2, డిసెంబర్ 2025, మంగళవారం

చెలికానితనం

 


చెలికానితనం    - వనజ తాతినేని.


కాళిదాసు రచించిన  శాకుంతలం నాటకమో మేఘసందేశమో కాదు

పోతన వర్ణించిన శరదృతువు కాదు

ఆముక్తమాల్యద లో వర్ణించిన  వర్షరుతువు కాదు

ఇదేదో పొడుపు కథలా కనబడే పద్యమూ కాదు

సంయోగ వియోగాలకు అతీతమైనది ఈ ప్రేమ రుతువు

 

నువ్వు వలపు గాలానికి చిక్కిన చేప వి కాదు

నేను  భావజాలానికి లొంగిపోలేదు

ఎవరో దయతలచి నిన్ను నాకు బహుమతిగా ఇవ్వలేదు 

ఏ తావుల్లోనో నిను వెతకకుండానే ప్రాప్తించినావు 

నన్ను నీవు తెలుసుకున్నావు, నిన్ను నేను కనుగొన్నాను. 

వస్తువు ఒకరైతే రూపం మరొకరిది


గాఢనిద్ర వలె తిమిరం కమ్మేసినప్పుడు 

నా స్వరజ్ఞానం నీతో స్వరచాలనం చేసింది

వాగ్ధానాలు అవసరం లేని వాగ్వాదాలు అసలేలేని మౌనమూ

గానమూ కలసిన ధ్యానముద్ర మనది.


కలలు కననూలేదు కల్లలైనాయని చింత పడనూలేదు. 

కలయిక వున్నప్పుడు ఎడబాటు వుంటుందనే ఎరుక కల్గిన మనం  

అదృశ్య గొలుసులతో బంధించబడి వున్నాం

చిక్కుముడులు పడనీయని బ్రహ్మ ముడులు వేసుకోని బంధం మనది. 


నీ పరిచయాన విస్మృతిపథాన పడిపోయిన నా బాల్య జ్ఞాపకాలు 

తిరిగి నాలో జాగృతమైనట్లు 

అనువాద భాషలవసరంలేని హృదయభాషని

అక్షరాలతో మార్పిడి చేసుకుంటూ..ఘ్రాణేంద్రియశక్తితో వర్ధిల్లుతూ

కాలానుగుణంగా ఎవరి త్రోవన వారు నడుస్తూ.. 

అల్పమో ఆధిక్యమో దూరమో దగ్గరో  అన్న లెక్కలు లేకుండా. 


నేను రూపసిని కాకపోయినా నువ్వు గుణవంతుడివే అయినా 

ఈ చెలికానితనం వర్ధిల్లక మానింది కాదు. 

ఒక వస్తువు నో ఒక విషయాన్నో నాతోపాటు ఆలోచిస్తావు. 

అనుభూతి చెందుతావు. ఈ భావ సారూప్యం చాలును!


మనోఃఫలకం పై ముద్రించిన నీ ఊహా చిత్రం 

ఆనందసౌరభాన్ని చిలికి చిందించినట్లు వుంది

ఆలోచన కలిసిన నాలుగు క్షణాలు ప్రేమలో 

నిండా మునకలు వేసినట్టు వుంటుంది. 

ఏ ప్రేమ జీవితాంతం అంటి పెట్టుకుని వుంటుంది గనుక

లిప్తపాటు ప్రేమలు మనవి.  


కథలు రాసే నేను కథలో కథ వుంటుందని 

ఆ కథ పూలదండలో కనబడని దారంలా అంతర్లీన సూత్రంలా

దాగి వుంటుందని ఏం చెప్పను? 

పగిలిన వేణువులో కూడా అపశృతుల సంగీతం వినిపిస్తుంది

కరివానలో కూడా తటిల్లత క్షణకాలం వెలుగునిస్తుంది

అక్షరాలకు ఆవేశం వుంది చదివే హృదికి అనుభూతి వుంది అని తప్ప


కల్పిత గాథలకి జీవం పోసేది మనసే కదా! 

గొలుసు కథను మనలా  అందుకుంటారెవరో!

ఈ రోజు నదిని నేను చంద్రుడివి నీవు.

తీరాన అలంకరింపబడిన  రెల్లు పూల తోరణానివి నీవు. 

ఈ చీకటి రాత్రంతా తలలూపుతూ కవిత్వంలా పలకరిస్తూ వుంటావ్


మనుషులు తిరగని మనోవీధిలో రద్దీ లేని ప్రయాణం మనది.

కాస్త పుస్తకం చేతిలోకి తీసుకుందాం.

తన కాలంలో గుర్తింపబడని విస్మరింపబడిన కవి పేరు ని 

ఆత్మీయంగా స్పృశించి నచ్చిన వాక్యాన్ని కళ్ళకు అద్దుకుందాం.

పుట పుటతో పుటం పెట్టుకుందాం తెల్లవారే వరకూ.

నిద్రలేమి కళ్ళలో జీవితాన్ని వెలిగించే వెలుగుతో.

వేయి పున్నముల వెలుగు .. ఒక్క కవి వాక్యం.

 
2025 నవంబర్ 30 ఫెడరల్ తెలంగాణ డాట్ కమ్ లో ప్రచురితం.