19, జూన్ 2011, ఆదివారం

నాన్నకి.. ఓ..భ్రూణ పుత్రిక ప్రశ్న



నాన్నా!!..ఈ రోజు ప్రపంచమంతా.. ఫాదర్స్  డే.. జరుపుకుంటుంది.

అందరు నాన్నలకి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ప్రేమగా కానుకలు ఇస్తున్నారు.

ఇంకా పుట్టని నేను..పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత వేసే ప్రశ్నలని పుట్టక ముందే అడగాలనుకుని సమాయుతమవుతున్నాను.

 మీరు ఇచ్చే సమాధానం బట్టి  నేను పుట్టి మీ నీడలో..బతికి బట్టకట్టాలనుకున్న పిండాన్ని నాన్నా!!
     
నాన్నా!? ఒక ప్రశ్నని వేస్తున్నాను. మనఃసాక్షిగా సమాధానం చెప్పుకోండి.నాకు చెప్పండి.   

బిడ్డ పుట్టుకకు కారకుడైన పురుషుడిని..ఆ బిడ్డకే రక్షకుడిగా చేసే..నాన్న స్థానం.. బిడ్డకి..అపురూపం. నాన్న మగ పిల్లడికే తండ్రి కాదు..ఆడ పిల్లకి కూడా.. 

ఆడ పిల్లగా నేను పుట్టినప్పుడు మనఃస్పూర్తిగా నీ వారసత్వానికి..సంతోషించారా ?  లేక..తప్పదు కనుక ఒక మగబిడ్డ పుట్టలేదన్న ఆశాభంగం ని  లోలోపల దాచుకుని.. సరిపెట్టుకున్నారా ?  మా అమ్మని.. వారసుడిని ఇవ్వలేదని సతాయించారా? 

అమ్మకి..రెండో కాన్పులోను చెల్లి పుట్టినప్పుడు  అమ్మని..తిట్టారా..? వారసుడి కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాలని.. అనుకున్నారా?

నన్ను  స్కూల్ కి  పంపుతున్నప్పుడు.. ఆడ పిల్లలకి.. ఇంత ఇంత ఖర్చు పెట్టి.. చదువు అవసరమా? అని మనసులోనైనా తిట్టుకున్నారా?  మేము బాగా చదువుకుంటుంటే పెద్ద చదువులు వద్దని ఆపేసి పెళ్లి చేసేయాలనుకున్నారా?
  
వీటన్నిటికన్నా ఒక ముఖ్యమైన  ప్రశ్న.

మా అమ్మని చీటికి మాటికి..తిడుతుంటారా? వంట బాగా చేయలేదని, బట్టలు బాగా ఉతకడం లేదని,అందంగా లేదని, బాగా మాట్లాడటం రాదని,చదువు సంస్కారం లేని మొద్దు అని..చిన్న చూపు చూసేవారా?

ఒక మంచి భర్త కాలేని మీరు ఒక మంచి తండ్రి కాగలరా?మాకు  మా అమ్మని   ప్రేమించే మా మంచి నాన్న కావాలి..నాన్నా!  మంచి అమ్మో.. లేక మంచి నాన్న.. గా ఉండే వేరు వేరు ఇద్దరు మాత్రమో..వద్దు. 
   
ఇంకా కొన్ని ప్రశ్నలు..

ఇంకా కట్నం బాగా తేలేదని,మీకు నచ్చినట్లు ఉండ లేదని,  జూదం ఆడుతూ,మద్యం తాగుతూ,పర స్త్రీల పొందులలో..ఇల్లు మరచిపోయి.. భాద్యతలు విస్మరించి ఉన్నప్పుడు అభ్యంతరం చెబుతుంటే.. ఆమెని శారీరకంగా..హింసించే వారా?

ఇవన్నీ లేకుండా ..మా అమ్మని ప్రేమించి, గౌరవించి..ఆమె మాటకి  విలువనిచ్చి.. అడ పిల్లైనా,మగ పిల్లాడైనా వారి పుట్టుకకు కారణం  మీరేనని తెలుసుకుని .. పుట్టిన మమ్మల్ని ప్రేమించి... అమ్మని ప్రేమగా ..చూసుకున్నప్పుడే     మీరు మంచి నాన్నగ ఉంటారని నేను అనుకుంటున్నాను. 

చిటికెన వేలు పట్టుకుని  ప్రపంచాన్నిచూపించి ..మా పై ఆంక్షలు లేకుండా మగ పిల్లల లతో..సమానం గా మమ్మల్ని పెంచి ప్రేమించే నాన్నగా మీరు ఉంటె..నేను మీకు మాత్రమే.. వారసురాలిగా జన్మించి..  మీ పెంపకంలో..మంచి కూతురిగా.. మీకు గర్వకారణమైన కూతురిగా పెరిగి..

ప్రేమతో..గౌరవంతో.. నాన్న.. మీకు   ప్రేమ పూర్వక పితృ దినోత్శవ శుభాకాంక్షలు.. మరియు అభివాదములు.. చెప్పాలని .. అనుకుంటున్నాను.

 అలా ఉంటారా..నాన్నా..?  

అలా ఉండలేని నాన్న మీరు అయితే.. నేను అసలు పుట్ట కుండా చేయమని.. వేడుకుంటున్నాను.
                                                                                                                    
                                                                                                                         ఇట్లు..  భ్రూణ పుత్రిక.     

5 కామెంట్‌లు:

కమల్ చెప్పారు...

నా తమ్ముడికి మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది నేను మా తమ్ముడు మంచి తెలుగు పేరు పెట్టాలని తెగ చించుకుంటుంటే మా మరదలు మాత్రం దిగులుగా కూర్చుంది " తనకి మొదటి కాన్పుగా ఆడపిల్ల పుట్టడం నామోషిగా ఫీల్ అయ్యింది అదె మాట మెల్లిగా చెప్పింది " నాకు కోపం వచ్చి చెడా మడా తిట్టేసి " మీకు ఆడపిల్ల ఇష్టం లేక పోతే నాకివ్వండి నేను పెంచుకుంటాను " అని వార్నింగ్ ఇచ్చి వచ్చాను. అన్ని దుర్గణాలకు, చెడుకు మగవాడే కేంద్రబిందువు అని జెండర్ డిఫిరెన్స్ చూపుతున్నారు. అదెప్పుడు మారుతుందో..? అసలు బ్రూణ హత్యలు ఎందుకు జరుగుతున్నాయో విషయం మీద ఎవరూ సుదీర్ఘంగా చర్చించట్లేదు తాత్కాలిక అపోహలకు తావిచ్చి వాటిమీద మాత్రమే ఆరోపణలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కమల్ గారు స్పందించిన మీకు ధన్యవాదములు. తక్కువ మంది మీలాటి వారు ..ఎక్కువ మంది ఆడ పిల్లలు వద్ధనుకున్నవారు ఉంటున్నారు.వారిని దృష్టిలో పెట్టుకునే ఈ పోస్ట్. ఏ రోజైతే.. ఆడపిల్లని కన్నందుకు..భార్యని చంపిన భర్త అని వార్తలు రాకుండా ఉంటాయో.. అప్పుడు..ఆరోపణలు అవే ఆగిపోతాయి. న్యూక్లియర్ చైల్డ్ ఉండాలనుకున్న కుటుంబాలలో,ఆర్ధికంగా బలపడిన కుటుంబాలలో..ఆడ-మగ ఈ తేడా ఉండక పోవచ్చు. దేశం మొత్తం జనాభాలో..నానాటికి తగ్గుతున్న స్త్రీ శాతం చూస్తే.. ఇంకా మీకు సత్యం గోచరించడం లేదా?

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

kamal garu..Thank you very much for your explain.

buddhamurali చెప్పారు...

భ్రుణ పుత్రికకు
నీ అనుమానాలు నిజమే కానీ కాలం మారింది తల్లి నువ్వు నిర్భయంగా ప్రపంచంలోకి అడుగు పెట్టు. అలా అని ఆందరూ మంచివారే అని చెప్పడం లేదు కానీ జాగ్రతగా ఉంటే ఆనందంగా బతకొచ్చు. నీవు ఇంకా ఈ భూమి మీదకు అడుగు పెట్టలేదు కాబట్టి నీకు తెలియక పోవచ్చు . ఇప్పుడు అమ్మాయిలదే నమ్మా ప్రపంచం అంతా . బాగా చదువుకుంటున్నారు . ఉద్యోగాల్లో ముందుంటున్నారు. జులాయిగా తిరిగే కొడుకులు ( ఈ మాట ఇప్పుడు ఓ తిట్టు తల్లి ) ఉన్నారు కానీ అలాంటి చిట్టి తల్లులు కనిపించరు. అక్కడక్కడ తోడేళ్ళు ఉంటాయి. నాన్న చేయి పట్టుకొని అడుగులు వేయడం నేర్చుకుంటే ఈ ప్రపంచం నిదె. ఆమ్మయిలకు చదువు ఎందుకు అనుకునే కాలం నుంచి నీ ఇష్టం ఉన్నత వరకు చదువుకో తల్లి నేనున్నాను కదా అనే తండ్రులు ఉన్నా కాలమిది . దైర్యంగా రా.. దైర్యంగా ఉండు. .. అనుమానం ఉంటే మా ఇంటి చిట్టి తల్లుల తో మాట్లాడి నివృత్తి చేసుకో......

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అమ్మాయిలు.. దీపంలా ప్రతి ఇంటా వెలగాలి.. మరి కొన్ని దీపాలు..వెలిగించాలని..మనఃస్పూర్తిగా .. కోరుకుంటున్న మీకు..ధన్యవాదములు.. బుద్ధా మురళి గారు. నాకు ఇప్పుడు ప్రపంచమంతా.. మీలా.. మంచి నాన్నలు ఉండాలని..కోరుకుంటూ..