంత చేసుకుంటాను. స్క్రీన్ పై మల్లన్న దర్శనం అయింది. లైవ్ లో మహాకాళుడి దర్శనం అయింది. నీ ప్రత్యక్ష దర్శనం కాకపోతే రోజు మొదలైనట్టే కాదు అంటాను కినుకగా. సరే తల్లీ… వెళ్ళు.. నీ ఫేస్ బుక్ పనులు చూసుకో, నా పని నేను చేసుకోవాలి అంటాడు ఆయన. 

ఎవరు పలకరించినా పలకరించకపోయినా… రోజూ నన్ను పలకరించే వారు వీరందరూ. వీరికి మనఃప్రణామములు. 🙏🙏🙏❤️


తర్వాత ఎవరెవరో పలకరిస్తారు అనుకోండి.  అపరిచితులు కూడా పలకరించడానికి ప్రయత్నిస్తారు. 😆😆వాళ్ళ తాతలు దిగొచ్చినా నేను అవకాశం ఇవ్వను.. 😂😂






15, డిసెంబర్ 2025, సోమవారం

కదంబ వనవాసిని

 నేను ప్రకృతి పువ్వుల చిత్రాలను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను కదా! ప్రకృతి ప్రేమికురాలిని. వీలైనంత వరకు పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటాను. పర్యావరణ స్పృహతో కొన్ని కథలు రాసాను. “నిర్మాల్యం” అనే కథ పై కొంత విమర్శ కూడా వచ్చింది. “బయలు నవ్వింది “ కథ నాకిష్టమైన కథ. పర్యావరణ కథలు ఇంకా కొన్ని కథలు వున్నాయి. ఈ రెండు కథల్లో ఒకటైనా పర్యావరణ కథల్లో చోటుచేసుకుంటాయా అంటే చెప్పలేం. కథాసంకలనాలు ప్రచురించే సంపాదకుల దృష్టి కి కొందరి కథలు అస్సలు కనబడవు. సాహిత్యం లో ఈ గ్రూపిజం వల్ల.. కొందరి కథలు క్రియాపూర్వకంగా భద్రంగా దాపెట్టబడతాయి. అందుకే .. నా ఈ కథలను ఫేస్ బుక్ పాఠకులకు పదే పదే పరిచయం చేస్తున్నాను. ఈ రెండు కథలు నా బ్లాగులో ఉన్నాయి. మీకు ఆసక్తి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో వున్న లింక్ ల ద్వారా వెళ్ళి కథలు చదవండి. కథలు మీకు నచ్చుతాయి అని ఆశిస్తూ.. మీ స్పందన కూడా తెలియజేయండి. ముందస్తు ధన్యవాదాలు. కథలు నచ్చకపోతే ఎందుకో అన్నది కూడా చెప్పేయండి.

బ్లాగ్  లో మీకెదురుగా ఎడమవైపు నా కథలు అనే 

చోట.. కథల లిస్టు ఉంది. “బయలు నవ్వింది” 

“నిర్మాల్యం” అనే చోట క్లిక్ చేసే కథ లోకి వెళ్ళి పోతారు. Happy Reading.. 

ఇక ఈ ఫోటో గురించి చెప్పాలంటే… ఇది ఒక అత్యుత్తమ చిత్రం. ఆ ఎండిన గోధుమరంగు పువ్వుల రజను.. ఏమిటనుకున్నారు!? కదంబపుష్పాల రజను అది. మా గృహ సముదాయం ముందు  తూర్పు వైపు కాంపౌండ్ వాల్ కి ఆనుకుని వరుసగా  కదంబ వృక్షాలు వేసారు. నేను వచ్చినప్పుడు అవి చిన్న మొక్కలు. ఐదేళ్లకు మూడు అంతస్తుల ఎత్తు పెరిగిపోయాయి. శ్రావణంలో పూలు పూయడం మొదలెట్టి దసరా వరకూ పూలు పూసేవి. ఆ చెట్ల మీద అనేక రకాల పక్షులు గూళ్ళు పెట్టుకుని వుండేవి. రోజులో 14 గంటలు సంగీత ఉత్సవమే మాకు. 

ఓ శ్రావణ మాసపు ఉదయం నేను పూజ కి పూల కోసం కిందకు వెళితే.. పరుపు పర్చినట్టు పువ్వుల రజను పడి వుంది. వెంటనే ఫోటోలు తీసుకున్నాను. అప్పుడు “ఈస్తటిక్ సెన్స్ “ కథా సంపుటి తెచ్చే ప్రయత్నంలో వున్నాను. ఒక ఆలోచన వచ్చింది తడవు వెంటనే పైకి వెళ్లి ముగ్గు పిండి తెచ్చి.. ఇలా రాసి ఫోటో తీసాను. కవర్ పేజ్ గా సెట్ అవుతుందని చూసాం కానీ .. అంత బాగోలేదా ఆ ప్రయత్నం. ఈ ఫోటో మాత్రం ఇలా మిగిలిపోయింది. 

