నగరంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకి అతి కష్టంపై ఒక రోజు మాత్రమే హాజరయి తనకి భాషాభిమానం ఉందని తృప్తి పడుతూ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూ, సాహితీ వేత్తల ప్రసంగాలు వినడంలో నిమగ్నమయింది స్నేహ .
అప్పుడప్పుడు తెలిసినవారు ఎవరైనా కనబడతారేమోనని చూపులతో ఆ హాల్ అంతటిని జల్లెడ పడుతుంది.
తెలుగు భాష మరుగున పడకుండా మనమేమి చేయాలో ఉద్భోదిస్తూ ఆంగ్లంలో మాట్లాడుతున్న ప్రముఖ సాహితీ వేత్తని ఆహుతులు తప్పనిసరై భరించారు. ఎవరైనా అభ్యంతరం తెలిపితే తెలుగు వారు వివాదం చేయడంలో ముందుంటారన్న అపవాదుని మూట గట్టుకున్నట్లవుతుందేమోనన్న భయంతో.
తరువాత పొరుగు రాష్ట్రంలో నివసిస్తున్న భాషాభిమానులు తెలుగు సాహిత్యంలో అంతో ఇంతో పేరున్నవారు మాట్లాడుతూ వారు నివసిస్తున్న రాష్ట్రంలో తెలుగు భాషని వ్యాప్తి చేయడానికి నిధులందిస్తే మన భాష ని అక్కడ కూడా వ్యాప్తి చేయడానికి అవకాశం ఉంటుందని విన్నమిస్తుంటే విని
"మూల విరాట్టుకే నైవేద్యం పెట్టడానికి లేకుంటే మూలన కూర్చున్న ఉత్సవ విగ్రహం వచ్చి నాకు నాకు అని అన్నట్లుగా ఉంది" అనుకుంది స్నేహ చిన్నగా నవ్వుకుంటూ..
అంతలో నాలుగైదు వరుసల ఆవల మరొకరితో కలసి వెళుతున్న ఆనంద్ ని చూసింది. అప్రయత్నంగా చేతిని ఊపింది. ఆనంద్ అయితే గమనించలేదు కానీ అతని ప్రక్కన ఉన్న అతను "ఎవరో నిన్ను చూసి పలకరిస్తున్నారు " అని చెప్పినట్లు ఉన్నాడు. ఆనంద్ స్నేహ వైపు చూసాడు. వెంటనే ఆమె ఉన్న వరుస వైపు వచ్చాడు.
"బాగున్నారా?" పలకరించాడు. అతన్ని చూసిన సంతోషం లో వెంటనే తల ఊపింది అందమైన అబద్డంలా
ఇక్కడ సీట్లు ఖాళీ గా లేవుకదా, అక్కడికి వెళ్లి కూర్చుంటాను. లంచ్ టైం లో మాట్లాడుకుందాం అని చెప్పి తనతో వచ్చిన వ్యక్తి ప్రక్కకి వెళ్లి కూర్చున్నాడు.
సభ నడుస్తున్నంతసేపు లంచ్ టైం ఎప్పుడవుతుందా అన్నట్లు ఎదురుచూసింది స్నేహ.
మధ్య మధ్యలో ఆనంద్ వైపు చూస్తుంది. పదేళ్ళ క్రితంలాగానే అలాగే సన్నగా ఉన్నాడు.ఎక్కడ ఉంటాడో వివరంగా తెలియదు కాని ఓ..ప్రముఖ దిన పత్రికలో విలేఖరిగా పని చేస్తున్నట్లు విన్నది. విని చాలా బాధపడింది కూడా.
ఎంత మంచి కవి. కలసి చదువుకునే రోజుల్లో ప్రతి రోజు అతని కవిత్వం కోసం పడి పడి ఎదురుచూసే వారిలో తను కూడా ఉండేదన్నది ఎప్పుడు మర్చిపోలేదు. అతని వ్రాసిన కవిత్వం సంపుటిగా కూడా వచ్చింది.తరువాత అతనెప్పుడు వ్రాసినట్లు లేదు.ఎక్కడైనా ఒక్క కవితైనా కనబడుతుందేమోనని కనిపించిన ప్రతి పత్రికలోను, దినపత్రికల లోను వెతుకుతూ ఉంటుంది.ఆనంద్ ఏమి వ్రాస్తాడో చూడాలి అని ఆమె ఆశ కూడా.
లంచ్ బ్రేక్ కన్నా ముందే లేచి వచ్చి" లంచ్ కి వెళదాం రండి " అని పిలిచాడు ఆనంద్.
స్నేహ అందుకోసమే చూస్తుంది కనుక వెంటనే లేచి వెళ్ళింది.
"ఇన్నేళ్ళ తరువాత మిమ్మల్ని చూడటం చాలా ఆనందం కల్గింది. అందుకే అలా చెయ్యి ఊపి నా ఉనికి చెప్పాల్సివచ్చింది" అంది కొంచెం సిగ్గుగా..
"ఆత్మీయుల
ని చూసినప్పుడు అలా ఆనందంని ప్రకటించడం విడ్డూరం కాదు కదండీ.! అది వారి మధ్య ఉన్న అనుబంధాన్ని పట్టి ఇస్తుంది." అని చెప్పాడు ఆనంద్ మిత్రుడు.
తనని తానూ పరిచయం చేసుకుంటూ "ఐ యాం మిత్ర "అని చెప్పాడు.
"ఈ రెండు రోజులనుండి మీరు కనబడతారేమో అని చూస్తున్నాను, వూరిలో లేరేమో, అందుకే ఇక్కడి రాలేదు .. అనుకున్నాను " అన్నాడు ఆనంద్.
ఆ మాటల్లో ఇన్నేళ్ళ తర్వాత కూడా నువ్వు కనబడవేమో ! అన్న నిరాశ పడినట్లు అనిపించింది.
" అనుకోకుండా ఇంటికి బంధువులు వచ్చేసారు, అందుకే రాలేకపోయాను. చాలా మిస్ అయ్యాను కూడా." చెప్పింది.
చాలా బాగా ఏర్పాటు చేసిన భోజనాల స్థలం వద్దకు వెళ్లి చేతులు శుభ్రం చేసుకుని ప్లేట్లు తీసుకుని ఇష్టమైన పదార్ధాలు పెట్టించుకుని.. దూరంగా వెళ్లి తినడానికి ఉపక్రమిస్తూ.. ఏమిటి.."కభీ కభీ" చిత్రంలో "అమితాబ్" వి అయిపోయారు ? అడిగేసింది ఉగ్గబట్టుకోలేనట్లు.
కొంచెం సేపు మౌనం తర్వాత "కవిత్వం వ్రాయాలన్న ఆసక్తి, వ్రాయించే స్పందన, అనుభూతి కూడా ఉండాలిగా.?".
అన్నాడు ప్రశ్నిస్తున్నట్లు.
"అవునేమో! అయినా అందరూ స్పందనతోనే కవిత్వం వ్రాస్తున్నారు అంటారా? మీలాంటి మంచి కవిత్వం వ్రాయగల్గినవారు వ్రాయకపోవడం ఒక రకంగా కవిత్వ ప్రక్రియకి అన్యాయం చేసినట్లే! " అంది స్నేహ.
"మాటైనా, బాటైనా, నా తీరు ఇంతేనేమో! మీ రచనలు చూస్తున్నాను. బావుంటున్నాయి అని చెప్పను కాని కొన్ని లోపాలు కన్పిస్తూ ఉంటాయి" అని నిర్మొహమాటంగా చెప్పాడు.
అలవాటైన ఆ నిర్మోహమాటాన్ని తట్టుకుంటూనే "మనిషిలో ఏ మాత్రం మార్పు లేదు" అనుకుంటూ తన రచనల్లోని లోపాలని అంగీకరించింది.
"రేపు ఆఖరి రోజు కదా! మీరు కూడా వస్తారుగా " అడిగాడు మిత్ర.
"రేపు కొందరు స్నేహితులు వస్తానని ఫోన్ చేసి చెప్పారు కాబట్టి తప్పకుండా వస్తాను." చెప్పింది స్నేహ.
"అయితే మీరొక హెల్ప్ చెయ్యాలి, మీరు చాలా అందమైన లేఖలు వ్రాస్తారని ఇంతకు క్రితమే ఆనంద్ చెప్పాడు.
మీరు నాకొక ప్రేమ లేఖ వ్రాయాలి" అని చొరవగా అడిగేసాడు మిత్ర.
"అస్సలు కుదరదడీ,మా వారు ఊరుకోరు "నవ్వుతూ చెప్పింది.
తన మాటలో దొర్లిన తప్పు అర్ధమయి "సారీ సారీ !! నాకొక అందమైన ప్రేమ లేఖ వ్రాసి పెట్టాలి.అది నా ప్రేయసికి ఇవ్వగానే ఆమె ఇంప్రెస్స్ అయిపోయి నా ప్రేమకి పడిపోవాలి " అని చెప్పాడు.
"ఒరేయ్ ! అమ్మాయిలూ నిజాయితీ అయిన ప్రేమకి, స్వచ్చమైన ప్రేమకి కూడా పడటంలేదు. నువ్వు ప్రేమించే అమ్మాయి ఒక్క ప్రేమ లేఖకే పడిపోతుందా!? ఇలాంటి ప్రయత్నాలు మాని వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ అమ్మాయి తల్లిదండ్రులతో పెళ్లి విషయం గురించి మాట్లాడు "అని మందలించాడు ఆనంద్.
"నేను కూడా ఒక కవినని ఆమె ముందు నిరూపించుకోవాలి.ఇంత మంది మిత్రులు ఉండి కూడా నాకు ఈ చిన్న సాయం చేయలేరా? " విచారం తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు మిత్ర.
అతను అడిగినతీరు నచ్చి "నేను తప్పక వ్రాసి పెడతాను సరేనా! హామీ ఇచ్చేసింది స్నేహ.
"మీరు చాలా సునిశితులండి ! చిన్న పాటి తప్పులని కూడా గుర్తిస్తారు.మీతో జాగ్రత్తగా మాట్లాడాలి" అని అంటూనే.. "రేపటికి నాకు ప్రేమ లేఖ ఇచ్చేస్తారుకదా !" మళ్ళీ అడిగాడు.
"అదిగో.. మళ్ళీ అలాగే అంటున్నారు" అంటూ నవ్వేసింది. "అయినా నా ప్రేమ లేఖ అందుకునే అదృష్టం ఒక్కరికే ఉంటుంది లెండి." అంది తమాషాగా అంటున్నట్లు.
భోజనం ముగించి సభ జరుగుతున్న హాల్లోకి వెళ్లి ముగ్గురూ ఒక చోటునే కూర్చున్నారు.
ఆనంద్ తో చాలా మాట్లాడాలి అనుకున్న స్నేహకి ఆ అవకాశం లభించడం లేదు అనే కన్నా ఆనంద్ ఆ అవకాశం ఇవ్వడంలేదు అన్నది అర్ధం అయింది. ఆమె మనసుకు బాధ కల్గింది. మధ్య మధ్యలో ఆనంద్ వైపు చూస్తుంది. అతను చాలా మాములుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడనిపించింది.
సమయం ఆరు గంటలవుతుండగా "ఇక నేను వెళ్ళాలి మీరు కూడా మా ఇంటికి వస్తే చాలా సంతోషం. "వెళదాం రండి " ఆహ్వానించింది.
"ఇప్పుడే ఇక్కడ మరొక ఫ్రెండ్ కలుస్తానని చెప్పాడు. వీలుంటే..రేపు వస్తాము. మీరు వెళ్ళిరండి." చెప్పాడు ఆనంద్.
స్నేహ మరేం మాట్లాడకుండా "వెళ్లొస్తాను " అని చెప్పి లేచి వచ్చేస్తూ ఎంట్రెన్స్ వరకు వచ్చాక వెనుతిరిగి చూసింది. ఆనంద్ తనవైపు చూస్తూ కనిపించాడు. మనసు కొంచెం తేలిక పడినట్లు అనిపించింది.
రాత్రి పన్నెండు గంటల తర్వాత అందరు నిద్ర పోయారనుకుని తీర్మానిన్చుకున్నాక మిత్ర కిచ్చిన మాట కోసం బెడ్ లైట్ వెలుతురులోనే ప్రేమ లేఖ వ్రాయడం మొదలెట్టింది. అరగంట గడిచినా.. ఒక్క వాక్యం వ్రాయడానికి కూడా ఆమె మనసు అంగీకరించలేకపోతుంది.
తనకి ఏమైంది? తమ చుట్టూ జరిగే సంఘటనలని,తన అనుభవాలని,ఊహలని కలిపి ప్రవాహంలా వ్రాసే తను ఒక్క ప్రేమ లేఖ వ్రాయలేకపోతుంది. తల పగిలిపోతుంది. కలం కదలనంటుంది. విసుగ్గా అనిపించి లేచి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడింది.పరదాలని ప్రక్కకి నెట్టి బయటకి చూసింది. మసక వెన్నెలని తరగి పోతున్న చంద్రుడిని చూసాక ముసుగేసిన ఆమె మనసు బయటకి వచ్చింది. ఆనంద్ రూపం, ఆనంద్ మనసు కళ్ళ తడిలో కదలాడింది.
వెనుకకి వచ్చి వ్రాయడానికి ఉపక్రమించింది.
ఎన్నటికి మరువలేని స్నేహమా!
ప్రేమ ప్రయాణంలో అంతర్ధానమైన హృదయమా!!
మత్తు మందుని మించిన మోహమా!
పిరికితనంతో మొహం చాటేసిన పాషాణమా !
ఈ ప్రణయ వేదికని జ్వాలగా రగిలిస్తూనే మలగని జ్యోతిగా మిగిలున్నావు.
ఉబికి వచ్చే ఉప్పునీటి ఆనవాలుగా మిగిలున్నావు.
క్షణ క్షణం నిన్ను తలవకుండా ఉండలేని నా పంచ ప్రాణమా!
నా ప్రాణ శక్తిని తోడేసుకుని నిర్జీవిగా వదిలేసి వెళ్ళిన ..నా చెలి! నెచ్చెలి!!
గతమొక జ్ఞాపకం లా మారింది..
ఆనాటి కల నే మరచేనా !?
చేరువైన చెలిమిని ఆహ్వానిస్తుంటే కెరటంలా మదిని తాకావు.గుండె గుడిలో దీపమై వెలిగావు.
వెంటాడే నీ చూపులు మాట లాడతాయి, నీ మందస్మితాలు పాటలుపాడుతాయి
నీ మౌనంకూడా మంత్రంలా మారి కాలాన్ని కరిగిస్తుంది.నీ ఊహలు నా ఊహలు కలిసి శ్వాసిస్తాయి.
నా ధ్యాసలు నిన్ను దాటి మరో ప్రపంచం వైపు మరలను అంటున్నాయి.
ఇది.. నీ కోసం నేను పడిన తపన.
తలచుకుంటేనే... నరకప్రాయమైన ఈ బతుకు నాకెందుకు? అన్న నా ప్రశ్నకి సమాధానమే లేదు.
ఒకప్పటి నీ బాసలు బ్రతికిస్తున్నాయేమో ! మానని గాయాన్ని రేపుతున్న మంటలా..ఇలా..
నా ఎదని అల్లుకున్న తీగవైనావు అన్నావు నా పాదాల చెంత కైనా చేరే పువ్వునవుతావన్నావు.
నీ కలల హారతిలో నా కలల కర్పూరం జతజేస్తానన్నావు
రాగమనే పరిమళాన్ని చవి చూపించి అనురాగమనే గంధాన్ని చిలకరించి....
నీ మనసుని, నీ యవ్వనపు ప్రాయాన్ని ముడుపుగా కట్టి దాచి ఉంచి
వాటిని దోచుకునే ఒడుపులు తెలిసిన చెలికాడివి నీవే కదా ! అని ఊరించావు
పుచ్చ పువ్వులా పూసిన పున్నమి లాంటి మన ప్రేమ వెన్నెలలా విరగబడి నవ్వుతుండగానే
దప్పిక గొన్న
రాకాసి మబ్బుల్లా కమ్మేసిన క్షణాలు
గ్రహణం లా కాటేసిన అంతరాలు ..
ఆహుతి గా మారిన నా ఒకే ఒక్క మనసు
ఈ గతమంతా చేదు తీపైన జ్ఞాపకం
జీవితానికి వెలకట్టే షరాబులున్న ఈ లోకంలో నా ప్రేమకి వెలకట్టగల షరాబు నీకన్న వేరెవ్వరు ? ఆ వెల మనం కలగన్న మనదైన రాత్రిన నేను క
ట్టే కొంగు బంగారమంత.
మనిషి సగమయ్యేది తనని తాను తగ్గించుకున్నప్పుడు, తనలో తనదైన ఇంకో సగం
ని ఐక్యం గావించు కున్నప్పుడు...
కలలు కల్లలు గా మిగిలిపోయిన ఇప్పుడు జీవనం అంతా దుఖపు నది. జీవితపు సంతోషతీరం ఆవలి ఒడ్డున ఊరిస్తూ ఉంటుంది.
నదిని దాటించే తెప్ప కూడా దుఃఖ రాశులతో తొణికిసలాడు తుండగా తెప్పని ఒడ్డుకు లాగే ప్రయత్నం లో గెలిచి అలసి
మమకారాల నివాళులందుకుంటూ క్షమించి చెలిమి నిచ్చే చల్లని చేయినయి
ఇలా ఏక బిగిన వ్రాసేసి.. ముగింపు ఏం వ్రాయాలో తెలియక ఆగిపోయింది.
మొదటి నుండి చదివింది. మళ్ళీ మళ్ళీ చదివింది.కానీ ముగింపు వ్రాయలేకపోయింది.
ఇది నేనే వ్రాశానా? తనని తానూ ప్రశ్నించుకుంది. "కాదు కాదు.. నాలో ఉన్న ..ఇంకో మనసు అచ్చు తను వ్రాసే రీతిన తన చేత ఇలా వ్రాయించింది" అను కుంటూ.. ఆనంద్ కూడా ఇలాగే రాస్తాడు అతని కోసమే అప్రయత్నంగా ఈ లెటర్ రాసిందని అర్ధమయి
రెండు మనసుల స్పందన ఒకటే కదా! అందుకే ఇలా వ్రాయగల్గాను అని ఒక నిట్టూర్పు నిడిచి
ఆ కాగితాలని భద్రంగా దాచి పెట్టి పడుకుంది. నిశిరాత్రి ఆమె ఆలోచనలలో కరిగిపోయింది.
తెల్లవారుతూనే ఇంటి పనులు అన్ని చేసుకుని అందరికి అన్ని సమకూర్చి తొమ్మిది గంటలకల్లా సభలు జరుగుతున్నచోటుకి వచ్చేసింది. ఆనంద్, మిత్ర అప్పటికే అక్కడ వేచి చూస్తున్నారు. .
"అరె!ఆలస్యంగా వచ్చినట్లున్నాను" అంది.
"లేదండి, నేనే త్వరగా వచ్చేసాను. నాకు ఆ లెటర్ ఇచ్చేస్త్రారా?" ఆత్రంగా అడిగాడుమిత్ర.
"సారీ !..నేను వ్రాయలేకపోయాను అని చెప్పి. మీ అడ్రస్ ఇస్తే త్వరలో వ్రాసి పోస్ట్ లో పంపుతాను సరేనా.. "
క్షమాపణ గా అడిగింది.
"పర్వాలేదు..స్నేహ గారు ఏ లేఖ వ్రాయాలన్నా ఫీలింగ్స్ ఉండాలి కదా! నా ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ గా మారలేవు కదా! ఆనంద్ అన్నట్టు ఎవరి ఫీలింగ్స్ వాళ్ళే ఎక్స్ ప్రెస్ చేయాలి. నా తంటాలు ఏవో నేను పడతాను. మీకు ఇబ్బంది కల్గిస్తే క్షమించండి" హృదయ పూర్వకంగా చెప్పాడు.
స్నేహ మాట్లాడకుండా ఉండిపోయింది.
ఆనంద్ ఒంటరిగా దొరికినప్పుడు.. హ్యాండ్ బాగ్ లోనుండి ఒక కవరు తీసి అతని చేతిలో ఉంచింది. అది తను రాత్రి వ్రాసిన అసంపూర్తి లేఖ.
"ఏమిటిది !? " కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు ఆనంద్
ప్లీజ్ ఆనంద్ ! నన్ను ఇప్పుడు ఏమి అడగకు, నేను వ్రాసినదే! కానీ అది నాలా నేను వ్రాయలేదు వ్రాసింది, వ్రాయించింది ఎవరో నీవు మాత్రమే చెప్పగలవు " చెమర్చిన కన్నులతో వణుకు తున్న గొంతుతో చెప్పింది.
ఆనంద్ ఆ కవరుని పదిలంగా గుండెకి దగ్గరగా చేర్చుకున్నాడు.
దాదాపు తొమ్మిదేళ్ళ వారి కలయికలో కొన్ని అపార్ధాలు మబ్బుల్లా మాయమయ్యాయి.
ఎన్నటికి తీరం చేరని నౌకలా ఎన్నటికి కలవని ప్రేమలు ఉంటాయి.
వ్రాసుకున్న లేఖలు, చేదు, తీపి జ్ఞాపకాలు గుండెల్ని గుచ్చే గులాబీల్లా వాడకుండా ఉంటాయి.
ఒంటరి పయనం ఒకరిదైతే.. అన్నీ ఉన్నా ఒంటరితనం వెదుక్కునే ఇంకొకరు కావచ్చు.
లేదా ఎవరి జీవితాలు వారివి కావచ్చు. కానీ ఆ లేఖలు మాత్రం బ్రతికే ఉంటాయి.
"చిక్కి శల్యం అయినా సరే. శవం అయ్యేదాకా అయినా సరే!"
ఒక నెల రోజుల తర్వాత ఆనంద్ పేరుతొ ప్రచురితమైన కవితని ఒక పత్రికలో చూసి ఆత్రంగా అది చదివిన స్నేహ నయనం చెమ్మ గిల్గింది, హృదయం భారమైంది.
తన లేఖ అతనిలో స్పందన కల్గించింది, అందుకే ఇన్నేళ్ళకి ఈ అక్షరాల రూపంలో అతని మనో భావాలకి రూపం వచ్చింది అని అనుకుంది.
ఆమె డైరీ లో మరో పుట ఇలా నల్లని అక్షరాలతో..నిండి పోయింది.
తొలకరి చినుకు లాంటిది స్నేహం
పువ్వులో పరిమళం లాంటి ప్రేమ.
మంచును కరిగించే కిరణం స్నేహం
కల్మషం ని కడిగేసే జడి వాన ప్రేమ.
ఒక కలలా సాగే పయనం స్నేహం
పవన వీచికలో వినిపించే పాట ప్రేమ
ప్రేమ, స్నేహం నమ్మకంలో నమ్మకమై ఉంటుంది.
నిజంగా నీ హృదయంతో నువ్వు పిలిచినప్పుడు ఈ రెండు నీతోనే ఉంటాయి
నీలోనే ఉంటాయి. గుర్తించే మనో నేత్రం మనకుంటే చాలు....