చల్లగా కురిసే వెన్నెలతో పాటు మంచు కూడా పోటీ పడి కురుస్తున్న ఆ రాత్రి సమయంలో ఎదలో ఏదో ఏదో సవ్వడి. అలల సవ్వడిలా
వెంటాడుతున్న జ్ఞాపకాలు అవిశ్రాంతంగా వెలుగుతూ..తమ ఉనికిని చూపుతున్న మిణుగురుల్లా
ప్రక్క మీద నుండి లేచి తలుపు తీసుకుని బయటకి నడిచాడు శరత్.
మెల్లగా డాబా ఎక్కాడు. ఇంటి చుట్టూ పెరిగిన కొబ్బరి చెట్ల మధ్య నుండి పడమర వైపుకు ఒరిగిన చంద్రుడు. దశాబ్దాలుగా అలవాటైన దృశ్యం. ఆ దృశ్యాన్ని పంచుకునే మనసైన తోడు కోసం వెదుక్కునే మనసు.
ఆహ్లాదకరమైన వాతావరణం కరువైపోయిన యాంత్రిక జీవనం నుండి బయట పడి కాస్త ప్రాణం ఊపిరి పోసుకోవాలంటే అప్పుడప్పుడు ఇలా బయటకి రావాల్సిందే! పోగొట్టున్నదేదో వెదుక్కోవాలంటే జ్ఞాపకాలని జల్లెడ పట్టాల్సిందే!
ఆ రోజు సాయంత్రం నుండి తన మదిలో మెదిలే ఊసులు, చిత్రంగా అనిపించే స్పందనలు. కాలాన్ని ఓపాతికేళ్ళు వెనుకకి త్రిప్పితే పోయిన పెన్నిది ఏదో దొరికి మరలా ప్రాణం పోసుకున్న జ్ఞాపకాలు, సత్యం అనిపించే అనుభూతులు. ఇలాంటి అనుభూతులు కొరకైనా మళ్ళీ మానవుడిగానే పుట్టాలనే బలీయమైన ఆకాంక్షలు. మళ్ళీ అంతలోనే ముప్పిరిగొన్న విషాద వీచికలు.
చిత్రంగా ఇవన్నీ పంచుకోవాలనుకునే తోడూ కోసం వెదుక్కోవడం ఆ వెదుక్కునే పని లేకుండానే.. ఎద లయలలో ధ్వనించే ప్రాణ తేజం నడిచే మనిషిలో ప్రణవ మంత్రం "అమృత"
ఆ ఆమృత కోసం ఓ.. శరత్ చంద్రుడి .. మనస్పందన... వెన్నెల్లో.. అక్షరాలుగా మారి.. ప్రవాహంలా సాగుతున్నాయి.
"అమృతా" ఎలా ఉన్నావ్? ఇది పలకరింపో, క్షేమ సమాచారమో! నాలో ఉన్న నిన్ను నేనడగకుండా ఉండలేను
ఎన్నో ఏళ్ళ తర్వాత కార్తీక పున్నమికి మన ఊరికి వచ్చాను. కుటుంబమంతా కలసి పౌర్ణమి పూట సొంతింట్లో నోము నోచుకోవాలని అమ్మ కోరిక. ఆమె కోరిక కాదనలేక ఎంత పని ఒత్తిడి ఉన్నాదూరాభారం అయినా అన్నదమ్ములందరూ,అక్క ,చెల్లి అందరం ఊరికి రావాలనుకున్నాం.
అందరికన్నా నేనే ముందుగా ఊరికి వచ్చాను. ఎంతైనా సొంతూరిపై ఉన్న మమకారం కదా! ఉద్యోగ హోదాలు వాహన సౌకర్యాలు,ఆధునిక వసతులు మధ్య జీవించే నేను వచ్చీ రాగానే అమ్మ చేతి వంట తిని..స్వచ్చమైన గాలికి ఊపిరి పోసుకోవాలని. కాళ్ళకి చెప్పులైనా లేకుండా వడి వడిగా బయట పడ్డాను. ఆత్మీయుల పలక రింపులు వింటే మమతల గంగ పొంగి నట్లయింది.
పొలం గట్ల వెంట నడుచుచుకుంటూ ఏటి ఒడ్డుకు చేరుకున్నాను.
సాయంత్రం ఎండకి తళ తళ మంటూ నదిలో ఎన్నో వర్ణాలు, రంగుల హరివిల్లులు. అది చూస్తూనే మనసు రాగరంజితమైనది.చప్పున నువ్వు గుర్తుకు వచ్చావు.ఆ రంగుల కళ కళల లో నీ నవ్వులు కనిపించాయి.ఆ తుళ్ళింతలు.. నన్ను కవ్వించే మంద స్మితాలు ఓహ్ అన్నీ కనుల ముందు కదలాడాయి.
నవ్వులు రువ్వే పువ్వమ్మా..నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా అనే ఉంటాను కదా!
అలవాటుగా కొంచెం ముందుకు నడిచాను. నీ మనసులా స్వచ్చంగా ఉన్న నీటి ప్రవాహం. అప్పటి దాకా వడి వడిగా ప్రవహించి.. కడలి ఒడిని చేరుకున్న కృష్ణమ్మ మందగమనంతో.. సాగరుడిలో ఐక్యమవుతున్న అపురూప దృశ్యం. ఆ దృశ్యం చూడటానికి ఎన్ని జన్మలు అయినా చాలవు అనిపించేటట్లు.
ఎంత మనోహర దృశ్యం.! ప్రాక్ దిక్కున అనంత సాగరుడు. దక్షిణం,ఉత్తరం అంతా అనంత జలరాశి. ఆ కెరటాల మృదు మధుర ద్వనాలు తనలో ఐక్యం చేసుకునేందుకు గా సాగరుడు మునుముందుకు వస్తూ ఎగసి పడే కెరటాలు ఓహ్ ! ఆ దృశ్యం చూస్తుండగా నా హృదిలో మేల్కొన్న భావాలు ఏమని వర్ణించను అమృతా..!
ఈ సాగర సంగమాన్ని చేయి చేయి కలుపుకుని జతగా ఎన్ని మార్లు చూసి ఉంటాం!? ఎన్ని సూర్యోదయాలు,ఎన్ని సూర్యాస్తమయాలు. ఈ అనంత ప్రకృతిలో నువ్వు నేను ఏకమైన మనసుతో వొదిగిపోయాం.! నాకు ఇప్పుడు కూడా అదే ఫీలింగ్. నువ్వు నాతో ఉన్నావన్న భావన. ఎన్నిమార్లు కార్తీక పుణ్య స్నానాల జన సమూహం నుండి మనం దూరంగా జరిగిపోయి వెన్నెల్లో జలకాలాడాం!? ఎంతగా మనసు దాహార్తిని తీర్చుకున్నాం? ఇప్పడేది ఆ ఆనవాలు? స్పందనలు కూడా కరువై నడుస్తున్న శిలా రూపిని నేను.
చీకట్లు ముసురుకుంటున్నాయి.ఈ రోజు సోమవారం కదా! పుణ్య స్నానాల సందడి. పట్టణ వాసపు పిల్లలు. పెద్దల హెచ్చరికలు పెడ చెవిన పెట్టి సముద్రం ముందు సందడి చేస్తూ..
కొందరు చిన్నారుల ఎదురు చూపులు చందమామరావే జాబిల్లిరావే అంటూ..
ఆ పాట రేడియోలో నా కోసం నువ్వు ఎప్పుడు అంకితమిచ్చే పాట నేను మరచిపోతే కదా! హరిప్రసాద్ చౌరాసియ వేణువు చిందించిన నర్తనకి ఒడలు పులకించని తనువు ఉంటుందా!
చాందిని రాత్ మే ఏక బార్ తుజే దేఖా హై అనుకుంటూ నేను నిన్ను తొలిసారిగా చూసిన ప్రదేశం ఇదే కదా!
నా ప్రాణ ప్రదమయిన నువ్వు, నువ్వు నేను కలసి ప్రేమించే ఆ ప్రదేశం స్పందన లేకుండా ఎలా ఉండగలను.?
నాకు ఈ నాటి చంద్రుడిని చూస్తే గురుదత్ గుండెల్లో గుబులు రేపిన "చౌద్విన్ కా చాంద్ " వహీదా రెహమాన్ గుర్తుకొస్తుంది. నువ్వు గుర్తుకు వచ్చావు.
చందమామ వచ్చాడమ్మా! తొంగి తొంగి చూసాడమ్మా అన్నట్లు అలల వెనుక నుండి పైపైకి వస్తున్న చంద్రుడు. గుండెల్ని తీపి కోత కోసే "రమేష్ నాయుడి స్వర కల్పన ఎన్ని సార్లు ఏకంగా విని ఉంటాము.
నేను ఒక నాడు అతిధిగా మీ ఇంటికి వచ్చినప్పుడు..నన్ను గేటు వరకు సాగనంపడానికి వచ్చి.. ఆకాశంలో.. చందమామని చూడమన్నట్లు సంజ్ఞా చేసావు.
ఆ చంద్రుడిని చూసి "నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు" పాట గుర్తు చేసాను. అదే పాట ని ఎన్నిసార్లు రేడియోలో కోరి వినిపించావు తలచుకుంటేనే నా మనసంతా బరువుగా మారిపోతుంది.
మన మధ్య చిరు చిరు అలకలు,కోపతాపాలు కరిగిన క్షణాలు ఒకరిలో ఒకరు ఒదిగిన తరుణాలు ఇక్కడే కదా!
చంద్రోయం ..చంద్రోదయం అంటూ ఆ జంట బదులు మనం జీవించిన కాలాలు ఎలా మరువ గలను? ఆ పాట చిత్రీకరణ లో ఉన్న ప్రదేశం ఇలాటిదే కదా!అందుకే ఆ దృశ్యంలో మనమూ మమేకం అయిపోయే వారిమి కదా!.
"వందనాలు వందనాలు వలపుల హరిచందనాలు వెన్నెలలలో వేచి వేచి వెచ్చనైన నా స్వామికి వందనాలు" అని పాడి నన్ను చిత్తు చేసిన తరుణాలు నేను మరువగలనా ప్రియా..!
మన వివాహం జరగడం అంటే నింగి నేల ఒకటై నట్లు.
మన వివాహం జరిగినట్లు మనం ఇరువురం కలసి కలగన్నప్పుడు మన ఇరువురి మదిలో ఒకటిగా మెదిలిన పాట "నేల మీది జాబిలీ నింగి లోని సిరి మల్లి "
ఎన్ని కలలు కన్నాము. మోయలేని ఈ ఎద బరువు కొండలా పెరిగిపోతుంది. పంచుకునేందుకు నీవూ లేవు..
అమృతా! పెరిగిన ఎద బరువు మోయడం అంటే మాటలా? ఏళ్ళ కొలదీ ఆ బాధని నేను అనుభవిస్తూనే ఉన్నాను.
నేను ఉద్యోగం వచ్చి దూరంగా వెళ్ళిపోయినప్పుడు నా ఎడబాటుని భరిస్తూ నీవు ఒంటరిగా పాడుకుంటూ ఉన్నానని చెప్పిన పాట నేను మర్చిపోతే కదా!
పున్నమిలాగా వచ్చి పొమ్మని జాబిలీ అడిగింది, పుష్కరమల్లె వచ్చి పొమ్మని గోదారి అడిగింది. ఇప్పుడు ఆపాటని ఎప్పుడు విన్నా గుండె కోతని రేపుతూనే ఉంటుంది.
మన వివాహం జరపాలని మీ పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళని అడిగినప్పుడు మనమధ్య ఉన్న తారతమ్యాలు అడ్డుగోడలై మన చుట్టూ కోటగోడలై నిలిచి
"జానకి కన్నుల జలధి తరంగం,రాముని మదిలో విరహసముద్రం.."
మనం దూరంగా ఉండి అనుభవించలేదా!
నీ వివాహానికి మీ వాళ్ళు సిద్దపద్దప్పుడు.. మరొకరి ఊహే భరించలేని నువ్వు..ఆత్మహత్య చేసుకుంటూ.. నాకు వ్రాసిన ఉత్తరంలోని ఆఖరి మాటలు నేను కలనైనా మరువగలనా!?
కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాలపైన వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నా రాజు ఈ రోజు.
ఈ పున్నమి.. ఈ వెన్నెల, ఈ నదీ, ఈ సాగర సంగమం అన్నీ ఇప్పటికీ నిన్నే గుర్తుకు తెస్తున్నాయి. నిన్ను మర్చిపోతే కదా! మరిస్తేనే జ్ఞాపకం చేసుకోవడం అనేది ఉంటుందని అపార్ధం చేసుకునేవు సుమా!
కాలం గాయాలని మాన్పుతుంది అంటారు. గాయం మానినా, గాయం తాలూకు చిహ్నంలా నీ అమృత ముద్ర నా మనసుపై ఎన్నటికి నిలిచే ఉంటుంది.
నిర్మానుష్యమైన ఆ సాగర తీరంలో, ఈ సంగమ ప్రదేశం లో నా మనసు వొంటరయి నీ కొరకు విలపిస్తుంది.
ఆ తీరంలోనే నీవు శాశ్వతంగా విశ్రమించిన చోట అమర ప్రేమకి ఆనవాలు గా ఓ సమాది. ఆ సమాధి ని తాకే కెరటాలు ప్రేమకి అభిషేకం చేస్తూ..
అమృతా! ఇదంతా నేను ఎవరికీ చెప్పను ? నీకు తప్ప!
అందుకే నీదరికి చేరని ఈ లేఖని నా మనసుకి ఊరట కల్గించుకోవడం కోసం వ్రాసుకుంటున్నాను. అంతే, అంతే!!
"కలసిన ఆత్మల అనుబంధాలే ఏ జన్మకు విడిపోలేవు తనువులు వేరైనా దారులు వేరైనా ఆ బందాలే నిలిచేనులే!"
15 కామెంట్‌లు:
ఎంత సున్నితంగా మరెంతో ఆర్థ్రంగా ఆవేదనతో కూడుకొనిఉంది వనజగారు.. టచ్ చేశారు.. చాలాసేపటి వరకు ఇంతటి ప్రేమని తట్టుకోలేము అనేంతగా ...
vanajaa kadanam chakkagaa undi. mee saili lo inkaa baagundi.
చాలా బాగుంది వనజ గారు. "వెన్నెల సాక్షిగా .. విషాదం" అన్న టైటిల్ కూడా భలే నచ్చిందండి.
మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేంత బాగా వ్రాశారు . విషాదం నిండిన ఎదబరువును మోయాలంటే ఎంత బలమైనా మనస్థత్వం ఉండాలో కదా....మీరు రాసిన వాటిల్లో చందమామలా వుందీ పోస్ట్.
వనజవనమాలి గారూ "వెన్నెల సాక్షిగా .. విషాదం" నిజంగా బాధను కలిగించిందండీ..
మంచి మంచి పాటలను కూడా పోస్ట్ లో కలిపి చెప్పేశారు చాలా బాగుంది పోస్ట్..
"వెన్నెల సాక్షిగా .. విషాదం" ఎంత బావుందో టపా కుడా అంతే బావుంది వనజ గారు...విషాదమైనా జ్ఞాపకం ఎప్పుడూ బావుంటుంది
చక్కటి కథకి కథనానికి అభినందనలండీ
ఈ పోస్ట్ చదివిన తర్వాత మళ్ళీ ప్రేమలో పడి మరణించి ప్రేమికుడి గుండెలో శాశ్వతంగా జీవించాలని ఉంది. అంత బావుంది.
మీరు ఉదాహరించిన పాటలు అదరహో అదరహ.
రమణి రాచపూడి.. గారు.. మీ స్పందనకి.. ధన్యవాదములు. పోస్ట్ వ్రాసిన నాకు కూడా బాగా నచ్చింది :)
@మెరాజ్ .. మెచ్చినందుకు ధన్యవాదములు.
@ జలతారు వెన్నెల గారు.. ఈ పోస్ట్ మీకు నచ్చుతుంది అని నాకు తెలుసు.ఎదో..కాస్త మీలా వ్రాదామని ప్రయత్నం అంతే!!
థాంక్ యు సో మచ్!
జ్యోతిర్మయి గారు.. అప్పుడప్పుడు ఇలా మనసు స్పందిస్తూ ఉంటుంది. వ్రాస్తూ ఉంటాను. పున్నమి వెన్నెల,చంద్రుడు,హంసలదీవి నదీ సంగమ ప్రదేశం నాకు అత్యంత ఇష్టమైనవి. అందుకే ఈ పోస్ట్ ఇలా..
థాంక్ యు వెరీ మచ్!
@ రాజీ గారు.. థాంక్ యూ వెరీ మచ్. పాటలు బాగా నచ్చి ఉంటాయి :) థాంక్ యు సో మచ్!!
@ చెప్పాలంటే మంజు గారు... మీ అభిమాన పూర్వక వ్యాఖ్యకి,స్పందనకి ..మరీ మరీ ధన్యవాదములు.
mhs greamspet రామ కృష్ణ గారు.. ధన్యవాదములు.
@వైష్ణవి.. ఓహ్.. ఎంత బాగా కామెంటారు? అలాగే అలాగే! థాంక్ యూ సోమచ్.:)
అద్భుతం గా వ్రాసారు...చాలా చాలా బాగుంది వనజ గారూ!....@శ్రీ
రెండేళ్ళ తర్వాత చూసినా ...
నిత్య నూతనమే ...
బంధాలు, భావాలు ...
చెరగని జ్ఞప్తులు ...
మనసు చెమ్మగిలేట్లుగా
వ్రాశారు మేడం ...
nmrao bandi గారు ధన్యాదములు . మీరు ఫీల్ అయినట్లే నేనూ నూ..
నిజమైన ప్రేమ ఎలావుంటుంది అనేదానికి ఇలాంటి లాండ్మార్క్ కథలు. ఇప్పటి ప్రేమల్లో చంపటాలు,ఆసిడ్ దాడులు ఎందుకు పెరుగుతున్నాయి,నిజంగా ప్రేమతోనేనా????ప్రేమ నిస్వర్దానీ ఆర్ద్రతని పంచుతుంది.అది ఈ కథ లో వుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి