10, ఏప్రిల్ 2012, మంగళవారం

ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం

అమ్మాయిని అత్తవారింటికి పంపించేటప్పుడు.. చెప్పవలసిన నాలుగు  మంచి మాటలు కోసం కౌన్సిలింగ్ ఇప్పించాలి.
అమ్మాయి గర్భం దాల్చిన తర్వాత కలిగే అనుమానాలకి,భయాలకి కౌన్సిలింగ్ ఇప్పించాలి.
భార్య-భర్తల మధ్య బేదాభి ప్రాయాలు వస్తే కౌన్సిలింగ్ కావాలి.
తల్లిదండ్రులకి బిడ్డలా భవిష్యత్ ఏమిటో అర్ధం కానప్పుడు పిల్లలకి కౌన్సిలింగ్ కావాలి.
ఈ కౌన్సిలింగ్ అవసరాలు బాగా పెరిగిన రోజులివి.
 నేను అయితే ఈ కౌన్సిలింగ్ ల బదులు ఒక పుస్తకం కొని ఇవ్వండి అని చెపుతాను ..ఆ పుస్తకం పెద్ద బాలశిక్ష
ఆ పుస్తకం ఉంటే.. చాలా మంది పెద్దలు మన ప్రక్కన ఉండి..మంచివిషయాలు చెపుతూ,భయాలు,సందేహాలు తీరుస్తున్నట్లే ఉంటుంది కూడా.
అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు ..చెప్పవలసిన విషయాలు ఉన్నఒక  శతకం..కుమారి శతకం.ఉన్నదని..నాకు అసలు తెలియదు.అలాగే గువ్వల చెన్న .. అంటూ సాగిన పాట సిరివెన్నెల చిత్రంలో విన్నప్పుడు.. అది ఒక శతకం అని తెలియదు...
ఎప్పటిదాక అంటారా!? నేను పెద్ద బాల శిక్ష చూసేదాకా. మొదటి సారి నేను నెల్లూరు లో మా కుటుంబ స్నేహితుల ఇంట్లో .. పెద్ద బాల శిక్షని చూసాను.
చిన్నప్పుడు నేను పెదబాలశిక్ష చదవలేదు.ఎందుకో..మా ఇంట్లో ఆ "విజ్ఞాన సర్వస్వం " ఉండేది కాదు.  మా అబ్బాయి కోసం నేను "పెద్ద బాలశిక్ష' కొనుక్కుని వచ్చాను.. కానీ ఇప్పటికి రోజు ..ఆ పుస్తకం తీసుకుని చదవడం అలవాటు అయిపొయింది.
మా అమ్మ నన్ను కాపురానికి పంపేటప్పుడు.. చాలా సామాగ్రి తో పాటు... భారత,భాగవత,రామాయణ గ్రంధాలు కొని ఇచ్చింది.
ఖాళీ సమయాలలో ఈ గ్రంధాలు కూడా తప్పకుండా చదువుకో..అని. అప్పటివరకు అన్నిపుస్తకాలు చదవనిచ్చిన అమ్మ ఇప్పుడు ప్రత్యేకంగా ఇంతంత..లావు పుస్తకాలు కొని ఇచ్చింది ఏమిటి..చాదస్తం.ఆ శ్లోకాలు..అర్ధాలు చదవడం ఎవరి తరం అనుకునేదాన్నివిసుగ్గా. అదే మాట అమ్మతో అంటే..ఇలా ఈ మహాత్గ్రంధాలు ఇవ్వడం మన సంప్రదాయం అని చెప్పింది.
అంతకు ముందు..మాఇంట్లో పూజ గదిలో ఓ..పీటమీద ఆ మూడు..గ్రంధాలు ఉండేవి. "శ్రీ మద్భాగ వద్గీత " లోని ఒక శ్లోకం ని..తాత్పర్యoని ...ని పూజ ఆఖరి సమయంలో చదువుకుని..పిల్లలు ఉంటే మాకు వినిపించి.. ఆ గ్రంధాన్ని మూయకుండా ..చదివిన పేజీపైన పువ్వులు అక్షితలు ఉంచి నమస్కరించడం చేసేవారు.అమ్మ,నాయనమ్మ కూడా.  
 అలా అది చూసిన ఉత్సాహంలో పదవతరగతి పరీక్షలు వ్రాసాక సెలవలలో..ఏం తోచక "శ్రీ మద్భాగ వద్గీత" ఏక దీక్షగా చదువుతుంటే..ఈ వయసులో చదవకూడని.. లాగి పడేసేవారు. ఏమిటో..ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు ఏం చేయమంటారో!వాళ్ల్లకే తెలియదు అని మనసులో స్టేట్ మెంట్ లు ఇచ్చేసుకుని... ఏ పొట్లం కట్టి ఇచ్చిన పేపర్ ముక్కతో..సహా సుదీర్ఘంగా చదివి పడేసేదాన్ని.
పదిహేడేళ్ళు నిండిన రెండు నెలలకే  చదువులు వద్దని పెళ్లి చేసి పడేసి.. ఇప్పుడు అత్తగారింట్లో..ఇంతలావు పుస్తకాలు చదువుకోమని ఇస్తారు ఏమిటీ..అని తిట్టుకున్నాను అనుకోండి. కానీ ఆ మహా గ్రంధాలు మాత్రం నాకు అసలు చదివినా తలకేక్కేవి కాదు.
కానీ ప్రతి ఇంట్లో ఉండాల్సిన .. పుస్తకం ఒకటుంది... అని తర్వాత  కదా తెలిసింది. పెళ్లి అయినాక రెండేళ్ళకి
పెద్ద బాలశిక్ష ని కొనుక్కోచ్చుకుంటే..ఇంకా చిన్న పిల్లవా!?..పెద్ద బాలశిక్ష చదవడానికి అని పరిహాసమాడితే.. అలా ఓ..లుక్ నిరసనగా పడేసి..అందులో మునిగి పోయేదాన్ని.
తర్వాత ఎవరికైనా బహుమతి ఇవాల్సి వచ్చినప్పుడు..పెద్ద బాలశిక్షని ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. విదేశాలలో  ఉన్న వారికి ఎవరికైనా ఇచ్చినా బరువు ఎక్కువ ఉన్నా కూడా వేరే వస్తువులు తగ్గించుకుని పెద్ద బాలశిక్ష ని తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాం అని చెపుతుంటే  చాలా సంతోషంగా కూడా ఉంటుంది.
ఇప్పటికి రోజు న్యూస్ పేపర్ తో పాటు..పెద్ద బాల శిక్ష పట్టుకోచ్చుకుని..ఓ..చేతిలో కాఫీ కప్పు..తోపాటు  అందులో ఉన్న ఆసక్తి కర విషయాలని .. కూడా  త్రాగేసి.. నిత్య నూతన పెద్ద బాలశిక్ష విద్యార్ధిని.అనిపించుకుంటాను.


గాజుల సత్యనారాయణ గారి పెద్ద బాల శిక్ష  2004  వ సంవత్సరం నుండి  ఇప్పటికి 72 ముద్రణలు అయ్యాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వేల 116 రూపాయలు మాత్రమే! పది కి పైగా కాఫీలు కొంటె.. 100 ..లెక్కన ఇస్తారు.డిస్కౌంట్ ఉంటుంది. (నేను అప్పుడప్పుడు అలా కొంటూ ఉంటాను)
చిన్న పిల్లలకి ఒక బొమ్మ బహుమతిగా ఇవ్వడం కంటే ఒక పుస్తకం ఇవ్వడం బాగుంటుంది అని. ఇంగ్లిష్ డిక్ష్ట నరీ  ఇవ్వడం మానేసి ఈ మధ్య పెద్ద బాల శిక్ష ఇస్తున్నాను. గాజుల సత్యనారాయణ గారి పెద్దబాలశిక్ష కాకుండా.
.
కూడా ఉంది.
యది హాస్తి తదన్యత్ర
యన్నేహాస్తి నత్ త్ క్వచిత్ ..
మహా భారతంలో ప్రచారం పొందిన జనవాక్యం .
ఇది పెద్ద బాలశిక్షకి  వర్తిస్తుంది..కదా!
మా ఇంట్లో ఉన్న పెద్ద బాలశిక్ష.. ఎప్పుడు బహుమతి కోసమే సిద్దంగా ఉంటుంది.  మళ్ళీ కొద్ది రోజులకి వస్తుంది. నేను చెప్పే ఒక మాట ఏమనగా.. ప్రతి ఇంట్లో ఒక పెద్ద బాలశిక్ష ఉండాలి. రామాయణ,భారత ,భాగవతములు లేకపోయినా సరే!
(ఈ విషయాన్ని పంచుకోవడానికి  స్పూర్తి కరం అయిన  సామాన్య గారికి ధన్యవాదములతో)

21 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

వనజగారు, నాకు ఎప్పుడు ఇస్తున్నారు "పెద్ద బాలశిక్ష' బహుమతిగా? తీసుకుంటాను మీరిస్తే!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు.. తప్పకుండా బహుమతి అందుతుంది. ఓకే..నా..! ధన్యవాదములు.

కాయల నాగేంద్ర చెప్పారు...

చిన్నప్పుడు నాన్న గారు చదువుతుంటే చూసాను. ఆ తర్వాత 'పెద్ద బాల శిక్ష' పేరు మాత్రం గుర్తుంది, కానీ చూడలేదు. ఇప్పుడు మీరు గుర్తు చేసారు. ధన్యవాదాలు! రేపటి నుంచి మా ఇంట్లో
'పెద్ద బాల శిక్ష' ఉంటుంది.

జ్యోతిర్మయి చెప్పారు...

ఇంట్లో పెద్దబాలశిక్ష వుంది కాని, మీర్రాసింది చదివాక ఇప్పుడు తీరిగ్గా చదవాలనిపిస్తుంది.

సి.ఉమాదేవి చెప్పారు...

పెద్ద బాలశిక్ష కాదు పెద్ద బాలరక్ష అనదగ్గ పుస్తకం.ఎప్పటికప్పుడు కొత్త విషయాలకు చోటిస్తూ సమగ్ర విషయవివరణ గావిస్తున్న పుస్తకం.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారూ "పెద్ద బాలశిక్ష' బహుమతిగా
నాకు కూడా కావాలి..
మీ దగ్గరికి వచ్చినప్పుడు తీసుకుంటాను సరేనా :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ తప్పకుండాను. బహుమతి రెడీగా ఉంటుంది. .. మీరు రావడమే ఆలస్యం. థాంక్ యు!

@ c .ఉమా దేవి గారు.. స్పందించి నందుకు సంతోషం అండీ..ధన్యవాదములు.

@జ్యోతిర్మయి గారు.. మీరు చూస్తూ..బుజ్జి పండు & పాపాయికి పరిచయం చేయండి ధన్యవాదములు.

@ నాగేంద్ర గారు.. చాలా సంతోషం. ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

buddha murali

9:10 AM (1 hour ago)

to me
వనజవనమాలి గారు మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు . హైదరాబాద్ లో ఈ పుస్తకాన్ని చాలా షాప్స్ లో వంద రూపాయలకే అమ్ముతున్నారు . ఇప్పుడు పిల్లలకు సెలవులు. సెలవుల్లో ఈ పుస్తకాన్ని చదివితే అంతకు మించిన ఆనందం, విజ్ఞానం మరోటి ఉండదేమో . (తల్లి తండ్రులు దగ్గరుండి చదివిస్తే మరీ మంచిది) జలతారు వెన్నెల గారు మీరు ఆ పుస్తకాన్ని ఓ సారి చూస్తే మీకు నచ్చిన వారందరికి ఆ పుస్తకాన్ని మీరే బహుమతిగా ఇస్తారు .( వనజ గారు ఈ కామెంట్ పోస్ట్ చేయాలనీ ప్రయత్నిస్తే రావడం లేదు . కామెంట్ చోట క్లిక్ చేస్తే ఏదో వెబ్ సైట్ ఓపెన్ అవుతోంది . వీలుంటే దీన్ని కామెంట్ గా పబ్లిష్ చేయగలరు )

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మురళీ గారు..మీ స్పందనకి ధన్యవాదములు. మరిన్ని మంచి విషయాలు తెలియ జేశారు. ఓపెన్ ID కామెంట్ వాళ్ళ ఇబ్బందులు ఉన్నట్లు అనిపిస్తుందండీ. మీ స్పందనకి ధన్యవాదములు.అలాగే మీకు కల్గిన ఇబ్బందికి విచారం తెలియజేస్తున్నాను. శ్రద్ద తీసుకుని అభిప్రాయం మెయిల్ చేసినందుకు ధన్యవాదములు.

గోదారి సుధీర చెప్పారు...

వనజ గారూ ,పెద్ద బాల శిక్ష పై మీ పరిచయం బాగుంది.ఎంత చదివినా తరగని గనిలా తయారు చేసారు గాజుల గారు.అదీ కాక ఇప్పుడు మనం ఘడియలు,విఘడియలు వంటి విషయాలు మరిచిపోతున్నాం కూడా.అవసరం లేకున్నా తెలిసి పెట్టుకోడం ఎప్పుడూ మంచిదే కదా!

మాలా కుమార్ చెప్పారు...

వనజ గారు ,
పెదబాలశిక్ష గురించి బాగా రాసారు . ఈ పుస్తకం మా పిల్లలందరికీ కొని ఇచ్చాను . నా దగ్గరా వుంది . అప్పుడప్పుడు , మరీ ముఖ్యం గా ఏదైనా గళ్ళనుడికట్టు పూరించాలంటే చూస్తూవునటాను :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Goaari Sudheera gaaru..Thank you very much.
@ Mala kumar gaaru Baagunnaaraa!
baagundandi.. mee anubhavam.
Thank you very much.

శ్యామలీయం చెప్పారు...

పెద్దబాలశిక్ష అంటే పెద్ద బాలురకు శిక్ష అని కూడా కాబట్టి నేను కూడా సంపాదించి చదివి నేర్చుకోవచ్చు చాలా విషయాలు! తప్పక ప్రయత్నిస్తాను.

ఇది చాలా మంచి వ్యాసం.

పల్లా కొండల రావు చెప్పారు...

వనజ గారూ!
పుస్తక పరిచయం బాగుంది. రామాయణం,భారతం,భాగవతం లేకున్నా ఇది ఉండితీరాలన్న తీరు పుస్తక ప్రాధాన్యాన్ని పెంచింది. కేవలం కెరీరిజం పేరుతో డబ్బు సంపాదించే చదువులు మాత్రమే కొనుక్కుంటున్న రోజులివి. సామాజిక శాస్త్రాలకు , నీతి శాస్త్రాలకు విలువ లేని రోజులివి. చిన్నప్పుడు మనం నేర్చుకున్న వాటిలో మంచి విషయాలు మనలో వైఖరులకు కారణాలవుతాయి. అది సమాజ మనుగడకు కారకాలవుతాయి. ఉదాహరణకు తల్లిదండ్రులను కావడిలో మోసిన శ్రావణ కుమారుడి కథ నన్ను బాగా ప్రభావితం చేసేది. పెద్ద బాలశిక్ష గురించి పూర్తిగా తెలియదు. చిన్నప్పుడు కొంచెం చదివాను. ఏమీ గుర్తు లేదు. మన సంస్కృతిలో ఉన్న మంచి విషయాలు నేటి విద్య ప్రైవేటీకరణ తో మంటగలసి పోతున్నాయి. మీ పోస్టు వల్ల సమాజానికి చాలా మేలు జరుగుతుంది. ఇలాంటి మంచి పోస్టులు ఇంకా చాలా వ్రాయాలి మీరు. పెద్దబాలశిక్ష బుక్ ఈ రోజే కొంటాను. చదివాక బాగుందనిపిస్తే ఈ బుక్ ని మా మార్కెటింగ్ సంస్థలో ప్రొడక్ట్ గా ఉంచుతాను. ఎవరికైనా బహుమతి ఇచ్చేందుకు మిమ్ములను అనుసరిస్తాను. ఆలోచింపజేసేవిధం గా పోస్టు ఉంచినందుకు అభినందనలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్యామలీయం గారు.. మీ స్పందనకి ధన్యవాదములు. మంచి పుస్తకం ఎవరి దగ్గరైనా ఉండాలి. మీరే ఒక పుస్తకం లాటి వారు. మీకు ఒక పెద్దబాలశిక్ష ..గొప్పవిషయం.

@ కొండలరావు గారు..మీ స్పందనకి మరి మరి ధన్యవాదములు.

జయ చెప్పారు...

ఈ పెద్ద బాలశిక్షనే పాతకాలపు ఇంటర్నెట్ అని ఎవరో రాయంగా ఆ మధ్య చదివాను. అది చాలా నిజం. ఈ బాలశిక్ష ఎన్నో రకాలుగా విస్తరిస్తు ఆధునిక సమాచారం తో కొత్త కొత్త గా కూడా పబ్లిష్ అవుతోంది. రోజుకొక సారి ఇందులో చేతికొచ్చిన పేజీ చదివినా చాలు. మనకెంతో విజ్ఞానం పంచుతుంది. ఈ మధ్యే నేను కూడా ఒకరికి గిఫ్ట్ గా ఇచ్చాను:) చాలా బాగా చెప్పారు.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

“ పెద్దబాలశిక్ష” విఙ్ఞాన భాండమై
తెలుగు లిండ్ల నాడు కొలువు దీరె ,
నేడు వనజ గారి వేడుక ఫలియించి
కొలువు దీరు గాక ! కోర్కె దీర

“ కామెంటును” పద్యములో
ఈ మాదిరి రాయ నితని కెంతటి వెఱ్ఱో ?
ఏమిది యనుకొందుర ? మరి
నామది కొక తలపు వచ్చె నాలోచింపన్

“ తెలుగులకు – పద్యముకు” విడదీయరాని
బంధమున్నది , భాషించు పట్ల - పద్య
మొక్కటైనను , కొంతైన పొర్లి వచ్చి
మాటతీరును “ ఇంపు” గా మార్చును గద !

తెలుగు పద్యము మన నుండి తొలిగె నేమొ !
ఎవ్వరైనను బ్లాగులో నేది యైన
“ పద్య” రూపాన రాసిన , పదుగురైన
చదువ నెంచరు , ఆ కొదువ తీర ...

పూని “ కామెంటు “ పద్య రూపాన రాసి
బ్లాగరుల చేత జదివించ వచ్చు ననుచు
“ పద్యమును తెల్గు బ్లాగరు మధ్య నిలుపు “
చిరు ప్రయత్నమ్ముగా నిట్లు చేయు చుంటి

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జయ గారు.. మీరు చదివిన .. పెద్ద బాలశిక్ష అంటే పాత కలం నాటి ఇంటర్నెట్ ..అని చెప్పినది ..అమయ బ్లాగ్ .

నిజం కదా! మీ స్పందనకి ధన్యవాదములు.

& వెంకట రాజారావు లక్కాకుల గారు..పద్యం పైన మీకున్న మమకారం తో..ఇలా కామెంట్ల రూపంలోనైనా బ్లాగులలో భాసిల్ల జేస్తున్న మీకు మనఃపూర్వక ధన్యవాదములు. మీ స్పందన సుందరమైన పద్య రూపమున అలరించినది.ధన్యవాదములు.

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

కొంటానండి!

Rajesh Devabhaktuni చెప్పారు...

ఇప్పుడు ఈ పెద్ద బాలశిక్ష రెండు బాగాలు చక్కగా బైన్డింగు చేసి చక్కని పేపర్లో వస్తుంది. అవి ఈ మధ్యనే కొన్నాను. నా దగ్గర ఉన్న పేపర్ బాక్ పుస్తకం వేరే వారికి ఇచ్చాను.

Indianblogger చెప్పారు...

మీరు ఇక్కడ రాసినదే మా చిన్నాన్నగారు ఎప్పటి నుండో చేసేవారు.నాకు కూడా ఆయనే బహూకరించారు. నేను ఆన్లైన్నో ఈ పుస్తకం కోసం వెతుకుతుంటే,మీ బ్లాగ్ కనిపించింది....నీలిమా