20, జులై 2012, శుక్రవారం

కథ కాదు

ఈ కాలం అమ్మాయిల ఆలోచనలు పెడదారి పట్టడమో.లేక తల్లిదండ్రుల మూర్కత్వం వల్లనో కాని..

ఒక యువకుడు అతని తల్లి దండ్రులు చెల్లించిన మూల్యం ధనం మాత్రమే కాదు..మానసిక వేదన కూడా..

మా ఇంటి ప్రక్కనే ఉన్న గ్రూప్ హౌస్ లోకి ఒక కుటుంబం అద్దెకి వచ్చారు.ఒక ఒక కొడుకు ..అతనికి ఒక సంవత్సరం క్రితం పెళ్లి అయింది. కోడలు చూడటానికి ముచ్చటగా బాగానే ఉంది. అత్తగారు..ఇంట్లో సామాను సర్దుకుంటూ ఉంటే.. మా వైపు బాల్కనీ లో వేలాడదీసిన ఉయ్యాలలో కూర్చుని పోద్దస్తమాను సేల్పోన్ లో మాటలాడుతూ ఉండి పోయేది.

ఆ ఇంట్లో పని చేసే వాళ్ళ ద్వారా విన్న మాటలు నా చెవిన పడేవి. ఏమిటా అమ్మాయి తీరు? అలా గౌరవ మర్యాదలు లేకుండా అత్తమామగారి ముందర కాలుపై కాలు వేసుకుని ఎల్లప్పుడూ ఆ పోన్ మాట్లాడటం ఏమిటి? వంట ఇంటి వైపు తొంగి చూడదు. లేదా గది వదిలి బయటకి రాదు.. పాపం ! ఆ గోపాలరావు గారు,రాజ్య లక్ష్మి గారు..ఆ కోడలి ప్రవర్తనని జీర్ణం చేసుకోలేక పోతున్నారు. ఏదో బొబ్బర్లంక అమ్మాయి అని కట్నకానుకల ప్రమేయం లేకుండా..అమ్మాయిని చూసి చేసుకొచ్చారు. ఆ కోడలి వరుస చూస్తే ఇలా.. అంటూ.. బుగ్గలు నొక్కుకునేవారు.చెవులు కొరుక్కునేవారు.

ఖచ్చితంగా..రెండు నెలలు తిరిగే సరికి గోపాలరావు గారి అబ్బాయి బాబ్జీకి విడాకులు అయ్యాయి అని చెప్పారు.

యధాలాపంగా వాళ్ళు వీళ్ళు చెప్పే కబుర్లు వినడమే తప్ప పెద్ద ఆసక్తి చూపని నేను..."ఆ.". అంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచాను

అవునంట.. ఆ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదంట. ఎవరినో..ప్రేమించింది అట. ఆ అమ్మాయి ఇష్టా ఇష్టాలకి విలువ ఇవ్వకుండా.. తల్లిదండ్రులు పెళ్లి చేసారని అయినా బాబ్జీని భర్తగా అంగీకరించ లేకపోతున్నానని చెప్పిందట.

ఆ అమ్మాయి పెళ్లి జరిగిన తర్వాత కూడా.. భర్త తో.. సర్దుకుని జీవించడం లో ఏ మాత్రం ఆసక్తి లేకపోయింది. ప్రేమించిన అతనితో రోజు పోన్ లో మాట్లాడుతూ సమయం దొరికినప్పుడు వెళ్ళిపోవాలని అనుకున్నదట. అలా ఒక సంవత్సరం పాటు ఓపికగా ఎదురుచూసిన బాబ్జీ ఇక రహస్యం దాచలేక అతని తల్లిదండ్రులకి విషయం చెప్పాడు. ఆ అమ్మాయిని గట్టిగా ప్రశ్నించే సరికి పుట్టింటికి వెళ్లి పోయింది. ఇక ఆ అమ్మాయి తో కాపురం చేయాలనుకోవడం అవివేకం కాబట్టి బాబ్జీ వైపు నుండే విడాకులు కోసం అప్లై చేసారు.

విడాకులు ఇవ్వడం కోసం ఆ అమ్మాయి పది లక్షలు రూపాయలు ఇవ్వాలని కోరిందట. ఆ అమ్మాయి కుటుంబం నుండి బాబ్జీ కుటుంబం కోసం వారు ఇచ్చిన డబ్బు అక్షరాల నలబై వేలు (అది వివాహ సమయంలో అబ్బాయికి బట్టలు కోసం) .. మధ్యవర్తుల సమక్షంలో ఏడు లక్షలు రూపాయలు ఇవ్వడానికి సిద్దపడి.. ఆ అమ్మాయికి వివాహ సమయం లో పెట్టిన బంగారు నగలను ఒదులుకుని,డబ్బు ఇచ్చి..విడాకుల కాగితం మీద సంతకం పెట్టించుకుని బ్రతుకు జీవుడా !అనుకుని బయట పడ్డారు. అని చెప్పారు.

ఎంత మోసం!? బాబ్జీ కి అతని తల్లిదండ్రులకి ఎంతటి క్షోభ?

ఏమిటీ ఈ పరిస్థితులు ? అమ్మాయి ఇష్టా ఇష్టాలని గమనించక ధనిక కుటుంబ అబ్బాయికి ఇచ్చి చేయడం తోనే.. అన్నీ సర్దు కుంటాయా ? ఈ తరం ఆడపిల్లల ఆలోచనా విధానం సవ్యమేనా? పెళ్లి చేసుకోక ముందే..తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఆ అమ్మాయి చెపితే బాగుండేది కదా!? అలా చెప్పకుండా ఒక సంవత్సరం పాటు ఓ..వ్యక్తిని బాధపెట్టడం తగునా!?

ఆర్ధికంగా,మానసికంగా,గౌరవమర్యాదల పరంగా..ఆ అమ్మాయి,ఆమె తల్లి దండ్రులు చేసిన డామేజ్ కి బాబ్జీ కుటుంబం ఎంత క్షోభ అనుభవించారు.

చట్టం ని అడ్డం పెట్టుకుని..అమ్మాయిలు చేసే పని ఏమన్నా బాగుందా!? ఈ కాలం అమ్మాయిలూ మగవారి జీవితాలతో..ఆడుకుంటున్నారు.

ప్రేమ-పెళ్లి వేరు వేరు వ్యక్తులతో..

జీవితాలతో..ఆడుకోవడం తగునా?

మగపిల్లల్ని కన్న తల్లిదండ్రులు కి ఇలాటి తిప్పలు తప్పవా?

అమ్మో! ఆలోచిస్తే భయం వేస్తుంది.

నేను మాత్రం ఒకటి చెప్పదలచాను. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలకి విలువ ఇవ్వకుండా..తాము చెప్పిన ప్రకారమే పిల్లలు నడుచుకోవాలనుకుంటే.. వారి పిల్లలు వేరొకరు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.

తల్లిదండ్రులు కాస్త పెద్ద మనసు చేసుకుంటే వారు ప్రేమించిన వారినే పెళ్లి చేసుకుంటారు, ఆనక వాళ్ళిద్దరూ కొట్టు కుంటారు,తిట్టుకుంటారు.. అది వాళ్ళ ఆలోచనా దోరణి ని బట్టి ఉంటుంది. ఇతరులు ప్రేమించినవారినో,లేదా ఇతరులని ప్రేమించిన అమ్మాయిని చేసుకుని చూస్తూ చూస్తూ జీవితాన్ని నరక ప్రాయం చేసుకోవడం ఉండదు కదా!

(ఈ పోస్ట్ లో పేర్లు మార్చడం తప్ప యధాతధం గా వ్రాయడం జరిగింది)

11 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

వనజ గారు... బొబ్బర్లంక అమ్మాయా? అలా ఉండరే అక్కడి అమ్మాయిలు ...
సరదాకి అన్నను కాని...ఇలా జరుగుతాయి....అమ్మాయిలు ఇల్లా చెయ్యడమా ఏంటండి? అమ్మయిలైనా , అబ్బాయిలైనా చెయ్యకూడదు ఇలా.. అంతే! ఒకప్పుడు ఇలా ప్రవర్తించే అమ్మయిలు తక్కువ ఉండేవారు..ఇపూడు ఎల్లువయ్యారు.. అబ్బాయిలతో సమానంగా..అంతే తేడా..:)

Pavani చెప్పారు...

...నేను ఈ మధ్య విన్న పది కి తొమ్మిది కేసులు ఇలాంటివేనండి.ఈ చట్టాలు middle/upper middle class మగపిల్లలికి శాపాలు.

ఈ తరగతి మొగ పిల్లలు పెల్లి చేసుకోవటం అంత మంచిది కాదని నా అభిప్రాయం. ముఖ్యంగా చదువుకున్న/అందమైన అమ్మాయిలని.ముందు ముందు విడాకులు ఇంకా ఇంకా పెరుగుతాయి.బహుశా one in every 5 marriages end divorce(in this segment).ప్రతి కేసులోను ఆర్థికంగా నష్టపోయేది పురుషుడే.కొంచెం కష్టంగా ఉన్నా మొగ పిల్లలు 40 దాకా పెళ్ళిగురించి ఆలోచించటం మనేస్తే, ఆ తర్వాతెలాగూ ఎవరూ చెసుకోరు కాబట్టి అదే అలవాటౌతుంది. ఏ రకమైన బంధాలు లేకుండా నచ్చిన వాళ్ళతో నచ్చినన్నాళ్ళు కలిసి జీవించటం,బోర్ కొట్టినరోజున విడిపోవటం..ఈ పద్ధతి మరింత popular అయ్యేవరకు--పురుషులు పెళ్ళి గురించి ఆలోచించకపోవటం మంచిది.

పై సలహా నిజంగానే వరసకి మా తమ్ముడికి ఇచ్చాను.సినెమా హీరో లాగ ఉండేవాడు, ఓ విజయవాడ అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు. తనకు already కులాంతర వివాహంలాంటిదేదో అయిందని,వాళ్ళమ్మ చస్తానని బెదిరిస్తే ఈ పెళ్ళికి ఒప్పుకున్నానని చెప్పి, సుమారో 20 లక్షలు నొక్కేసి, ఇంచక్క ముందు వాడితో వెల్లిపోయింది. గమ్మత్తుగా వాళ్ళమ్మేమీ చావలేదు.లాయర్లు చెప్పిన మాటేంటంటే, తప్పెవరిదైనా నోర్మూసుకొని అడిగిన డబ్బు ఇచ్చెయ్యండి కానీ ఆ అమ్మాయని పల్లెత్తు మాటన్నా జైలు ఖాయం. ఇవీ ఉగ్రవాద ఫెమినిస్టులంతా కల్సి చేయించిన బండ చట్టాలు.కనీసం ఒక వర్గంలో పెళ్ళంటే పారిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

Alapati Ramesh Babu చెప్పారు...

మీరు ఇ౦కా సత్తేకాలం లో వున్నట్లున్నారు లోకం చాల బాగా వెనుకకు అది డబ్బు వెనుకకు వేగం గా పరుగులు తీస్తు౦ది దానిలో అన్ని విలువలు తొక్కి పోతున్నాయి

అజ్ఞాత చెప్పారు...

నేనే పిచ్చాణ్ణననుకున్నా! నాలా ఇలా బాధపడేవాళ్ళింకా ఉన్నారోచ్!!! ఇది నిజంగా వ్యాపారమయిపోయిందంటే నమ్మండి.

అజ్ఞాత చెప్పారు...

కొద్దిగా మార్పులతో ఇలాంటి లాభదాయకమైన విడాకుల వ్యాపారంలో దాదాపు 40 లక్షల ఫ్లాట్ వదులుకున్న ఓ అబ్బాయి కథ విన్నాను. ఏమంటే వాళ్ళకు 4ఏళ్ళ కూతురు కూడా వుంది. తన కూతురికోసం ఇచ్చాలే అని తృప్తితో సరిపెట్టుకున్నాడా క్రిష్ణ జిల్లా క్రిస్టియన్ అబ్బాయి.
బుర్రబుద్ధీ లేఇ ఫేమిలీ చట్టాలు మనకు వున్నాయంటే ఏమో అనుకునే వాడిని, చూశాక/విన్నాక కాని అర్థమవలేదు. వాస్తవమైన కథ చెప్పారు. ఇలాంటివి చూసి అమెరికాలో వున్న మావాడొకడు పెళ్ళంటే భయపడుతున్నాడు, సిటీ అమ్మాయిలు కాక ఏ పల్లె అమాయో మేలేమో అంటాడు. ఏమో..

buddhamurali చెప్పారు...

