5, సెప్టెంబర్ 2012, బుధవారం

హితవాక్కులు నచ్చేనా!?

గురుభ్యోం నమః

గురు పూజోత్సవం .. రోజు మనకి పాఠాల తో బాటు ఎన్నో మంచి విషయాలు నేర్పి మంచి దిశా నిర్దేశం చేసిన  గురువు గారిని వీలయితే కలసి వారికి ధన్యవాదములు తెలిపి  ఆ రోజు కూడా వారు  చెప్పిన మంచి  మాటలు వినాలని  పాటించాలని అందరు అనుకుంటారు.

గురువులు చెప్పిన మాట జవదాటని వాళ్ళు ఉంటారు లక్ష్య పెట్టని వారు ఉంటారు. మధ్యే  మార్గంగా విని ఊరుకునే వారు ఉంటారు.

ఒక శిష్యురాలు ఈ రోజు తన గురువు గారిని భక్తిపూర్వకంగా కలసింది. క్షేమ సమాచారాలు అయిన తర్వాత తన కూతురు చదువు సంగతి చెప్పి .. ఆమెకి తగిన వరుడు ఎవరైనా ఉంటె సూచించమని అడిగింది.

ఆమె కూతురు మెడిసన్    పూర్తి చేసుకుని ఎం .ఎస్  చదవడానికి రెడీగా ఉంది. తల్లిదండ్రులు వరుని వేటలో ఉన్నారు.

తల్లి చెప్పిన మాటలు విని ఆమె గురువుగారు ఒక అతని వివరాలు చెప్పారు. అతను తన ఎం ,డి విద్య పూర్తి చేసుకుని ఒక కార్పోరేట్ హాస్పిటల్లో పని చేస్తున్నాడు. అతనికి బంజారా హిల్స్ కొంత స్థలం ఉంది ఆ స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించి ఇవ్వగల్గిన   స్థితిమంతుల ఇంటి బిడ్డని వివాహమాడాలని అతని కోరిక. అలా ఇవ్వగల్గితే .. ఆ సంబంధం విషయం చూద్దాం అని చెప్పాడు.

అమ్మో! అంత కట్నం ఇవ్వడం మా వల్ల  కాదు. అయినా మా అమ్మాయి మెడిసన్  చదివింది ఎం .ఎస్ చేయబోతుంది. వృ త్తి రీత్యా  ఇద్దరు ఒకటే అయితే అండర్ సస్టాండింగ్ ఉంటుందని ఆశపడుతున్నాం. ఇవేక్కడ గొంతెమ్మ  కోర్కేలో..!!?

అబ్బాయి మెడిసన్ చదివాడు. ఎం .ఎస్  మీరు చేయించుకోండి అని అడిగే వారు కొందరు.క్లినిక్ పెట్టించి ఇమ్మని కొందరు.

అమ్మాయి చదువుకుంటే చాలు అంటారు.. మళ్ళీ వెనుక ఈ చిట్టాలు అన్నీ ఏకరువు పెడతారు.మేము ఏబై లక్షలు ఖర్చుపెట్టి చదువు చెప్పించాము.పెళ్లి చేయడానికి అయ్యే ఖర్చులు ఎం ఎస్ చేయించడానికి అయ్యే ఖర్చు భరించగల్గడం ఎంత కష్టం .. అంటూ ఆమె మనసు లో మాటలు వెల్లడించింది.

ఒక ఆలోచన చెబుతాను.. నువ్వు ఏమి అనుకోనంటే ..అని గురువు గారు తన కున్న చనువుతో  అన్నారు.

"చెప్పండి సర్" అని అంది ఆమె.

మీ అమ్మాయి ఇప్పుడు జూనియర్ డాక్టర్ గా చేసింది కదా! ఆమెతో  కలసి  పని చేసిన తోటి జూనియర్ డాక్టర్ లలో
ఒకరిని ఎన్నుకుని  అతనికి ఇచ్చి పెళ్లి చేసేయండి. ఇద్దరు కలసి కష్టపడి ఉన్నత చదువులు చదువుకుంటారు. లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ..గ్రామీణ ప్రాంతాలలో వారి సేవలు అందిస్తారు అని చెప్పారు.

ఆ మాటలకి ఆమె అయిష్టంగా ముఖం పెట్టింది. పల్లెటూర్లలో సాదాసీదాగా ఏ ఇరవై వేల  పై చిలుకు కోసం ఉద్యోగం చేయడం  కోసమా..ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చదువు చెప్పించింది.తన కూతురు మంచి హాస్పిటల్ పెట్టుకోవాలని లక్షలు లక్షలు సంపాదిస్తూ.. అందరిలో గొప్పగా, గౌరవంగా ఉండాలనుకుంటే.. గురువు గారు ఏమిటి ఇలా చెపుతున్నారు అనుకుంది.

ఆమె ఆలోచనలు గమనించి ..గురువు గారు ఇలా చెప్పారు.

వైద్య వృత్తి  దైవంతో సమానం .. ఇప్పుడంతా వ్యాపారమయం అయిపొయింది. కొంత మంది అయినా సేవాభావంతో.. పేద ప్రజలకి అందుబాటులో లేకుంటే .. సంపాదించిన జ్ఞానానికి, మంచికి,మానవత్వానికి విలువ ఎక్కడ? పైసా మే   పరమాత్మగా బ్రతకడం లో ఆనందం లభిస్తుందా!? చెప్పమ్మా..  అన్నారు.

మీరు చెప్పిన విషయం ఆలోచిస్తాం అంటూ ఆమె సెలవు తీసుకుంది.

పిల్లల ఆలోచనలు గమనించి పెద్దలు కాస్త మంచి మాటలు చెప్పడం మాట అటుంచి.. తల్లిదండ్రులే విపరీతమైన ఆశలు పెట్టుకుంటే .. ఏం చేయగలం.? అనుకున్నారు గురువు గారు

సంపాదన కోసం కాకుంటే,సౌకర్యవంతంగా బ్రతకాలనే ఆశలతో కాకుంటే.. చదివిన చదువుతో.. సమాజానికి హితం కూడా కలగాలని ఎవరు ఆశిస్తున్నారు .. ? మీ పిచ్చి కాకపొతే.. మీ ఆలోచన ఎవరికైనా నచ్చుతుందా?  మీ శిష్యులే కదా అని ఇలా ఉచిత  సలహాలు ఇవ్వకండి  అంటూ  లోకంపోకడ బాగా తెలిసిన గురువుగారి భార్య సున్నితంగా చెప్పింది.

ఇదంతా విన్న నేను అనుకున్నాను. పిల్లలని(నేను నాతొ పాటు మరికొందరు ) మనం ఎందుకు ఇలా తయారయ్యేటట్లు పెంచుతున్నాం? అది సరి అయిన పెంపకమేనా.. అని.

గురువులని పూజించడమే కాదు గురువులు  చెప్పిన మంచి  మాటల గురించి ఆలోచించాలి. 
అప్పుడే ఈ గురుపూజోత్సవంకి అర్ధం అనిపించింది.

  

3, సెప్టెంబర్ 2012, సోమవారం

"విహంగ" లో నా కథ

వివాహానికి మత మార్పిడి అవసరమా!?...
"మా మేడం ఒకరు ఉన్నారు ఆవిడ పి.హెచ్ డి.చేసారు. ఒక ముస్లిం ని వివాహం చేసుకున్నారట. వివాహం అప్పుడు ఆమె అతని మతం లోకి మారి ముస్లింగా పేరు మార్చుకుంటేనే.. ఆ పెళ్లి జరిగింది అంట. అసలు ఆవిడకి ఓ..స్వంత ఆలోచన అయినా ఉందా? .వివాహానికి మతం కి ఏమిటీ సంబంధం అని ఆలోచించలేదా?
అలాగే.. మా సర్..ఒకరు. ఆయన కెమిస్ట్రీ అద్భుతంగా బోధిస్తారు. ఆయన వివాహం అయ్యాక వేరొక స్త్రీ తో ప్రేమలో పడ్డారట. ఆమెని చట్టబద్దంగా పెళ్లి చేసుకోవడానికి గాను ఆయన ముస్లిం గా మారి .ద్వితీయ వివాహం చేసుకున్నారు అని చెబుతారు. మతాలూ మార్చుకుని ఒకరిని మోసం చేసి చేసుకునే వివాహాల విలువ ఏమిటి? ఎందుకు వీళ్ళంతా ఇలా ప్రవర్తిస్తారు. వీళ్ళా మాకు గురువు లు అంది. ఆవేశంగా.

చాలా మంది విద్యాధికులు కూడా ప్రేమ వివాహాలు చేసుకున్నప్పుడు మతం ఒక సమ్యగా ఉంటుంది. అదే పురుషుడు అయితే మతం మార్చుకోవాల్సిన పని లేదు. స్త్రీ అయితే తప్పని సరిగా పురుషుడి మతం లోకి మారిపోతుంది.ఆ మారడం ఇష్టా పూర్వకం కావచ్చు,బలవంతం కావచ్చు. అయితే..మతం మారిన తర్వాత కూడా వారిలో ఉన్న ఆచార వ్యవహారాలూ,రక్తం లో జీర్ణించుకు పోయిన కొన్ని భావాలు రూపు మాసి పోతాయని అనుకోవడం పొరబాటే! వాళ్ళల్లో పుట్టుకతో వచ్చిన మతం ఆచారవ్యవహారాలు,ఆహారపు అలవాట్లు అలాగే ఉంటాయి. మతం మారామని మోసం చేసుకోవడం తప్ప అక్కడ ఏమి ఉండదు."అంది సుజాత.

అసలు ఒక స్త్రీ-ఒక పురుషుడు కలసి బ్రతకడానికి ఏ ఒక్క మతమో..ఎందుకు అవసరం? ఎవరి మతాన్ని వారు ఆచరించుకుంటూ ..ఎదుటి వారి మతాన్ని గౌరవిస్తూ..పరస్పర అభిప్రాయాలని గౌరవించుకుంటూ. ఉండటంలో ఉన్న విశాల దృక్పధం ఎందుకు అలవరచుకోరు? కనీసం మతం మారడం అనవసరం అన్న జ్ఞానం కలుగదు..?

ఈ మతం రంగులు,ఊసరవెల్లి తనాలు ఏమిటో..నాకు అర్ధం కాదు ..ఐ హేట్ ట్ థిస్ అంది.

వివాహ జీవితం కూడా ఆవకాయ పచ్చడి లాంటిదే. అన్నీ సరిగ్గా కుదిరితేనే.. మంచి రుచికరం గా ఉంటుంది ఏది తక్కువైనా..అది చూడాటానికి,తినడానికి కూడా బాగోదు. అని .విజయ జీవితం కూడా అన్నీ సమంగా పడని ఆవకాయ పచ్చడి లాంటిదే అని .

ఈ సంభాషణలు .. ఏమిటో.. ఈ కథలో చదవండి. ఆలోచించండి.

ఈ క్రింది లింక్ లో ...
నా జీవితం నా చేతుల్లో ..

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

ఆంధీ

పాట చంపేస్తుంది ... అంటారు కదా! అలాంటి పాట ఈ పాట.

ఈ పాట "ఆంధీ " చిత్రంలో పాట. 1975 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ చిత్రం నిషేధించ బడినట్లు విన్నాను.

ఈ చిత్రం శ్రీమతి ఇందిరా గాంధీ జీవిత కథని పోలి ఉంటుందని చెపుతూ ఉంటారు. నేను చిత్రం చూడలేదు కానీ "తేరే బినా జిందగీ సే కోయి " అనే పాట సురపరిచితం.

వివిధ భారతి ముంబై పుణ్యమా అని ఎప్పుడూ  వినడం అలవాటయింది.నాకు హిందీ భాష  రానప్పుడు కూడా ఎందుకో.. ఈ పాటని బాగా ఇష్ట పడేదాన్ని. ఆ పాటని పరిచయం చేయాలని అనుకుంటూ ఉండేదాన్ని,
ఇన్నాళ్ళకి ఇలా కుదిరింది.

ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట.సంజీవ్ కుమార్,సుచిత్ర సేన్..నటించిన ఈ చిత్రం సంచలనాత్మక చిత్రం అని మిత్రులొకరు చెపితే విన్నాను.

పాట సాహిత్యం"గుల్జార్"
సంగీతం " ఆర్ డీ బర్మన్"


పాట సాహిత్యం తెలుగులో...
ఆమె:
నీవు తోడు లేని జీవితానికి ఎటువంటి ఆరోపణ లేదు
ఆరోపణ లేదు ఆరోపణ లేదు ఆరోపణ లేదు
నీవు లేకుండా జీవితం ఉంది కానీ,అది జీవితమే కాదు.
అది జీవితమే కాదు. అది జీవితమే కాదు. అది జీవితమే కాదు.

ఇలా జరిగి ఉంటే బాగుండేది
నీ అడుగుజాడలనే గమ్యంగా ఎంచుకుని (ప్రయాణం చేస్తూ ) పయనిస్తూ ఎక్కడికో
దూరంగా ఎక్కడికో ..
నీ అడుగుజాడలనే గమ్యంగా ఎంచుకుని (ప్రయాణం చేస్తూ ) పయనిస్తూ ఎక్కడికో
దూరంగా ఎక్కడికో ..
నువ్వు తోడు ఉన్నట్లు అయితే గమ్యానికి ఏ లోటు ఉండేది కాదు
నీవు తోడు లేని జీవితానికి ఎటువంటి ఆరోపణ లేదు
ఆరోపణ లేదు ఆరోపణ లేదు ఆరోపణ లేదు
ఇరువురి మధ్యలో కొంత సంభాషణ :
సంజీవ్ కుమార్ ఇలా అంటాడు..
విను ఆరతి..ఈ పూల లతలు కనిపిస్తున్నాయే అవి నిజానికి లతలు కావు.
అరబీలో లిఖించ బడినటువంటి ఆయతులు
వీటిని ఉదయంపూటనే చూడాలి. అప్పుడే స్పష్టంగా చూడగలం.
మరొక వైపుకు చూపిస్తూ ..
ఉదయం పూట ఇక్కడ నీటితో నింపబడి ఉంటుంది. ఉదయం పూట ఈ నీటి గుమ్మటాలు .. అని ఏదో చెప్ప బోతుండగా..
ఆమె ఇలా అడ్డుకుంటుంది..
ఇవ్వన్నీ ఎందుకు చెపుతావ్? ఉదయం వేళలో నేనెక్కడ రాగలను..?
ఆమె అంతరంగం అర్ధం చేసుకున్న అతను.. మాట మారుస్తూ..
ఈ చంద్రుడు ఉన్నాడే ! దీనిని రాత్రే చూడాలి. ఉదయం పూట రాడు అంటాడు.
ఆమె: ఈ చందమామ రోజు వస్తూ ఉంటుంది అనుకుంటా..అంటుంది
అతడు: హా..కానీ మధ్యలో అమావాస్య వస్తుంది. మాములుగా అమావాస్య పదిహేను రోజులకి ఒకసారి వస్తుంది
ఈ సారి మాత్రం చాలా కాలం ఉండిపోయింది (దీర్ఘంగా)
ఆమె:తొమ్మిది సంవత్సరాలు సుదీర్ఘంగా (అమావాస్య) ఉంది కదా!

మళ్ళీ పాటలోకి...ప్రవేశం..

ఆమె:
మనసులో అనిపిస్తుంది నీ బాహుబందాలలో తలవాల్చి (మేము)నేను ఏడుస్తూ ఉండిపోవాలని..
ఏడుస్తూ ఉండిపోవాలని...
నీ కళ్ళలో మాత్రం కన్నీటి ఛాయలే లేవు!

అతడు:
నీవు తోడు లేని జీవితానికి ఎటువంటి ఆరోపణ లేదు
ఆరోపణ లేదు ఆరోపణ లేదు ఆరోపణ లేదు
నీవు లేకుండా జీవితం ఉంది కానీ,అది జీవితమే కాదు.
అది జీవితమే కాదు. అది జీవితమే కాదు. అది జీవితమే కాదు.

నీవు కనుక చెప్పినట్లయితే .. ఈనాటి రాత్రి చంద్రుడు వెళ్లి పోడు ,
రాత్రిని ఆపు,
నీవు కనుక చెప్పినట్లయితే ఈనాటి రాత్రి చంద్రుడు వెళ్లి పోడు ,
రాత్రిని ఆపు,
రాత్రి మాట ఇది (రాత్రికి సంబంధించిన విషయం ఇది)
మిగిలిన జీవితానిది కాదు.

నీవు తోడు లేని జీవితానికి ఎటువంటి ఆరోపణ లేదు
ఆరోపణ లేదు ఆరోపణ లేదు ఆరోపణ లేదు
నీవు లేకుండా జీవితం ఉంది కానీ,అది జీవితమే కాదు.
అది జీవితమే కాదు. అది జీవితమే కాదు. అది జీవితమే కాదు.
నీవు తోడు లేని జీవితానికి ఎటువంటి ఆరోపణ లేదు