23, జులై 2012, సోమవారం

చిరునామా...


చిరునామా

ఎన్నటికి మారని రహదారిపై..
మారుతున్న ప్రయాణికులు
ఎందరెందరో

జీవితాలు ఎన్ని మలుపులు తిరిగాయో
స్థిరంగా నిలబడిన పర్వత శిఖరాన్ని
తాకి తాకి వెళ్ళే మేఘమాలికలు ఎన్నెన్నో
ఎంత కుంభ వృష్టిని కురిపించి వెళ్ళాయో

నిశ్చలంగా నిలబడిన అద్దం ముందు
తమని తాము దర్శించుకుని వెళ్ళింది ఎందరో
ఎన్ని అంతఃస్వరూపాలు బహిర్గతం కాబడ్డాయో

అలజడితో స్వభావాన్ని మార్చుకోని సముద్రంలో
ఎన్ని నదులు సంగమం చెందాయో
సాగర సంగమం గా మారాలని
ఎన్ని నదీ హృదయాలు పరితపించాయో 

అనంత జీవన ప్రవాహంలో 
మనిషిని మనిషిగా ప్రేమించుకోలేనంత కాలం 
ఏదో ఆశించి రావడాలు.. బురద చల్లి పోవడాలు ..
అంతా..మామూలే

స్వార్ధం చేసిన గాయాలకి..
పైపై లేపనాలపూత కాదు కావాల్సింది..
జీవనపర్యంతం వెంట ఉండి
నడిపించే నమ్మకమైన తోడు.

ఒంటరితనాలు , ఒంటరిపయనాలు
ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చోట
జారిపోకుండా ఉండటానికి
ఎంత ధృడచిత్తం కావాలి
ఎంతటి అహం ఉంది అనిపించుకోవాలి
లేకుంటే నగుమోము
నగుబాటుతో తలదించుకోదూ

నా ప్రియ నేస్తాల్లారా
వయస్సు,యశస్సు శలభంలా 
ఘడియలో ముగిసిపోదూ
ఉండిలేనట్లు అంది అందనట్లు
భ్రమింపజేస్తూ నెరజాణతనం ప్రదర్శిస్తూ


మీ ఆలోచనల భారం మోసానో
మీ అనుభూతుల ఆయుష్షుని పెంచానో
మీ మీ ఈర్ష్యద్వేషాన్ని సహించానో
మీ .. మీ హృదయాల అలజడిని భరించానో

మీరేమనుకున్నా
నేను మాత్రం ..
ఒక ఆహ్లాద కెరటాన్ని.
ఒక.. విశ్వసనీయ స్నేహాన్ని
మిమ్మల్ని మీరుగా ప్రేమించే 
హృదయానికి .. చిరునామాని

11 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

మంచి కవిత...

the tree చెప్పారు...

చక్కగా రాశారు, అభినందనలు.

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

బాగుందండి మీ కవిత వనజా గారు...మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకున్నట్టుంది!

వనజవనమాలి చెప్పారు...

mhsgreamspet రామకృష్ణ గారు.. మీ స్పందనకి ధన్యవాదములు.
@ నిరంతరమూ వసంతమూ సురేష్ గారు.. మీ అభినందనకి ధన్యవాదములు.
కవిత.. లో లోతు చూసారు. థాంక్ యు వెరీమచ్ :)
@ ది ట్రీ భాస్కర్ గారు.. థాంక్ యు వెరీ మచ్ అండీ!!

సి.ఉమాదేవి చెప్పారు...

మనసును వీడిపోవు స్నేహ కెరటాలు.మనిషి విభిన్నకోణాలలో ఆవిష్కరించబడినా హృదయపు వాకిళ్లు మానవతకు స్వాగతం పలుకుతూ తెరిచే ఉంచగలిగితే ప్రతి మజిలీ ఒక మధుర స్వప్నమే!

అజ్ఞాత చెప్పారు...

కాలం అనంతం, ప్రతిది దానిని అనుసరించిపోయేదే.

కాయల నాగేంద్ర చెప్పారు...

"మీరేమనుకున్నా నేను మాత్రం
ఒక ఆహ్లాద కెరటాన్ని...
ఒక విశ్వసనీయ స్నేహాన్ని...
మిమ్మల్ని మీరుగా ప్రేమించే
హృదయానికి చిరునామాని...!"

చాలా బాగా రాసారు వనజగారు.
మీ మనసులోని భావాలను ఆవిష్కరించుకున్నట్టుంది!

శ్రీ చెప్పారు...

వనజ గారూ!
చాలా చక్కని భావాలను
పొందికగా కూర్చిన స్నేహ భావాల సుమహారం.
అభినందనలు మీకు...మీ స్నేహానికి..
@శ్రీ

సాయి చెప్పారు...

చాలా చక్కగా రాసారండీ.. సూపర్..

వనజవనమాలి చెప్పారు...

సి.ఉమాదేవి గారు.. మీ వ్యాఖ్య నాకు ఒక కితాబ్ మాత్రమే కాదు."కితాబ్" కూడా.
కవితలోని లోతుల్ని పట్టుకున్నారు. ధన్యవాదములు.
@కష్టేఫలె ..గారు.. మీ వ్యాఖ్య కి చాలా చాలా సంతోషం. స్నేహితులని లోపాలతో సహా ప్రేమించాలి కదండీ!
అందుకే .అలా చెప్పాను.
@ కాయల నాగేంద్ర గారు.. నా అనుభవం లో నుండి పుట్టిన కవిత..అండీ ఇది. ,స్నేహించే మనిషికి ప్రేమించే హృదయానికి కూడా స్వచ్చత ఉండాలి కదా!
మీ స్పందనకి ధన్యవాదములు.
@ శ్రీ గారు.. (శ్రీనివాస్) మీ వ్యాఖ్యకి ఆనందం కల్గింది. స్నేహం కి అర్ధం తెలుసుకోవాలి కదండీ. ఏదో ఆశించి రావడం, వారు అనుకున్నది దొరకనప్పుడు బురదజల్లడం సర్వసామాన్యం అయిన రోజులివి. అందుకే సహ్రుదయావిష్కరణ కావాలనిపించింది. ధన్యవాదములు.
@సాయి..గారు.. థాంక్ యు,థాంక్ యు వేరి మచ్!!

జలతారువెన్నెల చెప్పారు...

చాలా బాగుందండి వనజ గారు మీ కవిత.