నాకు చాలా బాగా నచ్చిన సినిమా .. గోరింటాకు.
నేను పదునైదేండ్లు వయసులో ఉండగా.. చూసిన సినిమా. ఇప్పటిలా ఒక సినిమా రాగానే కొన్ని నెలలకే , కొన్ని రోజులకే కనుమరుగై పోయిన రోజులు కావు కదా అవి. మంచి సినిమా అంటే ఏడాదికి ఓ సారి అయినా వచ్చి ఓ..పది పదిహేను రోజులపాటు ధియేటర్ లో మూడు పూటలా అలరించి వెళ్ళేవి .
నేను పదవతరగతి చదివేటప్పటికి ఆ చిత్రం విడుదలయి ఓ..రెండేళ్ళు దాటింది. శోభన్ చిత్రాలు అంటే..మా వూరి వాళ్లకి బాగా అభిమానం. అక్కడే పుట్టి పెరిగి వెళ్ళినవాడని..అందరికి పరిచయం ఉండటం మూలంగా ఎక్కువ గా శోభన్ చిత్రాలని ఆదరించే వారు. చిత్రం బాగుంటే ఇంకా ఎక్కువగా ఆ చిత్రాన్ని ఆదరించి అభిమానాన్ని చాటుకునేవారు. అయినా శోభన్ బాబు ఖాతాలో ఎక్కువ మంచి చిత్రాలే ఉండేవి.
నేను "గోరింటాకు " చిత్రాన్ని చూసింది మూడు సార్లు..కానీ ఆ చిత్రాన్ని రోజు సెకండ్ షో ని చూడకుండా వినడం ఓ..పదిహేను రోజులు. రాత్రి సమయాలలో ట్యూషన్ టైం అయిపోయి..అందరూ ముసుగుతన్ని పడుకుంటే..ఆ చిత్రంలో సంభాషణలన్నింటిని బాగా వింటూ.. అంత కన్నా బాగా జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ.. అలా నిద్రలోకి జారుకునేదానిని.(ప్రక్కనే దియేటర్ ఉండేది కాబట్టి)
అలా గోరింటాకు చిత్రం నాకు బాగా నచ్చేసింది. చిత్ర కథా రచన దాసరి గారు అనుకుంటాను. చాలా పదునైన సంభాషణలు, కదిలించే సంభాషణలు చాలానే ఉండేయి,
ఓ పల్లెటూర్లో పుట్టిన రాము కి ఓ..చిట్టి చెల్లి ఉండేది. ఆమెకి గోరింటాకు అంటే చాలా ఇష్టం. తల్లి ఆ అమ్మాయికి గోరింటాకు కోసి రుబ్బి పెడుతూ.. ఓ.పాట పాడుతుంది. ఆ పాట వినగానే మనకి గీత రచయిత దేవులపల్లి టక్కున గురుకు వస్తారు. మాహానటి సావిత్రి రూపం గుర్తుకు వచ్చి బాగా బాధ కల్గుతుంది.
"మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు,గన్నేరులా పూస్తే కలవాడోస్తాడు, సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా..అందాల చందమామ తానే దిగి వస్తాడు." అని పదహారు అణాల తెలుగుతనాన్ని పూయించిన పాట.
ఇంతకీ ఆ తల్లికి లభించిన మొగుడు కోపిస్టి వాడు,పాపిష్టి వాడు కాబట్టి..అ బిడ్డ అల్పాయుష్కురాలయింది.ఆ ముద్దుల అన్నకి గోరింటాకు అంటేనే భయం మిగిల్చింది.
ఆ చిత్రంలో సావిత్రి భర్త ఓ..వ్యసనపరుడు. పరాయి స్త్రీల మోజులో..కుటుంబాన్ని గాలికి వదిలేసి..అప్పుడప్పుడు వచ్చి తన ప్రతాపాన్ని చూపించి వెళ్ళిపోతూ ఉంటాడు. కనుల నీరు నింపుకుని ఆ భర్తకి ఎదురు చెప్పలేక మౌనంగా భరిస్తూ.. బిడ్డలే ప్రాణంగా బ్రతుకుతున్న ఆమెకి కడుపు కోత మిగిల్చి..పూర్తిగా తన విలాస జీవితంలోనే మునిగి పోతాడు..తండ్రి (జే వి రమణ మూర్తి). మేనమామ, అత్తల సాయంతో..రాము (శోభన్ బాబు ) చదువుకోవడానికి పట్నం చేరు కుంటాడు. మెడిసన్ కోర్స్ లో జాయిన్ అయి.. చదువుకుంటూ.. సక్రమంగా ఫీజు చెల్లించలేక ఆ
దుస్థితిలో అందరి దృష్టిలో పడినప్పుడు స్వప్న (సుజాత) దృష్టిలో పడతాడు. ఆమె అతని కి సాయపడి..అందుకు బదులుగా తన చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పమని అడిగి వారి ఇంట్లోనే అవుట్ హౌస్ లో ఆశ్రయం ఇస్తుంది. అతనికి సహాయ పడుతుంది.
ఆమె మంచితనాన్ని, సహృదయాన్ని, వ్యక్తిత్వంని ఆరాదిస్తూ..తన మనసులో భావాల్ని ఎప్పటికప్పుడు డైరీలో రాసుకుంటూ ఉంటాడు రాము. అవకాశం దొరికితే తన మనసులో భావాలని ఎన్నో సార్లు చెప్పాలనుకుని ఆరాట పడతాడు. అలా కొన్నేళ్ళు ఆమెకి తన ప్రేమని చెప్పాలనుకుని కూడా చెప్పలేక మూగప్రేమతో.. సతమత మవుతాడు.
చదువు పూర్తికావడంతో..స్వప్న తండ్రి ఆమెకి వివాహం చేయదలచి ఒక మంచి సంబందం చూస్తాడు.ఆ విషయాన్నే రాముకి చెప్పి అతని సలహా తీసుకుంటాడు.రాము కూడా ఆమెకి అన్ని విధాల సరైనజోడని ఆమె తండ్రి ఎంపికకి ఓటు వేస్తాడు. అది తెలిసిన స్వప్న ..తన ప్రేమని తనలోనే దాచుకుని తండ్రి కుదిర్చిన వ్యక్తి ని వివాహం చేసుకుంటుంది.
ఆనంద్ తో కలసి కాపురానికి వెళ్ళిన స్వప్నకి .. ఓ..చేదు విషయం తెలుస్తుంది. ఆమె వివాహమాడిన ఆనంద్ (దేవదాస్ కనకాల) కి అంతకు ముందు ఓ..వివాహం జరిగి..ఓ..పాపకి జన్మనిచ్చాడని తెలుస్తుంది. అతని తప్పుని నిలదీసి..అతనికి బుద్ధి చెప్పి పాపతో కూడా వచ్చిన ఆమెని అతనితో కలిపి తిరిగి పుట్టింటికి చేరుకుంటుంది. ఈ లోపు రాము ..ఆ ఇంటి నుండి వేరే ఇంటికి మారి పోయి..పల్లెటూరి నుండి తల్లిని తీసుకు వచ్చుకుని ఆమెతో కలసి ఉంటూ ఉంటాడు.
వారి ఇంటి ప్రక్కనే మేడమీద నివసిస్తున్న పద్మ పాడిన విషాదమైన పాట (పాడితే శిలలైన కరగాలి) వింటాడు. ఆ పాట తర్వాత ఆమె దుఖః భారంతో సృహ తప్పడం ఉన్మాదిలా ప్రవర్తించడం చేస్తూ ఉంటుంది. రాము ఒక డాక్టర్ గా వెళ్లి ఆమెకి సేవలు అందిస్తాడు.ఆ క్రమంలో ఆమె చేష్టలవలన గాయపడతాడు కూడా. ఆమె తల్లి చెప్పిన విషయాల వల్ల కొన్ని విషయాలు రాముకి తెలుస్తాయి. పద్మ వివాహ ఘడియకు ముందు ఆమెని పెండ్లాడాల్సిన వరుడు..పెళ్ళికి సిద్దమై వస్తూ.. దారిలో జరిగిన యాక్సిడెంట్ లో చనిపోవడం మూలంగా ఆమె ఆ షాక్ తో మానసికంగా దెబ్బతిని అలా ప్రవర్తిస్తుందని తెలుస్తుంది. ఆమె పై కలిగిన సానుభూతితో.. ఆమెకి ట్రీట్మెంట్ లో భాగంగాను..పద్మకి సన్నిహితం అవుతాడు. ఈ లోపు.. రాము తండ్రి అనారోగ్యం పాలయి హాస్పిటల్ లో దిక్కు మొక్కు లేకుండా పడి ఉండటం చూసి తండ్రికి తన తిరస్కృతి చూపుతూనే వైద్యం అందించి మామూలు మనిషి అయ్యేటట్లు చూస్తాడు. ఆ తర్వాత తండ్రి తమతో మరలా కలసి ఉంటాడని తల్లి అన్నప్పుడు వ్యతిరేకిస్తాడు...కానీ తల్లి మాట కాదనుకోలేక తమతో కలసి ఉండటానికి అయిష్టంగానే అంగీకరిస్తాడు. ఎందుకో సావిత్రి నిర్ణయాన్ని హర్షించలేకపోయాను కూడా ! అలాంటి భర్తని ఆమె క్షమించడం నా దృష్టిలో అవివేకం కూడా !
మధ్యలో ఒకసారి స్వప ని కలసినప్పుడు ఆమెకి జరిగిన అన్యాయానికి బాధపడతాడు.
ఒకరోజు.. స్వప్నకి రాము డైరీ ఆ ఇంట్లో కనబడుతుంది అది చదివిన ఆమెకి అతని మనసులో ఉన్న ప్రేమ సంగతి తెలుస్తుంది. అతనితో.. మాట్లాడాలనుకుంటుంది. ఈ లోపుగా రాముకి పద్మకి మధ్య ప్రేమ చిగురిస్తుంది. వారు ఇద్దరు పెళ్ళిచేసుకోవాలని నిర్ణయం చేసుకున్తప్పటికి ..స్వప్న ప్రేమ సంగతి తెలుస్తుంది. పద్మ ఆత్మహత్యా ప్రయత్నం .. చేయడం..స్వప్న ఆమెకి బ్లడ్ డొనేట్ చేసి బ్రతికించడం.. ఆ ఇరువురి మధ్య నలిగిన మూగ ప్రేమ తిరిగి కలిసే సమయానికి మళ్ళీ ట్రయాంగిల్ లవ్ స్టొరీ కావడం అంతా ఒక కలలా అనిపించినా.. కథ, సెంటిమెంట్ బలంగా ఉండటంతో.. ఎక్కడా ప్రేక్షకుడికి విసుగు పుట్టవు. మన మధ్య జరుగుతున్న సహజమైన కథలా రీళ్ళు కి రీళ్ళు కదలి వెళ్లి పోతుంటాయి .
పద్మ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కున్నాని రాము చెప్పినప్పుడు స్వప్న ఒక ఉన్నత వ్యక్తిత్వంతో.. పద్మ ఉన్న స్థితిలో ఆమెని వివాహమాడటమే మంచిదని రాముని ఒప్పిస్తుంది.
"స్వప్నా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్ ? " అని అడుగుతాడు..రాము.
"నేను తిరిగి నా భర్త దగ్గరకే వెళ్లి పోవాలనుకుంటున్నాను" అని చెపుతుంది.
"నీకు పాత కాలం ఆడవారికి తేడా లేదు అని నిరూపించావ్"..అంటాడు రాము.
"కాలం ఏదైనా ఆడవాళ్ళు ఆడవాళ్లే కదా !" అంటుంది..స్వప్న.
చదువుకునే రోజుల్లో వల్లించే ఆదర్శాలు,ఆశయాలు నిజ జీవితంలో ఆచరణ లో కనబడని స్త్రీల జీవితం పట్ల ఆవేశం,ఆవేదన ఉంటుంది.
అలాగే చిత్రం ఆఖరిలో స్వప్న ఒంటరిగా మిగిలిపోయి..అలా దూరంగా నడచి వెల్లిపోయేటప్పుడు.. వినిపించే గీతం మనసుకు వస్తూను ఉంటుంది. "తన రంగుని ఇచ్చి (ప్రాణ మిచ్చి ) తనువంతా ఎండి తను రాలిపోతుంది." అంటూ గోరింటాకు స్వరూపాన్ని స్వప్న పాత్రకి అన్వనయించి చెప్పడం నాకు చాలా నచ్చింది.
స్త్రీల పూర్తి కాల జీవితం పురుషుల నడవడికతో ముడిపడి ఉండటం.. వారి అహంకార విలాస,విచ్చలవిడి శృంగార జీవితాన్ని భరించాల్సి రావడం.ఎన్ని తప్పులు చేసినా..అన్నీ మరచి పోయి వారిని క్షమించడం.. సావిత్రి పాత్రలో మనకు దర్శనం ఇస్తే..
పెద్ద చదువులు చదువుకుని.. ఇచ్చిన మనసు బయట పెట్టుకోలేక తండ్రి కుదిర్చిన మనువాడి..అతని నిజ స్వరూపం తెలిసిన తర్వాత ఇంకొక స్త్రీజీవితాన్ని సరిదిద్దే ప్రయత్నంలో.. పురుషుడి మోసాన్ని నిలబెట్టి కడిగి పారేసి ఆ స్త్రీకి న్యాయం చేకూరుస్తుంది... ఆ పాత్రలో నటి సుజాతని తప్ప మరొకరిని ఊహించలేము.
ఆనంద్ (దేవదాస్ కనకాల) ని నిలదీసే టప్పటి డైలాగ్స్ నాకు యెంత బాగా నచ్చాయో!
మూడు మూరల పసుపుతాడుతో.. ఒక పసుపు కొమ్ముతో..ఒక ఆడదాన్ని జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చారు. ఆమెని తల్లిని చేసి మరలా డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకుని ..ఎంతోమంది జీవితాలతోనో ఆడుకోవాలనుకునే నిన్ను షూట్ చేసి పారేసినా పాపం లేదంటుంది. చాలా పదునైన సంభాషణలు.
సంభాషణ ల రచయిత ఎవరో గుర్తు లేదు కానీ ..ముప్పయ్యి ఏళ్ళ క్రితం చూసిన చిత్రం ఇంకా గుర్తు ఉండి పోయిందంటే ..కథా కథనం యెంత గొప్పవో కదా! ఆ చిత్రంలో పాటలన్నీ ఎంతో..బాగుంటాయి. రమాప్రభ,చలం ల హాస్యం మనసార నవ్విస్తాయి. కే.వి.మహదేవన్ సంగీతంలో పాటలు ఒక దానికి మించి మరొకటి..
అద్వితీయమైన సుజాత నటన మన మనస్సులో చెరగని ముద్ర వేస్తుంది.
నాలో స్త్రీవాదం పట్ల ఉన్న భావాలు బలంగా నాటించిన చిత్రం అది.ఎందుకంటే..అలాటి కథలు సావిత్రి భర్త లాటి పురుషులు కుడి ఎడమగా అలాటి ధోరణులు మనం చూస్తూనే ఉంటాం కాబట్టి. భర్తలని ప్రశ్నించలేని అసహాయతలో ఇంట్లో మగ్గిపోయిన ఆడవారి జీవితాలకి తార్కాణం సావిత్రి పాత్ర.. మేడిపండు లాటి వివాహ వ్యవస్థలో మగ్గిపోయిన ఆడవారి కథ కూడా.
విధి వంచించినా ఓ..సహ్రుదయుడి సానుభూతి లభించి అది ప్రేమగా మారి సరిక్రొత్త జీవితం లభించిన పద్మ జీవితం.. ఇలా ఇన్ని కోణాలు ఉన్న చిత్రం అది.
మళ్ళీ ఒకసారి చూసి చిత్రం గురించి వ్రాయాలనుకున్నాను. కానీ చూడటం కుదరక.. గుర్తు తెచ్చుకుని ఇది వ్రాస్తున్నాను.
20 కామెంట్లు:
వనజ గారు, గోరింటాకు సినిమా కథ వాసిరెడ్డి సీతాదేవి అని టైటిల్స్ లో వచినట్టు, కాని రంగనాయకమ్మ గారు కూడా ఆ స్టోరి బేస్ చేసి నోవెల్ రాసినట్టు , ఒక వివాదం తలకెత్తినట్టు మా అమ్మ గారు చెప్పినట్టు లీలగా గుర్తు. ఇద్దరూ పేరున్న మంచి రచయితలే. ఒకరి కథను ఇంకొకరు తీసుకుని మార్చి రాసే అవసరం ఇద్దరికి లేదు. కాని ఆ రోజుల్లో ఒక వివాదం వచ్చింది అని గుర్తు. నిజమేనా? మీకు తెలిస్తే చెప్పండి.
మంచి విశ్లేషణ. 15 ఏండ్ల నుండే అంత అబ్జర్వేషన్ లో ఉన్నందునే మీ పోస్టులు ఇలా ఆలోచింపజేసే విధం గా అదీ సామాన్యమైన , సమకాలీన ఉదాహరణలతో చెప్పదలచుకున్నది చెప్పగలుగుతున్నారు. కొత్త సినిమాలకు డబ్బాలు కొట్టుకుంటూ ఫైట్ లు , కిక్ లతో పనికిరాని రివ్యూల కంటే ఇలాంటి రివ్యూలు చాలా ఉపయోగం. ఎందుకంటే ఈ సమస్యలింకా ఉన్నాయి కాబట్టి. బుద్ధా మురళీ గారీ మధ్య ఒక పోస్టు రాశారు పాత సినిమాల గురించి. ప్రభుత్వం పాతసినిమాల ప్రదర్శనకు రాయితీ కల్పించి మార్నింగ్ షో లు వేయించాలని. ఈ సినిమా కూడా ఆ జాబితాలోదే. సుజాత-శోభన్ బాబు ల నటన హైలెట్. సావిత్రి గురించి చెపితే ఏం బాగుంటుంది చెప్పండి. ఈ సినిమాలో సంభాషణలు , మనసు సంఘర్షణలు అనేక చోట్ల చాలా పాత్రలు పడతాయి. కొమ్మకొమ్మకో సన్నాయి పాట భవాం-భాష బాగుంటుంది. ఆ పాట నా ఫేవరేట్ సాంగ్స్ లో ఒకటి. మీ విశ్లేషన బాగుది. ఇలాంటి సినిమాలను ఆల్బం గా ఉంచుకుని ఇప్పటి తరం వారికి చూపితే మన సంస్కృతికి మేలు చేసిన వారమవుతాము. ఏ చానల్ వాళ్లయినా ఇలాంటి మంచి పని చేస్తారేమో ప్రయత్నించాలి అందరం కలసి. మంచి ప్రయత్నం చేసారు వనజ గారూ! అభినందనలు.
ఇప్పటివరకూ ఎప్పుడూ చూడలేదండీ.. మీ రివ్యూ చదివాక ఒకసారి ట్రై చేద్దామనిపిస్తుంది. టీవీ లో వచ్చినప్పుడూ చూడాలి ఈసారి.
మంచి డైలాగ్స్ ఉన్నాయన్నారు. ఏమయినా పెట్టి ఉంటే బాగుండేదండీ.. ;)
గోరింటాకు నిస్సందేహంగా మంచి తెలుగుసినిమాల్లో ఒకటి.
జీవతంలోని వివిధకోణాల్ని స్పృశించే కథలతో సినిమాలు రావటంలేదు. ఇది సాంస్కృతికంగా పెద్ద కొఱత. కథకు తగిని పాత్రధారుల యెన్నిక రోజులు పోయి, హీరోగారికి నప్పే కథలకోసం వెంపర్లాడె సినీ వర్గాలు జనానికి చేస్తున్న మంచి యేమీ లేదు, అన్నిరకాలుగా దోపిడీ తప్ప.
70వ దశకంలో పాత తెలుగు సినిమాలు తక్కువ ధరకే సినిమాహాల్లో చేసే వీలుండేది. రాను రానూ ఆ సౌలభ్యం కనుమరుగైనది. మళ్ళీ ఆ రోజులు రావాలి!!
మార్పు అనివార్యం. మా చిన్న చెల్లెలు పాత సినిమాలను పాత చింతకాయలనేది తన చిన్నప్పుడు. మొన్న ఫోను చేసి పాతసినిమాల పేర్లు నటనలూ వగైరా తలచుకున్నది. ఇదంతా దేనికమ్మా అంటే పిల్లలకు కాస్త మంచి సినిమాలూ చూపించాలని తన తాపత్రయంట. అదీ సంగతి. చాలా సంతోషం కలిగింది.
చాలా బాగా రాశారండీ..
చిన్నప్పుడు శోభన్ బాబు సినిమాలు బాగా చూసేవాడిని.అభిమానం మరి .గోరింటాకు చాలా మంచి సినిమా!ఆయన మరణం చాలా బాధించింది .మంచి కుటుంబ కథా చిత్రాలు ఆయనవి.
గోరింటాకు' సినిమా గురించి మీ విశ్లేషణ చాలా బాగుంది. ఇప్పుడు ఇలాంటి సినిమాలను తీయలేకపోతున్నారు. ఈ చిత్రంలోని పాటలు,సన్నివేశాలు, సంభాషణలు. నటీనటుల అద్భుత నటన అన్నీ సమపాలలో కుదిరాయి. ఈ చిత్రంలోని పాటను వీడియో ద్వారా వినిపించారు ధన్యవాదాలు. పాట విన్న తర్వాత మళ్ళీ,మళ్ళీ వినాలనిపిస్తుంది.
జలతారు వెన్నెల గారు.. గోరింటాకు చిత్ర కథ గురించి నాకు వివరాలు తెలియవు. తెలుసుకునే జ్ఞానం కూడా అప్పుడు లేదు. ఎందుకో ఆ చిత్రం నాకు బాగా నచ్చింది. వాసిరెడ్డి సీత దేవి గారు or రంగనాయకమ్మ గారా..అన్నది చెప్పగాలడం కష్టమేమో.! ఏదైనా ఒక మంచి చిత్రం . నేను ఆ చిత్రం చూసిన ఇన్ని సంవత్సరాల తరవాత కూడా బాగా గుర్తుండిపోయింది. టీవి లో చిత్రాలు ప్రసారమైనా నేను టీవి చూసే దాన్ని కాదు. మా అబ్బాయి ఇంజినీరింగ్ లో చేరిన అయిన తర్వాత గాని మా ఇంట్లోకి టీవి వచ్చింది. స్టడీస్,రేడియో,బుక్స్ చదవడం ఇలా ఉండేవి నా హాబీలు. ఇప్పుడు ఆ చిత్రం గురించి చెప్పడానికి కూడా ఎవరిని అడగాలో! నాకు ఎందుకో..వాసి రెడ్డి సీతా దేవి గారి స్టయిల్ కనబడుతుంది అనిపిస్తుంది.అయినా దాసరి గారి చేతిలో పడ్డాక స్క్రీన్ ప్లే..సినిమాకి అనుగుణంగా మారుతుంది కదా! :) గోరింటాకు నచ్చినందుకు ధన్యవాదములు.
కొండలరావు గారు.. ధన్యవాదములు. చిన్నప్పుడే సీతాకోక చిలుక,గోరింటాకు చిత్రాలు నాకు బాగా నచ్చాయి .చిన్నప్పటి నుండి మా కుటుంబం లో.. ప్రేమ,స్వేచ్చ ఇవ్వడం బాగా ఉండేది. పుస్తకాలు చదవడం,రేడియో వినడం వీటి వల్ల అవగాహన ఉండేది. మంచి-చెడు విచక్షణ, లోపాలుని గుర్తించుకుని ఎదగడం.. ఇవన్నీ మా కుటుంబం మాకు ఇచ్చిన వారసత్వ ఆస్తులు. అవి మా అబ్బాయికి ఇవ్వాలని నా ప్రయత్నం . నా కుటుంబం నుండే..నా నుండే ఆచరించి చూపడం అని సదా ప్రయత్నం చేస్తుంటాను. మనిషిగా పుట్టి మంచిగా ఎదగాలని ప్రయత్నించడమే..మానవ నాగరికత అనుకుంటాను. అందరికి అవగాహన కలగాలనే ,ఉండాలనే ఈ చిన్నపాటి ప్రయాణం ని మొదలెట్టాను. ధన్యవాదములు.
పాత చిత్రాలు మళ్ళీ ప్రసారం చేయాలని కోరుకుందాం..
రాజ్ కుమార్ ..ధన్యవాదములు. ఇప్పటి కాలం తో..పోలిస్తే సాంఘిక చిత్రాలలో ఒక మంచి సందేశం ఇవ్వాలని ప్రయత్నిస్తూ..ఒక మంచి కథని చిత్రంగా మలచడం .. వినోదంలో భాగం గా అయినా కుటుంబం అంతా మెచ్చిన చిత్రం గా ఉండగలగడం పాత చిత్రాలలోనే చూస్తున్నాం.
ఎందుకు ఇప్పుడు అలాటి చిత్రాలు రావడం లేదో.. తెలియదు.
మీకు ఈ చిత్ర సమీక్ష నచ్చినందుకు ధన్యవాదములు. డైలాగ్స్ బాగా గుర్తు లేదు. ఈ సారి చిత్రం చూసి పరిచయం చేస్తాను. సరేనా!
@శ్యామలీయం గారు.. గతమంతా ఘనం అన్నట్లుగా పాత చిత్రాలని గుర్తు తెచ్చుకుని ..మురిసి పోవడమే! ఏ టీవి చానల్ వారు వేస్తే.. మనకి టీవి దొరికితే చూసి ఆనందించడమే! ఇప్పటి పిల్లలు అసలు ఆ చిత్రాలని చూడనిస్తారా..అండీ! మీ చెల్లెలు గారిలా ఇంకా కొంత మంది ఉన్నారు.అందుకు సంతోషం .ధన్యవాదములు.
కార్తిక్ గారు.. తప్పకుండా ఈ చిత్రం చూడండి. kv .మహదేవన్ స్వరాలూ మీకు బాగా నచ్చుతాయి. చిత్రం తప్పకుండా నచ్చుతుంది. ధన్యవాదములు.
రవి శేఖర్ గారు..చిత్ర సమీక్ష నచ్చినందుకు ధన్యవాదము. శోభన్ బాబు గారు మా పెదనాన్న గారి స్నేహితుడు. మా ఊరిలోనే పుట్టి పెరిగి .. మైలవరం వెళ్లి చదువుకునేవారు. అందుకే..మా ఊరివారు ఆయన చిత్రాలని తప్పక చూసేవారు. అలా వారు నటించిన చిత్రాలు..నాకు అన్నీ పరిచయమే!
@ నాగేంద్ర గారు తప్పకుండా ఈ చిత్రం చూడండి. సి డి దొరుకుతుందేమో..నేను ప్రయత్నిస్తాను. స్పందనకి ధన్యవాదములు.
గోరింటాకు సినిమా గురించి బాగా చెప్పారు అండి బాగుంది... ఇందులో కొమ్మ కొమ్మకో సన్నాయి... గోరింట పూచింది కొమ్మ లేకుంట సాంగ్స్ నాకు చాల ఇష్టం...
"గోరింటాకు 'కథ హక్కుల గురించి వివాదమే కాదు ,కోర్టులో కేసు కూడానడిచింది .రంగనాయకమ్మగారు కేసు గెలిచి నిర్మాత.దర్శకుల నుంచి పరిహారం కొంత పొందినట్లు జ్ఞాపకం ఉంది. ramanarao.muddu@gmail.com
తెలుగు పాటలు..గారు.. మీకు ఈ చిత్రం నచ్చిందా? ఓకే.. ఇంకేం.. పాటల సాహిత్యం ఇచ్చేయండి. ధన్యవాదములు.
@ కమనీయం ..గారు మీరు ఇచ్చిన వివరాలకి ధన్యవాదములు. అమ్మయ్య ఒక విషయం క్లియర్ అయింది అండీ! ధన్యవాదములు.
ఆ పాటలను చాలా రోజులకిందనే పోస్ట్ చేశాను అండి వీలు ఉంటె ఒకసారి చూడండి link> http://rvlyrics.blogspot.in/search/label/%E0%B0%97%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9F%E0%B0%BE%E0%B0%95%E0%B1%81
చాలా మంచి సినిమా ఇది . ఇందులోని " కొమ్మ కొమ్మకో సన్నాయీ" , గోరింటా పూచింది కొమ్మలేకుండా పాటలు నాకు నచ్చుతాయి .
ఆలస్యంగా చూశాను ఈ టపా!
ఈ సినిమాకూ వాసిరెడ్డి సీతాదేవి గారికీ ఎలాంటి సంబంధం లేదు.
రచన కె.రామలక్ష్మి గారిదని దర్శక నిర్మాతలు ఆమె పేరే టైటిల్స్ లో వేశారు. అయితే
‘గోరింటాకు’ సినిమాకు ఆధారం రంగనాయకమ్మ గారి నవల ‘ఇదే నా న్యాయం’. కోర్టులో నడిచిన ఈ రచనా స్వామ్యం కేసులో చివరకు రంగనాయకమ్మ గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది!
వేణు గారు. "గోరింటాకు" చిత్ర కథ రచయిత్రి వివరాలు తెలిపినందుకు ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి