నా ప్రియమైన ...
...............!?
నీకు.. అంటానని అనుకున్నావా?
ఆ లిప్త కాలమైనా నిన్ను ఇబ్బంది పెట్టాననే ఆలోచన అయినా నేను నీకు కల్గించాలనే నా అంతరంగ భావనని నువ్వు కనిపెట్ట గలవా !?
అక్షరాల వెంట పరుగులు తీస్తున్న నీ మనః వేగాన్నికాస్తయినా నిరోదించ గలిగాను కదా!
నా నీడ గా నువ్వు ఉన్నావని భ్రమపడి.. నీ ఏడంతస్తుల విజయ భవనం నుండి జారి పడ్డావని మరచి పోయావు.
కలలోను ,మెలుకువలోనూ..ఇద్దరి ని తలపులలో నింపుకునే ఉంటారని అంటూ ఉంటారని నీకును తెలుసు.
వారు ఎవరో తెలుసు కదా! ప్రియమైన వారు లేదా అప్రియమైన శత్రువు.
ఇవి రెండు కాని నిన్ను ప్రియమైన శత్రువు అనాలేమో కదా! కనులు మూసుకుని తెరిస్తే నీ రూపమే కనబడుతూ ఉంటుంది. దులిపి దూరం చేద్దామనుకున్నా ..నా ఆవరణం లోనే తిష్ట వేసుకుని కూర్చుని ఉంటావు.
గజనీ మహ్మద్ లా నా ఆలోచనల పై దండ యాత్ర చేసి అలసి పోయి ఉంటావు. మళ్ళీ ఇంకో జన్మకి నన్ను వీడకుండా ఘోరీలా పుట్టి సాదించాలని అనుకుని ఉన్నావు. నా మనసు పైన, ఆలోచనల పై దాడి చేసి.. ఏక కాలం లో గెలవలేనని గ్రహించాక..
మనసుని ఆలోచనని విడదీసి మనసుని గెలిచి ఆలోచనని వదిలేసావు .
ఆలోచన లేని మనసుని గెలుచుకుని అభద్రతా భావంలో నా శత్రువుగా మారి .. నా నీడలా వెంటాడుతూ,వేటాడుతూ..నన్ను కలవరపెట్టాలనుకున్నావు.
భారతం చెప్పిన "ఏక ఏవ చరే ద్దర్మం" ని మరచి పోయావా? అనుకరించి,సహాయం కోరి నడక సాగించ గలననుకున్నావా?
విభిన్న సమయాలలో..కొన్ని సందర్భాలలో.. అయినా నేను నిన్ను మెచ్చుకుంటాను .
శత్రువు అయినా సమాన స్థాయిలో ఉండాలంటారు కదా.. ! అందుకనేమో ఇలా.. అయినా మెచ్చుకుంటూ ఉంటాను. వైరి భావం తో ఉన్న మనమధ్య కొన్ని పోలికలు ఉన్నాయి.
.
శత్రువుని మెచ్చుకున్న చోట ఎన్నడైనా ..మరల చెలిమి కుదిరేనా!? పగిలిన మట్టి పాత్ర తిరిగి అతుకుట యెంత అసాధ్యమో.. శత్రువుతో మిత్రుత్వం అంత అసాధ్యం ..అని మరువకు.
ముసుగేసుకుని కపట వేష భూషణ ములతోను .. తెనేలూరించు పలుకుల తోను చేరువ కావలెనని ప్రయత్నిస్తావు.
"మరణంతాని వైరాణి కదా మన శత్రుత్వం" అది నేను మరచిపోతే..అంతటి దుస్సాహసం వేరొకటి కలదా!
నా బలమేమిటో,బలహీనత ఏమిటో.. నిన్ను నిశితంగా పరీక్షించాక కదా నాకు తెలియునది.
అందుకే నా నీడగా నువ్వుంటున్నా ..మౌనంగా..ఉపేక్షిస్తున్నాను
కలసి వచ్చే కాలం వచ్చునో..రానో.. వచ్చునని ఆశయును లేదు..రాదనీ ..నిరాశయను లేదు.
నా ప్రియాతి ప్రియమైన శత్రువా! దేహాన్ని అంటిపెట్టుకున మురికిలా.. రక్తంలో కలసి ఉన్న నీరులా.. తలపులతో..ముడిపడిన వలపులా .. నన్ను నీ కబంద హస్తాలలో ఉక్కిరి బిక్కిరి చేస్తూ.. పరిరక్షిస్తున్నావు కదూ..!?
అందుకే నువ్వంటే ..కోపం ఉంది ద్వేషం ఉంది.. ప్రేమా ఉంది
ఏది ఎక్కువో,ఏది తక్కువో.. తెలియదు.
తెలియనందుకేమో..అయోమయంలో నేను..నా వెంట నీవు..
నువ్వు నా ప్రియమైన శత్రువు వి. శత్రువుగా మిగిలిపోయే ప్రియ బానిస వి.
ఇదంతా నీకు చెప్పాక.. నీ కోపాన్ని కళ్ళారా చూసాక ..నేను లోలోపల నవ్వుకుంటూ.. ఇలా అనుకుంటాను.
నా ప్రియమైన ..శత్రువా!...
నీ నయనస్పర్శ తో నన్ను పరామర్శించి వెళ్ళిన తదుపరి ..
నా తనువు నయాగరా జలపాతమే అయింది..స్పర్సో త్సాహం తో..
వెల కట్టలేని వేల టన్నుల కొద్ది నవీన జీవ శక్తిని నింపుతూ.. అని.
10 కామెంట్లు:
అర్ధం కాలేదండి.
వనజ గారు, ఎవరండి మీ ప్రియమైన శత్రువు? ఎంత చక్కగా లేఖ రాసారో!
interesting
మీ ప్రియమైన శత్రువుకి ప్రేమతో రాసిన లేఖ చాలా బాగుంది వనజ గారు!
hmmm...
Bagundi Andi
రచన అద్భుతం గా వుందండి .కానీ దీని అంతరార్థాన్ని వివరించండి.
ఈ పోస్ట్ కి వివరణ. మిత్రుల కొరకు.
ఇరువురు సమానస్థాయి తెలివి తేటలు కల స్ర్త్రీ పురుషులు మధ్య ప్రేమ ఉంది ఆత్మీయత ఉంది. స్త్రీ కి ప్రియమైన శత్రువు తనకి మనసైన వాడే. ఒక మనసు వేరొక మనసుని తనదనుకుంటుంది. కాని ఆలోచన మనసు వేరు వేరు. మనసుని ఆలోచన తప్పకుండా కంట్రోల్ చేస్తుంది. చాలా అభ్యంతారాలని దాటుకుని ఆమె అతనిని ప్రియతముడిగా అంగీకరించలేక అంగీకరించినా ఆ విషయం రహస్యంగా ఉంచి నప్పుడు మనసిచ్చిన ప్రేమికుడు ఆమెకి శత్రువే కదా! అందుకే ప్రియ మైన శత్రువు అయ్యాడు. మనసులో అతనిని అత్యంత ప్రియతముడిగా భావిస్తూనే బాహ్యంగా అతనిని శత్రువుగా పరిగణిస్తూ..అడుగడుగునా .. తనకి తగినవాడివి కాదంటూ..చులకన చేస్తుంటుంది. మనసు బుద్ధి ఏక కాలంలో స్పందిస్తేనే ప్రేమ సాధ్యం. లేనప్పుడు ప్రేమికుడు ప్రియమైన శత్రువుగా అనిపించి ఆమెని నీడలా వెంటాడుతూ..ఓడిపోతూనే ఉంటాడు. అందుకే.. అతని నయన పరామర్శ అయినా.. ఆమెకి నవజీవాన్ని నింపే శక్తి. ద్వేషిస్తూనే ప్రేమించే ప్రేమిక ఆమె!
సన్నాయి రాగాలు ..గారు.. అర్ధం కాలేదు అన్నారు కదండీ .. ఇదిగోండి వివరణ. & రవి శేఖర్ గారు.. ధన్యవాదములు. నేను సరిగానే ప్రజెంట్ చేసాను అనుకుంటున్నాను అండీ.. ధన్యవాదములు.
జలతారు వెన్నెల గారు..ధన్యవాదములు. అమ్మయ్య మీ కవితా హృదయం .. నాడిని పట్టుకుంది. :)
@ కష్టేఫలె.. గారు..ధన్యవాదములు. అభ్యంతరాన్ని, తెచ్చి పెట్టుకున్న ద్వేషాన్ని .. అందంగా వ్యక్తీకరించడమే నేను చేసాను.
@ కాయల నాగేంద్ర గారు..ధన్యవాదములు.
@ బాలు గారు ..ధన్యవాదములు.
@పురాణపండ ఫణి గారు.. బాగా అర్ధం అయినట్లు ఉంది. ధన్యవాదములు.
బాగుందండీ.....!!!
మీ లేఖ....
కానీ.... నోటితో చెప్పకపోయినా.. కళ్ళు ప్రేమను కురిపిస్తూనే వుంటాయి కదా!
చాల బాగా చెప్పారు.... ఒక అమ్మాయి వద్దు వద్దు అంటూనే..... ప్రాణంగా ప్రేమిస్తుంది అనే ఒక నిజాన్ని.
కామెంట్‌ను పోస్ట్ చేయండి