కభి కభీ మేరే దిల్ మే ... ఈ మాట వింటూ ఉండగానే చప్పున గుర్తుకువచ్చే.. పాట..
కాస్తంత పాటలు వినే ఆసక్తి ఉన్న ఎవరికైనా ఏ భాష వారయినప్పటికీ కూడా కాస్తంత హిందీ తెలిస్తే చాలు ఈ పాటంటే ఇష్టం ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వినాలనుకునే మక్కువ కల్గుతుంది. అలాంటి పాట ఈ పాట.
కభి కభి మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై.. ఈ సాహిత్యం ఒక సినిమా పాట అనుకోవడం కన్నా ..ఓ..క్లాసికల్ పోయెట్రీ అనడం కద్దు. అసాధారణమైన గళమాదుర్యం ఒలింకించగల ముఖేష్ గళం నుండి మనకి వినవచ్చే ఈ పాట చాలా హృద్యంగా ఉంటుంది. ఏ కార్తీక మాసపు చల్లని వెన్నెలలో ఆరుబయట పడుకుని రేడియోలో ఆప్ కి ఫర్మాయిష్ లో వస్తున్న ఆపాటని..తక్కువ సౌండ్లో వింటూ ఉండటం ఉంది చూసారు.. ఓహ్.. గ్రేట్ ఫీల్. అది అనుభవిస్తే కాని తెలియదు
ముఖేష్ గళం మనకి ఆ పాట తాలూకు అందమైన దృశ్యాలతో..మమైకం చేసి ఓ..అద్భుత ఆనందార్ణవం మిగిల్చి వెళుతుంది. తరవాత వినవచ్చే పాటలు ఏవి మన చెవిని బాహ్యంగా కూడా తాకలేవు. ఎన్నోసార్లు ఎంతోసేపు ఆపాట మాధుర్యంలోనే మనం తేలి ఆడుతూ పాడుకుంటూనే ఉంటాం. అది ఆ పాట కున్న విశేషమైన ముద్ర.
ఈ పాటంటే..నాకు చాలా చాలా ఇష్టం.
ఈ పాటకి సాహిత్యం సాహిద్ లుధియాన్వి.
సంగీతం: మధురస్వరాల "ఖయ్యాం"
ఈ పాటకి 1977 సంవత్సరంలో ౩ పిలింఫేర్ అవార్డులు వచ్చాయి. సాహిత్యం, సంగీతం, గాయకుడు కి కలిపి.
అలాగే సిలోన్ రేడియో లో వచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన "బినాకా టాప్ టెన్ " లో..మొట్టమొదటి స్థానం లో ఈ పాట చోటుచేసుకుందట.
ఈ పాట సాహిత్యం హిందీలో నుండి తెలుగులోకి తర్జుమా చేసాను ..చూడండి
అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది.
అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది.
ఏమనంటే ఆ భగవంతుడు నిన్ను నాకోసమే సృష్టించాదేమో అని
అంతకు మునుపు ఆకాశంలో నక్షత్రంగా ఉండి ఉంటావు
అలాంటి నిన్ను నాకోసమే భూమి పైకి పిలుచుకువచ్చాడు
అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది.
ఏమంటే ఈ నీ శరీరం మరియు ఈ నీ చూపులు
నా (కోసం)కు మాత్రమే సంబంధించిన విలువైన సంపద అని
ఈ నీ కురులు ఇచ్చే దట్టమైన నీడ కూడా నా కోసమే
ఈ నీ పెదవులు మరియు కౌగిలి (భుజాలు) నాకు మాత్రమే సొంతమైన సంపద అని
అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది.
ఏమనంటే మ్రోగుతున్న ఈ మంగళ వాయిద్యాల మధ్య ..
తోలిరేయిన నీ మేలి ముసుగు తీస్తూ ఉంటూ నేను
సిగ్గుపడుతూ నీవు నా కౌగిలిలో ఒదిగిపోతూ (ఉంటావని)
అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది.
ఏమనంటే నన్ను ఇలానే నీవు జీవితాంతం నన్నే కోరుకుంటూ ఉంటావని
నీ ప్రేమ నింపుకున్న చూపులతో నా కోసం చూస్తూ ఉంటావని
నాకు తెలుసు ఇదంతా నీకు గుర్తు ఉంటుంది.
అయినా అలా చెప్పానులే
అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది.
" అమిత్" ఓ.. అద్భుతమైన కవి. తన ప్రేయసి "పూజ" కోసం వ్రాసుకున్న కవిత,పాడుకున్న పాట, కలలు కన్నఆశ లు ఇది.
మనిషి ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అంటారు కదా! అలా పూజ తల్లిదండ్రులు అమిత్ తో కాకుండా ఆమెకి వేరొకరితో వివాహం నిశ్చయిస్తారు. ప్రేమికుడు హృదయం ముక్కలైపోతుంది.పగిలిన హృదయం తో.. ఆ ఊరినుండి దూరంగా వెళ్ళిపోతూ..ఆ విఫలమైన ప్రేమని తలచుకుంటూ.. అలా ప్రయాణిస్తున్న రైలు పెట్టెలో ఒంటరిగా కూర్చుని .. దుఃఖిస్తూ ఉన్నప్పుడు.. అమిత్ కనుకొనుకుల నుండి జారి నిలిచిన ఒకే ఒక కన్నీటి చుక్కని..అర్ధం చేసుకోగల్గితే చాలు..
స్వచ్చమైన ప్రేమ కి చిరునామా పగిలిన హృదయం కాదని. హృదయాలని పగలకొట్టే ప్రేమలు వద్దని.
ఆ ఒక్క సన్నివేశం కోసం నేను ఆ చిత్రాన్ని అర్ధరాత్రులు వరకు మేలుకుని మరీ చూస్తాను. అంత గొప్ప స్క్రీన్ ప్లే.
అమానత్ అంటే అర్ధం తెలిసిన వారెవరు జీవితంలో మరొకరికి చోటు ఇవ్వరు. అమానత్ ..జన్మతా సంక్రమించిన మనదైన, మనకోసమే పరిమితమైన విలువైన సంపద. ఇంత కన్నా చెప్పేందుకు వేరే మాటలే లేవు.
ఈ పాట కాలర్ ట్యూన్ కోసం Hutch network లో ఓ..రెండు సంవత్సరాలు ప్రయత్నించామ,.. అంతలా నవ్వుకోకండీ :) .అంత ఇష్టం నాకు ఈ పాటంటే!
అలాగే కభి కభీ చిత్రంలో .. లతాజీ వెర్షన్లో ఈ పాట చూస్తుంటే..ను, వింటుంటేను కూడా దుఖం వస్తుంది.
ఒక ప్రియుడు తన ప్రేయసిని యెంత అద్భుతంగా వర్ణించగలడు. సృష్టిలో ప్రేమ కన్నా మదురమైనది,స్త్రీ కన్నా అందమైనది వేరొకటి ఉండదు..అని అనిపించే మధురాతిమదురమైన రోజులవి. ప్రేమికుడిగా మారిన ప్రతి ఒక్కరు కవి అవుతాడేమో! ఆ కవి తన మనసులో కల్గిన భావాలని ఆవిష్కరించే క్రమం లో ఎన్ని దృశ్యాలు అలా అలా కదలిపోతూ ఉంటాయి. ఎన్ని పాటలు పాడుకుంటారు..అలా.. ఈ పాట దృశ్యం కావ్యం కూడా..
యువతి యువకులలో తొలిచూపులోనే ఓ..ఆకర్షణ ఏర్పడి అది ప్రేమగా మారి.. ప్రేయసి ఆలోచనలతో నిదుర రాని రాత్రులలో.. ఆ ప్రేమికుడు ఇలా అనుకుంటున్నాడు
ఎప్పుడు కాదు ఎందుకంటె..ఎదురుగా నువ్వు ఉన్నప్పుడు,నువ్వు లేనప్పుడు కూడా అప్పుడప్పుడు నా మనసులో ఒక అందమైన ఆలోచన కల్గుతుంటుంది. ఆ భగవంతుడు నిన్ను నా కోసమే సృష్టించి ఉంటాడు. అందుకే నువ్వు నాకు తారస పడ్డావు. అంతకు ముందు ఆకాశంలో ఓ..నక్షత్రం వై వెలుగుతూ ఉండి ఉంటావు. అలాటి నిన్ను నాకోసం ఈ భూమిమీడకు రప్పించి ఉంటాడు దేవుడు..నేను యెంత అదృష్టవంతుడిని.
అప్పుడప్పుడు నా మనసులో ఆలోచ వస్తూ వుంటుంది అందమైన నీ సౌందర్యం,ప్రేమ నింపుకున్న అందమైన నీ చూపులు కేవలం నాకోసం మాత్రమే ఉండిన,జన్మతా నాకు లభించిన సంపద. అందమైన, దట్టమైన నీ నీలాల కురుల నీడ నాకోసమే ! అమృతాన్ని ఒలికించే, అందించే నీ పెదవులు,నీ బాహుదండాలమధ్య ఒదిగి ఉండటం కూడా నాకు జన్మతా లభించిన విలువైన సంపద.అది నాకు మాత్రమే సొంతమైనది.
అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది. పవిత్రంగా మ్రోగుతున్న మంగళ వాయిధ్యాలమధ్య మనం సప్తపదులు నడచి వెళ్ళాము. తొలిరేయి నీ మేలిముసుగు తీస్తూ ఉంటె నీవు అందంగా సిగ్గుపడుతూ నా కౌగిలిలో ఒదిగిపోయే దృశ్యం తలచుకుంటే యెంత మనోహరంగా ఉంటుంది.
అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది. నన్ను ఇలాగే ఉండాలని ..నీవు జీవితాంతం నన్నే కోరుకుంటూ ఉంటావని, ఎల్లప్పుడు నీ ప్రేమ దృక్కులు నావైపే ప్రసరిస్తూ ఉంటాయని నాకు తెలుసును నీకూ తెలుసును. ఊరికే ఏదో గుర్తు చేసాను అంతే! అప్పుడప్పుడూ నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది ఇలాగున.
అంటాడు అతను.
ఆపాటలోకి.. లీనమై ఆ అందమైన ఆత్మని పట్టుకోగల్గితే.. మన మనోవీధిలో ఎప్పుడూ ఈ పాట విహరిస్తూనే ఉంటుంది. ప్రతి రోజు ఈ పాట వింటున్నా ..ఇంకా ఏదో ఏదో క్రొత్త అర్ధం సృశిస్తూ ఉంటుంది నాకు.
అందుకే.. ఒంటరి తనంలో ఈ పాట, ఒంటరితనం సృష్టించుకుని ఈ పాట లో మమేకమై నేను. .
పాట వీడియో ఇక్కడ జతపరచలేను. ఆడియో మాత్రం వినండీ
ఓకే ఫ్రెండ్స్..ఓపికగా చూసినందుకు ధన్యవాదములు.ఈ పాట అర్ధం చేసుకోవడంకోసమే నేను హిందీ నేర్చుకోవడం మొదలెట్టిన రోజులని మర్చి పోను. ఇంత అందమైన పాట..అర్ధం కానందుకు నేను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి కూడా. ఒన్స్ అగైన్ థాంక్ యు వేరి మచ్.🙏