31, డిసెంబర్ 2011, శనివారం

సోలార్ కాంతులలో.. మా ఇల్లు



హాయ్..ఫ్రెండ్స్..బాగున్నారా!? నాకు కొంచెం అనారోగ్యం వల్ల ఇటు వైపు తొంగి చూడటం లేదు.
అలాగే పని ఒత్తిడి కూడా..

2011 కి వీడ్కోలు చెప్పటానికి సిద్ద పడ్డాం కదా!

కేలండర్ మారిపోతుంది. పేజీలు మాసిపోయి నెలల పుటలు వెనక్కి తిరిగి మనని ముందుకు తోస్తున్నాయి..ఆశ మరో సంవత్సరం లోకి మనని నెడుతుంది..

ఏమిటో..ఏదో చేయాలన్న తపన మాత్రం కాస్త నెరవేరి..మరి కాస్త నెరవేరక ..మబ్బు చాటు చందమామలా..దోబూచులాడింది.

అవసరం నెట్టిందో ఏమో.! లేదా కాస్త అవగాహన పెరిగిందో.. కానీ.. జ్ఞానం వైపు అడుగులు వేస్తున్నట్లు నేను..సహజ సిద్ద ఇంధన వనరులు వైపు దృష్టి పెట్టాను వెదకడం మొదలెట్టాను. రోజుకి ఏడు గంటల కరంటు కోతతో.. మా పనులకి చాలా కష్టం,నష్టం కూడా.. ఇన్వెర్టర్ వద్దనుకుని సొలార్ లైటింగ్ వైపు ఆసక్తితో.. ఇంటర్నెట్ సాయంతో..సమాచారాన్ని సేకరించాను. వారిని ఫోన్ లో కాంటాక్ట్ చెయ్యకుండానే లోకలే కదా..ఈజీగా కనుక్కోవచ్చు అని బయలుదేరి ..ఓ..గంట వెతుక్కుని ఎలాగోలా అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్లాను. ఎక్కడంటారా..!?

మా విజయవాడలోనే.. ! ఇతర దేశాలకి సోలార్ ఉత్పత్తులని ఎగుమతి చేసే "శ్రేష్టి మార్కెటింగ్ " వారిని సంప్రదించాను.
వారి ఉత్పత్తులని చూసి..నాకు కావాల్సిన సోలార్ లైటింగ్ సిస్టం ఎంపిక చేసుకుని వచ్చాను. శ్రేష్టి మార్కెటింగ్ వారు ..ఇంటికి వచ్చి సోలార్ సిస్టం ని ఏర్పాటు చేసి వెళ్ళారు.సోలార్ కాంతులలో.. మా ఇల్లు ధగ ధగ మెరుస్తూ..ఉంది.







ప్రకృతి నుండి సహజంగా లభించే వాటిని మనం ఉపగోగించుకోవడం మూలంగా.. విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చుని ,సమయాన్ని, సామాజిక వనరులని కూడా ఆదా చేయడంతో పాటు..మనకి కూడా విద్యుత్ బిల్లుల వడ్డింపు కూడా తగ్గుతుంది కదా!
ఇప్పుడు మా ఇంట్లో మూడు ..సోలార్ హోం లైటింగ్ సిస్టం ఏర్పరచుకుని ... ఆ కాంతిలో.. మా పనులు చేసుకో గల్గుతున్నాము. తర్వాత ఇంటి పూర్తి అవసరాలకి సరిపడా విద్యుత్ ని సూర్య రశ్మి ద్వారా పనిచేసేబాటరీ సాయం తో..ఏర్పాటు చేసుకోవాలన్న ఆసక్తి ఉంది.
ఒక్కో క సోలార్ లైట్ కి.. 4 ,200 రూపాయలు ఖర్చు అయినది. ఆన్ లైన్ ద్వారా ..ఇంకొక మూడువందల రూపాయలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.





28, డిసెంబర్ 2011, బుధవారం

చూసి నా మనసే పాడేనే

ఎంత  అందమైనది  ఈ  ప్రకృతి !!!!
చూడటానికి   రెండు కళ్ళు చాలవు.
అందుకే కెమెరాలో   బంధించి మళ్ళి మళ్ళీ చూస్తాము.
అందమైన ప్రకృతిని చూస్తే మనసంతా ఆనందాల హరివిల్లు విరిసినట్లే!
ఏ దేశమైతే ఏమిటీ? ఎంతో..రసికుడు దేవుడు..ఎన్ని రంగులు,ఎన్ని పూవులు.. అన్నీ మన కోసమే! నిన్ను చూసి నా మనసే పాడేనే ..అనుకుంటూ..
ప్రకృతిని ప్రేమిస్తూ.. ఆ అందాలని ఆస్వాదిస్తూ.. చేతనైన మేర పర్యావరణాన్ని పదిలంగా కాపాడుతూ..   ఉందామా!?



 ఈ చిత్రాలు అన్నీ కూడా ..ప్రకృతిని చూస్తే.. పసి పిల్లాడిలా పులకించే మా అబ్బాయి.. ఫోటోగ్రఫి.

 

26, డిసెంబర్ 2011, సోమవారం

స్కెచ్ పెన్ - కక్షసాధింపు

ఒకపరి ఏదో తలపోస్తాము వెనువెంటనే..మరుక్షణమే మరొక విధముగా నడుచుకుంటాము మనసు చెప్పిన దానిని వినకుండా ఆలోచన తో..వివేకంతో..నడచుకుంటాము. అది నాకే కాదు అందరికి ఎప్పుడో ఒకప్పుడు కాదు..రోజులో ఎన్నోసార్లు జరిగే సంగతే ఇది. నాకు నేను అలా అనుకున్న  సంఘటన  చాలా సిల్లీ గా తలపోసానా !? అని నవ్వుకునే విషయం ఒకటి జరిగింది. 

ఈ మద్యనే ఒకరోజు ..నేననుకోకుండా అప్పటికప్పుడు ..త్వరితంగా ఓ..డిజైన్  స్కెచ్ వేయాల్సి వచ్చింది. అందుకోసం పెన్ కావాలి కదా! అదీ ట్రేస్   పేపర్  పై వేసే డిజైన్ కాబట్టి స్కెచ్ తప్పనిసరిగా కావాలి. ఇల్లంతా వెతికాను.అప్పటికే స్కెచ్ పెన్ లు అయిపోయినట్లున్నాయి. ఏదో దొరికింది కానీ..అందులో.. చిన్న పాటి ఇంకు తడి జాడ కూడా లేదు. ఇక  పెన్సిల్ కి పని చెప్పి డిజైన్ చేస్తున్నాను. ఇంతలో..

మా ఇంట్లో పైన పోర్షన్లో ఉండే ఒక మేడం(వర్కింగ్ ఉమెన్) పైకి వెళుతూ..తాళాల కోసం వచ్చారు. ఆమె ప్రతి రోజు తాళాలు మా ఇంట్లో పెట్టి వెళతారు. ముందుగా వచ్చే పిల్లలకోసం వీలుగా అలా పెట్టి వెళుతుంటారు. అలా ఆ తాళాలు తీసుకుని వెళుతూ..ఎందుకు ఆ పెన్సిల్ తో..అలా అవస్థ పడతారు మా ఇంట్లో.. స్కెచ్ పెన్ ఉంది ఇస్తాను ఉండండి..అంటూ వెళ్ళారు. ఆమె వెళ్ళిన కొంచెం సేపటి..నేను వరండా దాటి బయటకి వెళ్లి ఆవిడ ఎప్పుడు పెన్ ఇస్తారా అన్నట్లు..ఎదురు చూస్తున్నాను. ఆమె పెన్ సంగతి మర్చిపోయి..ప్రక్కింటి పోర్షన్ లో ఉంటున్న మరొక ఆమెతో ముచ్చట్లలో పడ్డారు.ఎంతకీ పెన్ ఇవ్వరు..నేనేమో పని అర్జంట్ ..అలా అని పైకి వెళ్లి తెచ్చుకోను బద్ధకం + మోకాళ్ళ నొప్పి.  చినుకు కోసం ఎదురు చూసే నెర్రు లిచ్చిన భూమిలా ఇంకా చెప్పాలంటే భవతీ భిక్షాం దేహీ అన్నట్లు.... స్కెచ్ పెన్ దేహి గా మోరలు చాచి పైకి చూపులు. ఆమేమో రాదు. మోకాళ్ళ నొప్పులు అనుకున్నాను. ముందు మెడ నొప్పులు   వచ్చేటట్లున్నాయి..అనుకుని లోలోపల విసుక్కుని..దుర్గ గారు అని గట్టిగా కేక పెట్టాను.

అప్పుడు ఆమె ముచ్చట్లకి పుల్ స్టాప్  పెట్టకుండానే..తాళం తీసి ..నా బిక్షు చేతుల్లోకి పెన్ ని జార విడిచారు.అప్పుడు ఆ పెన్ నాకు ఆకాశం నుండి.. దుమికి వస్తున్న స్కెచ్ గంగమ్మలా కనబడింది.నేనయితే  లోలోపల సంతోషాన్ని మొహం పైకి..కురిపించేసుకుంటూ..అమ్మయ్య ఇప్పుడు నా పని సులభం. ధన్యవాదములు దుర్గా మాతా..అని చెప్పి..

 స్కెచ్ పెన్ ని పేపర్ పై పెట్టానా.. అందులోనుండి.. ఒక్క నల్ల గీత వస్తే వొట్టు.గట్టిగా విదిలించాను..నేలకేసి కొట్టి కొట్టాను. ..జరా..కాస్త తడిని కురిపించు తల్లీ..ఇప్పుడే.. నిన్ను గంగమ్మతో పోల్చాను..మరి ఇంతలోకే..నీలో తడి ఆరిపోతే..ఎలా!? ఇక్కడ ఈ బిడ్డ చాలా ఇబ్బంది పడిపోతుంది..అంటూ..విదిల్చి కదిల్చి..విసుగొచ్చి పక్కన విసిరికొట్టి..అన్యదా శరణం పెన్సిల్..చెల్లెలా..అనుకుని పని పూర్తి చేసాను. స్కెచ్ గంగమ్మని మర్చిపోయాను.
ఆతర్వాత దుర్గ గారు పైనుండి కేక పెట్టి అడిగారు.ఏమండీ..స్కెచ్ పెన్ ఇస్తారా అంటూ..

నేను లోపలి వెళ్లి పెన్ తెచ్చేటప్పటికి  ఒక పని పడింది.

పంపులు మరలుపోయి.. నీళ్ళు కారుతున్నాయని పంబ్లర్ ని పిలిస్తే   అప్పుడే  అన్ని కుళాయిలని చెక్ చేస్తున్నాడు.ఒక కుళాయి వాషర్ మాత్రమే పోయిందనుకుంటే.. మొత్తం పాడైపోయి కూర్చుంది. దాన్ని మార్చి వేయడానికి పంపు తల పీక గానే జివ్వున్న చిమ్ముతూ గంగమ్మ  తడిపి తరింపజేస్తుంది. ఏమండీ మీరు కొద్దిగా
ఇలా వచ్చి నీళ్ళు పోకుండా పట్టుకోండి..నేను పంపు సెట్ చేస్తాను అనగానే..అటు వెళ్లి ఆ పని లో చేయి పెట్టాను. కాస్త చేతయి చేత కాక పట్టుకోవడం వల్ల కిందా మీదా నీళ్ళు పడి నేను తడిసి ..నా చేతిలో నుండి ప్రక్కనే గోడ పై పెట్టిన ఆ.స్కెచ్ తడిచినట్లు  ఉంది.  అక్కడ పని పూర్తి కాగానే..ఆ పెన్ తెచ్చి మా వర్కర్ అమ్మాయి ..లక్ష్మి కి ఆ పెన్ ఇచ్చి పైన దుర్గ ఆంటికి ఇచ్చి రామ్మా అని ఇచ్చి పంపాను. ఆ అమ్మాయి తీసుకు వెళ్ళింది .ఆ పెన్ తీసుకుని చూసి  దుర్గ గారు వెంటనే..ఏంటండీ..పెన్లో..అంతా నీళ్ళు పోసేసారు. అని గట్టిగా అడిగింది. అయ్యో! అలా ఏం పోయలేదండీ   ఇప్పుడే ..దానిపై నీళ్ళు పడ్డాయి. అన్నాను. పోయలేదు అంటారు ఏమిటి..పెన్ అంతా ఇలా తడిచి పోతేను.. అందులో ఆలా నీళ్ళు పోయకూదడూ.. ఇంకు ని పిల్ చేసుకోవాలి. ఇది అసలే ఫారిన్ పెన్ కూడాను. ఇక దీని పని అయిపోయినట్లే! డస్ట్ బిన్ లో వేయాల్సిందే..అంటూ.. ఎంతో..హార్ష్ గా ఇంకా యేదేదో నాలుగు మాటలు అనేసింది.
మా లక్ష్మి నివ్వెరపోయింది. ఎందుకంటే  ఆ పెన్ మా దగ్గరికి వచ్చినప్పటి నుండి యిప్పుడు యిచ్చేవరకు జరిగిన దృశ్యాలకి ప్రత్యక్ష సాక్షి ఆ అమ్మాయి.. నాకైయితే.. మనసు చాలా నొచ్చుకుంది. చాలా సైలెంట్ గా అయిపోయాను.

మా లక్ష్మి క్రిందకి వచ్చి ..ఆవిడేమిటి..ఆంటీ..అలా గబా గబా అన్ని మాటలు అలా  అనేసారు.. అంది.

నేనేం  మాట్లాడలేదు. నేను వెంటనే.. మా అబ్బాయికి ఓ..మిస్ కాల్ ఇచ్చాను.వెంటనే.. రెండు నిమిషాల్లోనే.. మా అబ్బాయి (అ.సం.రా .నుండి ) కాల్ చేసాడు. వెంటనే.. నేను తనతో ..యేమి క్షేమ సమాచారం మాట్లాడ కుండానే నాన్నా! నువ్వు వెంటనే ఒక స్కెచ్ పెన్ కొని పంపివ్వు ..మీ ఫ్రెండ్స్ వస్తుంటే..అన్నాను. అమ్మా..! నువ్వు ఇది చెప్పటానికే కాల్ చేసావా యేమిటి?  చెప్పు యెలా ఉన్నావ్!? అంటూ క్షేమసమాచారాలు  మాట్లాడ సాగాడు నేను సరిగా మాట్లాడ కుండా .. (బాధతో) ఊ.. ఆ..అంటుంటే..సర్లే..తర్వాత చేస్తాను. పెన్ ల సెట్ పంపిస్తానులే అని ..మాట ఇచ్చాడు.

నేను చాలా రోజులు ..ఇప్పటికి కూడా ఆ విషయం తలచుకుని బాధపడతాను. ఆమె అలా మాట్లాడేసారన్న మాట. మూడేళ్ళ నుండి.. ఎప్పుడైనా యే చిన్న సాయం కావాల్సి వచ్చినా  చేస్తూనే ఉంటానే! వాళ్ల అబ్బాయికి ఆమెకి సమాచార సమన్మయం కుదరకపోతే.. ఆ  అబ్బాయి తో ఆమెకి  యెన్నిసార్లు కాల్ చేసి  మాట్లాడించాను.  ఈ మూడేళ్ళ లో యెన్ని కాల్స్ అయి ఉంటాయి. ఆవిడ లేకపోతే పాల పేకెట్ లు,పేపర్లు,గ్యాస్ సిలిండర్ వేయించుకోవ డాలు..ఎన్ని చిన్న సాయాలు చేస్తూ ఉంటాను. ఎన్నో సార్లు చిల్లర తీసుకుని మర్చి పోతారు అయినా అడగలేను.చానాళ్ళ క్రితం బొప్ప కాయలు తీసుకుని నలబై రూపాయలు నాతో ఇప్పించి ఆ సంగతే మర్చి పోయారు. అయినా  అడగలేక పోతాను నేను. వెదవ స్కెచ్ పెన్ కోసం యెన్ని మాటలు అనేసింది..గుర్తు పెట్టుకోవాలి.పైగా ఫారిన్   పెన్ అని గొప్ప చెప్పుకోవడాలు. ఆమెకేనా పారిన్ పెన్లు ఉండేది..నేను తలచుకుంటే మా ఇంట్లో పారిన్ పెన్ ల కేస్  యే వుంచగలను (మొదటిసారి మా అబ్బాయి పారిన్లో వున్నాడు లే అని గర్వం  కొని తెచ్చుకున్నాను అన్నమాట ) చెపుతా చెపుతా.. ఆ పారిన్ స్కెచ్ పెన్ మా అబ్బాయి పంపివ్వాలి .అప్పుడు చెపుతా..ఈవిడ పని అని తెగ తిట్టుకున్నాను మనసులోనే.

ఆమె పెన్ ని నేను కావాలని నీళ్ళలో తడపలేదు..అలా అనుకోకుండా జరిగిపోయింది..అంతే! నేనైతే..ఒక వేళ అలా ఆ వస్తువుని పొరబాటున అలా పాడైపోయినా అంత కఠినంగా  అనలేను కూడా.. ..నాకు జరిగిన నష్టాన్ని  జీర్ణించు కుంటూనే.. ఏమైనా అనాలనుకుంటే..సరదాగా.. దీనికి బదులుగా  ఒక పెన్ మీ అబ్బాయిని పంపమనండి  ..అని చెపుతాను.  చాలా మంది అంతే..చాలా నొప్పించే విధంగా మాట్లాడతారు. చదువుకుని ఉంటారు..నలుగురికి మంచి మాటలు చెప్పే స్థానంలోను ఉంటారు.కానీ మాట్లాడే విధానం కుదరదు. మరి వారి స్వభావమేమో తెలియదు.ఆవిడకి సమాధానం చెప్పే రోజు వస్తుందిలే అన్నట్లు వున్నాను కూడా.. ఆ రోజు రానే వచ్చింది.

మొన్న ఈ ఆమధ్య తను కాలేజ్ కి వెళ్ళిపోతూ..రోజూ లాగానే..తాళాలు మా ఇంట్లో పెట్టారు. ఆవిడ వెళ్ళేటప్పుడు పవర్ కట్. ఆమె వెళ్ళాక ఓ..గంటకి కరంట్ వచ్చింది. వాటర్ టాంక్ లో    నీళ్ళు నిండుకున్నాయని వెంటనే మోటార్ వేసాను. ఒక అరగంట తర్వాత ఒకరికి కూడా నీళ్ళు చుక్క కూడా రావడం లేదని కంప్లైంట్. విషయం ఏమిటో అర్ధం కాలేదు. ఇంకో ఆవిడ వచ్చి దుర్గ గారి ఇంట్లో.. పంపు వదిలేసి వెళ్ళారు నీళ్ళు పోతూనే ఉన్నాయి.అందుకే టాంక్ లో..నీళ్ళు ఉండటంలేదు.. అని.ఏం చేయాలి ఒక్క క్షణం ఆలోచించాను. నాలో ఉన్న కక్ష  స్వభావం నిద్ర లేచింది.. వెదవ స్కెచ్ పెన్.. అది ఒక్క నల్ల గీత కూడా పడని  ఆ పెన్ కోసం ఎన్ని మాటలు అంది..ఏమైనా   సరే ఆ నీళ్ళు   అలా పోతూనే  ఉండాలి.అప్పుడు కాని ఆమెకి ఇంటి ఓనర్ తో..చీవాట్లు పెట్టించాలి..అని..అనుకున్నాను.

అలా..అర క్షణం కూడా అనుకున్నానో లేదో..మళ్ళీ ఆలోచన,విజ్ఞత రెండు నా కక్ష స్వభావాన్ని జోకొట్టాయి. ఛీ..ఛీ ..అలా చేయడం యేమన్నా బాగుంటుందా! ఆవిడ మతి మరపు వల్ల పైగా యితరులు యిబ్బంది పడుతున్నారు. కరంట్ ఖర్చుతో.. టాంక్ లోకి యెక్కిన నీళ్ళు అన్నీ వృధా అయిపోతున్నాయి. నీ కక్ష సాధింపుకి  సామాజిక సంపదని యెందుకు  వృధా కానిస్తావు..? తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కదా.. ఆలా వెళ్లి ఆ తాళం తీసి..ఆ పంపు కట్టేయ వచ్చు కదా.. అని మనసు ఆలోచన రెండు కలసి ఒకేమాట చెప్పాయి. అప్పుడు ..అలా తాళం తీయకూడ దేమో..అన్న ఆలోచన   వచ్చినా విరమించుకుని. ఇంకో..ఆవిడ నేను కలసి.(తర్వాత ఏ ఇబ్బందులు రాకుండా ).తాళం తీసి వంటింట్లో తిప్పి వదిలేసిన  పంపు కట్టేసి వచ్చాము.

సాయంత్రం ఆవిడ వచ్చాక.. ఈ రోజు..మేడం గారికి.. బెత్తం దండన ఉండేది అన్నాను సరదాగా (ఆవిడ లెక్చరర్ గా
చేస్తారు) అమ్మా..అలా పంపు తిప్పేసి వెళ్ళిపోతే..ఎలా !? అరగంటపైన నీళ్ళు కాల్వ  పాలు. ఇంటి ఓనరు లేరు కాబట్టి సరిపోయింది లేకపోతే.. ఈ రోజు మీకు చీవాట్లు ఉండేవి. బతికి పోయారు..అన్నాను.

ఆవిడ చేస్తున్నది మాత్రం ఏమన్నా బాగుందా? నీళ్ళ బిల్లుకి డబ్బు పుచ్చుకుంటూనే మోటార్ సరిగా వేయరు. మాకు రోజు నీళ్ళకి ఇబ్బందే! అందుకే కావాలనే  అలా వదిలేసి వెళ్లాను అంది.

మళ్ళీ.. నాకు..నోట మాట రాలేదు.. కక్షా.. ఏమిటి.. మనుషుల్లో నీవు యింత  బలంగా ఉంటావా?  సాధించ కుండా   వదలవా?  అర క్షణమైనా   ఆలోచించ నీయవా?   మనకి ఇబ్బంది కల్గిందని  అదే గుర్తు ఉంచుకుని ఇతరులకి ..కష్టమో, నష్టమో.కల్గించడం .(గుర్తుంచుకుని మరీ కక్ష సాధింపుగా) మంచి చర్య యేనా? అలా అనుకుంటే పరుల సొమ్ము పాము అనుకునే ఆనాటి నుండి..పరుల సొమ్ము పరమాణ్ణం లాంటిదని అనుకుని దోచుకు తింటున్న ఈ ధన స్వామ్య వ్యవస్థలో..సామాజిక సంపదని ఆబగా దోచేసుకుంటున్న అవినీతి పరులపై.. సామాన్యుడు కక్ష సాదించేది ఎలా...చెప్మా..!? అని దీర్ఘంగా ఆలోచనలో పడ్డాను. నాలాటి వారు ఉండకూడదు. క్షమించేసి ఎవరికో ఒకరికి ఓటు వేస్తాను.ఆమె లాటి వాళ్ళైతే..ఓటు అనే ఆయుధం తో..కక్ష తీర్చుకుంటారు అనిపించింది.అయినా ఇక్కడ అంత అర్హులు  ఎవరు ఉన్నారులే!

ఇక నేను చెప్పొచ్చేదేమంటే..మొన్నకూడా దుర్గ గారి అబ్బాయి స్కూల్ నుండి వచ్చేటప్పటికి మా ఇంట్లో తాళాలు లేవు. ఆంటీ.. ! అమ్మకి కాల్ చేస్తాను అంటే కాల్  చేయించి మాట్లాడాక.. బాబు కి.. పాలు కాచి ఇస్తాను త్రాగమని చెప్పండి మీరు వచ్చే వరకు ఇక్కడే ఉంటాడు లెండి. పాలు వద్దంటే ప్రూట్స్  అయినా తినమనండి అని ఆమెతో చెప్పాను. ఎందుకంటె..ఆ అబ్బాయి వాళ్ల అమ్మ చెపితే తప్ప ఏమి తీసుకోడు .  దుర్గ గారేమో..వద్దండి..ఒక పది రూయలు ఇచ్చి పంపండిచాలు. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అక్కడికే వచ్చేస్తాడు అన్నాక..ఆ అబ్బాయికి డబ్బు ఇచ్చి పంపాను ఒక కమలా కాయ ఇస్తే తీసుకోలేదు కూడా..నేను ఫ్రూట్స్ తినను ఆంటీ.. అని తీసుకోలేదు.
 ఇదేమిటీ అవకాశం దొరికినప్పుడు..చిన్న సాయం కూడా చేయకూడదని మనసులో గట్టిగా తీర్మానించుకున్నానే,అయినా మళ్ళీ ఇలా.. ఎందుకు చేసాను.. అని ఒక మొట్టికాయ  కూడా వేసుకున్నాను.

అప్పుడు నేననుకున్నాను. నాకు కక్ష సాధింపు చర్య  రాదు. ..కక్ష సాదించాలన్న స్కెచ్ కూడా వేయలేను.
అది నా వల్ల కాని పని అని  అర్ధమైపోయింది

నాలో మరో మనిషిని నా ఆలోచన,విజ్ఞత పైకి రానీయదు ఎప్పటికి కూడా.. నాలో ఉన్న మరో మనిషి పైకి లేస్తే.. నేను ఎన్ని జీవిత ఖైదులు.. అనుభవించాలసి  వచ్చేదో! అలా ఖైదు అనుభవించకుండా.. హాపీగా  ఉంచే.. నా ఆలోచనకి ధన్యవాదములు చెపుతూ.. కారణం లేకుండానే..నన్ను బాధించినప్పటికీ  ..నా మనసు మల్లెలా నలిగి నప్పుడు కల్గిన బాధకి క్షమాపణలు చెప్పుకుంటూ..  నాకు మనసుకు చాలా బాధ కల్గినప్పుడు వినే నాకు యిష్టమైన  ఈ పాట వినండీ!

మనసా  ఎందుకు  కన్నీరు  !  కలగనమని ఎవరన్నారు.

24, డిసెంబర్ 2011, శనివారం

గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది !

గుమ్మాలు  తొమ్మిది  గుండేమో  చిన్నది 
ఏ దారి   వచ్చావురా ..జీవా..
ఏదారిపోయేవు రా
గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది 
ఏ దారి వచ్చావురా

ఏమిటి ఇంత వైరాగ్యభావమైన పాట ని వెంటపెట్టుకుని వచ్చానని అనుకుంటున్నారా? చాలా రోజులుగా ఈ పాట పరిచయం చేయాలనుకుని.. పాట సాహిత్యం  వ్రాసుకోవడానికి తీరిక లేక..పరిచయం చేయలేదు. జాలాది గారి మరణం తర్వాత వెంటనే పరిచయం చేయాలనుకుని  వ్రాయలేకపోయిన పాట ఇది. 

మానవ జీవితమే క్షణికం.ఉన్న నాలుగునాళ్ళు  కోపం, ద్వేషం చంపుకుని..ప్రేమ మంచిని పెంచుకుని..జీవించమంటూ..సాగుతూ..తల్లి బిడ్డలా అనుబంధం గురించి చెపుతూ.. వైరాగ్యమో జీవన సత్యమో.. రెండూ..కలిపి చెపుతూ సాగే ఈ పాట కుంతీపుత్రుడు చిత్రంలో..బిట్ లు బిట్లుగా చూస్తాం. తమిళ నటీ మణి మనోరమ ఈ చిత్రంలో..నటన అలా చిరస్థాయిగా మిగిలిపోతుంది. 

ఈ చిత్రం కి..దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహిస్తే..ఎమ్.ఎమ్ .కీరవాణి గారి సంగీతం అందించారు. చాలా చోట్ల ఇళయరాజా గారి  సంగీతం అంటూ తప్పు సమాచారం ఉంది. కానీ..కీరవాణి గారి కంపోజిషన్లో ఈ పాట  ఎక్కడో.. మీటినట్లుందే సుతిమెత్తని విషాదంని  మర్చిపోలేం కూడా!

ఇక సాహిత్యం విషయానికి వస్తే జాలాది గారి సాహిత్యం చాలా బాగుంటుంది.ముఖ్యంగా "చేతి చిటికిన వేళ్ళు కలిస్తే కళ్యాణమై, కాలి బొటన వేళ్ళు కలిస్తే నిర్యా ణమై " ఎంత చిక్కని సాహిత్యం.ఆ కవి కలానికి వారి భావ పరిమళాలకి మనసుతో,ఆలోచనతో..తలవంచి నమస్కరించమూ!  నాకు అంత గొప్పదైన భావాన్ని  మిగిల్చిన ఈ పాట..చాలా విలువైన సత్యాలని చెపుతుంటుంది. అందుకే ఈపాట పరిచయం.   మధుర స్వరాల గాయకుడు..కే.జే.ఏసుదాస్..గళం.లో..ఈ పాట వింటే   ఎంత బాగుంటుందో..
రెండవ వెర్షన్ పాట.  రెండు  వెర్షన్   పాటలు లభ్యమై..ఇంకా ఆనందం గా పాటని జత చేసాను.  పైన  లింక్ లో పాటని వినండి.  పాటని కొంచెంగా ఈ  క్రింద .చూడండి (కొంచెం గా మాత్రమే లభ్యమైనది.)



 సాహిత్యం.

గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది..
ఏ దారి వచ్చావురా ..జీవా..ఏ దారి పోయేవురా.
గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది .
ఏ దారి వాచ్చావురా మరి ఏ దారి పోయేవురా
నీ కోపమే నీకు కొలిమి లాటిది
లోలోపలే నిన్ను కాల్చుతుంటది
ద్వేషమును చంపుకుని స్నేహమును పెంచుకుని
క్షేమమును ఎంచుకుని ప్రేమనే పెంచుకుని
జీవించరా నీ మేలెంచ రా
లేకుంటే నీ బతుకు ఇంతేనురా..
గుమ్మాలు తొమ్మిది గుండె మో చిన్నది
ఏ దారి వచ్చావురా ..జీవా ఏ దారి పోయేవురా..
కడుపు కోత జీవితాల కధ ఇదేనురా
కన్నీళ్లు తల్లి ఋణం తీర్చలేవు రా
పేగు తెన్చుకున్నది జోల పాడుతున్నది
కన్ను మూసుకున్నది మన్ను కలసి పోతది
ఏది నీదిరా
మరి నీది కానిదేదిరా..
భాగాల బతుకు ఎపుడు బాదేనురా..
గుమ్మాలు తొమ్మిది గుండెమో చిన్నది
ఏ దారిని వచ్చావురా..జీవా ఏ దారి పోయేవురా..

చేతి చిటికెన వేళ్ళు కలిపితే కళ్యాణమై
కాలి బొటన వేళ్ళు కలిస్తే నిర్యాణ మై
కాలమంతా తీరినా కాళ్ళు లేకపోయినా
చావ లేక బ్రతికినా బతుకు చావు కోరినా
మోత ఒకటేనురా..ఆ రాత ఒకటేరా
ఆఖరికి ఆరడుగుల నేల మిగులురా
గుమ్మాలు తొమ్మిది గుండే మో  చిన్నది
ఏ దారి వచ్చావు రా జీవా..ఏ దారి పోయేవురా
మాసాలు మోసేటి ఈ మాయ జన్మకు
వాసాల మరుపంటారా
జీవా..పోసేది తులసాకు నీళ్ళే   రా
గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది
ఏ దారి వచ్చావురా జీవా..ఏ దారి పోయేవురా..
 
ఇంత చక్కని పాటని వినండి. మనని మనం ఎప్పుడైనా విశ్లేషించుకోవాల్సి వస్తే..
మనకి..ఒక కౌన్సిలింగ్ ఇచ్చే పాట గా ఈ పాటని గుర్చుకు తెచ్చుకోండి.

పులి -ఆడపులి

పులిని చూసాను - ఆడ పులిని సమీపంగా చూడలేకపోయాను.

బాల్యం  ఎవరికైనా ..ఓ..స్వేచ్చా ప్రపంచం.

  శ్రీ శ్రీ గారన్నట్లు  వాన కురిసినా .పువ్వు విరిసినా,హరివిల్లు ప్రత్యక్ష మైనా ..అవన్నీ తమకు మాత్రమే  సొంతం అనుకునే అందమైన, అమాయకమైన బాల్యం.

నా బాల్యం చాలా మధురంగా గడచి పోయింది. అన్నయ్య చెల్లి మద్యలో..నేను.

ఎనిమి దేళ్ళ వరకు  అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. పిన్ని..మామయ్యల ప్రేమతో..పెరుగుతూ..బడికి ఎగనామం పెడుతున్నానని..మా వూర్లో అయితే..ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ పెట్టారని  అమ్మ నన్ను తీసుకొచ్చేసి  మా వూరి కాన్వెంట్లో జాయిన్ చేసింది. మా టీచర్ కి.. మా అమ్మ రెండు పూటలా పాలు పోసేవారు.కూరగాయలు అవి ఇస్తూ ఉండేది.  అందుకని ఆవిడ మాకు   బాగా శ్రద్దగా చదువు చెప్పేవారు.

మా వూరు చుట్టూ ప్రక్కల ఊర్లు అన్నింటిలోను ఘనమైనదిగా మా వూరికి  పేరుంది.అంతా మోతుబరి రైతులే ఉండే వారు.బస్ సౌకర్యం అంతగా ఉండేది కాదు కానీ అందరికి.. ప్రత్యేకంగా ఒక ఎద్దుల బండికి గూడు కట్టి ఉంచేవారు.ఇంట్లో ఎవరైనా బయటకి వెళ్ళాల్సి వస్తే మైలవరం వరకు అందులో వెళ్లి అక్కడినుండి బస్ లో వెళ్ళేవారు.

మైలవరం వెళ్ళే రూట్లో..రోడ్డు నుండి రెండున్నర కిలోమీటర్ల దూరంలో..మా ఇల్లు వచ్చేసేది. . 

మా చిన్నప్పుడు ఆ బండి ఎక్కి మా చిన్నాయనమ్మా, అత్తలు, అమ్మవాళ్ళతో కలసి  ఏడ్చి గీ పెట్టి మరీ   సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఎక్కడో..వెల్వడం ప్రక్కనే.. మైలవరం ఊరి చివర ఉన్న విజయలక్ష్మి టూరింగ్ టాకీస్ లో..ఎప్పుడు మంచి మంచి సినిమాలు వచ్చేయి.అశోక్ దియేటర్ లో కానీ తర్వాత కట్టిన  నారాయణ దియేటర్ లో కానీ అంత మంచి సినిమాలు వచ్చేవి   కావు.అలా పెద్దవాళ్ళతో కలసి చూసిన సినిమాలలో..రాము,చిట్టిచెల్లెలు,ముత్యాలముగ్గు  ఉన్నట్లు బాగా జ్ఞాపకం.

రవాణా సౌకర్యం లేకపోయినా పాడి పంటలకి , ఘోషాకి కి నెలవు అని మా ఊరికీ పిల్లనివ్వడానికి ఉరికి వచ్చే వారట. ఘోషా అంటే ఏమిటి..తాతయ్యా ! అని అని అడిగితె.. "చుట్టుప్రక్కల ఊర్లు లో యెంత మోతుబరి రైతు భార్య అయినా పొలంకి వెళ్లి పొలం పనులు చూసుకోవాల్సిందే! మన వూర్లో  ఆడవాళ్ళు అలా వెళ్ళరమ్మా..అందుకే..మన వూరి కోడళ్ళకి..కూతుర్లకి.. నాజూకయిన వారు అని పేరు. పిల్లలని ఇవ్వాలన్నా చేసుకోవాలన్నా.. మన వూరికి ప్రాధాన్యం  ఇస్తారు" అనేవారు.

మా నాయనమ్మ,తాతయ్య ప్రేమ మూర్తులు. మా ఇల్లు ఎప్పుడు చుట్టపక్కాల రాకపోకలతో..చాలా సందడిగా ఉండేది.  నాయనమ్మ ,తాతయ్య తెల్లవారుజ్హామునే లేచి చుట్టపక్కాల విషయాలు చెప్పుకుంటుంటే.  మండువా ఇల్లు మాది..గదులకి పైన గోడలు పూర్తిగా కట్టి ఉండేవి కాదు. వాళ్ళ మాటలు బాగా అందరికి వినబడేయి. అమ్మ విసుక్కునేది. మెలుకువ రావడం ఆలస్యం వీళ్ళకి ఎప్పుడు చుట్టాల కబుర్లే!నేను దుప్పటి ముసుగు తీయ కుండానే..భలే శ్రద్దగా వినేదాన్ని.చాలా సందేహాలు ఉండేయి కూడా! మళ్ళీ తెల్లవారినాక  అడిగితే  చాలా వివరంగా చెప్పడం మా తాతయ్య ప్రత్యేకత.

మావూళ్లో నా చిన్నప్పుడు లైబ్రరి దగ్గర రోజు రాత్రి పూట రామాయణం వినిపించేవారు. నేను రోజు నాయనమ్మ వెంట..ఓ..చాప,దుప్పటి వెంట బెట్టుకుని వెళ్లి అక్కడ చాప పరచుకుని...విసుగు వేస్తే  నాయన్నమ్మ వళ్ళో పడుకుని,చలివేస్తే దుప్పటి కప్పుకుని  ఆవలింతల మద్య ఎలాగోలా విని వచ్చేదాన్ని. ఆంజనేయ స్వామి  సూర్యుడిని మామిడి పండు అని తిన బోయాడట.అందుకే ఆయన మూతి అలా వచ్చినదని చెప్పడం గుర్తు. రామాయణం అంతా విని రాముడంటే భక్తి కల్గింది.అన్నీ   ఉన్న మా వూరిలో..గుడి ఉండేది కాదు..

అంటే అసలు గుడి లేదని కాదు. ఉంది.ఆ గుడిని, రాముడిని పట్టించుకోకుండా .. దేవాలయం భూములన్నీ మింగేసి.. నైవేద్యం కూడా పెట్ట కుండా తాళాలు వేసేసారన్నమాట.ఆ గుడికి ఒక ప్రత్యేకత కూడా ఉందని చెప్పేవారు. భద్రాద్రిలో..సీతా రాములవారి గుడికి ఉన్న ప్రత్యేక వాస్తుతో..అదే మాదిరి ఉందని చెపుతారు. కానీ గుడి ని ఎవరు పర్యవేక్షించక మూసి పెట్టి ఉండేది.

అమ్మా..నేను రాముడిని చూడాలమ్మా..అంటే "వద్దు.. ఏళ్ళ తరబడి పాడుబెట్టి ఉంచారు. అంతా జిల్లేళ్ళు.సీమతుమ్మలు.పురుగు పుట్రా ఉంటాయి..వెళ్ళవద్దు"  అనేది. ఒకవేళ అలా అన్నప్పటికి కూడా  నేను వెళ్ళే తీరతానన్న సందేహం వచ్చేదేమో.. మళ్ళీ వెంటనే అక్కడ ప్రక్కనే ఉన్న మర్రి చెట్టుమీద దెయ్యాలు ఉంటాయి వేళ్ళకు అనేది. అయినా   నేను  దారి చేసుకుని వెళ్ళా ననుకోండి. లోపలి వెళ్లి తలుపుని తీద్దామనుకుంటే అక్కడ ఓ..పెద్ద తాళం వేసి ఉంది.  నిలువెత్తు పెరిగిన జిల్లెల్ల మధ్య నుండి దారిచేసుకుని నైరుతి మూలనున్న మండపం ఎక్కి కూర్చున్నాను. అలా పైకి   చూద్దును కదా..నల్లగా..ఏమిటో..వేలాడుతూ..కనిపించాయి. అవే దెయ్యాలనుకుని   ఒకటే పరుగు. మద్యలో..పడి లేచి వెళ్ళేటప్పటికి అక్కడ పెరిగిన చెట్ల  ముళ్ళు కొమ్మలు గీసుకుపోయి.. స్నానం చేయించేటప్పుడు అమ్మకి కనబడి.. మళ్ళీ రెండు దెబ్బలు వడ్డింపు . "ఎందుకు  వద్దన్న  పనే చేస్తావని..."

స్కూల్కి వెళ్ళడం,చదువుకోవడం సాయంత్రం   అయితే చాలు  పిల్లలందరూ   చేరి ఒకటే..ఆటలు పాటలు. తినడానికి బోలెడు అప్పచ్చులు   సిద్దంగా ఉండేవి. పచ్చీసు ఆటలు,కోతికొమ్మచ్చి,వెన్నెల కుప్పలు, చింత పిక్కలాట..కుందుళ్ళు,కబాడీ..దాగుడుమూతలు. గోలీలాటలు..అన్నీ ఆడేవాళ్ళం. నాతొ మా అన్నయ్య ఉండేవాడు.  పిల్లల మధ్య ఆటల్లో ఆడమగ తేడానే లేదు.      ..

పెద్దవాల్లేమో వాళ్ళ  వాళ్ళ కబుర్లు తో బిజీ గా ఉండేవారు . సెలవల్లో సినిమాలు..మామిడి తోటల్లో..తిరగడం,ఏ రుతువులో వచ్చే కాయ గట్రా.. పిందేలే తెంపడం, జామకాయలు దొంగతనంగా కోయడం,వగరు అని విసిరి కొట్టడం ..మధ్య మధ్యలో..కొట్లాటలు..పిర్యాదులు.. మా అన్నయ్య  గొడవలు వద్దని వెనక్కి లాగిన కొలది..నేను వెళ్లి మరీవాళ్ళని  కొట్టి రావడం మాములుగా ఉండేది.మళ్ళీ తెల్లవారితే.. చేయి చేయి కలపడం  మా బుడమేరు వాగులో ఆడడం,చెలమలు తీయడం పరుగులు తీయడం  ఓహ్..అంతా ఆనందమే! అక్కడ అడ్డుకట్టలే లేవు.

మా పెద్ద నాన్న గారింట్లో రేడియో ఉండేది. అందులో వచ్చే వార్తలు వినేవాళ్ళం .పాటలు వినేవాళ్ళం. ఆదివారం వస్తే మధ్యాహ్నం మూడు గంటలకి..సినిమా వచ్చేది. అందరి రేడియో చుట్టూ కూర్చుని సినిమా వినేవారు." కోరికలే  గురాలైతే" సినిమాని  అలాగే విన్నాను.

మా అమ్మ , అక్క ,.పెద్దమ్మ తలా ఒక వార పత్రిక తెప్పించుకుని.. మార్చుకుంటూ చదువుకునేవారు. వనితా జ్యోతి,ఆంద్ర జ్యోతి,ప్రభ పత్రికలూ వచ్చేవి. జ్యోతిలో  .."రాధాకృష్ణ' సీరియల్ వచ్చేది. నేను ఆ సీరియల్ చదవబోతుంటే "..నీకెందు..నువ్వు చిన్న పిల్లవి.. ఇది చదవకూడదు అని  అక్క కసురుకుంటే.. మా అమ్మ మాత్రం కొన్ని మాచేత చదివించేది. పుస్తకాలు చదవాలని చెప్పేది. మా వూరి లైబ్రరీలో..పుస్తకాలకి.. ముప్పై రూపాయలు డిపాజిట్ కట్టి మరీ పుస్తకాలు తెప్పించి తను చదివే వారు.మా చేత చదివించేది కూడా !.

నాకు తొమ్మిది ఏళ్ళప్పుడు దివిసీమ తుఫాను వచ్చింది.  అంత వర్షం ఉరుములు కి భయమేసింది  నేనా రోజయితే.. పెందలాడే అన్నం తినేసి.. మంచం పై పడుకోకుండా.. మంచం క్రింద దూరి పడుకున్నాను. మేము పడుకునే గదిలో..దక్షిణపు వైపు ఒక పెద్ద  కిటికీ  ఉండేది. ఆ కిటికీ రెక్కలు పెద్దగా వీచే గాలికి కొట్టుకుంటూ.. ఆ తలుపు  సందులో నుండి  పెద్ద పెద్ద మెరుపులు,తర్వాత వచ్చే  ఉరుములు  అంటే..నాకు చచ్చే భయం వేసేది.(ఇప్పటికి ఉరుము అంటే భయమే.) ఇక భయమని అలా పడుకున్నానా..మళ్ళీ  తెల్లవారి లేవడమే.. నాకు..ఉప్పెన బీభత్సం గాని... అసలేమి   తెలియవు.. అగ్ని శిఖలు కనబడినాయి అని చెప్పుకుంటుంటే.. భయమేసింది. కథలు కథలుగా పేపర్లో చూసి చెప్పుకోవడం, వినడం..ఒక నెల రోజులంతా అవే కబుర్లు. బోలెడు  మంది చనిపోయారని ఎక్కడ చూసినా శవాల గుట్టలు కనబడ్డాయని చెప్పుకునే వారు.  మా వూరి నుండి..బట్టలు,బియ్యం,దుప్పట్లు.(క్రొత్తవే) పోగేసి పంపారు కూడా..

ఆ తుఫాను వచ్చిన రోజు ఇందిరా గాంధి పుట్టిన రోజని చెప్పుకున్నారు.

ఇందిరా గాంధి అంటే నాకు అప్పట్లో..చాలా ఇష్టం..జాలితో వచ్చిన ఇష్టం కూడా.ఏమో!.

ఒక రోజు ఆవిడ ఫోటోని..అది ఉయ్యాల బల్లలో..కూర్చుని.. నెత్తిన చీర చెంగు వేసుకుని చాలా దిగులుగా కూర్చున్న ఫోటో.ని .పేపర్ లో వేసారు. అందరూ ఆ పేపర్త చూస్తూ తగిన శాస్తి జరిగిందని చెప్పుకుంటున్నారు. మా అమ్మని అడిగాను "ఎవరమ్మా  ..ఆవిడ" అని .

మన దేశ ప్రధానిగా చేసి మంచి గా నడుచుకోలేదు.అందుకే   అందరూ అందరూ  ఒట్లేయకుండా  ఓడిపోయేటట్లు చేసారు  .అని చెప్పారు . అయినా ఒక ఆడమనిషి దేశ ప్రధానిగా చేయడం కూడా..చాలా గొప్ప.  ఈ సారి మళ్ళీ ఆవిడే ప్రధాని అవుతారు కూడా..అని  అంది. . ఆ పేపర్ తీసి దాచుకుని ఇందిరా గాంధి నే చూస్తూ ఉండేదాన్ని.   .ఇప్పుడు ఇందిరా ప్రసక్తి  ఎందు కంటారా?    ఇంకొంచెం  ముందులో..అదే చెప్పబోతాను కాబట్టి.

ఇక ఆతర్వాత సంక్రాంతి సెలవలు వచ్చినప్పుడు.. అమ్మ వాళ్ళు తెల్లవారుజ్హామునే లేచి ముగ్గులు పెట్టుకుంటుంటే..నేనేమో..మెల్లగా లేచి.. బయటకి పరిగెత్తాను ఎక్కడికంటే  ఊరికి ప్రక్కనే  పెద్ద పెద్ద స్థలాలు ఉండేవి   .వాటిని  వామిలి దొడ్లు అనేవాళ్ళు.. కంది కంప, గడ్డి వాములు వేసుకునే స్థల్లలు.ఆ దొడ్లలోనే..కూరగాయల పాదులు వేసేవారు. హద్దులలో.. చింత చెట్లు ఉండేవి. సంక్రాంతి సమయానికే అక్కడో కాయ ఇక్కడో కాయ చింత కాయలు పండి రాలుతూ ఉండేవి.ఆ కాయలు తింటుంటే..అబ్బ ఎంత పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండేవో!  అందరికన్నా ముందు లేచి వెళ్లి  వాటిని ఏరుకుని.. గర్వంగా ఊరించుకుంటూ తినడం గొప్ప,ఆనందం కదా..! చీకట్లో.. ఏం ఆరిపోయింది..అలా..కంపలంపట తిరిగి చింతకాయలు ఏరడం..ఎందుకు?. తర్వాత తెచ్చుకోకూడదా అని అమ్మ కోప్పడుతుందని... అలా మా అమ్మకి కనబడకుండా మెల్లగా జారుకుని..ఇల్లు దాటగానే ఒకటే పరుగులు తీశాను. అప్పుడు చాలా బాగా మంచు కురుస్తుంది.అలా నేను పరుగు పెడుతూ.. పెడుతూ..మా వామిలి దొడ్డి సమీపం లోకి  వెళ్ళబోతూ ఆగి పోయాను.

ఎందుకంటారా? మీరు ఎప్పుడైనా పులిని చూశారా !? జంతు ప్రదర్శన శాలలోనో (ఇప్పుడు యు ట్యూబ్ లోనో ..కాదు)..నిజంగా.. అన్నమాట.

అప్పటకి నేను పులిని బొమ్మగా పుస్తకాలలో..చూసాను. బొమ్మగా చూసినదిగా ఎదురుగా కనబడుతుంటే..

నాకు గుండె ఆగిపోయింది.  ముందు గేదె పడ్డ ఏమో అనుకున్నాను. కానీ బాగా చూసాక  అర్ధం అయింది.అది పులే..అని. బొమ్మలా అలా కదలక మెదలక రాతి స్తంభం అంటారే ఆ మాదిరి గా నిలబడి పోయాను.  నా ఎదురుగా నుండే పులి.. అడ్డంగా నడచుకుంటూ వెళ్ళిపోయింది.అదృష్టవశాత్తు పులి నన్ను చూడలేదు అనుకున్నాను .ఇక అంతే.!. వెనక్కి తిరిగి ఒక్క దూకులో ఇంటికి వచ్చి పడ్డాను. అంత చలి కాలంలోనూ వళ్ళంతా చెమటలు.. వెళ్ళడం వెళ్ళడం..మా తాతయ్య దగ్గరికి వెళ్లి ఆయన పక్కన పడుకున్నాను. అలా అలవాటే కాబట్టి ఆయన ఏమి అనకుండా.. ఏదో..అడుగుతూంటే   అసలు చెప్పలేదు. వణికి పోతుండటం చూసి. ఏమిటని అడిగితే..  పులిని చూసాను అని భయం భయంగా చెప్పాను. నమ్మలేదు. ఎలా ఉంది అంటే  గుర్తుకు తెచ్చుకుని చారలు వేసుకుని పచ్చగా ఉంది తాతయ్యా    ..తోక కూడావేలాడి  మళ్ళి పైకి తిరిగి ఉంది అని చెప్పాను. ఆవు అయిఉంటుందమ్మా ..అన్నారు." ఏం కాదు పులే! "అన్నాను గట్టిగా..'

:సరే..భయపడకు..అటు ఇటు కొండలు ఉన్నాయి కదా! తిరుగుతుంటాయి లే"..ఆన్నారు.

అదే రోజు సాయంత్రానికి ఇంకొందరు పులిని చూసామని చెప్పాక కానీ   తాతయ్య నమ్మారన్నమాట.
అలా వెళ్లబాకు.మనిషి రక్తం మరిగిన  పులి కాదు  కాబట్టి ఎవరిని ఏమి చేయడం లేదు. లేకపోతే చాలా ప్రమాదం అని చెప్పి..మీ అమ్మకి చెప్పకు..అలా తిరగ వద్దని ఇక నీకు రోజు కాళ్ళకి తాళ్ళు కట్టి కట్టిపడేస్తుంది అని.   అదే మాట మళ్ళీ  మళ్ళీ  గట్టిగా చెపితే..అప్పటికి  బుద్దిగా తల  ఊపేసి.. రెండు రోజులకి.ఊర్లో పిల్లలందరికీ కథలు కథలుగా వర్ణించి పులి గురించి చెప్పేసి.. కాలరు (ప్రాక్ కాలరేలెండి)   ఎగరేసాను.ఆ నోటా ఈ నోటా పెద్దాళ్ళ నోట్లో పడి.. మా అమ్మకి తెలియనే తెల్సింది.అప్పుడు అమ్మ  గబుక్కున వాటేసుకుని..ఏడ్చేసి..  అలా దొడ్లేమ్మడా .తోపులలోను ఆడవద్దని ఒట్టు పెట్టిన్చుకుంది. అప్పుడు కొట్టలేదు. చాలా సంతోషం వేసింది కూడా.. అప్పుడలా  నేను పులిని చూసిన అనుభవం యెంత గర్వంగా ఉంటుందో! ఆ పులి ఎంత దర్జాగా..టీవిగా నడచి వెళ్లిందో..నాకు ఇప్పటికీ  గుర్తే!  ఆ తర్వాతెప్పుడు ఇందిరా గాంధి - పులి రెండే గుర్తుకు వచ్చేవి . ఇందిరా గాంధీ  గురించి వివరంగా చదివి తెలుసుకున్నాను కూడా.. ఆమె అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది.




తర్వాత విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఇందిరా జీ వస్తున్నారని తెలిసి నాకు చాలా సంతోషం. దగ్గరలోకి వస్తున్న ఆమెని  ఎలాగైనా చూడాలని ఆరాటం.  మా వూరి నుండి..ట్రాక్టర్ల లోను ,లారీలలోను చాలా మంది ఆమెని చూడాలని   వెళుతున్నారు. అప్పుడు . అమ్మ దగ్గరరికి వెళ్లి ".అమ్మా ..నేను ఇందిరని చూడాలమ్మా..వెళతాను "అని అడిగాను .. అమ్మ..ఎప్పుడు మాదిరే.!.వద్దు..ఆడ పిల్లలు అలా వెళ్ళ కూడదు.జనంలో..పిల్లలు నలిగి పోతారు.ఇంకెప్పుడైనా చూడవచ్చులే!అని బుజ్జగించింది.  ఛీ! ఈ అమ్మలు ఎప్పుడూ..ఇంతే! ప్రతి దానికి జాగ్రత్తలు..ఆంక్షలు.. అనుకుని.. వీలైనంత నిజం ఏడుపే ఏడ్చాను..కూడాను. అయినా అమ్మ మనసు కరగనే లేదు. నాకు కోపం వచ్చింది. ఆమెతో..ఓ..రోజంతా మాట్లాడలేదు కూడా. ఆ మర్నాడు..పేపరంతా..ఆమె గురించి వార్తలే.! ఆమె చురుకైన నడక గురించి..నలగని చీర గురించి.. మాట తీరు  గురించి..భలే చెప్పుకుంటుంటే.. మళ్ళీ.. ఏడుపు.. అంత దగ్గరలోకి వస్తే ప్రత్యక్షంగా చూడలేక పోయానే నన్న .ఆ బాధ అంతా ఇంతా కాదు.

తర్వాత  నాకు  ఆమెని చూసే అవకాశం రాలేదు. ఆవిడ లేరు..

ఎప్పుడూ  అనుకుంటూ ఉంటాను.

 "పులిని చూసాను-ఆడ పులి లాటి ఇందిరని చూడలేకపోయాను" అని.

ఇది..నా బాల్యంలోని ..ఓ..నెమలీక.


(ఆంధ్ర జ్యోతి  దిన పత్రిక "నెమలీక ' శీర్షికలో..ప్రచురితమైనది తేది గుర్తులేదు)

22, డిసెంబర్ 2011, గురువారం

నిశ్శబ్ద సంగీతం.

నిశ్శబ్ద సంగీతం.

శ్వాస శ్వాస తో చెప్పిందట
ఇది ఒక సంగీతమే అని.
ఎద లయలే జతులు,గతులు,సంగతులై
అదే ఝురి ప్రవాహమైనట్లు..
అందులో మునక లేస్తున్నట్లు
మరో మనిషి ఆచూకి లేని ..ఓ..మూల గదిలో..
పూరింపబడిన నిశ్శబ్దం.. ఒక సంగీతం
ఎక్కడో.. వినవస్తున్న పక్షుల కిల కిలలు
పిచ్చుకుల కిచ కిచలు..
ఎంత బిగించి పెట్టినా సరే సందు దొరికితే చాలు
టప్ టప్ మని కారే నీటి బొట్లు..
అప్పుడప్పుడు వెళ్ళే వాహనాల చప్పుడులు..
అవసరమైతే తప్ప పెదవి దాటని మాటలు
గాలిపూరింపక పలకని రవంలా
మీటకుండావదిలేసిన వీణలా
సవ్వడి చేయని చలిమరలు
గిర్రున తిరగని రెక్కల యంత్రాలు.
ధ్వని ముద్రణ ని వినిపించని బుల్లి పెట్టెలు.
హొరా హోరి కనబడని కథనాలు
వినబడేది అంతా.. ప్రాణ సంగీతమే
ఆ నిశ్శబ్ద యుద్దాన్ని చేదిస్తూ.
రుబ్బురోలు లో తిరుగాడే పొత్రం బర బరలు
తుక తుక ఉడుకుతున్నఅన్నం వాసనలు
మర్చిపోయిన జాడలని వెదికి ఇస్తూ..
పిల్లని పుట్టింటికి పంపేసిన అల్లుడిలా
సిగ్గుతో.. మొహం చాటేసినట్లు
ఒంట్లో నరాలకి జడత్వం వచ్చినట్లు
వేలాడే తీగల్లోను ప్రాణం లేనట్లు
తలపించే నిర్జీవ జీవనయానం

గంటలకి గంటలు ఆచూకి లేకుండా
అనంత ప్రవాహంలా సాగే విద్యుత్ కి
ఆనకట్టవేసినట్లున్న కోతలకి ..
మారక తప్పని మార్పుకి ....

 
చేరికైన సహజత్వానికి
అలవాటు పడుతున్న.. ఓ . శబ్ద ప్రేమికి
సర్వ జన సమ్మోహిత స్వర సంగీతం
నిశ్శబ్ద సంగీతం..



(హృదయానికి చెవులుంటే.. జగమంతా నాదమయమే . అని ఓ..కవి గారు వ్రాసినట్లున్నారు. ఏ పాటో సరిగా గుర్తు లేదు.రోజుకి ఏడెనిమిది గంటలు విద్యుత్ కోతకి అలవాటు పడి .. సహజత్వాని దగ్గరైన నా స్పందన.)

19, డిసెంబర్ 2011, సోమవారం

రాకోయి అనుకోని అతిధి

నువ్వు వస్తానంటే..నేనొద్దంటానా !? అనేది ఈ తరం వారి ఆనవాయితీ ఏమో కానీ..

ఒకప్పటి ఈ పాట.. యెంత మంది నోళ్ళలో మధురంగా నాని.. ఏ చుట్టమో..ఆత్మీయులో ఇంటికి చెప్పా పెట్టకుండా విచ్చేస్తే..ఈ పాట ని గుర్తుకు తెచ్చుకునే విధంగా .. ఉంటుంది ఈ పాట. అత్యంత సహజాతి సహజంగా..వ్రాసిన ఈ పాట ..పాలగుమ్మి పద్మ రాజు గారి సాహిత్యం.

ఇప్పుడైతే ఓ.. ఫోన్ కాల్ చేసి రాకూడదూ..అంటాం. కాల్ చేయకుండా వచ్చేవారు..మర్యాద తెలియని వారు. వారికి జరపాల్సిన మర్యాదల విషయం అటుంచి.. మన పనులు అటకెక్కి కూర్చుంటాయని మనసులో పీకులాట. లేదా ఎక్కడికో వెళ్లాలనుకుని సిద్దం అయినాక అతిధి వస్తే.. పొమ్మనలేక పొగ పెట్టడానికి పొయ్యిలు ఎక్కడున్నాయి చెప్పండి?మహా అయితే కావాల్సి వస్తే. టీ వి పెట్టి.. తెగ చానల్స్ మార్చేయడం లేదా..పిల్లలని విసుక్కోవడం చేస్తే చాలు వచ్చిన వాళ్ళు పరారవుతారని ఒక శ్రేయాభిలాషి రహస్యం చెప్పారు లెండి.

సరే..ఈ పాటలో చూస్తే..ఆమె .. రాకోయి అనుకోని అతిధి... కాకితో కబురైనా పంపకుండా రాకోయి అతిధి అంటుంది.

ఓ..కన్నె పిల్ల మనసులోనికి అనుకోకుండా హటాత్తుగా ప్రవేశించే వాడు.. అనుకోని అతిధి లాటి వాడు. వాకిట తలుపులు తెరవలేదు..(మనసు తలుపులు కూడా అనుకోవచ్చు)ముంగిట ముగ్గులు తీర్చాను లేదు ..అంటుంది. ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు ఇల్లు-వాకిలి పరిశుభ్రంగా లేకుండా.. వాకిట్లో..అందమైన ముగ్గు లేకుండా ఉంటె ఏం బాగుంటుంది. అందులో..వచ్చే వాడు..మనసెరిగిన వాడు అయితే..అతనికి ఆహ్వానం పలుకుతున్నట్లు మనసులో మాటతో..మనోహరమైన రంగవల్లిక వేసి ఆహ్వానించాలని అనుకుంటుంది కదా!

అలాగే సిగలో పువ్వులు ముడవాలంటే మల్లెలు విచ్చుకోనేలేదు..ఇంత ప్రొద్దుటే వస్తానంటే ఎలా? కాస్త పూలు పెట్టుకుని అందంగా..పరిమళాలు పంచుతూ.. నిన్ను ఆహ్వానిన్చవద్దు.అని అంటూ.. కన్నులకి కాటుక అయినా దిద్దుకోవాలనుకున్నాను.కానీ  కాటుక లాటి చీకటిలోనే.. ఇంకా నిదర నీడలాగే ఉంది .. పాలు,వెన్నలు తేనే ఇవేమీ లేకుండా.. పంచ భక్ష్య పరమాన్నములు చేయనూలేదు. వేళ కాని వేళ వస్తే అతిధి సత్కారాలుఎలా చేయను!?. మధురమైన పదార్ధాలు లేకుండా విందు ఎలా ఇవ్వను.?

అందుకే రాకోయి అనుకోని అతిధి అంటుంది.

దారిన పోతూ పోతూ.. ఊరికనే ఓ..మారు చూసి పోదామని వచ్చావా? లేక నీ నడకలో..పనులలో అలసి అలసి సేద తీరాలని వచ్చావా?
ఒకవేళ ఒంటరిగా ఉన్నానని తెలిసి కూడా వచ్చావా? నేను నిన్ను లోనికి రమ్మనుటకు సాహసించి పిలువలేను. వలదని చెప్పలేను. వద్దని చెప్పడం కూడా మర్యాద కాదు కదా!ఈ వేళ కాని వేళలో..త్వరపడి రాకోయి అనుకోని అతిది..అంటుంది.

ఈ అందమైన ముగ్ధ మనోహర రూపం ఎంత బాగుందో.. పాట కూడా..అంత బాగుంటుంది.చూడండీ!!


శ్రీ రాజ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్

రాకోయి అనుకోని అతిధి
కాకి చేత కబురైనా పంపక
రాకోయి అనుకోని అతిది
వాకిట తలుపులు తెరువనె లేదు
ముంగిట ముగ్గులు తీర్చనే లేదు
వేళకాని వేళ
ఈ వేళ కాని వేళ ఇంటికి.. రాకోయి అనుకోని అతిది
సిగలో పువ్వులు ముడవాలంటే
సిరిమల్లెలు వికసింపనేలేదు
కన్నుల కాటుక దిద్దాలంటే
నిద్దుర నీడలా వీడనే లేదు
పాలు వెన్నెలు తేనే లేదు
పంచ భక్ష్యములా చేయనే లేదు
వేళ కాని వేళ ఈ వేళ కాని వేళ
విందుకు రాకోయి అనుకోని అతిధి
ఊరక దారిన పోతూ పోతూ
అలసి వచ్చితివో
ఒంటరిగా ఉన్నానని తెలిసి వచ్చితివో
రమ్మను టకు సాహసం చాలదు
పొమ్మనుటా మరియాద కాదది
వేళ కానివేళ.. ఈ వేళ కాని వేళ త్వరపడి
రాకోయి అనుకోని అతిధి

పెండ్యాల నాగేశ్వర రావు గారు స్వరకల్పన లో.. సుశీలగారు పాడిన పాట ఇది. నాకు చాలా ఇష్టమైన పాట.

చాలా రోజులుగా వీడియో కోసం వెదుకుతున్నాను. ఇవాళే దొరికింది.చూసి బాగుంటే ఓ..ముక్క చెపితే..జయప్రదని ఎంతగానో అభిమానించే నేను సంతోషపడతాను. అందులో..ఆమె బాపు బొమ్మ కూడా.. ఈ చిత్రంకి బాపు దర్శకత్వం. ఈ చిత్రంలో..పాటలన్నీ ఆణిముత్యాలే!


18, డిసెంబర్ 2011, ఆదివారం

మన్ మేరా దుష్మన్



మన్ మేరా దుష్మన్

నేను  కోరుకున్నది  నా  ముందున్నా
అందుకునేందుకు చేయి కదల్చనీయవు
అడుగు ముందుకు పడనీయవు
సంకెళ్ళతో కట్టి పడేస్తావు
ఒక్క క్షణం అవునంటావు
ఆ మరుక్షణమే వలదంటావు
ఆలోచనతో అరక్షణమైనా  కలవనంటావు

అంతలోనే అద్దం లాటి నాలో నిన్ను చూసుకోమంటావు
నిన్ను ఎరిగినవాడు దేవుడట
అందుకేనేమో !నీ కళ్ళకు గంతలు కట్టి
జీవితంతో దోబూచులాటాడుకుంటాను

నిన్ను ఓడిసిపట్టడం చేతనవక
కవ్విస్తావంటాను
నవ్విస్తావంటాను
రగిలిస్తావంటాను

నువ్వుంటే మెలుకువలోనూ
 కలలూరుతుంటాయి
కళ్ళలో నదులు నిల్వుంటాయి

వాస్తవికత-బ్రాంతి మద్య ఊగిసలాడుతూ
నిన్ను మట్టు బెట్టి
జీవిత సౌధాన్ని  ఆడ్డం గా నిలబెట్టుకుంటూ
అప్పుడప్పుడు చిక్కి శల్యమై
నీ ఉనికి నిరూపణ తో
ఓడానని తలదించుకుంటాను

ఎన్ని గాధలకి వస్తువయినావు
రాతి గోడల వెనుక చెమ్మగా మిగిలావు
నువ్వు చెప్పినదే చేస్తానని
గొప్పగా చెపుతుంటాను కానీ
ఆచరణ లో నేను ఒక మర బొమ్మని .

నువ్వు నా ఆలోచనలోను లేవు
నా ఎదురుగాను లేవు
కానీ నువ్వు నాలోనే ఉన్నావు
ఎప్పుడు ..ఎప్పుడు..ఎల్లెప్పుడూ..
నువ్వు నా ప్రధమ శత్రువువి
నా మనసు వి .

 

16, డిసెంబర్ 2011, శుక్రవారం

స్త్రీలను స్త్రీలే ఈర్ష్య పడాలా !?

నేను చెప్పడం మొదలెట్టాను అని అక్కడ చెప్పడం ఆపాను కదా..! అక్కడి నుండి..చెప్పడం మొదలెడతాను. నాకు చిన్నప్పటి నుండి రేడియో వినడం అలవాటు. ఇప్పటికి కూడా.. రేడియో వినడం మానలేదు. ఆ ఒక్క ప్రసారసాదనం చాలు..ఇప్పుడు మనకి ఈ బ్లాగ్ లో ఉండని విషయాలు కూడా అక్కడ వింటాం. అవగాహన పెంచుకుంటాం. అనవసర విషయాలు ఉండవు అక్కడఅందుకే రేడియో వినడం నాకు చాలా చాలా ఇష్టం కూడా.. ఆర్.జే గా చేయాలని ఉబలాటం కూడా. అయితే..నాకు వయో పరిమితి ఉన్నప్పుడు ఆ ఆలోచన కలగలేదు.ఈ ఎఫ్.ఎమ్ సందళ్ళు మొదలయ్యాక ఇప్పటి ఆర్.జే లని చూస్తే..వాళ్ళని ఆ సీట్ లోనుంచి ప్రక్కకి తోసి పడేసి..ఆ సీట్లో..కూర్చుంటే..వారికన్నా ఇరగదీసే..పెర్ఫ్హార్మేన్స్ చూప వచ్చు అనుకుంటాను.(వాళ్ళు అంత చెత్తగా చేస్తుంటారు కాబట్టి.) నిజంగా చాలా మంది ఆర్.జే లు అంటూ ఉంటారు "వనజ గారు మీలా ఉంటె..మిమ్మల్ని కలుపుకుని ప్రోగ్రామ్స్ చేస్తే..సూపర్ ఉంటుంది అంటారు." నాకు ఇష్టం కలుగుతుంది.కానీ..వయో పరిమితి అన్నాను. అప్పుడెందుకు ట్రై చేయలేదు అంటే..అప్పుడు ఆ ఆలోచనలేదు అంటాను. ఇప్పటి మీరు ట్రై చేయండి న్యూస్ రీడర్ గా ఈజీగా సెలెక్ట్ అవుతారు అంటారు. అవును ఇంకో రెండు మూడేళ్ళ వరకు అర్హత ఉంది బుద్ది పుడితే ట్రై చేస్తానులే.. అయినా వార్తలు ఏం చదువుతాం.అంతకన్నా శ్రోతగానే ఎక్కువ కక్క వచ్చు అంటాను ఎక్కెసంగా. ఫ్రెండ్స్ ..విసుగేస్తుందా!?.. మీరు ఫాలో అవక తప్పదు .. ఎందుకంటే..ఇక్కడే..నేను చెప్పబోయే విషయం ఉంది. సరే ఇలాగే మాట్లాడుతుంటే .మా ఫ్రెండ్స్ చూస్తున్నారు..ఆసక్తిగా.. 

 మేము దాదాపు పదమూడు ఏళ్ళు నెల్లూరు ..కి సమీపంలో.. మా వ్యవసాయ క్షేత్రంలో ఉండేవారం. అక్కడ ఈ రోజు పేపర్ రేపు చూడటం,ఎవరైనా ఉత్తరాలు వ్రాస్తే ఓ..నాలుగు అయిదు రోజులు ఆలస్యంగా చదువుకోవడం, ఇంట్లోవాళ్ళు కట్టి పడేయకుండా దయతలచి విననిస్తే..రేడియో..వినడం దూరదర్శన్ ప్రసారాలు చూడటం.అలా  గడిచిపోయేవి రోజులు . 

అలాటి రోజుల నుండి.. సడన్గా.. హోం టవున్ లోకి వచ్చి పడ్డాక రేడియో బాగా వినడం, కార్యక్రమాల పై అభిప్రాయాలు తెలుపుతూ..ఉత్తరాలు వ్రాయడం, ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం ...అబ్బో..అవన్నీ గోల్డెన్ డేస్. నాకైతే..  ఆ అనుభవాలు పంచుకోవడం అంటే మామిడి కాయ పచ్చడి లో టెంకె నమిలితే వచ్చే జిహ్వానందం తో..పోల్చుకున్నట్లు అన్నమాట. ఆకాశ వాణి విజయవాడ కేంద్రం వారైతే..నన్ను మెచ్చి..నాకు ఉత్తమశ్రోతగా గుర్తింపు నిచ్చి నాతో .. ఒక పరిచయ కార్యక్రమం ఇప్పించి..పారితోషికం ఇచ్చి ..ఒక ఫోటో తీయించి.. ఆ ఫోటోని నాలుగు నెలలపాటు ఆకాశవాణి ఫోటో ప్రేమ్(విజిటర్ డిస్ప్లే ) లో.. బంధించి ఉత్తమ శ్రోతగా మరింతగా గుర్తింపు ఇచ్చారు. అప్పటి ఆ కార్యక్రమం .. మెచ్చి అక్షరాల నూట ఎనిమిది ఉత్తరాలు ఆకాశ వాణికీ వచ్చాయని..ఉత్తరాలు కార్య క్రమం చదివే వారు చెప్పడం నాకు (చాలా ఆనందం ఏమిటి..నా బొంద) ఎవరెస్ట్ ఎక్కిన ఆనందం అంటే నమ్మండి. నాలో అంతర్లీనంగా ఉన్న రాసే కళని గుర్తించి..ప్రోత్సాహం ని కలిగించారు. నవకవిత వేదిక, సాహిత్య ప్రసంగాలు,కథానికలు, చిన్ని నాటికలు ,సినిమా పాటలు అనుసంధానంగా వ్రాసిన చిన్న కతలు.. ఇలా అన్నిటా నా ఉనికిని చాటుకున్నాను. అక్కడ ఒక నాదంటూ ఒక ముద్ర ఉందనకుంటాను.ఎందుకంటె నాకు ఎక్కడైనా ఆకాశవాణి సిబ్బంది కనబడితే నేను గౌరవంగా విష్ చేసినప్పుడు ..ఆత్మీయంగా అడుగుతుంటారు ..ఏమ్మా..మీరు అసలు రావడం లేదు..స్క్రిప్ట్ లు ఏమి పంపడం లేదా..అని. నేను నవ్వేసి..అన్నిటికన్నా వినడం అనే కళ నాలో మరుగున పడలేదండీ! వింటూనే ఉంటాను ఇప్పుడు వ్రాసే తీరిక లేదు..అని చెపుతూ ఉంటాను.

 వ్రాసే తీరిక లేదు అని చెప్పడం అబద్దం అని నాకు తెలుసు. ఆకాశవాణి పట్ల నేను ఎందుకు విముఖత చూపుతానో..నాకు , నా మరి కొందరు నా ఆత్మీయులకి తెలుసు. కేవలం ఒకే ఒక స్త్రీ వల్ల నేను వ్రాయడం అనే కళని మరుగున పడేసి..నన్ను నేను చంపుకున్నట్లు. అలా అని నేను గొప్పగా వ్రాసుకున్నట్లు బిల్డప్ కాదు. ఆ పరిస్థితుల్లో..నేను ఉన్న స్థితిలోనుండి నేను బయట పడి..లోకాన్ని కొత్తగా చూసుకుంటూ.. నేను ఆత్మవిశ్వాసంగా ఎదిగిన రోజులవి. ఆ రోజులని విషపూరితం చేసిన ఒక స్త్రీ ఈర్ష్యాద్వేషాలు నేను జీవితంలో ఎప్పటికి మరువలేను. నాకు ప్రపంచం లో ఎవరైనా శత్రువులు ఉన్నారా..అంటే..నా ప్రధమ శత్రువు.. నా ఆఖరి శత్రువు కూడా ఆమే!. ఆమె.. కూడా ఒక గృహిణి.ఇద్దరి బిడ్డలా తల్లి.తీరిక సమయంలో రేడియో వింటూ కార్యక్రమాలకి ఉత్తరాలు వ్రాస్తూ..ఉంటారు. నాకన్నా ముందు.. రేడియో లో శ్రోతగా ఆమె పేరు సుపరిచితం. రోజు నాలుగైదు వార్తా పత్రికలూ చదువుతున్న అనుభవంలోనుండి.. ఏ టాపిక్ మీదైనా సరే ప్రిపేర్ అయి వ్రాసుకుని మరీ అనర్ఘళంగా.. చెప్పగలదు. విపరీతమైన ఎయిర్ టైం ..వెస్ట్ అవుతుంటుంది.అని చెపుతున్నా వినిపించుకోదు రోజు..ప్రత్యక్ష ప్రసారాల ప్రోగ్రాం లో ఆమె వాయిస్ రావాల్సిందే! అలా రేడియో రాణిలా అభివర్ణించుకుంటూ ఉండే ఆమెకు నేను పోటీ పడటం సుతారం ఇష్టం లేదు. 

 నా పై ఆకారణ ఈర్ష్య. ఆకాశవాణికి విమర్శిస్తూ ఉత్తరాలు వ్రాయడం తో పాటు వ్యక్తిగతంగా ఆకాశ రామన్న ఉత్తరాలు వ్రాయడం..అందులో అతి నీచ నికృష్ట పదములతో దూషణలకి దిగడం తో పాటు.. నాకు ఎంతో..ఆత్మీయురాలైన నా స్నేహితురాలు (తను రేడియో అనౌన్సర్) కలిపి తిడుతూ.. ఉత్తరాలు వ్రాయడం.. చేస్తూ ఉండేది. నేరుగా మాకు ఉత్తరాలు వ్రాయడమే కాకుండా .. ఆకాశవాణికి వ్రాస్తూ ఉండేది. లైవ్ కాల్స్ లో..వివాదాస్పదంగా అభ్యంతరకరం మాట్లాడటం,మాట్లాడింప జేయడం.. ఆఖరికి ఆమె పేరు వింటేనే.. ఆకాశవాణి లో..వివాదాల రాణిగా గుర్తింపబడి .. అనౌన్సర్ లు ఆమె కాల్ కట్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు. కట్ చేసారు అంటే చాలు.. ప్రసార భారతికి.. ఆకాశవాణి స్టేషన్ డైరక్టర్ నుండి అనౌన్సర్ ల అందరి పైనా..ఆరోపణలు జొప్పించి లేఖలు వ్రాస్తుంది. ఇక అక్కడినుండి అధికార గణం కి తాఖీదులు రావడం,వీరు వివరణ లి ఇవ్వాల్సి రావడం ఇవన్నీ తల బొప్పి కట్టే వ్యవహారంగా భావించి..ఆమెని ఇష్టారాజ్యంగా వదిలేసి.. రాసిస్తా రా..విల్లు రాసిస్తాం ..రామ్మా అన్నట్లు వ్రాసి ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్లు వాగుకోమ్మా..తల్లీ.. అని వదిలేసారు అని చెప్పుకుంటూ నవ్వుకునే వాళ్ళంతా రేడియో..రెగ్యులర్గా వినే శ్రోతలు,వారి అభిప్రాయం అన్నమాట. 

 విపరీతమైన ఐడెంటీ క్రైసిస్ తో.. ఆమె చేసిన పనులవల్ల.. ఆమె ఈర్ష్యాద్వేషాల వల్ల.. నా ఫ్రెండ్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కుంది. అలాగే.. ఎన్నో అపవాదులని ఎదుర్కొన్నాం. అది ఆమెలో నెలకొని ఉన్న ఈర్ష్యా ద్వేషాల స్థాయి. ఆఖరిగా నేను ఇచ్చిన స్క్రిప్ట్..:"కవిత్వం పై సామాన్య శ్రోతలకి ఉన్న అవగాహన" 21 నిమిషాల ప్రసంగ వ్యాసం. ఆ స్క్రిప్ట్ తర్వాత మరెప్పుడు ఆకాశవాణి వైపు అడుగుపెట్టకుండా ఉండాలని కంకణం కట్టుకుందేమో.. ఎంత వికృతంగా ఆకాశవాణి ఉత్తరాల కార్యక్రమానికి ఆకాశరామన్న పేరుతో.. ఉత్తరం వ్రాసింది. 

 చాలా ఆత్రుతగా "ఏం రాసింది..చెప్పు చెప్పు " అంది..మా ఫ్రెండ్ రమ . 

" వద్దు ..చెప్పలేను" అన్నాను. ఇప్పటికి ఆ విషయం గుర్తుకు తెచ్చుకుంటే..నాకు దుఖం ముంచు కొస్తుంది . అలా అని నేను పిరికిదాన్ని కాదు. కానీ..ఒక మనిషిలో..ఇంత వికృత స్వరూపం ఉంటుందా..అనుకునేదాన్ని. ఇక అప్పటి నుండి రేడియోకి..దూరం జరిగి..పత్రికలకి..వ్రాసాను. నా కవితలు ,వ్యాసాలూ,ప్రచురింప బడినప్పుడు..ఆమెకి కాల్ చేసి మరీ చెప్పేవారు..నా స్నేహితులు. అందుకు.. తను యేమని అనేదంటే తనలోని గొప్ప రచయిత్రిని..నేను నా ఫ్రెండ్ కలసి పైకి రానీయకుండా చేసామని చెప్పేది అంట . నేను లేకపోతే తను ఎంతగానో..ఎదిగి..విశ్వనాధ సత్యనారాయణ గారి చెల్లెలా ..అన్నంతగా గుర్తింపు తెచ్చుకునేదానిని అని చెప్పి గుక్కపెట్టి ఏడుస్తుంది అని చెప్పేవాళ్ళు. 

 "ఏమిటి..అంత సీను ఉందా..ఆమెకి..అంది" రమ . ఆమె రచనా పాండిత్యం ఎలా ఉంటుందో.. మన ఆకాశవాణిలో విని చూడు.. ఆనందం విలయ తాండవం చేస్తుంది.భుజంగాలు  రెక్కలు విప్పి ఎగురుతున్నాయి.. నీహారిక బిందువులతో ..పంటలు సస్యశ్యామలంగా ఉన్నాయి..అంటూ వర్ణా తీతంగా వర్ణించి..వర్ణించి చంపుతుంది" అనగానే మావాళ్ళు అందరు.. చేతయి చేతకాని ఈలలు.చప్పట్లు..తో..సందడి చేసారు. 

 రమ అయితే అందుకేగా నేను ఆమెకి ఘోషా రాణి అని పేరు పెట్టాను అంది. మిగతా వాళ్ళైతే అర్జంట్గా రేపటి నుండి..ఆమెని వినడానికైనా రేడియో వినాలి అని తీర్మానించుకున్నారు. అవునా.. !? చచ్చాం బాబోయి, ఆమె వస్తే..మేము రేడియోనే ఆఫ్ చేస్తాం అంది..రమ. రెండేళ్ళ క్రితం అనుకుంటాను..తీవ్ర అనారోగ్యం చేసి మంచాన పడి మరలా..ఆరోగ్యం చేకూర్చుకుని.. ఎక్కడైనా పంక్షన్స్ లో కనబడినా ఎలా ఉన్నారు అని కూడా ఆమెని పలకరించబుద్ది కూడా కాదు. ఎందుకంటే ఆమె నన్ను అంత హర్ట్ చేసింది. నోరుంది కదా అని అవాకులు చెవాకులు పేలడం,రాయడం వచ్చు కదా అని ఆకాశరామన్న ఉత్తరాలు వ్రాయడం.. ఇవన్నీ నాకు నచ్చలేదు. ఆమె వ్రాసినవి అన్నీ తనే స్వయంగా రాసిందని..సాక్ష్యాలతో సహా..నిరూపణ ఇప్పిస్తాను..అంటే.. వదిలేయండి..అంటారు ఆమెని ని సపోర్ట్ చేసేవాళ్ళు. 

 ఇక నా ఫ్రెండ్ కుసుమ అయితే.. తన మూలంగా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఆమె వ్రాతల వల్ల మూడేళ్ళ పాటు ఆకాశవాణి లో.. నుండి ఆమె వాయిస్ ఎయిర్ లోకి రాకుండా జనరల్ డ్యూటి లకి పరిమితం చేసారు. ఆఖరికి విసుగు వచ్చి.. హైదరాబాద్ కి బదిలీ చేయించుకుని వెళ్ళిపోయారు. అలాటి వికృతమైన మనస్తత్వం నేను ఎవరిలోనూ చూడలేదు.


నేను ఎప్పుడు ఏదో.. వ్రాసేస్తూ..గొప్ప రచయిత్రి కావాలని,పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించలేదు. నాకున్న తీరిక సమయంలో..నేను స్పందించిన విషయాన్ని కాగితం పై పెట్టడం..బాగుంది అనుకుంటే పత్రికలకి పంపడం..తప్ప.. నాలో ఉన్న రచనా శక్తి ని పెంపొందించుకోవాలని,రైటర్స్ వర్క్ షాప్ లకి వెళ్లాలని.. పుస్తకాలు అచ్చు వేయించుకుని..పరిచయం చేయాలనుకోవడం కానీ చేయడం ఉండదు. మా కవిత్వ మిత్రులు అంటూ ఉంటారు.. ఎప్పుడు కవితా సంపుటి..ప్రచురణ చేయిస్తారు అంటారు.వివిధ పత్రికలలో వచ్చిన 46 కవితలు ఉన్నాయి అయినా నేనొక కవయిత్రిని అని నేను చెప్పుకోను.. నా ఆత్మ సంతృప్తి కోసమే.. నా స్పందనని...నాలో మెదిలిన భావాలు వ్రాసుకుంటాను. సాహితీ లోకంలో కూడా ఎన్నో భావ కాలుష్యాలు..భావ చౌర్యాలు చూసాను. ఒక రకంగా నాకు అక్కడ చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. ఇతరుల అనుభవాలని వింటూ ఉంటాను. ఎప్పుడైతే మనకి గుర్తింపు రావాలని కోరుకుంటామో..అక్కడే మనలని అణచి వేసే కొందరు తయారుగా ఉంటారు. కొందరి లో..మంచి ప్రతిభ లేకున్నా ఆకాశానికి ఎత్తేస్తారు. అని చెపుతూ.. నా మనసులోని ఆవేదన అంతా వెళ్ళ గ్రక్కాను. అందరు..మౌనంగా వింటూ ఉండిపోయారు. . ఆమె స్త్రీ యే కదా..స్త్రీకి శత్రువు స్త్రీయే. కదా..అనుకుంటాను. అలా అని పురుషులలో.. ఈర్ష్య ఉండదు అని చెప్పను ..కానీ స్త్రీలలో..ఈర్ష్య ద్వేషాలు ఎక్కువ అనడానికి ఉదాహరణగా.. నా లైఫ్ టైములో..ఈమె ఒక్కరే కనబడ్డారు..అని ముగించాను. 

ఏం కాదు..నేను చెప్పేది వింటే. నువ్వు..స్త్రీలే నయం పురుషులకంటే..అంటావ్..అని.. అంది పద్మ. పద్మ చెప్పినది..ఇంకో.పోస్ట్ లో.

13, డిసెంబర్ 2011, మంగళవారం

వావ్..నాగా అందాలు ..


హాయ్.. ఫ్రెండ్స్.. 
ఈ రోజు అందమైన ప్రకృతిని..కొన్ని ఆసక్తికరమైనవిశేషాలని మోసుకుని వచ్చాను. 

 మన భారత దేశంలో.. "అక్కా-చెల్లెళ్ళు" గా వర్ణించు కునే  ఏడు ఈశాన్య రాష్ట్రాలలో.. మయన్మార్ కి..సరిహద్దుగా కల రాష్ట్రం ..నాగాలాండ్.  మా అన్నయ్య..తన వర్క్ నిమిత్తం ..ఒక ఆరేడు..నెలల క్రితం నాగాలాండ్ కి బదిలీ కావాల్సి వచ్చింది. నాగాలాండ్  అనగానే అమ్మో..అంత దూరమా? అనుకోవడంతో..పాటు..ఉల్ఫా , బోడో.. ల గురించి కొంచెం భయం కల్గింది. అందులోను మా అన్నయ్య సైట్ ఇంజినీర్ గా దేశం నలు చెరుగులా..పాతికేళ్ళ గా గిర గిర తిరుగుతూనే ఉన్నాడు.  

ఎప్పుడూ..అలా తిరిగే ఉద్యోగమేనా? రెండు ఏళ్ళు అయినా  ఒక చోట నిలకడగా ఉండేది లేదు.. మీ జి.ఎమ్ కి. చెప్పి  ఆంద్ర లోనే ఉండకూడదా..అంటే..  "లేదమ్మా..1100 వందల కోట్ల రూపాయల వర్క్.. నేను వెళితేనే.. నాలుగు పేకేజ్ లలో..వర్క్ బిగిన్ అవుతుంది..అంటూ. యూనిట్ అందరికన్నా..ముందు వెళ్ళాడు. అలా ముందుగా వెళ్ళినా అక్కడ వర్క్ మొదలు కావడానికి మూడు నెలలు టైం పట్టిందట. అక్కద ఒకటే..కుండపోత వర్షాలు.ప్రపంచంలోనే అత్యధిక వర్ష పాతం నమోదు అయ్యే ప్రాంతాలలో..నాగాలాండ్  ఒకటి.

ఇక నాగాలాండ్ గురిచి..యెంత ఆసక్తి కరంగా ఉందొ!..వింటుంటేనే..ఒక సారి వెళ్లి చూడాలనిపిస్తుంది. 
అస్సాం బోర్డర్ కి సమీపం లో ఉన్న దీమా పూర్ వరకు మాత్రమె..రైళ్ళు వెళతాయి. అక్కడ నుండి..ఆ రాష్ట్రం మొత్తం..బస్సు ప్రయాణం చేయ వలసిందే! సరిగా రోడ్డు సౌకర్యం కూడా లేని ఆరాష్ట్రం లో 320 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడమే.. మా అన్నయ్య పనిచేస్తున్న కాంట్రాక్ట్ కంపెని పని. 

నాగాలాండ్ ప్రజలలో..ఎక్కువ శాతం మంది..నాగా జాతికి చెందినవారు.వారు మాట్లాడే బాష..నాగా అనే భాష. ఆభాషకి..లిపి లేదట. ఆ భాషని వ్రాయాలంటే..మన తెలుగుని మనం ఇంగ్లిష్ లో వ్రాసి నట్లు.. నాగా భాషని. ఇంగ్లిష్ లో..వ్రాస్తారట.అక్కడ ఉన్న  తక్కువ శాతం మంది ముస్లిం లు .ఉర్దూ కలసిన .హిందీ మాట్లాడతారట. కొంతమంది..ఇంగ్లిష్.. ఒక ఇరవయి సంవత్సరాల నుండి.. హిందీ.ఇంగ్లిష్ మీడియం లలో.. స్కూల్స్ నడుస్తున్తాయని..చెపితే ఆశ్చర్య పోయాను. ఏమిటీ.దేశంలో..ఇంట వెనుకబడ్డ ప్రాంతం ఉందా? అని. 

అక్కడ ఆ రాష్ట్రంలో.. సొంత ఆస్తులు ఏమి ఉండవట.అంటే..భూములు,స్థలాలు.కొనడాలు, అమ్మడాలు ..లాటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలు లేవట..370 ..ఆక్ట్ అమలులో ఉందట.ఇంత మంది జనాభాకి ఇన్ని చదరపు కిలోమీట్ల మేర 
వ్యవసాయమ  చేసుకోవడమే..అని గ్రామ పెద్ద నిర్ణయిస్తారట.అక్కడ పర్వత ప్రాంతాలలో.లభించే అటవీ ఉత్పత్తులని సేకరించి..అమ్ముకోవడం చేస్తున్తారట.  ఇలాటి వెసులుబాటు ఉండటం మూలంగానే ప్రత్యేక స్వయంప్రతిపత్తి కావాలని కొంత మంది వేర్పాటువాదం ని..బయలుదేరదీశారట. నేను అప్పుడు ఒక జోక్ చేసాను. మన ఆంద్ర వాళ్ళకి అటువంటి చోటు ఉందని తెలిస్తే..భూబకాసురులై.. ఆక్రమించుకుంటారు కదా..అని.  అక్కడ వారి కూడా బాగా పండుతుంది.

అక్కడ..కొండ చరియలలో..అనుకూలంగా ఉన్న చోట ఇల్లు నిర్మించుకోవడం .. రెండుమూడు కొండల ప్రాతాలలో.. వ్యవసాయం చేసుకోవడం..ఆహార అవసరానికి తగినట్లు పంటలు పండించుకోవడం.. కోళ్ళు,పందులు,మేకలు లాటి పెంపకం వలన ఆదాయం సమకూర్చుకోవడం చేస్తారట. విద్యుత్ చార్జీలు కూడా..బహు స్వల్పంగా..వసూలు చేస్తారట. నాగా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కి.. చాలా పనులు చేపట్టి.బాగా పని చేస్తుందని చెప్పారట. అక్కడ ఆ రాష్ట్రంలో..ఉన్న ఏడు జిల్లాల  వారితోనూ కో..ఆర్డినేషన్ చేసుకుంటూ రోడ్డు పనులు చేయడం మా అన్నయ్య వాళ్ళ పని కాబట్టి.. .  కొంత మంది అధికార గణం తో..చాలా విషయాలు చర్చిస్తారట. వారు చెప్పిన మాటల్లో.. సారాంశం ఏమిటంటే.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం భారత దేశంలో..అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చేయడానికి బాగా పని చేస్తుందని చేపారట.
ఇక అక్కడ ప్రజలలో..ఎక్కువ శాతం మంది.. క్రైస్తవ మతస్తులు.ప్రజల సంస్కృతీ ..సంప్రదాయాలు అన్నీ.. విభిన్నం గా   ఉన్నా..కూడా.. వారందరిలోను భారతీయ భావన బాగా ఉంటుందట.ప్రజలకి.. ఇతర ప్రపంచం గురించి.. అంత పెద్దగా సమాచారం తెలియదట. వార్తా పత్రికలూ.. టీ.వి ల ప్రభావానికి లోనవక..ఓ..ఎభయ్యి ఏళ్ళు వెనుకబడ్డ ప్రాంతంగా అనుకోవచ్చు..అని మా అన్నయ్య చెప్పారు. కానీ వారంతా..స్నేహ స్వభావులు కానీ  వారి ఆచారాల్ని గౌరవించాలని..బలంగా కోరుకుంటారట. అడవి జంతువులని వేటాడటం..మాంసాహారం భుజించడం కూడా..వారి వృత్తిలో భాగమే నట. వారు..వేటాడిన ఎనుమల మాంసాన్ని..గ్రామంలో అందరితో..పంచుకోవడం. ఎన్ని ఎనుమలని వేటాడి ఆ..మాంసాన్ని అందరితో..పంచుకోవడం అన్నదానికి గుర్తుగా.. వేటాడిన జంతువుల కొమ్ములని ఇంటి ముందు.. అలంకరించుకుని..గొప్పగా ప్రదర్శించుకోవడం ని.. చూస్తే.. అయ్యో..పాపం అడవి జంతువులు  వీళ్ళ పాలబడి..ప్రాణాలు కోల్పోతున్నాయి కదా  అనిపించింది. అని జాలిగా చెప్పాడు. మా అన్నయ్య. ఇవన్నీ విన్నాక నేను ఒకటి రెండు సార్లు అయినా నాగాలాండ్ వెళ్లి ఓ..సారి చూసి రావాలనిపించిది.  అక్కడ యాలక్కాయలు  కాస్తాయట. భలే ఉన్నాయి..అవి. 

మా అన్నయ్య ప్రక్రుతి ప్రేమికుడు. అందమైన చిత్రాలని బంధించి..తీసుకుని వచ్చి చూపిస్తే..వావ్..అనుకోకుండా ఉండలేక పోయాను. ఆ..చిత్రాలలో..కొన్ని..ఇక్కడ పంచుకుంటున్నాను. 
మీరు..నాగాలాండ్ అందాలని చూసేయండీ!


పచ్చికపై నడచి వెళుతున్న మేఘాలు.. 



                                           చెక్క బొమ్మల తయారీ.. ఎంత జీవం ఉట్టి పడుతున్నాయో....కదా!


                                          నదీ..ప్రవాహం అద్భుతమైన  మనోహరమైన చిత్రం..


                                                          నల్లని దట్టమైన అడవి.



                                                        చెక్క తో తయారైన కొవ్వొత్తి స్టాండ్

                                                ఇలాటి దృశ్యం అడుగడుగునా..నిత్యం..


స్వచ్చమైన పూలు..మనసు పారేసుకునేటట్లున్నాయి. .



లేత గులాబీ పూబాల నేల చూపులు చూస్తుంది. సిగ్గు పడుతుందేమో!



                                           పసుపు తక్కువేం కాదు..సిగ్గు  భారం అధికమైనది అనుకుంటాను.



                                              దట్టమైన మంచు తో..కొండలే కనబడటం లేదు



                                                       అన్నయ్య పూల చెట్ల పెంపకం







                                           విలేజ్ కౌన్సిలర్ల మీటింగ్లో.. మా అన్నయ్య





                                                              మీడియా.. షూటింగ్


మీడియాకి రహదారి నిర్మాణాల గురించి వివరిస్తున్న నాగాలాండ్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు.. శ్రీ..లోహి



                                          రోడ్డు వేయడం కోసం కొండను   తొలుస్తున్న  జే.సి.బి.



                                                        మా అన్నయ్య గారి జి  ఎమ్



                                              స్థానిక అధికారులకి..రోడ్డు మ్యాప్ వివరిస్తున్న మా అన్నయ్య



ఈ కొండల పైనే ..నివాసం..వ్యవసాయం 




                                                                   కుందేళ్ళ పెంపకం


                                                వేటాడిన ఎనుమల గుర్తుగా కొమ్ములు



                                                  వెతకగా వెతకగా కనబడిన హిందూ దేవాలయం  




విజయదశమి రోజు పూజ సందర్భంగా   .మా అన్నయ్య ఆయుధ సంపత్తి  



                                                          ఇంటి వెనుక పూల తోటే!


                                          మంచు కాదు,నీరు కాదు ..కొండల మధ్య మేఘాల ప్రయాణం..






                                              మా అన్నయ్య వాళ్ళ క్యాంపు నిర్మాణ దశ..


తెల్ల ఎలుక ..



నాగా చిన్నారులు..ఆట పాటల్లో. 


                                                                  మిడిల్ ఖోమి అనే చిన్న పట్టణం


                               బొమ్మల తయారీకేంద్రంలో.. మా వదినమ్మ,తెల్ల చుడిదారులో..అక్కడి స్కూల్ టీచర్.

ఇంకో విషయం మర్చిపోయాను. ఒక రోజు అర్ధ రాత్రి వేళ.. ఇరవై మంది..సాయుధ దళం.. మా అన్నయ్య క్యాంపు ని చుట్టుముట్టి .. మొబైల్ ఫోన్ లాక్కుని .. రెండు మూడు గంటలు మాటలు పెట్టి.. ఇబ్బందికి గురిచేసి అధిక మొత్తం డబ్బు కావాలని ఇబ్బంది పెట్టారట. హెడ్ ఆఫీస్ కి కనక్ట్ చేసి మాట్లాడించాక వెళ్లి పోయి.. మరలా.. ఇంకో రోజు వచ్చి వెళ్లారట. .మొదటి రోజు ఆ విషయం విన్నాక మాకు చాలా భయం వేసింది. అవన్నీ..మామూలే!..వాళ్ళకి.. ముడుపులు..అందించకపోతే .వర్క్ లని సవ్యంగా   సాగనీయక, కిడ్నాప్ లు చేసి బాధపెదతారని భయం తో..వణికి  పోవాల్సిందే !    అని చెప్పాడు మా అన్నయ్య.

ఈ అన్నల కథలు బోలెడు ఉన్నాయి. మా అన్నయ్య తిరిగిన చోట్ల అన్నిటా.. వాళ్ళు ఉంటూనే ఉంటారట. ఏదైనా.. ప్రజలు కోసం ప్రభుత్వం పని చేయాలి.. ఆ ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకోవాలి. చేసే పనులని బట్టీ.. అభివృద్ధి జరుగుతుంటుంది. నాగాలాండ్ ప్రజలకి...ఈ రోడ్డ్ల ద్వారా అభివృద్ధి జరగడమే..కావాల్సింది..అని మా అన్నయ్య అంటే..అవును..నాలాటి వాళ్ళు సుఖంగా ప్రయాణం చేసి..ఆ..ప్రాంతాలన్నీ కూడా చూసి రావచ్చు అన్నాను.
ఈ సారి కొహిమా  విశేషాలు వ్రాస్తాను. చాలా చిత్రాలు జత చేస్తాను.  వెయిట్ ప్లీజ్!

11, డిసెంబర్ 2011, ఆదివారం

ఎపుడైనా ఏ క్షణమైనా..

తన చెలికాడి రాక కొరకై నిరీక్షిస్తున్న ఓ..అతివ అంతరంగం చిరు సవ్వడికి కూడా  ఉలికి ఉలికి పడుతుంది.. నీవు వత్తునని రాక.. నా ఇంటి గుమ్మంనకి..నన్నే కాపలాగా ఉంచితివా? అని మనసులో  చిరుకోపం ప్రదర్శిస్తుంది. అంతలోనే.. మరలా కనుచూపుమేర..వెతుకుతుంది..నిరాశగా వెనక్కి మళ్లించుకున్న   చూపుతో.. మరలా ముందుకు చూపు సారించి ఓ..ఏకాంత దర్శనీయవా..మరి మరి పలవరిస్తుంది.

నిండు పున్నమి వెన్నెలలా నీ ప్రేమ నాలో జల్లుగా కురుస్తుంది.. నీకున్న తీరిక సమయంలోనైనా ..ఎపుడైనా ఒక క్షణమైనా ఏకాంత   దర్శనమీయవా..అని అడుగుతుంది..ఈ పాట లో..

చెలికాడు ఏమన్నాడో  ..కూడా...ఈ క్రింద లింక్ లో ...   వినండీ!!

ఎప్పుడైనాఒక  క్షణమైనా    (ఎ)

ఏకాంత  దర్శన మీయవా  (ఎ)
ఎదురెదురుగా  ఎదురెదురుగా  .. నీవు నేనే.. నేను నీవే (ఎ )

ఈ చిరుగాలిలో ఏమున్నదో..
ఈ పరిమళము   ఏ తోటదో..
నిలువదు నాలో ఈ హృదయం ..ఆ .. ఆ ..నిలువదు నాలో ఈ హృదయం
పలవరించుతూ... పరుగిడు  నీ కోసం
ఎపుడైనా ఏ క్షణమైనా ఏకాంత  దర్శన మీయవా

విను విను ఝుమ్మను  తుమ్మెదలా (వి)
 నిను మరి మరి రమ్మను తీగెలా..ఆ ఆ ఆ ..ఆ
మరి మరి రమ్మను తీగెలా
నాపై కురిసే పున్నమి వెన్నెల (నా )
ఇవి నాలో పొంగే నీ ప్రేమ జల్లుల

ఎపుడైనా ఏ క్షణమైనా
ఏకాంత దర్శనమీయవా..

ఎపుడైనా ఏ క్షణమైనా ఏకాంత దర్శన మేల
ఎదురెదురుగా ఎదురెదురుగా
నీలో నేనే నాలో నీవే
ఎపుడైనా ఏ క్షణమైనా ...

  ఫ్రెండ్స్ !! ఈ  పాట ఎలా ఉంది?
నేను ఈ పాట కోసం ఎంతగా ఎన్నాళ్ళ నుండి వెతుకుతున్నానో!
ఇంత మంచి పాట ..నాకు చాలా ఇష్టమైన పాట.

ఈ పాట "ఇదెక్కడి న్యాయం " చిత్రంలో పాట . దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో.. సహజ నటి జయసుద..మనకి జయసుధ గా పరిచయం .. అందాలన్నీ నీలో నీలో దాగున్నాయి ..అవి తొందర చేస్తూ..నన్నే నన్నే రమ్మన్నాయి.. జయసుధ..ప్రియ సుధ అనే ప్రసిద్దమైన పాట ఈ చిత్రంలోని పాటయే ఎప్పుడైనా ఒక క్షణమైనా  ఆపాట నటి  ప్రభ పై చిత్రీకరించారు.  you tube లో   ఆపాటని.. చూసేయండి

8, డిసెంబర్ 2011, గురువారం

ప్రేమ బృందావనం


ప్రేమ బృందావనం  .. పలికేనే.. స్వాగతం అనే పాట పరిచయం

ఈ రోజు జి.ఆనంద్ గారి "దూరాన దూరాన తారా దీపం" అనే పాట కోసం వెదుకుతుంటే.. ఆనంద్ గారి  పాటల సమాహారం దొరికింది. "మా  బంగారక్క"  చిత్రం లో  ఆపాట కనబడ లేదు కానీ.. ఈ పాట కనబడింది. ఆనంద్ గారి గళం లో.. ఓ..విధమైన వైవిధ్యం   ఆకట్టుకుంటుంది. అమెరికా అమ్మాయి చిత్రంలో.. ఒక వేణువు   పాట కూడా వారి గళం నుండే వెలువడింది.

అక్కినేని గారు,శ్రీ దేవి,సుజాత  గార్లు నటించిన  "బంగారు కానుక "  ఈ చిత్రంలో.. ఇంకో..  రెండు మంచి పాటలు ఉన్నాయి..నడక హంస ధ్వని, చేమంతి పువ్వంటి ..అనే పాటలు.  సత్యం గారి మధుర స్వరాలూ.. అందిస్తే.. సాహిత్యం "సాహితి"  తొలినాళ్ళప్పుడు   అందించారు  .కార్తీక దీపం ఒరవడిలో..వచ్చిన  చిత్రం ఇది. చూడాలంటే ఓపిక కావాలి. కానీ ఈ పాట బాగుంటుంది  కాబట్టి.. ఈ పరిచయం...


పాట సాహిత్యం   

ప్రేమ బృందావనం ..
పలికేనే స్వాగతం
ఆ రాముడు నా వరునిగా...  చేరగా..
ప్రేమ బృందావనం

ప్రేమ బృందావనం..
పలికేనే  స్వాగతం
ఆ సీతే ..నా వధువుగా చేరగా.. ప్రేమ బృందావనం

పెళ్లికే కాలమనే పందిరే వేసేనయ్య
పచ్చని తీగలనే తోరణం చేసేనయ్యా.
తారలే తలంబ్రాలై కురిసేనయ్యా..
నా... కన్నుల ... కళ్యాణ జ్యోతుల కాంతులు మెరిసే..
ప్రేమ బృందావనం పలికేనే  స్వాగతం

గాలికే నీ అందం కవితలే నేర్పెనమ్మా
వీణకే నీ గానం స్వరములే  తెలిపెనమ్మ
చందమామ నీ ముందు ఎందుకే బొమ్మా
ఆ.. ..అమ్మమ్మ  ..అపురూప సుందర అప్సర నువ్వు
ప్రేమ బృందావనం పలికేనే  స్వాగతం

పాలలో తేనెవలె
మనసులే కలిసేనయ్య
కలసిన కొంగులు రెండు విడిపోవమ్మ
మా.. జంటనే దీవించగా గుడి గంటలు మ్రోగే
ప్రేమ బృందావనం పలికేనే  స్వాగతం

ఇక్కడ ఈ పాట వినేయండి!!!  ప్రేమ  బృందావనం 




తమిళంలో  ఇదే ట్యూన్ ఉన్న పాట 






7, డిసెంబర్ 2011, బుధవారం

ఫేస్ బుక్.. నా అనుభవాలు

సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల లో జాగ్రత్త.,మీ పిల్లల పేస్ బుక్ యాక్టి విటీస్ మోనీటార్   చేయడం ఎలా? రెండు విలువైన పోస్ట్ లే! సోషల్ నెట్వర్కింగ్ సైట్ ల వల్ల.. చాలా విలువైన సమయం వృధా అవుతుంది అంటే..పిల్లలు  ఒప్పుకోరేమో.. ! కానీ అది నిజం.

న్యూక్లియర్ చైల్డ్ ,ఆధునిక వసతులు తో కూడిన జీవితాన్ని అందించడమే ధ్యేయం అనుకుంటున్న తల్లి-దండ్రులు .. ఒంటరితనం మరియు లభించిన స్వేచ్చ..వల్ల.. యువతరం  అంతా ఇంటర్నెట్ అనుసంధానం వల్ల ప్రపంచంలో ఎక్కడో ఉన్న వారితో  కూడా ఇట్టే స్నేహం చేస్తున్నారు.

అది స్నేహం అంటే .. నాకు కోపం వచ్చేస్తుంది.  అధిక శాతం కాలక్షేపపు,ఉబుసుపోక(చిఫ్స్) కబుర్లు. నేను పేస్ బుక్ అంటే తెగ ఉబలాట పడిపోయి ఎకౌంటు ఓపెన్ చేసి మా అబ్బాయికి చెప్పగానే.. "నీకు ఎందుకమ్మా.. అక్కడ ఏం బాగోదు.నీకు నచ్చదు కూడా..  సైన్ అవుట్ చేసేసుకో.".అన్నాడు.

అదేమిటి..ఇలా అంటున్నాడు.. యువత తో..పాటు మధ్యవయస్కులు కూడా ఆర్కుట్,,పేస్ బుక్ అంటూ తెగ కలవరిస్తుంటే..అనుకున్నాను.

"నాకు పేస్ బుక్ డీ యాక్టివేట్ చేయడం  చేతకావడంలేదు అనగానే.. పాస్ వర్డ్..చెప్పమ్మా..నేను.. డీ యాక్టివేట్ ..చేస్తాను" అన్నాడు .
సరేనని నా పాస్ వర్డ్ చెప్పాను. అలా నా మొదటి ఉత్సాహం పై నీళ్ళు చిలకరించాడు మా..అబ్బాయి. నేను తర్వాత పేస్ బుక్ గురించి మర్చిపోయినా.. ఏ ..పాటలు వింటుండగా.. ఏ..రాగా లోనో.. లైక్స్   పెట్టమంటూ కనబడేది.  సరే మళ్ళీ .. మనసు అటు లాగేస్తుంటే..కనెక్ట్ అయ్యాను.

మొదట్లో..మా కుటుంబ సభ్యులు ..ముఖ్యమైన స్నేహితులు.. ఆడ్ అవుతూ..వచ్చారు.తర్వాత..  ఎవరెవరో..కొత్త కొత్తవారు ఆడ్ రిక్వెస్ట్ లు పెట్టడం.. వాళ్ళ ప్రొఫైల్ చూసి చూసి ..వాళ్ళ స్టేటస్..,పోస్ట్ లు బాగున్నాయి అనుకున్న   తర్వాత నే ..ఓకే.. చేసేదాన్ని.

తర్వాత మా అబ్బాయి..నాకు ఫ్రెండ్స్ లిస్టు లో..ఆడ్ అయ్యాడు. నాకు చాలా సంతోషం  అనిపించింది. నన్ను మొదట్లో..పేస్ బుక్ ఎకౌంట్..వద్దన్న మా అబ్బాయి..తర్వాత లిబరల్   గా ఆలోచించాడు ఏమో కానీ.. తరువాత నా ఆడ్ రిక్వెస్ట్ ని ఓకే చేసాడు,  నేను మా అబ్బాయి  ఇప్పుడు ఫ్రెండ్స్ గా మారాము. .  అయితే.. అది ఒకందుకు మంచిదే.! .పిల్లలు .. కాస్త జాగ్రత్తగా ఉంటారు. .మన పెద్దవాళ్ళు.. మనని గమనిస్తుంటారు అనుకున్నప్పుడు..వాళ్ళ దూకుడుకి ఆనకట్ట వేసినట్టే కదా! ఇప్పటి పిల్లలకి   అంత కన్నా కళ్ళెం అవసరం లేదు అనుకుంటాను.

ఇంటర్నెట్ ప్రపంచం చాలా పెద్దది..అవసరం మేర కన్నా అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి..మాత్రమే కాకుండా.. ఆ విషయాలని ఇతరులతో..పంచుకోవడానికి  వేదికలు ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లు. . ఇతరులతో..పంచుకోవాలన్న ఉత్షాహం ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల.ప్రతి విషయం ప్రాధాన్యత సంతరించుకుని.. సరి కొత్త ఆలోచనలు కల్గిస్తుంది.

కొంత మంది మీదు మిక్కిలి ఉత్సాహంతో.. ఫ్రెండ్..రిక్వెస్ట్ పంపుతారు. నాకైతే.. తెలంగాణా ప్రాంతం నుండి.. ఒక ఫ్రెండ్  రిక్వెస్ట్ వచ్చింది..అతనికి నాకు రిక్వెస్ట్ పెట్టేటప్పటికి 4396 ..మంది ఫ్రెండ్ ఉన్నారు, అతనికి తన జీవిత కాలంలో..యెంత మంది స్నేహితులు ఉంటారు.. ? అతనికి  కనీసం వారిఅందరి  పేర్లు అయినా గుర్తు ఉంటాయా? నాకూ..ఇంత మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకోవడానికి తప్ప ..ఒక వేళ  అతని స్నేహ ప్రపంచం ఎంత పెద్దదైనా వారందరిలో.. అతనికి మంచి స్నేహితులు ఎందరు అన్న విజ్ఞత అయినా ఉండవద్దు..అనుకుని..  వెంటనే ఇగ్నోర్ చెప్పి పడేసాను.

మన అభిరుచులు కలసిన వారు,స్నేహ స్వభావం కల్గిన వారు,నిజంగా మనుషుల పట్ల గౌరవం,అభిమానం కలవారు తారస పడితే.. ఆ వేదిక పైనే కాదు.. నిజ  జీవితంలో కూడా..మనకి మంచి మిత్రులు కాగలరు. ఎందుకంటే నాకు  .. అక్కడ స్నేహాలు లో..ఇరవై శాతం అయినా మంచి స్నేహాలు కనబడలేదు..  కనీసం ఒక పది మంది నా  అన్న వాళ్ళు ఉన్నారు. అనుకోవాలేమో! అలాటి వడపోత   కూడా అవసరం అని కూడా  నా అభిప్రాయం. నాతో ఏకీ భావించాలనేం లేదు. ఒకవేళ మంచి స్నేహాలు దొరికితే..అదృష్టం కూడా.. !

ఇంకొక ముఖ్య విషయం  నేను గమనించిన విషయం ఏమంటే.. ఇక్కడ కమ్యూనిటీల పిచ్చి..ఎక్కువే! అలాటి గ్రూప్ లలో నేను ఆడ్ కాలేదు కూడా.  గ్రూప్ లు.. గ్రూప్ చాటింగ్ లు చాలా వేలం వెర్రిగా ఉన్నాయి. మతం,కులం వేదికలు చేసుకుని మనుషుల మధ్య అడ్డుగోడలు నిర్మించుకోవడానికి ఈ వేదికలు చిరునామా కావడాన్ని నేను నిరసిస్తాను  .

మంచి విషయాలు   తక్కువ... కాలక్షేపపు.. కబుర్లు ఎక్కువ అని కూడా   కాదు.. అనవసర ప్రసంగాలు కూడా ఎక్కువే  ! .అమ్మాయిల అబ్బాయిల హద్దులు మీరిన సంభాషణలు,, తిట్టుకోవడాలు,మాటలతో..నరుక్కోవడాలు..కటీఫ్ లు చెప్పుకోవ డాలు,స్నేహాల ముసుగులో.. చేసే అబద్దపు ప్రేమలు, పెళ్లి చూపులు, పెళ్ళిళ్ళు, విడాకులు, లింకేడ్ వ్యవహారాలూ అన్ని వెగటు పుట్టించేవే!!

 ఎక్కడన్నా ఎవరిదైనా అప్ డేట్ స్టేటస్,, చిత్ర విశేషమో.. ఫోటోనో..నచ్చి ఒక కామెంట్ పడేసామో. చచ్చామే.!. ఇక దడ ..  పుట్టించే విధంగా  అప్డేట్స్.. మనలని వెంటాడతాయని  తెలుసుకున్న  ..అనుభవం తర్వాత ఆచి తూచి.. వ్యాఖ్యానించడం మొదలెట్టాను. ఈ  సోషల్   వర్కింగ్ సైట్ లలో..అన్నీ ఎక్కువే!..మా స్నేహితురాలి   కూతురు,కొడుకు కూడా.. పొద్దస్తమానం.. నెట్ కి అతుక్కుపోయి.. చాటింగ్ చేస్తున్నారట. ఒకే సారి పదిమంది పాతిక మంది తో కూడా.. చాట్ చేస్తూ అభివృద్ధి సాధించారట.

ఇక అక్కడ ఒరిజినల్ ప్రోపైల్స్ కూడా ఉన్నట్లు తోచదు.ఒక వేళ ఉన్నా సెక్యూరిటి తక్కువే!  వయసు ఉదహరించక పోవడం,ఉదహరించడం రెండు ఇబ్బందికరమే! నా విషయంలో.. అలా నాకు ఇబ్బంది కల్గిన సందర్భం వచ్చింది. మా .. ఫామిలీస్ నుండి చాలా మంది పిల్లలు నాకు ఫ్రెండ్స్ లిస్టు లో..ఆడ్ అయ్యారు. వారికి నేను ఒక అమ్మని అని తెలియదు..హాయ్..సిస్టర్ అంటారు..కాదని నేను చెపుతాను. తర్వాత వివరాలు తెలుపుకుని..చదువు,ఉద్యోగం,కుంటుంబాలు గురించి చెప్పుకుంటూ ఉంటాం. పిల్లలు చాలా ఆప్యాయంగా  ఉంటారు.. కొంత మంది నా బ్లాగ్ ఫాల్లో అవుతారు. కేవలం వారి కోసమే నేను  నా బ్లాగ్ ని పేస్ బుక్ షేరింగ్ పెట్టాను. పిల్లల ఆలోచనా ధోరణి, వాళ్ళ అభిప్రాయాలు..నిజంగా నాకు నచ్చుతాయి కూడా..

ఇక మా కుటుంబాల పిల్లలు కాకుండా..ఎప్పుడో..ఎక్కడో.. పొరబాటుగా ఆడ్ అయినవారు.. చాట్ లో..పలకరిస్తూ ఉంటారు. నేను..ఒక విధంగా..చాట్ అంటేనే వెనుకడు వేస్తాను. జస్ట్ అలా వెళ్లి..అన్నీ చూసేసి..స్పందిన్చాలనుకున్న చోట.. స్పందించి..ఓ..వ్యాఖ్య పెట్టి వస్తాను. కొన్ని గ్రూప్ లు మంచి పనులు చేస్తూ ఉండి ఉండవచ్చు.కానీ..నాకున్న కొద్దిపాటి విరామ సమయంలో..వాళ్ళతో..కూడా నేను కలవలేను..అలాటప్పుడు.. నేను కలవకపోవడమే మేలని.. నేను అసలు..అందులో..ఆడ్ అవ్వను. సామాజిక స్పృహ అంటే..ఇలా సైట్ల లో  ..మాత్రమే కాదు  ..ఇక్కడ కన్నా..కోట్ల రెట్టింపు.. వాస్తవికత మన చుట్టూ..బాహ్య ప్రపంచంలో..ఉంది అక్కడ స్పందించండి..అని అరచి చెప్పాలనిపిస్తుంది.

ఇక అక్కడ ఉన్న చిన్న పాటి పరిచయం లోనే..మన వ్యక్తిగత వివరాలు.. అడ్రస్ లు..అడుగుతూ..ఉంటారు. నేను సున్నితంగా తిరస్కరించడమో.. లేదా..అవసరం లేదని చెప్పడమో..చేస్తాను. వాళ్ళ ఆలోచనా విధానం వల్ల  వాళ్ళు అలా ఆలోచిస్తారు.. అమాయకం గా ఉన్న వారు..లేదా..తప్పు దారి నడిచేవారు ..కూడా..ఇక్కడ ఉండే  ఉండవచ్చు. అందుకని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ..అవసర మైనంత స్నేహం చేయడం మంచిది.  ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. అమ్మాయిలకే కాదు..అబ్బాయిలు..మోసపోతారు కూడా.!! .

మన తోటి బ్లాగర్ అచ్చంపేట్ రాజ్ గారి బ్లాగ్ ద్వారా..చాలా విలువైన విషయాలు తెలుసుకోవడం వలన   నేను నాకు అంత నెట్ పరిజ్ఞానం లేకపోయినా..సరే..జాగ్రత్తగా ఉండగలగడం నేర్చుకున్నాను. అపరిచిత వ్యక్తులు.. కి..సమాచారం ఇవ్వకుండా ఉండక పోతేనే మంచిదని నాకు సన్నిహితంగా ఉన్న పిల్లలకి చెపుతాను.

చదవడంని మరిపింపజేసే.. .నిజమైన సామాజిక స్పృహని లోపింపజేసే.. మనుషులతో..సహజమైన కలివిడి తనం లేకుండా,, ఇలా సైట్ స్నేహాలు..ఉన్నవారు  చాలా ఒరిజినాలిటి లైఫ్ ని మిస్ అవుతారు. కూడా..  .

మొన్న ఈ మద్య మా అబ్బాయితో..ఒక మాట అన్నాను. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినవారికి ధన్యవాదములు..చెప్పు..నాన్నా.!.అని. అంటే..అబ్బ అదొక హెల్ అమ్మా..! మనం నిజంగా అభిమానించే వారికి..అలా పైపై పూతగా..విషెస్ చెప్పనవసరము లేదు..ధన్యవాదములు చెప్పాల్సిన పని లేదు..రెండు మనకోసమే.. మనం చెప్పుకునేవి. అన్నాడు.నాకైతే..మొదట ఆ మాటలో శ్లేష  అర్ధం కాలేదు.  అర్ధం అయినాక.. ఆహా.. ఏం చెప్పావురా.. ! కొడుకా..! అనుకున్నాను.

ఏమైనా.. నవరత్నాలు అన్నీ ఒక వైపు,, నత్త గుల్లలన్నీ..మరొకవైపు   చేరినట్లు.. మంచి-చెడు..కలబోత, విడబోత..ఈ సైట్ ల లోనే ఉంది. తస్మాత్  జాగ్రత్త. పిల్లలు..పెద్దలు అందరూ కూడాను. సమయాన్ని వృధా చేసుకోకుండా..విలువైన వాటికే సమయం కేటాయించడం వలన మన  ఆనందం...జ్ఞానం రెండు వృద్ది అవుతాయి కూడా..

5, డిసెంబర్ 2011, సోమవారం

ఆదా హై చంద్రమా రాత్ ఆది

రెండు రోజుల క్రితం.. నాకు ఇష్టమైన పాటలు అన్నీ  మెమరీ కార్డ్లో సేవ్ చేసుకుని ప్లే చేసుకుని వింటూ .. ఎన్నాళ్లైందో చదువుకుని అనుకుని ...బుద్దిగా చదువుకుంటున్నాను..అలా ఇష్టమైన వ్యాపకంలో సమయం యిట్టె గడచిపోయి యెంత పోద్దుపోయిందో తెలియదు కదా!.. అర్ధ రాత్రి దాటి పోయింది నేను వింటున్న పాటని బ్రేక్ చేస్తూ ..ఫోన్ కాల్ .. నెంబర్ చూసుకుని లిఫ్ట్ చేసాను. 

ఏమిటీ తల్లి ! ఈ అర్ధ రాత్రి పలకరింపులు.. ఇక నాకు నిద్ర కరువేమో..అన్నాను. నువ్వు అంత త్వరగా నిద్రపోతే.నే . కదా నిన్ను నిద్ర లేపడం..అన్నది. నిశాసుర సంతతిలా మెలుకువగానే   ఉంటావులే!  నాకే నిద్ర పట్టక కాసేపు మాట్లాడదామని చేసాను.అంది.  

నాకు వళ్ళు మండిపోయి  "చూసావా నీకు యెంత  స్వార్ధమో.. ?  రోజూ బాగా  నిద్ర పడితే శుభ్రంగా   నిద్ర పోయి..ఎప్పుడు  అయినా నేను కనపడగానే.. తిండి నిద్రలు లేకుండా ఏమి చూడటాలు,ఏమి వినడాలు,ఏమి చదవడాలు..అని తరగతులు తీసుకుంటావు..కానీ.. నీకు నిద్ర పట్టకపోతే నేను అనే దాన్ని గుర్తుకు వచ్చాను చూడు..అందుకైనా మెచ్చుకోవు..దేనికైనా పారదర్శకత ఉండాలమ్మాయి.!!." అన్నాను నిష్టూరంగా.. 

సరేలే! ఏం చేస్తున్నావు చెప్పు? అని అడిగింది. పాటలు  వింటున్నాను + చదువుతున్నాను. అన్నాను. నీ టాప్ సీక్రెట్ వీటిల్లోనే ఉంటాయి. అందుకే ఆనందంగా బతికేస్తావ్ అంది. "అవును కదా! " అన్నాను. 

ఏం పాటలు వింటూ ఉన్నావ్  ? ఆరాగా అడిగింది. 

ఇదిగో విను..   అని ఈ పాట ప్లై చేసాను. ఆ సమయానికి తగిన పాట కూడా !
సూపర్ సాంగ్ కదా..అంటే..

అమ్మో ఇంత  పాత పాట ? నా వల్ల కాదు వినడం అంది. 

అవును...పాత పాటే! వి.బి.ఎస్. చాయా గీత్ లో విని విని నాకు మనసైంది. ఇది పాత పాటే! కానీ మీనింగ్ చాలా బాగుంటుంది తెలుసా? అన్నాను. 

ఏ కళ నుందో.. ఏమో  కానీ  సరే చెప్పు   వింటాను. .అంది. కాస్త వేచి ఉండు ..ఈ లోపు ఈ పాత  పాత వింటూ ఉండు అని..నేను  సిస్టం ఆన్ చేసి  

ముందుగా లిరిక్స్ వెతికి ఇదిగో ఇక్కడే అప్పటికప్పుడు ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. 

ఆదా హై చంద్రమా రాత్ ఆది..

తెలుగు  అనువాదం యధాతదంగా  ఇలా ఉంటుంది.విను.. అంటూ.. ఒక విషయం ఏమంటే.. మనకి హిందీని తెలుగులోకి యధాతదంగా అనువదిస్తే..అసలు తలకెక్కదు. హింది బాగా వచ్చి ఉంటె..హిందీ భాష పరంగా సాహిత్యాన్ని అర్ధం చేసుకుని ఆస్వాదించ గల్గితే..ఆ సాహిత్యం రసమయంగా ఉంటుంది. అది ఆస్వాదించడం  తప్ప  అర్ధవివరణ ఇవ్వగలగడం నాబోటివారికి సాధ్యం కాదు.ఎందుకంటె.. నాకు తెలిసిన విషయం ఏమంటే హిందీ పదాలకి ఉన్న అర్ధం సందర్భాల్ని బట్టి వ్యాక్యంలో ఇమిడిపోతూ ఉంటాయి. మన మాతృ   బాషలో మనకి ఒక పదానికి అనేక అర్ధాలు గోచరిస్తాయి ..మనం చెప్పగలం  కూడా .హిందీ అలా కాదు.కష్టం అనిపిస్తుంది.అందుకే ..ఈ పాటకి యదాతదంగా..అనువాదాన్ని.. అలాగే..నేను నా భావనలో పాట అర్ధాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. తప్పులుంటే క్షమించేయాలి! అని  విన్నమిచుకుంటా.. చెప్పడం మొదలెట్టాను . .. ఆ అనువాదం ఇలా ఉంది 

హిందీకి   తెలుగు అనువాదం:
పల్లవి:
అర్ధ చంద్రుడు అర్ధ (సగం)రాత్రి 
నీ నా సంభాషణ (మాటలు) ,కలయిక సగంలో ఆగిపోకూడదు (ఉండిపోకూడదు)
చంద్రుడు సగం గా ఉన్నాడు,రాత్రి సగం గడచి పోయింది.
నా,నీ ఈ కలయిక మాటలు సగంలో ఆగిపోకూడదు 
సగంగా ఉన్న చందమామా!

చరణం :1 
 ఓ..ప్రియా !ప్రేమ బాష సగమే ..
నీ మనసులోని కోరిక కూడా అలానే..సగంలో ఉండనీ...
సగం కన్నులు సగం కదులుతూ,సగం ఊగుతూ 
అరవిరిసిన కనురెప్పలలో (కళ్ళలో)కురుస్తున్న వాన కూడా సగంగానే ఉన్నది.
నీ,నా ఈ సంభాషణ,కలయిక ఇక్కడ ఇలానే ఆగిపోకూడదు 
సగంగా ఉన్న చందమామా 

చరణం :2 

ఇవాళ ఇంకా ఎప్పటి వరకు ఉంటుంది ఈ దూరం 
ఈ కోరిక తీరదా ఎప్పటికీ !? దాహం వెయ్యట లేదా?
దాహంతో ఉన్నటువంటి ఈ పవనాలు ..
దాహంతో ఉన్నటువంటి ఆకాశం 
ఆకాశంలో ఉన్న నక్షత్రాల ఊరేగింపు కూడా సగం గానే ఉంది..
అర్ధ చంద్రుడు ..అర్ధరాత్రి 

చరణం: 3 

గానం సగంలోనే  ఉంది శ్యాముడు సాధారణంగానే ఉన్నాడు 
కానీ రాధమ్మ ప్రేమ మాత్రం సగంగానే మిగిలింది 
నయనాలు సగం విచ్చుకున్నవి 
పెదవులు సగం కదిలాయి 
కలవాలనుకున్న ఆ మాట క్షణంలో సగంలో ఆగిపోయింది 
చందమామ సగంగా..రాత్రి సగం గడచిపోగా 
నా ఈ కలయిక ,మాటలు సగంలో ఆగిపోకూడదు 
అర్ధ చంద్రుడు అర్ధరాత్రి ..

పాట.. నీ అనువాదం ఏమో కానీ  మీనింగ్ మాత్రం చాలా బాగుంది ..అన్నది.
మరి  నేను వినే పాటలు ఏమనుకుంటున్నావ్ ?అన్నాను..గర్వంగా.. 
పాట చూస్తే ఇంకా మెచ్చుకున్తావ్.. ఈ పాట పాడిన  గాయని అంటే..నాకు ఇష్టం ఏర్పడింది..ఈ పాట వినడం మూలంగానే! ఇక ఈ పాటలో స్పెషల్స్ చాలా ఉన్నాయి ..ఇప్పటి తరం వాళ్ళు కోతి గంతులకి, కప్ప గంతులకి,పూనకం వచ్చి  ఊగినట్లు ఊగిన దానికి వండర్ ఫుల్ డాన్స్.అని కితాబులు ఇస్తారు. నువ్వు..అర్జంట్గా ఈ పాట చూడాల్సిందే! నీ కూతురిని బతిమలాడి రేపు యూ ట్యూబ్ లో..ఈ పాట చూడు.. అనిచెపుతూ  వివరాలు .కూడా .మెసేజ్ పెట్టాను. 

ఏమిటో..అంత స్పెషల్? అంది .క్లాసికల్ డాన్స్ అంటే ఏమిటో.. ఈ పాటలో చూస్తావు? మీ అమ్మాయి చేసే  " బర్సోరే మేఘ " పాటకే..మురిసి పోతావు కదా..! ఇది చూడు అన్నాను. అయితే తప్పకుండా చూస్తాను కానీ.. పాటకి బాగా అర్ధం చెప్పవా..! అంది..తప్పదా..?అడిగాను..తప్పదు..నా మట్టి బుర్రకి..నువ్వు ఇందాక చెప్పినది అర్ధం కాలేదు అంది. 
నేను నవరంగ్..చిత్రం అయితే చూడలేదు కానీ..అర్ధం మాత్రం చాలా బాగుంటుంది.రేపు చెపుతానులే!  ఇప్పటికి వదిలేయి   తల్లీ!..అని తప్పించుకున్నాను.. నాలో.. ఉన్న కవి రాణి ని అప్పుడు బయటకి తక్షణం తీయలేక కూడాను.  

ఇంకొచెం  వివరాలు అందిస్తూ.. హీరోయిన్  " సంధ్య"  ఆవిడ .. మంచి డాన్సర్,యాక్టర్..కూడా.. ఇండియన్ పిల్మ్ లెజండ్ వి .శాంతా రామ్ మూడవ భార్య అని అంటారు. అని నేను కాస్త తెలిసిన వివరాలు చెప్పాను. 

సంగీతం కూడా బాగుంది..అంది. 

ఆ.సంగీత దర్శకుడు.. మన తెలుగు చిత్రానికి సంగీతం అందించారు. అక్భర్ -సలీం-అనార్కలి. అంటూ ఇంకా యేవో పాటలు పాడుకుని .. ఆవలింతలు మద్య..  శుభోదయం చేప్పుకున్నాం. నాకు ఉదయం నడక కి సమయం అయి.. ఇక నిద్ర కి బై చెప్పి .. ఇలా ఈ పాట మీద మమకారం మరొకసారి పుట్టి .. ఒకసారి ఇష్టంగా చూసి కష్టంగా..వదిలి  వెళ్లక తప్పదు..అనుకుని ఉదయపు నడకకి వెళ్లాను. .
మీరు ఈ పాటని చూసేయండి. 


ఇక పాట అర్ధం .. పండితుల భాషలో ఏమో కానీ.. నా హృదయ భాషలో..చెప్పాలంటే.. ఇరువురు ప్రేమికులు.. మనసులోని మాటని పూర్తిగా వెల్లడించుకో లేక సతమతమైయి పోతూ.. 

అర్ధరాత్రి సమయంలో.కలుసుకుని.. 

ఇప్పుడు..సగం రాత్రి అయింది సగం చంద్రుడు ఉన్నాడు.. నీ నా..ప్రేమ,మాట మన ఈ కలయిక సగంలోనే ఉన్నాయి..అవి అలా ఉండిపోకుండా ఉంటె ఎంత బాగుండును... 

ఓ..ప్రియా..ప్రేమ భాష ఎప్పుడు సగమే.. నీ మనసులో కోరిక కూడా సగంగానే ఉండనీ..నేను భావనని గాంచి ప్రేమ వర్షంలోసగం  తడచిన అరమోడ్పు కన్నులతో..సగం మూసి సగం తెరచి..నిన్ను చూస్తూ..నా నీ..ఈ మాటలు,కలయిక ఆగిపోకూడదని   కోరుకుంటున్నాను. అంది ఆమె.. 

ఈ రోజు కూడా ఇంకా ఎప్పటి దాకా ఉంటుందో..దూరం.మన ఒకటి కావాలన్న కోరిక ఎప్పటికి నేరవేరదా? ఎప్పటికి ఈ    వలపు దాహార్తి తీరదా..? ఈ గాలి,ఆకాశం కూడా దాహంతో అలమటిస్తూ ఉన్నట్లు ఉంది.ఆకాశంలో ఉన్న నక్షత్రాల ఊరేగింపు కూడా సగం గానే ఉంది. ఈ అర్ధ చంద్రుడు సాక్షిగా  .ఈ అర్ధ రాత్రి .నా ఈ మాటలు .మన మాట,మన కలయిక సగంలోనే ఆగిపోకూడదు. ..అంటున్నాడు అతను. 

 అలరించే గానం సగంలోనే ఉంది నల్లనయ్య మాత్రం మాములుగానే ఉన్నాడు. కానీ రాధమ్మ ప్రేమ మాత్రం సగంగానే మిగిలింది .నయనాలు సాంతం తెరుచుకోలేదు..పెదాలు దాటి మాట రానంటుంది  కలవాలన్న మాట కూడా.. అరక్షణంలో..ఆగిపోయింది..
ఈ..అర్ధ చంద్రుడు సాక్షిగా..ఈ అర్ధ రాత్రి గడచి పోగా.. నా నీ కలయిక సగంలోనే ఆగిపోకూడదు. అని అంటుంది ఆమె. 

ఇంత మధురానుభూతి ని అందించిన ఈ పాటకి ..జీవం ఉంటుంది కదా.. అందుకే..కలకాలం ఉంది. ఎప్పటికి  ప్రేమికులు.. ప్రేమ సందిగ్దావస్థలో.. గుర్తుకు తెచ్చుకునేలా ఉంది. 
అందుకే.. నాకు ఇష్టమైన పాట అయింది.