15, మార్చి 2012, గురువారం

అమ్మకి కోపం వచ్చింది

అమ్మకి కోపం వచ్చింది. ఆ కోపంలో కూడా మార్చి 12 ఎప్పుడు వస్తుందా ..అని టెన్షన్ గా ఎదురు చూసింది.
ప్రతి సంవత్సరం మార్చి 12 కి లేని టెన్షన్ ,ఆత్రుత ఎందుకంటారా?

ఓ.. ఎనిమిది నెలలు వెనక్కి వెళ్ళాలి. ఓ..కొడుకు కి అమ్మ పై ఉన్న ప్రేమ గురించి చెప్పాలి. ఇరవైనాలుగేళ్ళు వచ్చినా అమ్మకి ఆ కొడుకు ఎప్పుడు చిన్న బిడ్డడే! కష్టం విలువ తెలియాలి అనుకుంటుంది కానీ తన బిడ్డ ఏమాత్రం కష్టపడకూడదు అనుకుంటుంది. ఆ కష్టం ఏదో..తను అనుభవించి బిడ్డ చల్లగా సంతోషంగా ఉండాలనుకుంటుంది.అందుకేనేమో తల్లి బిడ్డల  ప్రేమ అన్ని ప్రేమలకన్న విలువైనది కదా!

నేను ఇప్పుడు నా గురించి మా చిరునవ్వుల చంద్రుడు గురించి చెప్పబోతున్నాను. మార్చి 12 కోసం యెంత టెన్షన్ గా ఎదురు చూసానో..అన్న విషయం కూడాను.

గత జూలై లో మా అబ్బాయి నిఖిల్ చంద్ర వచ్చినప్పుడు ఇంటి కోసం కొంత స్థలం కొనడం కోసం ప్రయత్నాలు జరిగాయి. అసలు అప్పటి పరిస్థితుల్లో ఆ స్థలం కొనడం అవసరం లేదు కూడా. కానీ మా మరిది గారి వాటా కి వచ్చిన స్థలాన్ని అమ్మే పరిస్థితిలో వేరేవారి ప్రవేశాన్ని అడ్డుకోవడానికిగాను మేము,మా బావగారు.. కలసి మా మరిది గారి వాటాని కొనవలసి వచ్చింది. ఆ స్థలం విలువ లక్షలలో. స్థలమేమో కొన్ని గజాలు మాత్రమే! మా స్వంత ఇంటి కల అదీ చాలా అందమైన సౌకర్యమైన ఇంటి కల నెరవేరాలంటే ..బాగా విశాలంగా ఇల్లు రావాలంటే ఆ స్థలం తప్పక కొనాల్సిన పరిస్థితి.

అప్పుడు మా దగ్గర డబ్బు అందుబాటులో లేదు. మా అబ్బాయికి ఇప్పటి ఆర్ధిక పరిస్థితుల్లో ఆ స్థలం కలుపుకోవడం ఇష్టం లేదు. కానీ నేనే పట్టుబట్టి కొంటే  బాగుంటుందని ఒప్పించాను.

ఇక డబ్బు కోసం అన్వేషణ. నాకేమో అప్పు చేయడం ఇష్టం లేదు. మరి ఎలా!? మా అబ్బాయి ప్రశ్న .

"చిన్నీ ..నా గోల్డ్ అమ్మేద్దాం "అన్నాను.

వెంటనే.. స్థలం కొనడమే మానేద్దాం. నీ గోల్డ్ అమ్మవద్దు అన్నాడు.

గోల్డ్ మొత్తం అమ్మవద్దు .. సగం అమ్మేద్దాం . అయినా నేను రోజు వాడను కదా! బ్యాంకు లాకర్ లో ఉండే కన్నా ఒక మంచి స్థలం ఉంటె బాగుంటుంది కదా అని చెప్పి ఒప్పించేసరికి నాకు ఒక వారం పట్టింది.

సరే..ఆ తర్వాత నాలుగైదు రోజులకి స్థలం రిజిస్ట్రేషన్ ఉందనగా.. గోల్డ్ అమ్మడానికి సిద్దపడి.. నా ఎనిమిది జతల బంగారు గాజులు (దాదాపు 250 గ్రాములు) అమ్మేయాలనుకుని బయలు దేరాం. .

మా అబ్బాయి.. అమ్మా! నీ గాజులు అమ్మవద్దు. మళ్ళీ చేయిన్చుకోగలం అని తేలికగా అమ్మేయడం చేస్తాం. కానీ ఇప్పుడు ఈ గాజులు అమ్మవద్దమ్మా.. నాకు ఇష్టం లేదు అన్నాడు.

"పర్వాలేదు నాన్నా..నాకయితే అంత సెంటిమెంట్ ఏమీ  లేదు.. అవసరమయినప్పుడు  ఆదుకోవడానికే కదా ... గోల్డ్ ఉండేది "అన్నాను.

ఇప్పటికే రెండు సార్లు ఇలాగే గాజులు అమ్మేసావు. మళ్ళీ ఇవికూడా అమ్మడమా!? వద్దు..అన్నాడు.

నిజంగానే అప్పటికి రెండు సార్లు వ్యాపారం కోసమని పొలాలు,బంగారం అమ్ముకున్న పరిస్థితి. అలాగే మా పెళ్ళికి ముందు ఈ గాజులు పెట్టలేదనే కారణం మీద నా పెళ్లి జరగకుండా సంవత్సరం పాటు వాయిదా పడిన జ్ఞాపకాలు. చాలా బాధాకర అనుభవాలు జ్ఞప్తికి వచ్చాయి ఆ క్షణాన నాకు.

మళ్ళీ నేను ఇంత ఎదిగాక కూడా "నీ చేతుల గాజులు అమ్మడమా! అని బాదపడుతూ.. సడన్ గా  లేచి  "అమ్మా! ..బ్యాంకు కి వెళదాం పద" ..అన్నాడు.

 "ఎందుకు బంగారం : అన్నాను. బంగారం అమ్మవద్దు. గోల్డ్ లోను తీసుకుందాం. ఆ లోన్ తీర్చడం నాకు లైట్ కదా అన్నాడు.

నీ చదువు పూర్తి కాకుండా ఎలా సంపా దించ గలవు . రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు వద్దు.. అని ఖరాఖండిగా చెప్పేసాను.

అమ్మా! నువ్వు ప్రతి విషయానికి టెన్షన్ పడతావు. ఏమి అవదు. నీ గాజులు అమ్మవద్దు. నిదానం గానే.. ఆ బాకీ తీర్చుకుందాం .కనీసం గోల్డ్ లోఅన్ తీసుకోవడం కోసమైనా ఒప్పుకో..అని నన్ను కన్విన్స్ చేసాడు. వెంటనే అసలు ఏమాత్రం ఆలస్యం చేయనీయకుండా బయలదేరదీసి బ్యాంకు కి తీసుకు వెళ్ళాడు.

అమ్మేసేయాలి అని అనుకున్న గాజులతో పాటు .. నాకున్న బంగారాన్ని (కొద్దిగా రోజూ  వేసుకోవడానికి మాత్రం ఉంచి  మిగతా మొత్తాన్ని  నా పేరున , మా అబ్బాయి పేరున కలిపి పెట్టి 7 లక్షల రూపాయలు వరకు లోన్ తీసుకున్నాం.

సరే ఆ స్థలం ని రిజిష్ట్రేషన్ చేయించాం.

ఇంకొక విషయం ఏమిటంటే నేను మా అబ్బాయి స్టడీస్ కోసం US  వెళ్ళాక తన కరిజ్మా బండి అమ్మేసి ఆ డబ్బుకి మరి కొంత జేర్చి.. ఒక గోల్డ్ బిస్కట్ కొని ఉంచాం. కానీ అది అమ్మడం నాకు ఇష్టం లేదు. మా కాబోయే కోడలికి గిఫ్ట్ గా ఇవ్వాలని కొన్న బిస్కెట్ అది. అక్కడ సెంటిమెంట్ అడ్డువచ్చింది నాకు. అందుకే ఈజీగా కాష్ అయ్యే వీలు ఉన్నా సరే ఆ గోల్డ్ బికి ని అమ్మాలనుకోలేదు. ఒక విషయం ఏమంటే బిస్కెట్ రూపంలో ఉన్న గోల్డ్ ని పెట్టుకుని బ్యాంకు వాళ్ళు గోల్డ్ లోన్ ఇవ్వరు.కూడా. నిజానికి ఆ విషయం అప్పటివరకు నాకు తెలియదు. ఏదైతేనేం..?  అప్పటికి అలా.. జరిగి పోయింది. అవసరం కూడా తీరింది ఇబ్బంది లేదు అనుకున్నాను.

ఆగస్ట్ లో మా అబ్బాయి తిరిగి US  కి రిటన్ అయ్యాడు. తను వెళ్ళేటప్పటికి రెండు సెమిస్టర్ లకి సరి పడా పీజులు, ప్రయాణపు చార్జీలు అన్నీ బ్యాంకు లోన్ ద్వారా సమకూర్చి పంపాం. ఎందుకంటే పార్ట్ టైం జాబ్ చేసి ఇబ్బందికర పరిస్థితుల్లో పడకుండా.

నీకే ..నువ్వు ఇలాగే చెపుతావ్.. రేపు ఈ లోన్స్ అన్నీ తీర్చడానికి నేను బోలెడు కష్టపడి బ్యాంకు వాళ్లకి లోను డబ్బు కట్టాలి. ఆ బాధ లేకుండా ఇప్పుడే నా ఫీజులకి సరిపడా నేను సంపాదించుకుని ఫీజులు  కట్టేసుకుంటాను కదా..అన్నా కూడా నేను వినలేదు. ఫీజు కి సరిపడా డబ్బు  ఇచ్చే పంపాము..

మా ఇంట్లో ఒక పద్దతి.. చిన్నవాడైనా అబ్బాయి చెపితే అమ్మ వినాలి. అమ్మ చెపితే అబ్బాయి వినాలి. ఈ అమ్మా కొడుకు మంచి స్నేహితులు కూడా.

సరే US  వెళ్ళాక ..తన చదువు చదువుకుంటూనే .. దగ్గరలో ఉన్న గ్యాస్ స్టేషన్ లో జాబ్  చేయడం మొదలెట్టాడు . అంతకు ముందు.. ఒక స్టోర్స్ లో జాబ్  చేసేవాడు. అది మానేసి.. గ్యాస్ స్టేషన్ జాబ్.

మా అబ్బాయి మనసులో ఒకటే కోరిక .అదీ వాళ్ళ నానమ్మ తోనూ, మా చెల్లి తోనూ చెప్పేవాడు.అమ్మ పుట్టినరోజు వచ్చే సరికల్లా అమ్మ గోల్డ్ అంతా ఇచ్చేయాలి. అదే అమ్మకి నేను ఇచ్చే గిఫ్ట్ అని.

ఇక అక్కడ గోల్డ్ లోన్ క్లియర్ చేయాలి అని గట్టిగా నిశ్చయించుకుని.. పని గంటలు పెంచుకుని కష్టపడం మొదలెట్టాడు.

నేను US  వెళ్ళేటప్పుడు..అలా జాబ్ చేయకూడదని మాట తీసుకుని ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపిస్తే.. వీడేమిటీ ఇలా తయారయ్యాడని నాకు కోపం వచ్చేది. దిగులు వచ్చేసేది. నేను కోప్పడుతున్నానని నాకు ఫోన్ చేయకుండా తప్పించుకోవడం మొదలెట్టాడు. ఒకసారి.. కాల్ చేసి..పది రోజులైంది చిన్ని ..నువ్వు అని అంటే..బిజీగా ఉన్నాను.. తీరిక లేదమ్మా .! .అన్నాడు. వెంటనే నాకు కోపం వచ్చి పోన్ కట్ చేసుకున్నాను.

వెంటనే నాకు రెండు మూడు సార్లు పోన్ చేసినా నేను కట్ చేసినా  సరే పదే పదే పోన్ చేస్తున్నాడు అని స్విచ్ ఆఫ్ చేసుకున్నాను.అలా ఈ అమ్మకి కోపం వచ్చింది.బాగా కోపం వచ్చింది.

అబ్బాయికన్న ఈ అమ్మకి ఏది ఎక్కువ కాదు.. కదా! తర్వాత రెండవ రోజు చీకటితో..కాల్ చేసాడు అబ్బాయి. అమ్మకి కోపం తగ్గిపోయి..పోన్ లిఫ్ట్ చేసింది. తన ఆదుర్ధాని..భయాలని చెప్పింది. ఏడ్చింది కూడా.

ఆ రోజు నుండి.. అబ్బాయి రోజు.. క్రమం తప్పకుండా అమ్మకి పోన్ చేస్తాడు.లేదా జి.చాట్లో వీడియో కాల్ లో కనబడతాడు.

కొడుకు గ్యాస్ స్టేషన్ లో జాబ్ చేస్తుంటే..అమ్మా రాత్రంతా మేలుకుని..కొడుకుకి కబుర్లు చెపుతుంది.

ఆమ్మ మేలుకుని ఉండి తనతో మాట్లాడుతుందని గురుకు రాగానే.. అమ్మా! పొద్దు పోయింది..పడుకో..అని గుడ్ నైట్ చెపుతాడు.

పగలల్లా అమ్మ జి మెయిల్ లో బిజీ స్టేటస్ పడేసి ..(ఎవరికి చాట్ కి చిక్కకుండా ) కొడుకు ఆన్ లైన్ చాటింగ్ కి ఎప్పుడు కనక్ట్ అవుతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. తన పనులు మానుకుని అప్పుడప్పుడు.. కొడుకుతో మాట్లాడమే పని గా పెట్టుకుంటుంది. అంతకన్నా.. ఈ అమ్మకి ఏది ఎక్కువ కాదు.

చూడు ... ఇంట్లో.. కాఫీ తాగిన గ్లాస్ కూడా సింక్లో పడేయని నేను..ఎలా కష్టపడుతున్నానో.. అందుకేనా అమెరికా పంపించావ్ ? అని హాస్యమాడేవాడు అబ్బాయి. "డిగ్నిటీ అఫ్ లేబర్.. గురించి చెప్పేది..అమ్మ

ఒక సారి అమ్మ అబ్బాయి వేసుకున్న షర్ట్ చూసి కొత్త షర్ట్ కొనుక్కున్నావా? చాలా బాగుంది బంగారం ..అంది. కాదమ్మా.. బి.ఎఫ్ అన్నాడు.


అమ్మకి అర్ధం కావడానికి క్షణం పట్టింది. కళ్ళల్లో కన్నీరు. "ఇదిగో..ఇలా ఏడుస్తావనే..నేను నీకు ఏమి చెప్పను.".అంటాడు..అబ్బాయి.

"లాస్ట్ వీక్ లో..ప్రక్క గ్యాస్ స్టేషన్ లో షూటింగ్ జరిగింది. అందుకే.. ముందు జాగ్రత్త చర్యగా బి.ఎఫ్ వేసుకున్నానులే"..అని చెపుతాడు.

కొడుకు ఆమ్మ కన్నా మొండి వాడు. తను అనుకున్నదే చేసి తీరతాడు. ఎవరి మాట వినడు కూడా.

ప్రతి రోజు అమ్మకి దిగులు. బిడ్డ బాగుండాలని  క్షేమం కోసం దేవుడికి పూజలు చేసుకుంటుంది. ఒకోసారి తను ఎక్కువగా ఆలోచించుకుని భయపడుతుందని తనని తనే..కోప్పడుకుంటూ ఉంటుంది.

మార్చ్ 12 ఎప్పుడు వస్తుందా అని ఎదురెదురు చూసింది. త్వరగా రోజులు గడిచి పొతే బాగుండును అని పదే పదే కోరుకుంది. ఇక్కడ అమ్మ ఇలాగుంటే అబ్బాయి అయితే.. అక్కడ స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఒక సబ్జక్ట్ ని అట్టిపెట్టుకుని తన యూనివర్సిటీ దగ్గరలోనే ఉండి జాబ్ చేసి అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలనుకుని కంకణం కట్టుకుని జాబ్ చేస్తున్నాడు.

అట్లాంటా లో ఉన్న వాళ్ళ బాబాయి దగ్గరికి వెళ్ళకుండా ,బాబాయితో మాట్లాడ కుండా కూడా (మాట్లాడితే..ఆ జాబు లు ఎందుకు..మన దగ్గరే బోలెడు జాబ్ లు ఉండగా అని కోప్పడ తాడని ) అలా తన అనుకున్న టార్గెట్ ని అనుకున్న తేదీకి రీచ్ అయ్యాడు.తన కోరిక నెరవేరింది కూడా.

"ఈ మధ్య కాలంలో ..అన్నం తిన కుండా పస్తులుగా  ఉన్న రోజులు ఎన్నో, డాలర్ కోసం ఏకధాటిగా  కష్టపడిన గంటలు ఎన్నో! ఆ క్రమం లో..తను పని చేస్తున్న గ్యాస్ స్టేషన్ నష్టాలని దాటేసి..లాభాల బాటలో పెట్టేటప్పటికి .. ఓనర్ ప్రశంసలు పొంది..గిఫ్ట్ లు కూడా అందుకున్నాను"   అని చెపుతున్నప్పుడు వింటున్న అమ్మకి గర్వంగా ఉంటుంది. అనుకున్న లక్ష్యం కోసం నిబద్దతతో పనిచేస్తున్న కొడుకుని చూసి..  

అమ్మా ! ఒకే ఒక జీవితం పాట విన్నావా? డౌన్లోడ్ చేసుకుని విను బాగుంది అని చెపుతాడు. ఆ పాట విన్న అమ్మకి మళ్ళీ దిగులు వస్తుంది.

అమ్మా! ఈ రోజు ఝుమ్మంది నాదం సినిమా చూసాను. .." లాలి పాడుతుంది ..గాలి". పాట యెంత బాగుందో .. ..అంటాడు.

నా చిన్నప్పుడు..మన ఇద్దరం కలసి చంటి సినిమా చూసాం గుర్తుందా  ? అని అడుగుతాడు 

" మా ఫ్రెండ్ కి మా మమ్మీకి బ్లాగ్ ఉంది చూడు అని చెప్పాను. నువ్వు ఆ రోజే "సరదా బెట్టింగ్స్" పోస్ట్ పెట్టి నా పరువు తీసేశావు.."అంటాడు.  అమ్మా అబ్బాయి నవ్వుకుంటారు.

అలాగే అమ్మ కోసం ఒక బోటిక్ ప్లాన్ చేస్తున్నాడు కూడా.

ఇంకో రెండు నెలల్లో వాళ్ళ బాబాయి దగ్గరకి వెళతాడు.

కానీ US  లో ఉండే ఆలోచన మాత్రం లేదు. తనకున్న ఆలోచనలు,లక్ష్యాలు..అన్నీ అమ్మకి చెపుతుంటాడు.
అమ్మ అబ్బాయికి ఎప్పుడు.. తన ఇష్ట ప్రకారమే చేయమని చెపుతుంటుంది.. Go ..A head .. అని full support ఇస్తుంది. అబ్బాయికి తనకున్న స్కిల్ల్స్ ని మన దేశం లోనే నిరూపించుకోవాలని కోరిక.

అమ్మది  మనీ మైండ్ కాదు. "జీవితపు తూకంలో..డబ్బు అనేది పడిగట్టు రాళ్ళు కాదు  కాకూడదు " అంటుంది. మేటీయరలిస్ట్ కాదు. ఒడిదుడుకులు,లాభనష్టాలు..అన్నీ సర్వసాదారణమైన విషయాలు. కానీ అమ్మకి అబ్బాయి పి.హెచ్.డి చేయాలని కోరిక. (తన తీరని కోరిక కూడా)

అమ్మ పుట్టిన రోజుకి అబ్బాయి అమ్మ కిచ్చిన కానుక. తానూ కష్టపడి రూపాయి రూపాయి పొదుపు చేసి.. అమ్మకి ఇచ్చిన కానుక. ఆ రోజు అమ్మాలనుకున్న బంగారు గాజులు. ఈ గాజులు వారసత్వపు సంపద కూడా.


అమ్మ జీవితంలో.. అందుకున్న బహుమతులలో.. విలువైన బహుమతి..(ఖరీదు లో కాదు) ఇది రెండవది. ఆ రెండు బహుమతులు కొడుకు ఇచ్చినవే కావడం ఇంకా ఆనందం.

అమ్మకి పుట్టిన రోజు కానుక

అమ్మకి ఇంతకన్నా గర్వకారణం ఇంకోటి లేదు.

అయినా ఇంకా కోరుకుంటుంది.

ఇలా చెపుతుంది. నీ మాతృ దేశానికి నీ అవసరం ఉంది కన్నా.! మంచి నైపుణ్యం పెంచుకుని మన దేశంలో.. కష్టపడుతూ..మంచి దక్షత తో.. నీ భవిత ఎదగాలని కోరిక. ఇండస్ట్రీ స్టార్ట్ చేసి మరి కొంతమందికి అయినా జీవనోపాది కల్గించాలని కోరిక .బ్రతుకు- బ్రతికించు.. తరహాలో ..ఎదిగి ఒదగాలి అని

"ఎస్..బాస్ అంటూ.. ఒకరి ఆదేశాలమీద ఒకరి క్రింద పనిచేయకు "అన్నది అమ్మ సూత్రం.

అలాగే కొడుకుని మంచి ఉన్నత స్థితిలో చూడాలనుకుంటుంది.

అమ్మా! అన్నం పెట్టమ్మా..అనకుండా .".అమ్మా..అన్నం తిందాం రామ్మా!  అనే కొడుకు,"

ఆమ్మఅర్ధ రాత్రివరకు పుస్తకాలు చదువుకుంటూ అల్లాగే నిద్రపోయినా,

రిమోట్ చేతిలో నుండి జారి అలాగే నిద్ర పోయినా ,

ఆమ్మ గదిలోకి వచ్చి టీవి, లైట్లు ఆఫ్ఫ్ చేసి.. దుప్పటి కప్పి ,దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకుని.. భద్రంగా తలుపులు మూసి  అన్ని జాగ్రత్తలు తీసుకునే కొడుకు

ఫ్రెండ్స్ తో..ఎస్ ఏం ఎస్ చాట్ చేస్తున్న అమ్మని "నొక్కింది ఇక చాల్లే పడుకో.."అని ప్రేమగా కసిరే ..కొడుకు,

అమ్మకి పూజ కి కూర్చునే టప్పుడు కావాల్సిన చాప దగ్గర నుండి..డైనింగ్ టేబుల్ పై డిష్ మాట్ ల వరకు..అన్నీ వివరంగా షాపింగ్ చేసుకొచ్చే కొడుకు దగ్గరగా లేకుంటే..అమ్మకి యెంత లోటు.

చిన్నీ! బంగారం.. ఐ మిస్ యూ.. నాన్నా! వారం అవుతుంది..నిన్ను చూసి. వీడియో కాల్ చేయి బంగారం ..అని అమ్మ మెయిల్స్.

అమ్మ కోసం తెచ్చిన లాప్టాప్ లో.. యాపిల్ ట్యూన్స్ నుండి డౌన్లోడ్ చేసి ఇచ్చిన అమ్మకి ఇష్టమైన సాంగ్స్ ఇలా అమ్మ కోసం, నానమ్మ కోసం బహుమతులు. నాన్న గారి కోసం ఎలక్ట్రిక్ సిగార్. ఇలా.. అందరి మనసెరిగి ఉన్న అబ్బాయి ..

ఇక అమ్మ అబ్బాయికి ఇలా చెపుతుంది.....

నా పై నీకు ఉన్న ప్రేమ కన్నా బంగారు వస్తువులు ఎక్కువకాదు బంగారం..అలాగే అమ్మకి నీవు తప్ప మరో ప్రపంచం లేదు కన్నా!

నువ్వు పుట్టాక నేను మనిషిని అనే సంగతి మరచి పోయి  నీ అమ్మని... అనే ఒకే ఒకటి గుర్తెరిగి బ్రతుకుతున్న మీ అమ్మని నాన్నా!

ఈ బంగారంని బ్యాంకు లాకర్ లో భద్రపరచుకుంటాం. కానీ నీకు నా పై ఉన్న ప్రేమని ఏ బ్యాంకు లాకర్ లోను దాయడానికి పట్టదు. అవాజ్యమైన నీ ప్రేమకి ..ఏ బ్యాంకు లాకర్ స్పేస్ ఇవ్వగలవు? చెప్పు కన్నా !

ఆమ్మ ఆశ..ఆశయాల రూపం నువ్వే కన్నా!
"
ఎక్కడ నీవున్నా-నా ఆశలు నీవన్నా
నీతో నీడల్లే నా ప్రాణం ఉందన్నా
నీవు ఇంతకు ఇంతై - అంతకు అంతై ఎదగర ఓ..కన్నా"..... ( ఇంట్లో ఇల్లాలు.వంటింట్లో ప్రియురాలు చిత్రం లో ఒక పాటలో భాగం)

 ప్రేమతో..దీవెనలతో .. అమ్మ

(అమ్మా ! ఇదంతా బ్లాగ్లో రాయాలా!? నీకు మైండ్ లేదసలు అనే చిన్నికి ... నా ఇష్టం ఇది నా బ్లాగ్ కాబట్టి అంటూ అమ్మ ) :)))))

20 వ్యాఖ్యలు:

జ్యోతిర్మయి చెప్పారు...

వనజ గారూ ఈ రోజుల్లో ఇలాంటి కొడుకుండడం మీ అదృష్టం..మీరూ మీ అబ్బాయి కలకాలం ఇలాగే చల్లగా ఉండాలి. నిఖిల్ కు మా అభినందనలు చెప్పండి.

sasi చెప్పారు...

ఎంత అదృష్టవంతులండీ మీరు.Nice to have a son like him

అజ్ఞాత చెప్పారు...

ఎపుడయినా, ఎక్కడయినా,ఎవరికైనా అమ్మ అమ్మే! చాలా బాగుంది.

రిషి చెప్పారు...

అమ్మ కొడుకుల ప్రేమని ఎంత బాగా రాసారో. మీ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది చూడండి. అలాగే మీ కోడలికి మీరు కొన్న బిస్కట్టు ఇచ్చి ఫోటో పెట్టి పోస్టు రాయడం మరవకండేం :)

వనజవనమాలి చెప్పారు...

జ్యోతిర్మయి గారు.. చాలా సంతోషం. మీ చల్లని నోట.. మా బాబుకి విషెస్ దొరికాయి. మరి మరి ధన్యవాదములు.

@ శశి గారు మీ బ్లాగ్ బాగుంది "నిర్మల తరంగాలు." మీ స్పందనకి.. మీ విషెస్ కి నా హృదయపూర్వక ధన్యవాదములు.

@ కష్టేఫలె గారు. నిజంగా అమ్మ కన్నా మరేది గొప్పది కాదు కదా! ఒకసారి మా అమ్మ అడిగారు..సరదాగానే అనుకోండి. నేను అంటే ఇష్టమా? లేక నీ కొడుకు అంటే నీకు ఇష్టమా?అని. అప్పుడు నేను అదే ప్రశ్న ని మా అమ్మకి వేసాను. అమ్మ నవ్వింది.ప్రేమగా ఓ..మొట్టికాయ వేసింది. అది అమ్మతనం అంటే. మా అమ్మ అంటే..నాకు చాలా ఇష్టం.కానీ అబ్బాయంటే ప్రాణం. మరి అమ్మని కదా! ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

@ రిషి ..ధన్యవాదములు. మీరు అన్నట్లు..మా కోడలికి బిస్కట్ ఇవ్వనులెండి.:)))))

ఆభరణం ని బహుమతిగా ఇస్తాను. తప్పకుండా ఫోటో పెట్టి పోస్ట్ రాస్తాను. మా కోడలిని మీరు అందరు చూడకపోతే ఎలా!? :))))

@ నాకు మెయిల్ పెట్టి తన మనసుని వెల్లడించి, అభినందించిన ఓ..బ్లాగ్ మిత్రురాలికి ధన్యవాదములు.

రాజి చెప్పారు...

"వనజవనమాలి" గారూ.. మీరు మీ చిరునవ్వుల చంద్రుడి గురించి చెప్తుంటే నాకు మా అమ్మ,తమ్ముడు గుర్తొచ్చారండీ..వాళ్ళిద్దరు కూడా అంతే..
మా అమ్మంటే మాకంటే మా తమ్ముడికే చాలా ఇష్టం.
కొడుకు ప్రేమను పొందగలిగిన తల్లి చాలా అదృష్టవంతురాలు మీలాగే..
మీ ఇద్దరి అనుబంధం ఎప్పటికీ ఇలాగే వుండాలని కోరుకుంటున్నాను.

సామాన్య చెప్పారు...

చాలా బాగుందండీ 'పుణ్యం కొద్దీ పురుషుడూ దానం కొద్దీ బిడ్డలూ' అంటారు కదా... అది గుర్తొచ్చింది.మీ అబ్బాయి కి నా బ్లెస్సింగ్స్.

Raj చెప్పారు...

మీ తల్లీ, కొడుకుల అనుబంధం చూస్తుంటే - చూడముచ్చట వేస్తున్నది.. ఈ అనుబంధం, ఆప్యాయత కలకాలం అలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాను..

Vineela చెప్పారు...

వనజ గారు....మీ పోస్ట్ చదివి ఒక్క క్షణం కళ్ళలో నీళ్ళు తిరిగాయి...నాకు మా అమ్మ నాన్న గుర్తు వచ్చారు బాగా....గాజులు భలే బాగున్నాయి ;) My best wishes to nikhil..and to the proud mom.

వనజవనమాలి చెప్పారు...

రాజీ.. అమ్మ అంటే అందరికి ఇష్టమే! కొంత మంది ప్రకటించలేరు,కొంతమంది ప్రకటించగలరు. అంతే! మొత్తానికి అమ్మ -తమ్ముడిని జ్ఞాపకం చేసాను కదా! నాని గార్కి నా విషెస్ చెప్పండి. తమ్ముడికి నీ దేవెనలు చెప్పండి. ధన్యవాదము రాజీ గారు.

@ సామాన్య గారు ధన్యవాదములు. మా నిఖిల్ మీ బ్లెస్సింగ్స్ చూసి అందుకునే ఉంటాడు. మెనీ థాంక్స్.అండీ!

@రాజ్..గారు..ధన్యవాదములు. మీలాంటి వారి విషెస్ తప్పక ఫలితంని ఇస్తాయి. థాంక్ యు!!

@ హాయ్..వినీలా.. నా బ్లాగ్ కి స్వాగతం. అమ్మ-నాన్న ప్రేమ మీ వెంటే ఉంటుంది. మిమ్మల్ని సదా సంరక్షిస్తుంది. లైట్ యార్..అనుబంధాలు గాడత..అలాగే ఉంటాయి. అందుకే కన్నీళ్లు చిప్పిల్లాయి.

గాజులు బాగున్నాయి..అన్నావు. మరో కాంప్లిమెంట్ అన్నమాట. థాంక్ యు!

జయ చెప్పారు...

వనజ గారు, మీ టెన్షన్ ఇప్పుడర్ధమైంది నాకు. తల్లీ కొడుకుల అనుబంధానికి నిర్వచనమే లేదండి. తల్లి ప్రతిక్షణం తలచుకునేది తన బిడ్డనే. మీ చిరునవ్వుల చంద్రుడికి నా ఆశీర్వచనాలు అందజేయండి. మీ కోడలికి కూడా:)

Mamtha Naidu చెప్పారు...

Hello Aunty. Your son is very lucky to have a good mother like you. soo sweet of you aunty :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

I felt touched reading the post!

ఎంతటి అదృష్టమో! నిఖిల్ ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

అమ్మ అంటే అందరికి ఇష్టమే! కొంత మంది ప్రకటించలేరు,కొంతమంది ప్రకటించగలరు. అంతే!
బాగా చెప్పారు :-)

వనజవనమాలి చెప్పారు...

జయ..గారు.. ధన్యవాదములు. నిజంగా.. మన వాళ్ళ గురించి మనకి చాలా బెంగ కదా!
ఇప్పుడు నేను చాలా ఫ్రీ అయ్యాను. థాంక్ యు వేరి మచ్.
@ మమత .. నా బ్లాగ్ కి స్వాగతం. మీ లాని యువత బ్లాగ్స్ చదువుతున్నారంటే చాలా సంతోషం. థాంక్ యు వేరి మచ్ ఫర్ యువర్ కామెంట్స్.
@ భాస్కర్ గారు.. మీ స్పందనకి ధన్యవాదములు.

Pavani చెప్పారు...

Very touching. Congrats, you both!!

radhe చెప్పారు...

కాస్త దిష్టి చూక్క కుడా పెటాలి very nice

radhe చెప్పారు...

కాస్త దిష్టి చూక్క కుడా పెటాలి

వనజవనమాలి చెప్పారు...

radhe.. Thank you very much.

Vani చెప్పారు...

Namaskaram Vanaja garu. Entha baga rasarandi ee blog post. Naaku chivaralo chaduvuthuntene, entha vudvegam ga anipinchindo. 2 days mundu mee blog chusanu, appati nundi non stop ga chaduvuthune vunnanu. Mee honest opinions, prema, dabbu kanna relationship ku value ivvatam..prathidi chala goppa ga anipinchindi. Andaru matladutharu kaani entho koddi mande ila rayagalaru. Hatsoff andi.

- Vani