కాంపౌండ్ వాల్ నెర్రెలు ఇచ్చాయని కదంబ వృక్షాలపై గబ్బిలాలు వేలాడుతున్నాయని ఆ చెట్లు ఆఫ్రికన్ తులిప్ చెట్లూ.. మొదళ్ళతో సహా తీయించారు. అప్పుడు నేను USA లో వున్నాను. మా ప్రక్కింటి శాంతి ఫోన్ చేసారు. చెట్లన్నీ తీసేయిస్తున్నారు అని. వీడియో కాల్ చేసి చూపించారు. కళ్ల వెంట నీళ్లు కారిపోయాయి. వద్దని చెప్పడానికి వీల్లేదు. అద్దెకి వున్నవాళ్ళ అభిప్రాయాలు ఎవరికి కావాలి !? అనుకున్నాను. మూడేళ్లు దాటింది కదంబ చెట్లు నరికించేసి. ఆ జ్ఞాపకం మాత్రం ఇలా మిగిలింది. కదంబవృక్షం అమ్మ వారి స్వరూపం అంటారు. ఆ సెంటిమెంట్ కాకపోయినా ఆ వృక్షాలు పక్షులకు నివాసంగా వున్నాయి. ప్రకృతి అనంతంగా శోభిల్లింది. .. ఆ కొరత తీరేది కాదు. ఆ చెట్ల స్థానంలో Lantana పొదలు పెరిగి వున్నాయి. ఆ చెట్ల వేర్లు మిగతా మొక్కలకు harmful అంట. Lantana పూలపై వాలే సీతాకోకచిలుకలు గోరింట చెట్టుపై సంచారం చేసే బుల్లి పిట్టలు ఇప్పుడు నా నేస్తాలు. నా పొద్దు అలా గడుస్తూ వుంటుంది వాటిని చూస్తూ… 

ఈ ఫోటో మాత్రం .. తీపి గుర్తు. ❤️❤️🎈రేపటి పూలన్నీ ఈ రోజు విత్తనాలలో దాగి వుంటాయి. నా ఆలోచనల విత్తనాలు ఈ కదంబ వృక్షాలను (మొక్కలను) తప్పకుండా నాటతాయి.. సొంత తావులో.   శ్రీగిరి భ్రమరాంబిక మల్లన్న  తల్చుకుంటే ఇట్టే అయిపోతుంది. విశ్వాసం వుంది కూడా!

వనజతాతినేని #vanajatatineni #greentales #వనజవనమాలి #పర్యావరణకథలు




13, డిసెంబర్ 2025, శనివారం

Core Philosophy

 Core philosophy -వనజ తాతినేని


ప్రతి రోజూ… జీవితాన్ని ఆస్వాదిస్తావ్

అసలెలా సాధ్యం నీకు!? 

అబ్బురంగా ఆమెనే చూస్తూ

అడిగాడతను. 


ఆమె చిరునవ్వుతో అతని కళ్ళల్లోకి 

చూస్తూ చెప్పింది.నువ్విప్పుడు నాలో నుండి 

నీ ప్రపంచాన్ని చూస్తున్నావు 

కాబట్టి అలా అనిపిస్తుంది. 


ఆమె మాటల్లో లోతు అతను గ్రహించకుండా 

నేనూ నీతో కలిసి నడుస్తాను అన్నాడు 

చిన్నపిల్లాడిలా మారాం చేస్తూ.. 


ఆమె విడమర్చి చెప్పింది. ఇప్పుడు అద్భుతంగా 

అనిపించినన్నీ త్వరలోనే అతి సాధారణం 

అయిపోతాయి నీకు. అప్పుడు 

నేనంటే నీకు తప్పక విసుగు వస్తుంది.


ఏం కాదు, నువ్వేదో మాయచేస్తున్నావు.

నిన్ను విడిచి నేను వెళ్ళలేను.వెళ్ళి వుండలేను

రా.. పోదాం. బతిమిలాడాడు. 


ఆమె సున్నితంగా తిరస్కరిస్తూ.. అంది.

ఎదుటివారి కళ్లలో నుంచి చూస్తూ నీ జీవితాన్ని 

ఊహించకు. నీ దృష్టికోణంలో నుంచి నిశితంగా చూడు. 

జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది.


అతను బేలగా చూసాడు.

ఆనకట్ట తెగినట్టు చెంపలపై కన్నీరు ఉరికింది.

ఆమె అతని కలల రంగులన్నీ మూటగట్టుకుని

సూర్యునిలా కనుమరుగైంది. 


చుట్టూ పెను చీకటి. 

తూర్పు ఆకసంలో ఉదయించిన చంద్రుడు.. 

చెరువులో నెమ్మదిగా రేకులు విప్పుతున్న కలువ. 

అతని గళంలో ఆవేదన విచ్చుకుంది. 

దూరాన దూరాన తారాదీపం.


©️Vanaja Tatineni


 






#వనజతాతినేని

#vanajatatineni

#hilights

#follower

12, డిసెంబర్ 2025, శుక్రవారం

సీతాకోకచిలుకలు పూచే కాలం

 సీతాకోకచిలుకలు పూచే కాలం  - వనజ తాతినేని 

ఉదయం నీరెండ ఏటవాలుగా ఆకుపచ్చని తోటపై వాలి

నారింజ కలగలిసిన పసుపు రంగు రశ్మి అయింది.

సీతాకోకచిలుకలు ఎగిరే కాలం కోసం నా ఎదురుచూపు

గ్రహణం నను పూర్తిగా మింగేసిన సమయంలో నుండి 

వెలుగులోకి మునిగి తేలియాడుతూన్న కాలం అది.


ఈ వేళ  నా బాల్కనీ తోటంతా కలిపి ఒక పువ్వే పూసింది 

హఠాత్తుగా నాలుగు రెక్కల పువ్వులు నాలుగైదు 

గాలికి ఊగుతున్నట్టున్నాయనిపించింది 

కళ్ళు నులుముకుని చూస్తాన్నేను.

అవి పూల రెక్కల సీతాకోకచిలుకలు

నా హృదయం కూడా రెక్కలు తొడిగింది.


ఆకురాలు కాలంలో వృక్షాలు నీటి అద్దంలో

తమ రంగులను తామే చూసుకుని విభ్రాంతి చెందినట్టు 

పూలపై వాలిన సీతాకోకచిలుకుల అందానికి మూర్చిల్లుతాను.

నిద్రమత్తు వదిలించుకుని పూల అందాలను వీక్షిస్తూ

తమను తాము వెచ్చ బరుచుకుంటూ  జంటగా ఒంటరిగా

నిదానంగా కదులుతుంటాయి సీతాకోకచిలుకలు. వాటి వెనుకే నేనూ.


గృహిణులు పగటి పనంతా ముగించుకుని అలసి 

ఏ పుస్తకం పైనో మొబైల్ స్క్రీన్ పైనో వాలే సమయంలో

నేను వాలిపోబోతాను ఎక్కడో..

సీతాకోకచిలుకలు సంచరించే తావుల కోసం

జల్లెడ పడతాను, మనః ఫలకంపై ముద్రిస్తాను. 


రోజ్మేరీ పూలపై వాలే తెల్ల జంట సీతాకోక చిలుకలు, 

జినియా పూలు బంతిపూలపై వాలే మోనార్క్ సీతాకోకచిలుకలు

లాంటానా గుత్తులుపై వాలే నల్ల సీతాకోకచిలుకలు 

నిశ్శబ్దంగా మకరందాన్ని ఆస్వాదిస్తూ.


గ్లాస్ సీతాకోకచిలుకలు పసుపుపచ్చని సీతాకోకచిలుకలు 

తుమ్మెద రెక్కల సీతాకోకచిలుకలు రెక్కలపై కళ్ళు పెట్టుకున్న

రష్యన్ సీతాకోకచిలుకలు నల్లంచు ఎరుపు చుక్కలున్న తెల్ల 

సీతాకోకచిలుకలు ఏదో రహస్యాక్షరాలను ముద్రించుకుని వస్తాయి. 

సౌందర్య ఆరాధకులకు మాత్రమే అర్థమయ్యే భాష అది. 


ఆ రెక్కలపై చుక్కల ప్రేమ లేఖలు రాసుకుని వచ్చాయో

తమ జీవిత కథను రాసుకుని వచ్చాయో కానీ

వాటి అందానికి దాసోహం అవుతాను.

ఆశగా అన్నింటినీ జవురుకోవాలనుకుంటాను

లిప్తపాటు కాలంలో సత్త్వహీనమై  మోకరిల్లుతాను


పూల బుుతువుతో జీవిత చక్రం ముగిసిపోయే

వీటికి దీర్ఘకాలం ఎగిరే శక్తిని ఎవరిచ్చారు!?

ఇంతటి అందాన్ని కూడా దారాదత్తంగా మధువే 

సమకూర్చి వుంటుంది. విధాత కూడా ఈర్ష్య చెంది 

వాటి జీవితకాలాన్ని నిర్దాక్షిణ్యంగా కుదించేసాడేమో. 


వాటిని  ప్రేమించాల్సిన అవసరం లేదు

కానీ అమితంగా  ప్రేమించాను పనీపాట ఎగ్గొట్టి మరీ. 

నిత్యం  వెతుక్కుంటూ వెళ్ళి…

ఇలాగే ప్రేమిస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది.


ఓ సీతాకోకచిలుకా! 

నా ఆత్మను తాకింది నీ స్వేచ్ఛా ప్రియత్వం

కుసుమ సదృశ హృదయం నాది 

ఏ తుమ్మెద అంటని అడవి మల్లెపూవు సొగసు నాది

ఒక్కసారి వచ్చి ముద్దాడిపో!

మరుజన్మకు నీవెక్కడో నేనెక్కడో!

నీ స్వేచ్ఛా ప్రియత్వాన్ని పుప్పొడిలా అద్దుకుని తరించిపోతాను. 


09/11/2025 


(ది ఫెడరల్ తెలంగాణ డాట్ కామ్ లో ప్రచురితం)