8, అక్టోబర్ 2026, గురువారం

నేనూ సముద్రం


 

నేనూ సముద్రం - వనజ తాతినేని


నువ్వెంతో అందంగా వుంటావ్ ప్రియతమా! 

మహా మహా సౌందర్యాలన్నీ నీ ముందు మోకరిల్లుతాయి

మణి మాణిక్యాలు యెన్నో దాచుకుని గుంభనంగా వుండగల్గడం

నీకు మాత్రమే సాధ్యం

క్షణ విరామమెరుగని ప్రయాస వుంది

అంతులేని అలజడి వుంది 

చెలిమిలి కట్ట దాటలేని సహృదయత వుంది


బడబాగ్నిని కడుపులో దాచుకున్న

గంభీరమైన నిశ్శబ్దం వుంది

అనేక చరాలకిచ్చిన ఆత్మీయ ఆశ్రయం వుంది

ఎవరేమిచ్చినా తీసుకోని నిరాడంబరత వుంది

ఎవరితోను విడమర్చి చెప్పలేని అంతులేని ఘోష వుంది


సమయ సందర్భాలు వేరు వేరైనా నువ్వు పుట్టినట్లే నేనూ 

నీతో పాటు నేనూ తిరుగుతూ ఇరువురం శలభాల్లా  

సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూనే వున్నాం

ఈ ఆకర్షణ  యుగాల యుగాల పర్యంతం


అయినా..

ఎవరికి యెవరూ యేమీ కాకున్న యీ లోకాన 

నాకు నువ్వున్నట్లే నీకూ నేనున్నాను కదా! 

నా రాక కోసం నిరీక్షిస్తూ యెదురెదురు వచ్చి స్వాగతిస్తావ్ 

నేను కాదనకుండా నీ ఆలింగనంలో వొదిగిపోతాను.

ఈ సమ్మోహన శక్తిని అన్యులు ఆపలేనిది

అనేకంగా మమేకం మనం. 


కామెంట్‌లు లేవు: