6, జులై 2012, శుక్రవారం

మై స్పేస్ ..అమ్మలక్కల కబుర్లు 3

ఒక శత్రు దేశ సైనికుడు ఇలా అన్నాడు..

"నా దగ్గర ఓ..మెషిన్ గన్ ఉంది..వంద మందినైనా మట్టిగరిపించ గలను". అన్నాడు.

దేశ భక్తి గల ఒక పౌరుడు ఇలా అన్నాడు..

"నా వద్ద ఒక వడిసెల ఉంది.ఒక గులక రాయి పెట్టి గురి కొడితే..నువ్వే ఉండవు." అన్నాడట.

సకల జీవులలో కూడా వేటి గొప్ప వాటివే! దేని ప్రాధాన్యం దానిదే!

ఈ రోజు ఇలా చెబుతూ ఎందుకు వచ్చానంటే...

మా ఫ్రెండ్ ఒకరు ఇలా అన్నారు. యండమూరి వీరేంద్ర నాథ్ ఎంత గొప్ప రచయిత. అంతకు ముందు వచ్చిన రచయితలూ అందరూ దిగదిడుపే! అంది.. చాలా ఆరాధనగా తన అభిమాన రచయితని తలచుకుని.

నవలా యుగం అని చెప్పిన కాలంలో స్త్రీలు పోటాపోటీగా నవలలు వ్రాశారు. అలాగే పురుష రచయిత కూడా స్త్రీల పేరు తో వ్రాసారని చెప్పుకుంటారు. అంత మాత్రం చేత ఎల్లకాలం స్త్రీలు మాత్రమే వ్రాసారా? అంతకు ముందు సాహిత్యం లో పేరెన్నికగల రచయితలూ లేరా..ఏమిటి? ఈ గొప్ప చిన్న తేడా ఎందుకు? నీకు యండమూరి వీరేంద్ర నాథ్ రచనలు నచ్చినవి అని మిగతా వారిని తక్కువ చేయటం తప్పు కదూ!

అయినా ఏముంది వీరేంద్ర నాథ్ రచనలలో..క్షుద్ర శక్తులు, దుప్పట్లో మిన్నాగు, వెన్నెల్లో ఆడపిల్ల..ఆటలు,సస్పెన్స్..సాగతీత ఇవేకదా! ఇంగ్లీష్ సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేయడం లో కాస్తంత ప్రత్యెక శైలి కనపరచాడు అంతకు మించి ఏముంది..? సమకాలీన సాహిత్యం ఏమైనా వ్రాశాడా?అని విసుక్కుంది నా ఫ్రెండ్ రమ.

ఎందుకు ప్రతి చిన్న విషయానికి అలా బరస్ట్ అవుతావ్? అడిగాను నేను.

అప్పుడప్పుడు అలా స్ట్రాంగ్ గా ఆన్సర్ చేయాలి అమ్మాయి. లేకపోతె..వాళ్ళకి పగ్గాలు వేయలేము.
.మనకి నచ్చారు కదా అని ఇతరులని తక్కువ చేయడం ఏమిటో!

మన చేతి వేళ్ళ లోనే అన్నీ సమానంగా ఉండవు. .అలా అని ఏ వేలు మనది కాకుండా పోతుందా!? అభిమానం ప్రకటించడం తప్పు కాదు. కానీ అభిమానం ప్రకటిస్తూ..ఇతరులని తక్కువ చేయడం సమంజసం అనిపించుకోదు. దురభిమానం ని బాహాటంగా ప్రకటించుకోవడం లో ఇతరులని తీసి పడేయడం కోపం తెప్పించదూ!? అంది

ఆలోచించిన నాకు నిజమే అనిపించింది. ఏమైనా మా ఫ్రెండ్ "రమ" ఏమా షార్ప్..!!

సాహిత్యం లో పలానా రచయితే చాలా గొప్ప అని చెప్పడానికి ఏం లేదు. ఎవరి బాణీ వారిది. ఎవరి గొప్ప వారిది అనుకుంటూ.. నేను "సరస్సు" కవిత వ్రాసుకున్నప్పుడు వ్రాసిన వాక్యాలని గుర్తు చేసుకున్నాను

ఆ వాక్యాలు మా ఫ్రెండ్ "రమ" కి చెప్పాను. ఇవి..

ప్రవాహం అభివృద్దికి సూచకం.
భావ స్వేచ్చ కూడా ప్రవాహం లాంటిదే!

సాహిత్యం సముద్రం వంటిది.

ప్రకృతిలో సముద్రమే కాదు నదులు ఉన్నాయి..జలపాతాలు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, వాగు ప్రక్కన వెళుతూ వెళుతూ దాహం కోసం తవ్వుకుంటే మంచి నీటి చెలమలు ఉంటాయి.వాటికి ప్రవాహం లేదు కదా! సరస్సులు, చెలమలు అభివృద్ధి కారకాలు కాదు అనుకోకూడదు.

ఎలాటి ప్రవాహం అయినా ప్రవహించి ప్రవహించి చివరికి కడలి ఒడికే చేరుతుంది.కాని సరస్సు,చెలమ అక్కడే ఉండి తన ఉనికిని నిలబెట్టుకుంటాయి.సరస్సు,చెలమ ఉనికి ప్రత్యేకం అని చెప్పడం మాత్రమే కాదు అవి కూడా ఈ ఈ అనంత ప్రకృతిలో భాగమే కదా! సాహిత్యంలో ఎవరి ఉనికి వారిదే కదా! అలాగే ఎవరి గొప్ప వారిదే కదా! ఇతరులను కించపరచకూడదు అని అనుకుంటే బాగుంటుంది..అని చెప్పుకున్నాం

ఇవి.. మా అమ్మలక్క కబుర్లు.

22 కామెంట్‌లు:

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"సాహిత్యంలో ఎవరి ఉనికి వారిదే కదా! అలాగే ఎవరి గొప్ప వారిదే కదా! ఇతరులను కించపరచకూడదు అని అనుకుంటే బాగుంటుంది"

వనజవనమాలి గారూ.. మీరంతా మంచి విషయాలు చెప్పుకున్నారండీ :)
ఒక్క సాహిత్యమే కాదు ఏ రంగంలోనైనా ఎవరి గొప్ప వారిదే!! అనుకుంటాను నేను..

సీత చెప్పారు...

మంచి కబుర్లు :)
బాగుందండీ

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ గారు..మీరు అన్నట్లు అన్ని రంగాలలోను ఎవరి గొప్ప వారిదే!
ఇక్కడ ఒక రచయిత గురించి ప్రస్తావన కాబట్టి.. సాహితీ రంగం అని కబుర్లాడుకున్నాం అంతే! థాంక్ యూ!

prasanthi చెప్పారు...

భలే ఉన్నాయి మీ ముచ్చట్లు. మంచి విషయం చెప్పారండీ. నాకు నచ్చింది.

Kottapali చెప్పారు...

కించ పరచకూడదు అనేది మంచి సెంటిమెంటే కాని, కళల్లో .. ముఖ్యంగా సాహిత్యంలో వాలఖిల్యులు పుట్టుకొచ్చి మేమే మేరుపర్వత సమానులం అని డబ్బా కొట్టుకోడం, పాఠక లోకం కూడా ఆహా ఓహో అనుకుంటూ ఇదే మేరు పర్వతం అనుకుంటూ బాజాలు మోగించడం. దీని మధ్య నిజంగా మేరు పర్వత ధీరమైన సాహిత్యం ఎలా ఉంటుందో అందరూ మర్చిపోతారు - అందుకని అక్కడక్కడా అప్పుడప్పుడూ మీ స్నేహితులు రమగారి వంటి వాళ్ళు కాస్త ఘాటుగా పుటం పెడుతూ ఉండాలి!

అజ్ఞాత చెప్పారు...

అమ్మలక్కల కబుర్లా ?? చుస్తుంటే ఏదో సాహిత్య గోష్టి లా ఉంది. అమ్మలక్కల కబుర్లంటే మిగత అమ్మలక్కల గురించి మాట్లాడుకోవాలి కాని, ఇవెంటండి. మా ఊరికి రండి, మిమ్మల్ని ఒక అరుగు మీద కూర్చుపెడతాను, మీకు మొత్తం ఊరిలో ఉన్న అందరి చరిత్ర విప్పి చెప్తారు. హి హి హి..just kidding.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నారాయణ స్వామి గారు..మీ వ్యాఖ్యతో..నేను ఏకీభవిస్తున్నాను.
మన బ్లాగ్ లలోనే చూడండి.. మంచి సాహిత్య సంబంధమైన విషయాలు చెప్పే బ్లాగ్ లకి కామెంట్స్ ఉండవు.
"అమయ" బ్లాగ్ ఎంతమంది చూసి ..సామాన్య గారి రచనలను మెచ్చుకుంటున్నారు చెప్పండి. !?
సాదా సీదా రచనలు, ఇంకా చెప్పాలంటే భావ చౌర్యం చేసి వ్రాసిన వారి రచనలకి.. ఎన్నో ప్రశంసలు.
మీ వ్యాఖ్య కి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సీత గారు..ధన్యవాదములు.
@ప్రశాంతి ..మీకు ధన్యవాదములు.
@సన్నాయి రాగాలు గారు..ఈ కబుర్లు.. కొంచెం కథలు-కవిత్వం చదివే వాళ్ళ కబుర్లు లెండి.
ఆ కబుర్లు ఉంటాయి. కాని నేను వినను. ఆ గుంపులో కలవను:) ధన్యవాదములు.

భాస్కర్ కె చెప్పారు...

mee kaburlu baagunnai andi,
keep talking.

శ్యామలీయం చెప్పారు...

>మంచి సాహిత్య సంబంధమైన విషయాలు చెప్పే బ్లాగ్ లకి కామెంట్స్ ఉండవు.

కాలక్షేపం సామాగ్రికే హెచ్చుశాతం కళ్ళు వెతుకుతాయి, స్పందిస్తాయి. పాఠాలు చదువుదామనో కావ్యాలు చదువుదామనో‌ జనం అనుకోకపోతే అందులో‌ఆశ్చర్యపోవలసినది యేమీ లేదు.

జలతారు వెన్నెల చెప్పారు...

శ్యామలీయం గారు అన్నటు ఒక్కొక్కరి అభిరుచి ని బట్టి ఉంటుంది వనజ గారు.
కొందరు సరదాగా కాస్త టైం ఉన్నప్పుడు చదివేసి వెళ్ళిపోతారు, కొందరు మంచి సాహిత్యపు విలువలున్న రచనలు ఇష్టపడతారు. కొందరు సినిమా కబుర్లు, రాజకీయలు తప్పితే చదవరు.కొందరి కవితలు మాత్రామే, అలా...
అందుకని నా ఉద్దేశం లో ఎంతో బాగా రాసే వారు చాలా మంది ఉన్నారు. అలా అని వారు రాసినవన్ని చదివి ఆస్వాదించే వారు కూడా ఉండాలి కదా?
ఎవరో ఒకసారి నాతో అన్నారు, నీ బ్లాగ లో కామెంట్స్ పెట్టేవారందరు నీ స్నేహితులేమో కాని, నిజంగా మెచ్చి పెట్టేవారు లేరు అని..నా జవాబు, ఫర్వాలేదు నేను రాసేది ముందుగా నాకు నచ్చితే చాలు, ఇంకెవ్వరికి నచ్చినా నచ్చకపోయినా అని. ఎవరి అభిప్రాయాలు వారివి.

మాలా కుమార్ చెప్పారు...

అవునండి ఎవరి ప్రత్యేకత వారిదే . కాని మనకు నచ్చిన్వే మనకు గొప్ప అనిపిస్తుంది . అంతమాత్రాన ఎదుటివారిని తీసిపారేయకూడదు కదా .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్యామలీయం గారు.. మీరు చెప్పినది నిజమే! కాస్త సరదా గా బ్లాగ్ వ్రాసుకుంటూ..ఇతరులు వ్రాసినవి చదువుకునే వారికి సమస్యా పూరణం,పద్యం,ఇంకా సాహిత్య విషయాల పట్ల నిరాసక్తి. ఎవరి అభిరుచిని బట్టి వారు ఫాల్లో అవుతుంటారు. కామెంట్స్ పెడుతుంటారు.
ఇప్పుడు మన బ్లాగ్ లలో కవిత్వమే చూడండి. చాలా మంది కవిత్వం చూస్తే అది అసలు కవిత్వమే కాదు.. ఏదో పదాలు పేర్చినట్లు ఉంటుంది. ..అంటారు కవిత్వం అంటే బాగా తెలిసినవారు కాకలు తీరినవారు.
అలా అని ఉత్సాహంగా వ్రాసే వారిని మనం చిన్నబుచ్చ లేం..కదా! కవిత్వం అర్ధం కాని వాళ్ళు ఉంటారు..(నాలాగా)
అలాగే వ్యక్తులు ఎవరి అభిరుచిని బట్టి వారు వ్రాసుకుంటారు.నచ్చినవారు చదువుతారు.వీలయితే కామెంట్ పెడతారు.లేకపోతే లేదు.
అసలు మేము మాత్రమే వ్రాసేది అసలైన కవిత్వం.. శ్రీ శ్రీ , తిలక్ లాగా మేము మాత్రమే వ్రాయగలము. వాళ్ళే కవులు మాకు నచ్చిన వాళ్ళే కవులు మీరు కవిత్వం వ్రాయకండి అని అనగలమా!?
స్రవంతిలో అందరు భాగమే కదా!
మంచి సాహిత్యం రావాలని కోరుకునే వారు,కాని సాహిత్య విలువలు తెలిసినవారి బాధ ఎలా ఉంటుందో.. మా ఫ్రెండ్ రమ చెప్పారు.నేను వ్రాసాను. అంతేనండీ!
మీ వ్యాఖ్య కి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు.. ఎవరి బ్లాగ్లలో ఎవరికీ నచ్చినది వారు వ్రాసుకుంటారు.అందుకు ఎవరికీ అభ్యతరం లేదు. మనకి ఇంటరెస్ట్ ఉంది చదివి నచ్చితే కామెంట్ పెడుతుంటాం. అందరు మేరు పర్వత సమానులు కాలేరు. కాలేరు. ఎవరి ఉనికి వారిదే కదా!అని చెప్పడమే చేసాను. మిమ్మల్ని నొప్పిస్తే "సారీ "అండీ.
మీకొక విషయం తెలుసా..!? కవితా ప్రక్రియలో కొత్త ఒరవడిని ప్రవేశ పెట్టి..బాగా పేరు పొందిన ఒక కవి.ఇంగ్లీష్ సాహిత్యం నుండి అనువాదం చేసుకుని తన కవిత్వంగా పత్రికలకి పంపారు. అవి అక్కడ ప్రచురితం అయి తర్వాత ఎవరి దృష్టికో వచ్చి ఈ విషయాన్ని మరి కొందరితో పంచుకున్నారు.
పేరు ప్రఖ్యాతలు ఉన్న వారే అలా చేసారు. కొత్తగా కలం పట్టి ఉత్సాహంగా స్వంతంగా వ్రాసేవారిని కించపరచకూడదు. అసలు కవిత్వం ఎలా ఉంటుందో వాళ్ళతో చదివించి అప్పుడు వ్రాయండి అని చెప్పడం విజ్ఞుల పని అని అనుకుంటాను నేను.
ఇది మీకు నేను ఎందుకు చెప్పానంటే.. మీకు బాగా వ్రాయడం రాదు,పరిణితి లేదు బాగా వ్రాసే వాళ్లతో మీరు పోటీ పడటం ఏమిటీ ? బ్లాగ్ లు మూసేసుకోండి అని చెప్పేవారికి నిజంగా వ్రాసే శక్తి ఉందా? వాళ్ళు కాపీ,పేస్ట్ వాళ్ళేనా..అని నా సందేహం కూడా.
నేను మీలాగా ఏదో తోచింది రాసుకునేదాన్ని. మీ మాటే నామాట అండీ!మన కోసమే మనం వ్రాసుకుందాం. సరేనా!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మాల కుమార్ గారు.. ఎవరి గొప్ప వారిదే నండీ! ఎవరో మాత్రమే గొప్ప అని చెప్పేవారికి ఇతరులని కించపరచ కూడదని తెలియనందుకు నొచ్చుకుని ఈ పోస్ట్ వ్రాసాను. ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

the tree భాస్కర్ గారు. మీ స్పందనకి ధన్యవాదములు.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

వనజ గారూ ,
కాక తాళీయంగా నేను తెలుగు బ్లాగులు చదవడం మొదలు పెట్టాక , నాకు చాలా ఆనందం వేసింది . సంతోషం పట్టలేక , ఇంత మంచి – ఇంతమంది తెలుగు రచయితలను తయారు చేసిన బ్లాగు ప్రపంచాన్ని మనస్ఫూర్తిగా ఒక పోస్ట్ లో ‘ బ్లాగరు పూమొల్కలారా ‘ అంటూ ప్రశంశించ కుండా ఉండ లేక పోయాను కుడా .
ప్రసక్తాను ప్రసక్తంగా నైనా ఈ చర్చలోకి వచ్చిన సాహిత్య (సమస్యాపూరణాది) బ్లాగులను కూడా చూచాను . తెలుగు పద్యం అంటే ఇష్టపడే వాణ్ణి కాబట్టి అందులో వేలు పెట్టేను కూడా . అహం (భావం) కారం తో నిండిన అచటి అసంబధ్ధ వాతావరణానికి శతకోటి వందనాలు పెట్టేశాను కూడా .
నేటి రచయితలో కూడా అనేక మంది లబ్ధ ప్రతిష్టులున్నారు . పాఠకలోకంలో వారి కెన్నడూ గౌరవ మర్యాద లుంటాయి . పాఠకులకు సులభ గ్రాహ్యంగాను , చదువరుల మనస్సునాకట్టుకొనే విధంగాను , కాస్తంత ప్రయోజన కారులు గానూ ఉంటూ , నిడివిలో మరీ విస్తారం కాని రచనల వైపు పాఠకులు మళ్ళుతారు . రాసేది మనకోసమే కాదు , ఇతరుల కోసం కూడా (మనం నెట్లో ఉంచుతన్నాం కదా) .
హైస్కూల్ ప్రథానోపాధ్యాయులుగా అవిశ్రాంత విధి నిర్వహనల నుండి విడివడి- నేటి అతి విశ్రాంత స్థితి లోని నాకు – వీరూ , వారూ అని కాకుండా చాలవరకు తెలుగు బ్లాగర్ల రచనలు అమితానందాన్నీ , అమితాశ్చర్యాన్నీ కల్గిస్తున్నవి .
ఎక్కడో ఒకటీ అరా తప్ప చాలమటుకు ఇచటి స్నేహపూర్వక వాతావరణం , రచనా విషయ వైవిధ్యం – నన్ను బాగా ఆకట్టు కొన్నవి . ఈ మీ పోస్టు బ్లాగర్లకు స్ఫూర్తి దాయకంగా , ఆలోచింపజేసే విథంగా ఉంది . ధన్యవాదములు .
----- సుజన-సృజన

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజారావు గారు..మీ వ్యాఖ్యకి చాలా సంతోషం .
నిజంగా బ్లాగ్ లలో వ్రాసే వారికి చక్కటి భావ వ్యక్తీకరణ శక్తి ఉంది.
కొంత మంది అహంభావుల దృష్టిలో..ఆ.. వీళ్ళెంత లే ! అన్నట్టు ఉంటుంది కాని.. ఇక్కడ వ్రాసే వారు బాగా పరిణితి చెంది చక్కని రచనలు చేయగలరు అనిపిస్తుంది. పెద్దల నుండి కాస్తంత సూచనలు,చిన్న పాటి ప్రశంసలు ఆశిస్తారు.అవి లభించనప్పుడు నిరాశ పడతారు.
అందుకే మన కోసమే మనం బ్లాగ్ రాసుకుంటూ ఉన్నాం అనుకుని తృప్తి పడటం ఉంది చూసారు..అది ఎవరికీ హాని చేయదు కదండీ!
ఈ రోజే ఎక్కడో ఒక బ్లాగర్ అన్నారు."నేనేమి అశ్లీల సాహిత్యం వ్రాయడం లేదు " అని .
నిజం కదా! నచ్చితే చదవడం, లేకుంటే లేదు.. అందరికి ఇతరులని ప్రభావితం చేసే శక్తి ఉందొ లేదో కూడా తెలియదు. నేను మాత్రం ఏదో..నా పాటికి నేను రాసుకుంటున్నాను. అంతే!
ధన్యవాదములు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

బ్లాగ్లోకం లోకి వచ్చాక ఇక్కడ ఎన్నో బ్లాగుల్లో మంచి మంచి విషయాలు చాలా చదివేను.కొందరు బ్లాగర్ల భావశబలతకూ, భావవ్యక్తీకరణకూ ముగ్ధుడనైనాను కూడా.ఎన్నో పరమ చెత్త బ్లాగులనూ, వారి అభ్యతరకరమైన భాషనూ చూసి ఏవగింపూ కలిగింది. అయితే ఈ సాహితీ రత్నాకరం లో మణులూ ఉంటాయి, నత్తగుల్లలూ ఉంటాయి. మనకి కావలసినవి మనం ఏరుకోవడమే.నచ్చిన వారికో కామెంటు పెట్టండి. నచ్చని వారిని విస్మరించండి. అంతే.

y.v.ramana చెప్పారు...

మీ స్నేహితురాలు యండమూరికి వీరాభిమాని. వీరాభిమానులు అలానే మాట్లాడతారు. అది ఆవిడ అభిప్రాయం. ఆ ఆనందాన్ని మనమెందుకు కాదనాలి? నేను కూడా మీ ఫ్రెండ్ పార్టీనే! యండమూరి ముందు తెలుగు సాహిత్యమంతా శూన్యం! జై యండమూరి!!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

yaramana ..గారు మీ స్పందనకి ధన్యవాదములు. నేను యండమూరి యుగంలోనే సాహిత్యం చదవడం మొదలెట్టాను లెండి. కాని వారికి మరే అంతా వీరాభిమాని ని కాదు. :)) జై.. యండమూరి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పంతుల గోపాల కృష్ణారావు గారు.. మీ స్పందనకి ధన్యవాదములు. మీరు చెప్పినది నిజం అండీ! సముద్రం ఒడ్డున నిలబడి.. ఎవరి విజ్ఞతని బట్టి వారు లభించిన దానిని ఏరుకుంటారు. ఇక్కడే అంతే! మీ సలహాకి..మరిన్ని ధన్యవాదములు. కృతజ్ఞతలు.