12, ఏప్రిల్ 2012, గురువారం

"మానవి " గురించి ఓ..మానవి..





"మానవి " గురించి ఓ..మానవి..

పెద్దల ఇష్టాలతో బేరసారాలు ముడిపడిన పెళ్ళిలో.. 

20  సంవత్సరాలు ఏదైతే తన సంపూర్ణ జీవితం అనుకుందో..ఆ జీవితం తనదికాదని తెలిసినప్పుడు..తన ఆశలు అడియాసలై.. కట్టుకున్న ఆకాశ హర్మ్యాలు పేక మేడలా కుప్పకూలిపోయినప్పుడు  కానీ భారతీయ వివాహ వ్యవస్థ లోని డొల్లతనం అర్ధం కాలేని  స్త్రీ.. వసంత. 

జీవితమంతా   వసంతంలా సాగిపోవాలనుకునే  అతి సామాన్యమైన స్త్రీ. 

ఆమె గుంటూరులో డిగ్రీ చదువుకునే రోజుల్లో కూడా విద్యార్ధి సమస్యలకి మద్దతునివ్వని, ఉక్కు కర్మాగార ఉద్యమంలో గళం కలపని బుద్దిగా ఒద్దికగా చదువుకుని డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయి. 
రంగనాయకమ్మ నవలలోని మొగుడులాంటి మొగుడు తనకి దొరకగూడదని ప్రార్దిస్తూ,యద్దనపూడి నవలా నాయకుడు నాకు ఎక్కడ దొరుకుతాడులే ఆని అనుకుని నిరాశపడే అమ్మాయి. 

ప్రేమ దోమ లేకుండా తల్లిదండ్రులు కుదిర్చిపెట్టిన సురేష్ ని వివాహం చేసుకుని డాక్టర్ గారి భార్య అయింది. ఇద్దరి బిడ్డల తల్లి అయింది. నా ఇల్లు, నా సర్వస్వం నా భర్త, నా బిడ్డలే   నాప్రపంచం అనుకుంటూ అందులో ముని గిపోయింది.

భర్తకి టూత్ బ్రష్ పై  పేస్ట్ దగ్గరనుండి,బయటకి వెళ్ళేటప్పుడు ఇచ్చే కర్చీఫ్ వరకు స్వయంగా అందిస్తూ భాద్యతగా గృహిణిగా..తన కర్తవ్యమ్ నిర్వహించేది. తనకున్న ఇద్దరి కూతుళ్ళ లో లావణ్య అంటే ఎక్కువ ఇష్టం.ఆమె మాట  తుచ తప్పకుండా వింటుందని.  ఇక రెండో కూతురు నవత   అంటే..కొంచెం విముఖం.తన మాట అసలు వినదని.   చదువంటే పెద్ద ఆసక్తి లేని లావణ్యకి పెళ్ళి  చేసి అత్తగారైంది.  

అలాటి వసంత జీవితంలోకి .. వడగాల్పులా నీలిమని  తీసుకువచ్చి వదిలేసాడు భర్త సురేష్. 
కుటుంబంలో భార్య భర్తలమధ్య ప్రేమ,అనురాగం,సదవగాహన లోపిస్తే కుటుంబ వ్యవస్థ తాత్కాలికంగాను, శాశ్వతం గాను దెబ్బతినే అవకాశాలు ఉన్న్తాయి.  సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్య బలహీనతలు ఉండటం,సర్దుబాటు లేకపోవడం వల్ల వివాహ సంబందం తెగిపోవడమనేది జరిగిపోతుంది. 

ఈ నవలలో అదే జరిగింది. పెళ్ళయిన ఇరవై సంవత్సరాల కాలంలో ఏనాడు భార్య పై ప్రేమ  కలగ లేదని..తోటి డాక్టర్ నీలిమపై తనకు ప్రేమ కల్గినది అని ఆమెని వదులుకోవడం కష్టంగా ఉందని.. రహస్యంగా దాచి వసంతని మోసం చేసే ఉద్దేశ్యం తనకి లేదని  ఆమెకి  చెపుతాడు సురేష్. ఇకపై వసంత కలసి ఉండటం ఇష్టం లేదని కూడా చెపుతాడు.

అయ్యో! ప్రేమ అంటే ఏమిటి..? భర్తని నేను ప్రేమించాలని నాకు ఎవరు చెప్పలేదే..? అయినా మీ నాన్నకి ఇప్పుడు ప్రేమ ఏమిటే? ఇన్నేళ్ళ మా బంధంలో ప్రేమ లేకుండానే కాపురం చేసానా!? అని విస్తుపోయే సగటు భారతీయ స్త్రీ వసంత. 

ఇరవై ఏళ్ళు కాపురంచేసి భర్తపై హక్కులైతే సంపాదించుకుంది కానీ అతని మనసులో  తన పై ప్రేమ లేదని తెలుసుకుని మనసులో కుమిలిపోయి.. అమ్మా ! లావణ్యా..నా తరపున వఖల్తా పుచ్చుకుని అమ్మకి అన్యాయం చేయవద్దని మీ నాన్నకి నువ్వైనా చెప్పమ్మా! అని దీనంగా  వేడుకుంటుంది.

ఆ లావణ్య అనే కూతురు భర్త తో కలసి వచ్చి ఆస్తులని పంపకం చేసుకుని.. నాన్నని ఎలాగోలా నువ్వే ఓపికగా మార్చుకోవాలి గాని..మా అత్తవారింట్లో ఈ విషయం తెలిస్తే యెంత నామోషి అనే  కూతురిని చూసి వసంత నిర్ఘాంత పోతుంది. సగటు స్త్రీలా భర్తని నలభై ఏళ్ళ ప్రౌడ ప్రాయంతో..ఆకర్షించడానికి ప్రయత్నించి విపలమై..
భర్త పరాయి స్త్రీతో కలసి ఉంటూ తనని నిర్లక్ష్యం చేయడాన్ని భరించలేక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది.

ఆమెని బ్రతికించి వసంత స్నేహితురాలు రోహిణి ఇంటికి పంపించాక అక్కడ మరో స్నేహితురాలు  అవివాహితురాలు శాంత కి ఆమె స్నేహితుడు రాధాకృష్ణ కి గల సంబందాన్ని  అసహ్యించు కుంటూనే social  dis organisation  గురించి తెలుసుకుంటుంది. వివాహ వ్యవస్థలో లేని ప్రేమ గురించి, అంతకు క్రితం ఆమె ఎప్పుడో చదివిన నవలలోని భర్త ప్రేమ కోసం దేవులాడే ఆడవాళ్ళ గురించి  గుర్తు తెచ్చుకుని.. వారి స్థానంలో తనని పోల్చుకుని వ్యద చెందుతుంది.   

 పెళ్ళి  అనేది కుటుంబం సభ్యుల మధ్య,సమాజంలో ఇతర సమూహాల మధ్య లైంగిక సంబంధాలని క్రమ బద్దం అయితే చేయవచ్చోమో కానీ ప్రేమ ఆధారం లేని పెళ్ళి  అనే భవనం ఏదో ఒకనాడు కుప్పకూలి పోతుందని తెలుసుకుంటుంది. పురుషుల అక్రమ సంబందాలు,బహు వివాహాలు వల్ల ఇలాంటివి  జరగడం వివాహిత స్త్రీలకి అమితమైన బాధ కలగడం జరుగుతూనే ఉంది కదా! ఆమె విషయంలోను అదే జరిగింది

వసంత తను  సురేష్ భార్యగా  హోదా కోల్పోతానని బాధ పడుతూ సమాజంలో మొగుడు వదిలేసిన, లేదా మొగుడుని గుప్పిట పెట్టుకోలేనితనం అని  అందరూ ఎద్దేవా చేస్తారని బాధపడుతూ సంఘర్షణతో  పిచ్చిదయి పోయి  భర్త తో కలసి ఉండటం ఇష్టం లేక తన ప్రమేయం లేకుండానే భర్త నుండి విడదీయబడుతుంది.  చివరకు అన్నీ పోగుట్టుకున్న భావనలో జీవశ్చవంలా మారి చిన్న కూతురు నవతతో ఆమె ఉంటున్న విశాఖపట్నం చేర్చబడుతుంది. 

అక్కడ నవత స్నేహితులని,ఆమె స్నేహితులు ఆమె కలసి చేసే ఉద్య మాలని గమనిస్తూ  ఆనారోగ్యంగా ఉన్న ఉద్యమకారునికి  సేవే చేస్తూ తనలో ఉన్న తనని  గుర్తించుకుంటుంది. 

స్త్రీ కి జీవితం అంటే పెళ్ళి ,పిల్లలు,ఇల్లు మాత్రమే కాదని జీవితం లో వాటికి అధిక ప్రాధాన్యత నివ్వడం మూలంగా బలహీనమైన అనుబందాలు నిలబడలేనప్పుడు వ్యద చెందక తప్పదని గుర్తించింది వసంత. 

సిద్దాంతాల కోసం ఉద్యమంలో నడిచే వారు కొందరైతే, సిద్దాంతాలు ప్రక్కన పెట్టి ఇతరులకిమంచి జరుతుంది అనుకుంటే  ఆ విధంగాను నడిచే కొందరు  ఉద్యమ కారులుని,  అలాంటి లోకంని  తన కళ్ళతో తానూ చూసి ..నిర్ధారించుకుని వాటి గురించి అనర్ఘళంగా  మాట్లాడే స్థాయికి ఎదిగిన వసంతని చూస్తే మనకి ఆశ్చర్యం కల్గుతుంది.  ఈ వసంత ని  చూస్తే భర్త ప్రేమకి నోచుకోలేదని ఆత్మ హత్య చేసుకోబోయిన వసంత యేనా ఈమె అని అనుకుంటాం. 

ఆఖరికి కొన్ని నెలల తర్వాత చూసిన భర్త ని చూసి కూడా ఆమె మనసులో కోపం,భాద కలగకపోవడ అనే లక్షణాలని చూసి ఆశ్చర్య పోతాం.  చిన్న కూతురు మాటలతో, చేతలలో కనిపించే వ్యక్తిత్వం, ఆధారపడని తత్త్వం, స్నేహశీలత..ఇవన్నీ ఆమెకి ఒక  కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. 

నవత తన స్నేహితురాలు రాజ్య లక్ష్మి యవ్వన ఉద్రేకం లో చేసిన పొరబాటు ఆమె తనని వివాహం చేసుకో వాలనుకున్న  అతనికి   ఆ సంగతి చెప్పడం, ఎంతో  ఆదర్శ వాదులుగా కనిపించే ఉద్యమకారులు స్త్రీ శారీరక శీలానికి   ప్రాధాన్యత నిస్తూ సగటు మగవారిలా ప్రవర్తించడం, మరొక పురుషుడు..ప్రేమించినప్పుడు  అతను ఆమె వ్యక్తిత్వానికే  గాని శీలం అనే పదానికి  ఎక్కువ  విలువ ఇవ్వకపోవడం అనే విషయాలతో  (మనసుఅంగీకరినచని,సాంప్రదాయవాదులు ఆమోదించని) విషయాలు ) పాటు.. శాంత -  రాదాకృష్ణ మధ్య  ఉన్న పెళ్ళి  లేని ప్రేమ సంబంధాలు , ఆ సంబంధాలకి  సమాజంలో ఉన్న విలువ.. వాటికి ప్రాధాన్యత నివ్వకుండా.. వారికి నచ్చిన జీవన మార్గంలో నడిచే వారిని   ఈ నవలలో మరొక కోణంగా  చూస్తాం.మెదడుని తొలిచే ఆలోచనలతో  పెళ్ళి లేని ప్రేమల గురించి, సహజీవనం గురించి ఆలోచిస్తాం.

ఈ నవలలో నన్ను అమితంగా ప్రభావితం చేసిన పాత్ర "వసంత"
భారతీయ సాధారణ గృహిణిగా మనకి పరిచయమై.. నవల ముగింపుకి వచ్చేసరికి ఒక మనిషిగా, మానవిగా పరిణామ క్రమంలో ఎదిగిన స్త్రీగా చూపడం నాకు బాగా నచ్చింది. 

ప్రేమ లేకపోయినా కుటుంబం ఉంటుంది. 
అదే ప్రేమ లేని స్త్రీ-పురుష అనైతిక సంబంధాలు ఉన్నాయి.
ప్రేమని ఆశించి, ప్రేమని ఇచ్చి, ప్రేమని పొందుతూ  సమాజానికి  వెరవని , కుటుంబ కట్టుబాట్లు లేని స్త్రీ-పురుష సంబంద భాంధవ్యాలు  ఉంటాయని  వాటి గురించి  కూడా చెపుతుంది ఈ నవల. 

భారతీయ సమాజం లో కూతురిగా మాట వెల్లడించుకునే స్వేచ్చలేక, భార్యగా మారిన   ఇరవై ఏళ్ళ తర్వాత కూడా భర్త ప్రేమకి నోచుకోక,తల్లిగా బిడ్డలని ప్రభావితం చేయలేక,వారి మనసులో తల్లిగా మంచి స్థానం సంపాదించుకోలేక..అదే సమస్త  జీవితం అనుకుని బ్రతికిన వసంతకి జ్ఞానోదయం కలుగుతుంది. 

భర్త వద్దన్నప్పుడు ఏ ఆధారం లేకుండా పోతుందని,  ఏ భద్రతా లేదని భావించిన వసంత ..కళ్ళకి కదలిక వచ్చింది.కళ్ళు చూడటం నేర్చుకుంటాయి,నోరు మాట్లాడుతుంది,జీవ శక్తి నింపుకుని ప్రవహించడం మొదలెట్టి భార్య నుండి,తల్లి నుండి వేరై..ప్రవహించడం మొదలెట్టింది..

ఆడదాని జీవితంలో ఏదో ఒక రోజు మనిషిగా మానవిగా మారాల్సిన రోజు వస్తుందని,అట్లా మారే శక్తి లేకపోతే. మారడానికి ఏ ఆధారం లేకపోతే సర్వనాశనం అయిపోతాం అని, ప్రాణాలు ధారపోసి అయినా మనుషుల్లా మారడానికి కావాల్సిన శక్తి సంపాదించుకోవాలని చెపుతూ కూతురికి ఉత్తరం రాస్తుంది వసంత.

 అలాగే ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉండాలని ఆ జ్ఞానం రావడం చాలా అవసరమని మీ అమ్మ ఒకరి భార్యగా కాకుండా ఒక వ్యక్తిగా బతుకుతుందని గర్వపడమని,నలుగురుకి సాయం చేస్తున్నందుకు సంతోషించమని చెపుతుంది.    తల్లి ప్రేమని బిడ్డలు అర్ధం చేసుకోవాలని,బిడ్డలకి చాకిరి చేసి పెట్టె అమ్మలుగా చూడటం కాకుండా..మనిషిగా చూడటం నేర్చుకోమని చెపుతూ.. నువ్వు..నాలా ఒకప్పటి వసంతలా కాకుండా ఒక వ్యక్తిలా గుర్తించుకునే రోజు కోసం ఎదురు చూస్తాను" అన్జెప్పి  ఉత్తరం ముగిస్తుంది.

మన భారతీయ సమాజంలో లక్షలాది వసంతలు ఉన్నారు. కొద్ది గొప్ప తేడాలతో వారి జీవితాలు చాలా వరకు అలాగే ఉంటాయి. వివాహ వైఫల్యంతో,సమాజంలో చులకన భావం ఏర్పడుతుందని , పుట్టింటి వారి ఆదరణ ఉండదని ,  ఆర్ధిక భద్రత లేకపోవడం లాంటి  విషయాలతో..  వెనకంజ వేస్తూ .. జీవితం కొల్లగొట్టబడి.. జీవశ్చవాలుగా..మిగిలిన వారు కనబడతారు. వారికి ఏం కావాలో తెలియని స్థితిలో ఆత్మహత్యా ప్రయత్నాలతో, లేదా మానసిక వికలాంగులై బ్రతుకుతూ హిస్టీరియా రోగులుగానో,రాక్షసుల్లాగా ప్రవర్తించే వారిగానో మారిన వారందరూ గుర్తుకువచ్చి  వారందరిపైనా సానుభూతి కల్గుతుంది. 
అలాంటి వారందరూ  నిజాన్ని గుర్తించి మళ్ళీ  నడక మొదలెట్టి  జీవితాన్ని సాగించాలనే స్ఫూర్తి వంతమైన సందేశం  ఈ నవలలో ఉంటుంది.

1989   డిసెంబర్ చతుర నవలగా వచ్చిన ఈ నవల 1998లో ప్రధమ ముద్రణ వచ్చింది. అప్పటి నుండి.. నేను ఈ నవల కొంటూనే ఉంటాను. బలహీన మనస్కులైన వసంత లాటి స్త్రీల కోసం ఈ నవల  నా నుండి బహుమతిగా అందుతుంది. 
అవును వసంత లాంటి వసంతలు ఉండకూడదు. ఈ నవల చదువుతుంటే..ఎన్నో సార్లు హృదయం ద్రవించి పోతుంది. వసంత పాత్రలో నన్ను నేను చూసుకుంటే పుట్టెడు దుఖం ముంచుకొస్తుంది.నెమ్మదిగా లేచి నిలబడి తడబడి అడుగులు వేయడం నేర్చుకున్న వసంత గుర్తుకు వస్తుంది. 

స్త్రీ జీవితంలో ప్రేమ,పెళ్లి,పిల్లలు.. కొంత భాగం మాత్రమే పూర్తి భాగం మాత్రం అవి  కానే కాదు. అలా అనుకున్నప్పుడే వసంత లు లేకుండా.."మానవి"మాత్రమే ఉంటుంది. అందుకే..మానవి నాకు చాలా  ఇష్టమైన నవల అయింది.

నేను చదవడం నేర్చినప్పటి నుండి ఎన్నో పుస్తకాలు చదివాను. కానీ నన్ను అమితంగా ప్రభావితం చేసిందనడం కన్నా, నాకు నచ్చిన నవలల్లో  మొదటిది,ఆఖరిది  కూడా అయిన నవల ఇది.  స్త్రీ ఒక కూతురు,ఒక సోదరి,ఒక భార్య,ఒక తల్లి వీటి అన్నిటికన్నా ముందు ఒక  మనిషి అన్నది ఎరింగి ఉండాలన్నది ..ఓల్గా గారి అభిప్రాయం మాత్రమే కాదు.. స్త్రీల అందరి అభిప్రాయం.కూడా. అలా అందరు అనుకున్నప్పుడు నాకు "మానవి" నవల కొనడం అవసరపడదు. 

ఈ నవల దొరుకు చోటు నవోదయ బుక్ హౌస్, విశాలాంద్ర బుక్ హౌస్, ప్రజా శక్తి బుక్ హౌస్.     .

(మిత్రులు ఎక్కడైనా  ముద్రా రాక్షసాలు ఉంటే మన్నించగలరు) 

అలాగే ఈ పోస్ట్ పై ఆరోగ్యకరమైన చర్చకి ఆహ్వానం.

15 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

ఇలాంటి ఒక నవల ఉందని పరిచయం చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు.
"వసంత" లాంటి వాళ్ళు కొందరు నాకు పరిచయమే. అందుకే నండి ప్రేమ/ పెళ్ళి జీవితంలో ఒక భాగం మాత్రమే, అని చెప్పినది.స్త్రీలందరూ కూడా భర్త, పిల్లల, ఉద్యోగం తో పాటు వారి చుట్టూ కూడా వారిదైన ఒక లోకం స్రుష్టించుకోవాలి.జీవితంలో ఆటుపోట్లు సహజం. అవి వసంత కు జరిగినట్టు అవ్వచ్చు, లేదా ప్రాణమనుకున్న వాళ్ళు గతించవచ్చు, ఎదైనా జరగవచ్చు. అలాంటప్పుడు తనకంటూ స్నేహితులు, తనదైన లోకం ఉంటేనే కదా నిలదొక్కుకునేది..

జ్యోతి చెప్పారు...

నేను ఈ నవల చదవలేదు కాని వనిత టీవీలో సీరియల్ గా వచ్చినప్పుడు చూసాను. నా మాటగా ఏం చెప్పను. మీరు చెప్పిన ప్రతీమాట నా మనసులో కూడా వచ్చింది.. ప్రతి స్త్రీ ముందు తనని తాను గుర్తించి , గౌరవించుకోవాలి. ఇందులో ఓల్గా గారు చెప్పిన మాటలు నన్ను కూడా చాలా ఆలోచింపజేసాయి..అర్రే.. నా మనసులో మాట ఆవిడకెలా తెలిసింది అనుకున్నా కూడా..

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జ్యోతి గారు.. మీ మనసైన స్పందనకి mareఎ మరీ ధన్యవాదములు."మానవి " ఎవరికి నచ్చకుండా ఉండదు కదా! స్త్రీలందరూ తప్పకుండా చదవాల్సిన నవల. ఈ సమీక్ష నచ్చిననదుకు సంతోషమండీ!ధన్యవాదములు.

@ జలతారు వెంనేలగారు..ఈ నవల ఒన్లినె లో ఎక్కడా లేదనదే!నేను వెతికాను కానీ దొరకలేదు. మీకు నచ్చినందుకు సంతోషం.మీ కోసం ఈ నవల కూడా సిద్దంగా ఉంటుంది.సరేనా! స్పందించి మీ విలువైన అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు.

జ్యోతిర్మయి చెప్పారు...

ఈ నవల ఎప్పుడో చదివాను. మళ్ళీ గుర్తుచేశారు. ఓల్గా గారి నవల్ని అలా చదివి ఒదిలెయ్యలేం..అవి మనల్ని చాలాకాలం వెంటాడుతూ వు౦టాయి.

సుజాత వేల్పూరి చెప్పారు...

ఈ నవల మొదటి సారి చదివినపుడు నిజంగా చాలా భయం వేస్తుంది. ఎవరికైనా వసంత స్థితి వస్తే ఎలా అని ఖంగారు పుడుతుంది.

మొగుడూ, పిల్లలే సర్వస్వం అనుకున్న వసంత పట్ల మనసు జాలితో నిండిపోతుంది.సురేష్ కి వసంత మీద ఉన్న ఫిర్యాదుల్ని ఒక్కటి కూడా నేను ఒప్పుకోను. తనకు కావల్సిన క్వాలిటీలు భార్యలో లేవని,తన అభిరుచులకు సరిపోలదని అలా నిర్ణయం తీసేసుకుంటాడా? అతనికి ఏర్పడ్డ ఆకర్షణకు వాటిని సాకుగా చూపిస్తాడంతే!

తన పుస్తకాలను అభిరుచుల్ని వసంతకు పరిచయం చేయడు. తన ఇంటి ఇల్లాలిగా,తన పిల్లలకు తల్లి గా తప్ప సురేష్ ఆమెకు విలువ ఇవ్వడు.

కానీ వసంత తనను తాను సంబాళించుకుని నిలబడటం బాగుంటుంది. అయినా ఎక్కడో నాకు ఒక అసంతృప్తి! వన్సంత ఏమిటి? ఒక నర్సా? అంతేనా?

ఎవరికైనా వసంత స్థితి వస్తే ఏదో ఒక పని చేసో, సర్వీస్ చేసో తమను తాము "నేనూ ఎంతో కొంత చేయగలను" అని మభ్యపెట్టుకోడమేనా?

ఎందుకంటే ఈ నరింగ్ పనులు అవీ వసంత కు సురేష్ ప్రేమలో పడకపోయి ఉన్నా చేయగలదు. ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తల్లి ఆ మాత్రం నేర్చుకోలేదా?

అది కాదు, మరి వసంత అభిరుచులు, వసంత జీవితం ఏమవుతాయి? ఇహ అంతేనా? పిల్లల కోసం,భర్త కోసం జీవితం లో సగభాగాన్ని పూర్తిగా వెచ్చించిన వసంతకు ఏం మిగిలింది? "నువ్వూ ఏదో ఒకటి చేయగలవు" అనే ఓదార్పు మాటలు, చాకిరీ, నవత స్నేహితుల వల్ల కాస్తంత మానసిక వికాసం....ఇంతేనా?

ఇహ దీన్ని సీరియల్ గా తీయడం ఒక చెత్త పని. వసంత పాత్రకు స్వాతీ సోమనాథ్ అనే నాట్యకారిణిని తీసుకున్నారు.సీరియల్ లో వసంత నర్స్ గా కాక నాట్యం నేర్చుకుని ప్రావీణ్యం సంపాదించడం సహజత్వానికి దూరంగా అనిపించింది నాకు. అలా వదిలేయక, ఇందులో ఆమెకు ఒక హీరోని పెట్టారు. ఇది సముచితమో కాదో కానీ, దీని వల్ల వసంత మానసిక స్థితి, సమతౌల్యం, మనోభావాలు వీటన్నింటినీ చూపించే అవకాశం లేకుండా పోయింది.

ఇంతా చేసి ఆ సీరియల్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత పూర్తి చేసారో లేదో నేను గమనించలేదు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సుజాత గారు మీ స్పందనకి నాధన్యవాదములు. అసలు నేను వనితా టీవి లో వచ్చిన సీరియల్ చూడలేదు. దృశ్య రూపంగా వచ్చినప్పుడు "వసంత" మానసిక స్థితిని ఆమె వేదనని,ఆమె ఆలోచనలని ఇంకా బాగా చూపవచ్చును. మీరు అంటున్నదానిని బట్టి.. అనవసరంగా "మానవి" ని తెరకి ఎక్కించి చెడగోట్టినట్టున్నారు.

"మానవి " తానున్న స్థితి నుండి బయట పడి..భర్త,పిల్లలు ఇది మాత్రమే జీవితం కాదనుకుని..ఒక ఆలోచనావిధానం ని నేర్చుకోగల్గినది. ఏమాత్రం అసహజం లేకుండా..నాటకీయత లేకుండా..తానున్న పరిధిలోనుండి.. కొంచెం బయట పడగల్గింది.ముందు ముందు.. తనలోని సహజ గుణాలతో.. ఎన్నో సాదిస్తుంది.. అనుకోవడం స్పూర్తిగా ఉంటుంది.

నిజజీవితంలో "వసంత" లాటి ఒక స్త్రీ..వసంతలా ఆత్మ హత్య చేసుకోబోయింది. ఆ కుటుంబంలో వ్యక్తిత్వం లేకుండా భర్త మోసాన్ని,దురలవాట్లని భరించలేక విడివడి బిడ్డతో సహా ఎవరిమీద ఆధారపడక..ఎవరి ఆస్తిపాస్తులు ఆశించక ..ఆగిన చదువు మొదలెట్టి..బిడ్డతో సమానంగా చదువుకుని ఆత్మస్యైర్యంగా ..ఎదిగింది. మానవిగా ఎదిగింది.

నేను అనుకుంటాను ఇలా.."ఈ మార్పు చాలదా!?".అని.

ఇలాటి "వసంత"లు చాలా మంది ఉన్నారు . వాళ్ళు అందరు "మానవి" లా ఎదగాలని.. మొగుడి మొహం పై..తన్ని దైర్యంగా,విశ్వాసంగా బ్రతకాలని నా అభిప్రాయం.

చాలా ఆవేశంగా స్పందించాను అనుకుంటాను. ధన్యవాదములు సుజాత గారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జ్యోతిర్మయి గారు...ఓల్గా గారి రచనలు చదివిన తర్వాత మన ఆలోచనలని వీడి పోవు.నిజం.

చైతన్యం పొందడం ని జీర్ణించుకోలేనివారు పుస్తకాలు చదివి చెడిపోతారని స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. మానసిక వికాసం కలగడం నేరం కాదు. కానీ లభించిన స్వేచ్చని కాపాడుకోవడం అవసరం కూడా..అని నేను అనుకుంటూ ఉంటాను. మీకు వీలైనప్పుడలా ఓల్గా గారి రచనలు చదవండి. ధన్యవాదములు.

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

మంచి నవలను పరిచయం చేసారు.హృదయం ద్రవించే నవల లాగా వుంది.అసలు ప్రేమంటే ఏమిటండి?దీన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ ప్రపంచానికి ఇన్ని కష్టాలు వుండవు.ప్రేమ గురించి వ్రాయబోతున్నాను.అక్కడ వివరిస్తాను.
చివరకి మానవి గా మారటం .జ్ఞానోదయం కలగటం .పరిణామక్రమం చక్కగా వివరించారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఓఅజ్ఞాత స్త్రీ మూర్తి స్పందన ఇది. చూడండి.
this is my comment.. dont give my name .. ఇది నా అభిప్రాయం.
వనితా టీవీలో వచ్చిన మానవి సీరియల్ ద్వారానే వోల్గా పరిచయమైంది నాకు. ఆ నవల కాని, ఇంకే పుస్తకం కాని చదివి ఉండలేదు నేను. ఆ సీరియల్లో హీరోయిన్ మాటలు వింటుంటే నా మనసులో మాటలు, ఆలోచనలే అనిపించింది. నన్ను నా గురించి ఆలోచించుకునేలా చేసింది. ప్రతీ స్త్రీకి తనకంటూ ఒక వ్యక్తిత్వం, గుర్తింపు లేకపోతే ఇంతేనా అనిపించింది. భర్త నీడలో అతనికి, పిల్లలకు కావలసినవి అందిస్తూ తనని తను మర్చిపోతుంది ఇల్లాలు. వాళ్ళే తన జీవితం అనుకుంటుంది. భర్త పిల్లలకు ఆమె ఇచ్చిన ప్రాముఖ్యం , వాళ్ళు ఆమెకు ఇవ్వరు కదా అనిపించింది.వాళ్ళ జీవితంలో తన పాత్ర చాలా పరిమితం, అవసరానికి ఏర్పడిందే తప్ప చివరివరకు తనకు తోడుగా ఎవరూ ఉండరు అనిపించింది. అలా ఆలోచించాక అప్పటివరకు నేను అలా మానవిలా ఉన్నదాన్ని కుటుంబంతో పాటు తన గురించి తనే ఆలోచించాలి అనుకుని ఈ వయసులో బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయలేను కాబట్టి ఇంట్లోనే ఉంటూ నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుతూ, రాతలు మొదలుపెట్టాను.రచయిత్రి అనిపించుకోకపోయినా నాకంటూ సంతృప్తి కలుగుతుంది. అది చాలు నాకు.. ఇంతవరకు మానవి పుస్తకం కొనలేదు. కొంటాను తప్పకుండా..

ఓల్గా రాసిన విముక్త కూడా చాలా బావుంది. అందరూ తప్పకుండా చదవాల్సిన అవసరం ఉంది..

సామాన్య చెప్పారు...

vanaja gaaroo kontha pani valla valla mee blogu ee madhya choodaledu.navalaa parichayam chaalaa baagundi.annattu nenippudu chesthunna pani koodaa olgaa ranchanala paine.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సామాన్య గారు..ఓల్గా రచనలు స్వేచ్చ,విముక్త..కూడా నాకు బాగా నచ్చిన నవలలు. వారి రచనలు గురించి మీరు పరిశోధనా పత్రం సమర్పించ బోతున్నారా? సాహిత్యంలో సమాజ సమస్యలు-అభ్యుదయ భావాలు.. ఓహ్.. చూడటానికి వేచి చూస్తాం.మీకు "మానవి" సమీక్ష నచ్చినందుకు ధన్యవాదములు.

Gowri Kirubanandan చెప్పారు...

ఓల్గా గారి "మానవి" నవలను తమిళంలో "thoduvaanam thottuvidum dooram" అన్న టైటిల్ తో అనువదించాను, ఓల్గా గారి అనుమతితో. ఆ కథ thinnai.com అన్నవెబ్ పత్రికలో సీరియల్ గా వచ్చింది. మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇంకా పుస్తక రూపంలో రావాల్సి ఉంది. ఓల్గా గారి రాజకీయ కథ ఈ మధ్యనే "oru pennin kathai" అన్న పేరిట మంగైయర్ మలర్ అన్న పత్రికలో రెండు నెలలు మినీ సీరియల్ గా వచ్చింది.
ఓల్గా గారి రచనలు మనల్ని ఆలోచింప చేస్తాయి. స్త్రీ అయినా పురుషుడు అయినా ముందు మనిషిగా బ్రతకడం నేర్చుకోవాలి.

--
Gowri Kirubanandan

అజ్ఞాత చెప్పారు...

Naku ee novel dorakaledu ekkada.
Meeru ekkada kontaro regular ga konchem cheppara pls

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రావ్య గారు .. మానవి నవల పై సమీక్ష నచ్చినందుకు ధన్యవాదములు.

మీకు ఈ నవల విశాలాంద్ర, నవోదయ బుక్ హౌస్ లలో తప్పకుండా దొరుకుతుంది. మీరున్న చోటులో లభ్యం కాకపొతే .. నా facebook అకౌంట్ లో మీ అడ్రెస్స్ మెసేజ్ చేయండి. నేను మీకు ఆ నవల పంపగలను. థాంక్ యూ !

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Gowri Kirubanandan

గారు మానవి నవల పై సమీక్ష నచ్చినందుకు ధన్యవాదములు. మీరు ఓల్గా గారి సాహిత్యాన్ని అనువదించి మంచి పని చేసారు. అభినందనలు. అసలు అన్ని బాషలలోకి ఆమె రచనలు అనువదించబడాలండీ! !