వనజవనమాలి గారు మీరు రాసిన దాని ప్రకారం అబ్బాయి తల్లి తండ్రులది ఎలాంటి తప్పు లేదు. ఆ అమ్మాయి చేసింది మాత్రం పక్కా వ్యాపారం ... ఒక వేళ నచ్చని పెళ్లి చేస్తే ఆ విషయం ముందు చెప్పాలి .. సరే తల్లి తండ్రుల మాట ఎదిరించ లేక సెప్ప లేక పోయిందని అనుకుందాం ... పెళ్లి తరువాత ఇష్టం లేనప్పుడు వీడి పోవాలి అంతే కానీ ౪౦ లక్షలు ఇచ్చి ౭ లక్షలు వసూలు చేయడం అంతే వ్యాపారం చేసినట్టే కదా ... పెద్ద మునుషుల మధ్య ఒప్పందం అన్నారు ఆంటే ఆ అమ్మాయి తల్లి తండ్రులు కూడా ఆ పెద్ద మనుషుల ఒప్పందం లో ఉంటారు కదా ...ఒక వేళ ఉంటే ,దీనికి వాళ్ళు ఒప్పుకుంటే అమ్మాయి చేసిన వ్యాపారం లో వాళ్ళు బాగా స్వాములే ...

శిశిర చెప్పారు...

బాగున్నారా వనజ గారూ. చాలా కాలం తర్వాత మీ బ్లాగు చూస్తున్నాను. మీ టపాలు ఆలోచింపజేసేవిగా ఉంటాయి.

మురళి గారూ, ౪౦ లక్షలు కాదు, ౪౦ వేలు. నేను మీ వ్యాఖ్యతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆ అమ్మాయి, ఆమె తల్లిదండ్రులూ చేసింది ముమ్మాటికీ తప్పే. మీరన్నట్టు పెళ్ళిని ఒక లాభదాయక వ్యాపారంలా చేసిన వాళ్ళు చేసింది చాలా తప్పు. ఏ తప్పూ చేయని ఆ అబ్బాయి, అతని తల్లిదండ్రులూ ఎంత బాధపడి ఉంటారో కదా!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు.. ఈ తరం అమ్మాయిల స్పీడ్ చూసి, వారిలో ఉన్న భయంకరమైన ఆలోచనలు చూసి భయపడే రోజులు వచ్చేసాయండి.
పిల్లల కి ఇష్టమయ్యే వివాహాలు పెద్దలు చేయడం ఉత్తమం. లేకపోతె.. ఆ..వచ్చే వారు బలయిపోతారు.
@పావని గారు.. ఈ కేసులో ఆ అమ్మాయి ..అబ్బాయిపై భయంకరమైన నెపం మోపి.. వెళ్ళింది. ఇలాటి చావు తెలివితేటలూ ఎందుకొస్తున్నాయో! నైతిక విలువలు అంటూ మనం నెత్తినోరు కొట్టుకోనవసరం లేదు. ఎంతగానో కాష్ చేసుకుంటున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ఇది నిజం.
@రమేష్ గారు.. మీరు అన్నది నిజమే! నేను ఇంకా వెనుకటి కాలంలోనే ఉన్నాను. ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నాను.
థాంక్స్ అండీ!
@ SNKR ..ఇలాటి విషయాలు రెండు మూడు విన్నాను.
అబ్బాయిలని కన్నందుకు.. ముందు ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో!ఇప్పుడంతా రివర్స్..అన్నమాట.
ఒక జీవిత కాలంలో రెండు భిన్నమైన పోకడల్ని చవి చూడాల్సి వస్తుంది ఏమో!
చాలా మంది స్త్రీలకి కష్టాలు-కన్నీళ్లు తప్పడం లేదు. వాటిని అలా ఉంచి ఇప్పుడు అవకాశవాదంతో ఇలా చేయడం సిగ్గుచేటు..విచారకరం కూడా!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

బుద్దా మురళీ గారు.. అమ్మాయి,అమ్మాయితో పాటు..ఆమె తల్లిదండ్రులు ఈ పెళ్లి ఆనే వ్యాపారంలో విడాకులు జరిగేటప్పుడు పాత్ర దారులే!
ఆ అమ్మాయి చట్టాన్ని బాగా అడ్డుపెట్టుకుంది. కాష్ చేసుకున్నారు. ఆ అమ్మాయి గురించి తెలిసి పద్దతి మార్చుకోవాలని కోరినందుకు ఆ అబ్బాయికి పడిన ముద్ర.. చెరిగిపోనిది. అందుకే డబ్బు ఇచ్చి వదిలిన్చుకున్నారు.
ఇలాటి వాస్తవ గాధలు ఉన్నాయి సమయం చూసి నేను నా బ్లాగ్లో వ్రాసే ప్రయత్నం చేస్తాను. అందువల్ల కొంతమంది తల్లిదండ్రులకి,బిడ్డలకి కూడా ఆలోచనా విధానంలో మార్పు కలుగుతుందేమో..అన్న ఆలోచన తోనే ఇలా వ్రాస్తున్నాను. ఏది ఏమైనా అవకాశవాదం ని విడనాడి హుందా గా నిజాయితీగా ప్రవర్తించడం నేర్చుకుంటే డబ్బులో మునిగి తెలకపోయినా సంతృప్తి తో బ్రతుకుతామని అమ్మాయిలూ అనుకోవాలి. అదే ఆమెకి శ్రీరామ రక్ష,
వర కట్నం, లింగ వివక్ష,సామాజికంగా వచ్చిన మార్పుల వల్ల అనేక కొత్త ఇబ్బందులు ఉండనే ఉండగా.. ఇంకా ఎందుకు ఇలా అవకాశ వాదం తో ప్రవర్తించడం.. అన్నది చదువుకున్న విజ్ఞత కల్గిన అమ్మాయిలు ఆలోచించుకోవాలి.
పైకి ఎగాబ్రాకాలనుకుని దిగజారిపోతున్నారు. దురదృష్టకరం కదండీ!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శిశిర గారు.. ముందుగా మీ అభిమానానికి చాలా చాలా సంతోషం. థాంక్ యు వేరి మచ్. !!
మీ గురించి ఎంత గుర్తు చేసుకున్నానో..తెలుసా!? మీరు,జయ గారు,సుభ గారు..సో స్వీట్. బ్లాగులలో కనబడకపోతే కొంచెం దిగులు. జిలేబీ గారి బ్లాగ్ లో మిమ్మల్ని తలచుకున్నాను కూడా!
శోభ గారు కూడా కనబడటం లేదు.
ఇక నా పోస్ట్ లు అంటారా? ఏదో..మీ అభిమానం అండీ.. వాళ్ళు వీళ్ళు కలసి నన్ను తిట్టేస్తారేమో.. అని అనుకుంటాను.
ఏమిటో..! నా దృక్పధం నాది. ధన్యవాదములు.
మా అబ్బాయి అంటాడు. అమ్మా! నువ్వు చెప్పే మాటలు వినడానికి నాకు ఇప్పుడు టైం లేదు. నువ్వు ఏం చెప్పాలనుకున్నవో..అవన్నీ బ్లాగ్ లో వ్రాసేయి. నా పిల్లలతో కలసి చదువు కుంటూ..అప్పుడు ఆలోచిస్తాను అంటాడు. మా అబ్బాయి కోసమే కొన్ని వ్రాస్తాను కూడా!.
అందుకేనేమో.. పనిలో పని నా పాస్ వర్డ్ తో సహా వ్రాసి మా అబ్బాయికి అందుబాటులో పెట్టి ఉంచాను.
రేపు ఏమవుతుందో.. లేదా మరు క్షణం ఏమవుతుందో..ఎవరికీ తెలియదు కదండీ! :)

anrd చెప్పారు...

వనజ గారు, సరిగ్గా ఇలాగే మాకు చాలా దగ్గర బంధువులబ్బాయికి జరిగింది. అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళనుంచి 5 లక్షలు కూడా గుంజారు .
ఆ డబ్బు ఇవ్వకపోతే గృహహింస కేస్ పెడతామని అబ్బాయి తరపు వాళ్ళను బెదిరించేసరికి వీళ్ళు ఆ డబ్బంతా సమర్పించుకున్నారు.
అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేకపోతే ముందే ఫోన్ చేసి చెబితే మాకు ఈ కష్టాలు ఉండేవి కాదు కదా ! అని అబ్బాయి వాళ్ళు లబోదిబో అంటున్నారు.
ఈ రోజుల్లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయట..