31, మార్చి 2012, శనివారం

చిల్డ్రన్స్ చాయిస్ ?

పిల్లలకి కావలసినది ఏమిటో!? తల్లిదండ్రులు, పెద్దలు వారికి తెలియనిస్తున్నారా?

పొత్తిళ్ళలో బిడ్డలు ఆకలి అయినప్పుడు ఏడుస్తారు అది వాళ్ళ బాష. బాధ కల్గినా ఏడుస్తారు. అది చెప్పడానికి బాష రాదు కాబట్టి. వేళకి పాలు పట్టి,లాలి పోసి, జోల పాడి ముద్దు ముద్దుగా వారి ఆలనా పాలనలో మునిగి తేలే తల్లి ఇప్పటి పిల్లలకి కరువు. ఏ అమ్మమో,నాయనమ్మో.. వాళ్లకి అమ్మలు.

అమ్మలేమో..అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ ప్రేమ నంతటిని..ఖరీదైన బట్టలు,బిస్కట్లు,బొమ్మలు కొని తెచ్చి..ఒక రోజో, రెండు రోజులో ముద్దుముచ్చట్లు ఆడి వెళ్ళిపోతారు.  అసలే సంపాదనా పరులైన అమ్మ-నాన్నలాయే! ఎక్కువ రోజులు ఉంటె రెండు రకాల ఇబ్బందులు.  పే లాస్, పిల్లలు అలవాటు అయితే వాళ్ళు వీళ్ళని వదలక వీరు  వారిని వదిలి వెళ్ళలేని బాధలు.అలా పెరిగి పెద్దైన పిల్లలు నర్సరీలు, ఎల్ కేజీ లు, యుకేజీలు దాటి కాన్వెంట్ చదువులు.

ఇక అక్కడ నుండి మొదలవుతాయి.. వాళ్లకి అవసరం ఉన్నా లేకపోయినా సరే  షాపింగ్ కి తీసుకుని వెళతారు. బుజ్జి..కన్నా.. ఈ డ్రస్ నీకు నచ్చిందా? అని అడుగుతుంటారు. నచ్చలేదంటే.. వారికి నచ్చే డ్రస్స్ ఏమిటో..వాళ్ళ ఎంపిక కే   వదిలేసి ..వేలేడేసి లేని బిడ్డలకి ఎంపిక చేసుకునే స్వేచ్చ ఇచ్చామని మురిసి పోతారు. వాళ్ళకి కావాల్సిన బొమ్మలు ,వాళ్ళకి కావాల్సిన ఇన్స్టంట్  తినుబండారాలు..అన్నీ ప్రేమగా సమకూర్చుతారు.

ఇలా చాలా మంది తల్లిదండ్రులకి కలిగే సంతృప్తి. వాళ్ళ కోసమే కదా రెక్కలు ముక్కలు చేసుకుని కష్ట పడుతున్నాం. వాళ్లకి కావాలసినది  కొని ఇస్తే తప్పేముంది అంటారు.

ఉదాహరణకి ..ఇది చూడండి. కాళ్ళకి చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో,ముళ్ళ బాటలో  మైళ్ళు మైళ్ళు నడచి వెళ్లి చదువుకుని ఉద్యోగం చేసే తండ్రి  బిడ్డలకి  కష్టం తెలియకూడదనుకుని.. ప్రత్యేకంగా ఆటో మాట్లాడి కాన్వెంట్ కి పంపడం తో పాటు తను చెప్పులు వేసుకోకుండా బాధపడిన రోజులు గుర్తు తెచ్చుకుని ..అవసరం ఉన్నా లేక పోయినా ..ఓ..పది రకాల చెప్పుల జతలు కొని ఇవ్వడం అతి ప్రేమ అనిపించుకుంటుంది. ఖచ్చితంగా చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్న పని అదే!

వాళ్ళకి డాన్స్ ఇష్టం. ఊహు.వద్దు. అదేమన్నా  కూడు గుడ్డా పెడుతుందా? వాళ్ళకి ఆర్ట్స్ ఇష్టం..ఆ పిచ్చి గీతలు..లో ఏముంది.? వాళ్లకి ఆటలు ఇష్టం..ఆ.. వాడేమన్నా సచిన్ టెండూల్కర్ అవుతాడా ఏమిటీ?  అనుకుంటారు. వాళ్ళు అడిగింది.. అసలు ఇవ్వం.  వాళ్లకి మెకానిజం అంటే ఆసక్తి..ఇంట్లో ఉన్న రేడియో విప్పేసి మళ్ళీ బిగించే ఆసక్తి. అది మనకి నచ్చదు ..ఇవెక్కడ లో క్లాస్స్ బుద్దులు..రా..! హాయిగా చదువు కోకుండా ..అంటారు.

బిడ్డలు అడగ కుండానే..పుట్టిన రోజు పండుగ వస్తే.. ఫైవ్   స్టార్ చాక్లెట్ లు,కేక్ కటింగ్ కార్యక్రమాలు తల్లిదండ్రులే నేర్పుతున్నారు.డ్రింక్స్,ఐస్-క్రీం లు కి వాళ్ళని మనమే అలవాటు చేస్తున్నాం. ఇంట్లో వండి పెట్టె ఓపిక లేక పిజ్జాలు,బర్గర్లు,అంటూ వాళ్ళని బజారు తిన్డ్లుకి అలవాటు చేస్తున్నది తల్లి దండ్రులే!  ఇతరులతో పోల్చుకుని వాళ్ళ కి బాగా ఖరీదైన బట్టలు కొని ఇవ్వడం,  ప్రక్క వాళ్ళతో పోటీ పడటం.. ముందు పెద్దవాళ్ళ మనస్సులో పేరుకున్న పైత్యమే!

పిల్లలకి వాళ్ళ అవసరాలు ఏమిటో వారికి తెలియకుండానే అన్నీ కొని పెట్టి ..వాళ్ళని సంతుష్టులని చేసాం అనుకుంటారు కాని వారిని ఒకవిధంగా నాశనం చేస్తున్నామని తెలియదు.ఒకో కార్పోరేట్ కాలేజ్ కి ఔటింగ్ టైమింగ్స్ అప్పుడు వెళ్లి చూస్తే..పిల్లల కోసం తల్లిదండ్రులు తెచ్చిన వస్తు సామాగ్రి చూస్తే ఆశ్చర్య పోతాం. మేకప్ కిట్ లు దగ్గర నుంచి.. ఆధునికమైన  ప్యాన్సీ ఆభరణాలు.డ్రై ఫ్రూట్స్,బట్టలు..ఇంకా అప్పటికప్పుడు తినడానికి నాన్వెజ్ పుడ్ .. ఇవ్వన్నీ తీసుకుని తెల్లవారు ఝామునే లేచి  వందల కొద్ది మైళ్ళు ప్రయాణం చేసి వస్తారు. అడగ కుండానే అన్నీ ఇచ్చి.. వారికి కావాల్సిన ఇంజినీరింగ్ ,డాక్టర్,ఐ ఏ .ఎస్, ఐ పి ఎస్..ఇమ్మని అడుగుతుంటారు.

మీ కోసం ఎంతో కష్టపడి మీరు కోరకుండానే అన్నీ ఇస్తున్నాం. మిమ్మల్ని మేము ఏం అడిగాం? బాగా చదువు   కోవడం ..అంతేగా..! అంటారు.

ఎండలో నడచి వెళ్ళే పిల్ల ..గొడుగు కావాలని ఆడకుండానే .. మాచింగ్ గొడుగు లు కొనిపెట్టే అమ్మలు, మద్యాహ్నం  లంచ్ బాక్స్ లోకి చికెన్ తప్ప వేరే కూర వండని అమ్మలు.. లంగా ఓణీ అవుట్ అఫ్ ఫేషన్,,లో వేయిస్ట్ ఫాంట్..పిజిక్ టైట్ టాప్.. పిన్ పాయింట్ హీల్స్ కావాలి. ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యేటప్పటికి  ఒక ఏబై  డ్రెస్ లు అన్నా కావద్దూ.. లేకపోతే..తోటి పిల్లల్లో మన అమ్మాయికి ఇన్సల్ట్.. ఇలా ఆలోచించే అమ్మలు ఇప్పుడు ఉన్నారు.
పోద్దస్తమాను టైలరింగ్ చేసి తొంబై రూపాయలతో కూతురు అడిగిన ప్లేవర్ ఐస్ క్రీం   కొని పెట్టె అమ్మలు . ఐ మాక్స్ దియేటర్ లో తప్ప సినిమా చూడని అమ్మాయిలూ.. ఉన్నారు.ఒక విధంగా అబ్బాయిలే నయం.. మహా అయితే..ఓ..బైక్,ఓ..ఫోన్ ..అడుగుతున్నారు అంతే!

కుటుంబ ఆర్ధిక పరిస్థిని ఎరిగి నడుచుకునే పిల్లలు చాలా తక్కువ. పిల్లలకి విలాసమైన జీవన విధానం నేర్పిన తల్లిదండ్రులు ..ఇక ఎన్ని దొడ్డిదార్లు తోక్కాలో అన్నట్లు ఉంటాయి పరిస్థితులు.

నేను చెపుతున్నది.. నిజమే నండీ ! ఒక జంట సగటు ఉద్యోగులు నెలంతా కష్ట పడితే కాని ఇంటి అవసరాలు,పిల్లల చదువు సాగుతూ..సాధారణంగా బ్రతుకు ఈడ్వ వలసిన కాలం ఇది.

 పిల్లల మీద ప్రేమతో..చిన్నప్పటి నుండే వాళ్ళకి అడిగినడల్లా కొని ఇచ్చి.. కొనుక్కునే స్వేచ్చ ఇచ్చి..వాళ్ళకి ఏం కావాలో, ఏం వద్దో.. నిర్ణయించుకోకుండా.. నిర్ణయించుకోనీయకుండా పిల్లలని పెంచడం జరుగుతుంది. ఆ అతి ప్రేమ పిల్లలకి చాలా కీడు చేస్తుంది కూడా.

అలా అతి మురిపెంగా,గారాబంగా పెరిగిన పిల్లలు ప్రేమ,పెళ్లి,ఉద్యోగం ఇలాటి  ముఖ్యమైన విషయాలలో ఆశాభంగం ఎదురైతే తట్టుకోగలరా? 

ఇలా  లగ్జరీస్ కి అలవాటు చేసి పిల్లలని కష్టపడమంటే.. అదేనండీ .. చదవడం మాత్రమే అయినా..చదవ గల్గుతారా? తల్లిదండ్రుల కోరికలు తీర్చగల్గుతారా? 

పిల్లలు మనం చేసిన మైనపు ముద్దలు కాదు. వారికి స్వంత అభిప్రాయాలు ఉంటాయి. వాటిని నేరవేర్చుకోనివ్వండి. పిల్లలకి ఏం కావాలో అడగనివ్వండి..వాళ్ళని తెలుసుకోనివ్వండి. ఇవన్నీ మనం చేస్తున్నామా ..అడగ కుండానే అన్నీ ఇచ్చి అడిగినది ఇమ్మంటున్నాం..ఏమో! నేటి తరం  తల్లిదండ్రులే ఆలోచించుకోవాలి.   

మేము నగలు అడిగామా ..నాణ్యాలు అడిగామా? హై టెక్ ప్లాట్ లు,లగ్జరీ కారు  కొనుక్కోడానికి సంపాదించే  అంత ఉద్యోగం వచ్చే చదువు కావాలి..అంతే!

(మొన్నీమధ్య ..మా ఫ్రెండ్ కూతురు  ని చూడటానికి తను చదువుతున్న కార్పోరేట్ కాలేజ్  కి వెళ్ళినప్పుడు అక్కడ చూసొచ్చిన దృశ్యానుభవం తో వ్రాసిన టపా..)