1, మార్చి 2012, గురువారం

మగవారు పెళ్లి ఎందుకు చేసుకోవాలి?

శ్రీనివాస్ గారి సందేహం ..
మగ వారు పెళ్లి  ఎందుకు చేసుకోవాలి? వాళ్లకి పెళ్లి చేసుకొంటే కలిగే లాభాలు ఏమిటీ ?  మీ అభిప్రాయం చెప్పగలరా? పెళ్ళి సాకుతో మగ వారి శ్రమను సమాజం దోచుకోవటం ఎక్కువైంది. మగవారికి పిల్లలు కావాలి కనుక పెళ్ళి అవసరం అని చెప్పవద్దు. మగ వారికి పిల్లల కావాలనేది(వంశం), సమాజం రుద్దిన అభిప్రాయం. దీనిని మన పెద్దలు రామాయణం లాంటి కథల ద్వారా ప్రచారం సాగించారు.
అని నాకు వ్యాఖ్య ద్వారా అభిప్రాయం చెప్పమని అడిగారు.అందుకే ఈ పోస్ట్. 
శ్రీనివాస్ గారు.. మీ ప్రశ్న అసహజంగా ఉంది. 
ఆదిమ మానవుడు పెళ్లి చేసుకోవడం అనే నియమాలు లేనప్పుడు కూడా నరజాతి పుట్టుక ఉంది. ఈ నరజాతి వారసులు.. జంతు ప్రవృత్తి తోనే   మెలిగి జంతువులాగానే జీవించాడు. కాలక్రమేణా  మంచి-చెడు విచక్షణ తో.. కొన్ని కట్టుబాట్లు తో..సమాజంలో సవ్యమైన మనుగడ కోసం స్వేచ్చా ప్రవృత్తిని ఇష్టం గానో,అయిష్టంగానో..మానుకుని... ఒక కుటుంబంగా మసలడానికి తగిన నియమ నిబందనలని ఏర్పరచుకున్నాడు. తన పరిధిలో.. అవకాశం ఉన్నత మేర పురుషుడు బహుభార్య తత్వాని సమర్ధించుకున్నను కాలక్రమేణా అవి మరుగయి..ఒకే స్త్రీ కి -ఒకే పురుషుడు  నిబద్దత తో.. జీవనం సాగించాలని రామాయణ కాలం నాడే చాటి చెప్పడం జరిగింది. 
పురుషుడు వివాహం ఎందుకు చేసుకోవాలి?  మీ ప్రశ్నలో మొదటి భాగం. 
నా జవాబు: మీ పుట్టుకకి ముందు మీ తండ్రి గారు ఈ ప్రశ్న వేసుకుని ఉంటే.. మీరు వారి కొడుకుగా చెలామణి అయ్యే వీలు ఉందా? (క్షమించాలి ఇది..అభిప్రాయం చెప్పడంలో సంధించిన ప్రశ్న మాత్రమే!)
అంటే పురుషుడుకు అవసరం లేని పెళ్లి తో.. పూర్తి బ్రహ్మచర్యం అవలంభించ గలరని  అనుకోవచ్చా? లేదా స్త్రీ సాంగత్యం కోరుకున్నప్పుడు  ఆ అవసరాన్ని సక్రమం కాని రీతిలో.. ఇప్పుడు కొత్తగా మన సంస్క్రతికి అలవాటవుతున్న సహజీవనం ద్వారా..బయలాజికల్ నీడ్స్ ని పొంది.. ఇద్దరు కలసి సంతానం అవసరం లేదనుకుంటే నిజంగా సమాజంలో.. చెత్త కుండీలలో బిడ్డలు ఉండనే ఉండరు. లేదా పురుషుడికి పిల్లలే వద్దనుకుంటే..స్త్రీకి పిల్లలు కావాలని కోరిక ఉంటే.. ఆ పిల్లలకి తండ్రి ఎవరు? అక్రమ సంతానంగా..తల్లి పిల్లలని పెంచాలని అభిలషి స్తుందా  ? 
సమాజం ఆరోగ్యం ఉండటం కోసం కొన్ని నియమాలతో,కట్టుబాట్లుతో.. కుటుంబ వ్యవస్థ మొదలయింది. ఆ కుటుంబాని నే     వద్దనుకుంటే.. సంతానం వద్దనుకుంటే.. మానవజాతి మనుగడ ఎలా? అక్రమ సంతానాల మయమా?  మనం అనాగరిక వారసులమా? 
ఇక మీ రెండో ప్రశ్న ..పెళ్లి వలన లాభం ఏమిటీ? 
నా జవాబు: పెళ్లి వలన మనిషికి స్తిరత్వం వస్తుంది. స్త్రీ-పురుష శారీరక ధర్మాల్ని అనుసరించి..ఆకర్షణ,మొహం,ప్రేమ మొదలగు భావాలు ఒకరిపై మరొకరికి ఏర్పడటం మూలంగా.. యవ్వనంలో ఒక తోడుని,బిడ్డలు పుట్టాక భాద్యతలలో పాలుపంచుకునే..ఒక స్నేహం, వృద్దాప్యంలో..మనిషికి  తన గురించి అవగాహన కల్గిన ఒక తోడు అవసరం. 
అందుకనే తాను ..ఎంపిక చేసుకున్న లేదా పెద్దలచేత ఎంపిక చేయబడ్డ భాగస్వామ్యితో శారీరక మానసిక కలయికలవల్ల.. పరస్పరం ఇచ్చిపుచ్చుకునే దోరణిలో.. అవగాహన కలిగి .. అనుబంధం పెరిగి..బిడ్డలు కలిగి..నా  అనుకున్న భావనలో..ప్రేమ,వాత్చల్యం పుట్టుకుని వచ్చి   వారి ఆలనా పాలనలో.. భాద్యత గల జీవనం లో.. తమని తాము మరచిపోతారు.  పిల్లలని పెంచి ఈ నరజాతి కి మంచి మనుగడని అందిస్తారు. 
బిడ్డలే వద్దనుకుంటే.. నరజాతి ఉంటుందా? 
పెళ్లి పేరిట సమాజం దోచుకోవడం.. అన్నారు.ఇక్కడ మీరన్నది సమాజం కాదని అనుకుంటాను. స్త్రీ అనాలనుకున్నారేమో..అని నాకు అనిపిస్తుంది. 
అయినా మీ ప్రశ్నకే   నా జవాబు:  సమాజం దోచుకుంటుంది అంటున్నారు.సమాజం ఏమి ఇవ్వకుండానే.మీరు సమాజానికి ఏమి ఇవ్వకుండానే ఎదిగారా? 
తల్లి-దండ్రులు జన్మ నిచ్చారు.గురువులు విద్యా బుద్దులు నేర్పారు. మీ శరీరం,మీ జ్ఞానం అన్నీ మీవి మాత్రమే కావు. ఒక వయసు వరకు అయినా తల్లిదండ్రులు మిమ్మల్ని పోషించారు. 
మీరు ఏ అడవులలోకి వెళ్ళో కందమూలాలు..ప్రకృతి ద్వారా లభించే సహజ వనరులతో..సమాజానికి దూరంగా బ్రతకడం లేదు కదా! సమాజం లో భాగమై పరస్పరం ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థలోనే బ్రతుకుతున్నారు. ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా,సేవ అయినా.. సమాజంలో ఒక భాగమే కదా! మీరు ఆర్జించిన ధనం తోనో, మీ బుద్ది వికాశం   వల్లనో.. మీ స్వంతం ఏదైనా ఉంటే.. మీకు సరిపడా వినియోగించుకున్నాక మిగిలినది,మిగల్చ గల్గిన రూపం లో ఉంటే  ఎప్పటి కైనా  అది ఎవరికో  ఒకరికి చెందుతుంది కదా? ఇక దోచుకోబడేది ఎక్కడ.? సముచితరీతిలో మీరు ఇవ్వడం ఇవ్వక పోవడం మీ ఇష్టం కదా! ఇది మీకు స్వంతమైనది అయితేనే! 
ఇక నేను అనుకున్నట్లు పురుషుడిని సమాజం కాకుండా పెళ్లి పేరుతొ దోచుకుంటున్నది స్త్రీ అయితే ..స్త్రీ కోసం పురుషుడు కష్టపడనవసరం లేదు. స్త్రీ కూడా కష్ట పడగలదు.  పురుషుడి కన్నా సమర్ధవంతంగా ,ఓర్పుతో.. కష్టించే గుణంతో తమని తాము పోషించుకోగలరు. (ఈ ప్రశ్న మీది కాకున్నా నా సమాధానం చెపుతున్నాను). 
పెళ్లి వలన ఉపయోగాలు లేక్కిన్చుకుని,బిడ్డలు వద్దు అనుకుని, పురుషుల శ్రమని సమాజం దోచుకుంటుందని భావించు కుంటున్నప్పుడు  పురుషుడికి సమాజంతో.. పెద్దగా పని లేదు. పుట్టుక మూలం మరచి.. తన స్వేచ్చా ప్రవృత్తితో.. ఇష్టం అయిన రీతిలో బ్రతికేయడమే. మీ కోసమే..మీరు జీవించి.. మీ కోసమే మీరు కష్టించి..మిమ్మల్ని మీరే ప్రేమించుకుని ఒంటరి ప్రపంచంలో.. మీరు మీరే గా ఉండగల్గితే..అది నిజంగా గొప్పే! 
నేను వెలిబుచ్చిన అభిప్రాయం ..ఇది కేవలం నా ఆలోచన మాత్రమే! నా అభిప్రాయం అడిగారు కనుక చెప్పాను. ఇందులో ఎక్కడైనా నొప్పించినట్లు ఉంటే.. అది అభిప్రాయం ది మాత్రమే కాని వ్యక్తిగతంగా పరిగణించడం కాదని భావించండి. అలాగే.. మీరు అజ్ఞాతం గా ఉండకుండా మీ బ్లాగ్ రూపం  వెలిబుచ్చితే ఇంకా బాగుండేది . 

16 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

మగ వారు పెళ్ళెందు కు చేసుకోవాలి ?

సరియైన జవాబుకి వంద మార్కులు ! తప్పైన
జవాబుకు వంద మార్కులు !

అ: పెళ్ళాం వచ్చును. అందుకు.
ఆ : బుట్టలో పడటానికి
ఇ: మట్టి బుర్రలవటానికి
ఈ : ఆల్ ది అబవ్


చీర్స్
జిలేబి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జిలేబీ.. సమాధానం ఎలా చెప్పినా వంద రావడం ఖాయం కాబట్టి.. నేను ఈ) అని అంటాను. ఓకే..నా!

Jai Gottimukkala చెప్పారు...

ప్ర. "మగ వారు పెళ్లి ఎందుకు చేసుకోవాలి?"

జ. (మన దేశంలో) పెళ్ళికి ఒక ఆడా ఒక మగా కావాలి కాబట్టి

మీరు చెప్పినట్టు పెళ్లి అనే తంతు ప్రకృతి నియమాలకు సమాజం చేసిన ఒక రూప కల్పనా మాత్రమె. సమాజ నియమాలు ప్రకృతిని ఎదిరించి నిలబడలేవు.

Henry Ford once said: "Unfortunately you can't hire just a hand. The whole person comes with it".

ఈ విషయాన్ని వివాహానికి అన్వయించుకుంటే అందరి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

ఇకపోతే మగ వారికి అక్కడక్కడా అన్యాయం జరుగుంటుందని బాధపడే మిత్రులకు నా ప్రశ్నలు ఇవే. తరతరాలుగా ఆడవారిపై జరిగిన జులుం ముందు ఇదొక లెక్కా? ఇప్పటికి కూడా పురుషాధిక్యత కొనసాగడం లేదా? చిదురు మదురు వార్తలను చూసి అవి ఎంతవరకు నిజమో కూడా విచారించకుండా, ఆడజాతినంతా ఆడిపోసుకోవడం పాడియేనా?

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Jai garu.. Manchi maata cheppaaru. Thank you!

Pavani చెప్పారు...

పవిత్ర భారత దేశంలో పెళ్ళనేది మగవారికి అంత మంచిది కాదని నా అభిప్రాయం కూడా. ఇక్కడ నాగరికతల గురించి, కట్టుబాట్లు చట్టుబండల గురించి ఆలోచన అనవసరం. వాటిని మన మీడియా వారు, సంస్కరణొద్యమకారులు అన్నిటినీ మించి స్త్రీ వాదులు వదిలేసి చాలా కాలమైంది.
పెళ్ళెందుకు వద్దంటే... దాన్ని మగవారికి గుదిబండంగా మార్చేసే చట్టాలనూ మనం దగ్గరుడి చేయించుకున్నాం కాబట్టి. వేల ఏళ్ళ నాగరికత , సంస్క్రుతి , నియమాలు ఓ కాగితపు ముక్క విలువ చెయ్యవు కాబట్టి.

అజ్ఞాత చెప్పారు...

నాదీ పావని గారి అభిప్రాయమే!

Jai Gottimukkala చెప్పారు...

జిలేబి గారూ, మీరిచ్చిన సూచీ లో లేని జవాబులకు ఎన్ని మార్కులు? వాటికి కూడా వందే ఇస్తే (ఇవ్వండి మీకు పుణ్యం ఉంటుంది) నా జవాబు "నన్ ఆఫ్ ది అబవ్"

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Jai..:)))))))))

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పావని గారు .. పవిత్ర భారత దేశంలో మగవారికి పెళ్లి అనేది గుదిబండగా మారిందని అన్యాయమైన వ్యాహ్య చేసారు. ఈ దేశంలో.. పురుషుడి పై అంత అన్యాయమైన శిక్షలు ఉన్నాయా? ఈ దేశంలో స్త్రీల పై హింసే లేదంటారా? అంత అన్యాయమండీ.? మీరు స్త్రీ అయి ఉండి..స్త్రీలు అందరు మగవారిని వేదించ డానికే పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పినట్టు ఉంది. భారతీయ పురుష అహంకార సమాజంలో.. 70 % మంది స్త్రీలు కుటుంబ హింసని ఎదుర్కుంటున్నారని గణాంకాలు చెబుతుంటే.. ఎక్కడో ఒకచోట కేవలం అతి తక్కువ చోట కొన్ని చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని..స్త్రీ జాతి మొత్తం కి చట్టాలు కొమ్ముకాస్తున్నట్లు వ్యాఖ్యానించడం ఏం బాగోలేదు.

మీరు అలా అజ్ఞాతంగా వ్యాఖ్య చేయకుండా మీ బ్లాగ్ లో చర్చ మొదలెట్టండి . గణాంకాల ఆధారంతో సహా.. చర్చలో పాల్గొనడానికి నేను తయారుగా ఉన్నాను. .

Pavani చెప్పారు...

మీరు మరీ verbatim తీసుకున్నట్టున్నారు. పెళ్ళఖర్లేదా కావాలా అనే ప్రశ్న కు నా రెండుముక్కల జవాబు అది. నిజంగానే మగవాళ్ళంతా పత్తిత్తులు ఆడవాళ్ళంతా గయ్యాళి గంపలు అని నేనెంత మాత్రం అనుకోవట్లేదండి. అయితే మొండి బండ వాదన్లతో కొందరు (అందరూ కాదు) స్త్రీ వాదులమని చెప్పుకుంటూ దుర్మార్గపు చట్టాల్ని తెచ్చినప్పుడూ, మళ్ళీ వాటిని సమర్ధించుకోవటాలు చూస్తే మాత్రం కంపరమెత్తుతుంది. పాపం మొగవాళ్ళని అనిపిస్తుంది. మీతో తగాదాకి సిద్ధంగా లేనండి :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పావని గారు.. ధన్యవాదములు. :))))))))

Jai Gottimukkala చెప్పారు...

"కొందరు (అందరూ కాదు)"
In other words, a small percent of a group who is any way a small minority of the population.

We should not lose sight of the big picture. The truth is that domestic violence against women is on the rise even in the US.

ఆంగ్లంలో రాసినందుకు క్షమించండి.

అజ్ఞాత చెప్పారు...

గొట్టిముక్కల గారు,
తరతరాలుగా మగ వారు అనుభవించిన సుఖాల గురించి మీరు రాస్తే చదవాలని ఉంది. ఇక్కడ చర్చ ప్రధానంగా మధ్య తరగతికి చెందిన వారి గురించి అనుకొంట్టున్నాను. భారత దేశం లో స్రీల సమస్యలు గురించి చర్చించటానికి, వారికి సహాయం అందించటానికి ప్రభుత్వం ఉంది.

అజ్ఞాత చెప్పారు...

*శ్రీనివాస్ గారు.. మీ ప్రశ్న అసహజంగా ఉంది.పెళ్లి వలన లాభం ఏమిటీ? *

వనజ గారు,
నా ప్రశ్న చాలా సహజమైంది. చిన్నపట్టి నుంచి గుడ్డెద్దు చేలో పడినట్లు పెద్ద వాళ్ల మాట వింటు పెరిగేవారు ఎవరు ఇటువంటి ప్రశ్నలు వేయరు. అలా ప్రశ్నించటం చాలా తప్పుగా కొంతమందికి అనిపించవచ్చు. పిల్లలు ప్రశ్నించకపోయినా, పిల్లలను పెంచటంలో ప్రముఖ పాత్ర వహించే తల్లి కూడా మగవారికి పెళ్ళి ఎందుకవసరమో చెప్పాలి కదా! ఇక పెళ్ళి వలన మగ వారికి కలిగే లాభం ఎమీటీ అన్నదానికి మీరిచ్చిన సమాధానం లో ఎక్కడ కూడా మగవారికి మాత్రమే కలిగే నాలుగు లాభాలు (కనీసం) రాయలేదు. (ఇలా అంట్టున్నందుకు మీరు కోప్పడ కుడదు).

* కాలక్రమేణా మంచి-చెడు విచక్షణ తో.. కొన్ని కట్టుబాట్లు తో..సమాజంలో *
మంచి చేడు విచక్షణ అనేదాని కన్న స్వార్థం, స్వలాభం,సుఖం కొరకు కట్టుబాట్లు ఎర్పరచుకొన్నారు. ఒకసారి భారతం చదవండి. మంచి చేడులు గురించి విదురుడు ఎంతో చెప్పినా విన్నవారు ఎవరు లేరు.

*అవకాశం ఉన్నత మేర పురుషుడు బహుభార్య తత్వాని సమర్ధించుకున్నను *

బహుభార్య తత్వాని పురుషుడు ఎదో తన స్వార్థం కొరకు సమర్ధించుకొన్నట్లు రాస్తున్నారు. అలా సమర్ధించుకోవలసిన అవసరం వారికేమి లేదు. వివరణలిచ్చుకోవలసిన అవసరం ఆకాలం లో అంతకన్నా అవసరం రాలేదు. ఒక భార్య వున్నాదని తెలిసినా, రెండవ భార్యగా ఉండటానికి సిద్దపడే ఆడవాళ్లు పెళ్లిచెసుకొనలేదా? అప్పటి దాకా ఎందుకు, మచ్చుకు ఈ మధ్య సినేమా హీరోయిన్ శ్రీదేవి బోనికపుర్ ను పెళ్ళి చేసుకొలేదా? రామారవును లక్ష్మి పార్వతి చేసుకోలేదా?

To be continued ....

అజ్ఞాత చెప్పారు...

*ఇక్కడ మీరన్నది సమాజం కాదని అనుకుంటాను. స్త్రీ అనాలనుకున్నారేమో..అని నాకు అనిపిస్తుంది.*

మగ వారికి పెళ్ళి చేసుకోక ముందు సమాజం తో పెద్ద పనేమి ఉండదు. చాలా సింపుల్ గా జీవిస్తాడు. పెళ్లి కాక మునుపు అతను ఉంట్టున్న గది చూడండి. అందులో ఉండే వస్తువులు రెండు బిగ్ షాపర్ సంచులలో వేస్తే సరిపోతాయి. అదే పెళ్ళి అయిన తరువాత ఎంత సరంజామా తయారౌతుందో చూడండి. అందులో అతని వస్తువులు 20% కూడా ఉండవు. మిగతా 80% శాతం వస్తువులు అన్ని సమాజం లో అన్ని వృత్తుల వారు, అతని చేత కొనిపించే విధంగా ఒక కల్చర్ అభివృద్ది చేసి దోచుకోవటం మొదలు పెట్టారు. రోజు పేపర్లలో ఎన్నో స్కాంలు చదువుతూంటాం. అందులో డబ్బులు దోచుకొనేది వారిలో అధిక భాగం పెళ్ళి అయిన వారే. అవసరానికి మించి, లెక్క లేకుండా ఎందుకు దోచుకుంట్టున్నాం అనే స్ప్రుహ లేకుండా దోచుకోవటమే జీవన విధానమైంది. వారు డబ్బులు ఎవరి కొరకు,ఎందు కొరకు వారు సంపాదిస్తునట్ట్లు? అలా దోచేస్తుంటే వారి భార్యలు హద్దు పద్దులేని, అక్రమ సంపాదన తమకొద్దు అని నిలదీస్తే, అలా ఊరి మీద పడి దోచగలుగుతారా? పెళ్ళాం, పిల్లల కొరకు అతిగా పనిచేస్తూ, అందరిని మోసం చేస్తూ,లెక్కా పత్రం లేకుండా సంపాదిస్తూ మగ వారు దిగజారి పోయారు. పోని అది 70సం|| క్రితం ఐతే వేరే విషయం ఆరోజుల్లో ఎక్కువ సంతానం. ఇల్లు గడవటానికి ఎవో అబద్దాలు ఎప్పి,మోసాలు చేశారనుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ఒకరిద్దరి పిల్లలకొరకు ఇంత దిగజారవలసిన అవసరం లేకపోయినా, అప్పటితో పోలిస్తే ప్రస్తుత సమాజం మరింత దిగజారి పోయింది. ఈ దిగజారుడు తనం మనకు స్పష్ట్టంగా కనిపిస్తున్నా పెద్దగా పట్టించుకోకపోవటానికి కారణం కులపిచ్చి,వంశాల పిచ్చి& వారసత్వ పిచ్చి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీనివాస్ గారు ..పైన చేసిన మీ వ్యాఖ తర్వాత నాకొక ఐడియా వచ్చింది. దేశంలో అవినీతి తగ్గాలంటే.. అందరు అన్నాహజారే మార్గంలో నడవండి. రెండు మార్గాదర్శకత్వాలు 1 .బ్రహ్మ చర్యం,2 అవినీతి పై పోరాటం