17, జూన్ 2012, ఆదివారం

నీ - నా అనే భావం

మనుషుల్లో నీ నా అనే భావం మనం ఎంత వద్దనుకున్నా.. పారద్రోలాలనుకున్నా పోయేది కాదు.

మనిషి కి మనిషికి మధ్య "స్వచ్చమైన ప్రేమని వెదకడం అంటే ఎండమావుల నీళ్ళు త్రాగి దాహం తీర్చుకోవడం లాంటిది"

"స్వచ్చమైన స్నేహం దొరకడం అంటే మన అంతరంగాన్ని వేరోకరిలో చూడగలగడం వంటిది"
రెండు సాధ్యం అవుతాయో లేదో.. నేను ప్రయత్నం కూడా చేయలేదు.

అందుకు ఏమంటాను అంటే.. ఈ స్వచ్చమైన స్నేహం,స్వచ్చమైన ప్రేమ రెండు ఇవ్వగలగడం నాకు సాధ్యం కాకపోవచ్చును కదా!

కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ జీవిత భాగస్వామ్యం చేసుకోవాల్సిన వ్యక్తితో బంధం ముడి పడేటప్పుడు ఆ వ్యక్తీ గురుంచే కాకుండా ఆ వ్యక్తి సమీప బంధువులని మన వారిగా భావించడం కూడా అవసరం ..అత్యవసరం కూడా.

ఈ మధ్య నేను విన్న విషయం ఒకటి చెప్పదలచాను.

ఒక మధ్య తరగతి కుటుంబంలోని యువతికి తగిన వరుడిని వెదకడం మొదలుపెట్టారు. కానీ ఆ అమ్మాయికి వచ్చిన సంబంధాలలో ఏ ఒక్కటి మ్యాచ్ అవడం లేదు.

అమ్మాయి చదువుకుంది.ఉద్యోగం చేస్తుంది. ఆమెకి తల్లిదండ్రులు,ఒక తమ్ముడు ఉన్నారు. పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయికి,అబ్బాయి తల్లిదండ్రులకి ఆ అమ్మాయి ఒక షరతు గురించి చెపుతుంది.

పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. వద్దనడానికి వీలు లేదు.ఉద్యోగం చేసినా ఆ డబ్బు భర్తకి ఇవ్వడం గాని భర్త కుటుంబంలోని వ్యక్తుల అవసరాలకి వాడటం కాని చేయకూడదు. ఆ అమ్మాయి జీతం అంతా ఆ అమ్మాయి తల్లిదండ్రులకి మాత్రమే ఇచ్చేటట్లు ఒప్పుకుంటే ..పెళ్ళికి ఒప్పుకుంటాను అని లేక పొతే లేదు అని.చెపుతుంది. పెళ్ళికి ముందే ఇన్ని షరతులు పెట్టె అమ్మాయి భర్త తల్లిదండ్రులు గురించి కూడా నాకు ఏ భాద్యత లేదని అంటే.. అతని పరిస్థితి ఏమిటి? అని అందరికి వస్తున్న సందేహం.

అందువల్ల ఆ అమ్మాయికి వివాహం జరగడం లేదు.

వివాహ విషయాలు మాట్లాడుకునేటప్పుడు ముందు జాగ్రత్తగా కొన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకోవడం అవసరమే అయినప్పటికీ ఆ అమ్మాయి ఆలోచన ఏమిటో నాకైతే బోధపడలేదు. ఒకవేళ వివాహం తర్వాత భర్త ఆమె సంపాదనని పుట్టింటి వారికి ఇవ్వనివ్వడని భయం కావచ్చు తల్లిదండ్రులని ఆర్ధికంగా ఆదుకోవాలనే తాపత్రయం కావచ్చు. ఆ అమ్మాయి విధించే షరతు లో ముందు జాగ్రత్త ఉంది కానీ ఇలా మాట్లాడటం ని జీర్ణించుకునే అంతగా మన సమాజం మారలేదు.

అలాగే అబ్బాయికి కూడా తల్లిదండ్రి బాధ్యతలు ఉంటాయి కదా!అతను అవన్నీ చూసుకోవాలి కదా! అని మధ్యవర్తిత్వం జరిపే వాళ్ళు ఆమెని అడిగినప్పుడు అవన్నీ నాకు తెలియవు అతని తల్లిదండ్రులని చూసుకుంటాడో లేదో అది అతని ఇష్టం అని జవాబు ఇచ్చింది అట.అంటే భర్త తో పాటు అతని తల్లిదండ్రుల పట్ల ఆ అమ్మాయికి భాద్యత ఉన్నట్లా లేనట్లా? నా భర్త నావాళ్ళు అని కూడా ఆ అమ్మాయికి ఉండాలి కదా ! అమ్మాయిల ఆలోచనలు ఇలా ఉండటం సమంజసంగా లేదని మాత్రం అనుకోగలం.

మన తెలుగు సినిమాలలో.. కుటుంబ భాద్త్యత కోసం వివాహ జీవితాలని త్యాగం చేసిన నాయిక పాత్రలు గుర్తుకు వచ్చ్చాయి. "అంతులేని కథ" లో "సరిత", "సంధ్య" చిత్రం లో" సంధ్య" పాత్ర అప్రయత్నం గా గుర్తుకు వచ్చాయి. త్యాగం చేయడం ఆడవాళ్ళ ఒక్కరి హక్కే కాదు. భాద్యతల కోసం,బంధాల కోసం జేవితాలని కరిగించిన పురుషులు ఉన్నారు.

పెళ్ళికి ముందు కొన్ని మాటలు అనుకోవడం లో అభ్యంతరం ఏమి ఉండదు కానీ ..తప్పని సరి షరతులు పెట్టుకుని.. ఆ ఒడంబడిక పై జీవితం పంచుకుని నడక సాగించడం మాత్రం కష్టమైన పనే!

నాకు తెలిసి చాలా మంది కాకపోయినా.. కొంత మంది అయినా భార్య తల్లిదండ్రులకి సహాయం చేసే వారిని చూస్తుంటాం.అయినా ఈ కాలం లో కన్న తల్లిదండ్రులే పరాయి వాళ్ళు అయిపోయి,అత్తింటి బంధువులే నట్టింట్లో తిష్ట వేసుకున్న సన్నివేశాలు నిత్య కృత్యం అయిపోతుంటే.. ఆ అమ్మాయి ఎందుకు తొందరపడి షరతులు పెట్టి వచ్చిన సంబందాలన్నిటిని చెడగొట్టు కుంటుంది అని వ్యాఖ్యానించాను నేను.

ఏం చేస్తాం ఆడపిల్లల కాలం ఇది.చదువు,ఉద్యోగం..చేతిలో ఆయుధాలు అయిపోయాయి మరి. అన్నారు.ఇంకొక ఆవిడ.

భార్య భర్త ల మధ్య నీ-నా అంతరాలు ఉంటే ఆ కాపురాలు ఎలా సవ్యంగా సాగ గలవు?

నేను చదివిన ..ఓ..పర్షియన్ కథ గుర్తుకు వచ్చింది.
ఇద్దరు ప్రేమికులు ఉంటారు. ప్రేమికుడు.. అర్ధరాత్రి వచ్చి తలుపు తడతాడు. ఆమె లోపలి నుండి.. ఎవరు నువ్వు అని అడుగుతుంది. అతను " నేనే".. అని సమాధానం ఇస్తాడు. ఆమె తలుపు తీయదు.

రెండసారి అతను తలుపు తడతాడు. ఆమె మళ్ళీ అడుగుతుంది ..ఎవరు మీరు అని. అతను మళ్ళీ" నేనే ..నీ ప్రేమికుడిని" అని చెపుతాడు. అయినా ఆమె తలుపు తీయదు.

మూడవసారి అతను తలుపు తడతాడు. ఆమె మళ్ళీ లోపలి నుంచి అడుగుతుంది ఎవరు నీవు ?అని.
అప్పుడు అతను ..ఓ.. ప్రియురాలా.. !నువ్వే నేను. నేనే నువ్వు ..అని బదులిచ్చాడట. అప్పుడు కాని తలుపు తెరవబడ లేదట..

అల్లాటి బంధం ఏర్పడినప్పుడు కాని వారు వేరు వేరు వ్యక్తులు కాదు. ఇరువురు ఒకటే! అనే భావం కల్గితే తప్ప కలసి మనుగడ సాగించలేరు అని తోస్తుంది కదా! మనకు.

దురదృష్టవశాత్తు..నేటి జీవన విధానంలో నీ -నా భావం పెరిగిపోయి ఎవరికీ కావాల్సినవి వారికి లభించాలి.అవి లభించక పొతే.. ఆ కాడిని ఒదిలేసి.. ఇంకో కాడిని వెదుక్కోవటం ..అది నచ్చక పొతే ఇంకోటి వెదుక్కోవడం లో ప్రవేశించి చాలా కాలం అయిపొయింది.అందుకే ముందు జాగ్రత్తగా ఇలాటి షరతులు ఏమో అని కూడా అనుకున్నాను.

ఆలోచనా విధానం లో మార్పులు జీవితాల గతినే మార్చివేస్తున్నాయి. లైఫ్ గ్యారంటీ యే కాదు.. లైఫ్ పార్టనర్ గ్యారంటీ కూడా లేని కాలం ఇది.

నీ-నా అనే భావం తగ్గించే విధం గా ఇరువురి భావనలు ఏకమైన ఒక పాట వినండి.
నువ్వు నేను ఏకమైనాము ఆనేపాట ని విని చూడండి.

16, జూన్ 2012, శనివారం

ఆకాశాన సగం మనం..

ఆకాశాన సగం మనం..
వినడానికి ఎంత బాగుందో..
ఎన్నెన్ని ఇనప కచ్చడాలు దాటాం..
నిత్యం సమరం చేస్తూనే ఉన్నాం..

ఉనికిని నిలబెట్టుకోవడానికి
మనుగడ సాగించడానికి ..
ఆధార
పీఠం కోల్పోకుండా ఉండటానికి ..

మనవాళ్ళే
.. మనవాళ్ళే..
మనని అనుమానపు దృక్కులతో ..
వెంటాడి
వేటాడిన క్షణాలు..
మనలని
మానసికంగా చంపేస్తాయి .
కూపస్థ
మండూకాల్లా .. బ్రతకమని
అనరు
కానీ.. హస్తిమ శకాంతర భేదంతో 
ఉండాలని
కోరుకుంటారు.
ఇంకానా ..... ఇంకానా.. అనుకోకండి ..
అరఘడియ
ఆలస్యం అయిందంటే ..
మన
మీద ప్రేమ కన్నా..,
మన
భద్రత మీద భయం కన్నా..
ఇరుగుపొరుగు
ఏమనుకుంటారో అని భయం ..
ఎదిగేది ఎక్కడ.. ఎదగనిచ్చేది ఎక్కడ..?
శరణార్ధ శిభిరాల్లోనే నయం..
చింతనలోనైన..స్వేచ్చగా మనగల్గుతారు


అవసరాల బానిసత్వ కొట్టంలో..
జీతం
రాళ్ళ పాలిచ్చే పసురాళ్ళం మనం..
జీవితపు
రంగస్థలం మీద
మనది
కాని జీవితంలో నటిస్తున్న
నట
ఊర్వశి' లం మనం.
విజ్ఞానపు
పూలతో అలంకరించుకున్న
వసంత
భామినులం ..మనం..
వ్యక్తిత్వపు
పరిమళాలు ,సమర్ధతా నైపుణ్యాలు ఉన్న
పట్టమహిషు 
 "లం మనం..
అయినా
మనకన్నా. బోనుసాయి మొక్కలే నయం ..
గర్వంగా పదుగురికి ప్రదర్శిస్తారు. .

మనువు
ఒక లోహపు గది..
తనువు
ఒక మోహపు నది..
నిత్యం
మనసు మల్లెలా
నలుగుతూనే
ఉంటుంది .
ఏ.. ఆలోచనా విధానంలోను
మనగల్గలేని
మనం..
ఎప్పటకి చరణదాసిలా..
మిగిలిపోతే
బాగుండునట ..
పురాణాల్లో లా కాకుండా
చరిత్రలో
శోకపర్వాలు , వనవాస ఘట్టాలు లేని
మనకొక
అధ్యాయాలు మిగుల్చుకుంటూ..
భవితలో
.. మన లాటి మనం
లేకుండా
మరింత చైతన్యశీలురుగా .
ఎదిగే
దిశలో మనలో
మనం
. మనం మనం...

15, జూన్ 2012, శుక్రవారం

ప్రియునికై అన్వేషణ

ఉదయం నుండి ఒకటే వెదుకుతున్నాను. కనబడితే ఒట్టు. నాకు తను లేకుండా.. ఒక గంట కూడా పొద్దు పొతే ఒట్టు వెదుకుతూనే ఉన్నాను విసిగి వేసారి పోయాను. 

అందరిని అడుగుతున్నాను..అతను కనబడ్డాడా? అని ఎవరు అని అడిగారు.

అయ్యో..అతనే! ఏమని చెప్పను..అతను అంటే అతనే..కనబడ్డాడా..?అని అడిగాను. అందరు లేదని సమాధానం ఇచ్చారు. అయ్యో! నా జానేమన్! నీ ఎడబాటు ఎంత దుఃఖం ! నేను ఈ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను .

 "నిధి ఛాలా సుఖమా! నీ పెన్నిధి చాలా సుఖమా!" అంటే..నీ పెన్నిధి చాలా సుఖమని చెప్పనా!? ఎందుకు అలా దాక్కుని నన్ను విసిగిస్తావు? అని తిట్టుకున్నాను కూడా. 

 అతని చల్లని స్పర్శతో..నా దేహపర్యంతం అలముకున్న బాధ అంతా క్షణకాలంలో మాయం అయిపోతుంది. నా నిర్లక్ష్యం తో అతనిని దూరం చేసుకున్న బాధ "ఇంతింతై వటుడింతై" రీతిన నన్ను బాధిస్తుంది.
 

 స్నానపానాదులు అవసరం లేదు,అన్నపానీయాలు సహించడం లేదు.అక్షరం పై దృషి నిలుపలేను..వీనుల విందైన సంగీతాన్ని ఆస్వాదించ లేకున్నాను. మనశ్శరీరాలు అతని జాడ కోసం వెతికి వెతికి డస్సి గొన్నాయి. మావారిని,మా అత్తగారిని,అందరిని అడిగాను నా ప్రియుడు ఎక్కడ ? అని. ఎవరికీ తెలుసు ?..నీ ప్రియుడు నీ ఇష్టం! భద్రంగా ఎక్కడ దాచుకున్నావో,లేక ఎక్కడ చేజార్చుకున్నావో! అని..విసుక్కున్నారు. 


 అసలు నాకు ప్రియుడు అవసరం రాదనుకున్నాను. మా పిన్నికి ప్రియుడు ఉన్నాడు,మా చెల్లికి ప్రియుడు ఉన్నాడు..ఛీ  ఛీ .... నాకు ప్రియుడి అవసరం రానే రాకూడదు అనుకున్నాను. 

 మనం ఏదైతే వద్దనుకుని ద్వేషిస్తామో.. అదే మనలని వెంటాడుతుంది చూడు అని పిన్ని,చెల్లి హెచ్చరించారు. వాళ్ళు అన్నట్లుగానే..ప్రియుని అవసరం నాకు వచ్చి పడనే పడింది. ఒక్కసారి ప్రియుని చెంత సాంత్వన చెందానా.!? ఇక నేను అతన్ని ఒదిలిపెడితే ఒట్టు. అది మొదలు నా ప్రియుడు ఎప్పుడు నన్ను అంటి పెట్టుకుని ఉండాల్సిందే!. 


 నా ప్రియుడు దూరం అవుతాడు అని ముందస్తు సూచనలు కనబడాగానే..అతని ఆచూకి వెతికి వెతికి ..చేజిక్కించుకుని ..గుప్పిట బిగించుకుని విజయగర్వంతో...మురిసి ముక్కలైపోతాను. 

 నా ప్రియుడు నా ప్రక్కన ఉంటే ఏ బాధ, గాధ నన్ను దరిచేరవు అని ఉల్లాసంగా ,ఉత్సాహంగా అధికంగా సామర్ధ్యాన్ని మించి పనులు చేసుకుంటాను. నను అంతలా అలరించే ప్రియుడు ఉంటే..మరి నేను అలా ఉండకుండా నిరుత్సాహముగా ఎలా ఉంటాను చెప్పండి.? 

 పొద్దస్తమాను వెదికాను వెదికాను. నా కళ్ళలో నీళ్ళు ఊరుతున్నాయి. ఎక్కడున్నావు ప్రియా !..ఒక్క సారి కనబడవా!? . నిన్ను రోజు అతిగా ఉపయోగించుకుని ఇబ్బంది పెట్టాను కదా! ప్రామిస్..నన్ను నమ్ము ఇక పై అంతగా నిన్ను ఇబ్బంది పెట్టను సరేనా! అని వేడుకున్నాను. మంచమెక్కి దిగులుగా పడుకున్నాను. 

కాసేపాగేసరికి నాకు ఒక చిన్న ఆచూకి దొరికింది . వెంటనే లేచి వెతికాను. ఆఖరికి .. నా ప్రియుడు నన్ను కనికరించాడు. ఎక్కడ ఉన్నాడో.. కనబడ్డాడు. నాకు దొరికి పోయాడు..మంచానికి బెడ్ కి మద్య దాక్కుని ఉన్నాడు. బయటకి తీసి బెడ్ మీద పడేసి.. అమ్మయ్య .అనుకున్నాను.

 నా.."ఒలిని" జెల్ నాకు దొరికిన్దోచ్! ఇక ఏ నడుము నొప్పులు,బెణుకులు,మెడ నొప్పులు, కీ బోర్డ్ పై టక టక మని నొక్కిన నొక్కులకి వచ్చిన నొప్పులకి సర్వ బాధ నివారిణి .."ఒలిని" రియల్ పెయిన్ రిలీఫ్ .. నా అసలైన ప్రియుడు.