6, జులై 2012, శుక్రవారం

మై స్పేస్ ..అమ్మలక్కల కబుర్లు 3

ఒక శత్రు దేశ సైనికుడు ఇలా అన్నాడు..

"నా దగ్గర ఓ..మెషిన్ గన్ ఉంది..వంద మందినైనా మట్టిగరిపించ గలను". అన్నాడు.

దేశ భక్తి గల ఒక పౌరుడు ఇలా అన్నాడు..

"నా వద్ద ఒక వడిసెల ఉంది.ఒక గులక రాయి పెట్టి గురి కొడితే..నువ్వే ఉండవు." అన్నాడట.

సకల జీవులలో కూడా వేటి గొప్ప వాటివే! దేని ప్రాధాన్యం దానిదే!

ఈ రోజు ఇలా చెబుతూ ఎందుకు వచ్చానంటే...

మా ఫ్రెండ్ ఒకరు ఇలా అన్నారు. యండమూరి వీరేంద్ర నాథ్ ఎంత గొప్ప రచయిత. అంతకు ముందు వచ్చిన రచయితలూ అందరూ దిగదిడుపే! అంది.. చాలా ఆరాధనగా తన అభిమాన రచయితని తలచుకుని.

నవలా యుగం అని చెప్పిన కాలంలో స్త్రీలు పోటాపోటీగా నవలలు వ్రాశారు. అలాగే పురుష రచయిత కూడా స్త్రీల పేరు తో వ్రాసారని చెప్పుకుంటారు. అంత మాత్రం చేత ఎల్లకాలం స్త్రీలు మాత్రమే వ్రాసారా? అంతకు ముందు సాహిత్యం లో పేరెన్నికగల రచయితలూ లేరా..ఏమిటి? ఈ గొప్ప చిన్న తేడా ఎందుకు? నీకు యండమూరి వీరేంద్ర నాథ్ రచనలు నచ్చినవి అని మిగతా వారిని తక్కువ చేయటం తప్పు కదూ!

అయినా ఏముంది వీరేంద్ర నాథ్ రచనలలో..క్షుద్ర శక్తులు, దుప్పట్లో మిన్నాగు, వెన్నెల్లో ఆడపిల్ల..ఆటలు,సస్పెన్స్..సాగతీత ఇవేకదా! ఇంగ్లీష్ సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేయడం లో కాస్తంత ప్రత్యెక శైలి కనపరచాడు అంతకు మించి ఏముంది..? సమకాలీన సాహిత్యం ఏమైనా వ్రాశాడా?అని విసుక్కుంది నా ఫ్రెండ్ రమ.

ఎందుకు ప్రతి చిన్న విషయానికి అలా బరస్ట్ అవుతావ్? అడిగాను నేను.

అప్పుడప్పుడు అలా స్ట్రాంగ్ గా ఆన్సర్ చేయాలి అమ్మాయి. లేకపోతె..వాళ్ళకి పగ్గాలు వేయలేము.
.మనకి నచ్చారు కదా అని ఇతరులని తక్కువ చేయడం ఏమిటో!

మన చేతి వేళ్ళ లోనే అన్నీ సమానంగా ఉండవు. .అలా అని ఏ వేలు మనది కాకుండా పోతుందా!? అభిమానం ప్రకటించడం తప్పు కాదు. కానీ అభిమానం ప్రకటిస్తూ..ఇతరులని తక్కువ చేయడం సమంజసం అనిపించుకోదు. దురభిమానం ని బాహాటంగా ప్రకటించుకోవడం లో ఇతరులని తీసి పడేయడం కోపం తెప్పించదూ!? అంది

ఆలోచించిన నాకు నిజమే అనిపించింది. ఏమైనా మా ఫ్రెండ్ "రమ" ఏమా షార్ప్..!!

సాహిత్యం లో పలానా రచయితే చాలా గొప్ప అని చెప్పడానికి ఏం లేదు. ఎవరి బాణీ వారిది. ఎవరి గొప్ప వారిది అనుకుంటూ.. నేను "సరస్సు" కవిత వ్రాసుకున్నప్పుడు వ్రాసిన వాక్యాలని గుర్తు చేసుకున్నాను

ఆ వాక్యాలు మా ఫ్రెండ్ "రమ" కి చెప్పాను. ఇవి..

ప్రవాహం అభివృద్దికి సూచకం.
భావ స్వేచ్చ కూడా ప్రవాహం లాంటిదే!

సాహిత్యం సముద్రం వంటిది.

ప్రకృతిలో సముద్రమే కాదు నదులు ఉన్నాయి..జలపాతాలు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, వాగు ప్రక్కన వెళుతూ వెళుతూ దాహం కోసం తవ్వుకుంటే మంచి నీటి చెలమలు ఉంటాయి.వాటికి ప్రవాహం లేదు కదా! సరస్సులు, చెలమలు అభివృద్ధి కారకాలు కాదు అనుకోకూడదు.

ఎలాటి ప్రవాహం అయినా ప్రవహించి ప్రవహించి చివరికి కడలి ఒడికే చేరుతుంది.కాని సరస్సు,చెలమ అక్కడే ఉండి తన ఉనికిని నిలబెట్టుకుంటాయి.సరస్సు,చెలమ ఉనికి ప్రత్యేకం అని చెప్పడం మాత్రమే కాదు అవి కూడా ఈ ఈ అనంత ప్రకృతిలో భాగమే కదా! సాహిత్యంలో ఎవరి ఉనికి వారిదే కదా! అలాగే ఎవరి గొప్ప వారిదే కదా! ఇతరులను కించపరచకూడదు అని అనుకుంటే బాగుంటుంది..అని చెప్పుకున్నాం

ఇవి.. మా అమ్మలక్క కబుర్లు.

5, జులై 2012, గురువారం

వంకాయ విత్ బోర్నవీటా





కూరలలో రారాజు వంకాయ అంటారు కదా!

వంకాయ వంటి కూరయు పంకజ ముఖి సీత వంటి భార్యామణి.. అన్నారు కదండీ.. అని జంధ్యాల గారి సినిమాలో పాట మనందరకీ సురపరిచితమే!

ఇక వంకాయ మీద పాటలు చెప్పాలంటే.. ఆహా..ఏమి రుచి..అనరా మై మరచి.. గుర్తుకువచ్చును కదా!

సరే..ఈ వంకాయ గురించి ప్రస్తావన ఎందుకంటే.. ఈ మధ్య నా పాక శాస్త్ర ప్రావీణ్యం కి నూటికి నూరు మార్కులు పడిన వైనం గురిచి..చెప్పడం అన్నమాట.

అలా అని నేను పాకశాస్త్ర ప్రావీణ్యంలో దిట్ట అనుకునేరు. నాకు వంట చేయడం అంటేనే మహా చిరాకు. కాని ఒక్క రోజు కూడా తప్పించుకోను వీలు కాదు. ఏం చేస్తాం..?


ఈ మధ్య మా అత్తమ్మ కి అనారోగ్యంగా ఉన్నప్పుడు.. ఆమె కోరిక ప్రకారం వంకాయ కూర వండాలని ప్రయత్నం మొదలెట్టాను. అది రాత్రి ఎనిమిది గంటల సమయం

వంకాయ మామిడి కాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కాని ఆవిడ.."నో" చెప్పేశారు.

వంకాయ +దోసకాయ,..అన్నాను.."నో" అన్నారు.

వంకాయ పులుసు అన్నాను ..తల ఊపారు. అమ్మయ్య బతికి పోయాను అనుకుని ..వంటకి ఉపక్రమించాను.

వంకాయలు ఓ..పావు కిలో , ఉల్లిపాయలు. రెండు,నాలుగు పచ్చి మిర్చి..కలిపి తాలింపు వేసి .. పది నిమిషాలు సన్నటి మంట పై కూర మగ్గనిచ్చి. తర్వాత చింతపండు పులుసు పోసి.. అలా తిరిగానో లేదో..టక్కున కరంట్ పోయింది.

అయ్యో! అనుకుని.. కాండిల్ కూడా వెలిగించాకుండానే..కారం వేసాను.

కొంచెం బెల్లం ముక్క కూడా వేసి కాసేపు ఉడికి పులుసు చిక్క పడేవరకు ఉంచి స్టవ్ ఆపేసి బయట పడ్డాను.
భోజనాలు సమయం అప్పుడు.. వంకాయ కూర రుచి చూస్తే చాలా బాగుంది.

ఓస్.. ఇది కూడా విచిత్రంగా చెప్పాలా అనుకోకండి.

మా అత్తమ్మ.. నేను చేసిన వంకాయ కూరని చాలా ఇష్టంగా తింటున్నారు. చాలా బాగుంది అని కితాబు ఇచ్చారు. అమ్మయ్య..! అనుకుని ఊపిరి పీల్చుకున్నాను కూడా.

సరే.. నేను రుచి చూడాలని..కొంచెం వేసుకుని తిన్న తర్వాత కాని నాకు అర్ధం కాలేదు. కారం రుచి కాకుండా..నాకు ఏదో.. డిఫరెంట్ రుచి తెలుస్తుంది. నేను వేసిన కారంకి ..ఆ వంకాయ పులుసు..చాలా స్పైసీగా ఉండాలి. అలా కాకుండా..ఎంత బెల్లం ముక్క వేస్తే మాత్రం..ఇలా చాక్లెట్ ఫ్లేవర్ రావడం ఏమిటి? అనుకున్నాను.

ఏమన్నా సందేహం వేలిబుచ్చాలన్నా.. అంతా బాగోదు కదా! నా వంట ప్రావీణ్యం ని కించ పరచుకున్నట్లు కాదు..అనుకుని..సైలెంట్గా తినేసి.. సింక్లో ప్లేట్లు పడేసి చేతులు కడుక్కుని బయటపడ్డాను.

ఎంత ఆలోచించినా..ఆ పులుసుకి చాక్లెట్ ఫ్లేవర్ ఏమిటో..అర్ధం కాలేదు.

కరంటు రాగానే..ఏ మాత్రం ఆలస్యం చేయకుండా..వంట ఇంట్లోకి వెళ్లి చూసాను. ఎందుకో అనుమానం వచ్చి కారం బాటిల్ లో నుండి.. స్పూన్ తో..కారం తీసి పరిక్షీంచిన తర్వాత తెలిసింది. అది కారం కాదు "బోర్నవీటా" అని.

ఆ రోజు సాయంత్రమే.. బోర్నవీటా తీసుకుని వచ్చి..ఓపెన్ చేసి కారం బాటిల్ ప్రక్కనే పెట్టారని.
కారం పోసే బాటిల్ కూడా.. క్రితం ఖాళీ అయిన బోర్నవీటా బాటిల్ లోనే కారం పోసి పెడుతుంటారు కాబట్టి నేను చీకటిలో పొరబడి.. బోర్నవీటా ని కారం అనుకుని వేసి.. వంకాయ పులుసు చేసాను అని.

మొత్తానికి ఎవరికీ అసలు కారమే వేయలేదు అని అనుమానమే రాలేదు.

మా కోడలు వంట బ్రహ్మాండంగా చేస్తుని అన్న కితాబు కూడా వచ్చేసింది.

రుచికరమైన వంకాయ పులుసు..తయారీ విధానం లోని అసలు సిసలైన కిటుకు "బోర్నవీటా" అని నేను అసలు చెప్పనేలేదు.

ఏదో..మన బ్లాగరీ మణులు, బ్లాగర్ మహాశయులు పాకశాస్త్రం లో తలమునకలై ఉంటూ..ఉంటారు కదా!

అప్పుడప్పుడు.. వంకాయ పులుసు విత్ బోర్నవీటా తో చేసి టేస్ట్ చేసి.. బాగుంటే..నాకు ఓ..కామెంట్ కితాబు ఇస్తారని ఆశ + నాకు ఒక బ్లాగ్ పోస్ట్ కి కంటెంట్ దొరికింది అన్న సంతోషం తో.. ఇలా వచ్చాను.

ఇంతకీ.. ఈ అనుభవం తర్వాత వంకాయ పులుసు ఎప్పుడు చేసినా సరే.. ఓ..రెండు స్పూన్ లు.. "బోర్నవీటా " ని యాడ్ చేయడం మానలేదు.

ఈ రహస్యం మా అత్తమ్మకి ..చెప్పకండే..ప్లీజ్!!

4, జులై 2012, బుధవారం

జ్ఞాన సముపార్జన డేగ-ఆవు

ఈ కాలం తల్లి దండ్రులకి ఒక ప్రశ్న..? 

 మీ పిల్లలకి ఎలాటి జ్ఞాన సముపార్జన కావాలనుకుంటున్నారు!? 
 ఆవు లాగా సంగ్రహించిన జ్ఞానాన్ని నేమరవేసుకునే విద్యావలంబన కావాలా? 
 లేక డేగ లాగా చాలా ఎత్తు నుండి పసి గట్టి తన్నుకుని వెళ్ళే విద్య కావాలా ?

 డేగ లక్ష్యం : అర్జునుడి లక్ష్యం కేవలం పక్షి కన్ను బేధించడం. అర్జునుడి లాగా డేగ కూడా.. తన ఆహార సాధనకి కృషి చేస్తుంది. ఓపికగా నిరీక్షించి తన ఆహారాన్ని సాధించుకుంటుంది. కడుపు నిండిన డేగ శాంతిస్తుంది. మళ్లీ.. ఆకలి కాగానే ఆహారాన్వేషణ మొదలు పెడుతుంది. ఈ సారి లక్ష్యం మారుతుంది. 

 ఆవు లక్ష్యం: ఆవు తన ఆహారాన్ని కనపడిన చోటల్లా సేకరించి.. ఆబగా తినేస్తుంది. అటుపిమ్మట తీరికగా.. తిన్న ఆహారాన్ని నోటిలోకి తెచ్చుకుని నెమరు వేస్తూ సారాన్ని గ్రహిస్తుంది. ఇలా తన ఆహారాన్ని ఆస్వాదిస్తుంది. 

 ఆహారాన్వేషణలో డేగ స్వభావానికి -ఆవు స్వభావానికి తేడా గమనించాము కదా! 


బిడ్డలు కూడా ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు .. ఏ విధంగా అయితే ఆవు తన ఆహారాన్ని గ్రహిస్తుందో.. అటువంటి సాధన పిల్లలకు అలవడాలి. 

 కానీ నేటి విద్యావిధానం చూస్తుంటే.. డేగ లక్ష్య సాధన మాత్రమే గోచరిస్తుంది. మార్కులు, రాంకుల వేటలో.. విషయసారం లేని బట్టీ చదువులు కి అలవడిపోయి విషయ పరిజ్ఞానం కొరవడుతుంది. 

ఎలాంటి విద్య కావాలో.. నేటి తరం తల్లిదండ్రులు,పిల్లలు కూడా ఆలోచించి ఎంచుకోవాలి.