22, ఫిబ్రవరి 2018, గురువారం

నా దారెంట

మనిషి జ్ఞాపకాల ఆధారంగానూ కల్పనలతో రోజుని గడుపుతుంటాడు. ఒకో జ్ఞాపకం చాలా పాతది కావచ్చు. అది మంచిదో చెడ్డదో.. కానవసరం లేదు. ఏదైనా జ్ఞాపకమే! ఈ రోజొక జ్ఞాపకం.. అది విషాద వీచికగా రూపాంతరం చెందిన జ్ఞాపకం. 

"నా దారెంట నే పోతుంటే  నన్నెందుకు  ఆకర్షించాలి నువ్వు"

వాస్తు పిచ్చితో మూలబడ్డ ఓ ఇంటి స్థలం ప్రక్కనుండి  వేలాది మందిలా  రోజూ నేను నడుచుకుంటూనే వెళతాను. ఖచ్చితంగా స్థలం ఎదురుగానూ ఎడమప్రక్కనూ కలుపుతూ  బ్లైండ్ మలుపు, వేగాలని నియత్రించడానికి అక్కడ వేసిన ఓ స్పీడ్ బ్రేకర్.  నా హడావిడి జీవితంలో ఓ రోజ.  ఆ రోజు చిన్నగా అనిపించే పెద్ద విచిత్రమే సంభవించింది. రోడ్డెంట నడుస్తూనే కనుకొసలనుంచి ప్రక్కకి చూస్తున్నప్పుడూ  ఓ పసుపు పచ్చని మొక్కొకటి తనువంతా పూలతో అలంకరించుకుని కనబడింది. ఏ వాహనమూ రాకుండానే నా నడకకి సంకెళ్ళు పడ్డాయి. 

"నా దారెంట నే పోతుంటే  నన్నెందుకు  ఆకర్షించాలి నువ్వు" అనుకుంటూ ముఖమంతా నవ్వు విచ్చుకుని వెలుగు కళ్ళతో ఆ మొక్క సమీపానికి వెళ్ళానా, ఎంత అందంగా వుందో ఆ పిచ్చి తల్లి. ఏవో కాయలు కూడా కాస్తున్నట్లు కనబడింది కూడా.  నెర్రెలిచ్చిన సిమెంట్ బండల మధ్య మొలకెత్తి పుష్ఫించి ఫలించిన మొక్క అది.  నయన స్పర్శతోనే ఆ జీవన సౌందర్యాన్ని పలకరించి ఆ రూపాన్ని హృదయంలో చిత్రించుకుంటూ   లోలోపల గింగిర్లు తిరుగుతున్నస్వరాలేవో పెదవి దాటి కూని రాగంగా మారి ఈ రోజు జీవించిన క్షణాల్లో ఇవి కొన్ని అనుకుంటూ  పదపద మంటూ అడుగులని తరిమే ఆలోచనల సాక్షిగా బతుకు బాటలో పరుగులు మామూలే. 

ఇంకొంచెం ముందు కు వెళతానా .. దారి ప్రక్కనే ఉన్న మామిడి చెట్టు క్రింద మాసిన గుడ్డని పరిచి దానిని గాలికి ఎగిరి పోకుండా చేతి కర్రని వుంచి వచ్చే పోయే వారి వొంక ఆశగా చూస్తూ ఉంటాడు ఓ భిక్షుయసీ. భుజాన తగిలించుకున్న సంచి చిల్లర నాణేలతో బరువుగా ఉంటే కాస్త బరువు తగ్గించుకుని తృప్తి పడుతూ బరువు లేని రోజు తల అడ్డంగా వూపుతూ నడక సాగిస్తూ ఉంటాను. 

నేను నడక నుండి  మళ్ళీ రెండు చక్రాల బండి పై ప్రయాణం , తర్వాత నాలుగు చక్రాల రధం పై ప్రయాణం చేసే స్థాయికి ఎదిగినప్పటికీ నిత్యం నన్ను ఆకర్షించే ఆ రెండు వస్తువులూ నాకొక ప్రకృతి పాఠాన్ని నేర్పుతూనే ఉంటాయి. ఆగి మరీ అలవాటైన నడకలోకి తొంగి చూడమంటాయి. పసుపచ్చ పూల చెట్టు  యే సంరక్షణా లేకుండా అన్ని ఋతువులలోనూ  ప్రవర్ధమానం అవుతూనే ఉంది. తాత  వొంట్లో సత్తువ తగ్గి  పీకేసే ఓపిక లేక వదిలేయగా జీబుగా   విస్తరించిన గరిక దుబ్బుల మధ్యన  సురక్షితంగానూ   వాకిట్లో నీళ్ళు చల్లి ముగ్గు కర్ర వేసుకోవాలన్న బామ్మ ఆకాంక్షలను త్రాగి బ్రతుకుతూనూ. 

మామిడి చెట్టు క్రింద భిక్షుయసి  శరీరం మరీ కృశించి పోతుంది.  పాదచారుల దయతో లభించిన నాలుగు కాసులుని  రోడ్డు చివర ఫలహారాల బండికి చేర్చలేక .. ఎదురుగా భవనంలో పని చేసే అడ్డ బాసర పెట్టుకున్నామెని బతిమలాడుకుంటాడు కాసిని టీ నీళ్ళు, రెండు ఇడ్లీముక్కలు తెచ్చి పెట్టమ్మా అని.  నేను నీకు  పని మనిషినా ..అని విసుక్కుంటూనే తెచ్చిచ్చే ఆమెలో  రోజూ దయా వర్షం కురుస్తూనే ఉంటుంది. అది చూస్తున్న నాలో తెలివి ఇనుమడించి రోజూ చేతి సంచీ బరువుగా ఉంటేనే ఇవ్వాలా .. నిండు కుండ అన్నంలో నాలుగు ముద్దలు పెట్టొచ్చు కదా అనుకుని ఆచరిస్తాను. 

పసుపచ్చ పూల చెట్టు ఉన్న ఇంటి తలుపులు రోజుల తరబడి మూసుకున్నట్లు గమనించినప్పుడు ఓ సీసాతో నీళ్ళు తీసుకెళ్ళి మొక్కని తడుపుతుంటాను.  అదో మానసిక ఆనందం నాకు. నిజానికి ఈ రెండు పనులు నేను చేయకపోయినా అవి ఉండవచ్చు .  సమయానికి  సందర్భానికి తగినట్లు బ్రతకడం మనుగడ సాగించడం సృష్టిలో సాధారణమైన విషయం.  అదీ కుహనా విలువల మధ్య బ్రతికే ఒక్క మనిషికి తప్ప. 

ఉన్నట్టుండి  మా వైపు రోడ్డు విస్తరణా కార్యక్రమాలు మొదలయ్యాయి. తెల్లారేపాటికి  రహదారి ప్రక్కనే ఉన్న మామిడి చెట్టు ముక్కలు ముక్కలుగా నరకబడింది. దాని క్రింద కూర్చునే వృద్దుడికి ఇప్పుడు తిండే కాదు నీడ లేకుండా పోయిందని విచార పడుతుండగా వెంటనే పసుపచ్చ పూల మొక్క గుర్తుకొచ్చింది. అడుగుల వేగం పెంచి ముందుకొస్తే  రంగ రంగ వైభవంగా విస్తరించుతున్న పసుపచ్చ పూల మొక్క ప్రోక్లెయిన్ తవ్విపోసిన మట్టి గుట్టల మధ్య  ఒదిగి పోయి దిగాలుగా పడి ఉంది.  ప్రయాసతో జారుతున్న మట్టి గుట్టలపైకెక్కి  పసుపు పచ్చ పూల మొక్కని చేతిలోకి తీసుకుంటే విరిగిన కొమ్మై నా చేతిలోకి వచ్చింది. నా మానసిక ప్రపంచం ముక్కలైనట్లైంది. దయ లేని లోకంలోకి,  ఈ వాచ్యం లోకి మళ్ళీ వచ్చిపడ్డాను.  "నా దారెంట నే పోతుంటే  నన్నెందుకు  ఆకర్షించాలి నువ్వు" అనే అభియోగాలు మోపని సాధారణ కాలంలోకి  మళ్ళీ వచ్చిపడ్డాను నేను.. 

కొన్నాళ్ళు నా పెదవులపై యే కూనిరాగాలు కూయవు. నా కళ్ళల్లో యే వెలుగుపూలు పూయవు. మళ్ళీ యేదో ఆకర్షణ తనలోకి నన్ను లాక్కునేదాక నేను వాచ్యంలో బ్రతుకుతుంటాను జీవించడం తెలియక.


15, ఫిబ్రవరి 2018, గురువారం

సౌందర్యానుభవం

అందమైన హృదయం ఉన్న వారికి అన్నీ అందంగానే కనబడతాయని నానుడి.అలాగే అందంగా కనబడని వాటిని నిర్విద్దంగా తిరస్కరిస్తారని కూడా అంటూంటారు.

"అతనెంత అందంగా ఉంటాడు" అని స్త్రీలు  బహిరంగంగా ప్రకటించడం కూడా నిషిద్దం కొన్ని కుటుంబాలలో అయితే  చూపులతో ఉరి వేసేస్తారు మరి.

ఈ మధ్య నా ఫ్రెండ్ ఇలా అంది " వాడు అందంగా ఉండేవారికి వలవేస్తాడు ఆ అందాన్ని అడ్డంగా వాడి పారేసిన తర్వాత త్రోసి పడేస్తాడు"  అని. ఆమె భర్త "మీ ఆడవాళ్ళు మాత్రం తక్కువా!  కాస్త అందంగా కనబడితే చాలు చటుక్కున ప్రేమించేస్తారు.డ్రెస్ మార్చినట్లు మార్చి పడేస్తారు" అని. మాటలతో యుద్ధం చేసుకుంటున్న వారిని వారి పాటికి వదిలేసి  అసలీ అందానికి ప్రేమకి అవినాభావన సంబంధం ఏమిటీ ?  అని ఆలోచించసాగాను.

అసలందమంటే యేమిటీ ? అందాన్ని నిర్వచించలేము. కవులయితే పోలికలతో చెప్పగలరేమో ! ఒకోసారి కవి దృష్టి పథానికి  కూడా గోచరించని నిర్మలమైన సౌందర్యాన్ని కనులు..  కాదు కాదు  హృదయం మాత్రమే కనుగొనగలవు. ఓ సినీ కవి తన ఇంటర్ వ్యూ లో తన జీవన ప్రయాణంలో అందమైన అమ్మాయి కనబడినప్పుడల్లా ఆమెతో పీకల్లోతు  ప్రేమలో పడిపోయానని చెపుతుంటే "వీడి ముఖం తగలెయ్య, ఎంతమందిని ప్రేమిస్తావురా, అసలు వీడికి పెళ్ళై౦దో  లేదో , అయితే దాని బొచ్చెలో రాయే! ఇలాంటివాడిని కట్టుకున్నందుకు" అని  మా ప్రక్కింటావిడ తిడుతుంటే  ఉలికి పడి బాహ్యప్రపంచాలోకి వచ్చిపడ్డాను. కళ్ళు వెళ్ళిన చోటుకల్లా కాళ్ళు వెళ్ళకూడదు కదా అని.

నిజానికి ఆ కవి మాటల్లో అతిశయోక్తి లేదనిపించింది నాకు.  అలా అందాన్ని తమదైన సృహతో గుర్తించి,ఆస్వాదిస్తే తప్ప వారు అలా అన్నేసి  ప్రేమ,శృంగార  గీతాలు వ్రాయలేరని  అనిపిస్తూ ఉంటుంది . కొందరు పురుషులు స్త్రీలందరిలోనూ అమ్మని చూస్తే కొందరు పురుషులు కావ్యనాయకి ని చూస్తుంటారు అది వారిలో ఉన్న చిత్తప్రవృత్తులే కారణం అని అర్ధం చేసుకోవచ్చు .   బయటకి చెప్పం కానీ  ఎవరికీ వారు స్వీయానుభవంలో,అనుభూతిలో సౌందర్యాన్ని తదాత్మయం చెంది ఉంటారు.

ఇక నా స్వీయానుభం  ఒకటి చెప్పదలచానిపుడు. సౌందర్యాన్ని అలౌకిక ఆనందంతో చవిచూసిన సందర్భానికి అక్షర రూపం ఇది. ఒకానొక ప్రయాణంలో ..చీరాల టు విజయవాడ ప్రయాణంలో వేసవి కాలం సాయంత్రపు యె౦డకూడా నిప్పులు చెరుగుతున్నట్లే ఉన్న సమయంలో ట్రాక్ మరమత్తుల నిమిత్తం  రైలు వేగం నెమ్మదించింది.  ధారాళంగా కారుతున్న చెమట చికాకుల మధ్య ఓ మధురమైన కంఠ స్వరం వలవేసి నన్ను అటువైపు లాక్కెళ్ళింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. "రాగాల సిగలోన సిరి మల్లివి,సంగీత గగనాన జాబిల్లివి " అంటూ అతను పాటనందుకున్నాడు. నేను అప్రయత్నంగా సీట్ నుండి లేచి తర్వాత ఆ సీట్  ఎవరో ఆక్రమిస్తారని తెలిసికూడా అతని  వైపుకి వెళ్లాను. అతను అర్ధనిమీలిత నేత్రాలతో యేపాటి బిడియం సంకోచం లేకుండా యేవాయిద్యాల సహకారం లేకుండా ఆనందంగా  పాడుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడూ పాటలు వింటూ అనేక గళమాధుర్యాన్ని  వీనుల విందుగా ఆస్వాదించిన నేను  ఆ సమయంలో అంతటి మధుర స్వరం అంతకు ముందెన్నడూ విన్నట్టు ఇక ముందు కూడా వింటానో లేదో అన్నట్టుగా  ఆ రసస్వాదనలో మునిగి పోయాను. పాట వెంబడి పాట. ఆ స్వర తుషారానికి వడ్లపూడి మల్లెల పరిమళం అల్లుకున్నట్లు అనిపించింది. రైలు వేగమందుకుని ఎప్పుడు కృష్ణా కెనాల్ పైకి వచ్చిందో తెలియదు. ఆ ఇనుప వంతెనపై రైలు నడిచే  కరకు శబ్దాలు  అతని గాన ఝరికి అడ్డుకట్ట వేసినట్లైంది   నేను బాహ్య ప్రపంచంలోకి వచ్చిపడ్డాను. "చాలా మంచి వాయిస్, చక్కని పాటలు పాడారు, థాంక్స్ అండీ " అన్నాను. అతని పెదాలు సన్నగా నవ్వాయి. ఇకపై సంభాషణ ఏమీ జరగలేదు. అతను నేను  చేస్తున్న  ప్రయాణం ఇంకా కొనసాగితే బాగుండుననిపించింది. స్నేహితులతో మాట్లాడుతున్నాప్పుడు అతని మాటలు విన్నాను. పాట పాడినట్లే ఉన్నాయి  ఆ మాటలు కూడా ! తర్వాత విజయవాడలో దిగిపోయి జనప్రవాహంలో కలిసిపోయాం.

యేళ్ళు గడిచినా అతని అందాన్ని ఇప్పటికీ కళ్ళ ముందుకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను ..ఊహూ..అసలు సాధ్యం కాదు. అతనిప్పటికీ నాకు గుర్తు ఉండటానికి కారణం గళ సౌందర్యమేనా?  అతని అందం విశాలమైన ఆ కనుదోయలో ఆ కనుబొమలలోనూ ఉందా ?  ఆ గడ్డం నొక్కులో ఉందా ? నవ్వకపోయినా నవ్వినట్లు ఉండే ముఖ కళవళికలోనా, నవ్వినప్పుడు కనబడే తెల్లని పలువరసలోనా ..లేకపోతే తలుపుకి ఆనుకుని ఒంటి కాలితో నిలబడిన తీరులోన (style) .. లేకపోతే అతను కనులు మూసి తన్మయత్వంతో పాట పాడే తీరులోనా లేక గళమాధుర్యంలోనా ,లేక  రమేష్ నాయుడు స్వరాలలోన,   డాక్టర్ సి.నారాయణరెడ్డి పదాలలోన, లేక  ఆ పాటలో నటించిన శ్రీవిద్యలో అణువణువునా నిండిన అందం గుర్తుకు వచ్చిన జ్ఞాపకం లోనా ? ఏమో ..అసలు చెప్పలేను . ఆనాటి పాట  బాలు గళాన్ని  మరిపింపజేసింది ఎంతగా అంటే ..అప్పుడతను పాడిన  పాటలని ఎపుడైనా   వింటున్నప్పుడల్లా  అతని సమ్మోహన గళమే   ఈ స్వరాలై  నన్ను వేటాడుతూ ఉంటుంది. బహుశా సౌందర్యమంటే అదే అనుకుంటాను.

ఇప్పటికీ ఎప్పటికీ అతని రూపు రేఖలని నేను వర్ణించలేను. కానీ నేను మేధోపరంగానూ,మనసుతోనూ, హృదయం తోనూ అనుభంలోకి వచ్చిన సౌందర్యం అది. హటాత్తుగా అతనెదురైనా అతన్ని గుర్తించలేకపోవచ్చు కూడా !  ఆ క్షణంలో ఆ అనంత సౌందర్యాన్ని నేను అనుభవించాను.  ఆ క్షణాలని అపురూపంగా  ప్రేమించాను. ప్రేమించిన అనుభూతిని అనుభవించాను. సౌందర్యం సహజమైనది,  సంస్కారం వంతమైనది. సాన పెట్టినది కావడం వలెనే అది వజ్రంలా కాంతులీనుతూ ఇప్పటికి అదీ సున్నితంగా కోసేస్తూ ఉంటుంది అని నా అనుభవం. నదిలా ప్రవహించే సంగీతంలో అతని స్వరమొక పిల్ల కెరటం.  అయాచితంగా అతని గానామృతాన్ని ఆస్వాదించడమే ఒక సౌందర్యానుభవం.

ఒక అనుభూతి,ఒక ఆస్వాదన.ఒక జీవితానుభవం  ..ఇదే అనంత సౌందర్యం నా దృష్టిలో .  క్షణ క్షణం పుడుతూనే ఉంటుంది చస్తూనే ఉంటుంది.లోలోపలికి ఇంకి పోతూనే ఉంటుంది. కనబడే  వెలుగై కాంతులీనుతూ  ఉంటుంది.
.

8, ఫిబ్రవరి 2018, గురువారం

అతిధి

ఉదయాన్ని వెలిగిస్తూ.....

నా ఇంటికొక కొత్త అతిధి వేంచేసింది

తనని పసి పాపని చేతిలోకి తీసుకున్నట్లు

రెండు వ్రేళ్ళ మధ్య మృదువుగా జొనుపుకుని

తలనొంచి కనురెప్పలతో అల్లనల్లగా ఓ ముద్దిచ్చాను

మరింత సన్న నవ్వుతో చిలిపిగా కన్నుకొట్టింది

లోని అసహనాలని తృటిలో మాయం చేసింది

హృదయమంతా శాంతి నింపింది



ప్రాణ శక్తినంతా పోసి పెంచిన తల్లి తలపై కిరీటంలా మెరుస్తూనే

అల్లరిగా తనబరువుతో వొంచేస్తుంటే

చిన్నగా కోప్పడి ఓ పుల్లముక్కతో సహవాసం నేర్పి

నేల పడటానికి తొందరెందుకనీ

తోడెంత అవసరమోనని సుద్దులు చెప్పాను



రేకు రేకుపై వెలుగురేఖలు నాట్యమాడినప్పుడల్లా

 తనపై విరిసే రంగు రంగుల కాంతులతో

మిగిలిన మొక్కలన్నీ హోళీ ఆడుకుంటున్నట్లు ఉంది

తన రాక ...కారణం లేకుండానే సంబంరం చేసుకున్నట్టూ

చిరు సత్కారాలతో నాకు క్షణం తీరిక లేకుండానూ

రోజంతా నను తుమ్మెదని చేసి తన చుట్టూ తిప్పుకుంటూనూ ..

మొత్తానికి ...ఈ వేళ నా వరండా తోట ఓ కొత్త నగని ధరించినట్లు ఉంది.

08/02/2018. 04:45 AM.